April 27, 2024

సినీ బేతాళ కథలు – 3, నబూతోనభవిష్యతి

రచన: డా. వివేకానందమూర్తి

విక్రమార్కుడు చెట్టు మీదనుంచి బేతాళుడి శవాన్ని దింపి, తన భుజం మీద వేసుకుని మళ్ళీ నడకసాగించాడు.
‘విక్రమార్కా! నీకు శ్రమ కలుగుతోందనే ఫీలింగు రాకుండా మరో కథ చెబుతాను, విను -’ అని బేతాళుడు ప్రారంభించాడు.
గుంటుపల్లిలో బంటు ఈశ్వరుడు అనే పొగాకు వ్యాపారి ఉండేవాడు. అతనికి సినిమాలంటే ప్రాణం. ప్రతిరోజూ ఏదో ఒక సినిమా చూసేవాడు. చూశాక తన తోటి బంధుమిత్రులతో ఆ సినిమాను విశ్లేషించేవాడు. తను యవ్వనంలో ఉన్నప్పుడు పౌరాణిక, సాంఘిక నాటకాల్లో కొన్ని వేషాలు వేశాడు. అప్పుడప్పుడు సినిమాల్లో నటించాలనిపించినా అవకాశాలు రాలేదు. అయినా పొగాకు బిజినెస్ వదిలి, సినిమా వేషాల కోసం రిస్కు చెయ్యడానికి జంకాడు. క్షణక్షణం మూడు చుట్టలూ, ఆరుసిగరెట్లలా వెలిగిపోతూ ధుమ ధుమలాడిపోతూ జీవితం దర్జాగా సాగిపోతోంది. అయినా వేస్తే హీరో వేషమే వెయ్యాలి. తనకి ఒత్తులన్నీ కరెక్టుగా పలుకుతాయి. ఈ రోజుల్లో ఒత్తులు పలికేవాడికి హీరో వేషం ఎవడిస్తాడు?
రోజులు మొరోజుగా గడుస్తున్నాయి. ఖర్చులు పెరుగుతున్నాయి. రోజు కూలీకి బదులు, పూటకూలీ యివ్వాల్సొస్తోంది. పూటకూలీ కంపూటర్ కూలీ అయి పెట్టుబడి పొగాకు పొగలా పెరిగిపోతోంది. క్రమంగా కాన్సర్కి ఆన్సరు దొరక్క నిందంతా పొగాకు మీద పడింది. జనం పొగతాగడం మానేస్తూ, తాగడం మొదలెట్టారు. బంటు ఈశ్వరుడి పొగాకు బిజినెస్ వీక్ వీక్‍కీ వీకైపోసాగింది.
‘ఒరే ప్రజలారా! మీ అమ్మ కడుపులు కాలా! పొగతాగనివాడు దున్నపోతై పుడతాడర్రా’ అని మొత్తుకున్నాడు బంటు.
‘తాగనివాడు తిమింగలమై పుడతాడు. అయినా మన కొత్త సినిమాలు చూస్తూ తాగకుండా ఎలా బతకమంటావురా ఎదవా!’ అని జనం రిప్లీకరించారు. బంటు ఈశ్వరుడు ఇంక ఇలా లాభం లేదనుకున్నాడు. ఏదో ఒకటి తలపెట్టి సక్సెస్ అవ్వాలనుకున్నాడు. సక్సెస్కి శుభం సీనే తృప్తి. ఆ తృప్తి సంప్రాప్తించేదాకా అన్నాహారాలు మాని అహరహ్నం కృషి చెయ్యాలని నిశ్చయించుకున్నాడు.
ఈలోగా బంటు ఈశ్వరుడి ఏకైక పుత్రరత్నం ‘జిల్‍బుల్ బాబు’ యుక్తవయస్సుకి ఎదిగాడు. ఒకరోజు తన పుత్రుడు జిల్‍బుల్ బాబుని చూడగానే బంటుకి అనిపించింది. అందరూ తమ పిల్లాళ్ళని హీరోలు చేస్తున్నారు. తను కూడా తన జిల్‍బుల్ బాబుని హీరో చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. కానీ వచ్చిన చిక్కల్లా ఒక్కటే. ఏ కారణం చేతనో జిల్‍బుల్ బాబుకి జుట్టు పెరగలేదు. అంతా విగ్గులే వాడుతున్నారు. మీవాడికి కూడా తలకి విగ్గు తొడుగేయించు అన్నారు మిత్రులు. కానీ బంటు ఈశ్వరుడికి హీరో విగ్గులేకుండా, హీరోయిన్ సిగ్గులేకుండా నటిస్తేనే ఇష్టం. అంచేత జిల్‍బుల్కి జుట్టు పెరగడం కోసం ఎన్నో వైద్యాలు చేయించాడు. ఎన్నో రకరకాల మందులు వాడాడు. కొడుక్కి ఏ మందూ పనిచెయ్యలేదు సరికదా తన బుర్ర హీటెక్కిపోయి ఉన్న నాలుగు వెంట్రుకలూ రాలిపో సాగాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో అనుకోకుండా దేవుడు పంపిన దూతలా నిడదవోలు రైల్వే స్టేషను ప్లాట్ఫారం మీద ఒక సాధువు గారు కనిపించి ఒక లేపనం డబ్బా ఇచ్చి, ఆశీర్వదించి, కాళ్ళకడ్డం పడుతున్న తన గడ్డాన్ని లుంగీ పంచెలా ఎత్తిపట్టుకుని ప్లాట్ ఫారం పక్కనున్న రైలు కిందపడకుండా గబగబా నడిచి రైలింజన్ పొగలో దూరి అంతర్ధానమైపోయారు.
అదృష్టవశాత్తూ ఆ సాధువుగారి మందు పనిచేసిందనే ఒప్పుకోవాలి. సాధువుగారిచ్చిన లేపనం వాడాక జిల్‍బుల్ బాబుకి
జుట్టేం పెరగలేదు కానీ, ముఖం చిన్నదైపోయి ఉన్న జుట్టే ఎక్కువగా ఉన్నట్టు కనిపించింది. కనిపించడమేమిటి, జుట్టు తలనీ,
ముఖాన్నీ కప్పేసి జిల్‍బుల్ బాబు జులపాలబాబు అయిపోయాడు. బంటు ఈశ్వరుడు కొత్త ఉత్సాహంతో కొడుక్కి, ‘జులపాల బాబు’
అని స్క్రీన్ నేమ్ ఖరారు చేసి రంగంలోకి దిగాడు.
ఇప్పుడు అసలు ప్రశ్న – ఏ సినిమా తియ్యాలి? ఏ కథ ఎక్కడ దొరుకును? డైరెక్టరెవరు? తన ఏకైక పుత్రరత్నం జులపాల బాబుని హీరో చెయ్యడం ఎలా? –
అని ఆలోచించాడు బంటు. తెలుగులో తీస్తే తెలుగువారే చూస్తారు. రీమేక్ చేసినా, డబ్ చేసినా ఇంకా ఇక్కడా అక్కడా చూస్తారు. అందుచేత ఇంగ్లీషులో తీస్తే బెటరు. అంతర్జాతీయ హీరో అవుతాడు.
పొగాకు వ్యాపారంలో పోగుచేసిన డబ్బంతా పట్టుకుని ధైర్యే సాహసే జ్యోతిలక్ష్మీ అనుకుని, కొడుకు జులపాలబాబుతో హాలీవుడ్కి ప్రయాణం కట్టాడు బంటు ఈశ్వరుడు.
హాలీవుడ్‍లో సినిమాకి కథ, నిర్వహణ, ఎడిటింగ్ డైరెక్షన్ వగైరా విభాగాలు తెలియని చోట, విడివిడిగా మనుషుల్ని వెదుక్కోడంకంటే అన్నీ తనొక్కడే చూసుకునే అనుభవజ్ఞుడు ఒక్కణ్ణి చూసుకుంటే ప్రొడక్షన్ సులభం. ఖర్చు తక్కువతో తొందరగా వర్క్ పూర్తవుతుంది అనుకున్నాడు. హాలీవుడ్‍లో స్టూడియోలు, ఆఫీసులు, అక్కడి ఫేసులు అన్నీ వెదికాడు.
అలా వెతుకుతూ వెతుకుతూ ఉంటే, ఒకరోజు ఒక వీధిలో ‘మల్పాసో’ అనే బోర్డు కనపడింది. దగ్గరకు వెళ్ళాక ఆఫీసు ముందు చిన్న గార్డెన్లో ఒక చెట్టుకింద ఒకాయన కుర్చీలో కూర్చుని చేతిలో బహుశా స్క్రిప్టు కాబోలు చూసుకుంటున్నాడు. బంటు ఈశ్వరుడు, జులపాల బాబు అతని దగ్గరకు వెళ్ళారు. తీరా చూస్తే ఆయన క్లింటు ఈస్టువుడ్. తండ్రీ, కొడుకులు ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కారం పెట్టారు.
‘మీది ఈ ఏరియా కాదనుకుంటాను. బాలీవుడ్ మిత్రుల్లా అనిపిస్తున్నారు – కూర్చోండి’ అని ఇద్దరికీ తలో కుర్చీ చూపించాడు ఆయన.
కూర్చుంటూ బంటు, ‘తవరు క్లింటు ఈస్టువుడుగారే కదండీ – మేం బాలీవుడ్ కాదండి. కసింత కిందకండి. టాలీవుడ్డండి. నా పేరు బంటు ఈశ్వరుడు. ఈడు నా కొడుకు జులపాల బాబండి’ అని పరిచయం చేసుకున్నాడు.
క్లింట్ ‘బాంటు ఈస్ వేర్వుడ్’ చిరునవ్వుతో అన్నాడు.
బంటు ‘ఆయ్! అదేనండి. బంటు ఈశ్వరుడు కరెస్టండి. క్లింటు ఈస్టువుడుగారు’ అన్నాడు.
‘ఏం కావాలి మీకు? మై ఆటోగ్రాఫ్?’
‘అయిబాబో! ఆటోగ్రాపొక్కటే కాదండి. ఇంకా సేనా ఉందండి. ’
‘సేనా? వాట్సిట్?’
‘మీరు మాకు సినిమా సేసి పెట్టాలండి.’
‘నన్ను చాలామంది ఇలాగే అడుగుతూ ఉంటారు. అయితే నేనొక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు రైట్ ఆన్సరిస్తే – ఓ. కే’
‘అయిబాబో – ఎంత మాటండి క్లింటుగారూ – తవరడగడం ఈ బంటుగాడు సెప్పకపోడవా?’
‘వెరీ సింపుల్ క్వశ్చన్. ఎవరు మహానటుడు?-’
‘బలేవోరేనండి – పరాసికాలాడుతున్నారు. తవరు మా ఎదర అలా కుర్చీలో కూసున్నా నిలుసున్నాల్ల కంటే యవాఁ పొడుగ్గా ఉన్న తవరు. తవరంటే తవరు కాక ఇంకెవరండీ క్లింటుగారూ మహ్హానటుడు. ’
‘బంటుగారూ – కరెక్టుగా చెప్పారు – తనగురించి కాకుండా వేరే ఇంకెవరి గురించి మాట్లాడినా అర్జంటుగా లేచి వెళ్ళిపోయే వాడే మహానటుడు. మీరు నేనే అన్నారు. అందుకే నేను ఎక్సిటవలేదు. మీకు తప్పకుండా సినిమా చేసి పెడతాను. గో యెహెడ్! మేక్ మై డే!’
‘మీరు దేవుడు క్లింటు ఈస్టువుడుగారూ!’
‘మీ అప్రోచికి మెచ్చాను. బంటు ఈశ్వరుడుగారూ’
‘అయిబాబో – తవరి తెలుగు బలే ఫాస్టుగా, సరిగ్గా మీరు గన్లాగినట్టే మాటాడేత్తన్నారు.’
‘ఇక్కడంతా తెలుగువాళ్ళమేనయ్యా – అమెరికన్లంతా మెక్సికో పోయి మెక్డొనాల్డ్స్ అనే టౌన్‍లో పగలూ రాత్రీ తింటూ ఉంటున్నారు. త్వరలొనే సెపరేట్ తెలుగెరికా ఫార్మవుతోంది. ’
‘అయితే మనం బాగా క్లోజ్షాట్‍లో కొచ్చేశాం ఈస్టువుడుగారూ!’ ‘అఫ్కోర్స్, ఇకనుంచీ నన్ను క్లింటు అని పిలవండి’
‘తవరు నన్ను బంటు అని పిలవండి.’
‘బంటూ’
‘క్లింటూ’
‘బంటూ’
‘క్లింటూ’
‘నాన్నా మరి నేను?’
‘మీ చిరంజీవి పేరేవిటన్నారు?’
‘జులపాలబాబు – నా కొడుకు క్లింటనా. మన సినిమాలో నా కొడుకే హీరో నా కొడుకు. పోతే – ఈడికి యాక్సను అంతంత మాత్రం – మహానటుడు – మీరే నేర్పాలి క్లింటూ!’
క్లింట్ – ‘నాకూ యాక్షన్ రాదు బంటూ. అందుకే డాలర్ సిరీస్‍లో సెర్జియో లియోన్ గారు నన్ను హీరోగా వాడారు. నెత్తిమీది టోపీ తీస్తూ పెట్టుకుంటూ, చుట్టకాలుస్తూ, ఉమ్ములేస్తూవుంటే చాలన్నారు. ఎక్స్ప్రెషన్ అసలక్కర్లేదన్నారు. అందుకే మహానటుడి నయ్యాను.’
‘క్లింటు బాబూ – బుల్లెట్‍లాంటి డవిలాగ్గొట్టారు. మా జులపాల బాబుని హీరో సేసి తవరు సినేమా సేసి పెడితే ఇద్దరం తలకో మిలియన్ డాలర్లు ఇచ్చుకుంటాం. కసింత లోబడ్జెట్‍లో సాయంసెయ్యాలి క్లింటూ’
‘బంటూ! ఎంతలో బడ్జెట్ అయినా – ఇది హాలీవుడ్ కదా! తలకో మిలియన్ బదులు, చెవికో మిలియన్ చేసుకో’
‘అంటే – మా ఇద్దరికీ కలిపి నాలుగు చెవులు – నాలుగు మిలియన్లా – సరే క్లింటూ – మా జులపాల బాబుకోసం ఏవైనా చేస్తా. ఇంకా నయ్యం. వేలికో మిలియనడగలేదు. మంచోడివి క్లింటూ!’
‘పిచ్చిబంటూ! గన్ను పట్టుకున్న వాళ్ళంతా విలన్లు కాదు. గంతులేసే వాళ్ళంతా హీరోలు కాదు. ’
‘అవును క్లింటూ! డబుల్ కరెస్టు – మరింకో ఇసయం. కసింత కష్టపడి ఒళ్ళు దాచుకోకుండా పనిసేసే హీరోయిన్నెట్టుకుందాం. ఎంచాతంటే – మా తెలుగోల్లు కసింత రసికులు – అందుకని క్లింటూ -’
‘నీకా భయం లేదు బంటూ – మనది లో బడ్జెట్. సినిమా హీరోయిన్కి బట్టలు కొంటే డాలర్లు సరిపోవు. ’
‘సెబాసో సెబాసు.’
‘అయితే మన సినిమాకి ఒక చిన్న రిక్వైర్మెంటు బంటూ’
‘ఏంటది క్లింటూ’
‘నేను ఏ సినిమా అయినా, రచయిత ఎలా రాస్తే అలాగే తీస్తాను మన కథలో -’ ‘ఏటీ – అప్పుడే కథ రెడీనా? సెబాసో సెబాసు.’
‘మన కథలో అసలు కథంతా పొలాల మధ్య ఉన్న ఒక చిన్న పాత ఇంట్లో నడుస్తుంది. మన సినిమా కోసం అలాంటి ఇల్లు
చూశాను. ఆ ఇల్లు ఒక ముసలి వోనరుది. కథలో కాదు. నిజంగా.’
‘ఎవరా వృద్ధకపోతం?’ అడిగాడు జులపాల బాబు.
‘పేరు గుర్తులేదు. అందాకా కపోతం అనే పిల్చుకుందాం. మన వర్క్ ఓ నెలరోజులుంటుందక్కడ. ఒక మిలియన్కి ఒప్పుకున్నాడు. అంతా అడ్వాన్స్‌లోముందే ఇచ్చేశాను. ’
‘ఆల్రెడీ మనకి సెట్టింగు ఫిక్సయిపోయిందన్నమాట. ’
‘అవును బంటూ! ఈ సబ్జెక్టు మీద మనం కలవకముందునుంచే వర్క్ చేస్తున్నాను. ఇక మనం ప్రొడక్షన్కి ప్రొసీడయిపోడమే.’
‘ఏవదృష్టం క్లింటూ! – నిజానికి నాదికాదు – మా జులపాలబాబుది. నువ్వసలు ఈస్టువుడుకాదు. ఈస్టునీ యెస్టునీ ముడేసినరావుడివి – నేను నీ బంటుని. ’ జులపాల బాబు హీరోగా, బంటు ఈశ్వరుడు నిర్మాతగా, క్లింట్ ఈస్వుడ్ ట్‌ దర్శకత్వంలో ‘మల్పాసో’ వారు సమర్పించే మరో చిత్రం మొదలయింది. మొదటిరోజు షూటింగ్ పొలాల మధ్య ఉన్న కపోతంగారి ఫార్మ్‌హౌస్‍లో ఫిల్మ్ క్రూ అంతా లైటింగ్, కెమెరా అన్నీ రెడీ చేస్తున్నారు. ఫస్షాట్ట్‌కి ఆ ఇంటి ఓనరు ముసిలాయన్ని క్లాప్ కొట్టమన్నారు.
క్లింట్గారు రెడి అనగానే కపోతంగారికి అంటే ఆ ఇంటి ముసిలి వోనర్గారికి క్లాప్ బోర్డు అందించారు.
కపోతంగారు క్లాప్ కొట్టబోయి సడెన్గా ఆగిపోయాడు.
‘అదేవిటి? అలా ఆగిపోయారు?’ అని అడిగాడు జులపాల బాబు. అప్పుడు వృద్ధకపోతంగారు, ‘అన్నట్టు అడగడం మరిచిపోయా. ఇంతకీ మీ సినిమా కథేవిటి?’ అనడిగారు.
‘కథ నీకెందుకయ్యా? నువ్వేవన్నా డైరెట్రా? ఏట్రా? ముందు క్లాపుకొట్టు’ అన్నాడు బంటు.
‘కథేవిటో తెలియకుండా క్లాపు నేను కొట్టను – వేరే ఎవర్నీ కొట్టనివ్వను’ ఖచ్చితంగా చెప్పాడు కపోతంగారు.
‘ఇప్పుడు కథ మొదలెడితే తెల్లారిపోతుందిరా మావా!’ అన్నాడు క్లింట్. ‘ఏవైనా సరే! కథవింటేగానీ నా ఇంట్లో షూటింగ్ మొదలెట్టడానికి వీల్లేదు’ – కపోతం.
‘ఆదిలోనే హంసపాదు’ జులపాలబాబు.
ఇక వేరేదారిలేక, ‘సరే, కథ బ్రీఫ్గా చెప్తాను. షూటింగ్ ఒక గంట తర్వాత స్టార్ట్ చేద్దాం’ అన్నాడు క్లింట్.
ఫిల్మ్ క్రూ అంతా ఇంటిముందు చెట్లకిందికి చేరారు. ఇంట్లో వృద్ధకపోతంగారికి క్లింట్ ఈస్ట్‌వుడ్ కథ అవుట్లైన్ చెప్పాడు. బంటు, జులపాల బాబు కూడా అక్కడే ఉన్నారు.
క్లింట్ కథ అవుట్ లైన్ ముగించిన వెంటనే ఏదో అలజడి. క్లింటు, బంటు, జులపాల బాబు ఇంట్లోంచి హడావుడిగా ఎవరో తరుముతున్నట్టు బైటికి వచ్చేశారు. వాళ్ళ వెనకాలే వృద్ధకపోతం ఒగరుస్తూ ఒక షాట్గన్తో ఉరుముకుంటూ – ‘మీరు మరొక్క క్షణం ఇక్కడుంటే అందర్నీ కాల్చిపారేస్తాను. పొండి. షూటింగు పేరెత్తితే షూట్ చేసేస్తాను – ఒరే క్లింటూ! ఇదుగో నీ డర్టీ మిలియను -’ అని డబ్బు విసిరికొట్టాడు.
క్లింటు ఈస్వుడ్, బం ట్‌టు ఈశ్వరుడు, జులపాలబాబు, ఫిల్మ్‌క్రూ అంతా కార్లు, వాన్లు, రోడ్డు అన్నీ ఎక్కి తిరుగు ముఖం పట్టారు.
అదీ విక్రమార్కా! జరిగిన సంగతి. ఇప్పుడు చెప్పు. షూటింగ్ ఎందుకు కాన్సిల్ అయింది? కథ విన్న కపోతం రాబందులా ఎందుకు మారిపోయాడు? నే చెప్పిన ఈ కథకు నీ కంక్లూజనేమిటి? నా ఈ ప్రశ్నలకు నువ్వు తెలిసీ సమాధానం చెప్పకపోయావో, నీ తల అర్జంటుగా బట్టతలైపోయి నువ్వు విగ్గు పెట్టుకు తిరగాల్సొస్తుంది. -” అని బేతాళుడు ముగించాడు.
అంతా విన్న విక్రమార్కుడు, బేతాళుడితో అన్నాడు – ‘బేతాళా! ఈనెల నీ కథ కొల్లేటి చాంతాడులా, ఇలవేలుపు సినిమాలా, క్లింట్ ఈస్వుడ్ ట్‌లా బాగా పొడుగ్గా ఉంది. అంచేత నా సమాధానం కూడా కాస్త పొడుగే.
షూటింగ్కి పొలంలో ఉన్న తన ఏకాకిగూడు వాడుకోవచ్చని వృద్ధకపోతంగారు, బేరం కుదుర్చుకుని, డబ్బు తీసుకుని
ఒప్పుకున్నమాట నిజమే. కానీ వృద్ధాప్యం వల్ల కథేవిటి అని ముందుగా అడగడం మరిచిపోయాడు.
క్లాప్ కొట్టబోయే ముందు కథ గురించి చటుక్కున గుర్తొచ్చి కథ వినాలని పట్టుబట్టాడు. షూటింగ్కి ముందు కపోతంగారికి కథ చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది – అందర్నీ ఇంట్లోంచి బైటికి పంపించి, క్లింట్గారు బంట్ గార్ని తన మోకాలు మీద కూర్చో బెట్టుకుని, జులపాలబాబుని జింజర్ బీరు తాగుతూ మూలకూర్చోమని, వృద్ధకపోతంగారికి క్లుప్తంగా కథ వినిపించారు. ఆ కథేవిటంటే, – ప్రాణంలా చూసుకుంటూ, వ్యవసాయం చేసుకునే భర్తతో, ప్రేమ కురిపించే అమాయకమైన మంచిపిల్లతో ఏ ఒడు దుడుకులూ లేకుండా చక్కగా కాపురం చేసుకుంటున్న భార్య, ఈ చిత్రం హీరోయిన్ – తమ ఇంటి దరిదాపుల్లో ఉన్న పురాతనమైన వంతెనలను ఫోటోలు తీసుకోడానికొచ్చిన ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్తో అనుకోకుండా ప్రేమలో పడుతుంది. ఇంటి పొంతనే ఉన్న పాత వంతెన ఆ ఇద్దరి మధ్యా మింటికెగిసిన అనురాగబంధంతో ప్రేమ వంతెనగా మారింది. ఈ స్త్రీ పురుషుల ప్రేమకథే మా సినిమా! అని చెప్పగానే, కథ విన్న కపోతంగారి ముఖం కందగడ్డలా అయిపోయింది. అంతవరకూ ఏవండీ, సార్! అన్నవాడు క్లింట్ని ‘ఏరా’ అని తగులుకున్నాడు – ‘ఏరా! నా ఇల్లు నీకంత లోకువైపోయిందిరా! ఈ ఇంట్లో మా కుటుంబాలెన్నో ఏళ్ళుగా ఎంత పవిత్రంగా బ్రతికాయో నీకసలు అయిడియా ఉందిరా! నాది ఇల్లు కాదురా! దేవాలయం. ఈ పవిత్రమైన దేవాలయంలో రంగుల్లో రంకు సినిమా తీస్తావా! – నాకొంపను రొంపి చేస్తావా? ముందు – గెటవుట్! – నాకా తొంభై ఏళ్ళు దాటాయి. ముందూ వెనకా ఎవరూ లేరు. ఎప్పుడు రాలిపోతానో నాకే తెలియదు. నాకెంత కావాలిరా డబ్బు? నాకెందుకురా నీ బోడి మిలియను? అయినా – నువ్వు మాత్రం – కాటికి కాల్షీట్స్ చాచుకున్నావు. నీకెందుకురా ఇంకా ఈ పాడు సినిమాలు. ఫో! బైటికి ఫో! వెంఠనే కదలకపోతే మీ అందర్నీ కాల్చి చంపేస్తాను. నా పవిత్రమైన పర్ణశాలలో నీ బూతుకథలకు స్థానంలేదు. గో అవే – గెటౌట్ ఆఫ్ మై క్రిప్లింగ్ సైట్!’ – అని క్లింటుమీద, బంటు మీద కపోతం తిట్ల జలపాతం కురిపించాడు.
క్లింట్ ఈస్వుడ్, తెరమీదేకాదు, తెర వె ట్‌నుక కూడా మితభాషి. కపోతంతో కనీస ప్రయత్నంగా అన్నాడు – ‘నన్నర్థం చేసుకోండి. న బూతో న భవిష్యతి – బూతులేని సాహిత్యానికి బతుకులేదు. బూతుకాని సినిమా బతకలేదు. ’ ఇది విన్న వెంటనే కపోతం దున్నపోతం అయిపోయాడు. అందర్నీ బండబూతులు తిడుతూ తన ఇంటి గుమ్మం అవతలకు కుమ్మేశాడు.
బేతాళా! అంచేతే ఆ సినిమా షూటింగ్ అవాళ అలా ఆగిపోయింది. బైటికొచ్చాక క్లింటు ఈస్టువుడు, బంటు ఈశ్వరుడుతో అన్నాడు – ‘అయిదారు సినిమాలు తీసినప్పుడు వాటిలో ఏదో ఒక సినిమా ఇలా రివర్స్‌లో పేల్తుంది. అంచేత నిర్మాతగా ప్రతి సినిమా ముహూర్తం షాట్ ముందు, నిన్ను నువ్వు ఒక ప్రశ్న అడుక్కోవాలి – డు ఐ ఫీల్ లక్కీ! – వాడ్డూయూసే బంట్?’
ఈ హాలీవుడ్ హడావుడికి బంటు ఈశ్వరుడు, అతని కొడుకు జులపాల బాబు, జడుసుకుని, జలుబుచేసి, జ్వరవొచ్చి ఇండియా తిరిగొచ్చేశారు.
కానీ క్లింట్ ఈస్ట్ వుడ్ పట్టుదల మనిషి. సరిగ్గా పంధొమ్మిది వందల తొంభై రెండులో రాబర్ట్ వేలర్గారు రాసిన బెస్ట్సెల్లర్ నవలలో రాసినట్టుగా, వృద్ధకపోతం గారి ఇల్లులాంటి ఇల్లు, అలాంటి మరో లొకేషన్‍లో సెట్ వేయించి, షూటింగ్ చేసి సినిమా పూర్తి చేసి రిలీజ్ చేశాడు. ఆ చిత్రం పేరే ‘బ్రిడ్జెస్ ఆఫ్ మాడిసన్ కౌంటీ!’ ఇప్పటిదాకా హాలీవుడ్ హీరోయిన్స్ అందరినీ అధిగమించి రెండు ఆస్కార్స్, ఇరవై తొమ్మిది ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకున్న ‘మెరిల్‍స్ట్రీప్’ ఈ చిత్రానికి కూడా ఆస్కార్కి నామినేట్ అయింది. ఆమె అదృష్టం పాలు ఎక్కువ తాగిన ఒక హాలీవుడ్ సావిత్రి.
“కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫలహేతుర్భూఃమా తే సంగోఽస్త్వకర్మణి” అన్నారు గీతాచార్యులు శ్రీకృష్ణభగవానుడు.
‘నీ సినిమా నువ్వు తియ్యి. ఫలితం నాకొదిలెయ్యి. ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ సినిమా తియ్యకు. ’ అని బదులు చెప్పగానే విక్రమార్కుడికి మౌనభంగం కలిగి, బేతాళుడు – ‘నేను నిర్మాతను కాదు బాబోయ్, నాకు నీతులు తప్ప బూతులు తెలియవు బాబోయ్’ – అంటూ మళ్ళీ చెట్టెక్కేశాడు.

* * *

2 thoughts on “సినీ బేతాళ కథలు – 3, నబూతోనభవిష్యతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *