April 28, 2024

స్వప్నాలూ , సంకల్పాలూ – సాకారాలు -3

రచన: డా. లక్ష్మీ సలీం
అనువాదం: స్వాతీ శ్రీపాద

4. ప్రేమ ప్రకటన

మిగతా ఆ వయసులో ఉండే చాలామంది అమ్మాయిల్లాగే విదేశాల్లో సెటిల్ అయిన ఎంతో మంది డాక్టర్ల సంబంధాలు వరదలా వచ్చిపడ్డాయి. ప్రతి సంబంధమూ ఏదో ఒక వంక పెట్టి తిరగగొట్టేదాన్ని. ఈ విషయ్ం సలీమ్ తో చర్చించి ఇద్దరం నవ్వుకునే వాళ్ళం. నా మనసులో మాత్రం నేను పెళ్ళంటూ చేసుకుంటే అది సలీమ్ తప్ప మరొకరు కాదని నిశ్చయించుకున్నాను. ఇంకెవరినో పెళ్ళి చేసుకుని జీవితాన్ని పంచుకునే బదులు, ఒంటరిగా ఉండటం నయమనుకునేంతవరకూ వచ్చేసాను. కాని, నా ఆలోచనలను అతనికెప్పుడు చెప్పలేదు.
దాపరికంలేని మనసుతో ఉండటం వల్ల సలీమ్ ఒక దిగువ మధ్యతరగతి శుద్ద సాంప్రదాయిక ముస్లిం కుటుంబంలో పెద్దకొడుకనీ, అతని అయిదుగురు చెల్లెళ్ళు, నలుగురు తమ్ముళ్ళ చదువు, పెళ్ళిళ్ళ బాధ్యత అతనిదేననీ నాకు తెలుసు. రోజూ ఇద్దరం కలిసే ఎంతో సమయం గడిపినా నా పట్ల అతని అభిప్రాయం ఏమిటో నాకు తెలీదు. ప్రేమ విశంలో నాకున్నవి పురాతన అభిప్రాయాలే, అబ్బాయే ముందుగా తన ప్రేమను వ్యక్తం చెయ్యాలి. కాని అదేం జరిగేలా లేదు.
ఎంత వరకంటే,
నన్నూ సలీమ్ నూ మా ఇంటర్న్‌షిప్‌లో కార్డియాలజీ వార్డ్‌లో వేసారు. మేము ఇద్దరం కూడా చాలా నిజాయితీగా శ్రద్ధ అవసరమైన రోగుల పట్ల పని చేసేవారం. మమ్మల్ని బాగా ఇష్టపడే ఒక సీనియర్ డాక్టర్ మా దగ్గరితనాన్ని గమనించి బయట ఎక్కడో ఉండే పేషంట్ ని చూడటానికి మమ్మల్నీ రమ్మని అడిగారు. ప్రయాణ చాలా దూరం, దాదాపు రానూ పోనూ పదిగంటలు విసుగ్గా అనిపించింది. తిరుగు ప్రయాణంలో సలీమ్, నేనూ కారులో పక్క పక్కన కూచున్నాము. ప్రయాణమంతా అతను నా చెయ్యి పట్టుకునే ఉన్నాడు. చెప్పేందుకు మాటలేమీ లేవు. ఎలాటి భావోద్వేగాలూ పంచుకోలేదు. అతని చేతి స్పర్శతోనే ఆ ఆప్యాయత, ప్రేమ, అభిమానం నేను అనుభవించాను. ఆ నిమిషమే నాకు తెలిసివచ్చింది, మా మతాలు వేరైనా, వేరు వేరు వాతావరణాల్లో పెరిగినా నేను కలవరపడవలసినదేదీ లేదని. మాకు ఏ అడ్డంకులు వచ్చినా ఇద్దరం కలిసి ఎదుర్కోగలమన్న నమ్మకం నాకు కలిగింది.
ఆ ప్రయాణం ముగిసి తిరిగి వచ్చాక నేను వేరుగా ప్రవర్తిస్తున్నానని జనాలు గమనించారు. ’
“లక్ష్మీ! నీ మొహంలో ఆ మెరుపేమిటి? ఎవరైనా ప్రేమలో పడితే కనిపించే మెరుపు” డా. గిరిజా శంకర్, రిజిస్త్రార్ లలో ఒకరు అన్నారు. నేను సిగ్గుపడుతూ నవ్వాను.
“అదే నిజమైతే ముందుగా తెలుసుకున్నది మీరే ” ఎర్రబారిన మొహంతో చెప్పాను.
సలీమ్ , నేనూ రోజూ తప్పకుండా, రామాలయం దగ్గర కలిసి, సాయంత్రం లేట్ గా ఇల్లు చేరేవరకూ మాట్లాడుకుంటూ గడిపేవాళ్ళం. అయోధ్య గురించి, రామ జన్మభూమి గురించి కాని, ఏం జరుగుతోందన్నది మాకు ఏమాత్రం తెలియదు.
ఒక రోజున, మా ఈ రోజువారీ కార్యక్రమం సమ్మె వల్ల కుదరలేదు. ఇళ్ళలోంచి బయట అడుగుపెట్టలేక నాలుగు రోజుల పాటు మేం కలుసుకోలేకపోయాం. సలీంను చూడాలని ఎంత ఆత్రుతగా ఉన్నానో, అతనెలా ఈ నాలుగు రోజుల ఎడబాటు భరిస్తున్నాడో ఊహించలేకపోయాను. సమ్మె ముగిసాక అతను వార్డ్‌లో నన్ను పలకరించినప్పుడు చిక్కి బలహీనంగా కనిపించాడు.
“సలీమ్ ఏమైంది? బాగానే ఉన్నావా?” ఆత్రుతగా అడిగాను.
సలీమ్ నావంక చూసి, విచారంగా చెప్పాడు, “నాలుగు రోజులు నిన్ను చూడకపోయేసరికి నాకు పిచ్చెక్కింది. ఒక్క ముద్ద కూడా తినలేకపోయాను”.
అతను నాకో ఉత్తరం అందించాడు, తన రక్తంతో రాసినది, నన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నానంటూ. అది అతని ప్రేమ తీవ్రత ఎంతో చెప్పడమే కాకుండా నన్ను నిజంగా షాక్ కి గురిచేసింది, అన్ని మాటల్లో అతను తన ప్రేమను అంత స్పష్టంగా వ్యక్తం చెయ్యడం. ఇలా మళ్ళీ ఇంకోసారి చెయ్యనని అతనితో మాట తీసుకున్నాను.
ఆ సాయంత్రం, నిశ్సబ్దంగా ఉన్న మసక వెన్నెట్లో , మినుకు మినుకుమనే చుక్కల కింద, నేనూ సలీమ్ గుడికి వెళ్ళి భగవంతుడి సమక్షంలో, అతని చేతిని నా చేతిలోకి తీసుకుని నా ప్రేమను అతనికి వ్యక్తపరచాను.
దాదాపు గాంధర్వ వివాహ విధానంలో, పురాణ పద్ధతిలో , శకుంతలా దుష్యంతుల మాదిరి, మా స్వంత విధానంలో గాంధర్వ వివాహం చేసుకున్నాము.
“ప్రియమైన సలీమ్, మనం అబ్స్టెట్రిక్స్ వార్డ్‌లో పనిచేసిన రోజులనుండి నేను నా పిల్లలకు నువ్వే తండ్రి కావాలని అనుకున్నాను. నా భర్త నా జీవన సహచరుడివి నువ్వే కావాలనుకున్నాను. నువ్వే నా నిజమైన ఆత్మ సహచరుడివని. భవిష్యత్తు ఎలాగైనా ఉండనీ గాక, ఇప్పుడూ , ఇహముందూ కూడా నువ్వే నా భర్తవు. మొత్తం ప్రపంచం వ్యతిరేకించినా నా నిర్ణయం మారదు. నీ ప్రేమ నాకు పోరాడే శక్తినిస్తుంది. నేను ఎప్పటికీ పోగొట్టుకున్న అనార్కలిని కాదలుచుకోలేదు. నీదాన్ని, కేవలం నీదాన్నే.” చంద్రుడి సాక్షిగా, చుక్కల సాక్షిగా భగవంతుడి సమక్షంలో ఆ రోజున నాపెళ్ళి జరిగినట్టే భావించాను. ప్రేమ పట్ల నా ప్రగాఢమైన నిర్ణయం కాలం పరీక్షను తట్టుకుని నిలబడింది. దీన్ని నా చివరి శ్వాస వరకూ ఆనందిస్తాను.
సలీం నా కళ్ళలోకి దీర్ఘంగా చూసాడు. ఆ చూపే ఎన్నో చెప్పింది. నాకోసం ఈ ప్రపంచంతో పోరాడతానని కూడా.
ఇద్దరం నిశ్శబ్దంగా ఇంటికి వెళ్ళాము. మేం ఏం చెప్పాలో అది చెప్పాము, ఏది అనుభవించాలో అది అనుభవించాము.
“జీవితం నుండి మనకు ఏం కావాలో చాలామందికి తెలియదు. కాని ఒక గమ్యం పెట్టుకుంటే మనం కోరుకునేది సాధించడానికి మనకు సాయపడుతుంది.”

5.
1972 లో తెలంగాణా పోరాటం మరో భాగమైన జై ఆంధ్రా ఉద్యమం నేపథ్యంలో న్యూస్‌పేపర్‌లో నేనొక ప్రకటన చూసాను. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ ( పీజీఐ ఎమ్ ఈ ఆర్) చండీఘడ్ అప్లికేషన్లను ఆహ్వానించడం. ఆ సమయంలో దేశంలో ఉన్న ఒకే ఒక్క పీజీ సంస్థ అది. సలీమ్ వెనకాడుతున్నా ఇద్దరం అప్లై చేద్దామని ఒప్పిం చాను. ప్రవేశ విధానం చాలా కఠినమైనది. దేశం మొత్తం మీద ఆరు సీట్లే ఇచ్చే సంస్థ అది.
అదృష్టవశాత్తూ మా ఇద్దరినీ కూడా 1972 డిసెంబర్ 9 న ఇంటర్వ్యూకి రమ్మన్నారు. మా బాచ్ నుండి మరో ఇద్దరిని కూడా పిలిచారు. మా బాచ్ లో మిగతావారు ఎడ్యుకేషనల్ కమీషన్ ఫర్ ఫారిన్ మెడికల్ గ్రాద్యుయేట్స్ పరీక్షకు అమెరికా వెళ్ళడానికి తయారవుతున్నారు. కాని మా ఇద్దరి తలిదండ్రులూ కూడా మమ్మల్ని అమెరికా పంపగలిగే స్థితిలో లేరు.
ఇంటర్వ్యూకి పిలుపు వచ్చినప్పుడు చండీఘడ్ వెళ్ళడానికి ట్రెయిన్ టికెట్ కొనుక్కునే డబ్బులు కూడా లేవు నా దగ్గర. నా
దగ్గర ఉన్న పిగ్గీ బాంక్ పూర్తిగా నాణేలతో నిండిపోయినది గుర్తుకు వచ్చింది. అదృష్టం అదే నా టికెట్ కొనడానికి సరిపోయింది.
చండీఘడ్ చేరుతూనే ఎంత ఆశ్చర్యపోయామో- ఆధునిక కట్టడాలు , వాటి చుట్టూ అందమైన ఉద్యానవనాలు చూసి. అది సినిమాల్లో చూసే పరిపక్వత గల చిత్రంలా ఉన్న అమెరికన్ సంస్థ. ఎంతో ఆత్రుత టెన్షన్ తో మేం వెళ్ళి ప్రవేశ పరీక్ష రాసాక మా మిత్రులతో కలిసి నగరాన్ని దర్శించాము.
తరువాత రోజు లిస్ట్ పెట్టినప్పుడు, మేమ్ నోటీస్ బోర్డ్ చూడటానికే భయపడ్డాము. ఏం చూస్తామో అనీ ఒకరినొకరు నిరాశ పడటం చూడలేకా. సర్జరీ డిపార్ట్‌మెంట్‌లో నాపేరు మూడో స్థానంలో సలీమ్ పేరు వెయిటింగ్ లిస్ట్‌లోనూ చూసి ఎంత సంతోషించానో. మా ఇద్దరు మిత్రులు అర్హత పొందలేదు. సర్జికల్ రెసిడెన్సీలో నా సీట్ నిర్ధారణ అయ్యాక, సలీమ్ సీట్ గురించి తరువాత తెలియజేస్తామని చెప్పాక మేం విజయవాడ బయల్దేరాము. ఫైనలియర్ దగ్గరకు వస్తూండటంతో మా బాచ్ మొత్తం ఒక రాత్రి హేమా పెళ్ళిలో సరదాగా జోక్ చేస్తూ, నవ్వుకుంటూ, భవిష్యత్తు గురించి మా ప్లాన్లు మాట్లాడుకుంటూ గడిపాం.
ప్రత్యేక తెలంగాణా, జై ఆంధ్రా ఉద్యమాల వల్ల నగరమంతా స్థంభించిపోయింది. మా హాస్పిటల్స్ కూడా మూసేసారు. దాని వల్ల మా మెడికల్ డిగ్రీ ఎమ్ బీబీఎస్ డిగ్రీ పూర్తవడం, సర్టిఫికెట్ రాడం ఆలస్యమయింది. మా హాస్పిటల్ అధికారులు అదృష్టవశాత్తూ మా సర్టిఫికెట్లు సమయానికి అందజెయ్యడం వల్ల మా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు వెళ్ళగలిగాం.
జనవరి 6, 1973, సలీమ్, నేనూ జీటీ ఎక్స్ప్రెస్ ఎక్కి ఢిల్లీ బయల్దేరాం. మా అమ్మ ఆగిపోయి చివరి నిమిషంలో అనస్థీషియా విభాగంలో అడ్మిషన్ గురించి తెలిసిన సలీంకి తన టికెట్ ఇచ్చింది. మాకు వీడ్కోలు చెప్పడానికి అమ్మ స్టేషన్‌కి వచ్చింది. నా బాధ్యతనంతా సలీంకి అప్పజెప్పింది. మా అమ్మ అతన్ని నమ్మినందుకు అతను బాధ్యతతో పాటు ఆనందాన్నీ పొందాడు.
మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఢిల్లీ స్టేషన్‌కి మా అన్నయ్య ప్రేమ్ వచ్చాడు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక తెలంగాణాఅ రాష్ట్ర ఉద్యమం వల్ల జరుగుతున్న అల్లరుల కారణంగా అన్ని రైళ్ళు కాన్సిల్ చేసి మొత్తం మూసేసారని చెప్పాడు. ఆంధ్రా సరిహద్దులు దాటిన చివరి ట్రెయిన్ మాదే కావడం మా అదృష్టం. కాకపోయుంటే పీజీలో మా సీట్లు పోగొట్టుకునేవారం. అక్కడ జనవరి 10 1973 లోపల చేరవలసి ఉంది. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మన రాష్ట్రం నించి చేరగలిగినది బహుశా మేమిద్దరమే.
విజయవాడ వదిలేస్తుంటే నాలో సంకీర్ణ భావాలు. ఒకవైపు అంత పేరున్న సంస్థలో చేరబోతున్నందుకు సంతోషం, అదే సమయంలో రహస్యంగా పెళ్ళి చేసుకుని సలీమ్ భార్యగా అస్థిమితంగా ఉన్న నా భవిష్యత్తు. అతనికి అతని సమస్యలు ఎన్నో. లీగల్‌గా నన్ను పెళ్ళి చేసుకోవాలంటే మతం నించి వెలి వేస్తారేమోనని అతని భయం. అతని కుటుంబం ఒక హిందూ పిల్లను చేసుకుందుకు ఒప్పుకోదు, దానివల్ల అతని చెల్లెళ్ళ పెళ్ళిళ్ళూ ప్రభావితమవుతాయని అతనికి తెలుసు.
ఈ పరిస్థితుల్లో కూడా అతని పట్ల నాకున్న ప్రేమ మీద నాకెంతో నమ్మకం. మా ప్రేమ పవిత్రత వల్ల ఈ అడ్డంకులను దాటగలదని నాకు తెలుసు. అది ఎంత బలమైనదంటే అది ఎవరినీ నొప్పించదు, ఎవరికీ కీడు చెయ్యదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా దేవుడే మా బాధ్యత తీసుకుని మా గాంధర్వ వివాహం సఫలం చేస్తాడని నా ప్రగాఢ విశ్వాసం.
” భవిష్యత్తు అనేది దైవత్వం నిర్ణయించినా , నా భవిష్యత్తు రూపకల్పనకు నా కున్న పరిస్థితుల్లో నేనే బాధ్యురాలను.”
6.
చండీఘడ్ ఇతిహాసం
మేం చండీఘడ్ లో అడుగుపెట్టిన క్షణం మొదలు అది పులి స్వారీ అని సుదీర్ఘమైనదనీ, క్లిష్టమైనదనీ మాకు తెలుసు. గడ్డ కట్టుకుపోయే చలికి పళ్ళు గిట్టకరుచుకుపోయి మాట్లాడటమూ కష్టంగానే ఉండేది. సంవత్సరం పొడుగునా వెచ్చగా ఉండే దక్షిణాది నుండి రావడం వల్ల సలీంకి నాకూ ఈ వాతావరణం అసాధారణమే. తిండి కూడా రుచించేది కాదు, మాకు అన్నం అంటే ప్ర్రాణం కాని ఇక్కడ పుల్కాలు పప్పుతో సరిపెట్టుకోవాలి మరి.
అయితేనేం, వాతావరణమో తిండో మాకు పెద్ద సమస్య కానే కాదు. నేనూ సలీం లేట్ గా చేరడం వల్ల నన్ను న్యూరో సర్జరీ డిపార్ట్‌మెంట్‌లో వేసారు, అది నా మొదటి చాయిస్ కానే కాదు. పని కష్టంగా ఉండేది, సుదీర్ఘ సమయం పని చెయ్యవలసి వచ్చేది, భాష పరాయిది. సర్జరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవగానే వెనక్కు వెళ్ళిపోవాలి, అదొక్కటే నాకున్న గొప్ప బలం అని నాకు తెలుసు. తపాలా సేవలు ఆగిపోడం వల్ల ఇంటి నుండి ఎలాటి సమాచారమూ లేదు. ఏదైనా వార్త తెలుసుకుందుకు ఉన్న మార్గం రేడియో వార్తలొకటే. దాంతో మరింత బెంగపడిపోయాను. కాని నా సోదరులు మాత్రం నేను బలమైన విల్ పవర్ ఉన్న వ్యక్తిననీ నేను నా సవాళ్ళను ధర్యంగా ఎదుర్కోవాలనీ నచ్చజెప్పేవారు.
రోజుకు పద్దెనిమిది పందొమ్మిది గంటలు వార్డ్ లలో పనిచెయ్యడం వల్ల పగటి వెలుగును చూడటమే గగనమయ్యేది నాకు. దానికి తోడు నా ఇద్దరు సీనియర్ కొలీగ్స్ సర్దార్జీలు కావడం వల్ల ఎవరు ఎవరో పోల్చుకోలేకపోయేదాన్ని. ఇప్పుడు తల్చుకుంటే నవ్వొస్తుంది కాని, ఎప్పుడు ఒకరిని మరొకరిగా తప్పుగా పిలవడం నన్నెప్పుడూ కష్టాల్లో పడేసేది. వాళ్ళతో కొంత సమయం గడిపి వాళ్ళ తలపాగాలు రంగు గుర్తుంచుకునే వరకూ ఇలాగే సాగింది.
న్యూరో సర్జరీ వార్డ్‌లో నా సమయం అతి దుర్భరమైనది. ఒక సీనియర్ రెజిస్ట్రార్ డా. రౌత్, ఒరిస్సా వాడు నాకు ఎలా టఫ్ గా ఉండాలో నేర్పించాడు. అతను నిపుణూడైన డాక్టర్, అధికారమూ దర్పమూ ఉన్నవాడు. అతని ఆపరేషన్ల సమయంలో అతని అసిస్టెంట్‌గా ఒక శిల్పంలా నిలబడవలసి వచ్చేది. చివరికి శ్వాస కూడా బలంగా తీసుకునే అవకాశం ఉండేది కాదు. ఏ మాత్రం కదిలినట్టు గమనించినా పెద్ద గొంతుతో అరిచేవాడు. దాంతో నాకు ఏడుపు పొంగి వచ్చేది, అదీ నిశ్శబ్దంగానే. నా సీనియర్ కొలీగ్స్ నాపట్ల సానుభూతితో ఏదో ఒక వంకన నన్ను పక్కకు పంపించేవారు. కాని డా. రౌత్ తో నేను గడిపిన సమయం నన్నొక మంచి డాక్టర్ గా తీర్చిదిద్ది, త్వరలోనే నన్నతని ఎక్పర్ట్ అసిస్టెంట్‌గా మలిచింది. మరొక కన్సల్టెంట్ డా. వీ.కే. కాక్ ఒకసారి అన్నాడు కూడా, “ఏదో ఒక రోజున నువ్వొక గొప్ప న్యూరో సర్జన్‌వి అవుతావు. మరొక స్పెషలైజేషన్ అంటూ దీన్ని వదులుకోకు.”
కాని త్వరలోనే నన్ను జెనరల్ సర్జరీకి మార్చారు. న్యూరో సర్జరీ గతంగా మారిపోయింది. మరో పక్క సలీమ్, తను కోరుకునే సర్జరీలో సీట్ కోసం మళ్ళీ ప్రవేశ పరీక్షకు చదువుకోడం మీదే దృష్టి సారించాడు.
మరోసారి, డిపార్ట్‌మెంట్‌లో ఒక్క అమ్మాయినే కాడంతో అసౌకర్యమైన స్థితిలో పడిపోయాను. వార్డ్‌లో జూనియర్‌ని కాడం, ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్ళే ప్రతి రోగినీ చెక్ చెయ్యాల్సి వచ్చేది. ఒకసారి ఒక మధ్యవయసు మనిషిని వెరికోస్ వెయిన్స్ ఆపరేషన్ కోసం పెట్టారు. అంతకు ముందు చూడకపోడం వల్ల నాకు ఆ విధానం పట్ల ఆసక్తి కూడా ఉంది. మత్తు మందు ఇచ్చాక సీనియర్ కన్సల్టెంట్ లో ఒకరైన డా. ఖన్నా నావైపు తిరిగి,
” ఈ రోగిని ఉదయం చెక్ చేసావా?” అని అడగాడు.
” అవును. డాక్టర్, చేసాను.” నా జవాబు.
నేను ప్రతి పనీ సవ్యంగా చేస్తాను గనక ఆ డాక్టర్ ఎందుకు కోపంగా ఉన్నాడో నాకు అర్ధం కాలేదు. అతను ఆ రోగి గుప్త భాగాలను చూపిస్తూ,
“అక్కడ ఎందుకు షేవ్ చెయ్యలేదు? ఆపరేషన్ ముందు చెయ్యవలసిన విధులు నేర్చుకోలేదా? ఏం నేర్చుకుంటున్నావు?” అంటూ నా మీద అరిచాడు.
” నేను చెక్ చేసాను డాక్టర్, అతని కాళ్ళు షేవ్ చేసారు కాబట్టి మిగతా పార్ట్స్ కూడా చేసి ఉంటారనుకున్నాను.” నేను నంగి నంగిగా జవాబిచ్చాను.
” ఈ వృత్తిలో ఎప్పుడూ, నొక్కి చెప్తున్నాను, ఎప్పుడూ ఏదైనా చేసి ఉంటారని అనుకోకు. ఎందుకతని జననాంగాలను చెక్ చెయ్యలేదు?”
“చెక్ చెయ్యడానికి సిగ్గుపడ్డాను, డాక్టర్” మళ్ళీ నంగిగా జవాబు చెప్పాను.
” ఇక్కడ సిగ్గు అనేదానికి తావు లేదు. నువ్వు సిగ్గుపడితే ఈ సర్జరీ డిపార్ట్మెంట్ వదిలేసి ఏ గైనకాలజీకో మరో దానికో పోడం నయం. ఇప్పుడు షేవింగ్ పూర్తి చెయ్యి” అని అరిచాడు.
కన్నీళ్ళు ఆపుకుంటూ, శుభ్రంగా ఉన్న రేజర్ తీసుకుని అందరి ముందూ ఆ రోగి జననాంగాల వద్ద షేవింగ్ పుర్తి చేసాను, ఓ పక్కన ఇబ్బంది పడుతూనే.
ఆ రోజున నిర్ణయించుకున్నాను ఎవరికీ నా తప్పులనెంచే అవకాశం ఇవ్వకూడదని.
ఆ ఏడాది పొడుగునా నా మిత్రులందరూ నా స్పెషాలిటీ మార్చుకోమని సూచిస్తూనే ఉన్నారు. ఏడాది చివరలో నాకా అవకాశం ఉంటుంది మరి. కాని నా ఆలోచన స్థిరంగానే ఉంది- నేను సర్జన్ అవ్వాలి. అర్నెల్ల చివరలో సలీమ్ కూడా సర్జరీ డిపార్ట్‌మెంట్‌కు వచ్చాడు. అంటే ఇద్దరం కలిసి పని చెయ్యగలం. ఒకరికొకరం సాయపడుతూ ఎక్కువ సమయం కలిసి గడపగలం.
సలీమ్, నేనూ వేరు వేరు డాక్టర్ల కింద పని చేసినా, వేరు వేరు సుపీరియర్లు ఉన్నా, అందరికీ తెలుసు మేమ్ మంచి మిత్రులం అని. ఎక్కువ సమయం కష్టమయిన పనులు చెయ్యమనే రెజిస్ట్రార్ సలీమ్ కుంటే, నాకు మాత్రం సోదరిలా చూసుకునే అతను దొరికాడు.
ఛండీగడ్‌లో ఒక ఏడాది గడిచాక, జనవరి 1974 లో రెసిడెన్సీ ప్రోగ్రాంకి అర్హత కోసం ఒక పరీక్ష రాయవలసి వచ్చింది. సలీం, నేను ఇద్దరం మా రెసిడెన్సీ మొదలెట్టాము. ఉచిత వసతితో పాటు ఆరు వందల స్టైఫండ్ కూడా వచ్చేది మాకు.
ఆ సమయంలో సలీం, నేనూ మా భవిష్యత్తు గురించి చర్చించుకోవలసిన అగత్యం ఒకటి వచ్చిపడింది. మేమిద్దరం రెసిడెన్సీ ప్రోగ్రామ్ లో చేరాక, సలీమ్ తన సీనియర్ డాక్టర్లను డిన్నర్ కి తీసుకెళ్ళాలనుకున్నాడు కాని, నన్ను తనతో తీసుకు వెళ్లడానికి విముఖత చూపాడు. అది నన్ను చాలా బాధపెట్టింది.
“నన్ను నీ గర్ల్‌ఫ్రెండ్‌గా పరిచయం చెయ్యడానికి ఎందుకు భయపడుతున్నావు? మనకు ఎవరూ తెలియని ఛండీగడ్‌లాటి చోట ఈ పని చెయ్యలేకపోతే, మీ కుటుంబానికి నన్నెలా పరిచయం చేస్తావు?” అని అడిగాను.
“నాకు…నాకు తెలీదు” అంటు నసిగాడు.
“కాదు, నీ కుటుంబాన్ని, మిత్రులను కలిసేందుకు నన్ను గుంటూరుకు, తెనాలికి ఎలా తీసుకు వెళ్తావు? అప్పుడూ ఇలాగే భయపడతావా?” కోపంగా అడిగాను.
నేను ఏడుపు మొదలుపెట్టేసరికి అతనికి అర్ధమయింది నన్ను గాయపరచాడని. ఆ రాత్రి నన్ను ఓదార్చేందుకు నాతో పాటు అమ్మాయిల హాస్టల్‌లో ఉండిపోయాడు.
ఆ రాత్రి మేము మా భవిష్యత్తు గురించి స్పష్టంగా చర్చించుకున్నాం. ఇద్దరి ఆలోచనలూ ఒక దారిన లేవని అర్ధమయి పోయింది.
“సలీం, మన రెసిడేన్సీ మూడేళ్ళూ మనం బిజీగా ఉంటాం, దేని గురించీ వర్రీ అవనక్కరలేదు. కాని మనం ఈ లోగా లీగల్‌గా పెళ్ళి చేసుకోవచ్చు. మనం సెతిల్ అయాకా ఫామిలీ సెట్ చేసుకోడం గురించి ఆలోచించ వచ్చు.” అతనికి నచ్చజెప్పడానికి చూసాను.
“ఇప్పుడు వెంటనే ఆ పని చెయ్యలేను. ముందు నా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కావాలి. ఆ పెళ్ళిళ్ళకి మా నాన్నకు ఆర్ధికంగా నేను సాయం చెయ్యాలి.” అతని జవాబు.
” నీ జీతమ్ మొత్తం వాళ్ళకు సాయపడటానికి మీ నాన్నకు పంపేసెయ్యి. నా జీతంతో మనిద్దరం మానేజ్ చెయ్యగలం.” అంటూ బ్రతిమాలాను.
అయినా సలీం ఒక పట్టాన ఒప్పుకోలేదు. ఈ సమయంలో ఎన్నో సమస్యల ఒత్తిడి వల్ల అతను పెళ్ళి గురించి ఆలోచిం చేందుకు సుముఖంగా లేడు. అతని ఒప్పించాలనే ప్రయత్నాన్ని వదిలేసి, ఈ విషయం తరువాతెప్పుడో కదపవచ్చులే అనుకున్నాను.
మేము పెళ్ళి గురించి చాలాసార్లే మాట్లాడినా మతం విషయం గాని, అది మార్చుకోడం గురించి కాని ఎప్పుడూ మాట వరసకైనా అనుకోలేదు.
ఏదైనా ప్రేమలో సత్యం అనేది ఉంటే భగవంతుడు మనకు మార్గదర్శకుడవుతాడనేది నా నమ్మకం.
మేము గమనించుకునేలోగానే మా ఫైనల్ పరీక్షలు, చాలా మంది నాకు గోల్డ్ మెడల్ వస్తుందని భావించారు కాని, నేను మాత్రం సలీం నేనూ ఈ పరీక్షలు గట్టెక్కి జీవితంలో తరువాత దశకు వెళ్ళాలని ఆశించాను.
మా తయారుపడటం మధ్యన సలీం అతని తమ్ముడి పెళ్ళికి, ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళికి వారం వ్యవధిలో ఇంటికి వెళ్ళి రావలసి వచ్చింది. మళ్ళీ ఛండీగడ్‌కు మరింత ఒత్తిడితో తిరిగి వచ్చాడు. ఇక్కడ మా చదువు ముగింపుకు వస్తోంది, మా అనుబంధం మాటేమిటనేది అతని కలవరం. దీనికి తోడు మా ఫైనల్ పరీక్షల టెన్షన్.
ఒక రాత్రి, ప్రతి విఢయానికీ అల్లకల్లోలమైపోతూ సలీం కన్నీళ్ళ పర్యంతమైపోయాడు. అనిషిత స్థితి, రాబోయే ఫలితాలు, భవిష్యత్తు, అన్నీ కలగలిసి మంచుముద్దలా భావోద్వేగాన్ని పెంచాయి అతనిలో. హాస్టల్‌లో నా చిన్నగది నిండా పుస్తకాలు, నోట్స్, పేపర్లు , పరీక్షల టెన్షన్, నాకూ తెలియలేదు అతని మూడ్ ఎలా మార్చాలో.
దీర్ఘంగా శ్వాస తీసుకుని అతని దగ్గరగా వెళ్ళాను. నా చేతులు అతని చుట్టు వేసాను. కొంచం తడబడుతున్నాను తప్ప జరగ బోయే దాని గురించి భయపడలేదు. నాకు తెలుసు ప్రేమ సంక్రమిస్తుంది తప్ప అది పాపంలా తోచలేదు. నా లోలోపల హృదయంలో మా పెళ్ళి ఎప్పుడో జరిగిపోయిన భావన.
ఆ రాత్రి నేను మనసా, వాచా హృదయాన్ని , శరీరాన్ని ప్రేమగా సలీంకు నిరూపించుకున్నాను. సంపూర్ణ సమర్పణ.
చివరికి పరీక్షల సమయం ముగిసింది. ఫలితాల కోసం వర్రీ అవుతున్నాను. మా ప్రాక్టికల్ పరీక్షల్లో ఇద్దరం బాగానే చేసాము. వైవా దగ్గరకు వచ్చేసరికి అంత బాగా చెయ్యలేకపోయాననుకున్నాను. ఎంతగా నిరాశపడిపోయానంటే ఎవరికీ నా మొహం చూపించలేక హాస్టల్ గద్దికి పరుగెత్తాను. ఫలితాలు తెలుసుకోవాలన్న ఆలోచనే భరించలేకపోయాను. జూనియర్లలో ఒకరు నన్ను వెతికి పట్టుకుని డిపార్ట్‌మెంట్‌కు లాక్కెళ్ళాడు.
డా. పాఠక్ , హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నన్ను ముందుకు పిలిచి నాతో కరచాలనం చేసాడు.
“అభినందనలు. నువ్విప్పుడు సర్టిఫైడ్ సర్జన్‌వి. ” అన్నాడు.
ఎన్నో ఏళ్ళు కష్టపడి, సహనంగా ఎదురు చూసాక నన్ను మరొకరు సర్జన్ అని పిలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇంకా సలీం ఫలితం తెలియదు గనక నేనది సంబరంగా జరుపుకోలేను. నా ఆలోచనలు తెలిసినట్టుగా డా. పాఠక్ నవ్వుతూ –
“రెట్టింపు అభినందనలు. సలీం కూడా పాసయాడు” అన్నాడు.
నాకు థ్రిల్లింగ్‌గా అనిపించింది.
మరో ఇంటర్నల్ ఎక్జామినర్ ప్రొఫెసర్ తల్వార్ –
“ముమ్మారు అభినందనలు. చివరికి ఇది మీరిద్దరూ పెళ్ళి చేసుకోవలసిన సమయం కదా ” అన్నాడు.
నేను చిన్నగా నవ్వి అతనికి ధన్యవాదాలు తెలిపాను. సలీం కోసం పరుగు తీసాను. మా కష్టానికి చివరికి ఫలితం దక్కింది.
“సాంఘిక కట్టుబాట్లు దాటే వరకు జీవితంలో ఏదీ సులభంగా రాదు. ఏం జరగాలో అది మీ మంచికే కదా”

7.
ఒక నూతన ఆరంభం
అందరం పాస్ అవడంతో మా బాచ్ మొత్తం ఆ సంరంభంలో ఉన్నాము. సలీం, మరికొంత మంది ఫ్రెండ్స్‌మి కలిసి, ఉద్యోగం వెతుక్కునేలోగా, సరదాగా గడపడానికి వారాంతానికి షిమ్లా వెళ్ళాలని అనుకున్నాం. అప్పుడే నాకేమిటో సరిగ్గా లేదని పించింది. ఎందుకో ఆరోగ్యం సరిగ్గా లేదనిపించింది. కళ్ళు తిరగడం, నడవలేకపోడం. అది ఎత్తైన ప్రదేశం వల్ల అయితే కాదు. అప్పుడు గుర్తుకు వచ్చింది ఆ నెల నా నెలసరి మిస్ అయిన సంగతి.
అది నాకొక షాక్. అంతే కాని పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. అదే సమయంలో ఎలా హాండిల్ చెయ్యాలా దీన్ని అనే ఆలోచన. జనం నన్ను చూసి ఎగతాళి చేస్తారా లేకపోతే జాలిపడతారా? సలీం ఏమంటాడు? తండ్రి కాబోతున్నందుకు ఆనందిస్తాడా? హిందువో, ముస్లిమో పెళ్ళి రెజిస్ట్రేషన్‌కి తొందరపడతాడా?
కాని నేను ఎదురు చూసినదంతా సత్యదూరమైనదని అతనితో చెప్పగానే తేలిపోయింది. కాలేజిలో రెజిస్ట్రార్ పోస్ట్ ఇంటర్వ్యూ గురించి వర్రీ అవుతున్నానని అన్నాడు. ఆ సమయానికి దాదాపు ఎనిమిది , పది వారాల గర్భవతిని నేను.
సలీంని ఒత్తిడి చెయ్యకుండా ఉండాలని నిశ్చయించుకుని నా దృష్టి మేమ్ ఇద్దరం ఉద్యోగాలు తెచ్చుకునే దాని వైపు మళ్ళించాను. మా ఇద్దరి మొదటి చాయిస్ పీజీ ఐ ఎమ్ ఈ ఆర్ లో రెజిస్ట్రార్, అవి మూడు పోస్ట్ లే ఉన్నాయి. కాని నలుగురం అప్లై చేశాం. ప్రొఫెస్సర్ తల్వార్ నన్నతని ఆఫీస్ గదిలోకి పిలిచి తనా మూడూ పోస్ట్ లు అప్లై చేసిన ముగ్గురు మగవారికే ఇవ్వదల్చు కున్నట్టు చెప్పాడు. అందులో సలీమ్ కూడా ఉన్నాడు. నేను కాస్త ఆశ్చర్యపోయాను. నేను స్త్రీనని నన్ను తిరస్కరిస్తున్నారా?
” సర్, నేనీ పోస్ట్ కి తగనని అనుకుంటున్నారా? లేదా నేను స్త్రీనవడం కారణమా?” నేనతన్ని అడిగాను.
అతని ఉద్దేశ్యాన్ని నాకు వివరించాడు.
“నేను ఆడవారికి ఉద్యోగం ఇవ్వడానికి వ్యతిరేకిని కాదు. కాని నీకు ఉద్యోగం ఇస్తే సలీం వెళ్ళిపోవాలి, అతను వెళ్ళిపోతే నువ్వూ ఉండవని నాకు తెలుసు. నాకు ఆర్నెల్ల టైమ్ ఇవ్వు నీకూ ఇక్కడ ఒక పోస్ట్ ఇస్తాను.”
ప్రయోగాత్మక సర్జరీ డిపార్ట్‌మెంట్‌లో నాకు ఆర్నెల్లపాటు ఉద్యోగం ఇస్తాననీ, ఆ తరువాత జనరల్ సర్జరీలో ఏదో ఒక పోస్టులో తీసుకుంటాననీ మాట ఇచ్చాడు. కాని దురదృష్టవశాత్తూ ఇక్కడా నాకు అదృష్టం కలిసిరాలేదు.
తరువాత ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్‌మెంట్‌లో రెజిస్ట్రార్ పోస్ట్ ఒకటి వచ్చింది, నిజానికి అది నాకు పెద్దగా నచ్చినదేమీ కాదు. కార్డియో థొరాసిక్ సర్జరీ వంటి మిగతా విభాగాలతో పోలిస్తే అక్కడ డల్ గా పని నెమ్మదిగా సాగుతుందని నా అభిప్రాయం. అయినా నా అదృష్టాన్ని పరీక్షించుకోదలుచుకున్నాను.
డిపార్ట్‌మెంట్‌ హెడ్ ప్రొఫెసర్ బాలక్రిష్ణన్ నాతో సూటిగా మాట్లాడాడు.
“నా డిపార్ట్‌మెంట్‌లో అమ్మాయిలను తీసుకోవాలని నాకేం ఆసక్తి లేదు. ఇప్పటికే నాకు వాళ్ళతో ఎన్నో అనుభవాలున్నాయి. వాళ్ళు సమయాలను పాటించరు. ఎప్పుడూ సిక్ లీవ్ అడుగుతూ ఉంటారు.”
అప్పుడు నాకు తెలిసి వచ్చింది. లింగ పక్షపాతం అనేది కేవలం నా ఊహ కాదని. అది అన్నిచోట్లా అన్ని వేళలా ఉందని.
” సరే, నీ భవిష్యత్ ప్రణాళికలేమిటీ?” అని అడిగాడు.
“సర్ త్వరలో నేనూ, సలీమ్ కోర్ట్ మారేజి చేసుకుంటాము. ఇహ నా కెరియర్ విషయానికి వస్తే జనరల్ సర్జరీలో పోస్ట్ లేదు కనక, భవిష్యత్ ఏమిటో నాకు తెలీదు.”
” మరి మీ కుటుంబాల మాటేమిటి? పెళ్ళికి ఎవరైనా వస్తున్నారా?” ఎలాటి భావోద్వేగ సూచనా లేకుండా అడిగాడు.
” లేదు సర్, నేను మా కుటుంబానికి తెలియపరచాను. ఎవరూ ఎలాటి స్పందన కనబరచలేదు. సలీమ్ కుటుంబానికి అతను చెప్పలేదు. కొంతమంది మిత్రులు మాత్రమే వస్తారు” అన్నాను విచారంగా.
అతని ఎదురుగా ఉన్న కుర్చీ చూపించి కూచోమన్నాడు.
“ప్లాస్టిక్ సర్జరీలో ట్రైనింగ్ అయిన అమ్మాయిలు గైనకాలజీకి మారిపోయారని నా అనుమానం. ఈ సమాజంకున్న పాక్షికత వల్ల అమ్మాయిలు సర్జన్స్‌గా నిరూపించుకోడం కష్టం అనుకుంటారు. అందుకే నీకు చెప్పొచ్చేదేమిటంటే అమ్మాయిలకు బాగా సరిపోయే ఇక్కడ ఒక ప్రయత్నం చెయ్యమని” అతను వివరించాడు.
“సర్! నా జనరల్ సర్జరీ రొటేషన్స్‌లో ప్రొఫెసర్ తల్వార్ అబార్షన్స్ అర్ధం చేసుకుందుకు కొన్ని గైనకాలజీ సెషన్స్‌కి పంపారు. కొంతమంది అమ్మాయిలు వాళ్ల అమ్మలతో బయటకు వచ్చారు, మరికొందరు ఏమీ జరగనట్టు అసాధారణమైన ప్రశాంతతో బయటకు వచ్చారు. నాకు మాత్రం వాళ్ళొక జీవాన్ని మొగ్గగానే తుంచేస్తున్నట్టుగా అనిపించింది. నాకున్న భావాలతో, నా స్వభావానికి నేనలా చెయ్యలేను. మళ్ళీ అక్కడి వెళ్ళకూడదని ఒట్టుపెట్టుకున్నాను, ఎప్పటికీ”
నేను లేచి బయటకు నడిచాను.
కొంతమంది సీనియర్ డాక్టర్లు ఏం జరిగిందో తెలుసుకుందుకు బయట ఎదురుచూస్తున్నారు. నేను ప్రొఫెసర్ బాలక్రిష్ణన్
గారి అభిప్రాయాలు చెప్పాను. వాళ్ళు నా బ్రెయిన్ వాష్ చెయ్యడానికి ప్రయత్నించారు. ప్లాస్టిక్ సర్జరీలో తొలి రోజులు కొన్నేళ్ళు మాత్రం
కష్టంగా ఉంటాయనీ, ఒకసారి కన్సల్టెంట్ అయ్యాక కుటుంబానికి కూడా కొంత సమయం వెచ్చించగలమనీ అన్నారు.
కుటుంబం మాట వినగానే నా మెదడులో ఏదో మెరిసినట్టైంది. ఒకసారి తిరస్కరించాక మళ్ళీ జనరల్ సర్జరీకి
వెళ్లదలుచుకోలేదు. ఊపిరి పీల్చుకుని, మూడు నెలల్లో మొదలుపెట్టబోయే ఉద్యోగంలో చేరడానికి అంగీకరించాను.
సలీమ్, మిగతా ఇద్దరూ జనరల్ సర్జరీ డిపార్ట్‌మెంట్‌లో చేరి పనిలో బిజీ అయిపోయారు. నాతో గడపడానికి కాస్త సమయం కూడా చిక్కేది కాదతనికి. ఇంకా పని మొదలు పెట్టలేదు గనక నాకు హాస్టల్‌లో ఉండే యోగ్యత కూడా లేదు. అదృష్ట వశాత్తూ హాస్టల్ క్లర్క్ కి నేనంటే ఉన్న అభిమానం వల్ల ఖాళీ చెయ్యమని అనలేదు.
నేను నిరాశపడిపోయాను. సలీమ్ నాతో పెళ్ళి గురించి ఇంకా ఏమీ నిర్ణయించుకోకపోడంతో ఒంటరిగా, నిస్సహాయంగా ఉండిపోయాను. ఒక నెల తరవాతే తన ఉద్యోగం కన్ఫర్మ్ అవుతుందని, పెళ్ళి మాట వాయిదా వేస్తూ వచ్చాడు. ఉన్నట్టుండి అతనికి నేనిహ ఎంత మాత్రం ముఖ్యం కాదు అనుకున్నాడేమో.
నాకు ఉద్యోగం నిశ్చితం కాదు, ఎలాటి చేయూత లేదు. పైగా పుట్టబోయే బిడ్డ. రాత్రీ , పగలూ నా బిడ్డ ఆనందం కోసమే ప్రార్ధించాను. నాకు శక్తినివ్వమని భగవంతుడిని వేడుకున్నాను. ఒకరోజున కావలసినంత బలం చేకూరినట్టు అనిపించి సలీంను ఎదుర్కొన్నాను.
“నువ్వే నా స్థితిలో ఉంటే ఏం చేస్తావు?” అని అడిగా.
ఏ మాత్రం ఆలోచించకుండా, “సూయిసైడ్ చేసుకునేవాడిని.” అని జవాబిచ్చాడు. అతని స్పందనకు నేను షాక్ తిన్నాను. నేను ప్రేమించినవాడు, నా బిడ్డకు తండ్రి, ఏ మాత్రం సంకోచించకుండా ఇలా అన్నాడు. నా కళ్లలో విషాదం, నిరాశ గమనించాడు.
ఆపైన వివరించాడు.” అది కాదు. నాకు నీ అంత స్థైర్యం లేదు.నువ్వు చాలా గట్టి స్త్రీవి. ధైర్యవంతురాలవు. నీ కున్నంత ధైర్యం నాకు లేదు.” కాని అతని మాటలకు నాకు కోపం వచ్చింది. నా బాధ ఏమిటో అతను , కనీసం అతనొక్కడైనా అర్ధం చేసు కోవాలని అనుకున్నాను.
“నా బేబీకి నేనెప్పుడు కీడు చెయ్యను. ఈ భగవంతుడి కానుకను నువ్వూ, నేనూ కలిసి సృష్టించాము. నువ్వు నాకు వ్యతిరేకంగా ఉన్నా, మొత్తం ప్రపంచం నన్ను వ్యతిరేకించినా నేనే నా బేబీని పెంచుకుంటాను. నా భర్తగా ఉండే ధైర్యం నీకు లేదంటే, నేను నీ జీవితం నుండి అదృశ్యమైపోతాను.” కోపంగా చెప్పానతనికి.
దాంతో అతని తలలో ఏదో జ్ఞానం తట్టిలేపినట్టుంది, కోర్ట్ మారేజి గురించి చేసుకునే విధానం గురించి వాకబు చెయ్యడం మొదలెట్టాడు. అతను, మరో డాక్టర్ మిత్రుడు ఉన్ని మోపన్ కలిసి మా ఇద్దరి వివరాలు ఇవ్వడానికి వెళ్ళారు. అవి ఒక నెల నోటీస్ బోర్డు మీదుంచి ఎవరికీ ఎలాటి అభ్యంతరం లేదని తెలుసుకోవాలి. లీగల్ డాక్యుమెంట్ రాడానికి నెలరోజులు టైమ్ పడుతుందని చెప్పారు. మరో దారి ఏదైనా గుడిలో కాని , ఇస్లామిక్ నిఖా గాని జరుపుకునే ఫొటో కావాలి.
కాని సలీం అధికారికంగా తన ఉద్యోగం మొదలయ్యేవరకు చూడదలుచుకోడం వల్ల ఒక నెల ఆగాలని అనుకున్నాము.
సలీమ్ నేనూ భార్యభర్తలు కావడానికి కాస్త కాస్త చేరువ అవుతున్నాము.
నిజాన్ని, వాస్తవికతను అంగీకరించి ఒక సమయ నిర్ధారణ చేసుకోడం, ఆ విధంగా నిన్ను నువ్వు మలచుకుంటూ పోడం
నిన్ను ముందుకు తీసుకు వెళ్తుందేమో.

ఇంకా వుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *