April 28, 2024

అమ్మమ్మ – 52

రచన: గిరిజ పీసపాటి

“తెలియదు పెద్ద తల్లీ! ఈ రోజు రాత్రికి విజయనగరంలో పెళ్ళి ఉంది. అక్కడికని చెప్పి ఇలా వచ్చాను” అన్నారాయన. మరో రెండు గంటల పాటు మాట్లాడుకుని బాగా చీకటి పడటంతో ‘ఇక బయల్దేరరామని’ చెప్పి లేచారంతా.
“ఒక్క నిముషం” అంటూ తన కేష్ బేగ్ లోంచి పాత డైరీ ఒకటి తీసి, అందులోంచి ఒక పేపర్ చించి, దాని మీద ఒక అడ్రెస్ రాసి ఇస్తూ “ఇక మీద మీరు నాకు ఉత్తరం రాయాలనుకుంటే ఈ అడ్రస్ కి రాయండి. మా నాన్నకి తెలియ కుండా నాకు ఉత్తరాలు అందుతాయి” అన్నారాయన.
‘సరే’ నని ఆ కాగితం తీసుకుని ఇంటి దారి పట్టారంతా.
వీళ్ళు ఇంటికి చేరేసరికి పక్క పోర్షన్ అయిన హౌస్ ఓనర్ ఇంట్లో ఆయన భార్యతో మాట్లాడుతూ కనిపించింది అమ్మమ్మ.
ఆవిడను చూడగానే “ఎంత సేపైందమ్మా వచ్చి?” అనడిగిన కూతురితో “రెండు గంటలయిందే! అయినా ఇంత చీకటి పడే వరకూ మీరెక్కడికి వెళ్ళారూ!?” అని ప్రశ్నించిన తల్లితో “ఇంట్లోకి పద. అన్నీ వివరంగా చెప్తాను” అంటూ తాళం తీసి, ఇంట్లోకి దారి తీసింది.
ఇంట్లోకి వెళ్తూనే తల్లితో జరిగిన విషయం వివరంగా చెప్పింది. అంతా విని “బాబు త్వరలోనే వస్తాడని నాకు తెలుసు. కాకపోతే ఇంటికి వస్తే బాగుండేది. పెద్ద దాన్ని కనుక మీ మేలు కోరి ఒక విషయం చెప్తున్నాను‌. విను నాగేంద్రుడూ! అంతా బాగుంది గానీ… బాబు ఎక్కడో లాడ్జిలో దిగడం, అక్కడికి మీరు వెళ్ళడం బాగో లేదు.”
“నేను సమయానికి లేను. లేకపోతే నేను కూడా వచ్చేదాన్ని. నీ వయసు ముఫ్ఫై మూడు సంవత్సరాలు. ఈడొచ్చిన ఆడపిల్లలతో నువ్వు అలా చవకబారు లాడ్జిలకు వెళ్ళడం పద్ధతి కాదు. నువ్వు నీ భర్త కోసం వెళ్తున్నావని చూసినవారు ఎవ్వరూ అనుకోరు. కనుక ఇక మీద బాబు వైజాగ్ వస్తే ఇంటికి రమ్మని నిర్మొహమాటంగా ఒక ఉత్తరం ముక్క రాయు. నన్ను రాయమంటే నేనే రాస్తాను” అంది పెద్దావిడ కూతురితో.
“నువ్వన్నదీ నిజమేనమ్మా. నేనంత దూరం ఆలోచించలేదు. రేపే ఉత్తరం రాస్తాను” అంది నాగ. ఆ రాత్రి చాలా రోజుల తరువాత కాస్త ప్రశాంతంగా నిద్ర పోయారు అంతా. మర్నాడు ఆయన ఇచ్చిన అడ్రస్ కి లాడ్జికి వచ్చి కలవడానికి తమకున్న ఇబ్బందులు తెలియజేస్తూ ఉత్తరం రాసింది నాగ.
పదిహేను రోజులకు ఆయన దగ్గర నుండి “తన మీద కోపం పెట్టుకోకుండా ఇంటికి రమ్మన్నందుకు చాలా సంతోషంగా ఉందనీ, ఇక్కడ తండ్రి తనకు పోస్ట్ మాస్టర్ ఉద్యోగం ఇప్పించారు కనుక, ఇక మీద డైరెక్ట్ గా తనకే ఉత్తరాలు రాయొచ్చనీ” జవాబు వచ్చింది.
గిరిజ డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు, నాని కూడా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసాడు.
మరోసారి తండ్రి వైజాగ్ వస్తూ ముందుగా మాటిచ్చినట్లే ఇంటికి రావడంతో అందరూ సంతోషించారు. రెండు రోజులు ఉన్నాడాయన. ఉన్న రెండు రోజుల్లో సినిమాకి, బీచ్ కి వెళ్ళారు. ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు పిల్లలు ముగ్గురినీ పిలిచి తలో కొంత చిల్లరా చేతిలో పెట్టి, ఇంతకన్నా ఏమీ ఇవ్వలేకపోతున్నందుకు క్షమించమని అడిగాడు. నాని తండ్రితో పాటు రాముడువలస వెళ్తానని మొండి కెయ్యడంతో సరేనని పంపించారు.
ఆ ఏడు కూడా వసంతకు ప్రతీ వేసవిలో వచ్చే చెమట పొక్కులు వచ్చి, పెద్ద కురుపులుగా మారిపోవడంతో ఇక ఉద్యోగం చెయ్యలేక మానేసింది. ఏంటీ బయోటిక్స్ వాడుతున్నా తగ్గలేదు సరికదా రెండు కాళ్ళ మీద కురుపులు బాగా పెద్దవి అయిపోవడంతో నడవలేక పూర్తిగా మంచం పట్టేసింది.
హాస్పిటల్ కి వెళ్దామంటే వీళ్ళ ఇంటి నుండి ఆటో వరకూ కూడా నడవ లేని పరిస్థితి. మరో పక్క తీవ్రమైన తుఫాను, పవర్ కట్. ఆ రాత్రి వసంతకు టెంపరేచర్ బాగా ఉండడం, కురుపుల నుండి చీము, రక్తం కారుతుండడంతో భయం వేసి ఎలాగైనా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళే ప్రయత్నం చేసారు.
కానీ… రాత్రి ఎనిమిది గంటల వేళ, పైగా తుఫాను కావడంతో ఒక్క ఆటో కూడా దొరక్క తిరిగి ఇంటికి వచ్చేసారు. కాసేపు ఆలోచించిన నాగ ‘వసంతను జాగ్రత్తగా చూసుకో’మని గిరిజకు చెప్పి, గొడుగు తీసుకుని, వడివడిగా నడుచు కుంటూ ఆశలమెట్ట జంక్షన్ లో ఉన్న ‘వందనా హోమియో క్లినిక్’ కి వెళ్ళి డా. వెంకటేశ్వరరావు గారిని కలిసి, బతిమాలి ఇంటికి తీసుకువచ్చింది.
ఆయన వస్తూనే వసంత పరిస్థితి చూసి, వేడి నీళ్ళు పెట్టమని, అర్జంటుగా కొత్త బ్లేడ్ ఇమ్మని చెప్పి, కొవ్వొత్తుల వెలుగులోనే ఆ బ్లేడ్ తో కురుపుల మీద గాటు పెట్టి పస్ తీసేసి, డ్రెస్సింగ్ చేసి, “ఎందుకైనా మంచిది. ఉదయాన్నే హాస్పిటల్ లో అడ్మిట్ చెయ్యండి. లేట్ చేస్తే కాలు తీసేయవచ్చు. హై ఫీవర్ ఉంది.” అని ఒకటికి పదిసార్లు హెచ్చరించి వెళ్ళిపోయాడు.
పస్ తీసేయడంతో కొద్దిగా నొప్పి తగ్గి, మర్నాడు ఉదయాన్నే ఆటో వరకూ మనిషి సాయంతో మెల్లిగా నడవగలిగిన వసంతను తీసుకుని అక్కయ్యపాలెం హైవే రోడ్ దగ్గర ఉన్న ప్రశాంతి నర్సింగ్ హోమ్ లో అడ్మిట్ చేసారు. వసంతకు ఇది వరకు వేళ్ళు తీసేసిన కేజీహెచ్ అసిస్టెంట్ సర్జన్ డా. భాస్కరరావు గారు రిటైర్ అయాక ఓపెన్ చేసిన నర్సింగ్ హోమ్ అది.
ఆయనకు వసంత అంటే కేజీహెచ్ లో ఉన్నప్పుడే చాలా అభిమానం ఏర్పడింది. దానితో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కలవమని ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్ ఇచ్చినా ఇప్పటివరకు మళ్ళీ ఆయన అవసరం కలగలేదు. మధ్యలో ఒకసారి రోడ్డు మీద అనుకోకుండా కలిసి నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేసినట్లు చెప్పారు.
వసంతను తీసుకుని వెళ్ళేసరికి ఉదయం ఏడు గంటలయింది. హాస్పిటల్ లో స్టాఫ్ డాక్టర్ గారికి ఫోన్ చేసి పేషెంట్ వచ్చిన విషయం చెప్తుండగానే… నాగ “నేను డాక్టర్ గారితో మాట్లాడతాను” అంటూ రిసీవర్ తీసుకుని వసంత కండిషన్ చెప్పగానే ఆయన మరేం మాట్లాడకుండా “పది నిముషాలలో అక్కడ ఉంటాను”
అంటూ కాల్ డిస్కనెక్ట్ చేసారు.
చెప్పినట్లుగానే పది నిముషాలలో ఆయన కార్ వచ్చి ఆగింది. అందులోంచి ఒక్క ఉదుటున దిగి, పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వసంత ఉన్న రూమ్ దగ్గరకు చేరుకున్నారు. కురుపులను బాగా పరీక్షించాక ఒక బకెట్ తెప్పించి అందులో వేడి నీరు పోసి, ఆ నీటిలో పొటాషియం పర్మాంగనేట్ పలుకులు వేసి, వసంత రెండు కాళ్ళూ అందులో పెట్టమన్నారు.
“అమ్మో! ఇంత వేడిగా ఉన్నాయి” అంటున్న నాగను ఒక్క చూపుతో కట్టడి చేసి, “ఏంటి ఆలోచిస్తున్నావు వసంతా!? నీ కాళ్ళ మీద నువ్వు లేచి నడవా లంటే ముందు కాళ్ళు రెండు అందులో పెట్టు. కాళ్ళు తీసేసినా పరవాలేదు, మిగిలిన జీవితం అంతా మంచంలో బతుకుతానంటే నీ ఇష్టం” అన్నారు రెచ్చ గొడుతున్నట్లు.
దాంతో వసంత మరో ఆలోచన లేకుండా రెండు కాళ్ళూ బకెట్ లో పెట్టి, ఆ వేడి నీటికి కురుపులు సలుపుతున్నా ఓర్చుకుంటూ కూర్చుంది. “దట్ ఈజ్ వసంత. నీ విల్ పవర్ నాకు బాగా తెలుసు. రోజూ రెండు పూట్లా ఇలా కూర్చోవాలి. మిగిలిన ట్రీట్మెంట్ నేను చూసుకుంటాను.”
అంటూనే స్టాఫ్ తో “వసంతకు షుగర్ వెయ్యకుండా వేడిగా కాఫీ ఇవ్వండి. త్వరగా…” అనడంతో వారు కాఫీ పెట్టడానికి పరిగెట్టారు.
నాగను తనతో రమ్మని సైగ చేసి, కారిడార్ లో కొద్దిగా ముందుకు వెళ్ళాక “ముందే తీసుకురావలసింది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. కాలు తీసెయ్యకుండా ఉండడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఇప్పుడే గారంటీ ఇవ్వలేను” అనడంతో నాగ పాలిపోయిన ముఖంతో చూసిందాయనవైపు.
“అధైర్యపడకండి. మంచే జరుగుతుందని పదేపదే అనుకోండి. వసంతకు ఈ విషయం అస్సలు చెప్పొద్దు” అని చెప్తే ‘సరే’నని తల ఊపింది. తిరిగి ఇద్దరూ వసంత ఉన్న రూమ్ కి వచ్చేసరికి కాఫీ తాగుతూ కనిపించింది వసంత.
“ఏం వసంతా! ఎలా ఉంది కాఫీ?” అనడిగిన డాక్టర్ గారి ప్రశ్నకు “వేడి
నీళ్ళలో కాళ్ళు పెట్టమని వేడి కాఫీ తాగడానికి ఇచ్చిందే కాక ఎలా ఉందని అడుగు తున్నారా!?” అంది కోపంగా. దాంతో ఆయన పెద్దగా నవ్వి “కోల్డ్ కాఫీ ఇమ్మం టావా?” అనడిగితే ‘వద్దు’ అన్నట్లు బుర్ర అడ్డంగా ఊపి “ఐస్ క్రీమ్ అయితే బాగుంటుంది” అంది.
ఆయన చిన్నగా నవ్వుతూ “నీ అల్లరి తగ్గలేదు” అంటూ సుతిమెత్తగా వసంత జుత్తుని చిన్నగా ఊపి వదిలేసారు. బకెట్ లో నీళ్ళు చల్లగా అవగానే కాళ్ళు బయటకు తీయించి, శుభ్రంగా క్లీన్ చేసాక “రాత్రి ఆపరేషన్ చేసిన డాక్టర్ సర్జనేనా!” అని అడగడంతో, హోమియో డాక్టర్ అని చెప్పి, ఏ పరిస్థితిలో ఆయన దేవుడిలా వచ్చి సహాయపడ్డారో చెప్పింది నాగ.
ఆయన చిన్నగా తల పంకించి “గాట్లు పెట్టిన విధానం చూసి అడిగాను. ఏదైనా మంచి పనే చేసారాయన” అంటూ వసంతతో తనకిష్టమైన సినిమాల గురించి మాట్లాడుతూ చకచకా రెండు కాళ్ళకీ ఆపరేషన్ చేసి, డ్రెస్సింగ్ చేసారు. “మళ్ళీ సాయంత్రం వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టాలి. మర్చిపోకు వసంతా!” అంటూ కొన్ని సర్జికల్ ఐటెమ్స్, మెడిసిన్ లిస్ట్ రాసి నాగ చేతిలో పెట్టారు.
“గిరీ! నువ్వు ఇంటికి వెళ్ళు. నేను అక్క దగ్గర ఉంటాను. వంట చేసి, కేరేజ్ ఇచ్చిన తరువాత షాప్ కి వెళ్ళు. గణేష్ గారికి మన పరిస్థితి చెప్పి ఐదు వేలు అడ్వాన్స్ అడుగు. సాయంత్రం పెందరాడే పర్మిషన్ పెట్టి ఇంటికి వచ్చి, రాత్రికి వంట చేసి కేరేజ్ తో పాటు ఈ సర్జికల్ ఐటెమ్స్, మందులు కొని తీసుకురా” అని చెప్పి‌న తల్లి మాటలకు ఇంటికి బయలుదేరింది గిరిజ. వెళ్తూ పూర్ణా మార్కెట్ లో కూరలు కొనుక్కుని మరీ వెళ్ళింది.
ఇంటికి గిరిజ వెళ్ళేసరికి అమ్మమ్మ అందరికీ కలిపి వంట చేస్తూ కన బడింది. గిరిజ గబగబా తల్లికి, అక్కకి కావలసిన బట్టలు, పేస్ట్, బ్రష్, దువ్వెన, టవల్స్, సోప్స్ వంటి సామానుతో పాటు రెండు కంచాలు, గ్లాసులు, స్పూన్లు, పంచదార, ఉప్పు వంటివన్నీ పేక్ చేసి ఒక బేగ్ లో సర్దింది.
రాత్రి తిన్న అంట్లు తోమేసి, ఇల్లంతా సర్దేసి, స్నానం చేసి, వంట పూర్తయాక కేరేజ్ సర్ది, తను కూడా భోజనం చేసి, హాస్పిటల్ కి మోపెడ్ ని ఉరికించింది. దారిలో కావలసిన ఐటెమ్స్ కొనుక్కుని మరీ వెళ్ళింది. వసంత, నాగ భోజనం చేసాక, ఖాళీ కేరియర్ తీసుకుని షాప్ కి వెళ్ళింది.

****** సశేషం *******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *