April 27, 2024

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 8

రచన: కొంపెల్ల రామలక్ష్మి

క్రితం సంచికలో మనం అర్ధ శాస్త్రీయ (సెమి-క్లాసికల్) సంగీత రచనలలో ఉన్న ఒక రాగమాలికా రచన గురించి సవివరంగా తెలుసుకోవడం జరిగింది. దాని కొనసాగింపుగా ఈ సంచికలో మరో రెండు రచనల గురించి తెలుసుకుందాం.

1. అన్నమాచార్య కీర్తన ‘కంటి కంటి నిలువు చక్కని మేని దండలును’
2. సి. రాజగోపాలాచారి గారి రచన ‘కురై ఒన్రుం ఇల్లై’

ఈ రెండు రచనలు పాడినవారు భారతరత్న శ్రీమతి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు. సంగీతం సమకూర్చిన వారు శ్రీ కడయనల్లూర్ వెంకటరామన్ గారు. శ్రీ అన్నమాచార్యులవారి గురించి, మరియు వెంకటరామన్ గారి గురించి కూడా మనం క్రితం సంచికలో తెలుసుకున్నాం. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు మరియు వెంకటరామన్ గారి భాగస్వామ్యంలో వెలువడిన ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ సంగీత రసికులను భక్తిలో ముంచెత్తాయి అనడంలో ఆశ్చర్యం లేదు. ఎన్నో భక్తి గీతాలు, కనకధారాస్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం మొదలైన ఎన్నో స్తోత్రాలు, తులసిదాస్ విరచిత హనుమాన్ చాలీసా, ఇలా ఉదయాన్నే భగవంతుడి ఆరాధన కోసం, స్మరణ కోసం, కీర్తించుకోవడం కోసం ఇవి మంచి సాధనాలు అయ్యాయి. ఈ రచనలు మనం గమనిస్తే, కడయనల్లూర్ వెంకటరామన్ గారు, రాగమాలికలుగా రచనలు మలచడంలో సిద్ధహస్తులని అనిపిస్తుంది.

అన్నమాచార్య కీర్తన:
పల్లవి: నాదనామక్రియ రాగం
కంటి కంటి నిలువు చక్కని మేను దండలును
నంటు చూపులను జూచే నగుమోము దేవుని

చరణం 1 నాదనామక్రియ రాగం

కనకపు పాదములు గజ్జెలును అందెలును
ఘన పీతాంబరముపై కట్టు కట్టారి
మొనసి వడ్డాణపు మొగపున మొలనూలు
మొనర నాభి కమలం ఉదర బంధములు ll కంటి కంటి ll

చరణం 2 పున్నాగ వరాళి రాగం

గరిమ వరద హస్త కటి హస్తములును
సరసనటిల్ల శంఖ చక్ర హస్తములు
ఉరముపై కౌస్తుభము ఒప్పగు హారములు
తరుణి అలమేలు మంగ ధరణి భామయును ll కంటి కంటి ll

చరణం 3 సింధు భైరవి రాగం
కట్టిన కంఠసరులు ఘనభుజ కీర్తులు
కట్టాణి ముత్యాల సింగార నామము
నెట్టన శ్రీ వేంకటేశ నీకు కర్ణ పత్రములు
అట్టే శిరసు మీద అమరే కిరీటము ll కంటి కంటి ll

అన్నమాచార్యులు, వెంకటేశ్వర స్వామిపై, అలమేలు మంగమ్మ గురించి, అహోబిల నరసింహ స్వామిపై, హనుమంతునిపై ఎన్నో రచనలు చేసారు. నవవిధ భక్తి మార్గాలైన శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం – ఈ తొమ్మిది మార్గాలలో తన భక్తిని తాను అనుభవించి రచనల ద్వారా మనందరికి తెలియచేసిన భాగవతోత్తములు అన్నమాచార్యులవారు. క్రితం సంచికలో మనం చర్చించుకున్న కీర్తన పూర్తిగా తత్త్వచింతనతో కూడినదైతే, పైన ఉదహరించిన కీర్తన పూర్తిగా స్వామివారి దివ్య మంగళ స్వరూప వర్ణన. ఈ కీర్తనకు సంగీత కర్త 3 రాగాలు ఎంచుకున్నారు. పల్లవి, మొదటి చరణం, ‘నాదనామక్రియ’ రాగంలో సంగీతం చేయబడ్డాయి. రెండవ చరణం ‘పున్నాగ వరాళి’ రాగంలో, మూడవ చరణం ‘సింధు భైరవి’ రాగంలో సంగీతం చేయబడ్డాయి.
పల్లవిలో అన్నమాచార్య, తను శ్రీ వేంకటేశ్వర స్వామివారి నిలువెత్తు విగ్రహాన్ని ఏ తీరుగా దర్శించుకున్నారో వర్ణించారు. చక్కని నిలువు మేను, దండలు, స్నేహపూరితమైన దృష్టిని ప్రసరింప జేస్తూ, నవ్వుముఖంతో ఉండే స్వామిని కన్నాను అన్నారు అన్నమయ్య.
మొదటి చరణంలో – బంగారు పాదాలకు ఉన్న గజ్జెలు, మువ్వలు, పట్టు పీతాంబరం పైన నిలువుగా బిగించి కట్టిన ఖడ్గం (నందకం), నడుముకు కట్టిన వడ్డాణం, మొలత్రాడు, నాభిలో కమలం, ఉదర బంధనం మొదలైన వాటి గురించిన అందమైన వర్ణన చేసారు.
రెండవ చరణంలో – స్వామివారి విగ్రహం మధ్య భాగంలో ఇరువైపులా ఉన్న వరద హస్తము, కటి హస్తము, హస్తాల పైభాగాన ఉన్న శంఖు చక్రాలు, ఉరముపైన ఉన్న హారములు, ప్రకాశిస్తున్న కౌస్తుభ మణి, వక్షస్థలము ఇరువైపులా కొలువుదీరిన శ్రీదేవి భూదేవి అమ్మవార్ల గురించి వర్ణించారు అన్నమయ్య.
మూడవ చరణం – స్వామివారి కంఠంలో మెరుస్తున్న కంఠసరులు, ఇరు భుజములకు బిగింపబడిన భుజకీర్తులు, ముత్యాల హారములు, సింగారించబడిన నుదుటి నామం, చెవులకు పెట్టిన ఆభరణాలు ఎట్లా అయితే మెరిస్తున్నాయో, అట్లే ఆ స్వామి శిరసు మీది కిరీటము కూడా శోభిల్లుతున్నది అని అన్నమయ్య చాలా అందంగా వర్ణించి చేసిన రచన ఇది. అంతే అందంగా వెంకటరామన్ గారి ద్వారా స్వర రచన చేయబడ్డ రచన.
ఎమ్మెస్ అమ్మ కంఠంలో ఈ కీర్తన వింటే, ఆ స్వామి దివ్య రూపం కళ్ళముందు ప్రత్యక్షం అవుతుంది. మనం కూడా అన్నమయ్య అనుభవించిన ఆ దివ్యానుభూతిని పొందటం తథ్యం.
***
ఇప్పుడు మనం రెండవ రచన గురించి వివరించుకుందాం. ఈ రచన తమిళంలో చేసిన రచన కాబట్టి సాహిత్యం ఇంగ్లీష్ లో ఇస్తున్నాను. రచించిన వారు సి. రాజగోపాలాచారి గారు. వీరు గొప్ప రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత, న్యాయవాది. వీరు జీవించిన కాలం 10 డిసెంబర్ 1878 నుండి 25 డిసెంబర్ 1972 వరకు. వీరిని రాజాజీ అని కూడా పిలుస్తారు. వీరు మన దేశానికి ఆఖరు గవర్నర్ జనరల్ గా పని చేసారు. 26 జనవరి 1950 రోజున ఈ పదవిని రద్దు చేసి స్వతంత్ర భారత దేశానికి అత్యున్నత పదవి, ‘ప్రెసిడెంట్’ (అధ్యక్షుడు) అని ప్రకటించడం జరిగింది. మొట్ట మొదటి దేశాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు. గవర్నర్ జనరల్ గా పదవీవిరమణ చేసిన తర్వాత రాజాజీ గారు, మంత్రివర్యులుగా వివిధ పదవులను సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను పొందిన తొలి వ్యక్తులలో ఒకరు శ్రీ రాజగోపాలాచారి గారు.
ఈ రచన, వీరికి ఆ ఏడుకొండల వాడి మీద ఉన్న అమితమైన, అవ్యాజమైన భక్తికి తార్కాణం. వేంకటేశ్వర స్వామి మరియు కృష్ణుడు ఇద్దరి గురించి ప్రస్తావిస్తూ చేసిన రచన ఇది. ఈ రచన ఎంత జనాదరణ పొందిన రచన అంటే, దాదాపు పెద్ద పెద్ద సంగీత కచేరీలలో, విద్వాంసులు ఈ రచనను పాడడం ఎంతో గొప్పగా భావించేటంత.
పల్లవి శివరంజని రాగం
kurai ondrum illai marai moorthy kanna
kurai ondrum illai kannaa
kurai ondrum illai Govindha

అనుపల్లవి శివరంజని రాగం
Kannukku Theriyaamal nirkinraay kannaa
kannukku Theriyaamal nindraalum enakku
kurai ondrum illai marai Moorthy kanna

చరణం 1 శివరంజని రాగం
Vendiyadhai thannthida Venkatesan endrirukka
Vendiyadhu Verillai marai Moorthi kannaa
Manivannaa malayappaa Govindha Govindha

చరణం 2 కాపీ రాగం
Thiraiyin pin nirkinraay kannaa kannaa
Thiraiyin pin nirkinraay kannaa Unnai
marai Odhum Gnyaaniyar mattume kaanbaar
endraalum kurai ondrum enakkillai kanna
Kundrin Mel kallaagi nirkindra varadha
kurai ondrum illai marai Moorthy kanna
Manivannaa Malayappaa Govindha Govindha

చరణం 3 సింధు భైరవి రాగం
Kalinaalukkirangi kallile irangi
Nilayaaga Kovilil nirkindraai Kesavaa
kurai ondrum illai marai Moorthy kanna
Yaadhum marukkaadha malayappa – un marbil
Yedhum thara nirkum karunai kadal annai
endrum irundhida Ethu kuRai enakku
ondrum kurai illai marai Moorthi kannaa
Manivannaa malayappaa Govindha Govindha
Govindha Govindha Govindha Govindha

సాహిత్య భావం:
తమిళ భాషలో ఉన్న రచన కాబట్టి అర్థం కోసం చాలా చోట్ల వెతికి, కొందరు తమిళులను అడిగి తెలుసుకొని నాకు స్ఫురణకు వచ్చిన విషయాలు కూడా జోడించి ఈ వివరణ చేస్తున్నాను. తమిళం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇందులో మార్పులు సూచించవచ్చు.
‘కురై’ అన్న పదానికి, తక్కువ, లోటు, లోపం – ఇలా చాలానే అర్థాలు ఉన్నాయి. అలాగే ‘మరై’ అన్న పదానికి అర్థం, రహస్యమైన, దాచబడిన అని ఉంది. గుహ్యమైన అని కూడా అనుకోవచ్చు. వేద విజ్ఞానం చాలా రహస్యమైనది అంటారు విజ్ఞులు. అందువల్ల కొందరు ‘మరై మూర్తి’ అన్న పదానికి అర్థం, ‘జ్ఞాన మూర్తి’ అని, కొందరు వేద మూర్తి అని కూడా చెప్పారు. భక్త రామదాసు గారి రచన “తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకు” అన్న రచనలో, రామదాసు గారు వ్యక్తపరచిన ధీమా, ఈ తమిళ రచనలో కూడా మనకు కనిపిస్తుంది. భగవంతుడు మనకు కావలసినవన్నీ చూసుకుంటాడు అనుకునే స్థితికి భక్తుడు రావడమే చాలా సాధన ద్వారా కలుగుతుంది. అయితే, భక్తికి పరాకాష్ఠ స్థితి ఎటువంటిది అంటే, మన భారం అంతా, భగవంతుడిపైన వేసాక, మనకు జరిగేవన్నీ కూడా, భగవంతుడి ఆజ్ఞానుసారం జరుగుతున్నాయని భావిస్తూ, ఆ జరిగేది మన మంచి కోసమే అనుకోవడం. ఈ స్థితి అంత సులభంగా లభించే మానసిక స్థితి కాదు. ఎంతో సాధన చెయ్యడం ద్వారా కలిగే స్థితి. ఈ సారాంశమే ‘ఈశావాస్యోపనిషత్తు’ కూడా మనకు వివరిస్తుంది. ఇంతటి తత్త్వచింతనతో కూడిన ఈ రచనలో, భగవంతుడి పైన భక్తుడు చూపించే ‘ప్రతిఫలం ఆశించని ప్రేమ’ (unconditional love) కూడా ఉంది.
పల్లవిలో – “నాకు ఏ కొరతా/వెలితి లేదు ఓ వేదస్వరూపుడైన కృష్ణా! నాకేదో తక్కువ అయ్యింది అన్న భావన లేనే లేదు గోవిందా! కంటికి కనిపించని చోట నువ్వు నిలుచుని ఉన్నావు. నువ్వు కనిపించక పోయినా సరే, నాకు ఏమీ బాధ లేదు, ఏ వెలితీ లేదు కన్నయ్యా!”, అని చాలా ప్రేమగా దేవుడితో అన్నారు రాజాజీ. వెంకటేశ్వర స్వామికి పర్యాయ పదాలుగా మణివణ్ణ (నీలమణి వర్ణుడు), మలయప్ప (కొండమీది దేవుడు అని అర్థం, అలాగే వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని కూడా మలయప్ప అని పిలుస్తారు), గోవిందా, కన్నా, అని వాడారు.
అనుపల్లవిలో – “వేడినవన్నీ ఒసగే వెంకటేశా! నువ్వు నాకు ఉన్నంతవరకు, నేను వేడుకోవడానికి ఏమీ లేదయ్యా మణివణ్ణ, మలయప్ప, గోవిందా!” అన్నారు రాజాజీ.
1 చరణంలో – “తెరవెనుక నిలబడి ఉన్నావు నువ్వు. వేదాలు చదివే కోవిదులు/జ్ఞానులు మాత్రమే నిన్ను పట్టుకోగలరు/ చూడగలరు. అయినా సరే, నాకు మాత్రం ఏ బాధా లేదు.” ఇక్కడ రాజాజీ గారి ఉద్దేశ్యం బహుశా, నేను వేదాలు చదివిన గొప్ప జ్ఞానిని కాదు. అందువల్ల నేను నిన్ను చూడలేను. అయినా కూడా నాకు ఏ లోటు లేదు, అన్నట్టు అనిపిస్తుంది. ఇదే చరణంలో తర్వాతి వాక్యంలో, “శిఖరం మీద శిలవై విగ్రహరూపంలో ఉన్న ఓ వరాలిచ్చే దైవమా! నీ పట్ల నాకు ఏ వ్యతిరేక భావనా లేదయ్యా వేదమూర్తీ, మణివణ్ణ, మలయప్ప, గోవిందా!” అని భావం.
2 చరణంలో – “కలియుగంలో మానవాళి అవసరాలను గమనిస్తూ, శిలారూపంలో, నువ్వు భూమి మీదకు ఏతెంచి, శాశ్వతంగా తిరుమల గుడిలో కొలువైయున్న ఓ కేశవా! ఏదీ కాదనే (తిరస్కరించని) ఓ మలయప్పా! నీ హృదయంలో కరుణాసముద్రయైన శ్రీలక్ష్మి అమ్మవారు కొలువైయుండి ఏ వరం అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నాకు తక్కువ ఏముంది స్వామీ! నాకు దేనికీ కొరత లేదు వేదవిహరీ! మణివణ్ణ, మలయప్ప, గోవిందా!” అని భావం.
ఇంత చక్కని రచన చేసిన రాజాజీ నిజంగా ధన్యులు. స్వచ్ఛమైన భక్తికి నిజమైన నిదర్శనం ఈ సంకీర్తన. ఏ భాషలోని రచన అయినా సరే, అది మన భాష కాకపోయినా, అందులోని భావం తెలుసుకుని మనం ఆనందించ గలిగితే అంత కన్నా ఇంకేం కావాలి?
ఈ రచనలో మూడు రాగాలు ఎంచుకున్నారు కడయనల్లూర్ వెంకట రామన్ గారు. పల్లవి, అనుపల్లవి శివరంజని రాగంలో చేసారు. మొదటి చరణం కాపీ రాగంలోనూ, రెండవ చరణం సింధు భైరవి రాగంలోనూ చేసారు. ఈ పాటలోని భావం లాగే, వాడిన మూడు రాగాలూ కూడా భక్తి మరియు కరుణ రసాలు కురిపించేవే. ఆ భావాలు తన గొంతులో అలవోకగా పలికించారు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు. మొత్తం మీద ఈ సంకీర్తన మనకు ఇద్దరు భారతరత్నలు, ఒక గొప్ప సంగీత దర్శకులు (వెంకట రామన్ గారు) కలిసి అందించారు.
మరో మంచి రాగమాలిక రచన వచ్చే సంచికలో వివరించుకుందాం.

. kanti kanti niluvu

2. Kurai Ondrum Illai

***

1 thought on “కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *