April 27, 2024

స్వప్నాలూ, సంకల్పాలూ – సాకారాలు -7

రచన: డా. లక్ష్మీ సలీం
అనువాదం: స్వాతీ శ్రీపాద

16.
ఏమీ తెలియని దేశంలో ప్రవేశం
1978 నవంబర్ లో ఏమీ తెలియని మట్టి మీద, హీత్రో విమానాశ్రయంలో, చేతుల్లో నా కూతురితో కాలు మోపాం. జాతి వివక్ష గురించి ఎన్నో చదివాం, ఎన్నో విన్నాం. ఆసియా డాక్టర్ల స్థితి గతుల గురించీ, భెల్ఫాస్ట్ లో బాంబ్ విసరడాల గురించీ, ఇలా ఎన్నో, ఎన్నెన్నో.. నాలో ఎన్నో ప్రశ్నలు, తొందరపడి ఇక్కడికి వచ్చామా అనికూడా అనుకున్నాను. నేను ఓ మంచి అమ్మను కాగలనా? నేను చక్కటి భార్యగా ఉండగలనా? ఒక నిపుణురాలైన ప్లాస్టిక్ సర్జన్ గా నా కలలు సాకారం చేసుకోగలనా?
తలపైకెత్తి ఆకాశం వంక చూసి భగవంతుడిని వేడుకున్నాను. ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ మాకు రెండు నెలల అనుమతి మాత్రం ఇచ్చాడు అక్కడ ఉండటానికి. పీ జీ ఐ లో మాతో ఉన్న డా. మన్ మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు.
అతను ఆశ్చర్యంగా ” అబ్బో మీ అమ్మాయి ఎంత పెరిగిపోయింది? నేను తనను చూసినప్పుడు నెలల పిల్ల కదా? ఇప్పుడు దానికి ఎన్నేళ్ళు? విమానప్రయాణం దానికి బాగా నచ్చిందా?” అన్నాడు.
“దానికి రెండేళ్ళు. ఫ్రాంక్ ఫర్ట్ వచ్చేవరకూ బాగానే ఉంది. ఇప్పుడు బాగా అలసిపోయిందనుకుంటాను.” అన్నాను.
లగేజ్ అతని కారులో లోడ్ చేసాడు.
అతనింటికి పది నిమిషాల ప్రయాణంలో మళ్ళీ జీవితంలో పడ్డాం.
“లక్ష్మీ ఎమ్ సీ హెచ్ పూర్తి చేశావా?”తన ప్రశ్న.
“చేశాను. జూన్ లో డిగ్రీ అందుకుని మొన్నటి వరకు సీనియర్ రెజిస్ట్రార్ గా పనిచేసాను”
“అద్భుతం. ఇంత హడావిడిగా ఇక్కడికి ఎందుకు వచ్చారా అని అనుకుంటున్నాను. నాకు నీ రాక గురించి నిన్ననే తెలిసింది మరి.”
సలీం మధ్యలో వచ్చి, “అదో పెద్ద కథ, మీకు దాని గురించి తొందరలో చెప్తాను.” అన్నాడు. మేం టీ తో సరిపెట్టు కున్నాం. ఈ లోగా సలీం మేం లండన్ రాడానికి, అదీ మరీ తక్కువ సమయంలో గల కారణాలు అతనికి వివరించాడు.
“నేను, లక్ష్మి కూడా ఈ డిసెంబర్ లో రెజిస్ట్రార్ లు గా జనరల్ సర్జికల్ ట్రైనింగ్ ప్లాస్టిక్ సర్జరీలో పూర్తి చెయ్యాలి. ఎక్కడో ఒక చోట శాశ్వతంగా మేం సెటిల్ అయ్యేలోపల మా అమ్మాయి పెరిగి పెద్దయ్యేలోగా ప్రపంచాన్ని ఒకసారి చుట్టి రాడం, అదీ పని చేస్తూ, మా జీవితాలు నిర్మించుకుంటూ ఉంటే బాగుంటుందని ఇద్దరం అనుకున్నాము. జీవితం పట్ల మా ధృక్పథం మరింత విశాలమవుతుందనీ మరింత పరిక్వత తెచ్చుకోగలమనీ అనుకున్నాము. క్రితం నెల జీఎమ్ సీ నుండి నా మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. కాని లక్ష్మి అప్లికేషన్ తిరస్కరించారు. ఆమెను ఆర్నెల్లు మెడిసిన్ లో ఇంటర్న్ షిప్ చెయ్యమన్నారు. ఇద్దరం ఒకే చోట ఒకే ట్రెయినింగ్ పూర్త్తి చేసాం, ఒకే సమయం కూడా, కాని వాళ్ళు ఆమె ప్లాస్టిక్ సర్జరీ ట్రయినింగ్ అపార్థం చేసుకున్నట్టున్నారు. డిసెంబర్ ఒకటి నుండీ జీఎమ్ సీ విదేశీ డాక్టర్ల రిజిస్ట్రేషన్ ఆపేస్తోందని విన్నాము. అందుకే మా మిత్రుడు డా. మధు ఈ మధ్యనే మాకు ఫోన్ చేసి జీఎమ్ సీ కి రమ్మనీ అక్కడ వ్యక్తిగతంగా పూర్తి రెజిస్ట్రేషన్ కోసం ఒక వివరణ ఇవ్వమనీ చెప్పాడు. అందుకే ఇంత హడావిడిగా ఇక్కడికి వచ్చాం. పీ జీ ఐ ఎమ్ ఈ ఆర్ ప్రొఫెసర్లు, అడ్మినిస్టేటివ్ ఉద్యోగులూ చాలా సహృదయులు, అందుకే ఇక్కడికి సకాలంలో రాడానికి సాయపడ్డారు.”
“లక్ష్మి రెజిస్ట్రేషన్ పూర్తయాక మీ ఇద్దరు ఏం చెయ్యాలని మీ ప్లాన్?” డా. మన్ అడిగాడు.
“మేం బెల్ ఫాస్ట్ వెళ్తాం. డా. మధు నా కోసం డౌన్ పాట్రిక్, డౌన్ షైర్ హాస్ఫటల్ లో ఒక క్లినికల్ అటాచ్మెంట్ ఏర్పాటు చేసాడు. ఫిబ్రవరిలో మంచి ఉద్యోగం సంపాదించడానికి మాకు డా. కాక్ కూడా రెఫరెన్స్ లెటర్స్ ఇచ్చాడు.” సలీం జవాబు.
“గ్రేట్. అంతా మంచే జరగాలని అనుకుందాం. ఇప్పటికి ఆరేళ్ళుగా సర్జరీలో పనిచేస్తున్నావు కదా, ఇప్పటికే నువ్వో గొప్ప సర్జన్ వి అయ్యుంటావు.” అన్నాడు సలీం తో.
“నిజమే, నేనావిధంగా అదృష్టవంతుడినే. చాల మటుకు అబ్డామిన్ సర్జరీలు ఒక్కడినే చెయ్యగలను.” సలీం స్వరం లో గర్వం.
డా. మన్ మెచ్చుకుంటున్నట్టు తలాడించాడు. “బాగుంది, ఇక్కడ మీకు ఎవరూ ఏమీ బోధించరు. మీరే విషయాలు స్వయంగా ఎంచుకుని మీరే నేర్చుకోవాలని చూస్తారు. సరే ఆ విషయం మాట్లాడదాం, రాయల్ కాలేజి ఆఫ్ సర్జన్స్ లో ఫెలోషిప్ మీద ఆసక్తి ఉందా?”
“మరీ పెద్ద వ్యామోహం లేదు కాని ఎలాగూ వచ్చాం గనక ఓ సారి పరీక్ష రాస్తే పోతుందిగా?” సలీం అన్నాడు.
“పరీక్షలు మరీ అంత సాదా సీదా కాదు, పీజీఐఎమ్ ఈ ఆర్ లో ట్రైనింగ్ అయ్యాక ఇక్కడి శిక్షణ నీకు నిరాశ కలిగిస్తుందేమో. లక్ష్మీ నీ ఆసక్తి ఏమిటి?”
అతను నన్నడిగాడు. నా బదులు సలీం జవాబిస్తూ, ” లక్ష్మికి మైక్రో వాస్క్యులార్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ లో ఆసక్తి. ఎమ్ సీ హెచ్ కి పని చేస్తూ అవి తను మిస్ అయింది” అన్నాడు.
“సరే, నేను డ్యూటీకి వెళ్ళాలి. జీ ఎమ్ సీ కి ఎలావెళ్ళాలో ట్యూబ్ లో చూపిస్తాను మీకు ” అన్నాడు.
డా. మన్ మాకొక రౌట్ మాప్ ఇచ్చాడు, అది ఎంతో అయోమయంగా ఉంది. ఒక దాని బదులు మరో ట్రైన్ ఎక్కకుండా ఒక ఇంగ్లీష్ పెద్దమనిషిని డైరెక్షన్స్ అడగాల్సి వచ్చింది. ఆ సాయపడటంలో అతను తన ట్రెయిన్ మిస్ అయినా ఉదారంగానే వ్యవహరించాడు.
చివరికి ఎలాగైతేనేం మేం అమ్ముతో పాటు ట్రైన్ లో ఆక్స్ఫర్డ్ వీధి చేరుకున్నాం. కాస్త దూరం తప్పిపోయినా
ఎలాగో జీ ఎమ్ సీ భవనం చేరుకున్నాం. అక్కడ వాళ్ళు మా డాక్యుమెంట్స్ చెక్ చేసి, దాదాపు వెంటనే నాకు పూర్తి రెజిస్ట్రేషన్ అనుమతించారు. ఇంత సరళంగా జరిగిపోయేదానికి ఎందుకు హడావిడిగా రావాలో నాకు అర్ధం కాలేదు.
వెనక్కు వెళ్ళేప్పుడు ఎలాటి ఇబ్బంది లేకుండా డా. మన్ ఇల్లు చేరాం. డిన్నర్ సమయంలో ఉద్యోగం చూసు కునేప్పుడు నేను ఎలాటి కష్టాలు ఎదుర్కోవాలో డా. మన్ వివరించాడు.
నేనిహ వెనక్కు చూసుకోదలుచుకోలేదు. “డా. మన్ నా సర్జికల్ ట్రైనింగ్ 1973 లో మొదలెట్టినప్పటి నుండీ బిజీ గానే ఉన్నాను. బ్రేక్ తీసుకుందుకు ఎప్పుడూ సాహసించలేకపోయాను. ఇప్పుడు చివరికి బ్రేక్ తీసుకుని నా కూతురితో సమయం గడపగలుగుతున్నాను. ప్లాస్టిక్ సర్జికల్ ట్రైనింగ్ కోసం ఇక్కడకు వచ్చి ఆ స్పెషాలిటీలో చేరకుండానే వెనక్కు వచ్చిన నా మిత్రులు దీనిలో ఉద్యోగం తెచ్చుకోడంలో కష్టాల గురించి నన్ను హెచ్చరించారు. అందుకే నేను మానసికంగా ఆ కష్టాలు ఎదుర్కొందుకు, నిరాశపడినా సరే సిద్ధమయాను. అలాగని అపజయాన్ని అంగీకరించడానికో, వదిలెయ్య డానికో సిద్ధంగా లేను. నేను చేసేది సవ్యంగానే చేస్తానని నమ్ముతాను. ఫలితం అదే వస్తుంది. ఇప్పుడూ ఈ సవాలు ఎలాగైనా ఎదుర్కొని ప్రతి వాళ్ళూ తప్పని నిరూపిస్తాను.”అన్నాను ఆత్మ విశ్వాసంతో.
“లక్ష్మీ, నువ్వేమిటో నాకు తెలుసు. కాని నేను మీ ఇద్దరి గురించీ ఆదుర్దా పడుతున్నాను. అందుకే ఈ హెచ్చరిక. మళ్ళీ వెళ్ళాక ఉద్యోగాల మాటేమిటీ?”
“మా ఇద్దరకీ ఆంధ్రాలో సర్జన్ లుగా ఉద్యోగాలు వస్తాయి. నేను అయిదేళ్ళలో ఏదో ఒక మెడికల్ కాలేజీలో ప్లాస్టిక్ సర్జరీలో ప్రొఫెసర్ని కూడా కావచ్చు. కాని, నాకింకా పరిపక్వత పూర్తిగా రాలేదనీ, నేను మరింత గొప్ప ప్లాస్టిక్ సర్జన్ అయేందుకు నా ప్రపంచం మరింత విశాలం చేసుకోవాలని అనుకుంటున్నాను. ” నా భావాలను వివరించాను.
సలీం చివరికి డా. మన్ కి వివరించాడు, “మేం హిందూ, ముస్లిమ్ జంట. ఆర్ధికసాయానికి మా మా కుటుంబాల మీద ఆధారపడదలుచుకోలేదు. మేం వెనక్కు వెళ్ళలేము, ఇక్కడే ఉండి సాధించాలి”
డా. మన్ గట్టిగా నొక్కి చెప్పాడు, “డబ్బు కోసం వర్రీ అవకండి. మీకు టికెట్స్ కొని ఎయిర్ పోర్ట్ లో దింపుతాను. ఇక్కడ మీరు ముగ్గురూ కష్టపడకూడదనే నా బాధ. వెనక్కు వెళ్తే మీకు మరింత మంచి అవకాశాలు అక్కడ దొరుకుతాయి.”
“చాలా బాగా చెప్పారు. కాని ఇంత దూరం వచ్చాక మా మా అవకాశాలు ఒకసారి ప్రయత్నిస్తాము. ఇక్కడ విషయాలు తేల్చుకుని డెఫినెట్ గా ఓ ఏడాది తరువాత వెళ్ళవచ్చును. నన్ను నమ్ము, మరీ కష్టంగా ఉంటే మీ సాయం అడగటానికి వెనుకాడం. మా పట్ల మీ ఆదుర్దాకు థాంక్స్” అన్నాను.
మిసెస్ మన్ సంభాషణలో పాల్గొంటూ, “బెల్ఫాస్ట్ లో ఎన్నో బాంబ్ బ్లాస్ట్ లు చూస్తున్నాం. ఆ కారణం గానే మేమక్కడికి వెకేషన్ కి కూడా వెళ్ళలేదు.” అంది.
సలీం మేం ఆ విషయాలన్నీ ముందే తెలుసుకున్నామనీ, పరిస్థితులు కనిపించినంత దారుణంగా లేవనీ చెప్పాడు.
పడుకునే ముందు మేం చాలా విషయాలు మాట్లాడుకున్నాం.
మర్నాడు ఎయిర్ పోర్ట్ లో మేమ్ బెల్ఫాస్ట్ వెళ్తుంటే డా. మన్ మాకు వీడ్కోలు చెప్పాడు. సెక్యూరిటీ చెక్ కాస్త వింతగా ఉంది. వాళ్ళు మా ఇంటినించి తెచ్చుకున్న మా ఇండియన్ ఆహార పదార్ధాలన్నీ, పచ్చళ్ళనూ జల్లెడ పట్టారు.
చివరికి మేం బెల్ఫాస్ట్ లో మా అగోచర భవిష్యత్తువైపు ప్రయాణమయ్యాం. ఈ మధ్య కాలంలో బెల్ఫాస్ట్ కున్న పేరల్లా వినాశనానికీ. మా విమానం గాల్లోకి ఎగురుతుంటే నిశ్శబ్దంగా ప్రార్దించాను.
“గమ్యం సాధించడంలోనే విజయోత్సాహం, దాన్ని చేరుకోడంలో కాదు.” – మహాత్మాగాంధీ.
17.
బెల్ఫాస్ట్ – బాంబులు- బుల్లెట్లు
మేం బెల్ఫాస్ట్ చేరగానే ఎప్పటిలానే సెక్యూరిటీ చెక్ దుర్భరంగానే ఉంది. ఎలాగో బయటపడ్డాక మా మిత్రుడు, డా.మధు, అతని భార్య కుముద మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. ఆరేళ్ళ సుదీర్ఘ కాలం తరువాత వాళ్ళని చూడగానే సంతోషం వేసింది. నా రెజిస్త్రేషన్ పూర్తైందని, అతని సాయానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తే సంతోషపడ్డాడు. అతని వృత్తి ఎలా సాగుతోందో తెలుసుకోవాలని నాకు ఆత్రంగా ఉంది.
“ఇక్కడికి వచ్చాక కొన్నాళ్ళు సర్జరీలో పనిచేసాను. ఇప్పుడు సైకియాట్రీకి మారాను.”
అతను నా అయోమయాన్ని చూసి మారడం గురించి తరువాత వివరిస్తానని అన్నాడు. అతనికా విషయం మాట్లాడటం ఇష్టం లేదని గ్రహించి నేనూ దాన్ని పొడిగించలేదు. మేమ్ వెళ్తూ వెళ్తూ దారంతా పచ్చదనం గమనించినా ఒక్క ప్రాణీ కనపడలేదు. డా. మధు బెల్ఫాస్ట్ లో ఇబ్బందుల గురించి చెప్పాడు.
” జరుగుతున్న ఈ జగడం- యునైటెడ్ ఐర్లాండ్ కాథలిక్స్ ఉత్తర ఐర్లాండ్, దక్షిణ ఐర్లాండ్ తో కలిసి ఉండాలని కోరుతున్నారు. కాని బ్రిటిష్ ప్రభుత్వం దాని మీద అధికారం నిలుపుకుందుకు పోరాడుతోంది. బ్రిటిష్ రిపబ్లికన్ సైన్యానికీ బ్రిటిష్ సైన్యానికీ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఆధిపత్యం ఉన్న కాథలిక్స్ కీ ప్రొటెస్టేంట్ల కూ మధ్య అనధికారిక హద్దు కొనసాగుతోంది.
సలీమ్ అడిగాడు, “ఏ మనిషి ఏ కమ్యూనిటీకి చెందినవాడో ఎలా తెలుస్తుంది?”
“వాళ్ళ పేర్లను, ఇంటి పేర్లను, ఎక్కడ చదువుతున్నారు, ఎక్కడుంటారు అనే వాటిని బట్టి తెలుసుకోడం చాలా సులభం.” మధు వివరించాడు.
ఒకే మతం వాళ్ళు ఒకరితో ఒకరు పోట్లాడుకోడంనా ఊహకు అందలేదు.
“ఎవరైనా మనను ఆపి చెక్ చేస్తే మనం సహకరించాలి. లేదంటే మనను షూట్ చేసేందుకు వాళ్ళకు పూర్తి హక్కు ఉంది. హాస్పిటల్ లోగాని షాపింగ్ ప్రాంతంలో గాని బాంబ్ బెదిరింపు ఉందంటే వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవాలి. ” మధు చెప్పాడు.
నేను షాక్ అవడం చూసి మధు అన్నాడు, “అది వింటున్నంత చెడుగా ఏముండదు. మీరు అలవాటు పడిపోతారు”
మధు డౌన్ పాట్రిక్ హాస్పిటల్ టాప్ ఫ్లోర్ లో విశాలమైన అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు. అతను చాలా ఉదారంగా సలీంకు ఒక నెల కోసం, అదే హాస్పిటల్ లో సర్జరీ విభాగంలో క్లినికల్ అటాచ్మెంట్ ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో సలీంకు ఎలాటి పారితోషికం ఉండదు కాని కన్సల్టెంట్ అతని కమ్యూనికేషన్ నైపుణ్యం, అనుభవం, పేషంట్ తో అతని ప్రవర్తన, అర్హతలను గమనిస్తాడు. యూకేలో ముందు ముందు చేసే ఉద్యోగ ప్రయత్నాలకు అది ముఖ్యమైన సిఫారసు.
మేం మా స్వంత అపార్ట్మెంట్ భరించలేం గనక మధు మమ్మల్ని ఒక నెలపాటు తమతోనే ఉండమన్నాడు. అతని భార్య అపార్ట్మెంట్ లో రోజువారీ పనులు ఎలా చెయ్యాలో చూపించింది. నేను ఆ సాయం చెయ్యడానికి సిద్దంగా ఉన్నాను.
సలీంకు తన క్లినికల్ అటాచ్మెంట్ చివర్లో అదే హాస్పిటల్లో ఫిబ్రవరి వరకు టెంపరరీ ఉద్యోగం ఇచ్చి, టౌన్ లో రెసిడేన్షియల్ ప్రాంతంలో ఒక పెద్ద మూడు బెడ్ రూం ల బంగళా బాగా పరిచయమైన ఆసుపత్రికి దూరంగా ఇచ్చారు. మాకు చాలా ఒంటరిగా, చాలా చలిగా అనిపించేది. రాత్రిళ్ళు ఇంటిని కనీసం వేడిగా ఉంచడం ఎలాగో తెలిసేది కాదు. అక్కడ ఉండటానికి భయంగా ఉండేది.
ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని ఉత్తర ఐర్లాండ్ లో అన్ని సర్జికల్ ప్రోగ్రామ్ లకూ ఇన్చార్జ్ అయిన మిస్టర్ టీ. జీ పార్క్స్ ను కలుసుకున్నాం. పీజీ ఐ ఎమ్ ఈ ఆర్ డా. వీ.’కాక్ ఇచ్చిన మా రిఫరెన్స్ లెటర్స్ చూసాక ఫిబ్రవరిలో మొదలయే సీనియర్ హౌస్ సర్జరీ ఉద్యోగాలకు అప్ప్లై చెయ్యమని సలహా ఇచ్చాడు.
నేనతనికి చాలా దృఢంగా ప్లాస్టిక్ సర్జరీలో ఉద్యోగం తప్ప మరో దానిపైన ఆసక్తి లేదని చెప్పాను. ఆ సమయంలో అవసరమైన క్లినికల్ అటాచ్మెంట్ చెయ్యమని నాకు సలహా ఇచ్చాడు. బెల్ఫాస్ట లో సిటీ ఆసుపత్రిలో ఒక వాస్క్యులర్ సర్జన్ తో పనిచేసేందుకు ఏర్పాటు చేసాడు. అమ్ముకోసం ఒక బేబీసిట్టర్ దొరికాక నేను సిటీ ఆసుపత్రిలో పనిచెయ్యడం మొదలుపెట్టాను.
ప్రతి ఉదయం ఎనిమిదింటికి ఆపరేషన్ థియేటర్ పని మొదలయ్యేది. పొద్దున ఆరింటికి ఇంట్లోంచి బయలు దేరి బస్ స్టాప్ కి దాదాపు రెండు మైళ్ళు నడిచేదాన్ని. తరువాత ఆసుపత్రి చేరేందుకు మరో పదిహేను నిమిషాల నడక. ఇంటికి తిరిగి వస్తూ తరచూ దారి తప్పేదాన్ని. కావలసిన బట్టలు, షూస్ లేకుండా డిసెంబర్ నెల ఎముకలు కొరికే చలిలో నడవడం అంత సులభం కాదు. కాని నాకు తెలుసు, నేను ఏదీ వదులుకోలేను.
నా ప్లాస్టిక్ సర్జికల్ ట్రైనింగ్ తో నేను నా కన్సల్టింగ్ డాక్టర్ని మెప్పించగలిగాను. వాస్క్యులర్ సర్జరీ విధానాల్లోనూ సాయపడ్డాను. త్వరలోనే వాతావరణానికి, ఆసుపత్రి రొటీన్ కి, ఇంటి పనికి, చివరికి సాంస్కృతిక తారతమ్యాలకూ అలవాటుపడిపోయాను. నిజానికి ఎవరూ చెప్పక పోయినా నాకే అందరిలో ఒడ్డున పడ్డ చేపనని అనిపించేది. ఎప్పుడూ నేను మిగతా వారికన్న భిన్నంగా కనిపించేదాన్ని.
త్వరలోనే రొటేషనల్ సర్జికల్ ఉద్యోగాలకు మాకు ఇంటర్యూలు జరిగాయి. యాక్సిడెంట్, అల్స్టర్ ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగంలో సలీంకి ఉద్యోగం ఇచ్చారు. అక్కడే మొత్తం ఉత్తర ఐర్లండ్ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ తో పాటు పిల్లల కు శిశురక్షణ కేంద్రం కూడా ఉన్నాయి సలీం వెంటనే ఆ ఉద్యోగాన్ని అంగీకరించాడు.
నేను నా వివరాలతో అల్స్టర్ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ చీఫ్ ను కలుసుకోడానికి వెళ్ళాను. అతను నాతో చాలా బాగా మాట్లాడి మిగతావారికి నన్ను పరిచయం చేసారు. సీనియర్ హౌస్ సర్జెన్సీలో ఒక రెండు వారాల తాత్కాలిక పోస్ట్ ఖాళీగా ఉందనీ డిపార్ట్మెంట్ లో అది జూనియర్ మోస్ట్ అనీ చెప్పారు. ఏ మాత్రం వెనుకాడకుండా నేనాపనిని ఒప్పుకున్నాను.
మేం అల్స్టర్ ఆసుపత్రికి మారి, ఆ కాంపస్ లోనే చిన్న ఒకబెడ్ రూమ్ అపార్ట్మెంట్ కి వెళ్ళాం. అమ్మును క్రెచ్ లో వదిలి నేను ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి వెళ్ళడం మొదలుపెట్టాను. డిపార్ట్మెంట్లో ఇతర ఇండియన్ సహ డాక్టర్ల సహాయంతో వార్డ్ లో, ఆపరేషన్ థియేటర్లో పని అర్ధం చేసుకున్నాను. మిగతా కన్సల్టెంట్ లు ఉన్నా, చాలా సార్లు నేను ఇద్దరు సీనియర్ రెజిస్ట్రార్ లు మిస్టర్ బ్రెన్నన్, మిస్టర్ లెనార్డ్ తో సంభాషించేదాన్ని.
వార్డ్ రౌండ్ లలో ప్రతి పేషంట్ కు సంబంధించిన ట్రీట్ మెంట్ అవకాశాలు, కూలంకషంగా చాలా సులభంగా చిత్రాలతో, వివరాలతో చర్చించేదాన్ని. మేం పీజీ ఐ ఎమ్ ఈ ఆర్ లో నేర్చుకున్నదే అది. నా కృషికి మారుగా నాకు టెర్రిఫిక్ లక్ష్మి అని మారుపేరు పెట్టారు.
రెండు వారాల నా పని వేగంగా ముగిసిపోయినా ఆపరేషన్ థియేటర్లో సాయపడటానికి వెళ్ళేదాన్ని. మంచి ఫలితాల కోసం ఆధునిక పరికరాలు నునిశితమైన నైపుణ్యంతో ఎలా వాడాలో నేర్చుకుందుకు అది నాకు సాయపడింది. నేను ఎలాటి పారితోషికం ఆశించకపోడం వల్ల నేనక్కడ ఉండటం వల్ల కన్సల్టెంట్ లకు సానుకూలంగానే అనిపించేది. మే ఒకటి నుండి నాకు మూడు నెలల ఒక తాత్కాలిక రెజిస్ట్రార్ పోస్ట్ ఇవ్వడం అత్యంత ఆనందాన్ని కలిగించింది. కష్టపడితే ఫలితం ఉంటుంది. నేను మరో రెండు ఆసుపత్రులు, రాయల్ విక్టోరియా, బెల్ఫాస్ట్ లోని పిల్లల ఆసుపత్రి కూడా చూసుకోవలసి వచ్చేది. ఎమర్జెన్సీ సర్జరీ కోసం నేను వెళ్ళవలసి వచ్చినప్పుడల్లా ఆపరేషన్ థియేటర్ స్టాఫ్, ఎనస్థిటిస్ట్ నేను సక్రమంగా అవసరమైన విధులను, తొలిసారిగా ఒక ఇండియన్ స్త్రీ ప్లాస్టిక్ సర్జన్ గా సర్జరీని చెయ్యగలనా అని సందేహించేవారు. ఒకసారి నా పనితీరు చూసాక వాళ్ళు రిలాక్స్ అవడం మొదలెట్టారు. చేతి సర్జరీ, కాస్మెటిక్ సర్జరీలు ఎంతో మెరుగుపడ్డాయి. అదే నేను ఇండియాలోనే ఉంటే ఇది జరిగేదే కాదు.
మాతో పాటు పీజీఐ ఎమ్ ఈ ఆర్ లో ఉన్న కార్డియాక్ సర్జన్, పీ వీ సత్యనారాయణ (పీవీ), అల్స్టర్ ఆసుపత్రి నుండి పావుగంట దూరంలో ఉన్న న్యూటన్ ఆబ్బీ హాస్పిటల్ లో తన డ్యూటీ మొదలుపెట్టారు. మేం తరచు ఆయనను, ఆయన భార్య కమలను వారాంతాల్లో కలవడం వల్ల మాకు స్వదేశంలో ఉన్నట్టు అనిపించేది.
ఒక శనివారం రాత్రి, మా పిల్లలకు తిండి తినిపించి మేం డిన్నర్ చెయ్యబోతుంటే డోర్ బెల్ మోగింది. అది హాస్పిటల్ ఇచ్చిన ఇల్లే అయినా ఇండిపెండెంట్ బంగళా, రోడ్ సైడ్ న ఉంది. తలుపు తెరిస్తే మధ్య వయసు మనిషి తలుపు తీసిన పీవీ వైపు పిస్టల్ గురిపెట్టి తోసుకుంటూ లోపలికి హాల్ లోకి వచ్చాడు.
ఆ అపరిచితుడు వెంటనే తలుపులు మూసి, “నేనొక జైలు అధికారిని, నేను పబ్ నుండి వెళుతుంటే ఎవరో నన్ను అనుసరిస్తూ వస్తున్నారు. పోలీసులు వచ్చి నన్ను క్షేమంగా తీసుకెళ్ళేవరకూ నాకు కాస్సేపు ఇక్కడ రక్షణ కావాలి.” అన్నాడు.
మేం అందరం పాలిపోయిన మొహాలతో అతని వైపు చూసాము. అతను పాకెట్ నుండి ఏదో తీసి దాన్ని నొక్కాడు. “ఇది నా ఐడెంటిటీ కార్డ్. నేను మీకేమీ హాని చెయ్యను, కాని పొలీస్ వచ్చే వరకు నన్నిక్కడ ఉండనివ్వండి. ప్లీజ్. మీరు మీ డిన్నర్ చెయ్యండి” అన్నాడు.
అతను వణికిపోతూ చెమటలతో తడిసి ముద్దవుతున్నాడు. పీవీ అతన్ని చూసి జాలిపడి, “మాతో డిన్నర్ చెయ్యండి” అన్నాడు.
అతను తల అడ్డంగా ఊపి,
“కొంచం నీళ్ళు ఇవ్వండి చాలు. భయపడకండి. నేను మీ లాగే. నాకూ ఒక కుటుంబం ఉంది. నా కొడుకు నీ కూతురి వయసే.” అమ్ము వైపు చూపిస్తూ అన్నాడు.
పదినిమిషాల్లో పొలీస్ వాన్ వచ్చి అతన్ని తీసుకు వెళ్ళింది. పీవీ తప్ప మాలో ఎవరం గది దాటి బయటకు వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళాక అతను తలుపులు మూసి, ” ఇక్కడ ఐ ఆర్ ఏ కదలికల గురించి పొలీస్ మాట్లాడుకుంటుంటే అతని జీవితం ప్రమాదంలో ఉన్నట్టనిపిస్తోంది. పొలీస్ సూచనల ప్రకారం మనం లోపలే ఉండటం మంచిది” అన్నాడు.
బయటకు వెళ్ళడానికే భయపడిపోయి భయం భయంగానే డిన్నర్ చేసాము. ఆ వారాంతమంతా మేము పీవీ కుటుంబంతోనే ఉండి ఆదివారం సాయంత్రం బయలు దేరాం. పొలీస్ ఆ సమయంలో రొటిన్ చెకప్ లు చేస్తూనే ఉన్నారు.
నా కొత్త ఉద్యోగం మే లో మొదలుపెట్టాను. కొన్ని సెషన్స్ కి రాయల్ విక్టోరియా హాస్పిటల్ కి వెళ్ళాల్సి వచ్చింది. నాకు డ్రైవింగ్ రాకపోడం వల్ల కన్సల్టెంట్ లలో ఒకరు అతనితో పాటు నన్నూ కారులో తీసుకు వెళ్ళే వారు, సాయంత్రం అయిదు దాటాక ఎమర్జెన్సీ కాల్స్ అటెండ్ చెయ్యడానికి
ఆసుపత్రే నా కోసం టాక్సీ ఏర్పాటు చేసేది. నేను లేడీ టాక్సీ డ్రైవర్ ను కోరుకునేదాన్ని, దారిపొడుగునా వారి సంస్కృతి గురించీ, వారి కష్టాల గురించీ మాట్లాడే సౌలభ్యం కోసం.
రాయల్ విక్టోరియా ఆసుపత్రి ప్రత్యేకమైన విధంగా కట్టారు. ముఖ ద్వారం ప్రొటెస్టేంట్ ప్రాంతంలో ఉండేట్టు నిష్క్రమణ తలుపులు కాథలిక్ ప్రభావిత ప్రాంతంలో ఉంచారు. నిష్క్రమణ తలుపు నుండి బయటకు వచ్చి తాజాగా ఉండే కూరగాయలు, మాంసం సరైన ధరకు కొనుక్కోడం నాకు హోమ్లీగా అనిపించేది. ఆసుపత్రికి ఈ వైపున ఉన్న రోడ్లు కూడా కూల్చేసిన భవనాలతో చెత్తా చెదారంతో, గోడలమీద రాతలు, బొమ్మలతో ఉండేవి. ఒక విధంగా నాకు ఇండియా గుర్తుకు వచ్చేది. అక్కడికి నేను వెళ్ళడం సలీం కి భయంగా ఉండేది. కాని నేనే నచ్చజెప్పాను, బెల్ఫాస్ట్ లో అక్కడ నాకు ఎంతో సురక్షితం అనిపిస్తుందని.
మతం అంటే భారత దేశమే సంకుచిత మనస్తత్వంతో ఉంటుందని మనం అనుకుంటే భెల్ఫాస్ట్ లో నేనున్న సమయం నాకు నేర్పించినది, “మనం ఎక్కడకు వెళ్ళినా మతం అనేది మన జీవితంలో ఒక పెద్ద భాగమేనని”. ఒక కాథలిక్ కీ ప్ర్రొటస్టేంట్ కీ మధ్య పెళ్ళి జరిగితే ఆ జంట ఐర్లాండ్ వదిలి మరెక్కడో వెళ్ళి స్థిరపడతారు. కారణం వాళ్ళపట్ల ఉన్న చిన్న చూపు. చర్చ్ కూడా కఠినమైన నియమాలనే అనుసరిస్తుంది, ముఖ్యంగా తల్లి కాథలిక్ అయితే బిడ్డ కూడా ఎలాటి వాదన లేకుండా కాథలికే అయితీరాలి. ఎందుకో గాని ఈ విషయంలో భారతీయులే ఇలాటి విషయాలలో ఎక్కువ సహనపరులు అనిపించింది.
హాస్పటల్ లో పేషంట్లు వాళ్ల మొహాల మీద, కాళ్ళూ చేతుల మీద, నియమాలను అమలుపరుస్తున్నామనుకునే రామిలిటరీ వారి గన్ కాల్పుల గాయాలతో మా వద్దకు వస్తారు. తమను ఏ కాస్త వ్యతిరేకించినా ఎవరినైనా వాళ్ళు శిక్షిస్తారు. కాళ్ళు విరగగొట్టడం, మోకాలి కీళ్ళ మధ్య కాల్పులు జరపి అంగవైకల్యం కలిగిస్తారు, చంపకుండా. ఈ గాయాల వల్ల బాధితులు సామాజిక అపవాదులకు గురవుతారు. ఈ బాధితులకు మేం ఆపరేషన్లు చేసినప్పుడల్లా మేం కాళ్ళు చేతులు తీసెయ్యకుండా వాటిని కాపాడడానికే చూస్తాము. తరువాత మిగతా జీవితమంతా వాళ్ళు కుంటివారుగా మిగిలినా.
ఒకసారి, ఒక పేషంట్ గా నలబై యేళ్ళ జైలు అధికారి వచ్చాడు. అతను కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వాన్ అతన్ని వెంటాడింది. తప్పించుకునే ప్రయత్నంలో అతని కారు చెక్క ఫెన్సింగ్ కి గుద్ది కారు విండ్ షీల్డ్ ముక్కలై ఒక చెక్క ముక్క అతని మొహమ్మీద ఒకచోట గుచ్చుకుని, శరీరం మీద అనేక గాయాలతో వచ్చాడు. అతని మొహం ఒక మిక్సర్లో తిప్పిన రక్తపు ముద్దలా ఉంది. చాలా పెద్ద ప్లాస్టిక్ సర్జన్ల టీమ్ అయిన మాకు అది సరిచెయ్యడానికి ఆరుగంటలపైనే పట్టింది. చివరి ఫలితం మాత్రం అద్భుతంగా అనిపించింది. గాయాలు మానాక మొహం మీద పెద్దగా మచ్చలేమీ కన బడలేదు.
వారాంతాల్లో మరీ ఎక్కువగా విరిగిన చేతులు, తెగిన మొహాలు, తాగిన వారి కలహాల వల్ల ఎమర్జెన్సీలు వచ్చేవి. ఒక శనివారం రాత్రి ఒక 25 యేళ్ళ యువకుడు నరికిన మణికట్టు, తెగిన నరాలు, కండరాలతో వచ్చాడు. మైక్రో సర్జరీ ద్వారా ఆపరేషన్ చేసాము. తరువాత వార్డ్ నర్స్ లలో ఒకరు ఆ గాయం ఎలా అయిందో చెప్పారు. ఆ యువకుడు ఒక షాప్ లో దొంగతనం చేస్తుంటే అలారమ్ మోగి అతను బయటకు పరుగెత్తుకు రాబోతూ జారి, రోడ్ సైడ్ గుంటలో పడ్డాడు. ఇక్కడ నవ్వొచ్చేది ఏమిటంటే రోడ్ లు సరిగా ఉంచలేదని అధికారుల మీద కేస్ పెట్టాడు. ఇదంతా షాప్ దోచుకున్నందుకు పోలీస్ లు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే జరిగింది.
మళ్ళీ జూన్ 1979 నుండి నా ఉద్యోగపు వేట మొదలైంది. ప్లాస్టిక్ సర్జరీలో ఎలాటి ఖాళీలు లేవని తెలుసు కున్నాను. రొటేషనల్ సర్జికల్ ట్రైనింగ్ లో నేను చేరదలుచుకోలేదు, తరువాత తరువాత నాకు దానివల్ల ఎలాటి ఉపయోగం ఉండదు మరి. ఆ ఆగస్ట్ లో అమ్ముని సరైన ప్రీ స్కూల్ లో వెయ్యాలని తెలుసు. మాకు రెండే అవకాశా లున్నాయి- అయితే నేను ఇంట్లో ఉండటం, సలీం నేనూ కూడా సర్జికల్ వార్డ్ లో పనిచెయ్యగలిగే హాస్పిటల్ ఎక్కడయినా టౌన్ లో చూడటం.
ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ కన్సల్టెంట్ లు మా ప్లాన్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు. నా భర్త ఫెలోషిప్ ప్రాముఖ్యత గురించి చెప్పాను. నేను తరువాత ఎప్పుడో చెయ్యగలను. నా కూతురి పట్ల నేను చూపవలసిన శ్రద్ధ గురించి కూడా చెప్పాను. అదృష్టవశాత్తూ మాకున్న అనుభవం వల్ల, సలీంకు నాకు కూడా లగాన్ వాలీ హాస్పిటల్ లో సర్జరీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు వచ్చాయి.
అమ్ము మూడో పుట్టినరోజు అయిన కొన్నాళ్ళకే మేము లగాన్ వాలీ హాస్పిటల్ కి మారాము. అక్కడ మాకు గ్రౌండ్ ఫ్లోర్ లో పెద్ద టూ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ పెద్ద పెరడుతో ప్రత్యేకమైన తెల్లని కంచె ఉన్నది ఇచ్చారు. అది చాలా అనుకులంగా ఉంది, అమ్ముకి బాగా నచ్చింది. అక్కడ అమ్ము ఊయలమీద ఆడుకోవచ్చు ఒక చిన్న గుర్రం పిల్ల కూడా ఉంది. మేం ఒక బేబీ సిట్టర్, మిసెస్ రీనీ ని చూసుకున్నాం, ఆవిడ పిల్లను స్కూల్ నుండి తీసుకు వచ్చేది.
ఎమర్జెన్సీ రూమ్ లో సలీం పని నేను చెయ్యడం మొదలెట్టాను, దానివల్ల సలీం ఎఫ్ ఆర్ సీ ఎస్ పరీక్షకు తయారయేందుకు సమయం దొరికేది. నేను అటెండయిన మొదటి మేజర్ సర్జరీ 19 యేళ్ళ అమ్మాయిది. ఆ పిల్లను ఆర్మీ ట్రక్ గుద్దేసింది. ఎన్నిచోట్లో ఎముకలు విరిగి, తలకు గాయంతో, కోమాలోకి వెళ్ళిన ఆమెను తెచ్చారు. ఒక్క నిమిషం కూడా వృధా చెయ్యకుండా ఎండోట్రాకియల్ ట్యూబ్ అమర్చి, స్పృహ తెప్పించడానికి ప్రత్నిస్తూ, ఐవి లైన్ అమర్చి గుండె మసాజ్ మొదలెట్టాను. ఏ సాయం లేకుండా నేను ఇవన్నీ చెయ్యడం చూసి స్టాఫ్ ఆశ్చర్యపోయారు, ఎమర్జెన్సీ టీమ్ ను నాకు సాయం చేసేందుకు పిలిచారు. సీనియర్ డాక్టర్ నేనెక్కడ ట్రెయినింగ్ అయానని అడిగాడు. నేను గర్వంగా పీజీఐ ఎమ్ ఈ ఆర్ అని చెప్పాను. మరి అక్కడి నుండే నాకు ఈ అనుభవం, నైపుణ్యం వచ్చినది.
సలీం ఆ వేసవిలో జరిగే ఎఫ్ ఆర్ సీ ఎస్ పరీక్షకు చదువుకోవలసి ఉన్నా ఇంటికి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు. దాని వల్ల మా ఇద్దరికీ కూడా నిద్ర సరిపోయేది కాదు. వార్డ్స్ లో కాల్ మీద ఉన్నపుడు నేను చిన్నగా కునుకు తీసేదాన్ని.
స్టాఫ్ లో చాలామంది నాతో స్నేహంగా ఉండటం వల్ల, సర్జికల్ వార్డ్స్ లో పని నాకు బాగుండేది. వారాంతాల్లో తాగిన వాళ్ల ఎమర్జెన్సీలు ఎక్కువగా వచ్చేవి, తెగిన గాయలతో దెబ్బలతో. ఈ పేషంట్ల వెనక పోలీస్ ఆఫీసర్లూ వచ్చే వాళ్ళు.
ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ తో నాకు స్నేహం కుదిరి ఆవిడ వచ్చినప్పుడల్లా ఇద్దరం టీ ఆస్వాదించేవాళ్ళం. ఒకసారి ఆవిడ, ” మీ వెడ్డింగ్ రింగ్ నువ్వు వేలికి పెట్టుకోవాలి, తాగిన మొహాలు పేషంట్లు అడ్డమైన వ్యాఖ్యలు చెయ్యకుండా” అని చెప్పింది. అప్పటి నుండి ఈ రోజు వరకు నా వేలిన పెళ్ళి ఉంగరం అలాగే ఉంది. ఒక రాత్రి ఈ పొలీస్ ఆఫీసర్ చాలా డల్ గా నా దగ్గరకు వచ్చింది. ఆమెను పరీక్ష చేసి వెంటనే ఒక న్యూరో సర్జన్ ను చూడమని చెప్పాను. ముందు తన డాక్టర్ని కలిసాకే స్పెషలిస్ట్ న్యూరో సర్జన్ ను కలుస్తానని చెప్పింది. ఎమర్జెన్సీ కనక ముందు న్యూరో సర్జన్ ని చూడమని బలవంత పెట్టాను. కొన్ని వారాల తరువాత ఆమె కోమాలోకి వెళ్ళిపోయిందని తెలిసింది. ఆపైన కొన్నాళ్ళకే ఆవిడ ఈ ప్రపంచం వదిలి నిష్క్రమించింది.ఆ రోజున ఒక మంచి మిత్రురాలిని కోల్పోయాను.
ఒక్కోసారి జీవితంలో మనం లాజిక్ ను వదిలి మన హృదయం ఏం చెప్తుందో అది చెయ్యాలి. అది మన జీవితాలకు ఒక ఆయింట్మెంట్ లా పనిచేస్తుంది. – రబీంద్రనాథ్ టాగూర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *