April 28, 2024

వెంటాడే కథ – 21

రచన: … చంద్రప్రతాప్ కంతేటి
విపుల / చతుర పూర్వసంపాదకులు
Ph: 80081 43507
నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో చెప్పుకోవచ్చు. నా దృష్టిలో రచయితంటేనే క్రాంతదర్శి. . ప్రాతఃస్మరణీయ శక్తి!
ఎందరో రచయితలు. . అయితే కొందరే మహానుభావులు! వారికి పాదాభివందనాలు!!

మగాడు
రాత్రి 11 గంటలు.
నిరంజన్ హుషారుగా మాట్లాడుతూ కారు నడుపుతున్నాడు. పక్క సీట్లో భార్య కావ్య ఉండడంతో అతని మాటలకు అడ్డే లేకుండా పోతోంది.. ఆమె కూడా చాలా ఆనందంగా ఉంది.
వాళ్ళిద్దరూ నిరంజన్ క్లాస్మేట్ రేష్మి ఇంట్లో పార్టీకి వెళ్లి వస్తున్నారు. తన భర్త రేష్మి గురించి పదేపదే చెప్పడం, ఆమె అందాన్ని, తెలివితేటల్ని మెచ్చు కుంటూ ఉండటం వల్ల అతనికి ఆమె అంటే చాలా ఇష్టమని కావ్యకు ఎప్పటి నుంచో తెలిసు.
చదువుకునే రోజుల్లో ఇలాంటి ఆకర్షణలు, ఇష్టాలు ఎవరికైనా కామనే కదా అనుకుని తానూ పెద్దగా పట్టించుకోదు. ఆమెకు మాత్రం లేవా ఇలాంటివి చదువుకునేటప్పుడు! అందుకని సర్దుకుపోయేది.
అయితే పెళ్లి అయ్యాక కూడా తన భర్త పరాయి స్త్రీని, అందునా వివాహితను గురించి తన ముందే విపరీతంగా పొగడడం కావ్య మనసుకు ఇసుమంత బాధ అనిపిస్తున్నా మౌనంగా భరించేది.
‘ఒకవేళ ఇలా ఎలా మాట్లాడతారండి తప్పుకదా?’ అని అడిగినా అతని నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో ఆమెకు బాగా తెలుసు. ‘ఇంకా ముసలమ్మల కాలంలోనే ఉన్నావా? కాలేజీలో చదువుకునే రోజుల్లో గాని ఉద్యోగంలో ఉన్నప్పుడు గానీ తోటి ఉద్యోగినీ ఉద్యోగుల నడుమ పరస్పర స్నేహాను బంధాలు ఉండవంటావా? అది తప్పంటావా ??’ అని నోరుమూయించేవాడు.
అప్పుడప్పుడూ కావ్యకు కూడా అది కరెక్టే కదా అనిపించేది!
తను చదివిన కాలేజీలో ‘మిస్ కాలేజీ’గా ఎంపికైన వ్యక్తి ఆమె! తనకు కూడా ఎందరో అభిమానులు, అజ్ఞాత ప్రేమికులు ఉండేవారు.. బాడీ గార్డుల్లా తను ఎటు వెళ్తే అటు అనుసరించేవారు. తన చూపు వాళ్ళ మీద పడాలని నానా తంటాలు పడుతుంటే ఆమెకు నవ్వొచ్చేది. కానీ గంభీరంగా ఉండేది. ఎప్పుడూ వారి గురించి పట్టించుకునేది కాదు. తన చదు వేంటో తనలోకమేంటో అన్నట్టుగా ఉండేది.
పార్టీలో కొద్దిగా మందు ఎక్కువైనట్టుంది నిరంజన్ కి మాటలు తడబడుతున్నాయి..
“ఆ పోనీటెయిల్ సురేఖావాణిని చూసావా? ఇప్పుడు లావయింది కానీ కాలేజీ రోజుల్లో సన్నగా తీగలా ఉండేది. చాలా బాగుండేది.. కాలేజీలో కుర్రకారంతా ప్రేమ ప్రేమ అంటూ ఆమె వెంట పడేవారు..”
“మీరు కూడా పడ్డారా? ” కావ్య గొంతులో వ్యంగ్యం.
అది అర్థం చేసుకునే స్థితిలో లేడు నిరంజన్.
“నెవర్! గమ్మత్తేమంటే అందరూ వెంటపడే సురేఖ నా వెంటపడేది.. మన పెళ్లిముందు వరకు ప్రేమ లేఖలు రాస్తూనే ఉండేది. అయినా పట్టించుకునే వాడిని కాదు..”
“ఎలా పట్టించుకుంటార్లెండి? మీ లోకమంతా రేష్మి నిండిపోయి ఉంది కదా? ఆమె ఎటు వెళ్తే అటు బాడీగార్డులా తిరిగేవారట .. ఇందాకే ఆమె సరదాగా మీ కబుర్లు చెప్పింది” నవ్వుతూనే అంటించింది కావ్య.
“Exactly! she is a wonderful lady. Gorgeous courageous and intelligent. ఇప్పటికీ ఆమె అందం చెక్కుచెదరలేదు గమనించేవా నువ్వు? అసలు ఆమె నవ్వులోనే మెస్మరైజింగ్ ఉంది.. అసలు ఆమె కళ్ళు చూశావా ఇప్పటికీ ..”
“మరి అంత admire చేసిన వారు ఆమెనే పెళ్లి చేసుకోలేకపోయారా?” అక్కసుగా అంది కావ్య.
నిరంజన్ నుదుటి రాత అన్నట్టు బొటనవేలుతో ఫాలభాగం మీద రాసుకుంటూ నిట్టూర్చాడు.
కావ్యకి మండిపోయింది. అది దాచిపెట్టుకుంటూ –
“ఆమె కూడా మిమ్మల్ని ఆరాధించేదా? ప్రేమించేదా?” కూపీ లాగింది కావ్య.
“మనకంత అదృష్టం ఎక్కడిది? స్టేట్స్ లో ఎమ్మెస్ చదువుతున్న వాళ్ళ బావ మాధవ్ అంటే ఆమెకి పిచ్చ క్రష్.. అందుకే మాలాంటి వాళ్ళు అంటే ఆమెకు పెద్ద కేర్ ఉండేది కాదు”
“అయ్యో! మీరు అంతగా ప్రేమించినా ఆమె హృదయం కరగలేదా?” ఎగతాళిగా అంది కావ్య.
“ఆమె హృదయం కరగలేదు కానీ సురేఖ వాణి, ఆమె ఫ్రెండ్స్ వైజయంతి, సల్మా వీళ్ళందరూ నాకు లైన్ వేయడం మొదలుపెట్టారు. ఇది చూసి మా ఫ్రెండ్స్ ‘ఆహా నువ్వు ఎంత అదృష్టవంతుడివిరా? అటు చూస్తే సురేఖ.. ఇటు చూస్తే వైజయంతి.. ఇంకో పక్కన సల్మా ఇంటి పక్కన రమణి నీ కడగంటి చూపు కోసం అర్రులు చాస్తున్నారు.. మా మొహం చూసేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు’ అని ఉడుక్కునేవారు” అన్నాడు ఇంచుక గర్వంగా.
“అంటే మీ కాలేజీలో మీరు రొమాంటిక్ హీరో అనమాట..”
“అన్న మాట ఏంటి ఉన్న మాటే! అప్పట్లో అందరూ నన్ను నీకేంరా హీరోలా ఉన్నావు. అందమైన అమ్మాయిలందరూ తమ హృదయాల్లో నీకు గుడి కట్టార్రా అని ఈర్ష్య పడేవారు” కాలరెగరేశాడు నిరంజన్.
”అవునా?” ఆశ్చర్య పోతున్నట్టుగా అంది కావ్య.
”అవును.నువ్వు ఏమీ అనుకోనంటే ఒక మాట.. ఒకసారి సురేఖ క్లాసులో ఎవరూ లేనప్పుడు వడివడిగా నా దగ్గరకు వచ్చి చంప మీద గట్టిగా కిస్ చేసి వెళ్ళింది..”
కావ్య మనసు ఉడికిపోయింది.
”ఆమె చొరవకి ఆశ్చర్యపోయాను. అభినందించకుండా ఉండలేక పోయాను. అప్పటికప్పుడే ఆమె ‘బాకీ’ తీర్చేశాను ఘాట్టిగా ముద్దుపెట్టుకుని. ఈ ‘ముద్దుల వ్యాపారం’ కాలేజీ వదిలేంతవరకూ వారానికోసారి కచ్చితంగా జరిగింది…”
ఇక వినడం ఇష్టం లేదన్నట్టు కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది కావ్య.
“అది సరే. నా ప్రేమ సంగతులన్నీ నీకు ఓపెన్‌గా చెప్పాను నీకు కూడా ఇలాంటి ఎఫైర్స్ ఏమైనా ఉన్నాయా ? ఉంటే ఓపెన్‌గా చెప్పు సరదాగా నవ్వు కోవచ్చు..”
తను కాలేజీలో గొప్ప అందగత్తెనని చెబుదామనుకుంది కావ్య. అంతే కాదు.. తమ కాలేజీలో రొమాంటిక్ హీరోగా ఉండే చంద్రశేఖర్ అంటే తనకు విపరీతమైన క్రష్ అని కూడా చెప్పాలనుకుంది.. చెబుదామా వద్దా అన్న డైలమాలో ఉంది.
మళ్ళీ అతనే అన్నాడు.
“రేష్మి అంత కాకపోయినా నువ్వు కూడా చూడ్డానికి బాగానే ఉంటావు ఈ లెక్కన కనీసం ఒక్క లవర్ అయినా లేకుండా ఉంటాడా నీకు? చెప్పు చెప్పు.. ప్లీజ్ చెప్పు ఓపెన్ అప్ యార్”
ఆమె ఏమీ మాట్లాడలేదు.
కాలేజీ స్పోర్ట్స్ రూమ్ లో చంద్రశేఖర్ తనని గట్టిగా హగ్ చేసుకుని ‘ఐ లవ్ యు’ అని చెప్పిన విషయం గుర్తొచ్చింది.. ‘బోడి నీకేనా లవర్స్? నాకు ఉన్నారోయ్’ అని నిరంజన్ కి అరచి చెప్పాలని, తన కడగంటి చూపు కోసం ఎందరో కుర్రాళ్ళు పడిగాపులు కాచేవారని చెప్పాలని ఆమె మనస్సు తెగ ఉవ్విళ్ళూరుతోంది.. కానీ ఆమె చెప్పాలనుకునే ముందే మూడు రోజుల క్రితం నాటి విషయం గుర్తొచ్చింది.
తమకు పాలు పొసే గోపాల్ – ”అక్కా మీ దగ్గర యద్దనపూడిగారి నవలలు ఏమన్నా ఉంటే ఇవ్వండి.. చదివి ఇచ్చేస్తాను” అన్నాడు నవ్వుతూ. అతను ప్రైవేటుగా డిగ్రీ చేస్తున్నాడు.
“నీకు ఆవిడంటే అంట ఇంట్రెష్టా?” అంది తను.
”అవునండి..” అన్నాడు వాడు సిగ్గుపడుతూ.
”సరే చూసిస్తాలే రేపు..” అంది తను.
వాడు వెళ్ళిపోయేదాకా అక్కడే సోఫాలో కూర్చుని పేపర్ చూస్తున్నట్టు నటిస్తున్న నిరంజన్ ”వాడికి ఆవిడ అంటే ఇంట్రెస్ట్ కాదు.. నువ్వంటే ఇంట్రెస్ట్” అన్నాడు వ్యంగ్యంగా నవ్వుతూ.
కావ్య చురుక్కుమని భర్త వంక చూసింది.
తనకంటే నాలుగేళ్ల చిన్నవాడైన కుర్రాడిని పట్టుకుని ఎంత మాటనేశాడు ఈయన అనుకుంది.
ఆమె మౌనంగా లోపలి వెళ్తుంటే ”కొంపతీసి వాడికి నవల ఇచ్చావో.. అందులో నీకు కచ్చితంగా లవ్ లెటర్ పెట్టి తిరిగి ఇస్తాడు వాడు.. ” అన్నాడు పెద్దగా నవ్వుతూ.
ఆమె కోపంగా వెనుతిరిగి చూస్తుంటే ”అవును! డామ్ సూర్ ! పెళ్లయ్యాక నువ్వందుకున్న తొలిప్రేమ లేఖగా అది చరిత్రలో నిలిచిపోతుంది” అన్నాడు మరింత వ్యంగ్యంగా.
”అసలు మీరు మనుషులేనా? భార్యతో మాట్లాడే తీరు ఇదేనా?” అంటూ నిప్పులు చెరిగింది.
“డోంట్ టేక్ ఇట్ సీరియస్ జస్ట్ ఇట్స్ ఏ జోక్?” అన్నాడు బాత్ రూమ్ లోకి వెళ్తూ.
అలాంటి మనిషి ఇప్పుడు తన ప్రేమ తాలూకూ ఫ్లాష్ బ్లాకులు చెప్ప మంటున్నాడు..
చంద్రశేఖర్ కి ‘హగ్ ‘ ఇచ్చానని చెబితే ఇప్పుడే గుండాగి చస్తాడు అనుకుంది కావ్య కసిగా.
అందుకే మౌనంగా ఉందామె.
”చెప్పు చెప్పు డియర్! నీ లవర్ పేరేంటి? వాడిప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? నాలాగా రొమాంటిక్ గా ఉంటాడా? తారుడబ్బాలా ఉంటాడా? అయినా ‘ప్రేమ గుడ్డిది అంటారు కానీ వయసు గుడ్డిది అనడం కరెక్ట్!’ ఆ వయసులో ఏ దిక్కూ లేకపోతే తారుడబ్బానైనా ప్రేమించక తప్పదు కదా నీలాంటి వాళ్ళు.. ” వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు నిరంజన్.
