April 27, 2024

కర్ణాటకలో పండుగలు

రచన: రమా శాండిల్య

నేను బెంగుళూర్ వచ్చి మూడు సంవత్సరాలు పూర్తి అయింది. ఇక్కడ ఉండి నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే, కర్ణాటక రాష్ట్ర ప్రజలు సంప్రదాయాన్ని చాలా విధిగా పాటిస్తారు. వీరి జీవితంలో సంప్రదాయము, సాహిత్యము, సంగీతం, నృత్యం వంటి విషయాలన్నీ పరంపరగా వస్తున్నాయి. వాటిని వీరు అంతే శ్రద్ధగా అనుసరిస్తున్నారు కూడా! వీరు చేసే పండుగలన్నీ, చాలా మట్టుకు నేను స్వయంగా చూసాను. రంగులమయం వీరి జీవితం. వీరు చాలా విషయాలు పరంపరాగతంగా ఆలోచిస్తారు, అమలుపరుస్తారు కూడా! పండుగలు చేసుకునే విధానం, అది అమలుపరిచే విధానం కూడా చాలా క్రమశిక్షణతో ఉంటుంది. ఈ సంవత్సరం ఎలా ఉందో, మళ్లీ సంవత్సరం కూడా అలాగే చేస్తారు. అయినా విసుగులేకుండా చాలా ఉత్సాహభరితంగా చేసుకుంటారు.
అలా నేను చూసిన, విన్న కొన్ని పండుగల గురించి వ్రాస్తున్నాను.
ముఖ్యంగా వీరి నేల, వాతావరణం వీరికి చాలా సహకరిస్తుంది. వీరి పెరట్లో పూసే పువ్వులు జీవితాన్నే రంగులభరితం చేస్తాయి అని చెప్పటంలో అతిశయోక్తి లేదు.
కర్ణాటకలో కన్నడిగులు చేసుకునే, నేను చూసిన, విన్న, సంప్రదాయ పండుగలు కొన్నిటి గురించి నాకు తెలిసిన విషయాలు. ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

1. గౌరీ గణేశ:
ఈ పండుగ చూడాలంటే, భాద్రపద శుద్ధ తదియ రోజు గౌరీ అమ్మవారిని నిలబెడతారు. అమ్మవారు గణేషుడిని నలుగుపిండితో తయారుచేసిన రోజట ఇది. ఆడపిల్లలు చాలా అందంగా తయారై, అమ్మవారిని అలంకరిస్తారు. వారికి వచ్చిన సంప్రదాయ సంగీత, నృత్యాలతో, షోడశోపచారాలతో పూజిస్తారు. వీరికి, “హోళిగలు” అనే పిండివంట, పెసరపప్పు పాయసం తప్పనిసరిగా అమ్మవారికి నైవేద్యం పెడతారు. అలాగే, హారతి వీరి పూజలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. స్త్రీదేవతా పూజల్లో సుహాసిని ధ్రవ్యాలను పంచిపెడతారు. చాలా బావుంటుంది. తాంబూలంలో కొబ్బరికాయ తప్పనిసరిగా ఇస్తారు.

2. వినాయక చతుర్థి:
ఈ పండుగలో పాలవెల్లి ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇక్కడ గణేశ చతుర్థికి, గరిక, జిల్లేడు పూలతో మాలలు, ముద్ద శంకంపూల మాలలు దొరుకుతాయి. అందంగా అలంకరించి, కుడుములు, జిల్లేదికాయలు, పాలతాలికలతో నైవేద్యం, బెళ్ళంపానకం కూడా పెడతారు. తొమ్మిది రాత్రులు ప్రతీ వారింట్లోనూ గణేషుడిని నిలబెట్టి పూజలు, హారతి రోజూ రెండుపూటలా ఇస్తారు.

3. వరమహాలక్ష్మి: ఇదికూడా అమ్మవారిని నిలబెట్టి, చక్కగా అలంకరించి, తోరపూజ చేసుకుని ముత్తైదువులకు భోజన తాంబూలాలతో సత్కరిస్తారు. బోలెడు పిండివంటలు చేస్తారు.

4. శ్రీకృష్ణజన్మష్టమి:
రాధాష్ఠమి కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఈ పండుగకు బొమ్మల కొలువు పెట్టడం సంప్రదాయం కొందరి ఇళ్ళల్లో! పాలవెల్లి 24 రకాల పిండివంటలతో అలంకరించి, భగవత్గీత, భాగవత, భారతాల పారాయణం ఉంటుంది. వెల్లినవారికి దక్షిణ తాంబూలాలతో సత్కరిస్తారు.

5. దీపావళి:
ఇది వ్యాపారస్తులు క్రొత్త అకౌంట్ పుస్తకాలు పెట్టీ పూజిస్తారు. ఇంట్లోనూ, వ్యాపార స్థలాలలో లక్ష్మీపూజ చేస్తారు. వచ్చిన అతిథులకు స్వీట్ డబ్బా తప్పకుండా ఇస్తారు. ఊరంతా ఎలక్ట్రిక్ బల్బులతో అలంకరిస్తారు. వివిధరకాల తీపి పిండివంటలు చేస్తారు. ఇక్కడ ఒకరకమైన పేణి దొరుకుతుంది. పాలతో తింటారు. హైదరాబాద్ పేణి కాదు.

6. మకర సంక్రమణం:
మనలాగే కర్ణాటక వారికి కూడా మూడురోజుల పండుగే ఇది. కానీ, బొమ్మలు పెట్టుకోరు.
భోగిరోజు, సంక్రాంతి రోజు కూడా పొంగలి వండుకుంటారు. ఆ పొంగలి కోసం కొత్త గిన్నె కానీ, కుండగాని కొని దానిలో వండుతారు. మనకు, వీరికి కొంచెం తేడాగా ఉంటాయి. పసుపుకుంకుమలు ముత్తైదువులకు ఇస్తారు.
కనుమ మాత్రం పొలంలో పూజ, పశువులకు పూజ, పాలేగాళ్ళకు సంవత్సరానికి ఇచ్చే బహుమానాలు ఇస్తారట.
ఇవి రాష్ట్రమంతటా వారి వారి ఇంటి పద్ధతిని బట్టి చేసుకుంటారు.
ఇక రాష్టమంతా ఒకటే లాగా, ప్రతి జిల్లాకు ఉండే పండుగలు కొన్ని ఉన్నాయి. ఈ పండుగల కోసం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, సంవత్సరానికి ఒకసారి వారి జిల్లాకు వచ్చి ఆ పండుగ కోసం తప్పకుండా వచ్చి చేసుకుని వెడతారు. విజిటర్స్ కూడా ఆ పండుగల కోసం తప్పకుండా వచ్చి చేసుకుంటారు. అవి!

1. మహా మస్తకాభిషేకం:
శ్రావణ బెళొగొళలో పన్నెండు సంవత్సరాలకి ఒకసారి మహావీరుడు 17.3736 పొడుగైన విగ్రహానికి చేసే అభిషేకం కోసం ప్రపంచంలో ఇక్కడ ఉన్న జైనులైనా అక్కడికి వస్తారు. అప్పుడు చేసే అభిషేకానికి వాడే పదార్ధాలు, గంధం, కుంకుమ పువ్వు, చేరుకురసం, సుగందపానేయానికి వాడే పదార్ధాలు వంటివి. ఈ అభిషేకం చూసి తీరవలసిందే గానీ, వర్ణించ మాటలు ఉండవు. 2018 లో జరిగిన ఈ అభిషేకం కొంచెం దూరం నుంచి చూసాను. వీలైతే ఒకసారి చూడవచ్చును. 2030 లో మళ్ళీ జరుగుతుంది. ఇది జైనులే కాదు, హిందువులు కూడా తప్పకుండా వెడతారు.

2. కంబాల పండుగ: అంటే, గేదెలకు పరుగుపందెం అన్నమాట.
వేల సంవత్సరాల నుంచీ, కర్ణాటక పల్లెలలో వ్యవసాయం చేసే రైతులు చేసుకునే పండుగ ఇది. ఈ పండుగకు మూడు నెలల ముందునుంచి జిల్లాలన్నీ పోటీలలో పాల్గొని జయాపజయాలు నిర్ణయించుకుంటారు. పండుగ రోజు బహుమానాలు, అవార్డులను కర్ణాటక రాష్ట్రం నుంచే తీసుకుంటారు. వీటిలో బోలెడు రాజ్యాలను పాలించిన రాజులు కూడా పాల్గొనే వారట. ఇది చాలా గౌరవనీయమైన పండుగ అని చెబుతారు.

3. మైసూర్ దసరా పండుగ:
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు దసరా చాలా పెద్ద పండుగ. ఇంటింటా బొమ్మల కొలువులు, ఇళ్ళల్లోనే కాదు, షాప్స్ లో, మాల్స్ లో గుళ్ళలో, పీఠాలలో ఎక్కడ చూసినా కొలువులు, పేరంటాలు, ప్రసాదాలు, తాంబూలాలు, సంగీత కచేరీలు, డాన్స్ ప్రోగ్రాంలు, చిత్రకళ ప్రదర్శనలతో అదో ప్రపంచంలో ఉన్నట్లు ఉంటుంది.
ఇక మైసూర్ అయితే చెప్పవద్దు. ఊరంతా, కోటంతా, చెట్లు, భవనాలు అన్నీ 15 రోజులు అలంకరిస్తారు. కోటలో ఉన్న చాముండి అమ్మవారికి, కొండమీద ఉన్న చాముండి అమ్మవారికి కూడా అనేక పురాతన నగలతో అలంకరించుతారు. యుద్ధవిన్యాసాలు అన్నీ చూడవచ్చును. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కన్నడిగులు తప్పక కలుస్తారు. అతిథులు కూడా వస్తారు. అంగరంగ వైభవంగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ప్లాన్ చేసుకుని చూసిరావచ్చును. మూడు సంవత్సరాలు చూసాను. మైసూర్ పాక్, మైసూర్ బోండా, మైసూర్ దోశ చాలా బావుంటాయి రుచి చూడటం మరువ వద్దు. ఒక మైసూర్ సిల్క్ చీర కూడా తప్పకుండా కొనుక్కోండి!
***

1 thought on “కర్ణాటకలో పండుగలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *