April 27, 2024

ఆచార్య సర్వత్ర పూజ్యతే

రచన: నండూరి సుందరీ నాగమణి

“వంటయింది… భోజనానికి రండి…” పిలిచింది విశాలాక్షి.
“వస్తున్నాను విశాలా… వడ్డించు… ఇదిగో… ఈ శార్దూలాన్ని సవరించి వచ్చేస్తాను…” అల్లిన పద్యాన్ని పుస్తకంలో వ్రాసుకుని, మరోసారి చదువుకుని, తృప్తిగా తలపంకించాడు విశ్వనాథం.
కంచంలో అన్నం, ఆవకాయ, బెండకాయ వేపుడు, ముద్ద పప్పు, వడియాలు, పక్కనే వేడి వేడి చారు గిన్నె అన్నీ చక్కగా బల్లపై అమర్చింది విశాల. మోకాళ్ళ నొప్పుల వలన కింద కూర్చుని తినలేరు ఇద్దరూ…
“అబ్బాయిలు ఫోన్లు చేయటమే మానేసారు చూసారా?” దిగులుగా అంది విశాల ఆయనకి నెయ్యి వడ్డిస్తూ…
“వాళ్ళ దృష్టిలో నేనెందుకూ పనికిరాని ఒక తెలుగు పంతుల్ని. ఏం చేస్తాము చెప్పు? నా వలన ఒనగూడింది ఏమీ లేదని వాళ్ళ భావన… ఇంగ్లీషు చదువులు చదువుకుని, అమెరికాకి ఎగిరిపోయారు… పోనీలే, నా మీద ఆధారపడకుండా స్వంత చదువులు చదువుకున్నారు. మంచిదే… కానీ మన మాతృభాష అంటే అసలు మమకారం లేదు చూసావూ, అదే నన్ను బాధ పెడుతూ ఉంటుంది విశాలా…”
“పోనీలెండి, అల్లుడు మీ బాటలోనే నడిచాడు, మేనల్లుడైనందుకు… కాకపోతే తెలుగు దేశంలో ఉండకుండా ఎక్కడో రాజధానీ నగరంలో ఉన్నాడనే నా చింత…”
“సమీర్ అమ్మాయిని ఎంతో బాగా చూసుకుంటున్నాడు. అంతకన్నా కావలసిందేముంది? ఇంకా వీళ్ళు దేశంలోనే ఉన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనల్ని చూడటానికి వస్తారు… అన్నిటికన్నా మించి, అమ్మాయి, అల్లుడూ నా వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. తెలుగంటే ఎంత ప్రాణమో ఇద్దరికీ… అల్లుడు కాలేజీలో తెలుగు బోధిస్తూ, నాలాగే కావ్యరచన చేస్తూ తెలుగును బతికిస్తున్నాడు.” తృప్తిగా అన్నాడు విశ్వనాథం.
“అబ్బాయిలకు ప్రత్యేకంగా మీమీద కోపమేమీ లేదండీ… మిగిలిన మాస్టర్లలాగా మీరు ట్యూషన్స్ చెప్పి డబ్బు సంపాదించలేదని, వీళ్ళ సరదాలేవీ తీర్చలేదనీను…”
“వీళ్ళ భ్రమ కాకుంటే, తెలుగు మాస్టర్ దగ్గర ట్యూషన్ కి ఎవరు వస్తారు విశాలా? పోనీ, నేను చదివించకున్నా, ఇద్దరూ చక్కగా చదువుకుని ఇంజనీర్లు అయ్యారు. ఉద్యోగాలు సంపాదించుకుని, నా మాట వినకుండా అమెరికాకి వెళ్ళిపోయారు. డబ్బు సంపాదించలేదనీ, ఈ ఇల్లు తప్ప మిగిలిన ఆస్తులు పోగు వేయలేదనీ నా మీద కోపం… ఇదిగో నేను వ్రాస్తున్న అంతర్జాతీయ పద్యకావ్యాల పోటీలో నా ప్రబంధానికి బహుమతి వస్తే వాళ్ళకి తృప్తి కలుగుతుందిలే… మాతృభాషపైనున్న మమకారమూ పెరుగుతుంది…”
“అలాగేనండీ… అదే కోరుకుంటున్నాను, అమ్మవారిని…” రెండు చేతులూ జోడించి, ఆ ఆదిపరాశక్తికి మనసులోనే మొక్కింది విశాలాక్షి.
***
అమెరికాలోని న్యూజెర్సీ పట్టణం. తెలుగుసంఘం వారి సభ జరుగుతున్నది. సభలో విశ్వనాథం ఇద్దరు కుమారులైన నీలేష్, గణేష్ లు, వారి భార్యలు, పిల్లలు, విశాలాక్షి కూర్చుని ఉన్నారు. వారి చెంతనే విశ్వనాథం పుత్రిక పూర్ణిమ, అల్లుడు సమీర్ కూడా ఉన్నారు. అందరి ముఖాలలో ఎంతో సంతోషం. అక్కడ విశ్వనాథం రచించిన ‘మధూదయం’ అనే ప్రబంధ కావ్య రచనకు గాను ప్రథమ బహుమతి వచ్చిన సందర్భంలో జరుగుతున్న కావ్యావిష్కరణ సభ మరియు బహుమతి ప్రదానోత్సవం జరుగుతున్నది. ద్వితీయ బహుమతి సమీర్ రచించిన ‘వేణుగానం’ అనే గ్రంథానికి వచ్చింది. అందువలన అతను కూడా భార్యతో అమెరికాకి వచ్చాడు. అందరూ ఒక దగ్గర కలసినందుకు ఒక పండుగ వాతావరణమే ఏర్పడింది అక్కడ.
విశ్వనాథానికి చాలా ఘనంగా సన్మానం జరిగింది. సన్మాన పత్రం చదువుతున్న యువకుడు దాన్ని చదివి, విశ్వనాథం చేతులకు అందిస్తూనే, ఆయన పాదాల దగ్గర కూర్చుండిపోయాడు. విపరీతమైన ఉద్వేగంతో ఆయన పాదాలకు తన కన్నీటితో అభిషేకం చేయసాగాడు.
విశ్వనాథంతో సహా అందరూ ఒక్కసారిగా గాబరా పడసాగారు. ‘ఏమైంది, ఏమైంది?’ అని అడిగారు… దానికతను తనను తాను సంబాళించుకుని, మైక్ అందుకుని, చెప్పసాగాడు, అలా కూర్చునే.
“నా పేరు చంద్రశేఖర్. బాబుగారికి చంద్రిగాడు అంటే బాగా గుర్తు వస్తానేమో… చాలా చిన్నప్పుడు బాబుగారింటి దగ్గరే చిన్న పాకలో ఉండే వాళ్ళం మేము. నన్ను కూలిపనికి పంపించాలని అమ్మా, నాన్నా చూసేవారు. నాకేమో చదువుకోవాలంటే ఎంతో ఇష్టంగా ఉండేది. ఒకరోజు పనిలోకి పొమ్మని మా నాన్న నన్ను కొడుతూ ఉంటే, ఏం చేయాలో తెలియని నేను, ఇదిగో ఈ మాస్టరు గారి కాళ్ళకు చుట్టేసుకున్నాను. ఈయన మా నాన్నను మందలించి, తన బడిలోనే చేర్చారు. తన చేతులతో నాకు అక్షరాభ్యాసం చేసారు. నాకు స్కాలర్షిప్ వచ్చే ఏర్పాటు చేసారు. ఆ తరువాత వేరే ఊరికి బదిలీ అయి వెళ్ళిపోయారు. కానీ ఆనాడు మా గురువుగారు చూపించిన అక్షరాల రుచిని నేను మరువలేదు. చదువును విడిచి పెట్టలేకపోయాను. పార్ట్ టైమ్ పనులు చేస్తూ చదువుకున్నాను. కష్టపడి పైకి వచ్చాను. ఖండాంతరాలు దాటి అమెరికాకి వచ్చాను. మాస్టారి పేరున స్కాలర్షిప్ ఏర్పాటు చేసి, భారత్ లో పదిమంది విద్యార్థులను చదివిస్తున్నాను.
ఈనాటి నా వైభవం అంతా మాస్టారు పెట్టిన భిక్షే… వారి ఋణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను నేను…” గద్గద స్వరంతో పలికాడు, ఒక పెద్ద కంపెనీకి సీయీవో అయిన చంద్రశేఖర్.
నీలేష్, గణేష్ ల తలలు సిగ్గుతో వాలిపోయాయి. సమీర్ పైకి లేచి, చప్పట్లు కొట్టసాగాడు. అందరూ లయబద్ధంగా ఆ ధ్వనితో చేతులు కలిపారు. చంద్రశేఖర్ ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు విశ్వనాథం.
“నేను చేసిందేముంది నాయనా, నా చేతులతో కాసిని నీరు విదిలించాను… నువ్వు బలమైన మొక్కవు కనుక నాటుకుని, విస్తరించావు… నీదే కదా స్వయంకృషి అంతా…” అని భుజం తట్టారు.
తండ్రియొక్క ఔన్నత్యాన్ని, నిగర్వాన్ని గ్రహించిన విశ్వనాథం కొడుకులిద్దరి కళ్ళూ అపరాధభావనతో కూడిన అశ్రువులతో నిండిపోయాయి.
“ఈ సందర్భంగా గురువుగారికి నాదొక విన్నపం. ఈ ఆదివారం నాడు నా చిన్న కూతురికి అక్షరాభ్యాసం చేస్తున్నాను. తొలి అక్షరాలు మీరే దిద్దించాలి గురువుగారూ…” చంద్రశేఖర్ కోరికకు విశ్వనాథం తలపంకించాడు.
సభలో కరతాళధ్వనులు మిన్ను ముట్టాయి.

***

1 thought on “ఆచార్య సర్వత్ర పూజ్యతే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *