41. పూజాఫలం

రచన: సి.హెచ్.చిన సూర్యనారాయణ

 

ఏమండీ! డ్యూటీ నుండి వచ్చేటప్పుడు ఒక కొబ్బరికాయ అరడజను అరటిపళ్ళు తీసుకురండి. రేపు శివాలయానికి వెళ్ళాలి నా చేతికి క్యారేజీ అందిస్తూ ప్రాధేయపడింది మా ఆవిడ.                                                                                           మా ఆవిడ అలా అడిగినప్పుడల్లా, నాకు చాలా కోపం వస్తుంది. లోలోపల అణచి వేస్తుంటాను. ఎందుకంటె నాలో నాస్తికత్వపు భావాలు కాస్తో కూస్తో వున్నప్పటికీ, దేవుడు ఉన్నాడేమోనని భయం కూడా నాలో లేకపోలేదు. సంధిగ్ద మనస్తత్వముతో సగటు జీవనం గడుపుతున్నాను .

నా భార్యకు రెండేరెండు పనులు తెలుసు. ఒకటి వంట. రెండోది పూజ. మరో లోకము తెలియుదు ఆమెకు.                     పెళ్ళైన కొత్తలో యీమె నాకు సరైన భార్య కాదనిపించేది. వాళ్ళ ఉమ్మడి కుటుంబం చూసి,మా అమ్మానాన్న యీమెను కోడలుగా తెచ్చుకున్నారు. భూమ్మీద అధ్యాత్మక పోటీలు నిర్వహించు నట్లయితె తప్పనిసరిగా మా ఆవిడకే ఫస్టు ప్రైజు వస్తుంది. అందరూ పూజలు చేస్తుంటారు, కాని మా ఆవిడంత నిష్టతో, దీక్షతో ఎవరూ పూజలు చేయలేరు. జ్వరమైనా జబ్బైనా ప్రతిరోజు ఉపవాసముతో దేవునికి ప్రసాదం పెట్టకుండా పచ్చి మంచినీళ్ళైనా ముట్టదు. శ్రావణమాసము, కార్తీక మాసము లాంటి పుణ్యకాలాల్లో, పూజాసామగ్రిని అందించడానికి నన్ను పరుగులు తీయుస్తుంది. మరొక విశేషమేమిటంటే, నేనెక్కడ తప్పు పడతానేమోనని, ఉపవాస నీరసాన్ని కూడ పక్కన పెట్టి,

మరొక వైపు ఇతర ఇంటి పనులును కూడా చకచకా  పూర్తి చేసేస్తుంది. నన్నుకూడా దేవునికి దండం పెట్టుకోమని పదేపదే ఒత్తిడి చేస్తుంటుంది.

*                *                 *

రోజు  ఆఫీసులో  పని ఎక్కువుగాఉండటం వలనబాగా అలసిపోయాను. ఇంటికి రావడం కూడా ఆలస్యమైంది. చాలా చిరాకుగా వుంది. ఇంటికి వచ్చిన వెంటనే చేతిలో ఉన్న కారేజ్ అక్కడ పడేసి, సోఫాలో చతికిలపడ్డాను. మా ఆవిడ ఇవ్వాల్సిన కాఫీ  పడితే గాని, మరలా జవసత్వాలు రావు. అలాగ అలవాటైపోతుంది మగవాని జీవనశైలి. భర్తల్లో ఉన్న నీరసాన్ని తగ్గించే భాద్యత భార్యలదే.  ఇది సమాజధర్మం. దానికే కట్టుబడి పోయాము మనమంతా. అందుకే నేను కళ్ళుమూసుకొని కూర్చున్న, కాఫీ తనంతటదే నా నోటి దగ్గరిగా వస్తుందనే నమ్మకం. నేను కళ్ళు తెరిచి చూడకపోయినా తెలిసిపోతుంది మా ఆవిడ నా ముందుకొచ్చి నిలబడి ఉందని. ఎందుకంటే కాఫీ వాసన అలాంటిది.

సమయములో మా ఆవిడ కాఫీ నాకు అందించడానికి, వరాలిచ్చే దేవతలాగ ప్రత్యక్షవుతుంది.

కళ్ళు తెరిచి కాఫీ అందుకోబోతుంటే, “ఏమండీ! అరటిపళ్ళు కొబ్బరికాయ తెమ్మన్నాను తెచ్చారా?” అని అడిగింది మా ఆవిడ. అప్పటికి గాని అర్ధమవలేదు, రోజు జీవన పయనంలో అపసృతి ఏదో దొర్లిందని, మరచిపోయానని చెప్పడానికి మనసెందుకో ఒప్పుకోవడం లేదు. ఇలాంటప్పుడే కదా మగబుద్ధి సాయము చేసేది.

మార్కెట్లో ఈరోజు అరటిపళ్ళు కొబ్బరికాయలు లేవు లక్ష్మితడుముకోకుండా అబద్దమాడేసాను.

మగవాళ్ళ అబద్దాలు ఆడవాళ్ళకి తెలియనివి కావు. వాదించలేక మౌనంగా ఉంటారు కాని, వారు మ్మలేదనే విషయము వాళ్ళ ముఖాలలో స్పష్టంగా కనిపించేస్తుంది. ఇక్కడకూడా అదే జరిగింది.

మా ఆవిడ కళ్ళల్లో కన్నీరు రాలేదు గాని ,ముఖములో ఏడుపు లక్షణాలు ఎగిసిపడుతున్నాయి.

మీరెప్పుడూ.. ఇంతే, నాపనంటే మీకు లెక్కలేదు. ఇప్పుడు గుడికి ఏం  పట్టుకొని వెళ్ళాలి?”

మా ఆవిడ ముఖము ఎర్రబారిపోయింది.నామీద చాలాకోపం వచ్చినట్లుంది.ఏదో గొణుగుతుంది

తుంపరలు పడుతున్నప్పుడే అడ్డుకోకపోతే తుఫానుగా మారిపోయే ప్రమాదముంది. ఇప్పుడు మౌనముగా ఉంటే తప్పు ఒప్పు కున్నట్లవుతుంది. మగవాడి చేయి కిందపడి పోతే, భవిష్యత్తులో గృహ సామ్రాజ్యాధిపత్యానికి గండిపడే అవకాశముంది జాగ్రత్త సుమానా మనసు నన్నుహెచ్చిరిస్తుంది.

స్వరం పెంచానుఇప్పుడేమైపోయిందని అలా బాధపడిపోతున్నావ్  లక్ష్మి, ఇవాల్టికి ఏదోలాగ పూజ చేసేయ్‌.                     ఏమై పోదులే”                                                                                                                                ఎప్పుడైన నేను గొంతు పెంచితె ఆమె తగ్గిపోతుంది.నిజము చెప్పాలంటె, నాతో వాదించడానికి ఆమెకు ఇష్టం ఉండదు .

కాని ఈసారి వాదించడానికే నిర్ణయించుకొన్నట్లుంది.

దేవుని గురించి అలా మాట్లాడము తప్పనిపించడం లేదా?” ఆమె కూడా గొంతు పెంచింది. పెంచిన గొంతు ఏడుపును అణుచుకుంటుOదని తెలుస్తుంది

ఇప్పుడు నేనేమీ మాట్లాడకపోతే రేపటి నుండి నాపరిస్థితి ఏమిటి?.ఇదే పద్ధతి అలవాటై పోదా? అప్పుడు నేనేమైపోవాలి?. రోజెలాగైనా సరే ,నా భార్యను మాట్లాడనీయకుండా చెయ్యాలి. మరికొంచెము గట్టిగా చెప్పాల్సిందేనా  మగమనసు నాకు  సహకరిస్తుంది.

“ఇంక చాల్లే ఆపు నీ గొణుగుడు . నన్ను  ఇంటిదగ్గర ప్రశాంతంగా ఉండనీయవా, ఊరికే నస పెడుతున్నావుగద్దించాను గాని నాకంతకన్నామాటలేవీ దొరకలేదు,మా ఆవిడిని నోరిప్పకుండా చెయ్యడానికి.

దేవుడు కోసం నాలుగరిటిపళ్ళు, కొబ్బరికాయ తీసుకురావడానికి తీరిక  లేదు గాని, నా నోరు మూయించడానికి మాత్రం రెండు కాళ్ళ మీద లేచిపోతారుమా ఆవిడలో ఇప్పుడు ఏడుపులేదు, ముఖం సీరియస్ గా మారిపోయింది.

నాకూ లోలోపల భయమేస్తుంది.వాదన ఎక్కడకు దారి తీస్తుందోనని. ఎందుకంటె భార్యాభర్తల వాదన అలకలతో ముగుస్తుంది. అలకల పర్వం ముగియడానికి సుమారు నెల రోజులు పడుతుంది. నెల రోజులు యింట్లోనరకము. ఎవరు ముందు మాట్లాడాలన్నది తేల్చుకోలేక నిశ్శబ్దంతో ఇంటి వాతావరణము నిర్వీర్యమైపోతుంది. అదీ నా భయం.

కాని ఇప్పుడు నేనూరుకొని వెనుదిరిగితే, రేపటి నుండి యీ యింట్లో నా మాటకు విలువేముంటుంది? అందుకే ఇవ్వాళ ఎలాగైనా ఈమె నోరు మూయించాలనే  ఇంకా గట్టి నిర్ణయానికొచ్చేసాను నేను. ఆమె మనసును బాగా నొప్పించే మాటను ప్రయోగించడం తప్ప నాకు వేరే మార్గము దొరకలేదు. ఏదో ఉపదేశమిస్తున్నట్లు మాట్లాడడం మొదలుపెట్టాను.

చూడు లక్ష్మీ నేనొక మాటడుగుతాను చెబుతావా?”

మా ఆవిడేమీ మాట్లాడలేదు గాని, ఏదీ చెప్పండి అన్నట్లు నావైపు చూసింది.

నువు చిన్నప్పటి నుండి దేవునికి పూజ చేస్తున్నావు కదా , దేవుడు నీకేమైనా యిచ్చాడా?”

మా ఆవిడ అదోలా చూసింది నావైపు

నా ఉపదేశము కొనసాగిస్తున్నానునీకా చదువూ సంధ్యా లేదు. పెద్ద అందగత్తెవి కావు. పేదరికములో పుట్టావు.

పోనీ నలుగురిలో మాట్లాడడం వచ్చా అంటే అదీ రాదు. ఎప్పటి నుండో నాలో దాక్కున్నద్వేషనిధి, లోపాల జాబితా రూపంలో బయటపడేసాను.

ఎప్పుడూ పూజ పూజఅంటావు గాని దేవుడు నీకేమిచ్చాడో చెప్పు

ఎప్పుడైనా ,నా మాటల్లో కోపం పెరిగినట్లు మా ఆవిడ భావిస్తే, వెంటనే ఏడుచుకుంటూ లోపలికి వెళ్లిపోతుంది .అక్కడకు ఘట్టము ముగిసిపోవడం జరుగుతుంది. కాని సారెందుకో అలా జరగలేదు సరికదా.

మా ఆవిడ పైటకొంగుతో ముఖం తుడుచుకుని, విచిత్రంగా చిరునవ్వు నవ్వడం మొదలుపెట్టింది.

ఈమెకు నా మాటలు వినిపించలేదా? అర్ధంకాలేదా? నా అంచనా ప్రకారం ఏడవాలి కదా, నవ్వుతుందేమిటి?

నాకేమీ అంతుపట్టలేదు. మరోసారి చెబితే బాగుంటుంది అనిపించింది.

చూడు లక్ష్మీ .. నువు దేవునికి ఇన్ని పూజలు చేస్తున్నావు కదా, నీకు దేవుడు ఎప్పుడైనా నీ జీవితంలో ఏదైనా ఇచ్చాడా?” మా ఆవిడ వైపు సూటిగా చూస్తున్నాను, సమాధానం కొరకు ఎదురుచూస్తూ. ఈసారి నా పథకం పారుతుందని నమ్మకం.

ఆశ్చర్యమేమిటంటే మా ఆవిడ ముఖములో ఇప్పుడు  కూడా ఏమాత్రము విషాద చాయలు అలుము కోలేదు. పైపెచ్చు ఆమె ముఖము పున్నమి చంద్రునిలా వెలుగుపోతుంది.

నా ముఖము లోకి చూస్తూ, ప్రశాంతంగాఏమండీ మీరనుకున్నట్టు దేవుడు నాకేమీ అన్యాయం చెయ్యలేదండి. భగవంతుడు నాకన్నీ ఇచ్చాడు. నాపూజలన్నీఫలించాయి కాభట్టే అందం ,చదువు,ధనం,గుణం అన్నీ ఉన్నమిమ్మల్ని నాకు భర్తగా ఇచ్చాడు. మీరు నాకు దేవుడిచ్చిన భ‌ర్త కదండిఅంటూ ఆనంద తాండవం చేస్తున్నట్లు చలాకీగా నడచుకుంటూ మరొక గదిలోకి వెల్లిపోయింది.

ఒక్క క్షణం నిశ్చేష్టడునైపోయాను. అహంకార జ్వోలలును అమృతంతో ఆర్పుతున్నట్టుంది నాకు.

ప్రేమ ,ద్వేషము పోటీ పడి, ద్వేషాన్ని ప్రేమ తరుముతున్నట్టుంది.

మనసు చలించిపోయింది. కను లు చెమ్మగిల్లాయి.

బయటకు బయలుదేరాను, కొబ్బరి కాయ అరటిపళ్ళు తీసుకురావడానికి

 

40. పితృ యజ్ఞం

రచన: కె.వి.సుబ్రహ్మణ్యం

 

విజయ్ తన ఇంటి హాల్లో కూర్చుని ఉన్నాడు. ముందరి వైపుకు ఉన్న బెడ్ రూం గుమ్మంలో తల్లి నిలబడి, కొడుకు మూడ్ ని గ్రహించడానికి ప్రయత్నం చేసి, బాగానే ఉన్నట్లున్నాడని ముందరికి వచ్చింది.

“నాయనా నీతో కొంచెం మాట్లాడాలిరా”

కనపడని విసుగు, కనపడే నవ్వుతో, “వచ్చి కూర్చోమ్మా. అని చెప్పి, బహుశ భార్య అక్కడ దగ్గరలో ఉందేమోనని….వంటింటి గది వైపు చూశాడు. ఆతని ఇబ్బంది గమనించి…

” కోడలిక్కడ లేదులే, పేరంటానికి వెళ్లింది”  తల్లి మాటతో విజయ్ ముఖంలో నిర్భయత్వం తో కూడిన దరహాసం విరిసింది దానిని తల్లి గమనించకపోలేదు. విషయం చెప్పమన్నట్లు తల్లి కేసి చూశాడు.

“మీ నాన్నగారూ నేనూ కాశీకి వెళ్తామనుకుంటున్నాం రా. ఆయనకి ఎప్పటినించో ఆ కోరిక మిగిలి పోయింది.  ఆ విషయం నీకూ తెలుసు. అక్కడ ఒక సత్రం లో శివాజీ అని  నాన్నగారి శిష్యుడొకరు అక్కడే ఉద్యోగమో, సేవ కోసమో ఉంటున్నాడట. కావాలంటే ఓ పదిరోజులుండి వెళ్లచ్చన్నాడు, అక్కడివన్నీ తనే దగ్గరుండి చూపిస్తానన్నాదు. కాబట్టి పది రోజులూ ఆ సత్రంలో భోజనం, ఉండడానికి, అందరితో పాటే మాకూ ఉచితం గానే ఇస్తారుట.  విశ్వనాధుని కోవెల కూడా చాలా చేరువేనని అన్నాడు, అందుకని, దారి ఖర్చు తప్ప ఎక్కువ అవదు. శివాజీ నీకంటే ఒక క్లాసు తక్కువ కూడా, మనింటికి అప్పుడప్పుడు వచ్చి నాన్న గారి వద్ద అనుమానాలు  తీర్చుకునేవాడు, నీకు కూడా గుర్తుండే ఉంటుంది.  మేం కూడా ఈ మాత్రం ఓపిక ఉన్నపుడైనా వెళ్లొచ్చేస్తే ….. ఆయన చిరకాల సంకల్పం నెరవేర్చిన వాడివవుతావు నాయనా ”

” అమ్మా ఈ నెల పిల్లలిద్దరికీ పరీక్ష ఫీజులు కట్టాల్సి ఉంది. అదీ కాక అబ్బాయికి పరీక్షలవగానే వాళ్ల స్కూలు వారు ఏదో  ఎక్స్కర్షన్  కి తీసుకెల్తారని దానికి,  ‘నో’ అనడానికి వీల్లేదనీ బెదిరించాడు కూడా. కొంచెం వెసులుబాటగానే  చూద్దాం అమ్మా”.

“నువ్వు కొంచెం వెసులుబాటు చేసుకో నాయనా…మాదీ పోయే వయసే కానీ వచ్చే వయసుకాదు కదా” మ్లానంగా లోపలికి వెళ్ళిపోయింది.

ఆలోచనల్లో పడ్డాడు విజయ్. శివాజీ తనకి కూడా తెలుసు. బాల్యంలోకోసారి తొంగి చూసుకున్నాడు. తన తల్లిదండ్రులిద్దరూ తనని తమ స్తోమతకి మించే పెంచి పెద్దచేశారు. మరీ గొంతెమ్మ కోరికలు తప్ప అన్నీ తీర్చినట్లే చేశారు. ఇప్పటికీ తాను ఎగువ మధ్యతరగతి లో ఉన్నాడంటే కేవలం తన ఉద్యోగం గొప్పతనం కాదు.  పల్లెలో తండ్రికి ఉన్న అయిదెకరాల మాగాణీ మీద వచ్చే అయివేజు, తండ్రికి వచ్చే పెన్షన్, తన జీతం కలిస్తేనే ఈ రకంగా పిల్లలని ఖరీదయిన కాన్వెంట్ లో చేర్చి చదివించగలుగుతున్నాడు. అమ్మ అడిగిన కోరికలో తప్పేం లేదు. కేవలం నాన్నగారి రెండు నెలల పెన్షన్ పెడితే  అక్కడ ఉచిత వసతి భోజన అవసరం లేకుండానే వెళ్లి వచ్చేయగలరు.  వారి ఆదాయం కూడా ప్రతినెలా తానే అనుభవిస్తున్నాడు. నాన్నగారి చిరకాలంగా తీరని  కోరిక కోసం, అమ్మ తనని అడిగింది. ఎంత చిత్రం!  వారి డబ్బు వారు తమ ఇష్టానుసారం ఖర్చు చేసుకోడం కోసం,  వారి ధనంతో విలాసంగా జీవించే తనని అడిగారు.

జీవితంలో ఒక ఒరవడి ఆదాయానికి అలవాటు పడితే అక్కడనించి వెనక్కి రావడానికి ఏ ఒక్కరికీ ఇష్టం ఉండదు. మానవ జీవితంలో ఎంత అసహజమైన సహజ పరిణామం? ముఖ్యంగా రాజకీయాలలో…ఒకసారి పదవికి అలవాటు పడితే, పార్టీ మారి అయినా పదవి పొందాలనే ధ్యేయం బాగా కనిపిస్తుంటుంది.

చిన్నతనంలో తాను హైస్కూలు లో చదివేటప్పుడు స్కూల్ టూర్ కి వెళ్దామంటే వారి కాశీ ప్రయాణాన్ని వాయిదా వేసుకుని అప్పటికే మంజూరయిన తన సెలవుని క్యాన్సిల్ చేసి తనని  టూర్ కి  పంపించిన సంఘటన గుర్తొచ్చి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ రోజేమో తన కొడుకు టూర్ గురించి చెప్పి వారి కాశీ  ప్రయాణాన్ని వాయిదా వేస్తున్నాడు.  ఇప్పుడు మాత్రం? తన డబ్బడగడం లేదు వాళ్లు…కేవలం అనుమతి కోరుతున్నారు.

తన స్కూల్ టూర్ కోసం  ఒకసారి వాయిదా వేసుకున్నారు వారు తమప్రయాణాన్ని, ఇప్పుడూ అదే కధ, మనుమడి స్కూల్ టూర్ కోసం వాయిదా వేస్తున్నాడు తను. నిజానికి వాళ్లని పంపితే తనకి వచ్చే ’నష్టం’ అంటూ ఏమీ లేదు. తనకి  ఆగిపోయే కార్యాలూ ఏమీ ఉండవు కూడా.  ఇక్కడ తన భార్య,..వాళ్ల పట్ల అయిష్టం గానో, ఇష్టం గానో, వారిని సేవిస్తూనే ఉంది సేవా లోపం లేకుండా.   ఒక మాట అనకుండా, ఒక మాట పడకుండా.  కానీ భార్యనడిగి చెప్పచ్చని, ఎందుకయినా మంచిదనీ, వాయిదా కోరాడు..తల్లిని.  తన సంసారంలో రాబోయే ఉప్పెన ని తప్పించుకోడానికి మాత్రమే.  ఏం? వారంతట వారు…మేం కాశీ యాత్రకి వెళ్తామంటే వెళ్లగలరు కూడా.  తనేంజేయగలడు. మీ ఇష్టం అనుకుని వారడిగిన డబ్బిచ్చి మవునంగా ఉండడం తప్ప?

భార్య సునీత తో ఈ విషయం చర్చించి, ఇద్దరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు స్థూలంగా సునీత నిర్ణయమే అది.  రెండు మూడు నెలలలో పంపిస్తామని, ఈ లోపు త్రీ టైర్ ఏ.సీ. లో టికెట్ రిజర్వేషన్ చేయిస్తాననీ, దానికి ఆమాత్రం గడువు కావాలనీ, తల్లికి  చెప్పాడు. అంతటితో ఊరుకోకుండా “అయినా ఈ విషయం నాన్న గారే అడగవచ్చు గదా ” అని నోరు జారాడు.  “ఏరా చిన్నపుడు నీ కేది కావాలన్నా నువ్వు నన్నే గదా అడిగిందీ, నే వెళ్లి నాన్న గారితో చెప్పడం..నీ కోరిక తీరడం, ఇలాగేగా జరిగిందీ,  నేనడిగితే ఒకటీ ఆయన అడిగితే ఒకటీ నా?  ఆయనే  అడిగితే సమాధానం మా కనుకూలంగా వస్తుందంటే,  ఇప్పుడు మాత్రం ఏం పోయింది, ఆయననే వచ్చి అడగమంటాను” అని ఒక్క ఝలక్ ఇచ్చింది. “అక్కర్లేదు ఏదో మాటవరసకి, పొరపాటున ఆన్నానని క్షమించమ్మా ”  అనేశా. “ఇంత చిన్న దానికి క్షమ దాకా ఎందుకులే. టికెట్ల సంగతేదో చూడు” అంటూ తమ గదిలోకి వెళ్ళిపోయింది. ఈ వాయిదా  నమ్ముకోదగినది కాదని  ఆమెకి అర్థమైంది. తమ డబ్బు తో తమని పంపించవచ్చు గదా అని అందామనుకునే దుస్సాహసానికి ఆమె సంస్కారం అడ్డుపడింది. అయినా కాశీ వెళ్లాలంటే కుమారుది ఆజ్ఞ  కాదు కావలసింది, ఆ కుమారస్వామి తండ్రే అనుమతి ప్రసాదించాలి అని సమాధానపడింది.

ఈ నెల తో అన్ని ఖర్చులూ పూర్తయాయమ్మా, ఇక  నెల జీతం రాగానే మీ టికెట్ల గురించి ప్రయత్నం చేస్తానని ఓ రోజు తల్లితో చెప్పాడు విజయ్. అన్ని ఏర్పాట్లూ పూర్తి అయ్యాక నమ్ముదామని ఆవిడ కూడా విని ఊరుకుంది. ఎక్కువగా సంభాషణ పెంచదలుచుకోలేదు.

అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరుగుతుంటే మనిషికి “ఏదో”.. “ఎక్కడో” ఉంటుంది. అనుకోకుండా ఒక రోజు తన తండ్రికి హఠాత్తుగా గుండె పోటు వచ్చి, హాస్పిటల్ కి తరలించే ఏర్పాట్ల మధ్యలోనే కన్ను మూశారు. జీవిత కాలం తోడుండాల్సిన తోడు,  తప్పేసరికి అమ్మ దుఃఖానికి అంతే లేకుండా పోయింది. జీవన  ప్రయాణాల్లో ఎవరు ముందరో?  ఎవరు  తరువాతో ముందే రాసి ఉంటుంది. కానీ ఆ రాతలు  “పై వాడి” దగ్గరే ఉంటాయి, మన చేతుల్లో, చేతల్లో కాదు. కన్నతల్లి ఊరడిల్లడానికి కొంత సమయం పట్టినా, ఆమెకి తాను ఉన్నానని  నిరూపించుకోడంలో తాను విఫలమయాననే అర్థమైంది విజయ్ కి.  పాపం ఆయన కాశీ వెళ్లాలనే కోరిక అలాగే మిగిలిపోయిందని అమ్మ పిన్నితో అనడం విన్నాడు. విజయ్  దుఃఖం పెరిగి కళ్ల వెంట నీరు వచ్చింది.  తండ్రి పోయినందుకు ఇంకా తేరుకోలేదనే అనుకున్నారు అందరూ చూసి.

నిజానికి వారిని కాశీ పంపించ గలిగినా ఎందుకు వాయిదా వేశాడో తెలియదు. భార్య కారణమా? స్వతంత్రంగా  నిర్ణయం తీసు కోలేకపోవడమా? ఈ ఆదాయం అంతా తనదా? వారిదే కదా?  ఎందుకు ఇలా జరిగిపోయిందో తెలియ లేదు. తండ్రి పట్ల తప్పు చేశాననే భావన నించి తప్పించుకోలేక పోయాడు. దీనికి పరిష్కారం ఏమిటి? ఏం చేసి ఈ మథన నించి తప్పించుకో గలడు? రాత్రంతా నిద్రలేమితో గడిపి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. అది ఎవరికీ తెలియకుండా అమలు పరచాలని నిర్ణయించుకున్నాడు. చివరకి తన భార్యకు కూడా.

పరామర్శకు వచ్చిన బంధు మిత్రులందరూ వెళ్ళిపోయాక, మరో రెండ్రోజులాగి  ఆఫీసుకి చేరుకుని మరో పది రోజులకి సెలవు తీసుకుని ఇంటికి చేరాడు. నాలుగయిదు రోజులు ఆఫీసు పని మీద క్యాంప్ కి వెళ్ళాలని ఇంట్లో అందరికీ చెప్పి చిన్న బ్యాగు తో బయలుదేరి బయటికి వచ్చాడు. అక్కడనించీ స్మశానానికి చేరి తన తండ్రి అస్తికలున్న లాకరు నించి వాటిని తీసుకుని సరాసరి ఏర్ పోర్ట్ కి చేరుకున్నాడు.

 

కాశీలో,  తన తండ్రి శిష్యుడు శివాజీ చిరునామా  తెలుసుకుని విషయం తెలిపాడు. మంచి గురువుని పోగొట్టుకున్నానని బాధ పడి, విజయ్ ని  ఓదార్చాడు. ఆతని ద్వారా తన తండ్రికి చేయవలసిన  కర్మలు శాస్త్రోక్తంగా నిర్వహించి, అస్థికలని గంగమ్మ వడిలో నిమజ్జనం చేశాడు. మనసులో బాధ ఎగతన్నుతుంటే, ఏడుస్తూ… తనని మన్నించాలని, గంగాదేవినీ,  తండ్రిని  దర్శనం కోసం పంపించ లేక పోయినందుకు, విశ్వనాధునీ, క్షమించమని ప్రార్థించాడు… రోదించాడు.

సూర్యాస్తమయం అయే వరకూ గంగానది ఒడ్డునే కూర్చుని తనకు తన తండ్రితో ఉన్న జ్నాపకాలు తవ్వుకుని  తండ్రిని తలచుకుని  తనని మన్నించమని, తన తప్పును క్షమించమనీ మరీ మరీ వేడుకున్నాడు. రోదనం నిశ్శబ్దంగా అనుకున్నాడు గానీ శబ్దం తోనే వచ్చింది. చుట్టుపక్కల వారు ఓ సారి చూసుకుంటూ, మన లోకంలో లేడని తెలిసి వెళ్ళి పోయేవారు.  విజయ్ ని వెతుక్కుంటూ వచ్చి అతన్ని గమనించిన శివాజీ, విజయ్ బుజం మీద చెయ్యి వేసి ఊరడిస్తూ “వ్యక్తులు ఉన్నంతవరకు వారి విలువ తెలియదు ఎవరికీ. వారు దూరం అవగానే గతం తరుముకుని గుర్తుకొచ్చి మధనపడుతూండడం సహజమే.  తరువాత పశ్చాత్తాపమూ అంతే సహజం. కానీ ఈ స్వానుభవం తో నయినా మిగిలి ఉన్న  పెద్ద వారిని  జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండడం ఇప్పుడు నీవు చేయవలసిన తక్షణ కర్తవ్యం.  వారితో రోజూ కొద్ది సేపయినా ప్రేమగా మాట్లాడడం, వారి కష్టసుఖాలు

కనుక్కుంటూండం, వారికి నీవున్నామనే సంగతి వారనుకునేలా చేయగలగడం, నీకు మిగిలిన మానవ ప్రయత్నం. అందుకని నీ తల్లి గారిని ఏ లోటూ లేకుండా… నీ తండ్రి గారి పట్ల నువ్వు చెయ్యలేదనుకున్న సాయం, నీ తల్లిగారికి చేసి కొంతయినా పితౄణం తీర్చుకో విజయ్”  అన్నాడు. కొద్ది సేపటికి నెమ్మదిగా ఆశ్రమానికి ఇద్దరూ కలిసి వెళ్ళారు.

కనీసం ఇప్పుడయినా అమ్మని జాగ్రత్త గా చూసుకోవాలనీ, దానినే ఇకనించి ‘పితృయజ్ఞం’ గా చేస్తూండాలని,  (భార్యని ఒప్పించి, …. అవసరం  అయితే ఎదిరించి అయినా సరే తానుగా అమలుపరచాలని) నిర్ణయం తీసుకున్నాడు.    పెద్దవారి పట్ల అనాప్యాయతలు,  అగౌరవాలు కాశి లోనే వదలిపెట్టి తిరుగు ప్రయాణమయ్యాడు విజయ్ మనస్ఠిమితంగా.

****

39. నాలుగు చక్కెర రేణువులు

రచన: కృష్ణమూర్తి కడయింటి

 

సమయం సాయంత్రం ఐదు గంటలయ్యింది.

చేసే పనిని ప్రక్కన పెట్టి స్నానానికి లేచాను. సంధ్యా దీపం వెలిగించి “సంధ్యా దీప నమోస్తుతే”

అని ఒక నమస్కారం పెట్టుకుని సంధ్యా వందనానికి కూర్చోబోతూ అక్కడే తిరుగాడుతున్న రెండు చీమలను చూసి వాటిని పై పంచెతో దూరంగా

తోసి వేయ బోయాను. మరుక్షణంలో అవి తిరుగాడడంలో ఏదో ఆదుర్దా కనిపించడంతో కొంచెం పరిశీలనగా చూశాను. ఓ చీమ అక్కడ అచేతనంగా పడి ఉంది. దాని చుట్టూనే నేను మొదట చూసిన రెండు చీమలు అదుర్దా పడుతూ తిరుగుతున్నాయి. ఆ పడి ఉన్న చీమ ప్రాణంతో ఉందో లేక ప్రాణాలు కోల్పోయి ఉందో తెలియడం లేదు. వాటిని తోసి వేయాలనే సంకల్పం విరమించి ఆ చీమల అదుర్దాకు హడావిడికి కారణం తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఈలోగా ఆ రెండు చీమలు ఆ అచేతనంగా ఉన్న చీమకు రెండు ప్రక్కలా చేరి ఒకటి నెట్టడానికీ రెండోది లాగడానికీ ప్రయత్నం చేశాయి. వాటి వల్ల కాలేదు. అంతటితో ఆ ప్రయత్నం విరమించాయి.

తిరిగి రెండూ మధ్యకు వచ్చి ఏవో మంతనాలు జరిపాయి. తర్వాత వేగంగా చెరో వైపుకి పరుగులు తీశాయి. అవి అలా వెళ్ళగానే నేను కూడా అంతే వేగంగా వెళ్ళి నా సులోచనాలు తెచ్చుకున్నాను. ఇప్పుడు పరిశీలనగా చూస్తే ఆ అచేతనంగా ఉన్నచీమ ముందు కాళ్ళు కాస్త కదలడం గమనించాను. అంటే ప్రాణంతో ఉందన్నమాట. ఈ చీమ ఏ కారణం చేతనో గాయ పడడమో లేదా అనారోగ్యానికి గురి కావడమో జరిగిందనీ, అది చూసిన ఆ రెండు చీమలూ ఈ చీమకు సాయం చేసే ప్రయత్నంలో ఉన్నయనీ గ్రహించాను.

ఈ లోగా ఎడమ వైపు వెళ్ళిన చీమ దారిలో కనిపించిన చీమల కేదో చెప్పడం ఆ విన్న చీమలు పరుగున వచ్చి ఆ అచేతనం గావున్న చీమను పరిశీలనగా చూడడం జరుగుతోంది. నేను గమనించలేదుగానీ కుడి వైపు వెళ్ళిన చీమ కూడా అదేపని చేస్తూ ఉంది. వీలయినన్ని చీమలకు సమాచారం తెలియజేసి దానికి తగిన వైద్యం చేయించాలని అవి పడే ఆదుర్దా నాకు కొంచెం ఆశ్చర్యమూ, ఏం జరుగుతుందో చూద్దామన్న ఆసక్తీ కలిగాయి.

పనిలో పనిగా ఆ చీమలకు నామకరణాలు చేసేసింది నామనసు. ఆ అచేతనం గా ఉన్న చీమకు ‘యమపోరి’ అని పేరు బెట్టింది. తర్వాత మొదటి రెండు చీమలలో ఎడమవైపు వెళ్ళిన దానికి కరుణ అనీ రెండో దానికి కారుణ్య అనీ పేర్లు ఖాయం చేసేసింది. నేనూ బాగున్నాయి అని కితాబిచ్చాను. ఈ కరుణ, కారుణ్యలను కలుసుకున్న చీమలన్నీ హడావిడిగా వచ్చి ఆ యమపోరిని పరిశీలనగా చూడడమూ వాటిలో అవి చర్చించుకోవడమూ ఎవరో తరుము కొస్తున్నట్లు వెళ్ళి పోవడమూ చేస్తున్నాయి. ఓ రెండు చీమలు మాత్రం మహా గంభీరంగా చర్చించుకోవడం కనిపించింది. ఈ సందడిలో నా తలలోకి ఓ ఆలోచన వచ్చింది. పాపం అవి అలా తిరగడం ఆహారానికై అయి ఉంటుందేమో అని. వెంటనే ఆ చీమలు కొంచెం దూరంగా జరగడం చూసి నా చేతికి అందు బాటులో ఉన్న చక్కెర సీసా మూత తీసి నాలుగైదు రేణువులు వాటికి దగ్గరగా వేశాను. నా కళ్లు మెఱిసాయి. నా ఆలోచన నిజమే లాగుంది. అవి ఆ చక్కెర రేణువుల్ని గమనించాయి. వెంటనే ఓ రేణువును తరలించడానికి ప్రయత్నించాయి. వాటి వల్ల కాలేదు. నా తల మళ్లీ పని జేసింది. ఆ చీమలు దూరం వెళ్లడం గమనించి నా గోటితో ఆ చక్కెర రేణువుల్ని చిదిమాను. అన్నట్లు ఆ రెండు చీమలకు అన్నపూర్ణ అనీ విశాలాక్షి అనీ నేను పేర్లు పెట్టాను. అన్నపూర్ణ ఆ చిదిమిన చక్కెరను చూసి విశాలాక్షిని తీసుకొచ్చి చూపించింది. తర్వాత అవి వాదులాడుకున్నాయి. తర్వాత విశాలాక్షి మరో చక్కెర అణువు దగ్గరకెళ్ళి చూసి తర్వాత అన్నపూర్ణకు చూపించి ఏదో నచ్చ జెప్పినట్లు నాకు తోచింది. తర్వాత విశాలాక్షి అన్నపూర్ణకు ఏదో సలహా ఇస్తున్నట్లుగా కూడా నాకు అనిపించింది.

అన్నపూర్ణ ఆ సలహాకు అంగీకారం తెలిపి పనిలోకి దిగింది. ఆ రెండో చిదిమిన చక్కెర నుంచి ఒక్కొక్క చిన్న రేణువును తీసుకెళ్ళి యమపోరి నోటికి అందించసాగింది అన్నపూర్ణ. ఈలోగా విశాలాక్షి మరొక చీమకు కూడా ఇదే పని పురమాయించింది. అది కూడా ఒక్కొక్క చక్కెర అణువును తీసుకెళ్ళడం యమపోరికి అందించడం చేయసాగింది. అవి మొదటి చక్కెర రేణువు(చిదిమిన) దగ్గరకు వెళ్ళడం లేదు. కారణం ఏమయి ఉంటుందా అని ఆలోచించాను. అవి వాదులాడుకోవడం లోని కదలికలు నాకు ఇలా తోచాయి. ఈ రేణువును ఎవరో మనం తరలించడానికి ప్రయత్నం చేసిన తర్వాత చిదిమారు. వారికి ఏమయినా దురుద్దేశ్యం ఉందేమో? లేదా ఏమయినా కలిపారేమో అన్న సందేహం వెలిబుచ్చింది విశాలాక్షి. అన్నపూర్ణ అందుకు అంగీకరించక పోయినా ఎందుకు అనుమానంతో ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం అనుకొని, విశాలాక్షి మరో మార్గం (చిదిమిన చక్కెర) చూపిస్తానంటోందిగా అక్కడికే వెళ్లడమే మంచిది అని ఆమె అభిప్రాయానికి విలువనిచ్చి అనుమానం లేని ఆహారాన్ని యమపోరికి అందించడానికి పూనుకుంది.

నా అవగాహన సరైనదే అన్నదానికి ఋజువుగా మొదటి చక్కెర రేణువుల దగ్గరకు మరే చీమా వెళ్ళలేదు.

యమపోరికి ఆహార సమస్య కొంతవరకు తీరింది. నేను గమనించిన ఇంకో విషయం ఏమిటంటే అక్కడ మూడు నాలుగు చోట్ల చిదిమిన చక్కెర ఉన్నా విశాలాక్షి చూపిన చక్కెరనే అవి తీసుకుని వెళ్తున్నాయి. మిగతా చోట్లను అవి వచ్చి ఓ సారి వాసన చూచి వెళ్లాయే గానీ వాటి చుట్టూ మూగలేదు. ఈలోగా కరుణ, కారుణ్య చెరి రెండు మొత్తం నాలుగు చీమలను వెంటబెట్టుకుని వచ్చాయి. అవి వచ్చి యమపోరిని చాలా జాగ్రత్తగా పరిశీలించాయి. తమలో మంతనాలు జరుపుకున్నాయి. అవుననీ కాదనీ కావచ్చు అనీ వాదులాడుకుని ఏకాభిప్రాయానికి వచ్చే ముందు  విశాలాక్షిని ఏమిటేమిటో వివరాలడిగాయి. వారడిగిన వివరాలు వారికి తెలియజేసి తర్వాత అందులో రెండు చీమలను తీసుకుని వచ్చి అన్నపూర్ణ మరో చీమ తో కలిసి చేసే పనిని చూపించింది. అవి కూడా ఆ చిదిమిన చక్కెర ను పరీక్షించాయి. తిరిగి వెళ్ళి వాటితో కూడా వచ్చిన చీమలకు తాము చూసి వచ్చిన  విషయాన్ని వివరించాయి. చర్చించుకున్నాయి. మళ్ళీ యమపోరి దగ్గరకు వెళ్ళి విశాలాక్షికీ కరుణకూ, కారుణ్యకూ ఏవో సలహాలిచ్చాయి. ఆ సలహాలు విన్న వెంటనే కరుణ కారుణ్య ఎక్కడికో పరుగులు తీశారు. విశాలాక్షి మరో చీమ కలిసి యమపోరితో ఏదో చెప్పడమో అడగడమో చేస్తున్నారు. నాకు అవగతం కాలేదు గానీ ఆ మాటలు వింటున్నప్పుడు యమపోరి తన కదులుతున్న ముందు కాళ్ళను మరింత వేగంగా కదిలించడం గమనించాను. విశాలాక్షి తర్వాత యమపోరిని ఏదో బ్రతిమలాడుతున్నట్లుగానూ,  ‘చెబితే వినిపించుకోదూ’ అని మరో చీమతో చెబుతున్నట్లుగా నాకు అనిపించింది. నేనేమయినా కల్పించుకుని సాయం చేద్దామా అంటే నాకు చీమల భాష రాదాయె. ఒక వేళ వాటికేమయినా నా భాష వస్తుందేమో అన్నసందేహం వచ్చి ఏదో అనబోయాను. మళ్ళీ నా తల పని చేసింది. నా భాష అర్థం అయినా కాకపోయినా నోరు తెరిచి మాట్లాడితే వచ్చే గాలికో తుంపర్లకో వాటి పనికి అంతరాయం కలిగితే పాపం ఆ యమపోరికి సాయానికి బదులు మరింత హాని చేసినట్లవు తుందని అనిపించి ఆ ప్రయత్నం మానుకున్నాను.

ఈలోగా కారుణ్య వచ్చింది. అప్పుడు విశాలాక్షి ఆమెతో యమపోరి  ఆ వచ్చిన వారు చెప్పినది కాదంటున్నాదనీ బ్రతిమలాడినా ససేమిరా అంటున్నదనీ చెప్పింది. ఈ మాటలు విన్న యమపోరి కారుణ్యను పిలిచింది. కారుణ్య వెళ్ళి యమపోరి చెప్పింది విని విశాలాక్షితో “ఈమె ఏమంటున్నాదంటే ఇంతకుముందు ఇదే అనారోగ్యం వస్తే ఆ వైద్యం వికటించిందనీ మళ్లీ ఎవరో వేరే వాళ్లు వచ్చి క్రొత్త మందులిచ్చారనీ అప్పుడు బాగయిందనీ చెబుతున్నాది” అని సర్ది చెప్పింది. విశాలాక్షి కూడా అందుకు సమ్మతించింది. ముందు వైద్యం పట్ల రోగికి నమ్మకం కలగాలి గదా అనుకుంది. అప్పుడు కరుణ వచ్చి విశాలాక్షిని దూరంగా పిలిచి యమపోరికి వినిపించకుండా వైద్యాలయానికి వెళ్ళి వచ్చాననీ వారు వెంటనే రోగిని తీసుకుని రమ్మన్నారనీ చెప్పింది. కానీ ఎలా తీసుకుని వెళ్లడం అనే విషయం పైన తర్జన భర్జనలు గావించాయి. అప్పుడు విశాలాక్షి “ఇప్పుడే వస్తానుండండి” అని కరుణకూ కారుణ్యకూ చెప్పి ఏదో ఆలోచిస్తూ బయలుదేరింది. కొంచెం దూరం వెళ్ళి ఎవరో ఎదురొస్తే వారినేదో అడిగింది. వారి పేరు సహాయం అని పెట్టాను నేను. ఆ సహాయం వచ్చి యమపోరిని చూసి తల పంకించి కరుణతో కాసేపు మంతనాలాడి విశాలాక్షికి ఒక్క నిమిషంలో వస్తాను అనిచెప్పి వేగంగా వెళ్ళి పోయాడు. అలా వెళ్ళిన సహాయం మరో చీమను వెంట బెట్టుకుని వచ్చాడు. ఆ వచ్చిన వాడు యమపోరిని రెండు ప్రదక్షిణలు చేసి చూసి కారుణ్యతో ఏదో ఖరాఖండిగా చెప్పాడు. వాడి పేరు పాదరసం అని చెప్పారు వారు. ఆ పాదరసం ఖరాఖండిగా చెప్పినది ఈ యమపోరిని వైద్యాలయానికీ తీసుకుని వెళ్ళవలసినదే కానీ ఇక్కడ వైద్యం కుదరదు, ఆలస్యం అసలు కుదరదు అన్నట్లుగా నాకు అర్థం అయ్యింది. కావలిస్తే నేను వీపు మీద మోసుకెళ్ళడానికి సిద్ధం అని కూడా చెప్పినట్లు నాకు తోచింది.

తర్వాత విశాలాక్షీ కారుణ్య కరుణ అన్నపూర్ణ నలుగురూ తలలు చేర్చి చర్చించారు. ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత కారుణ్య ఆ కొత్త చీమ పాదరసాన్ని వెంట బెట్టుకుని ఎక్కడికో వెళ్ళి తిరిగి తీసుకుని వచ్చింది. ఈ లోగా సహాయం మరో వస్తాదు లాంటి చీమను పిల్చుకొచ్చాడు. వాడు కాస్త గంభీరంగా ఉన్నట్లు అనిపించింది నాకు. సహాయం ఆ వస్తాదుతో చేయవలసిన పని వివరించాడు. జాగ్రత్తగా చేయాలి సుమా అని హెచ్చరించాడు. అన్నింటికీ వాడు తమ ఆజ్ఞ అన్నట్లు తల పైకీ క్రిందికీ ఊపాడు. తర్వాత ఆ వస్తాదు తన నైపుణ్యం అంతా చూపిస్తూ యమపోరికి ఏ మాత్రం బాధ కలగని రీతిలో పైకి లేవదీసి పాదరసం వీపు మీద జాగ్రత్తగా పడుకో బెట్టాడు. సహాయం కరుణా కారుణ్య అతనికి సాయం చేశారు.   అంతా అయింతర్వాత బొటన వ్రేలు ఎత్తి ఆడించాడు వస్తాదు. అంతే, పాదరసం విడిచిన బాణంలా ఇంతకు మునుపు కారుణ్య చూపించిన చోటికి పరుగులు తీశాడు. ఆ వేగాన్ని నా కళ్లు అందుకోలేక పోయాయి. అన్నపూర్ణా విశాలాక్షీ, కరుణా, కారుణ్యా అంతా తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు. అన్నపూర్ణ విశాలాక్షిలు తమ ఒప్పందం మేరకు సహాయానికీ, వస్తాదుకీ చిదిమిన చక్కెర లను అప్పగించారు. పాదరసం సంగతి తాము చూసుకుంటామని వస్తాదూ సహాయం చెప్పారు . కరుణా కారుణ్యా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అన్నపూర్ణా విశాలాక్షీ వచ్చి కరుణా కారుణ్యల వీపులు తట్టారు. యమపోరికి మంచి వైద్యం అందుతుందనీ ప్రక్కరోజుకి మనలాగే తిరుగుతుందనీ భరోసా యిచ్చారు. కరుణ కారుణ్యల కళ్లు తడి అయ్యాయి. వారిని సాగనంపి యమపోరి అప్పటి వరకూ పడుకుని ఉన్న స్థలాన్ని ఇద్దరూ కలిసి శుభ్రం చేసి వెళ్తూ వెళ్తూ సహాయానికీ వస్తాదుకూ చేతులూపి యమపోరి దగ్గరకు బయలుదేరారు.

ఆచమనం దగ్గరే ఆగిపోయిన నా సంధ్యా వందనాన్ని కొనసాగించాను. కొనసాగిస్తూ ఆలోచించాను. అనారోగ్యమో, ప్రమాదమో, ఒక గాయపడిన చీమను అదుకోవడానికి అల్ప జీవులని మనం భావించే చీమలు ఎంత ఆదుర్దా పడ్డాయి. ఎవరికి తోచిన సాయం వారు చేసి ఆ చీమను కాపాడాయి. కేవలం కాపాడడం కాదు, అవి పడిన ఆందోళన ఆదుర్దా  అవి చేసిన చర్చలూ విషయ సేకరణా ఆలోచనలూ గమనిస్తే మనం ఎందుకు బ్రదికి ఉన్నట్టు? అన్న అనుమానం రావట్లేదూ.  తీపి ఇష్ట పడే చీమలు తమచుట్టూ పడి ఉన్న చక్కెర రేణువులను కూడా పట్టించుకోలేదు. తమకు సాయం చేసిన సహాయానికీ వస్తాదుకూ ఆ చక్కెర రేణువుల్ని అప్పగించాయి. ఈ కార్యక్రమంలో అన్నీ కలిసి పది పదిహేను చీమలయినా పాలు పంచుకున్నాయి. నిస్వార్థంగా.

అప్పుడు నా తల కాస్త పైకి లేచింది. ఆ సాయంలో నా పాలు కూడా ఉందిగా. అవును ఉంది. “నాలుగు చక్కెర రేణువులు”.

ఈ ఆలోచనతో నా సంధ్యా వందనం తృప్తిగా ముగించి యమపోరి ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఓ పాతిక సార్లు గాయత్రీ మంత్రం జపించి లేచాను.

ఇంతకూ ఆ యమపోరికి కరుణ, కారుణ్య, విశాలాక్షి, అన్నపూర్ణలు బంధువులా, తెలిసినవాళ్ళా, స్నేహితులా కనీసం “వాళ్ల” వాళ్లా?

ఏమో?? ఆ ఆరాలన్నీ ‘మనుషు’ లమైన  మనకు గదా!!!!

స్వస్తి.

 

**********oOo************

 

38. తోడు

రచన: బి.వి. శివప్రసాద్

 

స్నిగ్ధకంతా అయోమయంగా ఉంది. నాయనమ్మ చనిపోయి రెండు వారాలైనా ఆ అమ్మాయికి దుఖ్ఖమాగడంలేదు. ఒకటా రెండా పన్నెండు సంవత్సరాల అనుబంధం. ప్రతి మనిషి చనిపోవాలని, కొందరు ముందు, కొందరు వెనుక, చివరకందరూ తమకైన వాళ్ళకు, కొందరు కానివాళ్ళకు గుడ్ బై చెప్పవలసిందేనని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా, నాన్నల ద్వారా కొంత మటుకు, మరికొంత సినిమాలు, టీవీ, ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంది. కానీ ఆ చేదు వాస్తవం తనకు ప్రియాతి ప్రియమైన నాయనమ్మ విషయంలో ఎదురవ్వడంతో ఆ లేత మనసు తట్టుకోలేక పోతూ ఉంది.

చివరికి బాల్కనీలో, అపార్ట్మెంట్ బయటా ఉంచిన పూలు, ఆకు కూరలు, తులసీ మొక్కలు ఉన్న కుండీలు అన్నీ పెద్దామె స్పర్శ కోసం తహ తహలాడుతున్నాయి. ఓపిక చేసుకుని ప్రతిరోజూ ఉదయమో, సాయంత్రమో అన్నీ మొక్కల తొట్లలో నీరు పోసేది. కొన్ని కుండీలలో మట్టి మార్చేది. బంతి, చేమంతి, గులాబి పూలు కూడా ఆమె చేయి తగిలితే పులకరించి నోళ్ళు విప్పి మనసారా నవ్వుతున్నట్లుండేది. ఆమె తుది శ్వాస విడిచిందగ్గర్నుంచి, మొక్కలు శ్వాసించడం మానేసి జీవకళ కోల్పోయి మోడుబారిపోయాయి.

#

ఆ రోజు మామూలుగా తెల్లవారలేదు. ప్రతి దినమూ స్నిగ్ధకంటే ముందే లేచి పూజకోసం పువ్వులు కోసుకోవడానికి అపార్ట్మెంట్ సెల్లార్లో కెళ్ళే నాయనమ్మ ఇంకా తన పక్కన పడుకునే ఉంది. సమయం ఆరున్నరయ్యింది. “నాయనమ్మా లే” అంటూ స్నిగ్ధ పిలిచింది. ఎప్పుడైనా ఒంట్లో బాగులేని రోజు నిస్త్రాణగా పెద్దామె పెందలకడే లేవకుండా పడుకుండిపోతుంది. ఆమెకు జ్వరమొచ్చిందేమోనని స్నిగ్ధ ఆమె మెడ కింద చెయ్యి పెట్టి చూసింది. ఐతే ఆమె ఒళ్ళు చల్లగా తగిలింది. “నాయనమ్మా లే” అంటూ పెద్దామెను అటూ ఇటూ ఊపింది. ఆమె అమాంతం నేలమీద పడింది. ఆ అమ్మాయికి పెద్ద అనుమానమే వచ్చింది. “అమ్మా” అని అరుస్తూ కిచెన్ వేపుకు పరుగెట్టింది. అరుణ అప్పటికే లేచి వంట పనులు ప్రారంభించింది.

అరుణ, ఆనంద్(స్నిగ్ధ వాళ్ళ నాన్న) ఆఫీసులకు, స్నిగ్ధ స్కూలుకు వెళ్ళాలి కాబట్టి ఆమె ఉదయం అల్పాహారం తయారు చెయ్యడం, ముగ్గురికీ లంచ్ బాక్స్ లు సర్దడంతో సతమతమౌతూ ఉంటుంది. పెద్దామె మామూలుగా ఐతే తను పూలు కోసుకొచ్చింతర్వాత, వంట పనిలో అరుణకు సహాయపడుతూ ఉంటుంది. ఆరోజు ఆమెకు అలసటగా ఉందేమోనని అరుణ అనుకుంది. కానీ స్నిగ్ధ అరుచుకుంటూ రావడంతో ఏదో తేడా ఉన్నట్లు ఆమెకర్ధమయ్యింది.

“ఏమయ్యిందో చూద్దాం పద” అంటూ బెడ్రూంలోకి వడివడిగా వెళ్ళింది. నేల మీద పడి ఉన్న పెద్దామెను చూడగానే అనుమానం వచ్చి ఆనంద్ తో “ఏమండీ ఒక్క సారి థర్డ్ ఫ్లోర్లో ఉన్న డాక్టర్ గారిని పిలుచుకొస్తారా?” అంది. ఆనంద్ అప్పుడే బాల్కనీలో మొక్కలకు నీళ్ళు పోసి లోపలికొచ్చాడు. అమ్మకేదో అయ్యిందన్న విషయం అర్ధమై వెంటనే డాక్టర్ గారి కోసం పరుగెట్టాడు. ఈలోపల అరుణ అత్తగారిని తట్టి లేపడానికి ప్రయత్నించింది. శరీరం చల్లగా తగిలింది. ముక్కు దగ్గర వేలు పెట్టి చూసింది. శ్వాస ఆడుతూ ఉందో లేదో నిర్ధారణ కాలేదు. వెంటనే గుండె దగ్గర చెయ్యి పెట్టి అది కొట్టుకుంటూ ఉందో లేదో చూసింది. అంతలో డాక్టర్ శ్రీనివాస్ వచ్చారు. స్టెత్ తో పరీక్షించి “ఆంటీ చనిపోయారు. మూడు, నాలుగు గంటల క్రితం మాసివ్ హార్ట్ అటాక్ వచ్చినట్లుంది” అన్నాడాయన.

“హాస్పిటల్ కు తీసుకు వెళితే ఏమైనా చెయ్యగలరా సార్?” ఆనంద్ ఆదుర్దాగా అడిగాడు. “ఐ డోంట్ థింక్ దేర్ విల్బి ఎనీ యూజ్. ఇట్సాల్ ఓవర్ ఆనంద్ గారూ” ఒకింత బాధగా అన్నడతను. ఆ ఇంట్లో దుఖ్ఖం వరదలా పొంగింది. కావలసిన వాళ్ళు, రావలసిన వాళ్ళు వచ్చారు. జరగవలసిన కార్యక్రమాలు పూర్తయ్యాయి.

#

ఆనంద్, అరుణ పెద్ద వాళ్ళు కాబట్టి దుఖ్ఖాన్ని లోలోపలే దిగమింగుకుంటున్నారు. స్నిగ్ధ అలా చెయ్యలేక పోతూ ఉంది. రోజూ ఉదయం తను లేచి బాత్రూంకెళ్ళి రాగానే అమ్మ తనకు పాలు కలిపి ఇస్తుంది. సగం కప్పు పూర్తవ్వంగానే “నాయనమ్మా ఇంకా ఎంతసేపు? నాకు టైమవుతోంది జడెయ్యాలి తొందరగా రా” అంటూ అరుస్తుంది. ఆమె

“కొద్దిసేపాగమ్మా. మీ అమ్మకు ఈ బెండకాయలు తరిగిచ్చి వస్తాను” అంటే స్నిగ్ధ వెంటనే ఏడుపు లంకించుకునేది. ఆ అమ్మాయికి తను పాలు తాగీతాగంగానే తనకు జడవేసే కార్యక్రమం మొదలవ్వాలి. లేదంటే చాలా ఆలస్యమై పోయిందని ఏడవడం మొదలెడుతుంది. అరుణ అసలే పని హడావిడిలో ఉండడం వల్ల గట్టిగా అరుస్తుంది. చిన్న పిల్ల కొంచెంసేపయ్యాక కుయ్యిమనడం ఆపుతుంది. స్నానం చేసింతర్వాత స్నిగ్ధ టిఫిన్ కార్యక్రమం పూర్తవుతుంది. వెంటనే నాయనమ్మా, మనవరాలు ఒకరినొకరు తొందర పెట్టుకుంటూ అపార్ట్మెంట్ కిందకు లిఫ్ట్లో దిగుతారు. పెద్దామె పిల్లను స్కూల్ బస్సెక్కించి ఇంటికి తిరిగి వస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం నాల్గింటికి స్కూల్ బస్సులోంచి స్నిగ్ధను దింపుకుని ఇంట్లో ఆ అమ్మాయికి కొసరి, కసిరి భోజనం తినిపిస్తుంది.

స్నిగ్ధకిదంతా విసుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఆ అమ్మాయికి పెరుగన్నం తినటమంటే ఇష్తం లేదు. పిల్ల తినదు. పెద్దామె వదలదు. “నాకొద్దు. పెరుగన్నం వాసనంటే అసహ్యం” అంటుంది స్నిగ్ధ. “కడుపులో చల్లగా ఉండాలంటే తిని తీరాల్సిందే” పెద్దామె మంకు పట్టు పడుతుంది. అలా వాళ్ళిద్దరూ టాం అండ్ జెర్రీలా, అత్తా, కోడళ్ళలా, పాత సినిమాల్లోని సూర్యకాంతం, చాయాదేవిలా పోట్లాడుకునే వారు. అన్నం తినడం, తినిపించడం అనేది ఒక రచ్చతో కూడిన ప్రహసనంలా ఉండేది. దాని ప్రభావంతో అది పూర్తయ్యాక గంట, గంటన్నర వరకు వాళ్ళిద్దరి మధ్యన మాటలుండేవి కాదు. తర్వాత మళ్ళీ మామూలే. రాత్రయ్యిందంటే చాలు స్నిగ్ధ ఆమె పొట్టలో దూరి “కధ చెప్పు” అంటూ ఆమెను శాశించేది.

“సరే విను. సీతాదేవిని రావణుడెత్తుకెళ్ళింతర్వాత ఆమె అశోక వనంలో దిగులుగా రాముణ్ణి తలుచుకుంటూ ఉండేది. ఎప్పుడు ఆయనొచ్చి తనను కాపాడుతాడా అని ఆత్రంగా ఎదురు చూసేది. అలా చాలా రోజులు గడిచిన తర్వాత హనుమంతుడు లంకకు వచ్చాడు. సీతాదేవి దగ్గరకు వచ్చి ఆమెకు చూడామణిని ఇచ్చి, ధైర్యం చెప్పి, తర్వాత లంకా దహనం చేశాడు” అంటూ వర్ణించి రామాయణం, మహాభారతం, భాగవతం పిట్ట కధలుగా చెప్పేది. వింటూ వింటూ, ఊ కొడుతూ స్నిగ్ధ మధ్యలోనే బుల్లి గురకలు పెడుతూ నిద్రపోయేది.

ఇప్పుడు మాట్లాడడానికెవరూ లేరు. మరీ ముఖ్యంగా తనతో పోట్లాడటానికి సమఉజ్జీ అసలే లేదు. స్నిగ్ధ అమ్మా, నాన్నలిద్దరూ ఉద్యోగస్తులు కావడం వల్ల వాళ్ళతో తను గడిపే సమయం తక్కువ. ఆ అమ్మాయికి నాయనమ్మా, స్నేహితురాలు, శత్రువు అన్నీ పెద్దామే. ఆమె బతికున్నప్పుడు స్నిగ్ధకి ‘తోడు’ విలువ తెలియలేదు. ఇప్పుడు పెద్దామె లేని లోటు స్పష్టంగా తెలుస్తూ ఉంది. గతంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన ఆమెకు జ్ఞాపకానికొచ్చింది.

ఒక రోజు స్నిగ్ధతో తన క్లాస్మేట్ హరిణి “నేను కొత్తగూడెంలో జరిగే బాలోత్సవ్ కు వెళుతున్నాను. మా అమ్మా, నాన్నలు నాతో వస్తున్నారు” అంది. “అక్కడేం జరుగుతుంది?” స్నిగ్ధ. “లలిత కళల్లో చాలా పోటీలుంటాయట. మంచి బహుమతులిస్తారు. నేను సింగింగ్, డాన్స్ లో పాల్గొనబోతున్నాను” అంది. అది విన్న స్నిగ్ధ ఒక రకమైన ఉద్విగ్నతకు లోనయ్యింది. ఆరోజు సాయంత్రం ఆనంద్ తో “నాన్నా నేను కూడా బాలోత్సవ్లో పాల్గొంటాను” అంది. “ఆ టైంలో నాకు ఆఫీసు పనులుంటాయమ్మా. మనం వెళ్ళ లేక పోవచ్చు” అన్నాడు. “నాకదంతా తెలీదు. ఎలాగైనా నేను పాల్గొనాలి” మారాం చేసింది స్నిగ్ధ. ఆనంద్ సరేనని బాలోత్సవ్ తాలూకు దరఖాస్తు పూర్తి చేసి పంపించాడు. బాలోత్సవ్ రానే వచ్చింది. ఆనంద్, అరుణ ఇద్దరికీ తమ ఆఫీసుల్లో మీటింగులు, పనులు అడ్డం వచ్చాయి.

అప్పుడు పెద్దామె రంగంలోకి దిగింది. ఆ సమయంలో ఆమెకు కొంచెం నలతగా కూడా ఉంది. ఐనా “నానీ నువ్వేం బాధ పడకు. నిన్ను నేను తీసుకెళతాను. నువ్వు ప్రాక్టీసు మీద దృష్టి పెట్టు” అని అంతులేని భరోసా ఇచ్చింది. అన్నట్లుగా ఆ రోజు బస్టాండుకు స్నిగ్ధను తీసుకుని బయలుదేరింది. ఇక కొత్తగూడెంలో అన్నీ తానే అయ్యి స్నిగ్ధను సంతోషంగా వివిధ పోటీల్లో పాల్గొనేలా చేసింది. ఇప్పుడు స్నిగ్ధకు ఆ విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి. కూతురు పడుతున్న బాధ చాలా ఎక్కువగా ఉంది. ఆనంద్ కేం చెయ్యాలో పాలు పోవటం లేదు.

#

స్నిగ్ధ  పరిస్థితి అలా ఉంటే ఆనంద్ స్థితి అంతకంటే దారుణంగా ఉంది. తనకు చిన్నప్పుడే నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. ఇల్లు చుక్కాని లేని నావలా తయారయ్యింది. కొన్ని నెలలు అన్నిరకాలుగా ఇబ్బంది పడ్డ తర్వాత అమ్మకి కంపాషనేట్ గ్రౌండ్స్ లో డిపార్ట్మెంట్లో ఉద్యోగంవచ్చింది. దగ్గరి బంధువులు కొంతమంది

“పిల్లవాడు చిన్న వాడు. నువ్వు వయసులో ఉన్నావ్. మళ్ళీ పెళ్ళి చేసుకుంటే మీ ఇద్దరి జీవితం సాఫీగా సాగిపోతుంది” అన్నారు. అనడంతో ఆగక రెండేళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధితో భార్యను పోగొట్టుకున్న శ్రీనివాసరావ్ అనే దూరపు బంధువు సంబంధం కూడా తెచ్చారు. అందుకు ఆమె

“వద్దండి, నేనిప్పుడు హాయిగానే ఉన్నాను. ఆయన వల్ల వచ్చిన ఉద్యోగం ఎలాగూ ఉంది. తన జ్ఞాపకాల్తోటి బతుకుతూ ఆనంద్ ను పెంచుకోగలననే నమ్మకముంది. నాకేదైనా అవసరమైతే మిమ్మల్ని తప్పకుండా అడుగుతాను” అని ధీమాగా అంది. అనడమే కాదు. ఆనంద్ కు అన్నీ తానై, అతనికి నాన్న లేని లోటు తెలియనీయక కావలసినవన్నీ సమకూర్చిపెట్టింది. ఆనంద్ కింకా గుర్తుంది. చిన్నప్పుడు తనతో ఆటలాడుతూ, సబ్జెక్ట్స్లో తనకి తెలియని విషయాలు ఒక స్నేహపాత్రమైన ఉపాధ్యాయురాలిలా బోధిస్తూ(ట్యూషన్ల జోలికి పోక), తననప్పుడప్పుడూ మంచి సినిమాలకు తీసుకెళుతూ, ఒక స్నేహితునిలా పెంచింది. తను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఝాన్సీ లక్ష్మిలా ధైర్య సాహసాలు ప్రదర్శించింది. తనని సీనియర్లు రాగింగ్ చేస్తున్నారు. తను పైకి చెప్పుకోలేని చిత్రహింసననుభవించాడు. కళాశాల యాజమాన్యం పెద్దగా పట్టించుకోలేదు. ఒక దశలో సీనియర్ల పైశాచిక ప్రవర్తన వల్ల విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. అమ్మ తన అంతులేని ఆవేదనను పసిగట్టింది. కళాశాల వాళ్ళతో

“మా ఆనంద్ మీ కళాశాలలో రాగింగ్ వల్ల చాలా నలిగిపోతున్నాడండి. పరిస్థితి చెయ్యిదాటక ముందే మీరు తక్షణ చర్య తీసుకోవాలి” అంది. ప్రిన్సిపల్

“రాగింగ్ అనేది ప్రొఫెషనల్ కాలేజీల్లో కామన్ అండి. దాన్ని ఈజీగా తీసుకోవాలి” అన్నాడు.

“ఇది ఈజీగా తీసుకునే విషయం కాదండీ. సీనియర్లు ఆనంద్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మొన్న నగ్నంగా అతన్ని గ్రౌండ్ చుట్టూ పరుగెత్తించారట. ఇంకా పైకి చెప్పుకోలేనివి చాలా జరుగుతున్నాయి. రేపేదైనా జరగరానిది జరిగితే మీరేం చేస్తారు?” అని ఘాటుగా, గట్టిగా వాదించింది. యాజమాన్యం విచారణ చేసి తప్పు చేసిన సీనియర్లను కాలేజీ నుంచి కొన్ని రోజులు సస్పెండ్ చేసింది. అందు వల్ల ఆనందే కాక మిగతా జూనియర్లందరూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడే కాదు తనకు ప్రతి సందర్భంలో ఆసరా ఇస్తూనే ఉంది. తన అన్ని విజయాలకు, సంతోషానికీ ముఖ్య కారణం ఆమే.

అరుణకు కూడా అత్తయ్యతో అనుబంధం గాఢమైనదే. ఆనంద్ తో పెళ్ళయ్యింతర్వాత అరుణ వాళ్ళ తల్లిదండ్రులు రైలు ప్రమాదంలో చనిపోయారు. అప్పటినుంచి అత్తయ్యే ఆమెకు అమ్మయ్యింది. సాధారణంగా కుటుంబాల్లో అత్తా, కోడళ్ళ మధ్యన ఉండే అంతర్లీనమైన సంఘర్షణ వాళ్ళ మధ్య లేదు. దానికి బదులుగా వాళ్ళిద్దరి నడుమ ఒక గాఢమైన అనుబంధం ఏర్పడింది. అలాంటి అమూల్యమైన తోడును అరుణ ఇప్పుడు కోల్పోయింది.

#

ఒక రోజు రాత్రి స్నిగ్ధ నిద్రలో కలవరిస్తూ “జడెయ్యమంటుంటే ఆలస్యం చేస్తావేంటి? స్కూల్ కి టైమైపోయింది. నువ్వెప్పుడూ ఇంతే” అంటూ ఏడుపు లంకించుకుంది. ఆ శబ్దానికి ఆనంద్, అరుణ నిద్ర లేచారు. పెద్దామె పోయిన దగ్గర్నుంచీ స్నిగ్ధ వాళ్ళిద్దరి మధ్యన పడుకుంటోంది. చాలా సేపటిగ్గానీ ఆ అమ్మాయి దుఖఃమాగలేదు. ఇంకోరాత్రి “నేను పెరుగన్నం తిననే దెయ్యం. నువ్వేం చేస్తావో చేసుకోపో” అంటూ లేచి కూర్చుంది. దాదాపు ప్రతి రాత్రి అలాగే జరుగుతూ ఉంది. ఆనంద్, అరుణ మధన పడుతూనే ఉన్నారు. స్నిగ్ధ సర్వం కోల్పోయినదానిలా ఉంటోంది.

ఒక రోజు ఆనంద్ సాయంత్రం తనతోబాటు ఒక బుజ్జి కుక్క పిల్లను ఇంటికి తీసుకొచ్చాడు. అది ముద్దు మూతితో, అమాయకమైన కళ్ళతో బెదురు బెదురుగా చూస్తూ ఉంది. స్నిగ్ధ స్కూల్ నుంచి రాగానే హాల్లో అది కనిపించింది. ఆమెకు దాన్ని చూడగానే చాలా ముచ్చటేసింది. ముందు తనే దాని దగ్గరకెళ్లి నెమ్మదిగా మచ్చిక చేసుకుంది. స్పూకీ అని దానికి ముద్దు పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. రోజూ ఉదయం దానికి పాలు తాగించడం, భోజనం తినిపించడం, దాన్ని టాయిలెట్ కు తీసుకెళ్ళడం లాంటి బాధ్యతలు తీసుకుంది.

పెద్దామె బ్రతికున్నప్పుడు స్నిగ్ధను సంగీతం నేర్చుకోమని పోరు పెట్టేది. ఆమెకు అన్నమయ్య, రామదాసు కీర్తనలు, త్యాగరాజ కృతులంటే చాలా ఇష్టం. ఐతే అప్పుడు ఆనంద్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆమె పోయిన తర్వాత అతనికి ఆ విషయం గురించి ఆలోచన ఎక్కువయ్యింది. స్నిగ్ధను సంగీతం క్లాసుల్లో చేర్పించాడు. ఆ అమ్మాయి మొదట్లో కొంత సణిగినా నెమ్మదిగా పాటలంటే ఇష్టపడటం మొదలయ్యింది.

ఆనంద్ కు ఒక రోజు వాళ్ళ పెదనాన్న ఫోన్ చేశాడు. ఆయన గుజరాత్ లో వాళ్ళబ్బాయి వినోద్ దగ్గర ఉంటున్నాడు. వినోద్ అహమ్మదాబాద్ లో ఒక ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని భార్య కూడా ఉద్యోగే. వినోద్ వాళ్ళమ్మ కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది. పెదనాన్న ఫోన్లో “ఆనంద్… వినోద్…” అన్నాడు. అతను ఆపైన మాట్లాడలేకపోయాడు. గొంతు గద్గదంగా ఉంది. “ఏంటి పెదనాన్నా. ఏం జరిగిందో చెప్పు” లాలనగా అన్నాడు ఆనంద్. “వినోద్, అతని భార్య విమల, వాళ్ళబ్బాయి తేజ మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో వాళ్ళెక్కిన  వోల్వో బస్సు నిన్న రాత్రి మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయింది. బస్సులో ఉన్న అందరు ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు. బూడిద మాత్రమే మిగిలింది” అంటూ బావురుమన్నాడు.

ఆనంద్ హుటాహుటిన అహమ్మదాబాద్ చేరుకున్నాడు. జరగవలసిన కర్మకాండ జరిపించి, పెదనాన్నను తనతో బాటు వాళ్ళ ఊరికి తీసుకు వచ్చాడు. అప్పటి నుంచి పెద్దాయన వీళ్ళతోనే ఉంటున్నాడు. అరుణకు కూడా ఆయన రాక ఒకింత ఊరట కలిగించింది. వాళ్ళ కుటుంబానికి ఒక పెద్ద తోడు దొరికింది. స్నిగ్ధకు తాతయ్య మంచి నేస్తమయ్యాడు.

స్నిగ్ధ ఇదివరకటిలా హాయిగా నవ్వడం మొదలయ్యింది. అంతేకాక ఇప్పుడు బాల్కనీలోని పూల మొక్కలకూ, తులసీ మొక్కకూ ఆమె ఆత్మ బంధువైపొయింది. అవి పెద్దామె ఆత్మీయతను ఆ అమ్మాయి స్పర్శలో అనుభవిస్తున్నాయి. నాయనమ్మ లేనిలోటు పూడ్చలేనిదైనా ఇప్పుడు కొత్త బంధాలు, వ్యాపకాలు స్నిగ్ధకు తోడయ్యాయి. నాయనమ్మ మరణంతో ఏర్పడిన కుదుపువల్ల గాడి తప్పిన వాళ్ళ జీవితమనే రైలు ప్రయాణం మళ్ళీ పట్టాలెక్కి కొత్తదారిలో సాగిపోతూ ఉంది.

***

 

 

37. మనవడు “మనవాడే”

రచన: ఉమాదేవి కల్వకోట

 

అది ఫిబ్రవరి మొదటివారం.అంత ఎండగానూలేదూ అంత చల్లగానూ లేదు.వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది.బయటి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఆఇంట్లో మాత్రం

అందరూ చాలా ఆందోళనగా,అసహనంగా ఉన్నారు.

“మనకిదేం ఖర్మ అన్నయ్యా. ఎక్కడయినా పిల్లలతో తల్లిదండ్రులకు ఏవో సమస్యలు రావడం గురించి విన్నాం కానీ,

తండ్రితో తమ పిల్లలకు ఇంత పెద్ద సమస్య రావడం మనవిషయం

లోనే చూస్తున్నాం.నాకయితే పిచ్చిలేచిపోతోంది.ఎలా అన్నయ్యా

ఈసమస్యనెలా పరిష్కరించడం?”అసహనంగా అన్నాడు కిషోర్.

“ఏమోరా.నాకేం పాలుపోవడంలేదుఇది నేనసలు కలలోకూడా

ఊహించలేదు.ఎవరినయినా సలహా అడుగుదామన్నా సిగ్గుచేటు.

ఛ…ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు”అంటూ తలని ఓచేత్తో నొక్కుకుంటూ కోపంగా అన్నాడు ప్రదీప్.

“మావారికయితే ఎలాగోలా నచ్చచెప్పొచ్చుకానీఈవిషయం

వింటే మాఅత్తగారువాళ్ళేమనుకుంటారో ఏమో.వాళ్ళందరి

ముందు ఎలా తలెత్తుకుతిరిగేది.పరువు పోయేట్టుంది”అన్నది

సునీత.

“సరేలెండి…అలాజరక్కుండా చూద్దాం. ఎలాచేయాలో,ఏం

మాట్లాడాలో బాగా ఆలోచించి,రేపు ఎదోఒకటి తేల్చేద్దాం”అన్నాడు

కిషోర్.

ఇంతకీ వీళ్ళందర్నీ అంతలా కలవరపరుస్తున్న విషయమేంటంటే…

రాజారాంగారు,విమలమ్మగార్లది అన్యోన్యదాంపత్యం.

చక్కని సంసారం.రాజారాంగారు ఉద్యోగంలో స్వశక్తితో అంచెలం

చెలుగా ఎదిగి,మంచి పొజిషన్లో రిటైర్ అయ్యారు.ఇద్జరబ్బాయిలు,

ఒకమ్మాయినీ బాగా చదివించి,మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు

చేసారు.అందరూ పిల్లాపాపలతో సుఖంగా ఉన్నారు. ప్రదీప్ చెన్నైలో,కిషోర్ బెంగుళూర్లో,సునీత వైజాగ్ లో స్థిరపడ్డారు.

రాజారాందంపతులు పిల్లలకు అవసరమన్నప్పుడు అప్పుడప్పుడూ పిల్లలదగ్గరికి వెళ్ళొస్తూ,తీర్థయాత్రలతోపాటు,సింగపూర్, హాంకాంగ్ లాంటి

విహారయాత్రలూచేస్తూ హాయిగా కాలక్షేపం చేస్తుండేవారు.

ఇద్జరిదీ ఉన్నంతలో జీవితాన్ని చక్కగా అనుభవించాలనే

మనస్తత్వం కావడంతో,అందులో ఇప్పుడు బాధ్యతలు కూడా

పెద్దగాఏమీలేకపోవడంతో,సినిమాలూషికార్లు,హోటళ్ళంటూ

సంతోషంగా ఉండేవారు.

చుట్టాలూస్నేహితులు అందరూ జీవితమంటేవీళ్ళదే అని

అనుకునేంత ఆనందంగాఉండేవారు

విమలగారికి సరోజ అనే చిన్నప్పటి స్నేహితురాలు ఉంది.

పాపం ఆవిడకి మూడేళ్ళక్రితం భర్త చనిపోవడంతో ఒంటరిదయిపోయింది.ఉన్న ఒక్కగానొక్కకొడుకు కెనడాలో

స్థిరపడిపోయి, ఈవిడని పట్టించుకోవడంమానేసాడు.విమలగారి

బలవంతంమీద ఎక్కడోదూరంగాఉన్న ఇల్లు అమ్మేసి,విమలగారిఇంటిదగ్ఖర్లోనే ఓఫ్లాటు కొనుక్కుంంది

అయినా సరోజ తనపరిధిలోతానుండేది.సినిమాలకీహోటళ్ళకీ

రాజారాంవిమలగార్లు రమ్మన్నా వెళ్ళేదికాదు.విమలాతానూ

కలిసి గుళ్ళకిమాత్రం వెళ్ళేవారు.ఎందుకంటేరాజారాంగారు గుడికి

వెళ్ళేందుకు పెద్దగా ఆసక్తిచూపేవారుకాదు.వారంలో మూడునాల్గు

సార్లయినా స్నేహితురాళ్ళిద్దరూ కలుసుకునేవారు.

ఇలా ఆనందంగా సాగిపోతున్న రాజారాంగారిజీవితం ఒక్కసారిగా తలక్రిందులైపోయింది.విమలగారికి  వారంరోజులు విడవకుండా వైరల్ ఫీవర్ పట్టుకుంది.బాగా నీరసించిపోయింది.ఆజ్వరంలోనే

ఒకరోజు రాత్రి  మందులేసుకొని పడుకున్న విమలతెల్లవారు మరిలేవలేదు.వెంటనె ఆసుపత్రికి తీసుకెళ్తే నిద్రలోనే గుండెపోటువచ్చి ప్రాణం పోయిందన్నారు. రాజారాంగారి సంతోష

కరమైన జీవితం ముగిసిపోయింది.

పిల్లలూ,బంధువులు అందరూ వచ్చారు.ఎవరితోనూ చేయించుకోకుండా,ముత్తైదువగా చనిపోయింది.చావులోనూ విమలమ్మ అదృష్టవంతురాలేనన్నారు.జరగాల్సిన కార్యక్రమాలు

అన్నీ సవ్యంగా జరిపించారు.ఇక ఏడాదిపాటు జరపాల్సినవన్నీ

అంటే మాసికాలూఅవీ ఎలాఅని తర్జనభర్జనలు జరిగాయి.తనకు

ప్రతినెలా రావడం కుదరదని,తండ్రినీ,తమ్ముడినీ చెన్నై కేరమ్మని,

అక్కడే ఏదో మఠంలోజరిపించేద్దామన్నాడు ప్రదీప్.ప్రతినెలారావడం తనకికూడా కుదరదని,పెద్దవాడుకాబట్టి

అన్నయ్యనే అవన్నీ చూసుకొమ్మన్నాడు కిషోర్. అలా ఏడాది

గడిచిపోయింది.సంవత్సరికాలు చనిపోయిన ఊర్లోనే పెట్టాలని,

అదే విమలగారిఆత్మకికూడా ఆనందమని,అందర్నీ తమ ఊరికేరమ్మన్నారు రాజరాంగారు.

ఇంటికి రంగులువేయించాలని,కోడళ్ళని వీలయితే కాస్తా తనకి

సాయంగా రమ్మన్నా రు రాజారాంగారు. కానీ వాళ్ళెవ్వరూ తమకు

వీలుకాదని,మనుషుల్ని పెట్టుకొని పనికానిచ్చుకొమ్మని,సంవత్సరి

కానికి ఎలాగోలా వస్తామన్నారు వాళ్ళు.సరోజ సాయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు రాజారాంగారు.

సంవత్సరీకానికి ఒకరోజు ముందు రాజారాంగారి ముగ్గురు పిల్లలు

వచ్చేసారు.కోడళ్ళు,అల్లుడు, పెద్దమనవడు కార్తీక్  ,అమ్మాయి కూతురు సాహితి మాత్రం వచ్చారు.మిగతా పిల్లలకు స్కూళ్ళు, కాలేజ్ లతో కుదర్లేదన్నారు.కార్తీక్ చిన్నప్పుడు కొన్నేళ్ళు తాతాబామ్మలదగ్గరున్నాడు కాబట్టి వాళ్ళంటే చాలా ఇష్టం.

తాతగారికి ఆరెండుమూడు రోజులయినా సాయం చేస్తానని

పట్టుబట్టి వచ్చాడు

శ్రాద్ధకర్మ జరిగేప్పుడు పురోహితుడు ఏదో ఒక సామాగ్రి కావాలని అడగడము,సరోజే అన్నీ చూసుకోవడంచూసి,కొడుకులూకోడళ్ళూ

మిగతావాళ్ళందరూ ఆనాల్రోజులు ఇంట్లోపనులుచూసువడానికి

ఆవిడని సాయమడిగారేమోననుకున్నారు.

ఆమూడురోజులూ అయ్యాక అసలు విషయానికి వచ్చారు

“నాన్నగారూ! ఇక మీరొక్కరే ఇక్కడ ఉండడం ఎందుకు?మీరూ

మాదగ్గరకు వచ్చేయండి”అన్నాడు ప్రదీప్.

“లేదురా..ఇది నాకు అలవాటైన ఊరు.ఇక్కడకాకుండా నేనెక్కడా

కంఫర్టబుల్ గా ఉండలేను”అన్నారు రాజారాంగారు.

“సరే ఈఊరు వదల్లేనంటే ఇక్కడే ఏదయినా ఓల్డేజ్ హోంలో

చేర్పిస్తాము”అన్నాడు కిషోర్”

“మీరెవరూ నాగురించి ఆలోచించి వర్రీ అవకండి. నేనుమీతోవస్తే

ఇక్కడ ఈఇల్లూఅదీ ఎవరుచూస్తారు.మీఅమ్మ జ్ఞాపకాలతో నేనిక్కడే ఉంటాను. మీకు తెలుసుగా మీఅమ్మ ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న ఇల్లిది.పోనీ ఎవరికయినా అద్దెకిచ్చినా ఇంత పెద్దిల్లు సరిగా చూసుకోలేరు”అన్నారు రాజారాంగారు నిరాసక్తంగా.

“అదే మేమంటున్నది.మీఒక్కరికే ఇంత ఇల్లెందుకు?ఇదిఅమ్మేసి,ఓపదోపదహేనులక్షలో మీరుంచుకొని,మిగతాది మాకిచ్చెస్తే సరిపోతుందిగా”అన్నాడు ప్రదీప్.

“మీరు కావాలంటే మామగ్గురిదగ్గిరా తలా నాలుగునెల్లుంటే

గొడవుడదు కదా”పరిష్కారం సూచించాడు కిషోర్.

“నాదగ్గరుంటే మాఅత్తగారువాళ్ళేమనుకుంటారో..అయినా ఆడపిల్లదగ్గరుంటే నలుగురిలో బాగుండదు”అంది సునీత.

“అలాఅంటే ఎలా కుదురుతుంది… ఆస్థిదగ్గరేమో అందరూ సమానమేనంటావు.ఈక్వల్ షేర్ అంటావు.బాధ్యతనుండి

మాత్రం ఎస్కేప్ అయేందుకు చూస్తావేంటీ.”కోపంగా అన్నాడు

కిషోర్.

ఇంతలో లోపలిగదిలో ఉన్న కార్తీక్”మీఅందరికో విషయంచెప్పాలి

మొన్న ఇంటికి రంగులు వేయిస్తున్నప్పుడు,బామ్మ రోజూ చదువుకునే లలితాసహస్రనామాల పుస్తకంలో ఈ ఉత్తరం ఉందిట.తాతగారెంతో బాధపడుతూ నాకు చూపించారు.ఈ

విషయం మీకెవరికీ చెప్పొద్దన్నారు.కానీ నేనే మీకీవిషయం తెలిస్తేనే మంచిదని తెచ్చాను.”అంటూ ఒక లెటర్ ఇచ్చాడు.

దానిలో”.   ఏవండీ!ఈజ్వరం నన్ను పీల్చిపిప్పి చేస్తోంది.నేను

బ్రతకనేమోననిపిస్తోంది.ఒకవేళ నేను బాగయితే మంచిదే..ఎప్పటిలాగే మీతో ఆనుదంగా జీవిస్తాను.ఒకవేళ

నాకేమయినా అయితే మీరొక్కరు అసలుండలేరు.పోనీ పిల్లల

దగ్గర సర్దుకుపోయి ఉండనూలేరు.మీగురించిన బెంగే నన్ను

కృంగదీస్తోంది.నాచివరి కోరికగా ఒకటడుగుతాను.నామీదేమాత్రం

ప్రేమ ఉన్నా కాదనకండి.

నాఫ్రెండ్ సరోజ చాలామంచిదని మీకూతెలుసు.తనూ ఒంటరిదే

పదిమందీఏమనుకుంటారో అనే ఆలోచన వద్దు. వాళ్ళెవ్ళరూ

మిమ్మల్ని ఆదుకోరు.సరోజ అయితేనే మనగురించి అన్నీ తెలిసిన

మనిషి కనుక మిమ్మల్ని బాగా చూసుకుంటుంది.తనకీఓతోడు దొరుకుతుంది. తల్లిపోతే పుట్టిల్లు ఉండదంటారు.మనపిల్లలకి

సరోజ తల్లి అయి నేనులేనిలోటు కొంతవరకు తీరుస్తుంది.

సునీతకి పుట్టింటికి వచ్చినప్పుడు చలిమిడి పెట్టే అమ్మ దొరుకు

తుంది.దయచేసి నా చివరికోరిక కాదనకండి”

మీ

.———

విమల.

అదిచదివిన ముగ్గురూ ససేమిరా ఒప్పుకోలేదు.ఈవయసులో

పెళ్ళేంటన్నారు.ఒకవేళ సరోజ ఈపెళ్ళికి ఒప్పుకున్నా అది డబ్బుకోసమేని తేల్చేసారు.కానీ కార్తీక్ అందరికీ ఖచ్చితంగా

సమాధానమిచ్చాడు.

“అమ్మా!తాతగారు బెంగుళూరుకు రెండంటేరెండు మాసికాలకి

వచ్చి నాలుగురోజులుంటేనే ఇలాప్రతినెలా ఈయనకిసేవలు

చేయాలా అని విసుక్కున్నావే.ఇక తాతయ్య ఉన్నంతకాలం

ఆయన్ని సరిగా చూసుకోగలవా?నిజంచెప్పు”

“బాబాయ్!నిజంచెప్పు.తాతయ్యని వృద్ధాశ్రమానికి పంపించే

ప్రతిపాదన పిన్నిదేకదా.తనమీద ఎలాంటి భారం పడడం పిన్నికి

ఇష్టంలేదు.పిన్నిమాటకు నువ్వు సై అన్నావు”

“ఇక అత్త ఆడపిల్లకి ఆస్థి కావాలంటుంది కానీ తండ్రి బాధ్యత

వద్దంటుంది.”

“అందుకేమీకెవరికీ ఏబాధాలేకుండా పాపం పోతూపోతూకూడా బామ్మ అందరి గురించీ ఆలోచించింది.దయచేసిదీనికి ఆడ్డు చెప్పకండి.సరోజగారు, తాతయ్యకూడా ఈపెళ్ళికి అస్సలు

ఒప్పుకోలేదు.నేనే బలవంతంగా ఒప్పించాను.ఇక సరోజ గారికి

మన ఆస్థిఅక్కర్లేదు.ఆవిడకి పెన్షన్ వస్తుంది. ఆవిడిల్లు ఆవిడకుంది.మీఆస్థి ఎక్కడికీ పోదు.దయచేసి అందరూ

తాతయ్య గురించి ఆలోచించి,బామ్మ చివరి కోరిక తీర్చండి.అన్నాడు.

ఎవ్వరూ ఏమీమాట్లాడకుండా ఆలోచించసాగారు.మళ్ళీ కార్తీకే

“ఎల్లుండి ముహూర్తం బాగుందట.నాకుకావాలని తాతయ్య

దగ్గరడబ్బు తీసకొని,గుళ్ళోపెళ్ళికి అన్నిఏర్పాట్లూ చేసేసాను.

మీరందరూవస్తే సంతోషం.లేదంటేమీ ఇష్టం”అని నిక్కచ్చిగా

చెప్పాడు కార్తీక్.

రాజారాంగారికి విమలగారి మాటగుర్తొచ్చింది”నువ్వన్నమాట నిజం విమలా.మనవడెప్పుడూ “మనవాడే”అని మనసులోఅనుకొని  చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకున్నారు.

 

 

 

36. దృష్టి

రచన: ఎమ్. రమేశ్ కుమార్

                                                                                                             

ఆమె మహారాణి..! ఏ రాజ్యానికీ కాదు.. అందంలో మహారాణి !  ఆమెను చూసిన వాడెవడూ దివి నుంచి దిగివచ్చిన సుందరి అంటే ఈమేనేమో… అనుకోకుండా ఉండలేడు. అలాంటి అద్భుత సౌందర్యం ఆమెది. పాల మీగడ మృదుత్వాన్ని సంతరించుకున్న శరీరం, తేనెరంగు కళ్ళు, చెంపల్లో దాగున్న మందారాలు, చీకటిని నింపుకున్న శిరోజాలు.. ఇవన్నీ ఆమె సొంతం. ఉన్నత స్థాయిలో వున్న కుటుంబం.. గారాబంగా చూసుకునే తల్లిదండ్రులు.. దేనికీ లోటు లేదు.

చదువుకునే వయసులోనే ఎన్నో ప్రేమలేఖలు.. పెళ్ళి ప్రతిపాదనలు.. ఆమె చుట్టూ గింగిరాలు తిరిగాయి. గిరికీలు కొట్టాయి. దేనికీ ఆమె ప్రతిస్పందించలేదు.

అమ్మాయి చదువు పూర్తయింది.. ఇంక పెళ్ళి సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు తండ్రి.

మంచి సంబంధమే వచ్చింది. వరుడు అమెరికాలో ఇంజనీర్.. వీళ్ళకి తగ్గ స్థాయి గల కుటుంబం.. అబ్బాయి అందగాడు.. అన్నీ బావున్నాయి. ఆమెని చూసి వరుడికి మూర్ఛ వచ్చినంత పనైంది. ఇంత అందమైన అమ్మాయి

నా భార్య కాకపోతే నా జీవితమే వృధా అనుకున్నాడు. కట్నం లేదు.. లాంఛనాలక్కరలేదు.. అమ్మాయిని ఇస్తే చాలన్నాడు. ఇంక పెళ్ళి కుదిరిపోయినట్టే అనుకున్నారు తల్లిదండ్రులు. నిశ్చయ తాంబూలాలిచ్చేసుకుందాం.. అని సిద్ధమైపోయారు. అమ్మాయిని ఒక్కమాట అడగాలి కదా.. అయినా అమ్మాయి కాదనడానికేముంది..? ఏదైనా లోటుంటేనే కదా నచ్చకపోవడానికి..!

అమ్మాయిని అడిగారు. మరోమాట లేకుండా వద్దనేసింది.. తండ్రి ఆశ్చర్యపడ్డాడు. ఎందుకు నచ్చలేదని అడిగాడు. వివరాలు వొద్దంది. నేను సంతోషంగా వుండాలంటే ఈ సంబంధం చేసుకోలేనని చెప్పేసింది. ఎవరికీ ఏమీ పాలుపోలేదు.

“నాకర్థమైంది. అమ్మాయి మిమ్మల్ని వదిలి వుండాల్సొస్తుందని బహుశా వొద్దని చెప్పేస్తోంది. అలాంటి ఇబ్బందేమీ అక్కర్లేదు. నేను అక్కడ ఉద్యోగం వదిలేసి ఇండియాలోనే మరో మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకోగలను. కావాలంటే నేను ఇండియా వచ్చేశాకే పెళ్ళి పెట్టుకుందాం..” అన్నాడు వరుడు. పెళ్ళికూతురి తండ్రికి కూడా ఈ విషయం నిజమేననిపించింది. వరుడి నిర్ణయాన్ని ఆమెకు తెలియజేసి ‘ఇప్పుడింక పెళ్ళికి అభ్యంతరం లేదు కదా తల్లీ..?’ అనడిగాడు.

ఆమె మళ్ళీ మొదటి మాటకే వచ్చింది. ‘ఈ సంబంధం ఇష్టం లేదు.. అంతే..! నేను సుఖంగా వుండాలంటే ఇంక ఈ సంబంధం జోలికెళ్ళకండి..’ అనేసింది.

సరే.. ఇంక వొదిలేశారు. తర్వాత మరో సంబంధం వచ్చింది. వరుడు అదే సిటీలో ఓ పెద్ద కంపెనీలో ఉన్నతమైన పోస్టులో వున్నాడు. కలిగినవాళ్ళ కుటుంబం. దేనికీ లోటులేదు. అమ్మాయిని చూడగానే అతడూ అదేమాటన్నాడు. కట్నం, గిట్నం ఏమీ అక్కర్లేదు.. ఈ అమ్మాయిని నేను పెళ్ళిచేసుకుంటాను.. అన్నాడు. కావాలంటే ఎదురు కట్నమిస్తాం. పెళ్ళి ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాం.. ఇదీ పెళ్ళికొడుకు తరపువాళ్ళ మాట. ఇంకేం ఇబ్బంది లేదు. కుటుంబం గురించి కూడా కనుక్కున్నారు. మంచి కుటుంబం.. సంప్రదాయాలకు విలువిచ్చే మనుషులు అని తెలిసింది. ఈసారి వెంటనే పెళ్ళికూతుర్ని అడిగాడు తండ్రి.

మళ్ళీ అదేమాట. ‘ఇష్టం లేదు.. ఈ సంబంధం వద్దు..’

“ఈ సంబంధం ఇష్టం లేదా..? అసలు పెళ్ళి చేసుకోవడమే ఇష్టం లేదా..?” అసహనంగా అడిగాడు తండ్రి.

“లేదు.. పెళ్ళి చేసుకుంటాను.. ఈ సంబంధం ఇష్టం లేదు.. అంతే..” చెప్పింది అమ్మాయి.

“ఎందుకిష్టం లేదు..? కారణం చెప్పు..?” పట్టుపట్టాడు తండ్రి.

ముందు చెప్పిందే తిరిగి చెప్పింది. “కారణాలు అడగొద్దు.. నేను సుఖంగా వుండాలనుకొంటే ఈ సంబంధం మాట మరిచిపొండి..”

తండ్రికేం చెయ్యాలో పాలుపోవట్లేదు. సరే.. అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనుకొని మరో సంబంధం చూశాడు. ఇదీ కలిగినవాళ్ళ కుటుంబమే.. ఈ వరుడు కూడా కట్నంతో సంబంధం లేదు.. అమ్మాయిని చేసుకుంటాను అన్నాడు. ఇంత అందమైన అమ్మాయి నాకు దొరకడమే నా అదృష్టం అన్నట్టు భావించాడు.  ఏం లాభం..? మళ్ళీ ఆమె అదే సమాధానం చెప్పింది. “ఈ సంబంధం నాకొద్దు. అంతే..!”

తండ్రి విసిగిపోయాడు. నువ్వు పెళ్ళి చేసుకోకపోతే ఛస్తానన్నాడు. ‘నేను పెళ్ళి చేసుకోనని ఎప్పుడు చెప్పాను..? సరైన సంబంధం వస్తే తప్పకుండా చేసుకుంటాను’ అంది ఆమె. తండ్రికి పిచ్చెక్కినంత పనైంది. తర్వాత కూడా సంబంధాలు వచ్చాయి. అన్నీ మంచి సంబంధాలే.. గొప్ప సంబందాలే.. ఏవీ ఆమెకి నచ్చలేదు. దేనికీ సుముఖత తెలపలేదు. కాలం గడుస్తూనే వుంది.

*                    *                   *                    *

ఓ ఆదివారం ఆమె వెళ్ళేటప్పటికే అతడక్కడున్నాడు. ఒక్కోసారి అలా ఇద్దరూ ఒకేసారి రావడం తటస్థిస్తుంది. అదొక అనాధాశ్రమం. ఆమె అప్పుడప్పుడూ అక్కడకు వెళుతుంది.

అనాధలంటే ఆమెకి ప్రేమ. ప్రతి పుట్టినరోజుకీ అక్కడివారికి బట్టలు, స్వీట్లు పంచడం ఆమె అలవాటు. అంతేకాదు.. ఆ పిల్లలతో అనుబంధాన్ని పెంచుకొని అప్పుడప్పుడూ వాళ్ళని పలకరిస్తూ వాళ్ళ మంచిచెడ్డలు కనుక్కుంటూ తను చెయ్యగలిగిన సాయం చెయ్యడం ఆమె నైజం.

అతడో పాఠశాలలో టీచర్. కాకపోతే పుట్టు గుడ్డివాడు. తన వైకల్యం సంగతి మరిచిపోయి అనాధలైన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ.. వారి అవసరాలు చూస్తూ.. గొంతు ఆధారంగా వారిని గుర్తు పట్టి పేర్లతో పిలుస్తూ

ఆ ఆశ్రమంలో అందరికీ ప్రియమైన వ్యక్తిగా గుర్తింపబడ్డాడు

“బాగున్నారా..?” అతడిని పలకరించింది ఆమె. ఆ గొంతు అతడికి పరిచయమే.!

సమాధానంగా నవ్వాడు.. “మీరెలా వున్నారు..?” అడిగాడు.

ఆమె కూడా నవ్వి “అసలు ఈరోజు సాయంత్రం వద్దామనుకున్నాను. ఎందుకనో మళ్ళీ ఉదయాన్నే బైల్దేరాను. పోన్లెండి.. మిమ్మల్ని కలవాలని వున్నట్టుంది..” అంది.

“పోనీ ప్రతి ఆదివారం ఉదయమే రండి.. నేను కూడా ఉదయమే వస్తాను.. మీ అందమైన గొంతు వినే భాగ్యం కలుగుతుంది కదా అని..” అతడు సగంలో ఆపేసి ఏవైనా తప్పు మాట్లాడానా..? అన్నట్టు మొహం పెట్టాడు.

ఆమె మళ్ళీ నవ్వేసి “దానికేం భాగ్యం.. అలాగే చేద్దాం..” అంది.

అప్పణ్ణుంచి ప్రతివారం వాళ్ళు కలుసుకుంటూనే వున్నారు

సాథారణమైన కుటుంబానికి చెందిన అతడి వ్యక్తిత్వం అసాధారణమని ఆమె త్వరలోనే గ్రహించింది. అతడితో పరిచయం ఆమెలో కొత్త ఆశలకు పునాదులు వేసింది.  తనంతతానుగా అతడి జీవితంలోకి వస్తానని అడిగింది. అతడు ఆశ్చర్యపడ్డాడు. తన వైకల్యాన్ని గుర్తుచేశాడు. ఆమెకి తగనేమో అన్నాడు. ఆమె పట్టు వీడలేదు. చివరికి అతడు అంగీకరించాడు. ఆమె ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఆమె మంకుపట్టు కారణంగా ఆ పెళ్ళి జరపక తప్పలేదు.

ఆ విధంగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలయ్యారు.

*                  *                   *                   *

 

ఆ గది ఒక శృంగార సామ్రాజ్యం. అందులో అతడు మన్మధుడు.. ఆమె రతీదేవి ! కానీ ఒకటే లోటు ఆమె అద్భుత సౌందర్యాన్ని కళ్ళారా చూసే వీలు లేని గ్రుడ్డివాడు అతడు!

ఒక విషయంలో లోటున్న వారికి మిగతా విషయాల్లో శక్తి సామర్థ్యాలు ఎక్కువ వుంటాయంటారు. అతడు కూడా అంతే..!

“నిన్ను నా కళ్ళతో చూడలేను.. కానీ చేతివేళ్ళతో చూడగలను..” అన్నాడు. ఆమె నవ్వింది.

ప్రణయంలో ఒకర్నొకరు అల్లుకుపోయే వేళ.. మొదట ఆమె ముఖ భాగాన్ని తన చురుకైన చేతి వేళ్ళతో స్పర్శించాడు అతడు. ఆ ముక్కు.. అది సంపెంగకు దీటైనదే. పెదాలు.. తమలపాకు సున్నితత్వాన్ని సంతరించుకున్న ఆ పెదాలు అందంగా వొంపు తిరిగాయి. ఇక బుగ్గలు పాల మీగడ మృదుత్వాన్ని అరువు తెచ్చుకున్నాయి. మెడ శంఖానికి సరిసాటైనదే..!  పొడవైన కురులు అతడి మొహాన్ని కప్పేసినప్పుడు వచ్చిన సుగంధంలో అతడు ఉక్కిరిబిక్కిరయ్యాడు.

ఒక అద్భుతమైన శిల్పానికున్న అందాలు ఆమెలో అతడి చేతివేళ్ళు గుర్తించకపోలేదు. స్పర్శతోనే ఆమె అందాలన్నింటినీ కొలవగలిగిన అతడికి స్పష్టంగా అర్థమైంది.. ఆమె ఒక అపురూపమైన అద్భుత సౌందర్యరాశి !

అతడంటే సంపూర్ణమైన ఇష్టం, ప్రేమ వుంది ఆమెకి. అందుకే అతడి వెచ్చటి వూపిరికి ఆమె వేణువై స్వరాలు పలికింది. ఇద్దరిలో ఆవేశం తొలకరి చినుకైతే ఆ చినుకు వానై.. వాన వర్షమై.. వర్షం వరదగా మారి పరవళ్ళు తొక్కింది.  ఒకరి కౌగిలిలో మరొకరు సేదదీరుతున్న వేళ అతడన్నాడు.

 

 

“నీ అందం గురించి మా పెద్దలు నాతో చెప్తూ అదృష్టవంతుణ్ణని పొగిడితే నన్ను సంతృప్తి పరచడానికి అంటున్నారేమో అనుకున్నాను తప్ప నిజమని భావించలేదు. గుడ్డివాణ్ణైన నాకు ఎలాగూ నిన్ను చూసే భాగ్యం లేదు కాబట్టి ఆ విధంగా చెప్పేస్తున్నారేమో అనుకునేవాణ్ణి. నువ్వెలా వున్నా నాకు పట్టింపు లేదు కాబట్టి ఆ విషయం గురించి నేను పట్టించుకోనేలేదు. కానీ ఈరోజు.. ఈ క్షణం తర్వాత అర్థమైంది.. వాళ్ళు చెప్పింది అక్షరసత్యమని…! నన్ను మభ్యపెట్టడానికో.. మరి దేనికో వాళ్ళా మాట అనలేదనీ నిజాన్ని చెప్పారనీ ఇప్పుడు సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను.. కానీ ఒకటే సందేహం.. నువ్వు కావాలనుకుంటే నాకంటే వున్నతస్థితిలో వున్నవాళ్ళూ.. ఏ లోపమూ లేనివాళ్ళూ ఎంతోమంది దొరుకుతారు.. నాకు తెలిసి నేను గొప్ప అందగాణ్ణి కూడా కాదు. మరి నన్నే ఎందుకు కోరుకున్నావో అర్థం కాకుండా వుంది..”

“ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడే తెలుసుకోవాలా..?” అడిగింది ఆమె.

“అవును.. తెలుసుకోకపోతే నా మనసు మనసులో వుండదు..” అన్నాడతడు.

“సరే.. ముందు నేనో ప్రశ్న అడుగుతాను.. దానికి సమాధానం చెప్పండి..?”

“ఏమిటది..?”

“అసలు మీరెందుకు నన్ను పెళ్ళి చేసుకోవడానికి అంగీకరించారు..?” అడిగింది.

“రెండు కారణాలు.. ఒకటి నా వైకల్యానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా నువ్వు నన్నిష్టపడ్డావు. రెండవది.. అతి ముఖ్యమైనది.. నీ సేవాగుణం.. అనాధ పిల్లలతో అనుబంధాన్ని ఏర్పరచుకోవడం, వారికోసం సమయం కేటాయించడం, అవసరమైన సాయం చెయ్యడం.. ఇవన్నీ నీలో నేను అమితంగా ఇష్టపడ్డ లక్షణాలు. ఇప్పుడు చెప్పు.. నువ్వు నన్ను కోరుకోవడానికి కారణం ఏమిటి..?”

“మీరు చెప్పిన రెండో కారణమే నావైపు నుంచి కూడా కారణం అవుతుంది. అదెలాగంటే మీరు నన్ను అంగీకరించింది నా అందం చూసి కాదు. ఇలాంటి సౌందర్యం మన సొంతమైతే చాలన్న దుగ్ధతో కాదు. నిజానికి నేనెలా వుంటానన్న విషయాన్ని తెలుసుకోవాలని మీరేనాడూ తహతహలాడలేదు. మీరన్నట్టు అసలా విషయంలో మీకెలాంటి పట్టింపు లేదని నాకు తెలుసు. మీరు కేవలం నా ప్రవర్తన.. స్వభావం నచ్చి అంగీకరించారు. నాక్కావాల్సింది అదే ! నన్ను పెళ్ళి చేసుకుంటానన్నవాళ్ళందరూ నా అందానికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కేవలం నా అందం చూసే నన్ను పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. అందం ఎంతకాలం వుంటుంది.,? కాలం చేసే మాయలో అందం మెల్లమెల్లగా నా నుంచి వీడ్కోలు తీసుకొంటుంది. అప్పుడు కూడా వాళ్ళ ప్రేమ అలాగే నిలిచివుంటుందని ఏమిటి నమ్మకం..? అయినా అంతవరకూ అక్కర్లేదు.. పెళ్ళైన కొంతకాలం తర్వాత.. కొత్త మోజు తీరిపోయిన తర్వాత సహజంగానే నా అందం

వాళ్ళకు గొప్పగా కనిపించడం మానేస్తుంది. అప్పుడిక మిగతా విషయాలన్నీ గుర్తుకొస్తాయి. అందుకే అలాంటి వాళ్ళు నాకు వొద్దనుకున్నాను. మీకు నా అందంతో సంబంధం లేదు కనుక ఇక్కడ ఆ సమస్య రాదు. అందం అశాశ్వతం.. కాబట్టి అందంగా వున్నానన్న కారణంతో చేసుకొనేవాళ్ళు నాకు అక్కర్లేదు. ఇక అనాధ పిల్లల పట్ల నాకున్న ప్రేమ, అభిమానం మీలో కూడా వున్నాయి. మీరు నాలో ఇష్టపడ్డ ఆ విషయాన్నే నేను కూడా మీలో ఇష్టపడ్డాను.

 

ఇక మీరనుకుంటున్న మీ వైకల్యం గురించి.. భాహ్య ప్రపంచాన్ని కళ్ళతో చూసి రూపాన్ని బట్టి అంచనా వేసే వాళ్ళలా కాకుండా గుణాన్ని బట్టి అవగాహన చేసుకునే ప్రత్యేక శక్తి మీకు సొంతం. అందుకే దాన్ని నేను వైకల్యంగా భావించటం లేదు.. నిజానికి మీరనుకుంటున్న మీ వైకల్యాన్ని నా విషయంలో ఒక అనుకూలతగా భావించాను. వినడానికి కొంచెం విచిత్రంగా వున్నా అదే నిజం. మీ మనోనేత్రంతో చూసిన నా రూపాన్ని ఎప్పటికీ అదేవిధంగా మదిలో వుంచుకోండి..

ఆ రూపానికి కాలదోషం లేదు.. అదే మీనుంచి నేను కోరుకునేది..” చెప్పింది. అతడేమీ మాట్లాడలేదు. వంగి ఆమె నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు  పెట్టుకున్నాడు. ఆనందంతో కూడిన అతడి సంపూర్ణ అంగీకారం ఆమెకు అర్థం కావడానికి అది చాలు..!

*                *                 *               *

 

35. ఆత్మీయ బంధం

రచన: శీలం విజయనిర్మల

 

‘ముచ్చటకోసం ఎవరన్నా కుక్కపిల్లల్ని ,పిల్లిపిల్లల్ని పెంచుకుంటాను అంటారు నువ్వేమిటే వీళ్ళను పెంచుతాను అంటావు ?’అంది ధార్మిక తల్లి శారద .

‘అమ్మా !నేను ముచ్చటకోసం కాదు ఆ పిల్లల్లో తమ కోసం ఎవరో ఒకరు ఉన్నారనే ధైర్యాన్నిచ్చి ,వారి జీవితాలలో వెలుగు నింపే ప్రయత్నం చేద్దామని నా మాట వినమ్మా !’అంది ధార్మిక తల్లిని బతిమాలుతూ.

‘నేను విననుగాక వినను ఆ రోగిష్టి వాళ్ళను తెచ్చి నా ఇంట్లో పెడతానంటే  నే ను  ఒప్పుకోను .నువ్వు చిన్నప్పటి నుండి వదిలేసి రా !’అన్న శారద మాటలకు ‘ఈ ఒక్కరోజుకు ఉండనివ్వు రేపు నేను ఎదో ఒకటి ఆలోచిస్తాను ;అంది ధార్మిక .

ఏమే !నీకు ఒక్కసారి చెబితే అర్థం కాదా?ముందు వీళ్ళను నా ముందు నుండి తీసుకుపో ‘అంది గేటు వైపు చూపిస్తూ.

ధార్మకకు ఆ రోజు కాలేజిలో ఆలస్యం అయ్యింది .కొద్ది ,కొద్దిగా పగటిని రాత్రి తనలో కలుపుకోవడం మొదలు పెట్టింది .నెహ్రు నగర్లో వీ ధీ చివర  మిద  పదేళ్లలోపు ఉన్న ఇద్దరు పిల్లలు కూర్చుని ఎడుస్తున్నారు  చుట్టు ప్రక్కలంతా చూసింది ఎవరు కనిపించలేదు. ధార్మిక వారికీ దగ్గరగా వెళ్లి ‘ఎవరు మీరు ?మీ పేర్లేమిటి ?’అని అడిగింది వాళ్ళలో పెద్దవాడు ‘నా పేరు హేమంత్ ,మా తమ్ముడి పేరు సుమంత్ ‘అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ’ .మీరెందుకు ఏడుస్తున్నారు ?’మా అమ్మా ,నాన్నకోసం వాళ్ళు లేరుగా ‘అన్నాడు హేమంత్ .వాళ్ళు ఏమయ్యారు ?’అంది ధార్మిక .దేవుడి దగ్గరున్నారంట  ‘అన్నాడు సుమంత్ .ఆ దారినే వెళుతున్న ఒక పెద్దాయన ‘విల్ల  అమ్మా నాన్న హెచ్ .ఐ .వితో కన్నుమూసరమ్మా అందుకని వీళ్ళను ఎవరూ దగ్గరకు తీయటం లేదు ‘అన్నాడు వెళ్ళిపోతూ .

.         తల్లిదండ్రులకు హచ్ .ఐ .వి ఉన్నదని బంధువులు ఉండి కూడా పిల్లల్ని వీధిలో వదిలేశారా !ఎంత బాధాకరం అది అంటువ్యాధీ కాదని ,కలసి ఉన్నంత మాత్రాన అది సోకదనివీళ్ళకు తెలియదా !తిలిసి ,తిలియని వాళ్ళు అందరూ ఇలాంటి వాళ్ళను దూరంగానే ఉంచుతున్నారు అనుకుంది ఇంటివైపు నడుస్తూ .దారి పొడవునా ఎదో అపరాధ భావన ఎవరో వీళ్ళను వదిలేశారు అనుకుంటున్నాను గానీ నేను మాత్రం ఏమిచేశాను? అనే భావన రాగానే వెంటనే పిల్లలున్న చోటుకు తిరిగి వెళ్ళింది .పిల్లలలను ఎవరూ తిసికెళ్ళినట్లుగా లేరు అక్కడే ఉన్నారు .ధార్మికను చూడగానే ఆశగా నిలబడ్డారు .వాళ్ళను తనతో రమ్మని ఇంటికి తీసుకొచ్చింది .కానీ తల్లి ఇంట్లోనికి రానియ్యనంటు  టే ఏమి చెయ్యాలో తెలియక స్నేహితురాలు అంతిమ కు  ఫోన్   చేసి విషయం అంతా చెప్పింది .అంతావిన్న అంతిమ

‘మా ఇంట్లోకూడా మీ అమ్మగారిలాగే ఆలోచిస్తారు .కానీ నేనొకటి చేస్తాను మాకు నేతాజీ రోడ్లో ఒక ఇల్లు ఉంది నేను ఎదో ఒకటి చెప్పి తాళాలు తీసుకొస్తాను నువ్వు పిల్లల్ని తీసుకుని అక్కడికి రా !’అని ఫోన్ పెట్టేసింది .

పిల్లల్ని తీసుకుని వెళ్ళేటప్పటికీ అంతిమ తాళాలు తీసి వీళ్ళ  కోసం ఎదురు చూస్తుంది .అందరూ ఇంట్లోకి వెళ్లారు .

‘ముందుగా వీళ్ళకు వైద్య పరీక్షలు చేయించాలి ‘అంది ధార్మిక .తక్షణమే ఆ పనిచేద్దాం ‘అంది అంతిమ .

‘అదే ఎలాగా !అని ఆలోచిస్తున్నాను .ఒక పనిచేస్తాను మన కాలేజిలో తోటి విద్యార్థులు సహకారం కోరతాను .’

‘ఆ పని రేపే మొదలపెట్టు నా తోడు నీకు ఎప్పుడు ఉంటుంది ‘అని చెప్పి వెళ్ళిపోయింది అంతిమ .

మరుసటిరోజు కాలేజీకి వెళ్ళి సమస్యను వివరించగా ధార్మిక చేసిన పనిని ఎంతో ప్రశంసించి ,తాము దాచుకున్న  పాకెట్ మనీ అంతా తీసిచ్చారు స్నేహితులు .మొత్తం పదివేలు అయినవి .పిల్లలిద్దర్ని హాస్పిటల్ కు తిసుకెళ్ళిం ది .హేమంత్ ఆరోగ్యం బాగానేవుందని ,సుమంత్ లో మాత్రం హెచ్ .ఐ వి లక్షణాలు ప్రాధమిక దశలోనే ఉన్నాయని ,క్రమం తప్పకుండా మందులు వాడుతూ వైద్య పరీక్షలు చేయించుతుంటే మిగిలిన వారిలాగే సుమంత్ జీవితం కూడా  ఉంటుం దని చెప్పారు డాక్ట్రర్ గారు .పిల్లలతో ఎండలో నిలబడి వస్తున్న ఆటోను ఆపి ఎక్కింది .అంతకుముందే ఆటోలో ఉన్న ధర్మతేజ తను బాగా సర్దుకుని పిల్లలకు చోటిచ్చాడు .సుమంత్ మంచినీళ్ళు కావాలని అడిగాడు .బాటిల్ తీసింది దానిలో ఒక్కచుక్క కూడా లేవు ‘పది నిమిషాల్లో మన ఇల్లు వచ్చేస్తుంది సరేనా !’అంది .’అలాగే ‘అన్నాడు .ఇదంతా గమనిస్తున్న ధర్మతేజ తన దగ్గరున్న మంచినీళ్ళబాటిల్ తీసి సుమంత్ కు ఇవ్వబోతే ధార్మిక వైపు చూస్తున్నాడు తీసుకోనా! వద్దా ! అన్నట్లుగా.

‘తీసుకో ‘అన్న తరువాత మంచినీళ్ళు తాగాడు .ఇంటి దగ్గర ఆటో దిగుతూ ‘థాంక్సండి ‘అంది .’ఇట్స్ ఓకే ‘అన్నాడు. డాక్టర్ గారు చెప్పిన మాటలు ధార్మికకు ఎంతో సంతోషాన్నిచ్చాయి .తను చేసిన పని ఒక చిన్ని ప్రాణాన్ని నిలబెడుతుం దనేఆలోచనే కొత్త లక్ష్యాలు ఏర్పరుచుకునేలా !చేసింది .ఆ సాయంత్రం ఇంటికి వెళితే శారద కోపంగా ‘నువ్వెంత ?నీ వయసెంత ?హాయిగా చదువుకుంటూ ,ఆడుతూ పాడుతూ స్నేహితులతో గడపాల్సిన ఈ వయసులో ,ఈ కార్యక్రమాలేంటి ?ఎవరు  అయినా  జీవితములో అన్నీ చూశాక ఇలాంటివి చేస్తారు .నువ్వేమో !ఇప్పుడే తలమీద పెట్టుకున్నావు. ఏమిటి ఇదంతా ?’అంది శారద.

’మానవత్వంతో స్పందించే మనసుకు వయసుతో పనిలేదమ్మా !నేను చేసిన ఈ పనివలన సుమంత్ హాయిగా జీవితము గడపుతాడని వైద్యులు చెప్పారు అదే నేను తరువాత చేద్దాములే అనుకుంటే ఏమయ్యేవాడు ?’అంది .’సరే నిన్ను ఒక ఇంటి దాన్ని చేసిన తర్వాత నీ ఇష్టప్రకారం చెయ్యవచ్చు వచ్చే గురువారం పెళ్ళిచూపులు పెందలకడనే రా !’అంది ‘నీ పనిమీద నాకు నమ్మకం ఉంది .కానీ మా బాధ్యతలు మేము తీర్చుకోవలిగా !’అన్నాడు తండ్రి సుధాకర్ ధార్మికతో .ఆరు నెలలపాటు దార్మిక ఆ ఇంట్లో ఉండడానికివాళ్ళ అమ్మా నాన్నని  ఒప్పించానని చెప్పింది  అంతిమ. పిల్లలను దగ్గరలోని బడిలో చేర్పిమచింది  ఖర్చులకోసం కాలేజీ అయిన తర్వాత  పార్ట్ టైం జాబు చేస్తుంది. తనకు తోడుగా పిల్లలను చూసుకోడానికి ఒక అయాను ఏర్పాటు చిసింది .తల్లికి ఇచ్చిన మాటప్రకారం ఇంటికి వెళ్ళింది. పెళ్ళిచుపులు అయ్యాయి ఒకరికి ఒకరు నచ్చారు .ధార్మిక చేసే సేవ కార్యక్రమం గురుంచి చెప్పింది శారద ‘.ఇలాంటివి నాకు నచ్చావ్ ‘అన్నాడు పెళ్ళికొడుకు .శారద సర్ది చేప్పబోయినా వినకుండా పెళ్ళివారు వెళ్ళిపోయారు .ధార్మిక వచ్చేసింది.

దినపత్రికలో’  దేశభక్తి గీతాల పోటి ‘అన్న కాలమ్ చూసి దిగువ ఇచ్చిన  నంబర్కు ఫోన్ చేసి తనపేరును రిజిస్టర్ చేయించుకుని వెళ్ళింది. ’ఏ దేశమేగినా ఎండు కాలిడినా ‘అనే పాటను పదిహేనేళ్ళ బాబు శ్రావ్యంగా పాడుతున్నాడు ,పాడటం అయిపోయిన తర్వాత అతనికి ఎదురెల్లి తీసుకొస్తున్న వ్యక్తిని ఎక్కడో చూసినట్లనిపించింది .ధార్మిక అని పిలవటంతో వెల్లి   ‘పాడవోయి భారతీయుడా ‘అనే పాటను పాడింది ‘దార్మికకు ప్రధమ ,హర్శాకు ద్వితీయ బహుమతులు’అని ప్రకటించారు నిర్వాహకులు .తన బహుమతితో వస్తుంటే ‘మీరు ఆ రోజు ఆటోలో ‘ అని అత ను అంటుండగానే ‘అవునండి మీరు మా బాబుకు వాటర్ కుడా ఇచ్చారుగా ‘అంది ధార్మిక .’అత ను మీ బాబా !’అన్నాడు .’అవునండి ‘అని జరిగిన విషయమంత చెప్పి ఈ బాబు …’అంది హర్శాను చూస్తూ .ఇతనా నా కొడుకే ఇంకా  పద్నాలుగుమంది ఉన్నారు ‘అన్నాడు .’ఆ …!’అంది ‘.అవునండి విల్లందరు నా పిల్లలే చిత్తుకగితాలు ఎరుకునేవారిని ,యాచన చేసే వారిని  చేరదీసి వారికీ వసతి ,విద్యనూ అందిస్తున్నాను ‘అన్నాడు ‘మీకు వనరులు ఎలా …’అంది .’నా మిత్రులు ,బంధువులు ఇలా ఎవరో ఒకరు ఆసరా .ఇస్తున్నారు అన్నాడు .అలా మాట్లాడుకుంటూ బస్టాండ్ కు వచ్చి ఎవరి దారిన వాలు వెళ్ళిపోయారు.

ధార్మికను ,పిల్లలను చూడటానికి సుధాకర్ వచ్చాడు వెళ్ళేటప్పుడు ‘రేపు అమ్మ నిన్ను రమ్మంది ‘అన్నాడు. ధార్మిక వెళ్ళిన తరువాత పెళ్ళివారు వచ్చారు. ఒకరికిఒకరు నచ్చారు ముహూర్తం గురుంచి మాట్లాడుకుంటూ ఉండగా శారద ధార్మిక గురించి చెప్పగానే పెళ్ళివారు వద్దని వెళ్ళిపోయారు శారద ధార్మిక మీద విరుచుకు పడింది .ధార్మిక ఫోన్ రింగు విని ‘హలో ‘అనగానే ‘నేనండి ధర్మతేజ ఆ రోజు ఆటోలో వాటర్ ,పాతలు ….’’అంటూ ఉండగానే ‘గుర్తొచ్చారు చెప్పండి ‘అంది. ఏమిలేదు టి .వీ లో ఘంటసాల ఆడిటోరియంలో రేపు పాత పాటల పోటి జరుగుతుంది .పాతికవేల రూపాయల నగదు బహుమతి అని టి .విలో ప్రకటన చూసాను .మీరు పడతారేమోనని ‘అన్నాడు. ’థాంక్స్ నాకు  చెప్పినందుకు నేను తప్పకుండా పడతాను ‘అంది ‘.ఎవరు ?అంది శారద .ధర్మతేజ గురుంచి చెప్పి పిల్లలున్న ఇంటికి వచ్చింది .అనుకున్న విధంగానే పోటిలో నగదు బహుమతి పొందింది .ఆపోటికి ధర్మతేజ కూడా వచ్చాడు .తిరిగి వచ్చేటప్పుడు మా ‘ఆనందనిలయం ‘చూడటానికి రమ్మంటే వెళ్ళింది .పేరుపేరునా పిల్లలందరిని పరిచయం చేసాడు. ’విల్లందరితోపాటు విల్లమ్మను పరిచయం చేయరా !అంది ‘చెయ్యాలనే ఉంది కాని ఉండాలిగా !’అంటే …’’నా పిల్లలను చూసుకునే వాళ్ళు ఇంకా దొరకలేదు’ ‘.ఒక పని చేయండి ఆడ పిల్లలను నాకిచ్చేయ్యండి ఎదిగే పిల్లలకు తల్లి అవసరం చాలాఉంటుంది ‘ ‘ఏ మీ మగపిల్లలకు తండ్రి అదుపు ,ఆజ్ఞలు వద్దా !’అదే కదా మా అమ్మానాన్న బెంగ ‘అని సెలవ అంటూ ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో ధర్మతేజ ఆనంద నిలయం గురుంచి చెప్పింది .

‘మేమిద్దరం కూడా ఆనందనిలయం చూడాలనుకుంటున్నాము ,ఎప్పుడు రమ్మంటా డో  ధర్మతేజకు ఫోన్ చెయ్యి ‘అన్నాడు సుధాకర్ శారద వైపు చూస్తూ .ధార్మిక ఫోన్ విన్న ధర్మతేజ అతనే స్వయంగా వచ్చి వీళ్ళను తీసికెళ్ళాడు .అదంతా చుసిన తర్వాత సుధాకర్ శారద తో  సంప్రదించి కూతురితో ‘నీ లాంటి అభిప్రాయాలున్న ధర్మతేజ  నీకు భర్తగా వస్తే బాగుంటుంది  నువ్వేమంటావ్ ?’అన్నాడు ‘.మీ ఇష్టం ‘అంది .సుధాకర్ ధర్మతేజ కు ఫోన్ చేసి ‘మీ ఇద్దరు నా పిల్లలు ,నీ పిల్లలు అని కాకుండా మన పిల్లలు  అనుకునే విధంగా ఆత్మీయ బంధంతో ముడిపడాలని మా కోరిక దీనికి మీరు సమ్మతిస్తే మీ పెద్దవాళ్ళను తీసుకుని మా ఇంటికి రండి ‘అన్నాడు ‘.అలాగేనండి మా అమ్మానాన్నతో మీ ఇంటికి వస్తాం ‘అన్నాడు ధర్మతేజ దార్మికతో తన జీవితాన్ని ఊహించుకుంటూ.

.

34. కలహం

రచన: శాంతి ప్రభాకర్

 

కొర్తి బాంక్‌ నుండి వచ్చే సమయమైంది. చంప లేత మామిడి చిగురు రంగు చీర, కాటన్‌ది, దానిపైన నీలిరంగు జాకెట్టు వేసుకొంది. ఆమెది సహజమైన సౌందర్యం. పాశ్చాత్య వాతావరణంలో పెరిగినప్పటికీ ఆమెకు తెలుగువారి కట్టు బొట్టులంటే ప్రాణం. పొడవైన నల్లని కురులతో ఆమె కదిలినప్పుడల్లా కూచిపూడి నాట్యం చేసే నాలుగున్నర అడుగుల పొడవుగా, ఒత్తుగా ఉండే జడ ఆమె సొంతం. ఆ జడకు మంజీరాలా అన్నట్లు వ్రేలాడే జడగంటలు కనువిందు చేస్తుంటే, వాటి కింకిణీ రాగాలు వినేవారి చెవులకు వినువిందు చేస్తూ ఉంటాయి. ఇంక ఆమె అలంకరించుకునే పాపిడిపిందె, చెంపస్వరాలు, బుట్టలోలకులు అప్పుడే వికసిస్తున్న ఎర్ర కలువ మొగ్గ వంటి ఆమె బుగ్గపై జీరాడుతూ, పొదిగిన రాళ్ళనుండి సప్తవర్ణ కాంతుల మెరుపులు వెదజల్లుతున్నాయి. తమ ఇంటి ముందర ఉన్న చిన్న ఆవరణలోని పూదోటలో వాలు కుర్చీలో కూర్చుని కొర్తి రాకకోసం ఎదురుచూస్తూ బాపిరాజుగారి ‘కోణంగి’నవల తిరగేస్తోంది చంప, తన కాంచన మేఖలను సవరించుకుంటూ.

కొర్తి, చంప యువ దంపతులే కాదు, నవ దంపతులు కూడా. వాళ్ళ పెళ్ళై ఇంకా నాలుగు నెలలు కూడా కాలేదు. కొర్తి అహమ్మదాబాద్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌లో ఏం.బి.ఏ. చదివాడు. గ్లోబల్ స్టేచర్‌ ఉన్న పెద్ద బ్యాంకులో మెరిట్‌ మీద డైరెక్టుగా ఆఫీసరుగా సెలక్ట్‌ అయ్యాడు. ముంబాయిలో బాంక్‌ ఫారెన్‌ ఎక్సేంజ్‌ డిపార్ట్‌మెంట్‌లో జాయిన్‌ అయి ముంబైలో స్టాఫ్‌ క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. చంపతో రెండు, మూడు నెలల్లో ఫారెన్‌ వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తోంది. చంపతో కలిసే వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ‘‘చంపా నిన్ను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేను. అది నా పెద్ద బహీనత’’ అంటాడు కొర్తి పెద్దగా నవ్వుతూ. ‘‘ఇంక ఆపు బడాయి కొర్తీ, నీ రావణాసురుడి నవ్వు కూడా. మన పెళ్ళి అయ్యి ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు. నా ఇష్టాఇష్టాలు కూడా నీకు పూర్తిగా తెలియలేదు. గొప్ప కబుర్లు చెప్పకు’’ అంటుంది చంప సిగ్గుతో ఎర్రబారిన ముఖాన్ని రెండు చేతులతో దాచుకొంటూ. ‘‘చంపా… మనది జన్మజన్మల బంధం. నేను రావణాసురుడినైతే నీవు మండోదరివి. గుర్తుంచుకో. వాళ్ళది పవిత్రబంధం…’’ కొర్తి పెదవులపై తన కోమలమైన కుడిచేయి నుంచింది చంప, ఇక మాటలు చాలు అన్నట్లు. ఈ ఘటన జరిగి నెళ్ళాళ్ళు దాటింది. ఈరోజు కొర్తి తన మిత్రులను డిన్నర్‌కు ఆహ్వానించాడు. వాళ్ళు సతీ సమేతులై వస్తారు. డిన్నర్‌ అయిటమ్స్‌ సెలక్షన్‌, ప్రిపరేషన్‌, సర్వింగ్‌ బాధ్యతలన్నీ చంపకే వదిలేసాడు కొర్తి. డ్రాయింగ్‌ రూమ్‌, డైనింగ్‌ హాల్‌ డెకరేషన్‌తో సహా.

స్నేహితులు ‘ఆడి’కారు దిగిన వెంటనే కొర్తి, చంప వాళ్ళని ఆప్యాయంగా ఇంట్లోకి తీసుకువెళ్ళారు. అతిథులు డ్రాయింగ్‌ రూమ్‌ చూసి చాలా కళాత్మకంగా ఉందని పొగడ్తతో ముంచెత్తి వేసారు. చంప, రమణి, రాధ – వంటింట్లోకి వెళ్ళారు. రమణి భర్త రాఘవ, రాధ భర్త కృష్ణ. ఇద్దరితో కబుర్లతో పడ్డాడు కొర్తి. టేబుల్‌ మీద ఉన్న ‘కోణంగి’నవల చూసి కృష్ణ దానిని చేతుల్లోకి తీసుకున్నాడు. రెండు, మూడు పేజీలు తిరగేసి ‘‘కొర్తీ! ఈ పాతచింతకాయ పచ్చడిలాంటి సాహిత్యం ఏం చదువుతావోయ్‌, నీ రీడింగ్ టేస్ట్‌ మారాలి, అంతా మోడరన్‌గా ఉండాలి’’ అన్నాడు పుస్తకాన్ని బల్లమీద విసురుతూ. కొర్తి మొహం ఒక్కసారి చిన్నబోయింది. వెంటనే చంప డ్రాయింగ్‌ రూమ్‌లోకి వచ్చి ‘‘అన్నగారూ… బాపిరాజుగారి సాహితీ విలువలు ఏ రచయిత ప్రదర్శింపగలడు? ఆయన కలం, కుంచె రెండూ అద్వితీయం, అజరామరం. అయినా పాత కొత్త మేలు కలయిక మనకు సంపూర్ణత్వాన్ని ఇస్తుందని మీకు నేను చెప్పాలా?’’ చిన్న చురక అంటించింది. కృష్ణ మొహం తిప్పుకున్నాడు ఆమె సమాధానంతో. కొర్తి ముఖ కవళికలు ఏమీ మారలేదు.

భోజనాల సమయం, మళ్ళీ వాతావరణం సందడి, సంతోషాలతో నిండిపోయింది. గుత్తివంకాయ కూర, గోంగూర పచ్చడి, కొబ్బరి పచ్చడి, హైలైట్స్‌. అయితే కందిపొడి రుచే అందరినీ కట్టివేసింది. “కందిపొడి చాలా బావుంది. కందులు తగినంతగా వేయించి పొడిచేసినట్లున్నారు” అంది రమణి. “మరీ మెత్తగా, మరీ గరకుగా కాకుండా చాలా చక్కగా మిక్సీ పట్టారు. పొడి చూడ ముచ్చటగా ఉంది” అంది కందిపొడి వేడి అన్నంలో కుపుకొంటూ. “లేదు రమణీ, మిక్సీలో పట్టలేదు. చిన్న రోలులో దంచాను. అందుకే పొడి చక్కగా వచ్చింది” చంప నవ్వుతూ చెప్పింది. “ఏం మిక్సీ పనిచేయలేదా చంపా?” అడిగింది రాధ. “మిక్సీకేం. భేషుగ్గా పనిచేస్తోంది. కాని కొన్ని వంటలూ, పచ్చళ్ళూ, పొడులూ మన సాంప్రదాయం ప్రకారం చేస్తే ఆ రుచీ, సువాసనా వేరు కదా! నేను నెయ్యి కూడా ఇంట్లోనే కాస్తాను. పాల్లోంచి వెన్నతీసి, అల్లాగే వక్కపొడి కూడా నేనే చేస్తా” చంప రాధకు నెయ్యి గిన్నె అందించింది. “మీ ఆవిడవన్నీ పాత పద్ధతుల్లా ఉన్నట్లున్నాయి కొర్తీ” అన్నాడు రాఘవ నవ్వుతూ. వాతావరణంలో సౌహాదృత లోపించింది. అందరూ భోజనం పూర్తి చేసారు. నేతిలో వేయించిన కర్పూర వాసనలు వెదజల్లుతున్న వక్కపొడిని ఆస్వాదిస్తూ డ్రాయింగ్‌ రూమ్‌లో కూర్చున్నారు పిచ్చాపాటీ చర్చిస్తూ.

“కొర్తీ ఇంక మేం వెళతాం. పది దాటుతోంది” అన్నాడు రాఘవ లేస్తూ. మిత్రులందరూ బయటకు వచ్చారు. చంప, కొర్తీ వాళ్ళను అనుసరించారు. అతిథులు కారెక్కారు.

గేరుమారుస్తూ “చంప వేసుకున్న డ్రెస్‌ చూసావా రమణీ. అందులోనే తెలుస్తోంది ఆమె ఒట్టి పాత చింతకాయ పచ్చడి అని” మెల్లగా పలికానని అనుకొంటూ గట్టిగా అన్నాడు రాఘవ. మిగిలిన వాళ్ళందరూ కూడా గట్టిగా నవ్వారు. గేట్‌ వేస్తున్న కొర్తీకి వాళ్ళ మాటలు, నవ్వులు వినిపించనే వినిపించాయి.

చంపను నిద్రపోనివ్వకుండా రోజూ వసపిట్టలా వాగే కొర్తి ఆ రాత్రి మౌన యోగీశ్వరుడైపోయాడు. ఉదయం ఆరు గంటకు లేచింది చంప. రాత్రంతా నిద్రలేని ఆమె కళ్ళు ఎర్రబారి వున్నాయి. గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేసి తల ఆరబెట్టుకుంటూ కాఫీ ప్రయత్నంలో పడింది. చంప అందించిన కాఫీ గ్లాసు తీసుకుని “నీకు ముందరే చెప్పాను కదా! మోడ్రన్‌గా ఉండమని. వాళ్ళు నిన్ను అమ్మోరు అని పిలిస్తే నాకు ఎంత చిన్నతనమైందో తెలుసా! పైగా రీడింగ్ టేబుల్‌ మీద ఆ నవలొకటి” రుసరుసలాడాడు కొర్తి.

మధ్యాహ్నం పన్నెండు దాటింది. రోజూ వచ్చినట్లుగానే రంగమ్మ వచ్చింది. “చంపమ్మా.. అయ్యగారి టిపినీ రెడియేనా?” అంటూ. “ఈ రోజు అయ్యగారి కేరియర్‌ శుభ్రం చేయలేదు రంగమ్మా. అంచేత కేరియర్‌ మారింది” చంప కేరియర్‌ రంగమ్మ చేతికి ఇచ్చింది. “రేత్రి నిద్రరోలేదేంటీ. కళ్ళు రెండూ ఎర్రగున్నాయ్‌ చంపమ్మా” అంటూ రంగమ్మ మాటలో చంప కన్నుల నుండి నీళ్ళు జలజలారాలాయి. రంగమ్మ ఆశ్చర్యపోయింది. “అబ్బాయిగారికి కోపం వచ్చిందేంటి? బాధపడకమ్మా. మాపటేలకి అంతా సద్దుకుంటుంది. మా ఇంటోడు కూడా ఇల్లాగే కస్సుబుస్సు లాడతాడు అప్పుడప్పుడు. ఆ యవ్వ చెప్పేది సంసారంలో తంపతీ కలహం అప్పుడప్పుడు తప్పదని” అంటున్న రంగమ్మకు బుట్ట ఎత్తి సాయం చేసింది చంప.

రంగమ్మ వెళ్ళిపోయిన తరువాత చంప బెడ్‌రూంలోకి వెళ్ళిపోయింది. కాట్‌ మీద పడుకొని ఆలోచనలలో కొట్టుకొని పోయింది. “ఎంత ప్రేమగా చూసుకునేవాడు కొర్తి! అదంతా నటనేనా? కొత్త కుండలో నీరు తనకి ఇష్టమని కొత్త కుండను స్వయంగా తనే తెచ్చాడు. రోజూ తానే కుండను శుభ్రం చేసి మంచినీళ్ళు నింపుతాడు. కొత్త కుండలో నీరు తీయన, కోరిన పెళ్ళామె తీయన అని పాట పాడుతూ నీళ్ళ గ్లాసు అందిస్తాడు. తనకిష్టమని మల్లీశ్వరి, దాగుడుమూతలు, దేవదాసు, బండరాముడు – ఇంకా ఎన్నో పాత సినిమాలు చూపించాడు. అటువంటిది ఈరోజు ఇంత కోపం తెచ్చుకున్నాడేంటి? ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో స్టేట్‌ ఫస్ట్‌ వచ్చిందని అందరికీ గొప్పగా తనను గురించి చెప్పిన కొర్తి తనపై అకారణంగా కలహించారు. తానేమైనా తక్కువతిందా’’ చివాలున మంచం మీద నుంచి లేచింది చంప.

మధ్యాహ్నం రెండు గంటలు కావొస్తోంది. అకస్మాత్తుగా కొర్తి బాస్‌ రమాకాంత్‌ ఆఫీసు డైనింగ్‌ హాల్‌కి వచ్చాడు. “సారీ కొర్తి, నిన్న మీ ఇంటికి డిన్నర్‌కి రాలేకపోయాను. నా మిసెస్‌కి కొద్దిగా జ్వరం వచ్చింది అందుచేత. ఏమీ అనుకోకు” అంటూ. కొర్తి “పరవాలేదు సార్‌. ఇప్పుడు మేడమ్‌ గారికి ఎల్లావుంది?” అడిగాడు బాస్‌ని. “సీజనల్‌ ఫీవర్‌, సాయంకాలానికి తగ్గిపోతుంది” రమాకాంత్‌ అన్నాడు. “మరి మీ లంచ్‌?” రాఘవ అడిగాడు. “ఈ రోజుకి ఉపవాసమే” నవ్వాడు రమాకాంత్‌. “సారీ సర్‌. మా లంచ్‌ అయిపోయింది, లేకపోతే మీతో షేర్‌ చేసుకుందుం” అన్నాడు కృష్ణ.

ఏదో అన్యమనస్కంగా ఉన్న కొర్తి “సార్‌ నేనింకా భోజనం చేయడం మొదలు పెట్టలేదు. మనం ఇద్దరం కలిసి లంచ్‌ చేద్దాం. అసలు ఎందుకో ఈ రోజు ఇంటినుండి డబుల్‌ కేరియర్‌ వచ్చింది” అంటూ కేరియర్‌ తెరచి ప్లేటులో వడ్డించడం ప్రారంభించాడు కొర్తి.

“నా అదృష్టం కొర్తి. నిన్న డిన్నర్‌ మిస్‌ అయినా ఈ రోజు వండ్రఫుల్‌ లంచ్‌ కొట్టేసా. నాకు ఇష్టమైన చింతచిగురు పప్పు, బీరకాయ కూర, పండుమిరప పచ్చడి, మన ముక్కల పులుసు, గడ్డ పెరుగు ఇంతకన్నా ఏమి కావాలి? చంపను చూడాలోయ్‌. అమ్మాయికి థ్యాంక్స్‌ చెప్పాలి స్వయంగా అప్పుడే నాకు తృప్తి” అన్నాడు తృప్తిగా భోజనం చేసి రమాకాంత్‌.

భోజనం చేసి రమాకాంత్‌ రాఘవ మొబైల్‌లో ఫోటోలు చూడడం ప్రారంభించాడు. “నిన్నటి ఈవినింగ్‌ మీట్‌ ఫోటోలు ఏవి” అంటూ. “ఫెంటాస్టిక్‌ కొర్తి. చంప ట్రెడిషనల్‌ వేర్‌లో అద్భుతంగా ఉంది. ఆ కట్టూ, బొట్టూ అన్నీ… నీ అదృష్టం. చంపను ఇంకా పొగిడితే నా దిష్టే తుగులుతుంది. నాకు డాటర్స్‌ లేరు. నీకు తెలుసుగా మిస్టర్‌ రాఘవ్‌. చంప ఈ క్షణం నుంచే నా కూతురు” రమాకాంత్‌ కొర్తి భుజం పట్టుకొని ఊపేసాడు.

సాయంకాలం నాలుగు గంటలు దాటింది. ఆకాశం నుండి కుంభవృష్టి. “ఈ ముంబాయిలో ఎప్పుడు వర్షం వస్తుందో ఆ భగవంతుడు కూడా చెప్పలేడు. నేను ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి హైద్రాబాద్‌ ఫ్లైట్‌ కాచ్‌ చేయ్యాలి. ఈ రోజు డ్రైవర్‌ కూడా లేడు. కొర్తి నన్ను ఎయిర్‌ పోర్ట్‌లో డ్రాప్‌ చేసి నువ్వు నా వెహికల్‌లో ఇంటికి వెళ్ళు. నేను తిరిగి వచ్చేటప్పటికి మూడు, నాలుగు రోజులు పడుతుంది. అంతవరకు నా వెహికల్‌ నీ దగ్గరే ఉంచు. ఈ నాలుగు రోజులు సెలవు పెట్టి నువ్వు, చంప ముంబాయి అంతా చూడండి. నీకు లీవ్‌ గ్రాంట్‌ చేసాను. సరేనా” నవ్వుతూ అన్నాడు రమాకాంత్‌. రమాకాంత్‌ చంపపై చూపిస్తున్న అభిమానానికి, కృష్ణ, రాఘవ్ ఇద్దరూ అవాక్కయిపోయారు.

కొర్తి కార్‌ డ్రైవ్‌ చేస్తున్నాడు. ఏకదారగా కురుస్తున్న వర్షంలా అతని ఆలోచనలు కూడా ఆగడం లేదు. “అనవసరంగా స్నేహితులు చేసిన కామెంట్స్‌కు చంపను కోపడ్డాను. ఆమె సుకుమారమైన మనసును నొప్పించాను. జెలసీ వలన వాళ్ళు ఆ కామెంట్స్‌ చేసారని నా బుర్రకు తట్టలేదు. మరి ఈ రోజు రమాకాంత్‌ గారి అభినందనను నేను ఎలా తీసుకోవాలి? ఇంటికి వెళ్ళిన వెంటనే చంపను క్షమించమని అడగాలి. మొబైల్‌లో మాట్లాడదామంటే స్విచ్‌ ఆఫ్‌ చేసివుంది. చంప నిద్రపోతోందో ఏమో?” తనలోతానే మాట్లాడుకున్నాడు కొర్తి. కొర్తికి బాల్యం నుండి తనకు చంపకు మధ్య పూదోటలా పెరిగిన ప్రేమ, స్నేహం గుర్తుకు వస్తున్నాయి. అనేకమైన అనుభూతులు, మరువలేనివి. అందులో ఒకటి తమ చిన్నప్పుడు చంప పెట్టుకున్న చెంపస్వరాలను తాను సర్దుతూ ఉండడం, ఆ ఆరవ ఏటనే చంపను ఆరాధించడం. టీచర్‌ క్లాసులో “కొర్తి, చంప చెంపస్వరాలు తరువాత సర్దుదువుగాని ముందుర అ, ఆ లు వ్రాయి అని నవ్వుతూ అనడం గుర్తుకువచ్చి తనలోతానే నవ్వుకున్నాడు.

వెయిటర్స్‌ లాంజ్ లోకి వెళ్ళడంతోటే కొర్తి ఆశ్చర్యపోయాడు. చిన్న బేగ్‌తో చైర్‌లో కూర్చున్న చంప దగ్గరకు పరుగున వెళ్ళి “చంపా ఇదేమిటి నువ్విక్కడ” అంటూ ఆమె భుజాలను గట్టిగా ఊపేసాడు. చంప ఏమీ మాట్లాడలేదు. ఆమె కన్నుల నుండి అశ్రుధారలు. “మావూరు…” ఏదో చెప్పాలని ప్రయత్నించింది చంప. కొర్తి “చాల్లే. గొప్పపని చేద్దామని బయల్దేరావు. నేను రమాకాంత్‌ గారితో రాకపోతే. అమ్మో నా గుండె ఆగిపోదా. ఆఫీసు నుండి ఇంటికి డైరెక్టుగా వెళ్ళితే నువ్వు కనపడకపోతే నా గుండె ఆగి…” చంప కొర్తిని ఇంక ఏమీ మాట్లాడనివ్వలేదు. కోమలమైన తన కుడిచేతి చూపుడు వ్రేలితో అతని పెదవులు మూసింది. ఇదంతా చూస్తున్న రమాకాంత్‌ ఏదో అర్థమైనట్లు “దంపతీ కలహం” అన్నమాట. ఆ కృష్ణుడికీ తప్పలేదు ఈ పాట్లు” అంటూ ‘ఇండి గో’ కేబిన్‌ వైపుదారి తీసాడు. “విష్‌ యూ బోత్‌ నైస్‌ టైమ్‌” అని గట్టిగా నవ్వాడు.

“చూడు వర్షంలో తడిసి ముద్ద అయ్యావు” కారులో ఏ.సి. ఆఫ్‌ చేస్తూ అన్నాడు కొర్తి. కుడిచేత్తో స్టీరింగు కంట్రోలు చేస్తూ, ఎడమచేతితో చంపను దగ్గరకు తీసుకున్నాడు. “నీ జుట్టుపైన తెల్లని వర్షం నీటి బిందువులు చెంపస్వరాలులా మెరుస్తున్నాయి చంపా” ఆరాధనగా అన్నాడు కొర్తి. “ఆ చాల్లే ఇంక చెంపస్వరాల ఆరాధన, మనది జన్మజన్మల బంధం అంటావు. అదేమీ నాకు తెలియదు. కాని మనది వీధిబడి బంధం, చెంప స్వరాల బంధం… మన టీచర్‌ నర్సరీ సత్యభామ గారి మాటల్లో” చంప కొర్తికి దగ్గరగా జరిగింది.

తెల్లవారింది. ఉదయం ఏడు గంటలకే వచ్చిన రంగమ్మను చూసి ఆశ్చర్యపోయింది చంప. చంప, కొర్తి ఒకే సోఫాలో కూర్చుని కాఫీ త్రాగుతున్నారు. “అమ్మయ్య. తంపతీ కలహం సినిమా వందరోజులు ఆడినట్టేగా” అంది రంగమ్మ నవ్వుతూ.

33. నను కన్ననా తల్లే నా కన్నకూతురు.

రచన: ఎస్.వి.హనుమంతరావు

 

“సత్యా !నేను రాత్రికి ఊరు వెళుతున్నాను.రెండు రోజుల్లో వచ్చేస్తాను.ఆఫీస్ లో లీవ్ పెట్టాను.పనమ్మాయికి ,వంట మనిషికి  జాగ్రత్తలు చెప్పాను.అమ్మాయిల్ని టైంకు రెడీ చేసి స్కూల్ బస్ ఎక్కించే బాధ్యత మాత్రం మీదే.”

రాత్రి ఏడుగంటలకు ఆఫీస్ నుండి వచ్చిన భర్త కు చెప్పేసింది ప్రయాణ సన్నాహాల్లో వున్న విజయ సత్యమూర్తి భార్య.

“ఊరా?ఇవ్వాళా?ఏమిటి అంత అర్జెంట్?పెద్ద అమ్మాయి పరీక్షల టైంయిది.గుర్తుందా?”

అవును ,కాదు అనకుండా ప్రశ్నలతో పిచ్చి ఎక్కిoచేస్తున్న భర్తను వింతగా చూస్తూ .

“గుర్తుంది.నువ్వున్నావుగా.?అవును రాత్రి బస్ కే .అర్జెంట్ అంటే అర్జెంటే.మా అమ్మకు వంట్లో బాగోలేదని అన్నయ్య ఫోన్ చేసాడు.ఆవార్త విన్నప్పటినుండి గుండెల్లో ఒకటే దడ.”

“ఓహో !అదన్నమాట?విషయం.ఒOట్లో బాగున్నంతవరకు సేవలు చేయించుకున్నారు.ఇప్పుడు సేవలు చేయాల్సి వస్తుందని తమరికి ఫోన్ చేసారన్నమాట?నువ్వెందుకు వెళ్ళాలి?మీ అన్ననే చూసుకోమని చెప్పు.”

“పంతాలకు ,పట్టింపులకు పోయి కన్నతల్లిని చూడకుండా వుండడం నాకు సాధ్యం అయ్యే పనికాదు.వదినకు మనలాగే యిద్దరుఅమ్మాయిలు.అన్నయ్యది క్యాంపుల ఉద్యోగం.ఇప్పుడు అమ్మమతిమరుపు వ్యాధితోబాధపడుతోంది.ఆమెను ఎవరో ఒకరు ప్రక్కనుండి అనుక్షణం చూసుకోవాలి.ప్రతినిమిషం కంటికి రెప్పలా కాపాడుకోవాలి.”

“విజయా!అటువంటి వారిని చూసుకోడానికి అనేక కేర్ హోమ్స్ వున్నాయి.”

“అవును నేనూ విన్నాను . పిల్లల్ని చూసుకోడానికి కూడా అనేక హాస్టల్స్ వున్నాయని. కానీ మన పిల్లల్ని అందులో జాయిన్ చేయలేము కదా?అమ్మ అనాధకాదు. నేనుకూతురిని బ్రతికే వున్నాను.ఒకప్రాణికి ప్రాణం పోయాలంటే తల్లి తనప్రాణాన్ని పణంగా పెడుతుంది.అటువంటి త్యాగమూర్తిని హోమ్లో చేర్చడం అంటే గర్భ గుడిలోని మూర్తిని వీధుల పాలు చేయడమే.”

“ఏయ్ !విజయా పిచ్చిగా మాట్లాడకు.అమ్మవిలువ నాకూ తెలుసు.”

“అవును నాది పిచ్చే.కొన్ని సంఘటనల వెనుక పెద్ద ఉప్పెనలు దాగివుంటాయి.అర్ధం కానివాళ్ళు  దానిని పిచ్చి అంటారు.అర్ధమై న వాళ్ళు ఏడుపు అంటారు.కాని భరించే వాళ్ళకే అందులోని బాధ ,బాంధవ్యం తెలుస్తుంది.తల్లిప్రేమలోని తీయనితనం అనుభవిస్తేనే అర్ధమవుతుంది.”

“విజయా!నన్నుకన్నది కూడాఓతల్లే.నువ్వు నాకు పాఠాలు చెప్పనక్కర లేదు.సూక్తులు చెప్పవలసిన అవసరం లేదు. ఇంతకీ తమరి ఉద్దేశ్యం చెపితే బాగుంటుంది.”

“నేను చెప్పేశాను.అమ్మను తెచ్చుకుంటాను.నాకు మరోకూతురు అనుకుంటాను.సేవచేసి ఋణం తీర్చు కుంటాను.కన్నతల్లి ఋణం తీర్చుకోవడానికి యిదో సువర్ణ అవకాశO.”

“అంటే తుది నిర్ణయం తమరిదేనా?నాఅనుమతి అవసరం లేదా?”

“అందుకేగా  మీతో చెప్పి బయలుదేరుతున్నాను.అయినా యిందులో నిర్ణయాలు అనే పెద్దపెద్ద మాటలు ఎందుకు?రేపు మీఅమ్మగారికి అవసరమొచ్చినా నాకు  నలుగురు కూతుర్లనుకుంటాను .ఆనందంగా సేవచేస్తాను.అమ్మ ఎవరికైనా అమ్మే.”

“అంటే ?మీఅమ్మగారిని తీసుకు వచ్చి మనయింట్లో వుంచుకోవాలనే నిర్ణయానికి వచ్చేశావు అన్నమాట ?ఒకవేళ నేను నో అంటే?కాదంటావా?”

“మీకు అలా అనే అధికారం వుంది.ధనమిచ్చి యేవస్తువును కొనుక్కున్నా దానిమీద సంపూర్ణ అధికారం కొనుగోలుదారుకే వుంటుంది.కానీ అదేమిశాపమో? భారతీయ మహిళకు మాత్రం ఆఅధికారంలేదు.దీనిని దౌర్భాగ్యం అనాలో ,చేతకాని తనం అనాలో అర్ధంకాదు.అనాదినుండి వస్తున్నపనికిరాని పద్ధతులు మారలేదు.మార్చాలి.”

“నన్ను కట్నంయిచ్చి కొనుక్కున్నానని దెప్పనక్కరలేదు.అవును కట్నం తీసుకునే పెళ్ళిచేసుకున్నాను.కట్నం లేకుండా నిన్ను ఎవడు చేసుకునే వాడు?మీ నాన్న కాళ్ళవేళ్ళ పడితే కోటినుండి , ముష్టియాభై లక్షలకు దిగజారి ఒప్పుకున్నాను.”

“మీరు చెప్పింది నగ్నసత్యమే.ముష్టియాభై లక్షలు? మీపోలిక  బాగుంది.

మనకు పెళ్లి అయ్యి పదిహేను సంవత్సరాలు.అవునా?ఇప్పుడు నాజీతం లక్ష

దాటింది.వుద్యోగం లోచేరిన నాడు ముప్పైవేలు.యావరేజ్ చేసుకుంటే అరవై ఐదువేలు.దానిని పన్నెండుతో హెచ్చించి,మరోసారి పదిహేనుతో హెచ్చవేయండి.కోటి రూపాయల పైమాటే.పోతే భార్య భర్తకు,కుటుంబానికి చేసే సేవలకు విలువ కట్టగల్గితే ఎన్ని కోట్లు దాటుతుందో ఊహకే అందని విషయం.దీనిని తిరిగి యివ్వగలిగే శక్తి మీకు వుంటే వడ్డీ వద్దు అసలు ఇవ్వండి చాలు.”

“ఏంటీ ?ఛాలెంజ్ చేస్తున్నావా?నువ్వు సంపాదించింది అంతా నాకే యిచ్చావా?తమరి తిండీ,నగలు ,చీరలు విషయం మర్చిపోయావా?”

“లేదు మహాప్రభో!ఎలా మర్చిపోతాను? అయితే నా సంపాదనలో నాలుగో వంతు తీసేసి యివ్వండి చాలు.ఏమిటి శ్రీవారు మూగనోము పట్టారు.? అనాదిగా స్త్రీ పురుషుని ముందు మోసపోతూనే వుంది.కారణం మా చేతగాని తనమే.వేదకాలoనాడే నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి అన్నాడో గొప్ప పురుషుడు.స్త్రీకి పతివ్రతా ధర్మాలు చెప్పిన ఆపురుషుడు  తనకు తాను ధర్మాలు చెప్పుకోవడం మర్చిపోలేదు.. కావాలనే వదిలేసాడు.నాడు పురుషాధిక్య ప్రపంచం.కాని నేడు స్త్రీలు విద్యారంగంలో,ఆర్ధిక రంగంలో  పురుషుల్ని అధిగమించారు.ఇప్పుడు మీరు చూపించే పురుషాధిక్యం యిక  చెల్లదు.

స్త్రీ సహనమూర్తి,త్యాగమూర్తి .ఇప్పటివరకు స్త్రీ సహనాన్నిచూసారు.

ఇంకా రెచ్చగొట్టకండి.రెచ్చకొడితే సౌమ్యంగా వుండే పిల్లే పులిగా మారుతుంది.”

“ఓహో!చాలాదూరం వచ్చేశావు అన్నమాట?అంటే ఇప్పుడు మీ అమ్మగారిని నీతో తీసుకురావాలనే ప్రయత్నం ?మనది రెండు బెడ్ రూముల ఫ్లాట్.పిల్లలకు ఒకటి,మనకి ఒకటి.మరి నీ తల్లిగారిని ఎక్కడ వుంచుతావు?ఆలోచించావా?మరీ మంకు పట్టు  పట్టకు.”

“అదే మీ ప్రోబ్లం అయితే చాలా సింపుల్.మూడు బెడ్ రూముల ఫ్లాట్ తీసుకుందాము.లేదా మరో రెండు బెడ్రుముల ఫ్లాట్ తీసుకుని అమ్మని ,కేర్ టేకర్స్ ని అందులో ఉంచుదాము.”

“ఓహో  !తమరు ఆల్రెడీ ప్లాన్ చేసారన్నమాట?మరి చెప్పవే?”

“కన్న తల్లికోసం ఆమాత్రం ఆలోచించడం లో తప్పేముంది?ప్లాన్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడ కండి.వున్న గౌరవం పోగొట్టుకోకండి.”

“గౌరవం విషయం తర్వాత.ఖర్చు యెంత అవుతుందో ఐడియా ఉందా?చెప్పమంటావా?”

“అక్కర్లేదు మహా అయితే యాభై వేలు.అంటే నాజీతంలో సగం కూడా కాదు.”

“అంటే నిర్ణయానికి వచ్చేసావన్న మాట?మరి నన్నెందుకు అడగడం?నీ యిష్టం.”

“అవును నాయిస్టమే .నాకు నిర్ణయం తీసుకునే అధికారం,అవకాశoలేదన్నది  మీ ఉద్దేశ్యం అనిపిస్తోంది.పోనీ మీ నిర్ణయం చెప్పండి.ఆలోచిస్తాను. నాకు తల్లి మీకు అత్తగారేగా?”

“నువ్వు యిప్పుడు వెళ్ళడానికి వీలులేదు.ఇంతకాలం సేవలు చేయించుకున్న

తమరి అన్నగారే చూసుకుంటారు.నామాటగా  నువ్వే చెప్పు మీ అన్నగారికి.”

“నిజమే వాడు చూసుకో గలడు.అమ్మ ఒకస్త్రీ .స్త్రీని స్త్రీ మాత్రమె చూసుకోగలదు.

ఇప్పుడు అమ్మపరిస్థితి అయోమయ స్థితి.జ్ఞాపక శక్తి లేదు.మనుషుల్ని గుర్తించే శక్తి లేదు.తను యిప్పుడు ఒక పసిపాపతో సమానం.క్యాంపుల్లో అన్నయ్య తిరుగుతుంటే యిద్దరు పిల్లలతో వదిన అమ్మను చూసుకోలేదు.నేను మాత్రమే చూసుకోగలను.”

“అయితే నిర్ణయం తీసేసుకున్నావు.నానిర్ణయం కూడా విను.వెళ్ళు కాని తిరిగి రాకు”

మూడురోజుల తర్వాత  విజయ తన సామాను కోసంవచ్చింది.

“నేను చెప్పానుకదా?తిరిగి రావద్దని.తిరిగి నాపాదాల దగ్గరకే వచ్చావు?”

“భ్రమ పడకండి ,భయపడకండి. మనకు యిద్దరు కూతుళ్ళు.శ్రేయా,సౌమ్యా.ఇద్దరినీ   నాకు యిచ్చినా ఓకే.లేదా యిద్దరిని మీరు పెంచినా ఓకే.నేను ఒకప్పుడు మాఅమ్మకు కూతురిని.ఇప్పుడు మాఅమ్మే నాకుకూతురు.ఇదేలోకాలిటీలో ఫ్లాట్ తీసుకున్నాను.ఇద్దరు రెడ్ క్రాస్ అమ్మాయిల్ని అపాయింట్ చేసాను.సర్వెంట్ కం వంటమనిషిని పెట్టాను.మీకు విడాకులు తీసుకోవాలి అనుకుంటే నిరభ్యంతరంగా వచ్చి  తీసుకోండి.భరణం వంటి కక్కుర్తి కాసులకు కక్కుర్తి పడే మనస్తత్వం నాదికాదు.మగవాడిని  అనిఅనిపిoచుకోవాలనుకుంటే మానాన్నగారిచ్చిన ముష్టి యాభై లక్షలు  తిరిగి యిచ్చేయండి.నా అడ్రస్ వాట్స్ యాప్ చేస్తాను.అమ్మా శ్రేయా,సౌమ్యా యిది మేల్ ఇగో వున్న సమాజం.వారు చెప్పిందే వేదం.మీరు ఆలోచించుకోండి..ఎవరితో వుండాలి అనుకుంటున్నారో.ఈతల్లి హృదయం అనుక్షణం మీకోసం ఎదురుచూస్తూనే వుంటుంది.నా ఫోన్ నెంబర్ వుంది మీదగ్గర.మాట్లాడండి.కానీ దానికి కూడా అనుమతి యిస్తారో లేదో మీ నాన్నగారిని అడగండి.ప్రస్తుతానికి సెలవ్.

 

****సమాప్తం***

 

32. ఆడతనం ఓడింది … అమ్మతనం ..గెలిచింది !?

రచన: సాయిగోపాల్ రాచూరి

 

ఈ మధ్య నా మనసేమీ బాగుండటం లేదు ,..అల్లకల్లోలం గా వుంది ,ఏ పని సరిగా చేయలేకపోతున్నా ..ఏదో అలజడి ..ఏదో అసంతృప్తి ,ఎంతకూ తెగని ఆలోచనల ప్రవాహంలో కాస్సేపు అటు ..కాస్సేపు ఇటు కొట్టుకు పోతున్నాను .

అన్యమనస్కంగా ఉంటున్నానని ‘ చీవాట్లు ‘

కూడా తింటున్నాను ,ఏం చెయ్యను ?

సాధారణం గా  నేను ఏ విషయం పట్టించుకోను ,

నా భర్త ,నా పిల్లడు ,నా ఇల్లు అంతే ..!

బంధువులందరు ఊర్లోనే వున్నా వెళ్ళేది చాలా

తక్కువ ,అవుసరం వస్తే ఫొన్ లో మట్లాడుకోవడమే ,టి.వి చూడను ,ఒకవేల

చూసినా తెలుగు సీరియల్స్ అస్సలు చూడను .

స్త్రీ ని ఎంత దారుణం గా చూపిస్తారో ? స్త్రీ

మానసం లో లేని గుణగణాలను చిత్రం గా

చిత్రీకరించి ‘అడదంటే ఇలా ఉంటుందా అని

చూపిస్తున్నారు ..

అయినా అదంతా అప్రస్తుతం ..ఆడదాని గురించి

కొందరి కి ఇంకా సరిగా తెలియదు ..అలాగని

అందరినీ అనలేము కదా ..

ఆడది !?

అవసరార్థమో ..లేక పరిస్తితుల ప్రభావమో లొంగి

పొతుంది ..లేదా లొంగదీయ బడుతుంది ,ఇదే

జీవితం అనుకుంటుంది ..’ అంతా జరిగినాక

సర్దుకుపొతుంది ..ఇదే జీవితం అనుకుంటుంది ,

నాటి సీత నుండి నేటి వరకు ..అంతే ..కదా ,

-అలా ఆలోచిస్తుండగా కాలింగ్ బెల్ మోగింది ,

ఎవరూ అంటూనే తలుపు తీసింది ..ఎదురుగా

-అప్పన్న ,గ్యాస్ సిలెండర్ తో వచ్చాడు లోపల

పెట్టించి దబ్బులిచ్చి పంపించేసింది .

ఏం చెయ్యాలి ? ఆయన ఆఫీస్ కి వెళ్లారు ,బాబు

స్కూలు కి వెళ్ళాడు ,ఇంటి పని వంట పని అయిపొయింది .ఏం చెయ్యాలో తోచక అల సొఫా

లో కూర్చుంది ..

–కళ్లు తెరిచి నా ..కళ్లు మూసినా ఆ దృశ్యమే ?

కనిపిస్తొంది .’ ఆ చిన్నారి రూపమే ‘ ఎంత

బాగున్నాడో !? బోసి నవ్వుతో అమూల్ బేబీ లా

బొద్దుగా భలే ఉన్నాడు .

ఏ తల్లి కన్న బిడ్డడో ! పొత్తిళ్లలో పెరగాల్సి న వాడు ,విస్తర్ల మద్య పెరుగుతున్నాడు ..!?

ఆ సుమ సుకుమార శరీరం ఎండకు కంది పోయి

వానకు తడుస్తూ ,చలి కి వణికి పోతూ ..దుమ్మూ

ధూళిలో పెరుగుతున్నాడు .

ఆ చిన్నారి తండ్రిని తలుచుకుని హృదయం చాలా బాధతో మూలుగుతోంది .కళ్లు చెమర్చాయి

ఏమీ చెయ్యలేని నిస్సహాయత ..

–రెండు నెలల క్రితం అనుకుంటా ఆ బాబుని

చూసింది ,అప్పట్నుంచి ఏదో అలజడి ..ఏదో అసంతృప్తి …అసహనం …ఏదో చేసేయాలని

తపన ..పోనీ పెంచుకుందామా అంటే ఇతను

ఎమంటారో అని భయం ..దానికి తోడు తన బాబు కూడా వున్నాడు కదా ..

ప్రతి గురువారం ముగ్గురం కలిసి బాబా గుడికి

వెళ్తాము ,ఎన్ని పనులున్నా అయన బాబా మందిరం కి వెల్లడం మానరు .

ఆరోజు దర్శనం అయిన తరువాత అలా మర్రిపాలెం వెళ్లి బాబు కి బ్యాగ్ కొందామనుకుని

వెళ్ళాము .

-అదిగో అప్పుడు చూసాను ..ఈ చిన్నరి తండ్రిని ,

రోడ్డు ప్రక్కన ఇద్దరు ముష్టి వాళ్ళు కూర్చుని

ఆడుకుంటున్నారు ,కుష్టు రోగులు ల ఉన్నారు .

ఒకడు బండిలో కూర్చుంటే ఇంకొకడు దానిని

లాగుతున్నాడు .చెక్కల బండిలో కూర్చున్న

వాడి వడిలో ఈ బాబు ..!?

యధాలాపం గా చూశా ! కానీ కళ్లు తిప్పుకొలేకపోయాను ..వాళ్ళు చూస్తే అడుక్కునేవాళ్ళు ..ఈ బాబు వల్ల బిడ్డ కాదనీ

తెలిసిపోతుంది .

ఆ అందమైన మొహం చూడగానే ..ఒక్కసారి

ఎత్తుకుని గుండెలకు హత్తుకొవాలనిపించింది

వేంటనే అయనకు చెప్పాను .ఏవండి ..ఒక్కసారి

ఆ బాబు ని చూడండి ఇంట బాగున్నదో కదా ..

అతను చూసారు ..ఒక్క క్షణం మౌనం గ ఉండిపోయారు .కాస్సేపటి తరువాత అయనే

అన్నారు .” ఎవరో కని పారేసిన పిల్లడనుకుంటా

వీళ్లు తెచ్చి సింపతి కోసం అడ్డుకుంటున్నారు ..

పద ..వెళ్దాం అంటూ బైక్ స్టార్ట్ చేసారు .

ఆ తరువాత రెండు సార్లు మళ్ళీ బాబా మందిరం

దగ్గర చూసింది ..

అదేమిటొ ఆ స్పందన ?

అప్పటినుంచి గుడికి వెళ్లినా ముందు ఆ బాబు

కోసం కళ్లు వెదికేవి .వాళ్లిద్దరూ అడుక్కుంటుంటే

తాను ఆ బండి తో అడుకునేవాడు ..

ఏ తల్లి కన్న బిడ్డడో ? ఎలా పెరగాల్సినవాడో

ఇలా పెరుగుతున్నాడనిపించేది ..

నేను మాత్రం చాలా డిస్టర్బ్ అయ్యాను .

మరచిపోలేక పాటు మదన పడుతున్నాను .

బాబా ని కోరుకున్నా …!

***********×****************+********×

—మురళి నగర్ ,

హైదరాబాద్ లో బంజారాహిల్స్ కి ఇంట ప్రాముఖ్యత ఉందో …విశాఖపట్నం లో మరళీనగర్ కి అంతే ప్రాముఖ్యత ఉంది .ఎక్కువగా ధనవంతులు నివశించే ప్రాంతం

ఆ మురళి నగరులో  వైశాఖి పార్కు ప్రక్కనే ఉంది

” విశాల్  భవన్ ” ..పేరు లా చాలా విశాలం గ ఉంది .రెండు మెయిన్ గేట్ లు ..ఇద్దరు సెక్యూరిటీ

గార్డ్ లు ,

లొపల ఇంద్ర భవనం లా ఉంటుందని అందరు

అనుకోవడమే ..ఆ ఇంటి యజమాని ‘లయన్ ‘

రామిరెడ్డి గారు .చాలా పెద్ద కాంట్రాక్టర్ .కోటీశ్వరుడు ..అయన భార్య శ్రీ విశాల

ఒక స్కూలు కి డైరెక్టర్ ,అంతే కాదు మహిలా మండలి అద్యక్షురాలు కూడా ..చాలా బిజీ ..

–వారికున్న ఏకైక సంతానం ..శ్రీ సుధా ..

ఆ స్థితి తో ఉండేవారు ఒక్కగానొక్క కూతురిని

ఎలా చూసుకుంటారో ..ఎలా పెంచుతారో ఊహించుకోవచ్చు ..

ఇక సుధా …అందాలరాశి ..ఆ అందం అమెకు

అలంకరమైతే బాగుండేది …కానీ అహంకారమయ్యింది ,ఆ అహంకారము ఆమెను

నిలువునా ముంచింది .

ఒక వైపు ధన మదం ..మరో వైపు అందరికంటే

అందగత్తెనని గర్వం ..డబ్బుండలి గానీ ..ఎక్కడైనా తిరగవచ్చు ఏమైనా చెయ్యవచ్చు ..

వింటా వింటా స్నేహలు ..సరదాల షికార్లు ..వాటంతట అవే వస్తాయి ..అలానే

వచ్చాయి కూడా …–

–ఓ వైపు కాంట్రాక్టులు ..మరొ వైపు రాజకీయాలూ

‘ నాన్న ‘ చాలా బిజీ ..ఇంచుమించు అమ్మ కుడా అంతే ..ఏది మంచి ? ఏది చెడు ? ఏది చెయ్యాలి ? ఏది చెయ్యకూడదు ? చెప్పే వారు  లేరు .నొరు మెదపని నౌకర్లు మాత్రం కళ్ల తో

మాటలాడుకునేవారు .గుసగుసలాడేవారు .

– ఏమి జరగకూడదో అదే జరిగింది .

” తల్లి ” చాలా క్యాజువల్ గ తీసుకుంది మోడరన్

సొసైటీ తో ఇదంతా కామన్ అంది ,పెద్దగా బాధ

పడలేదు ..అంతగా ఆశర్యపడలేదు .” కడిగేస్తే ”

పోతుందని చెప్పింది ..

నాన్న గాబరా పడ్డాడు ..నలుగురికి తెలిస్తె పరువు

పోతుందని భయపడ్డాడు .పిల్ల జీవితం ఏమవుతుందో అని భయపడ్డాడు ..రేపు ఎవరు

పెళ్లి చేసుకుంటారని బాధ పడ్డాడు .

ఫామిలీ డాక్టర్ని సంప్రదిస్తే అబార్షన్ స్టేజి దాటి

పోయిందని చెప్పాడు ..ఏమైనా మొండిగా

ముందుకెళ్తే ప్రాణానికి ప్రమాదం అని చెప్పి ఒక సలహా ఇచ్చాడు .

“అంతా ” రహస్యం గ జరిగిపోయింది ..

డెలివరీ కాగానే బిడ్డని వదిలించుకుని ,లేడా ఎవరికైనా ఇచ్చేసి ,అమ్మాయిని చదువు పేరుతో

విదేశాలకు పంపేద్దామనుకున్నారు .

ఇదీ నిర్ణయం ..

డబ్బు ..హోదా ..పలుకుబడి బాగానే పని చేసాయి .ఇంట్లోనే డెలివరీ అయ్యింది .కాకపొతే

పసికూన చేతులు మారింది ..

అభినవ కుంతీ దేవి ..మరొ కర్ణుడిని రోడ్డు పాలు చేసింది …!!!

×**********************×****×***********

మనిషి తను అనుకున్నట్లు బతకలేడు ,ఇతరులనుకున్నట్లు జీవించలేడు ..

రోజులన్నీ ఒకేలా వుండవు .సుధ లో చాల

మార్పులు వచ్చాయి .ఆవేశం చల్లారింది .అహంకారం అణిగిపోయింది .ఆలోచన

మొదలైంది .

ఎంత నీచం గ ప్రవర్తించింది ..

ఇంట ఘోరం చేసింది ?

పశ్చాతాపపు అలల సుడిలో ఉక్కిరి బిక్కిరైంది

ఏదో “మైకం ” తో మూడు నిమిషాల సుఖం

కోసం అర్రులు చాచింది ..సరదా తీర్చుకుందామనుకుంది ..కానీ ..ఇప్పుడు ..ఇప్పుడు ..హృదయవిదారకంగా ఏడుస్తోంది.

మానసికంగా ,శారీరకంగా క్షోభ పడుతోంది ..

మాతృత్వపు మాదుర్యాన్ని తడిగా ఉన్న స్తనాలు

గుర్తు చేస్తుంటే ,మడత పడిన పేగు మమకారాన్ని గురుతు చేస్తుంటే …మనస్సు తన బంధాన్ని

తన రక్తాన్ని ప్రశ్నిస్తుంటే  వూరుకోలేకపోయింది .

మనిషికి ..మనసుకు సంఘర్షణ మొదలయింది ..మనిషేమో ఇదంతా మామూలే

అంటుంటే మనసేమో ఎదురు తిరిగింది ..మానవత్వాన్ని ప్రభోదించింది ..

అమ్మతనపు అనురాగాల మధురిమలు

చవిచూడమంటోంది .మాతృత్వం వరమని ..

గుర్తించింది.

–ఒక రోజు …

ఇంట్లో జరిగిన సంభాషణ తో అది కాస్తా ముదిరింది ..అమ్మ తనకు పెళ్ళి చేసెయ్యాలని

దగ్గర సంభందం వద్దు ..దూరపు సంభంధం చేద్దామని చెప్తుంటే విని తల్లడిల్లింది..

తనకు పెల్లి వద్దంది .తన తప్పుకు తానే భాద్యత

వహిస్తానంది ..

లోకం గానీ ..సంగం తో గానీ పని లేదంది .

తనకు తన బిడ్డ కావాలంది.

ప్రాధేయపడింది ..బ్రతిమిలాడింది

..చివరకు ఛస్తానని బెదిరించింది ..

నిజం గా చస్తుందని భయపడ్డారు ..

ముగ్గురు కలిసి డాక్టరుని కలిశారు ..అడిగారు

బిడ్డ ఏదని …ఎం చేసారని ?

–డాక్టర్ చాల మంచివాడు …ఎవరికీ చెప్పకుండా

తెలియకుండా చెత్త కుండీ తో పారెయ్యమని నర్స్ కి చెప్తే …ఆవిడ కూడా మంచిదే …కాకపొతే

హాస్పిటల్ వెనుక నున్న కుష్టు రోగులకు వెయ్యి రూపాయలకు అమ్మేసింది ..

అంతే …వేట …

మొదలయింది ..

దిక్కు నడిగింది ..చుక్క నడిగింది ,పక్కనెళ్ళే

పైరు గాలిని అడిగింది ..

తన బిడ్డ దొరికితే అన్ని దేవాలయాల్లో అభిషేకాలు చేస్తానని మొక్కుకుంది.

పిచ్చి దానిలా వెతుకుతోంది ..వెతికిస్తోంది..

అమ్మ మనసు …

************

మా ఇంటికి మా అన్నయ్య వదిన పిల్లలతో వచ్చారు.నకు కొంత రిలీఫ్ వచ్చింది .వీళ్లందరితో

ఇల్లు కాస్త సందడిగా మారింది .చాలా ఆనందంగా

వుంది .

అలా కొన్నాళ్ళు గడిచాయి ..

యధావిధి గా మేము బాబా మందిరం కి వెళ్ళాం .

దర్శనం చే సుకుని చుట్టూ చూశా ..

నా కళ్లు ఎవరికోసమో వెతుకుతున్నాయి ..

ముష్టివాళ్లు లేరు ..బండి లేదు .

బైల్దేరదామనుకుంటుంటే ..!?

‘ సర్రు సర్రు న రెండు స్కార్పియో లు వచ్చి ఆగాయి .

ఆ వెనుక తెల్లని ఇన్నోవా కారు వచ్చి ఆగింది.

డోర్ తెరుచుకుంది..

అమె దిగింది ..

మెరుపు మెరిసినట్లు …ఆ మెరుపుల మద్య

అప్సరస దిగినట్లు అనిపించింది .

కన్నార్పకుండా ..ఆశ్చర్యం తోఁ చూస్తుండగా

దేవతలా ..తెల్లగా అద్భుత సౌందర్యం తో ,

ఆమె …

మోహన చిరునవ్వుతో ..కిందికి దిగి కాస్త వయ్యారం తొ కారులోకి వంగి సున్నితం గా

ఓ బాబు ని  ఎత్తుకొని బైటకు తెచ్చింది ..

ఆశ్చర్యం !!!!

ఆ బాబే …యువరాజులా ..మెరిసిపోతున్నాడు

తన చిట్టి చేతులతో తల్లి మెడను గట్టిగా పట్టుకుని బోసి నవ్వుతొ ..

–నాకు తెలియకుండ నా కంట్లోంచి గోదారి …

కన్నీరు ..గుడిలోకి వెళ్తున్న వాళ్ళని చూస్తూ …

బాబా …బాబా…సాయిబాబా …

అంటూ అలా ఆ రోడ్డు మీదే ప్రణామం చేశాను.

 

***************