జాగేశ్వర మహదేవ్ మందిరం

రచన: నాగలక్ష్మి కర్రా

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశం గురించి వెతికితే మూడు రాష్ట్రాలలో అదే పేరుతో వున్నట్లు తెలిసింది. మొదటది మహారాష్ట్రలో వున్న ఔండ నాగనాధ్, ద్వారక దగ్గర వున్న నాగనాధ్ ఉత్తరాఖంఢ్ లో వున్న జాగేశ్వర్ లో వున్న నాగనాధ్. ఆయా రాష్ట్రాలవారు మాదే ఒరిజనల్ నాగనాధ్ అని అంటున్నారు, సరే మూడింటినీ చూసేస్తే పోలా అని జాగేశ్వర్ బయలుదేరేం.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పర్వత ప్రాంతాన్ని ఘరేవాల్, కుమావు ప్రాంతాలుగా విభజించేరు. బదరినాధ్, కేదార్ నాధ్, గంగోత్రి, యమునోత్రి, మొదలయిన పుణ్యక్షేత్రాలు ఘరేవాల్ ప్రాంతంలో వుండగా నైనిటాల్, రాణిఖేత్, జాగేశ్వర్, భాగేశ్వర్, పాతాళ భువనేశ్వర్ కుమావు ప్రాంతంలో వున్నాయి.
కుమావు ప్రాంతంలో వున్న జాగేశ్వర్ మహాదేవ్ గురించి తెలుసుకుందాం.
భారతదేశ రాజధాని ఢిల్లీ నుంచి జాగేశ్వర్ కి 400 కిమి.., ఢిల్లి నుంచి టూరిస్టు బస్సులు, ప్రైవేట్ టాక్సీలు బుక్ చేసుకోవచ్చు. రైలులో వెళ్లాలనుకొనేవారు ఢిల్లీ నుంచి కాఠ్ గోదాం వరకు రైలులో వెళ్లి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలి. కాఠ్ గోదాం నుంచి జాగేశ్వర్ సుమారు 125 కిమీ.. ఈ దూరం మాత్రం రోడ్డు మార్గం ద్వారానే చేరుకోగలం. కాఠ్ గోదాం నుంచి అంటా ఘాట్ రోడ్డే కాబట్టి ప్రయాణం నెమ్మదిగా సాగుతుంది.
ఢిల్లీ నుంచి రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటే మన ప్రయాణం ఉత్తరప్రదేశ్ లోని మీరట్, మొరాదాబాద్, రామనగర్ ( సమాజ్ వాది పార్టీలో వుండగా జయప్రద ఎం.పి గా వున్న నగరం ) ప్రాంతాల మీదుగా సాగి ఉత్తరాఖండ్ లోని హాల్ద్ వాని, కాఠ్ గోదాం మీదుగా సాగి ఆల్మొడా చేరుతాం. కాఠ్ గోదాం దాటిన తరువాత భోజన వసతులకు అల్మొడాలో మాత్రమే అనుకూలంగా వుంటుంది. కాఠ్ గోదాం నుంచి అంటా ఘాట్ రోడ్డు అవటం వల్ల , రోడ్డు వెడల్పు తక్కువ, కొండ చరియలు విరిగి పడ్డం వల్ల ప్రయాణానికి అంతరాయం కలిగిస్తూ 125 కిమీ.. సుమారు ఆరు యేడు గంటల సమయం పడుతుంది.
ఆల్మోడా దగ్గర పిత్తొరాఘఢ్ వెళ్ళే హైవే మీద సుమారు 14 కిమీ.. వెళ్ళిన తరువాత చితై అనే వూరు వొచ్చింది. యీ కొండ ప్రాంతాలలో ఊరులన్నీ రోడ్డుకి ఆనుకొని వుంటాయి. వూరు అంటే వేళ్ళ మీద లెఖ్ఖ పెట్టగలినన్ని ఇళ్ళు నిత్యావుసర వస్తువుల దుకాణాలు ఒకటోరెండో.అదీ వూరు.బట్టల షాపు, టీ బడ్డి వుంటే అది టౌను.ఆ వూర్లో రోడ్డుకి యిరువైపులా చిన్నచిన్న షాప్స్ అందులో అమ్మే వస్తువలు మనని ఆకట్టుకుంటాయి. అవి గంటలు, కోవెలలో కట్టే లాంటివి అతిచిన్న సైజు నుంచి అతి పెద్ద సైజు వరకు పెట్టి అమ్ముతున్నారు. కుతూహలం ఆపుకోలేక కారు రోడ్డుపక్కన ఆపి విషయం అడిగితే వాళ్లు చెప్పినదేమిటంటే అక్కడే చిన్న గుట్ట మీద వున్న అమ్మవారిని చైతై దేవి, గోలు దేవి అని అంటారని ఈ అమ్మవారికి మొక్కుబడులు యీ గంటల రూపంలో తీర్చుకుంటారుట భక్తులు, కాబట్టి యీ దేవిని గంటా దేవి అని అంటారని చెప్పేరు. అది వినగానే మేము కూడా అమ్మవారిని దర్శించుకోడానికి వెళ్లేం. ప్రవేశద్వారం నుంచి మెట్లు వుంటాయి,మెట్లుకి రెండువైపులా కొన్నివేల లక్షకి చేరేయో చిన్న పెద్ద గంటలు వేలాడ దీసి వున్నాయి. మండపం చుట్టూరా యేవేవో రాసిన చిన్న పెద్ద కాయితాల గుత్తులు వేలాడదీసి వున్నాయి. అవి అన్నీ న్యాయంకోసం భక్తులు పెట్టుకున్న ఆర్జీలుట. కోర్టు లో సాక్షాధారాలు న్యాయం వైపు లేక అన్యాయం జరిగిన వారు, న్యాయం కోసం కోర్టు వరకు వెళ్ళలేని వారు యిక్కడ తమకు జరిగిన అన్యాయం గురించి వొక కాయితం మీద రాసి కోవెలలో వ్రేలాడ దీస్తారు. అలాంటి వారికి న్యాయం చేస్తుందిట అమ్మవారు. పన్నెండు సంవత్సరాలు క్రిందట మేం మొదటిమారు యీ గోలు దేవిని దర్శించు కున్నప్పుడు యిది ఆలా చిన్న మందిరం. ఏటికేడాది ఈ కోవెలలో మార్పులు చోటు చేసుకుంటూ యిప్పడు ఆ కోవేలకి అర కిమీ ముందు నుంచి పూజా ద్రవ్యాలు, గంటలు అమ్మే దుకాణాలు మొదలవుతున్నాయి.గంటల సంఖ్య కుడా బాగా పెరిగిపోయాయి. అలాగే అర్జీలు కుడా గణనీయంగా పెరిగేయి. దీన్ని బట్టి చైతై దేవి మీద భక్తుల నమ్మకం రోజు రోజు పెరుగుతోందని మనకు తెలుస్తోంది.


గోలు దేవిని దర్శించు కొని తిరిగి మా ప్రయాణం కొనసాగించేము. మరో 20 కిమీ.. వెళ్లిన తరువాత రోడ్డుకి కుడివైపున జటగంగ వొడ్డున మందిర సముహం కనిపిస్తుంది. యిక్కడ కుబేరుని మందిరం, శివుని కోవెల యింకా చిన్న చిన్న మందిరాలు వున్నాయి. యీ దేవాలయ సమూహాలు అర్కియాలజి వారు సంరక్షిస్తున్నారు. దీనిని బాల జాగేశ్వర్ మందిరం అంటారు.
బాల జాగేశ్వర మందిరాన్ని చూసుకొని జాగేశ్వర్ బయలుదేరేం. మూడు కిలోమీటర్ల ప్రయాణానంతరం జాగేశ్వర్ చేరేం. అప్పట్లో జాగేశ్వర్ లో కుమావు వికాస మండల వారి గెస్ట్ హౌసు మాత్రమే వుండేది. వూరు మొదలులోనే గెస్ట్ హౌసు వుండడంతో ముందుగా రూము తీసుకొని ఫ్రెష్ అయి మందిరం వైపు వెళ్లేం. ఊరంతా కలిపి పది గడపల కంటే లేవు. గెస్ట్ హౌస్ కి పక్కగా మ్యూజియం వుంది అందులో చాలా పురాతనమైన రాతి విగ్రహాలు వున్నాయి. అక్కడ ఓ యూరోపియన్ జంట కలిసేరు, అక్కడ వున్న ఛాముండి విగ్రహం చూపించి యెవరు యేమిటి అని అడిగేరు, వచ్చీరాని యింగ్లీషులో పార్వతీ దేవి అవతారం అని చెప్తే కాళి, దుర్గాల గురించి తెలుసు కాని ఛాముండి గురించి తెలియదు అంటే ఛండ, ముండ అనే రాక్షసులను చంపడం మొదలయిన కథ వారికి వినిపించేను. మన హిందువులలో చాలామందికి పురాణాలమీద అవగాహన లేదు, ఆ శక్తిలేదు, వారి కుతూహలానికి జోహారు అనకుండా వుండలేకపోయేను. అయిదుకి మ్యూజియం మూసేస్తారు.
ఈ గ్రామం యిక్కడి మందిరం పేరు మీదనే గుర్తింపబడుతోంది. ఆల్మోడా నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరాన సుమారు 1870 మీటర్ల యెత్తులో దేవదారు వృక్షాల నడుమ , నందిని, సురభి అనే సెలయేరులు సంగమించిన పుణ్యప్రదేశం యిది.
ఆర్కియోలజికల్ సర్వే వారిచే సంరక్షింప పడుతున్న మందిర సముదాయం. సుమారు 124 చిన్న పెద్ద మందిరాలు వున్నాయి. ఇవి సుమారు తొమ్మిది నుంచి పదకొండవ శతాబ్దాల మధ్యలో నిర్మించినట్లు అంచనా. దండేశ్వరమందిరం, ఛండి మందిరం, జాగేశ్వర మందిరం, కుబేర మందిరం, పుష్టి దేవి మందిరం, మృత్యుంజయ మహదేవ మందిరం, నందాదేవి, నవ దుర్గ, నవ గ్రహ, సూర్య మొదలైన మందిరాలు వున్నాయి. వాటిలో అతి పురాతనమైనది మృత్యుంజ మందిరం, దండేశ్వర మందిరం అతిపెద్దది. ప్రాంగణమంతా రాతి పలకలు పరిచి వుంటాయి. చాలా చల్లగా వుంటుంది సూర్యాస్తమయం అవగానే శయన హారతి యిచ్చి మందిరం మూసేస్తారు. ఈ మందిరాలు పాండవులచే నిర్మింపబడ్డవి.
అన్ని ఉత్తరభారతదేశ మందిరాలలో వున్నట్లు యిక్కడకూడా శివలింగాన్ని తాకి పూజలు చేసుకోవచ్చు. స్థలపురాణం చెప్పుకొనే ముందర మందిరం గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం.
జాగేశ్వర మందిరం శంకరాచార్యులవారిచే గుర్తింపబడ్డ జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశం. ఇక్కడ పూజారులు కూడా శంకరాచార్యులచే నియమింపబడ్డ దక్షిణాదికి చెందిన పండితులే. అయితే కాలక్రమేణా యిక్కడి స్త్రీలను వివాహమాడి వారి భాషను కూడా మరచిపోయేరు, కాని మనం అడిగితే వారి పూర్వీకులు యే ప్రాంతానికి చెందినవారో చెప్పి సరదా పడతారు. జనవరి ఫిబ్రవరిలలో హిమపాతం జరుగుతుంది. మిగతా కాలం అతిచల్లగా వుంటుంది.
పాండవులు మృత్యుంజయుని రూపంలో శివుని ప్రార్ధించుకొని మహాభారత యుధ్దంలో మరణం లేకుండా వరం పొందేరుట.
జాగేశ్వరమహదేవ్ మందిరం కాస్త వెనుకవైపు వుంటుంది. ముందుగా యెడమవైపు వచ్చేది మృత్యంజయ మందిరం, ఇక్కడ చేసుకునే పూజ ధాన్యం ఆయుష్యు పెంచుతుందని నమ్మకం. ఈ మధ్యకాలంలో చాలామంది తెలుగువారు యిక్కడ మృత్యుంజయ హోమాలు చేయించుకోడం చూసేం. కాలసర్పదోషం వున్నవారు యిక్కడ హోమం చేసుకుంటే దోషనివారణ జరుగుతుందని చెప్పేరు.

తరవాత దండేశ్వర మహదేవ్ మందిరం చివరగా కుడివైపున నాగేశం మందిరాలు వున్నాయి. నాగేశం మందిరం పైన పెద్ద రాతితో చెక్కిన పాము విగ్రహం వుంటుంది. బయట ద్వారపాలకులుగా నంది, స్కంది కాపలా కాస్తూ వున్నారు. లోపల మంటపంలో, మహంతు కూర్చొనే గద్ది వుంది . అక్కడ అఖండదీపం, శివలింగం వుంటాయి. శివలింగానికి వెనుకవైపు గోడకు అమ్మవారి విగ్రహం వుంటాయి. పక్కగా మంచం పరుపు వుంటాయి. ఇక్కడ శివలింగం రెండు ముఖాలు వున్నట్లుగా వుంటుంది. దీనిని అర్ధనారీశ్వర లింగం అంటారు, పెద్ద భాగం శివుడని, చిన్న భాగం పార్వతి అని అంటారు. అలాగే లింగం చేత్తో కదిపితే కదులుతూ వుంటుంది. ఇక్కడ శివుడు యెప్పుడూ జాగ్రదావస్థలో వుంటాడట, సాధారణంగా మందిరాలలో దేవుడు హారతి సమయాలలో మాత్రమే వుంటాడని, యిక్కడ మాత్రం యెప్పుడూ వుంటాడని అంటారు. అందుకే యీ శివుడిని జాగేశ్వరుడు అని పిలుస్తారు.
రాత్రి శయన హారతికి ముందు పక్కన వున్న పడకను చక్కగా అమర్చి పూజారులు తలుపులు మూసేస్తారు, మరునాడు తలుపులు తెరిచేసరికి పడక పైన వేసిన దుప్పటి శివుడు శయనించేడు అనడానికి నిదర్శనంగా చెదరి వుంటుందట యిది పూజారులు చెప్పిన విషయం.
ప్రతి సంవత్సరం శివరాత్రికి, శ్రావణ మాసంలోనూ యాత్ర జరుగుతుంది. అప్పుడు వేల సంఖ్యలో భక్తులు వస్తారు. మిగతా సమయాలలో చాలా నిర్మానుష్యంగా వుంటుంది.
మందిర ప్రాంగణం లో పుష్టిదేవి మందిరం చూడదగ్గది.

స్థలపురాణం ప్రకారం విష్ణుమూర్తిచే స్థాపించబడ్డ జ్యోతిర్లింగమైన నాగేశం ని వెతుకుతూ శంకరాచార్యులవారు వచ్చి యీ ప్రదేశాన్ని గుర్తించి నాగనాథ్ లింగాన్ని ప్రతిష్టించి పూజలు చేసి తనకూడా వచ్చిన శిష్యులను పూజారులుగా నియమించేరు. కాలాంతరంలో చంద్ర వంశానికి చెందిన కతూరియా రాజులు మరమ్మత్తులు చేయించేరు. మరో కథనం ప్రకారం శివుడు యీ ప్రదేశానికి వచ్చి తపస్సమాధిలో వుండగా రాక్షసులు ధ్యాన భంగం చేస్తూవుంటారు. శివుడు మూడు నేత్రాలుకలిగిన ‘ శామ్ ‘ అనే గణాన్ని రాక్షస సంహారమునకు పంపుతాడు, శామ్ రాక్షస సంహారం గావించి అవతారం చాలిస్తాడు. ఈ ప్రదేశం జాగేశ్వర మహదేవ మందిరానికి 2 కిలోమీటర్ల దూరంలో వున్న ‘ కోటి లింగాలు ‘ అనే ప్రదేశం లో జరిగినట్లు చెప్తారు. ఇది జటగంగ శామ్ గంగల పవిత్ర సంగమ ప్రాంతం కావడం మరో విశేషం. శంకరాచార్యులవారు యిక్కడ నాగేశం మందిరాన్ని నిర్మించ దలచేరట, మందిరం సగం నిర్మించిన తర్వాత కూలిపోయిందట, ఇప్పటికీ అక్కడ పడి వున్న శిథిలాలను చూడొచ్చు. స్థానికుల నమ్మకం ప్రకారం కోటిలింగాలలో శివుడు యిప్పటికీ తపస్సమాధిలో వున్నట్లు కలియుగంలో తన 28 వ అవతారంగా ‘ లకులిష ‘ అనే పేరుతో మానవులను కలిప్రభావమునుండి రక్షించడానికి వస్తాడని, ఆ అవతారంలో శివుడు తన జడలలో కర్రతో చేసిన సుత్తి ఆకారాన్ని బంధించి తిరుగుతూ వస్తాడని కోటిలింగాల ప్రాంతంలో అతనికి మందిర నిర్మాణం చెయ్యమని శివుడు కోరినట్లుగా చెప్తారు, సోమనాధ్ ప్రాంతంలో వున్న గుజరాతీలలో కూడా యీ కథ గురించి నమ్మకం వుంది, ఆనమ్మకంతోనే కొంతమంది గుజరాతీలు 3, 4 తరాలకు పూర్వం యిక్కడకు వలస వచ్చేరు. శివుడు కోరిన ప్రకారం మందిరనిర్మాణం చేసేరట.
స్థానికల మరో కథనం ప్రకారం ‘ లకులిష ‘ అవతారం ఉద్భవించిందని బాలునిగా వున్నప్పుడు బాల జాగేశ్వర లోని మందిర సముదాయంలో సంచరించే వాడని మధ్య వయసువరకు జాగేశ్వర్ లోనూ ముసలి వయసులో వృద్ద జాగేశ్వర్ లో గడిపి అవతారం చాలించేడని, అతని శిష్యులను ‘ లకులిషులు ‘ అంటారని చెప్తారు. వీరు విభూతి ధారులై జడలతో మనకి యీ ప్రాంతాలలో కనిపిస్తారు.

వృద్ద జాగేశ్వర్ చిన్న గుట్టమీద వున్న చిన్న మందిరం, లోపల శివలింగం మందిరం పక్కనే పూజారి యిల్లు, రోజూ నైవేద్యం పెట్టి ఆ సమయంలో మందిరంలో భక్తులకు ప్రసాదం యిస్తూ వుంటారు. ఇక్కడ నాకు నచ్చిన విషయం యేమిటంటే దక్షిణ కోసం పూజారులు పీడించకపోవడం, ఈ మందిరాలు యే ట్రస్టు ఆధ్వర్యంలోనూ లేవు, భుక్తికి యెలా అనే ప్రశ్నకు సమాధానం శివుడుని నమ్ముకున్నవారికి భుక్తి శివుడే యిస్తాడు అని సమాధానమిచ్చేరు.
సాయంత్రం ఒక దర్శనం, పొద్దున్న మరో దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమయేం.

రఘునాథ మందిరం

రచన: నాగలక్ష్మి కర్ర

హిందువులు అతి భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి ఒకటి. చైత్ర శుద్ధ నవమిని శ్రీరాముడు జన్మించిన తిథిగా, శ్రీరామనవమిగా జరుపుకోవడం హిందువులకు అనాదిగా వస్తున్న ఆచారం.

ఆంధ్రప్రదేశ్ ఆంద్ర, తెలంగాణగా విభజన జరిగిన తరువాత ఆంధ్ర లో శ్రీరామనవమి ఉత్సవాలు ఎక్కడ జరపాలి ఒంటిమిట్టలోనా? లేక రామతీర్ఠాలులోనా ? అనే విషయం మీద యెన్నో తర్జన భర్జనలు జరిగిన తరువాత ‘ఒంటిమిట్ట’లో జరపాలని రాజకీయ నాయకులు నిర్ణయించేరు. శ్రీరామనవమిని కుడా రాజకీయం చేసేరు ఇలాంటి నేపధ్యంలో మనం ఉత్తరాఖండ్ లో వుండి తెలుగు పుజారులచే పూజలందుకుంటున్న రఘునాధ్ దేవాలయం గురించి తెలుసుకుందాం.

వైష్ణవులు పరమ పవిత్రంగా భావించే 108 దివ్య దేశాలలో 106 వ దివ్య దేశంగా చెప్పబడే రఘునాధ్ మందిరం యిదే. ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని తెహ్రి ఘరేవాల్ జిల్లాలో దేవప్రయాగ లో ఈ దివ్యదేశం వుంది. హరిద్వార్ కి సుమారు 100 కిమి.. దూరంలో శివాలిక్ పర్వత శ్రేణులలో వున్న పుణ్యక్షేత్రం ఇది.

హరిద్వార్ నుంచి ‘చార ధామ్ ‘ యాత్రగా పిలువబడే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బదరి నాథ్ యాత్రలు మొదలవుతాయి. హరిద్వార్ కి సుమారు 25కిమీ దూరంలో వున్న ఋషికేష్ నుంచి శివాలిక్ పర్వత శ్రేణులు మొదలౌతాయి. హరిద్వార్ నుంచి బదరీనాథ్ వరకు వున్న ముఖ్యమైన పంచ ప్రయాగలలో ముఖ్య మైనది ఈ దేవప్రయాగ. రెండు ముఖ్యనదులు కలిసే చోటుని సంగమం లేదా ప్రయాగ అని అంటారు.

మన దేశానికి టిబెట్ వైపున వున్న సరిహద్దులో గల సతోపంత్ మరియు భాగీరథి కారక్ అనే హిమనీ నదములలో పుట్టి అలకనందగా బదరీనాధ్ మీదుగా ప్రవహించి విష్ణు ప్రయాగలో దౌళి గంగని కలుపుకొని అలకనందగా ప్రవహించి, నంద ప్రయాగలో నందాకిని నదితో కలిసి అలకనంద గా ప్రవహించి కర్ణ ప్రయాగలో పిండారీ గంగతో కలిసి అలకనందగానే ప్రవహించి రుద్ర ప్రయాగలో మందాకినీ నదిని కలుపుకొని అలకనంద గ ప్రవహించింది. గోముఖ్ దగ్గరనున్న గంగోత్రి మరియు ఖట్లింగ్ అనే హిమనీనదముల నుండి పుట్టిన భాగీరథి నది హిందూ పురాణాల ప్రకారం భాగీరథుడు తన పూర్వజుల సద్గతులకోసం ఘొరతపస్సు నాచరించి గంగను భూలోకంలోకి తెప్పించెననే కధ ప్రచారంలో వుంది.భాగీరధుని ద్వారా రప్పించ బడింది కాబట్టి ఈ నదికి భాగీరధి అనే పేరు వచ్చింది. దేవప్రయాగలో అలకనంద మరియు భగీరథి సంగమించి గంగ గా పిలవబడుతూ హృషికేష్, హరిద్వార్ మొదలైన పుణ్యక్షేత్రాలలో ప్రవహిస్తూ భక్తులను పునీతులని చేస్తోంది. ఈ సంగమాన్ని అత్తా కోడళ్ళ సంగమంగా కుడా స్థానికులు వ్యవహరిస్తూ వుంటారు. రెండు నదులు రెండు వైపులనుంచి వచ్చి వేరువేరు రంగుల నీళ్ళు కలుస్తూ చూపరులను ఆనందాశ్చర్యాలలో ముంచెత్తుతుంది.

అలకనంద భగీరథి నదుల సంగమం ఇదే ఈ సంగమ ప్రదేశంలో వున్న పట్టణాన్ని”దేవనగరి ” అని పేరు. ఇక్కడ చేసే పూజలు, ముక్కోటి దేవతలు అందుకుంటారని స్థానికుల నమ్మకం. పురాణకాలం లో దేవశర్మ అనే రుషి ఇక్కడ తపస్సు చేసెనని ఈ ప్రదేశాన్ని దేవనగరి అని పిలువబడుతోంది.ఈ సంగమానికి యెదురుగా వున్న శివలింగాన్ని తొండేశ్వర్ మహదేవ్ అని ధనేశ్వర్ మహాదేవ అని పిలుస్తారు. సంగమం నుంచి నీటిని తెచ్చి ఈ శివలింగాన్ని అభిషేకించుకుంటూ వుంటారు. దేవనగరి గిద్దాంచల్, నృశింగాంచల్ , దశరథాంచల్ అనే మూడు పర్వతాల మధ్యన వుంది. రఘునాధ్ మందిరం వెనుక వైపున గిద్దాంచల్ పర్వతం వుంది, ఎదురుగా నృశింగాంచల్, సంగంకి యెదురుగా దశరథాంచల్ వున్నాయి. హృషికేష్ నుంచి బదరీనాథ్ వెళ్ళే జాతీయ రహదారిని ఆనుకొని వున్న బజారు లోంచి సుమారు 700కిమి.. దూరంలో రఘునాథ్ మందిరం వుంది.

శ్రీరాముడు లవకుశులను పట్టాభిషిక్తులని చేసిన అనంతరము శ్రీరాముడు రావణుని సంహరించుట వలన కలిగిన బ్రహ్మహత్యా పాతకమును పోగొట్టుకొనుటకు తపస్సు చేసుకోనుటకై భాగీరథి,అలకనంద నదుల సంగమ ప్రదేశాన్ని యెంచుకొని యిక్కడ తపస్సు చేసుకొని యాగం నిర్వహించేడని దానికి ప్రమాణంగా తన పాదగుర్తులను విడిచి అవతారం చాలించేడని యిక్కడి పూజారులు చెప్పేరు. కొన్ని వందల సంవత్సరాలకి పూర్వం హిమాచల్ లో వున్న “కుల్లు”ని పరిపాలించిన రాజు తాను చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకొనే వుద్దేశ్యం తో రామజన్మస్థానమైన అయోధ్య నుంచి దొంగిలించి రాముని విగ్రహం తెచ్చి యిక్కడ ప్రతిష్తించెనని ఇక్కడి స్థలపురాణం చెప్తోంది. ఇప్పుడున్న కోవేలని 1835 సం|| లో అప్పటి జమ్మ – కాశ్మీర్ రాజైన గులాబ్ సింగ్ కట్టించడం మొదలుపెట్టగా అతని కుమారుడైన మహారాజా రణబీర్ సింగ్ ద్వారా 1860 లో పూర్తి చెయ్యబడింది. ఈ కోవెలలో బౌద్ధ, దక్షిణ భారత శిల్పకళల మిశ్రమంగా కనిపిస్తుంది. కోవెలలో రాముని విగ్రహంతోపాటు సీతా, లక్ష్మణ విగ్రహాలు కుడా కొలువై వున్నాయి. రామ, కృష్ణ లీలలు బంగారు వెండి రేకులపై చెక్కి కోవేల లోపలి గోడలకు తాపించబడ్డాయి. శ్రీమహావిష్ణు ప్రతిరూపాలుగా చెప్పబడే శాలిగ్రామాలు ఈ కోవెల లోపలి గోడలకు వందల సంఖ్యలో తాపించబడి వున్నాయి.

ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే ఈ కోవెల పూజారులు తెలుగువారు. ఇంత దూరం వారు యెలా వచ్చేరు అని అడుగగా శంకరాచార్యులవారు జోషిమఠ్ వచ్చినపుడు అక్కడి రాజులు తమ రాజ్యంలో వేదవిధులు నిర్వర్తించేందుకు బ్రాహ్మణులు కావాలని శంకరులని అర్ధించగా, శంకరులవారు తనతో కూడా వచ్చిన కొందరు బ్రాహ్మణులను యిక్కడ వుంచెనట. ఇప్పుడున్న వారు వారి సంతతేనట. వీరిని స్థానికులు “పండా” లుగా వ్యవహరిస్తారు .

ఇక్కడకి సుమారు ఒకటి లేక రెండు కి.మీ.. దూరంలో వున్న ” పుండా “గ్రామంలో దుర్గాదేవి భువనేశ్వరి మాతగా పూజలందుకుంటోంది . ఈ కోవెల చిన్నగానే వుంటుంది కాని అమ్మవారిపై స్థానికుల విశ్వాసం అచంచలం .

ఆచార్య పండిట్ చక్రధర్ జోషి జ్యోతిష్ శాస్త్ర , నక్షత్ర గ్రహశాస్త్ర అధ్యయన కర్త 1946 లో నక్షత్ర వేదశాల ధశరథాంచల్ పర్వతంపైన నిర్మించేరు . ఇందులో పురాతన అధ్యయన పద్ధతులైన సూర్యగతి , జలగతి , ద్రువగతి లతో పాటు రెండు టెలిస్కోపులు కాక నక్షత్ర , జ్యోతిష అధ్యయనానికి కావలసిన అనేక గ్రంధాలను కుడా ఇక్కడ ఉంచేరు . ఇందులో 3000 లకు మించిన వ్రాత గ్రంధాలు కుడా వున్నాయి . ఇవి 1470 సం .. నుంచి గ్రంధస్థం చెయ్యబడినవి సేకరించి జాగర్త చెయ్యబడినవి , దేశం నలుమూలల నుంచి సంగ్రహింపబడినవి యిక్కడ నిక్షిప్తం చెయ్యబడినవి .

ఇక్కడి ప్రకృతి సౌందర్యం చెప్పడానికి మాటలు లేవు . అనుభవించ వలసిందే . ఏడాదిలో ఆరు నెలలు చల్లగా , మిగతా ఆరు నెలలు అతి చల్లగా వుంటుంది . బద్రినాథ్ యాత్రకు వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఒకరోజు వుండి రఘునాథ్ మందిరాన్ని చూసుకొని దేవప్రయాగలో పూజలు చేసుకొని ప్రకృతిని కళ్ళారా అనుభవించమని మనవి .

ట్రావెలాగ్ – వారణాసి యాత్ర

రచన: చెంగల్వల కామేశ్వరి

మన దేశం లో కాల భైరవుడు క్షేత్రపాలకుడుగా పార్వతీ పరమేశ్వరులు కొలువయిన వారణాశిని దర్శించడం పూర్వ జన్మ సుకృతం ఎంతో అదృష్టం ఉండాలి. అన్నిటికన్నా మనకి ఆ పుణ్యక్షేత్ర దర్శనం కావాలంటే కాలభైరవుని అనుగ్రహముండాలి. అందుకే మనం వారణాశి వెళ్లాలి అనుకుంటే కాలభైరవాష్టకం చదువుకోవాలి. నిరాటంకంగా మన వారణాశి యాత్ర చక్కగా జరుగుతుంది
వారణాశికి బెనారస్ అని, కాశీ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రం ఉత్తరప్రదేశ్ లో ఉంది.
పూర్వం కాశికెళ్లినవారు కాటికెళ్లిన వారు ఒకటే అనేవారు.. పిల్లల బరువు బాధ్యతలు తీరినవారు మాత్రమే వెళ్లేవారు
ఇప్పుడు రహదారులు, రైలు మార్గాలు అన్ని ఏర్పడి వయసుతో సంబంధం లేకుండా అందరూ దర్శిస్తున్నారు. అలాంటి అదృష్టంతోనే నేను ముమ్మారు కాశీ యాత్ర చేసుకున్నాను.
మొదటి సారి ఎవరో నిర్వహించిన కాశీయాత్ర లో, రెండోసారి మా సత్యం అన్నయ్య. మా మరిది రామారావు గారు మా బంధువులందరితో కలిసి వేసిన కాశీయాత్రలో పాలు పంచుకున్నాను. ఆ రెండుసార్లూ కాశీయాత్రకు సంబంధించిన విషయాలు అన్నీ కూలంకషంగా తెల్సుకున్నాను. ఎందుకంటే రెండు దశాబ్దాలుగా ఎన్నో యాత్రలు కండక్ట్ చేసాను నేను ఎవరితో ఎక్కడికెళ్లినా మిగతావాళ్లు గొడవ పెట్టేస్తారు. అందుకే నేను ఏది చూసినా మా వాళ్ల కోసం మళ్లీ టూర్ వేస్తాను
అలాగే మొన్న కార్తీక మాసంలో శైవ క్షేత్రం గంగాస్నాన పునీతం కావాలన్న ఆకాంక్షతో “కార్తీక మాస కాశీ యాత్ర” తొమ్మిది రోజులు వారణాశి తదుపరి త్రివేణి సంగమం, సీతామర్హి, వింధ్యాచల్, నైమిశారణ్యం, గయ, అయోధ్య
అని ఎనౌన్స్ చేసానో లేదో మేమొస్తాము మేమొస్తాము అని ఒక ముప్పైఅయిదు మంది రెడీ అయిపోయారు
16-11-2016 నుండి 1-12-2016 దాకా మొత్తం ట్రిప్…
అందులో ముఖపుస్తక మిత్రులు ఉమా కల్వకోట దంపతులు, వారిజా బాలాజీ దంపతులతో పాటు వారి స్నేహితులు కొందరు కూడా మాతో జాయిన్ అయ్యారు.


నేను యాత్రలు కండక్ట్ చేసేప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తాను అదేమిటంటే ఆహార వ్యవహారాల విషయం. ఏదో ఒకటి రెండు రోజుల కోసం పర్వాలేదు కాని పదిహేను రోజుల టూర్. ఎవరికి ఏ తేడా చేసినా కష్టం. కొందరు పెద్దవారు, మధ్యవయసువారు అందరూ నలభై సంవత్సరాల పై వారే
అందుకే నేను బుక్ చేసే హొటల్ లో కిచెన్ ఇస్తామన్న సాహు హొటల్ లోనే రూమ్స్ బుక్ చేసాను కుక్ నాగేశ్రరరావు, అసిస్టెంట్ ప్రసాద్, హెల్పర్స్ రామలక్ష్మి, సుజాత. సుగుణ + నేను మొత్తం నలభైమంది కాగానే బుకింగ్స్ క్లోజ్ చేసాను. ఆ తర్వాత వచ్చిన వారందర్నీ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది
ఇంక అక్కడికి తీసుకెళ్లాసిన సామాన్లన్ని పెట్టడానికి రెండు పెద్ద బ్యాగ్స్ కొన్నాను. గ్యాస్ స్టౌ, సిలిండర్ హొటల్ అతనే ఇస్తాడు కాబట్టి ఇడ్లీ పాత్ర పెద్దది నలభై ఇడ్లీలు అయ్యేది, నాలుగు పెద్ద గిన్నెలు, వంటకి గిన్నెల సెట్స్, వండిన వంట తీయడానికి డబ్బాల సెట్స్, గరిటెలు అన్నీ సర్దాము. లేకుంటే అక్కడ అద్దె సామానుల షాప్స్ చుట్టూ తిరిగే కన్నా ఉన్న మటుకు పట్టుకెళ్లితే మంచిది కదా.
కూరగాయలు ప్రొవిజన్స్ అవీ అక్కడే కొనుక్కోవచ్చు కదా అనుకున్నాను
అన్నట్లు సరిగ్గా మా ప్రయాణానికి వారం ముందే నోట్ల రద్దు. ఇంక చూడండి వారంరోజులు కష్టపడి బ్యాంకులలో పాత నోట్లు మార్చడం, వాళ్లెంత ఇస్తే అంత డ్రా చేసుకోవడం అదో ప్రహసనం, అమౌంటు ఇవ్వవలసిన వారినందరినీ వారణాశిలో కొత్తనోట్లే ఇచ్చేలా ప్లాన్ చేసుకుని ఆ సమస్యని దాటేసాను. హొటల్ వాళ్లకు, బిగ్ బజార్ ట్రావెల్స్ వాళ్ళకి కార్డ్ గీయటమే! పాపం వాళ్లు బాగానే కోపరేట్ చేసారు కొంత క్యాష్ ఇచ్చాము కాబట్టి వాళ్లు సర్దుకున్నారు.
ఇంక రోజుకో రకం పచ్చళ్ళు మొత్తం పన్నెండు రకాలు. అల్లం, గోంగూర, టమాట, చింతకాయ, ఉసిరికాయ, దోసావకాయ, ఆవకాయ, కొరివికారం, మాగాయ, కొత్తిమీర, కంది పొడుం, మామిడల్లం పచ్చడి, తొక్కుడు పచ్చడి, నిమ్మకాయ అన్నీ పట్టుకెళ్లాము.
ఇందులో తొమ్మిది రకాలు మాత్రం “”అమ్మమ్మ పచ్చళ్లు” అని తార్నాకలో ఆర్డర్ చేసాను. వాళ్లకే మేము ఎక్కే పాట్నా ఎక్స్ ప్రెస్ కి అందించేలా లంచ్ ఆర్డర్ ఇచ్చాను. నైట్ కి రోటీ, ఆలూ కూర మా కాలనీలో ఉన్న శకుంతలకు ఆర్డర్ ఇచ్చాను. వాటర్ బాటిల్స్ స్టేషన్ లోనే కొన్నాము. కనీసం ట్రైన్ లో ఉండే మూడు పూటల్లో రెండు పూటలకు మాతోనే తీసుకెళ్లాలని అనుకున్నాను. లేకుంటే ట్రైన్ ఫుడ్ మూడు పూటలా తినలేము కదా!
అనుకున్నట్లుగానే అందరూ చక్కగా చెప్పిన టైమ్ కే అందరూ స్టేషన్ కి వచ్చేసారు.


ఎవరి టికెట్స్ వారికి, దాంతో పాటు ప్రయాణించే వారందరి పేర్లు ఫోన్ నెంబర్స్ ఉన్న జిరాక్స్ కాపీలు ఇచ్చాను. అందరికీ అందరూ తెలియాలని.. ఎవరి గ్రూపులకు సంబంధించిన గ్రూప్ ల ప్రకారం వాళ్లు ఆయా కంపార్డ్మెంట్ల లో ఎక్కాము. అలా మా కాశీ యాత్ర మొదలయింది. వచ్చిన వాళ్లందరూ సరదాగా ఉండే వాళ్లవడం వలన చాలా బాగా ప్రయాణం సాగింది.
మర్నాడు ట్రైన్ కేటరింగ్ అతనికి ఆర్డర్ ఇచ్చిన కాఫీలు, టిఫిన్స్, లంచ్ అన్నీ మా హెల్పర్స్ సహాయంతో వాళ్లందరికీ అందించగలిగాము.
మర్నాడు మధ్యాహ్నం మూడు గంటలకు వారణాశి చేరాము.
స్టేషన్ కి మా వాట్సప్ గ్రూప్ ఫ్రెండ్ అనుపమ మమ్మల్ని రిసీవ్ చేసుకుంది.సామానంతా కూలీలను మాట్లాడి ముందుగానే మాట్లాడుకున్న మూడు వింగర్స్ లో చేర్చుకుని అందరం హొటల్ కి చేరాము.
హోటల్ నెంబర్ ప్రింట్ ఉన్న కార్డ్స్ అందరికీ ఇచ్చి ఎప్పుడయినా ఎవరయినా మనలో మిస్ అయితే కంగారు పడకుండా విశ్వనాధ్ టెంపుల్ లైన్ కి వచ్చేయండి మన హోటల్ కనిపిస్తుంది అని చెప్పాము. అలాగే ఒక ఇద్దరు ఒక గుడి దగ్గర తప్పిపోయినా ఆ కార్డ్ వల్ల క్షేమంగా వచ్చేసారు. రాత్రిళ్లు అందరికీ టిఫిన్సే కాబట్టి హొటల్ నుండి తెప్పించేసాము.
బిగ్ బజార్ కి వెళ్లి కావల్సినవన్నీ తెచ్చాము అనుపమ నేను. మర్నాడు ఉదయం గంగానదికి స్నానానికి వెడ్తుంటే అందరికీ ఆనందం గంగా ప్రవాహంలా పరవళ్లు తొక్కింది
ఇలా అందరం గంగమ్మ ఒడిలో జలకాలాడి సూర్యునికి అర్ఘ్యం ఇచ్చుకుని స్నానాలు ముగించుకుని హొటల్ కి వచ్చి రెడీగా ఉన్న టిఫిన్స్ తిని కాఫీలు సేవించి కాశీ విశ్వేశ్వరుని దర్శనార్ధం గుడికి బయల్దేరాము.


………………………..
మా గుడికి గంగానదికి షాపింగ్ కి దగ్గరగా ఒకే లైన్ లో ఉండటం వలన మా వాళ్లందరికీ మహా సంతోషమయింది. మొదడి రోజే మాతో వచ్చారు ఆ తర్వాత ఎవరికి వీలయిన టైమ్ లో వాళ్ల వాళ్ల ల గ్రూప్ లతో గంగా నదికి, గుడికి షాపింగ్స్ కి వెళ్లేవారు
రాత్రిళ్లు, తెల్లవారుఝామున అభిషేకాలు దర్శించి భక్తి పారవశ్యంలో మునిగి తేలిపోయారు అందరూ.
విశ్వేశ్వరుడు, విశాలాక్షి అన్నపూర్ణాదేవిని దర్శించుకుని మా రూమ్స్ కి వచ్చేసరికి హొటల్ డైనింగ్ హాలు లో వంట రెడీ వడ్డించడానికి మా రామలక్ష్మి, సుగుణ, సుజాత రెడీ

లంచ్ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని గంగాహారతికి వెళ్ళాము

అదొక అద్భుతమయిన అనుభవం చల్లని గాలి తెమ్మరలు గంగా నది ఒడ్డున గణ గణ గంటారావాలతో రంగురంగుల విద్యుత్కాంతుల మేళవింపుతో వివిధ దేశాలనుండి, మన దేశంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన జనసందోహంతో, శివస్తుతులతో ఇచ్చే గంగాహారతి చూడటం వినటం ఎన్నో జన్మల పుణ్యఫలం.
అదయ్యాక మా రూమ్స్ కి వచ్చేసాం.


ఆ మర్నాడు వారణాశిలోని కాలభైరవాలయం, గవ్వలమ్మ గుడి, వ్యాసకాశి, బౌద్ద ఆరామాలు, సారనాధ్, తిల భాండేశ్వర గుడి, చింతామణి గణపతి, జంగంవాడి గుడి, దుర్గదేవి గుడి, సావిత్రి వారాహి, ఇవన్నీ వ్యాస్ కాశీ చూసాము కాని కొన్ని దగ్గరున్నవి మధ్యమధ్యలో చూసాము.
జంగంబడి గుడి వారణాశిలో అడుగడుగునా ఒక గుడి ఉంది కేదారేశ్వరుడి గుడి


గంగా నది ఒడ్డనే ఉంది లలితా దేవి గుడి కూడా లలితాఘాట్ లో ఉంది
అలా వెళ్లిన రోజు ఒక ప్రమాదం తప్పింది. చెన్నయి నుండి వచ్చిన సుగుణ గారి మెడలో చెయిన్ లాగడానికి ఒకడు విఫలప్రయత్నం చేసాడు
అదృష్టం బాగుండి ఆ రోజు ఆమెకేమి కాలేదు కాని మెడ అంతా గీరుకు పోయింది. దెబ్బకి అందరం విడి విడిగా నడవడం మానేసి గుంపులుగా నడవడం మొదలు పెట్టాము
అలా ఆ రోజంతా చూసి మర్నాడు అలహాబాద్ కి హొటల్ వాళ్లు బుక్ చేసిన 40 సీట్ల బస్ లో ఉదయమే బయలు దేరాము
మా కుక్ చేసిచ్చిన ఉప్మా దారిలో తినేసాము. అలహాబాద్ వెళ్లగానే అందరికీ బోట్స్ లో తీసుకువెళ్లి త్రివేణి సంగమంలో స్నానాలు చేసి ఒడ్డున ఉన్నపందిరిలో తొమ్మిదిజంటలు శాస్త్రోక్తంగా వేణీ దానమహోత్సవం చూడముచ్చటగా జరిగింది

అక్కడే మరో పక్క పితృకార్యాలు తర్పణాలు పిండ ప్రధానాలు మరి కొంతమంది నిర్వహించుకున్నారు. మరి కొందరు చేసిన. తమకు తెలియకుండా జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్తం జరిపించుకున్నారు.
ఆ పక్కనే ఉన్న శయనావస్థలో ఉన్న బేడీ ఆంజనేయస్వామిని, ప్రయాగ లలితను దర్శించాము. తర్వాత బస్ లో ప్రయాణం. మధ్యలో పచ్చని చెట్ల దగ్రర మా కుక్ ఇచ్చిన పులిహోర, ధధ్యోజనం, అరటి పళ్లు లాగించాము. ఈ ప్రయాణంలో జోకులు, పాటలు, మాటలతో అందరికి అందరు తెలిసి పోయారు. వింధ్యవాసినీదేవి కొలువున్న శక్తి పీఠం, ఆ పైన సీతామర్హి అన్నప్రదేశం కి వెళ్ళాము. సీతాదేవి ప్రాణ త్యాగం చేసి భూమిలోకి వెళ్లిన ప్రదేశం చూసాము. పైన మహారాణి సర్వ సులక్షణ జత సీత కాగా క్రింద భూప్రవేశం చేసిన సీతామహాతల్లి ని చూస్తే గుండె చెరువయి కళ్ల లోకి వచ్చింది.


ఆమె చూపులోని భావాలు ఆ మహాతల్లికి జరిగిన అవమానానికి అద్దం చూపుతాయి. అంత సహజంగా ఉంది ఆ మూర్తి
మధ్యలో డిన్నర్ కి ఆగి కాశీ చేరేసరికి పదకొండయింది
ఆ తర్వాత నాలుగు రోజుల్లో ఒక రోజు వారణాశిలో వున్న పద్నాలుగు ఘాట్స్ చూడటానికి ఒక బోటు మాట్లాడుకున్నాము.
ప్రధాన ఘాట్స్ అయిన దశాశ్వమేధ ఘాట్, లలితా ఘాట్, కేదార్ ఘాట్, హరిచంద్ర ఘాట్ లలో స్నానం చేసి చివరగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు దేవతలు దిగివచ్చే సమయంలో మణికర్ణిక ఘాట్ లలో స్నానం చేసి అక్కడ సంకల్పంతో స్నానం చేసి బోటు వాడికి శివుడు ఇమ్మన్నట్లుగా గుప్తదానం ఇచ్చాము.

చాలా గుళ్ళు చూసాము. తిరిగాము. ఎక్కడా బోర్ అనిపించకుండా ఏదో రూమ్ లో చేరి కబుర్లు చెప్పుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం, దర్శనాలకు, షాపింగ్ లకు, గంగా స్నానాలకు కలిసి వెళ్లడం వల్ల అందరం ఒక కుటుంబంలా కలిసిపోయాము
ఇరవయి అయిదో తారీఖుకల్లా కాశీలో మా తొమ్మిది నిద్రలు అయ్యాయి.
ఆ మరునాడు 26-11-3016 న బయలుదేరి గయ వెళ్లాము. వెళ్లేటప్పుడు దారిలో టిఫిన్ తిన్నాము. పిండప్రధానం చేసే జంటలు తినలేదు. గయలో వున్న మాంగళ్య గౌరీ టెంపుల్ దర్శనం చేసుకున్నాము.
గయ వెళ్లి కుక్ కి గ్యాస్ సిలిండర్, స్టవ్ ఇప్పించి వంట చేయింఛాము. సాయంకాలం బుద్ద గయ కూడా దర్శించాము. ప్రశాంతమయిన పాలరాతి సౌధంలో తధాగతుని చరిత్ర అంతా చెప్పడానికి ఒక గైడ్ ని మాట్లాడుకున్నాము. అతను చాలా చక్కగా వివరించి చెప్పాడు..

లంచ్ చేసి నైట్ అక్కడే ఉందామనుకుంటే మీరు నైట్ బయల్దేరితేనే రేపు మధ్యాహ్నానికి అయోధ్య వెళ్లగలం లేకుంటే రేపు రాత్రికి వెడితే అయోధ్యలో ఏమి చూడలేరు అని డ్రైవర్ చెప్పాడు.. అంతే వెంటనే ప్యాకప్ అన్నాను
విషయం అర్ధం కానివారు కొందరు చిందులు వేసారు కాని మర్నాడు మధ్యాహ్నం (27-11-2016) అయోధ్యకు చేరేసరికి వాళ్ళకే అర్ధమయింది.
అసలు వారణాశి నుండే గయ వెళ్లొచ్చు కాని డిస్టెన్స్ వల్ల నైట్ కి చేరకుంటే తొమ్మిది రాత్రుల నిద్రకు భంగమవుతుంది. అని అలా వెళ్లలేదు. వారణాశికి ఒక వైపు గయ మరో వైపు అయోధ్య. అయోధ్యకు నైమిశారణ్యం దగ్గరే అందువల్ల గయనుండి వారణాశి, వారణాశినుండి అయోధ్య చూసామన్న మాట.
అయోధ్యలో పటిష్టమయిన, నిర్భేద్యమయిన పోలీస్ బందోబస్త్ లో ఉన్న రామ జన్మభూమి చూసాము. అక్కడ ఉన్న రామ మందిరాలు కూడా దర్శించాము
రాత్రికి కుక్ కి మళ్లీ గ్యాస్ సిలిండర్ స్టవ్ ఇప్పించి వంట చేయించాము.
ఒక హొటల్ వాళ్లు వాళ్ల కిచెన్ ఇచ్చారు. అక్కడే ఉన్న బెంచీల మీద కూర్చుని చలిలో వేడి భోజనం తినడం ఒక ధ్రిల్ అందరికీ.
ఏవో రెండు ఐటమ్స్ అన్నం వండేవాడు కుక్ నాగేశ్వరరావు. ఏడువారాల నగల్లాగా ఒక్కోరోజు ఒక్కో పచ్చడితో భోజనం. పెరుగు ఎక్కడ పడితే అక్కడే దొరికేది. కేవలం వంట సామగ్రి గిన్నెలతో మా కుక్ రడీ. అద్దెకి గ్యాస్ స్టవ్ ఇంకేమి కావాలి. అందరికీ ఆరోగ్యకరమైన హోమ్లీ ఫుడ్.
దానికే ఎంతో సంతోషించారు ఈ యాత్రకు వచ్చినవారంతా.. ఆరోగ్యమయిన భోజనం చాలు పంచ భక్ష్య పరమాన్నాలు అవసరం లేదు అనేవారు. ఆ కోపరేషన్ లేకుంటే మనం కూడా ఏమీ చేయలేము కదా!
రాత్రికి నైమిశారణ్యం చేరుకున్నాము. అప్పటికే బుక్ చేసిన సాయి ధామ్ ( సాయి బాబా గుడి) లో రూమ్స్ తీసుకున్నాము. మర్నాడు ( 28–21-2016) కొన్నిజంటలు సత్యనారాయణ వ్రతాలు చేసుకున్నారు


108 చక్రాలశ్రీచక్ర కుండ్

శ్రీకృష్ణుడు పూరీ జగన్నాధుడు గుడి కూడా అక్కడే వుంది చూసాము

సూత గద్దె గోమతీ నది, వ్యాసగద్దె లలితాదేవి గుడ, ధదీచి కుండ్, రుద్ర కుండ్ ( ఈ కుండంలో పాలు మారేడు దళాలు పళ్లు పూలు నీళ్ల ల్లో ఉన్న శివలింగానికి సమర్పించి ప్రసాదం ఇమ్మని అడగాలి. అప్పుడు ఏదొక పండు పైకి వస్తే తీసుకోవాలి)
వెంకటేశ్వరస్వామి గుడి శ్రీ చక్రతీర్ధం అన్నీ దర్శించుకుని సాయిధామ్ లో వారు పెట్టిన భోజనం చేసి మధ్యాహ్నం తిరుగు ప్రయాణం. ఛలో వారణాశి అనుకుని బయలు దేరాము. మధ్య మధ్యలో అగుతూ మర్నాటికి( 29-11-2016) వారణాశి చేరాము ఆ రోజు అరోజున అన్నపూర్ణా దేవి ఆలయంలో భోజనం చేసాము. ఆవాళంతా రెస్టే.
30-11-2017 న మిగతా షాపింగ్స్, ప్యాకింగ్స్, పేమెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాము. నో టిఫిన్ అనుకుని 11 గంటలకే భోజనం రెడీ. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంటకే హొటల్ నుండి మాట్లాడుకున్న వింగర్స్ లో మొగల్ సరాయ్ స్టేషన్ కి వెళ్లాలి మా ట్రైన్ కి అది స్టార్డింగ్ పాయింట్.
కాశీలో ఎక్కువ సేపు ఆగదు. గంటన్నర ప్రయాణం. అయినా లగేజిలతో ఏ ఒకరు ఎక్కలేకున్నా కష్టం అని మూడింటికి అక్కడ చేరాలి. అందుకే డైరెక్ట్ లంచ్. రాత్రికి చపాతీ ఫ్యాకింగ్స్ షరా మామూలే.
ఇంతకి ఆ లంచ్ దగ్గర చూడాలి అందరూ డల్ అయిపోయారు.
చిత్తూరు నుండి వచ్చిన శ్రీనివాస్( వారిజా బాలాజీల ఫామిలీ ఫ్రెండ్)
అందర్నీ వాళ్ల ఫీలింగ్స్ చెప్పమన్నారు. చెప్తున్నవారు చెప్తున్నారు. ఒక పక్క సుగుణ మరో పక్క అనుపమ మరో పక్క ఇంకొకరు కళ్లనీళ్ల పర్యంతమయి పోయారు. బాలాజీగారు చెప్పిన మాటలు.. ఇక్కడినుండి కొందరు వస్తువులు, మరి కొందరు దుస్తులు, మరి కొందరు పూసలు, ఇలా పట్టుకెడతారు నేను మాత్రం కొన్ని జ్ఞాపకాలు పట్టుకెడుతున్నాను అన్నారు


ఎక్క డ పుట్టామో ఎక్కడ పెరిగామో! కామేశ్వరి గారు కండక్ట్ చేసిన ఈ టూర్ వలన ఇలా కలుసుకున్నాము. పదిహేను రోజులు కలిసి మెలిసి ఒక కుటుంబంలా ఉన్నాము. విడిపోవాలంటే చాలా బాధగా ఉంది అని అందరూ సజల నేత్రాలతో చెప్పారు నాకూ అదే ఫీలింగ్ ఇన్నిరోజులు వీరందర్నీ నావాళ్లుగా చూసుకున్నాను కదా!
దానికి వారందరూ సంతోషించడం నాకూ ఆనందమే కదా!
అంతా భగవంతుడి దయ అనుకున్నాను
ఇలా అందరు ఆత్మీయులతో మా యాత్ర దిగ్విజయంగా ముగించుకుని వచ్చేసాము.
ఇది నేను నిర్వహించిన కాశీ యాత్ర

చెంగల్వల కామేశ్వరి