తపస్సు

రచన: రామా చంద్రమౌళి

 

జ్ఞానానికి రూపం లేదు.. గాలి వలె
ప్రవహించడం జీవ లక్షణమైనపుడు
స్థితి స్థల సమయ కాలాదులు అప్రస్తుతాలు
అగ్ని ఎప్పుడైనా, ఎక్కడైనా దహిస్తుంది కదా
జ్ఞానమూ, కళా అంతే
దహిస్తూ, వెలిగిస్తూ, దీప్తిస్తూ.. లీనమైపోతూంటుంది –
అది సంగీతమో, సాహిత్యమో, యుద్ధ క్రీడో
శిష్యుడు తాదాత్మ్యతతో భూమై విస్తరించాలి విస్తృతమై .. ఎదుట
అప్పుడు ముఖం రెక్కలు విప్పిన ‘ ఆంటెనా ‘ ఔతుంది
బీజాలు బీజాలుగా, సంకేతాలు సంకేతాలుగా .. జ్ఞాన వినిమయం
ఎప్పుడూ భూమిపై కురిసే చిరుజల్లుల వానే
తడుస్తున్నపుడు, రాగాలు హృదయాన్ని తడుతున్నపుడు
శరీరంలోనుండి.. గుంపులు గుంపులుగా పక్షులు సమూహాలై ఎగిరిపోతూ
లోపలంతా ఖాళీ
చినుకులు చినుకులుగా నిండిపోవాలిక మనిషి –
అలంకారాలుండవు.. శిష్యునికీ గురువుకూ
ఒక ఆత్మా.. ఒక దేహం.. ఇద్దరిలో రవ్వంత అగ్ని ఉంటే చాలు
విద్యే ఒక ఆభరణమౌతుంది
పాఠశాలలో ద్రోణుడూ పాండవకౌరవులూ, కొన్ని కుట్రలు అవసరం లేదు
కళాభ్యాసం నిరలంకారంగా వంటగదిలో,
పశువుల పాకలో, రాతి అరుగులపై కూడా జరుగుతుంది
బీదవాడి ఆయుధమైనా, వాయిద్యమైనా
దానికి ఒక పలికే గొంతూ, ద్రవించే జీవమూ ఉంటే చాలు
గురు శిష్యులు తపో మగ్నతలో ఉన్నపుడు
ఋతువును తోడ్కొని కాలం వాళ్ళ పాదాక్రాంతమౌతుంది
దీపం మట్టి దిగుట్లో కూడా దేదీప్యమై ప్రకాశిస్తుంది –

(పై చిత్రాన్ని ఫేస్‌ బుక్‌లో లభ్యపరచిన మిత్రునికి ధన్యవాదాలు – మౌళి)

TAPAS

Translated by Indira Babbellapati

Wisdom is abstract like air.
When flowing is the mark of life,
time the, status, or place
remain immaterial.
Just as burning and reducing the object
to ashes is the nature of fire,
so is wisdom and art.
They burn and throw light,
be it music, a poem, or
even a game of war.

The student should
immerse himself
so as to spread as the expanding earth.
Only then the countenance becomes
an antenna with wings spreading for
knowledge to transmit in coded letters.
When showers drench us, when a tune

gently knocks at the heart, birds hidden in
the body flap their wings to fly in flocks.
A sudden void is created
only to be filled by rain drops.
No embellishments needed for the teacher and the taught,
one soul, one body and
an iota of fire is enough to make knowledge your jewel.
Who needs a school or a Drona or the Pandavas or
the Kouravas and all that plotting?
Imparting education needs no place.
It can take place in the kitchen,
It can take place in a cattle shed or
can be carried out sitting on a stone-slab!
A beggar’s weapon or an instrument needs
only a voice and life that flows.
When the teacher and the taught are in unison,
time brings with it the seasons to surrender.

A wick burns bright
even in an earthen pan!

తపస్సు – ఆఖరి మెట్టు పైనుండి.

రచన: రామా చంద్రమౌళి

ఇక్కడనుండి చూడు.. ఈ ఆఖరి మెట్టుపైనుండి
ముషాయిరా.. రాత్రిని కాల్చేస్తూ కాల్చేస్తూ
ఎలుగెత్తిన స్వరాలను మోసుకుంటూ గాలిలో .. ఒక దుఃఖజీర
ప్రక్కనే నిరంతరమై ప్రవహిస్తూ.. నది.. నిశ్శబ్దంగా –
ఔనూ.. శరీరంలోని ప్రాణం శబ్దిస్తుందా
పాదాలు ఒక్కో మెట్టు ఎక్కుతున్నప్పుడు
అందుకోవాలని అలలు పడే యాతన.. ఒక వియోగ జీవక్షోభ
గజల్‌ గాయని ఒక్కో వాక్యకణికను
యజ్ఞంలోకి సమిధగా అర్పిస్తున్నపుడు
అక్షరాలు.. అగ్నిబిందువులై తేలి వస్తూంటాయి గాలిలో
సముద్ర జలాలపై లార్క్‌ పక్షుల్లా –
భూమిలో విత్తనమైనా, పిడికిట్లో నిప్పైనా
ఎన్నాళ్ళు దాగుంటుంది
మొలకెత్తడం.. దహించడం అనివార్యం కదా –
అర్థరాత్రి దాటుతూంటుంది.. అంతా మత్తు.. స్వరమధురిమ మైకం
వజ్రా హారాలేవో తెగిపోతున్నట్టు

From the Last Step
Hey, look from here,
standing at this last step,
the wind that carried the
vibrating notes that sprang forth
from the ashes of last night’s mushaira.

A sorrowing streak eternally flows beside
a river in a silent flow. Yes, tell me,
if life flows humming in the body?
The waves struggle to capture the feet
negotiating the stairs upward, there
echoes a haunting melody of destitution.
When the ghazal singer offers each of
her lines as the chips to the holy fire,
the letters, like drops of fire, come
floating in the air like larks hovering
on the surface of the sea. How long
can the earth retain a seed in its womb?
How long can fire be held in one’s fist?

తపస్సు – సంతకం

రచన: రామా చంద్రమౌళి

ఆవులిస్తూ మనిషి ఒళ్ళు విరుచుకుంటున్న ప్రతిసారీ
సవరిస్తున్నప్పుడు సాగే ఫిడేల్‌ తీగ
సారిస్తున్నప్పటి విల్లు అల్లె తాడూ జ్ఞాపకమొస్తాయి
స్ట్రెచ్‌.. స్ట్రెచ్‌
హృదయమూ, ఆత్మా వ్యాకోచిస్తున్నపుడు
సముద్రం అలలు అలలుగా విస్తృతమౌతున్నట్టు
మనిషిలోని తరతరాల వారసత్వావశేషాలు మేల్కొనడం తెలుస్తూంటుంది
మంచుతుఫానుల్లో మనిషి గడ్డకడ్తూండడం
మండుటెండలో మనిషి కరిగిపోతూండడం
ఒక సత్యాన్ని ప్రవచిస్తుంది
సంకోచించగల మనిషో.. ఒక అక్షరమో
ఎప్పుడో ఒకప్పుడు తప్పక వ్యాకోచిస్తాయని –

కాళ్ళని నిక్కించి మునగదీసుకుంటున్న
కుక్క తను నీ చేయి నిమురుతున్నప్పటి
పారవశ్యాన్నీ అర్థం చేసుకోగలదా
బావి నీటిలోకి బొక్కెనలా
మనిషి ఒక ఏకాంతంలోకి జారిపోతున్న ప్రతిసారీ
కాలసముద్రంలోకి యాత్రిస్తూ యాత్రిస్తూ
తనను తాను వెదుక్కుంటూ
మనిషంటే.. ఒక మహారణ్యాల సమూహమని తెలుసుకుంటూ
ఒక మనిషిలో వంద వేల పురా మానవులను కనుక్కుంటూ…
లోపల చినుకు చినుకుగా
ఎండిన ఆకులూ.. పూలూ.. కొన్ని నక్షత్రాలూ వర్షిస్తున్నప్పుడు
స్ట్రిచ్‌.. స్ట్రెచ్‌.. ఇంకా సాగిపో
విస్తరిస్తున్నకొద్దీ
తీగకు ఒక రాగమందుతున్నట్టు.,
అక్షరం పదమై.. వాక్యమై.. గ్రంథమౌతున్నట్టు
ఒట్టి శబ్దం సాగి సాగి
ప్రవహించీ ప్రవహించీ.. సంగీతమౌతున్నట్టు
రవ్వంత అగ్నిని పొదువుకుంటూ పొదువుకుంటూ
ఒక వాక్యం కవిత్వమై ధగ ధగా మెరుస్తున్నట్టు
స్ట్రెచ్‌.. సాగదీస్తూ సాగదీస్తూ అనంతమౌతున్నకొద్దీ
‘ పరమం ’ (absoluteness) అర్థమౌతుంది –
సంకోచించగల ప్రతిదీ వ్యాకోచిస్తుందనీ
మౌనమే మహాసంభాషణౌతుందనీ
చీకటి వ్యాకోచించీ వ్యాకోచించీ
చివరికి వెలుగౌతుందనీ .,
మనిషి విస్తరించీ విస్తరించీ
చివరికి ఒక ‘ సంతకం ’ ఔతాడనీ తెలుస్తుంది
*************************
సంతకమే.. చివరికి మిగిలే మనిషి జాడ –

**************

Translated by Purushothama Rao Ravela

The Signature

Every time when a human wakes up yawning
and curling out his body,
it appears to me like it is strenthening
the wire of a musical instrument tightly
and also like stretching long the wire tied to an archary bow.
Stretch and stretch
when the heart and soul start expanding,
it is felt as if the sea waves are spanning out,
largely to a wide and far place.

We also assume them as if some heriditary faces,
since many generations are back,
and down the line, they are putting up
brave faces, emerging as energetic forces in lots.
The solidifying nature of humans
in snow storm will tell us a factual truth.
A human or a letter, which have a trait of expanding,
will definitely, of sure are likely to stretch ahead
and very well beyond its limitations.

Can we estimate the value of ecstasy
one derives when he pats his pet,
putting on a softening smoothness
on its head and hair there on?
Like a dropping down bucket in the well waters,
the human also start to slip down into his loneliness,
and eagerly search for his own self and
this search goes unending and ceaseless many a time.

One realises a fact that the humans mean
a cluster of thickly grown forests.
In one human hundreds of age old humans are found at last.
In the process of the act of expansion,
some leaves get dried and flowers get waned
and stars too drowned in rains.
Still, stretch and stretch.
The letters become words, then
sentences and finally, a book.
Streaming its flows, further and further
as it turns out to be a mellifluous music.

Catching hold of a smaller fire stock,
and capturing it into captivity ,
it turns out to be a sentence ,
and there after slowly turns as poetry,
and start to sizzle onwards, so magnificently.

Stretch and stretch
expanding it further more,
till it reaches to infinity, once for all.
Then would one realize it as sheer absoluteness.
whatever contracts, it goes on expanding.
and complete silence too,
turns out to be a day long conversation,
Even the darkness, after a graded stretch,
flashes out as complete brightness.
Likewise, the human stretches and stretches
so that it will be a signature.
It’s so crystal clear.

At long last the signature itself remains
a priceless asset of the humans.

తపస్సు – మొదటి సమిధ

రచన:- రామా చంద్రమౌళి


ఔను .. ఈ శరీరం ఒక పుస్తకమే .. సంహిత
బీళ్ళు, అరణ్యాలు , నదులు, పర్వతాలు .. అన్నీ
ఈ దేహంలోనే .. సుప్త సముద్రాలు , జ్వలితాకాశాలు
పుట వెనుక పుట తిప్పుతూ
ఎన్ని యుగాలుగానో .. ఈ బూజుపట్టిన గ్రంథాల పురాపరిమళం
హోమర్ లు, వ్యాసులు, కంఫ్యూషియస్ లు, సూఫీలు
అన్నీ రక్తనదుల్లో కొట్టుకుపోతూ రాజ్యావశేషాలు
ఏ చక్రవర్తి జాడించి సింహాసనంపైకి బొంగరాన్నో , ఖడ్గాన్నో విసిరినా
అది .. రాజ్యంకోసమో , రమణీ ప్రియద్యూతిక రతిక్రియ కోసమో
రాక్షస హింసానందంకోసమో ,
స్క్రూ డ్రైవర్ ను ఎదుటివాని అరచేయిలో నాటుతున్నప్పటి
రక్తవిస్ఫోటనం .. హింస .. ఒక పైశాచిక పరమానందం
సీ అండ్ ఎంజాయ్ .. షో అండ్ ఎంజాయ్
ఫక్ అండ్ ఎంజాయ్ .. ఎంజాయ్ బట్ డోంట్ ఫక్
అంతిమంగా .. అన్నీ స్రావాలు.. దుఃఖాశ్రు పాతాలు
చివరికి ఒంటరి అశ్వద్థ వృక్ష కొమ్మకు
వ్రేలాడ్తూ , శబ్దిస్తూ .. ఇనుప గొలుసుల చెక్క ఊయల
కిర్ కిర్.. కిర్ కిర్
గాలి నిశ్శబ్ద సాక్ష్యం .. అనాది మానవుని అసలు చరిత్రకు –
యజ్ఞ కుండాల ముందు వేదమంత్ర ఘోష
ఓం నారాయణే బ్రహ్మః .. ఓం నారాయణే శివః
ఓం నారాయణే ఇంద్రః
ద్వాదశ రుద్రులు .. అష్టాదిశ పాలకులు .. వ్యాసులు అరవైఆరు .,
అనాది పురాణ, ఇతిహాస, ఋక్ ఘోషలన్నీ
మూసిన పిడికిట్లో బందీ ఐన చిదంబర రహస్యాలు
విముక్త కాంక్ష .. యుగయుగాల తిరుగుబాట్లలో
హావ్స్ .. అండ్ హావ్ నాట్స్
రెండే రెండు జాతులు ప్రపంచ మానవ మహాసమాజంలో
ఉజ్జయిని కోట గోడపైనైనా, చైనా లాంగ్ వాల్ పైనైనా
ఒరేయ్ తండ్రీ
గోడకు కొట్టిన పిడక ఎండిన తర్వాత రాలిపోవాల్సిందే
మనిషి మాత్రం .. రొచ్చు
గోమూత్రం ఔషదం
విసర్జితాలన్నీ ఒకటి కావు
నీ ఆహారాన్నిబట్టి నీ బహిర్ పదార్థాలు
శుద్ధి చేసుకోవాలి ఎవరికివారు.. అగ్ని చికిత్సతో
ఓం అంతరిక్షగం శాంతిః .. ఓషదయ శాంతిః
వనస్పతయ శాంతిః .. ఓం శాంతిరేవ శాంతిః
అని ఒక మహోధృత అశాంతలోకంలోనుండి
శాంతి క్రతువును మానవమహాప్రపంచమంతా హోమిస్తున్నపుడు
అగ్నిని శిరస్సున ధరించిన మొట్టమొదటి సమిధ ఎవరు .. అంటే
… అది నేనే.. ఆత్మాహుతితో –

తపోముద్రల వెనుక

రచన: రామా చంద్రమౌళి

తలుపులు మూసి ఉంటాయి
కొన్నిసార్లు తలుపులు మూసివేయబడ్తాయి
మూసినా, మూసివేయబడ్డా
వెనుకా, లోపలా గోప్యంగా ఉన్నది ఏమిటన్నదే ప్రశ్న –
ముందు ఒక ఛాతీ ఉంటుంది
వెనుక ఒక గుండెనో, ఒక హృదయమో ఉంటుందని తెలుస్తుంది
అరే .. ఒక నది తనను తాను విప్పుకుని
అలలు అలలుగా ప్రవాహమై వికసిస్తున్నపుడు
భరించగలవా నువ్వు జలసౌందర్య బీభత్సమధురాకృతిని
ప్రశాంతత నీలిమేఘాల వెనుకనో
తపోముద్రల వెనుక విలీనతలోనో
అప్పుడే వికసిస్తున్న పువ్వు ముఖంలోనో
ఉంటుందనుకోవడం భ్రమ –
శాంతత ఎప్పుడూ మరణంతో యుద్ధంచేస్తున్న
సమరాంగణ నాభికేంద్రకంలో ఊంటుంది
శోధించాలి నువ్వు
పిడికెడు మట్టినీ,
కొన్ని తడి ఇసుకలోని చరణముద్రలనూ,
పాత నగరాల్లోని పాకురుగోడలపై
ఎండిపోయిన దుఃఖపు మరకలనూ,
పురాతన హవేలీలలో
నిశ్శబ్దంగా వినిపిస్తున్న కాలిగజ్జెల ‘ వహ్వా వహ్వా ‘ లనూ-

మనుషులు సమూహాలుగా, జ్ఞాపకాలుగా స్మృతులుగా వెళ్ళిపోతున్నపుడు
ఇక ఇప్పుడు ఈ ఋణావశేషాలపై విశ్లేషణలెందుకు
మృదంగనాదాలూ, సారంగీ విషాద స్వరాలూ
అన్నీ అశృనివేదనలే వినిపిస్తాయి … కాని
తడి సాంబ్రాణి పొగలూ, గులాబీ పరిమళాలూ
ఎగిరిపోతున్న పావురాల రెక్కల్లో కలిసి
దిగంతాల్లోకి అదృశ్యమైపోయి శతాబ్దాలు గడిచిపోయాక
ఇప్పుడిక
నువ్వు తలుపులకేసి తలను బాదుకుంటే ఏం లాభం –
ఇంతకూ
నువ్వు తలను ఛిద్రం చేసుకునేది
లోపలినుండి బయటికి రావడానికా
బైటినుండి లోపలికి నిష్క్రమించడానికా-

లేలేత స్వప్నం

రచన: రామా చంద్రమౌళి

 

ఆమె లీలావతి – పదవ తరగతి
అప్పటిదాకా ‘లీలావతి గణితం’ చదువుతోంది.. అన్నీ లెక్కలు
కాలం – దూరం, కాలం – పని, ఘాతంకముల న్యాయం
చకచకా ఒక కాగితం తీసుకుని రాయడం మొదలెట్టింది పెన్సిల్ తో
బయట ఒకటే వర్షం.. చిక్కగా చీకటి

2

చెత్త.. తడి చెత్త.. పొడి చెత్త
ఆకుపచ్చ.. నీలి ప్లాస్టిక్ టబ్స్
” ఐతే చెత్త ఎప్పుడూ పదార్థ రూపం లోనే ఉండదు
చెత్త ఎక్కువ ‘ మానవ ‘ రూపంలో ఉంటుంది
బాగా విద్యావంతులైన మానవులు త్వరగా చెత్తగా మారుతారు ”
చెత్త ఎప్పుడూ చెడు వాసన మాత్రమే వేయదు
అప్పుడప్పుడు ‘ డీ ఓడరెంట్ ‘ సువాసనలతో ప్రత్యక్షమౌతుంది
దాన్ని గుర్తించడం చాలా కష్టం
బ్యాంక్ లకు వందల కోట్ల అప్పు ఎగ్గొడ్తూ ప్రధాన మంత్రి ప్రక్కనే ఒక మంత్రుంటాడు
చెత్త.. సురక్షితంగా –
సుప్రీం కోర్ట్ అతని నెత్తిపై చెత్తను కుమ్మరిస్తూనే ఉంటుంది
ఐనా చెత్తను గుర్తించరు
‘ మన్ కీ బాత్ ‘ లో రోడ్లను ఊడ్వడం.. చీపుళ్లను కొనడం గురించి
దేశ ప్రజలు చెవులు రిక్కించి ‘స్వచ్ఛ భారత్ ‘ ప్రసంగం వింటూంటారు
‘ మానవ చెత్త ‘ ను ఊడ్చేయగల ‘ చీపుళ్ళ ‘ గురించి
‘ ఆం ఆద్మీ ‘ చెప్పడు
ఐదు వందల రూపాయల అప్పు కట్టని రహీం పండ్ల బండిని జప్త్ చేసే బ్యాంక్ మగాళ్ళు
సినిమా హీరోలకూ, మాల్యాలకూ, నీరబ్ మోడీలకు, దొంగ పారిశ్రామిక వేత్తలకు
వాళ్ళ ఇండ్లలోకే వెళ్ళి వేలకోట్లు
అప్పిచ్చి .. లబోదిబోమని ఎందుకు ‘ రుడాలి ‘ ఏడ్పులేడుస్తారో తెలియదు
చాలావరకు చెత్త .. కోట్ల రూపాయల కరెన్సీ రూపంలో
రెపరెపలాడ్తూంటుంది లాకర్లలో

విశ్వవిద్యాలయాలు
ఈ దేశ పేదల అభున్నతికోసం పరిశోధనలు చేయవు
పెద్దకూర పండుగలు.. అఫ్జల్ గురు దేశభక్తి చర్చల్లో
ఉద్యమ స్థాయి ప్రసంగాల్లో తలమునకలై ఉంటాయి
‘ హక్కుల ‘ గురించి మాట్లాడే చెత్తమేధావి
‘ బాధ్యత ‘ ల గురించి అస్సలే చెప్పడు –

లీలావతి ఎదుట ఆ రోజు దినపత్రిక..దాంట్లో ఒక ఫోటో ఉంది
రైలు లోపల బెంచీపై.. ఆమె కూర్చుని చేతిలో ‘ వాట్సప్ ‘ చూస్తోంది
ముఖంలో.. తపః నిమగ్నత
పైన కుర్తా ఉంది.. కాని కింద ప్యాంట్ లేదు..అర్థనగ్నం
తెల్లగా నున్నని తొడలు
రైలు బాత్రూంలో ‘ వాట్సప్ ‘ చూస్తూ చూస్తూ..ప్యాంట్ వేసుకోవడం
మరచి వచ్చి కూర్చుంది.. అలా
అదీ ఫోటో.. చెత్త.. ఉన్మాద యువతరం.. మానవ చెత్త –

పది రోజుల క్రితమే తమ వీధిలో వేసిన
ఐదు లక్షల తారు రోడ్డు
నిన్న రాత్రి వానకు పూర్తిగా కొట్టుకుపోయి
‘ చెత్త కాంట్రాక్టర్ ‘ .. తడి చెత్త

లక్షల టన్నుల మానవ చెత్తతో నిండిన ఈ దేశాన్ని
ఎవరు.. ఏ చీపుళ్ళతో.. ఎప్పుడు ఊడుస్తారో
చాలా కంపు వాసనగా ఉంది.. ఛీ ఛీ-
ఐనా..’ భారత్ మాతా కీ జై ‘
3

లీలావతి పెన్సిల్ ను ప్రక్కన పెట్టి నిద్రపోయింది
నిద్రలో కల ‘వరిస్తూ’ ఒక కల
ఒక నల్లని బుల్ డోజర్ లారీ నిండా.. కోట్లూ , టై లతో మనుషుల శవాలు
కుప్పలు కుప్పలుగా
అంతా మానవ చెత్త.. చెత్తపైన వర్షం కురుస్తూనే ఉంది.. ఎడతెగకుండా
లీలావతి కల .. లేత ఎరుపు రంగులో లేలేత కల –

నదుల తీరాలపైననే నాగరికతలన్నీ

రచన: రామా చంద్రమౌళి

 

 

నాగరికతలన్నీ నదుల తీరాలపైననే పుట్టినపుడు

మనిషి తెలుసుకున్న పరమ సత్యం .. ‘ కడుక్కోవడం ‘ .. ‘ శుభ్రపర్చుకోవడం ‘

ఒంటికంటిన బురదను కడుక్కోవడం , మనసుకంటిన మలినాన్ని కడుక్కోవడం

చేతులకూ, కాళ్ళకూ.. చివరికి కావాలనే హృదయానికి పూసుకున్న మకిలిని కడుక్కోవడం

కడుక్కోవడంకోసం ఒకటే పరుగు

కడుక్కోడానికి దోసెడు నీళ్ళు కావాలి .. ఒక్కోసారి కడవెడు కావాలి

మనిషి లోలోపలి శరీరాంతర్భాగమంతా బురదే ఐనప్పుడు

కడుక్కోడానికి ఒక నదే కావాలి-

 

అసలు నది నిర్వచనమే ‘ కడుగునది ‘ అని

మనుషులను, పశువులను, పాపులను, పుణ్యులను

సకల చరాచర ప్రాణిసమస్తాలను కడగడమే నది పని

నది అంటే ఆగనిది

నది అంటే పరుగెత్తేది

నది అంటే వెనక్కి తిరిగి చూడనిది

నది అంటే నిత్య చలన చైతన్య శీలి.. జీవ ఝరి –

 

నదికి పుష్కరమంటే

తల్లి ప్రత్యేకంగా ప్రేమతో బాహువులు చాచి పిల్లలను పిలుస్తూండడమే

‘ బురదలో ఆడుకుని ఆడుకుని మకిలి పట్టిన పిల్లల్లారా

రండి నా ఒడిలోకి .. మిమ్మల్ని ప్రేమతో లాలించి మళ్ళీ

మీ ఒంటి .. మీ హృదయాల బురదనంతా కడిగి శుభ్రిస్తా రండి ‘

అని తీరమై విస్తరించి అభ్యర్థించడమే .. స్నానించడమే

ఇక ఒడ్డున జరిగే క్రతువులన్నీ అంతా ఒక తంతు

పూజలు .. పిండాలు ..    హారతులు .. తర్పణాలు .. అర్ఘ్యాలు

అంతా ఒక యథాలాప తాంత్రిక ప్రక్రియ

పుష్కర పర్యటనలను విహార యాత్రలో, వినోద యాత్రలో చేసుకుని

‘ జస్ట్ టు ఎంజాయ్ .. జస్ట్ టు సీ వాటర్ ‘ అనుకునేవాళ్ళకు

పన్నెండేళ్లకొకసారి పుష్కరించే నది ఒక కొరడా దెబ్బే

నదిని ఒక జీవదాతగా .. ప్రాణప్రదాయినిగా

నదిని ఒక నాగరికతా ప్రదాతగా

ఆఖరికి నదిని తల్లిగా స్వీకరించగల్గడమే  .. పుష్కర పాఠం

నీటిని ప్రాణమని గ్రహించడం .. నీటిని జీవమని తెలుసుకోవడం

నీరే దైవమని ప్రార్థించడం

చివరికి నీరే మనిషని స్పృహించడం

అదే .. అంతిమ పుష్కర పాఠం

నువ్వు పుష్కరుడవో .. పుష్కరిణివో .. జలదేవతా నీకు నా నమస్కారం –

 

 

ఒక ప్రాతః వేళ

రచన: రామా చంద్రమౌళి

ఒక సీతాకోక చిలుక వచ్చి భుజంపై వాలినట్టనిపించి
చటుక్కున మెలకువ వస్తుంది
నిజానికి ప్రతిరాత్రీ నిద్రపోవడం ఎంత చిత్రమో
మర్నాడు మనిషి మేల్కొనడం అంతకన్నా విచిత్రం
జీవించీ జీవించీ అలసి రాతిశరీరాలతో
తిరిగొచ్చిన తర్వాత
ఏమి కనిపిస్తాయి .. అన్నీ ఖండిత స్వప్నాలు .. రక్త రేకులు తప్పితే
ఎవరో తరుముతున్నట్టు
ఎవరో ప్రశ్నిస్తున్నట్టు
ఎవరో లోపల నిలబడి గునపంతో తవ్వుతున్నట్టనిపిస్తున్నపుడు
కళ్ళుమూసుకుని మాంసవిగ్రహమై నిద్ర మోసుకొచ్చే రాత్రికోసం నిరీక్షణ
తనకోసం తను బతకడం మరిచిపోయి
ఎవరికోసమో జీవించడం.. నిజంగా మోకాలిపై సలిపే పుండే –
నగరాలు ఏ అర్థ రాత్రో రెక్కలను ముడుచుకుంటున్నపుడు
ఎక్కడివాళ్ళక్కడ కలుగుల్లో ఎలుకలు
ఖాళీ రోడ్లపై
‘ పహరా హుషార్ ‘ కంకకట్టె టక్ టక్ .. పోలీస్ చప్పుళ్ళు
నిజానికి ప్రతి అర్థ రాత్రీ ఒక కాలుతున్న కాష్ఠమే
ఎవరికి వారు శరీరాలను కోల్పోయి
ఒడ్డున తలుగుతో కట్టేసిన చీకిపోయిన పాత పడవలు
అంతా అలల చప్పుడే.. నిర్విరామంగా
* * *
ఉదయం నాలుగున్నరవుతుందా
ఒక ‘ నో హావ్స్ ‘ ప్రపంచం మేల్కొంటుంది
నెత్తులపై గంపలను బోర్లించుకుని
కొందరు స్త్రీలు నడిచొస్తూంటారు రోడ్లపై
ఎర్రని రేడియం మెరుపుల దుస్తులతో
మరి కొందరు స్త్రీలు దేవదూతల్లా రోడ్లూడుస్తుంటారు
రోడ్ల ప్రక్కన స్టవ్ ను వెలిగిస్తున్న చీమిడి ముక్కు నిక్కర్లు
‘ చాయ్ చాయ్ ‘ అని అరుస్తూంటే
ఆగి ఉన్న ఆటోల ఆగని చప్పుళ్ళు
ఆర్టీసీ తో యుద్ధం చేస్తూంటాయి
పేపర్ బాయ్స్ దినపత్రికల కట్టలను సైకిళ్ళపై సర్దుకుంటూ
ప్రతి ఒక్కడూ ఇక ఎగురబోయే పావురమే
ఒక గంట క్రితమే నిద్రకుపక్రమించిన బార్ ముందు
చెత్తకుండీ దగ్గర సగం మిగిలిని బిర్యానీ పొట్లాలు
కుక్కలూ, మనుషుల కొట్లాటలో మట్టిపాలౌతూంటే
రాత్రంతా నలిగిపోయిన ‘ కాంట్రాక్ట్ సెక్స్ ‘
ఇక జాకెట్టు హుక్స్ ను సర్దుకుంటూంటుంది
ప్రతి ప్రాతః కాల ఉదయం
రోడ్లన్నీ వీళ్ళతోనే
కూలీలు, లేబర్, కూరగాయల మనుషులు, పాలవాళ్ళు
పేపర్ బోయ్స్, ఆటోలు, అడుక్కునేవాళ్ళు, అన్నీ అమ్ముకునే వాళ్ళు
అప్పుడే నిద్రలేస్తున్న వీధి కుక్కలు –
* * *
సరిగ్గా అదే సమయానికి
పోర్టర్ రాజయ్య బిడ్డ పదవ తరగతి లక్ష్మి
ఉరికి ఉరికి క్రీడా శిక్షణా శిబిరానికొస్తుంది మొసపోస్తూ
ఎప్పటికైనా ఒలంపిక్ పతక సాధనే లక్ష్యంగా.. ఎక్కుపెట్టిన బాణమై
గురిపెట్టిన అమ్ము కసుక్కున లక్ష్యం గుండెలోకి దిగుతుందికదా నిశ్శబ్ద ధ్వనితో
అప్పుడామె గ్రహిస్తుంది
గాయమైన ప్రతిసారీ రక్తం రాదని –