ఆమె పళ్ళు కొరుక్కుంది.
“సరేలే నీ ‘తారుడబ్బా’ నువ్వు ఎక్కడ కలిసేవాళ్లు. పార్కులోనా? సినిమా హాల్లోనా?”
తన ప్రియుడంటే ‘తారుడబ్బా’లా ఉంటాడని అప్పటికే ఖరారు చేసిన నిరంజన్ పై ఆమెకు పీకల దాకా కోపం వచ్చింది.
అన్నింటికంటే అతను నవ్వుతూ అడుగుతున్నా కళ్ళల్లో కనిపిస్తున్న అనుమానం, కసి, క్రోధం ఆమె పసిగట్టేసింది.
ఈ క్షణంలో తన ప్రేమ ఉదంతం ఒక్కటి ప్రస్తావించినా ఈ భర్త మహాశయుడు తనకు నిత్యం నరకమే చూపిస్తాడు అని ఆమెకు అర్థమైంది.
అందుకనే పెదవి విప్పలేదు.
”చెప్పు కావ్యా! నేను అందరి మగాళ్ళలాంటి అనుమానం పిశాచిని కాదు. నేను ఎంత ఓపెన్‌గా నా లవ్ స్టోరీలన్ని నీకు చెప్పాను నీకు కూడా అలాంటివి ఉండే ఉంటాయి. అవి ఏంటో చెప్పు సరదాగా వింటాను.. జస్ట్ ఫర్ టైం పాస్! అయినా అవి ఎప్పుడో కాలేజీ కాలం నాటి ముచ్చట్లు కదా! ఆ తీపి జ్ఞాపకాలని మళ్లీ మళ్లీ చెప్పుకోవడంలో తప్పేముంది? చెప్పు ప్లీజ్ చెప్పు! నేను ఓపెన్ మైండెడ్ అండ్ జోవియల్ అని నీకు తెలుసు కదా? ప్లీజ్ చెప్పవా?” అని అంటున్నా అతని కళ్ళలో కనపడుతున్న క్రీనీడల్ని గుర్తించింది కావ్య.
అందుకే- ”బాబు మాకు అలాంటివి ఏవీ లేవు. మా కాలేజీలో మీలాంటి రొమాంటిక్ హీరోలు ఎవరూ లేరు.. అందరూ మీరు చెప్పినట్టు తారుడబ్బాలే! అలాగే నేను కూడా రొమాంటిక్ హీరోయిన్ ఏమీ కాదు కదా? మాకు లవర్స్ ఎక్కడ దొరుకుతారండి?” అంటూ నవ్వేసింది.
నిరంజన్ గుండె కుదుటపడింది. అతని ఇగో సంతృప్తి చెందింది.
కావ్య కూడా భర్తలోని ఈ శాడిస్టిక్ లక్షణాల్ని చూసి ఇకపై తాను చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుంది.

నా విశ్లేషణ:

నాకు గుర్తుకున్నంతవరకూ ఇది ఒక కన్నడ కథ. పురుషాహంకారానికి నిలువెత్తు అద్దం ఈ కథ. ఉదారులుగా సంఘంలో చెలామణి అవుతున్న చాలా మంది భర్తల నిజస్వరూపాన్ని బట్టబయలు చేసిన కథ. తను ఎవరినైనా ఎంత మందినైనా లవ్ చేయవచ్చు.. ‘అడ్వాన్స్’ కూడా కావచ్చు. కానీ భార్య మాత్రం కారాదు అనుకునేవారికి ఈ కథ చెంపపెట్టు. ”చెప్పు చెప్పు సరదాగా.” అంటూ మొదలు పెట్టి ఆనక ఆమె ఏదన్నా చెబితే నరకయాతనలు పెట్టే తత్త్వం ఉన్నవారి కథ. వీళ్ళు దండిస్తారా లేదా అన్నది పక్కనపెడితే భార్యకు తమ మాటలతో నరకాన్ని చూపడం ఖాయం. పాతిక ముప్ఫయి ఏళ్ల కిందటి కథ కాబట్టి, కావ్య లాంటి వాళ్ళు సర్దుకుపోయారు. ఇప్పుడైతే అది కుదరదు. విడాకులు ఖాయంగా అయిపోతాయి. లేదంటే హత్యలకో ఆత్మహత్యలకో ఈ సంఘటనలు దారి తీస్తాయి. మీరేమంటారు ?

1 thought on “వెంటాడే కథ – 21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *