జి. యస్. హాస్యకథలు / వదినగారి కథలు

రచయిత్రి; జి. యస్. లక్ష్మి
సమీక్ష/మాటామంతీ: మాలాకుమార్

నవరసాలల్లో హాస్యరసం ప్రాధానమైనది అని నా భావన. నవ్వు నాలుగు విధాల చేటు అన్నారు . కాని అన్ని సమయాలల్లో కాదు. అసలు నవ్వని వాడు ఒక రోగి, నవ్వటం ఒక భోగం అన్నారు జంధ్యాల. చక్కగా నవ్వుతూ ఉండేవాళ్ళను చూస్తే ఎవరికైనా మాట్లాడాలనిపిస్తుంది. అదే చిటచిటగా ఉంటే దూరంగా ఉందామనిపిస్తుంది. మనసు బాగాలేనప్పుడు, ఏదైనా చికాకు కలిగినప్పుడు మనసు మళ్ళించుకునేందుకు ఓ హాస్య నవలో, కథో చదవాలనిపిస్తుంది. ఆ కథ చదవగానే పెదవులపై ఓ చిరునవ్వు రావాలి. అందులోని హాస్య సంఘటనలు పదే పదే గుర్తొచ్చి పడీ పడీ నవ్వాలి. “పాపం బిక్కమొహం వేసాడు. “అని చదవగానే ఆ బిక్క మొహం కళ్ళ ముందు మెదలాడాలి. ఏదైనా సంఘటన హాస్యంగా ఉండవచ్చు. దానిని హాస్యంగా వ్రాయటం ఒక కళ. పత్రికలల్లో హాస్యకథ అని రాసినా ఆ కథ చదవగానే నవ్వు కాదు కదా పెదాలు కూడా విచ్చుకోవటం లేదు! కాని అదేమిటో తెలుగు లో అలాంటి హాస్య రచయతలు ఎక్కువగా లేరు. ఉన్న కొద్ది హాస్య రచయతలల్లో కి ఈ మధ్య తన హాస్య కథలతో దూసుకు వచ్చేస్తున్నారు జి. యస్. లక్ష్మి గారు. ఆరోగ్యం కోసం హాస్యం అంటూ , “జి. యస్. హాస్యకథలు / వదినగారి కథలు” పుస్తకాన్ని, మనసారా నవ్వుకోండి అని పాఠకులకు అందించారు.

జి. యస్ హాస్యకథలల్లో మొత్తం పదమూడు కథలు ఉన్నాయి. మొదటి కథ “అమ్మగారికి దండం పెట్టు” తో నవ్వటం మొదలుపెడితే ఇక ఆప కుండా నవ్వుకుంటూ పోవటమే మన పని. అయ్యో కథలన్నీ అప్పుడే ఐపోయాయా అనుకోకుండా , వెనక్కి తిప్పుతే గడుసు వదినగారు, అమాయకపు మరదలు కథలు కనిపించి అమ్మయ్య ఇంకాసేపు నవ్వుకోవచ్చు అనుకుంటాము. ఆ కథల గురించి నేను చెప్పటమెందుకు మీరే చదివి నవ్వుకోండి. పుస్తకము కొని చదువుకునే ముందు కొంచము రచయిత్రితో మాటా మంతీ.

 

1. మీకు రచనలు చేయాలనే కోరిక ఎప్పుడు కలిగింది?
జ) 1992 నుంచీ అప్పుడప్పుడు ఆకాశవాణిలో ప్రసంగవ్యాసాలు, నాటికలు, పాటలు ప్రసారమయ్యేవి. నా మొట్టమొదటికథ ఆ రోజుల్లోనే ఆంధ్రప్రభ వారపత్రికలో పడినా నేను రచనావ్యాసంగాన్ని సీరియస్ గా తీసుకున్నది 2002 నుంచే.
2. మీ హస్య కథల గురించి మాట్లాడుకునే ముందు, మీ నవల “ఒక ఇల్లాలి కథ ” గురించి చిన్న అనుమానము. మీ “ఒక ఇల్లాలి కథ” లో నాయిక స్వరాజ్యమును ముందు నుంచీ సాత్వికురాలిగా, తల్లికీ, భర్తకూ విధేయురాలుగా, అణుకువగా చూపించి, చివరలో తిరుగుబాటు చేయిస్తారు. నిజ జీవితంలో అలా మారటం సాధ్యమంటారా?
జ) ఒక ఇల్లాలి కథ లో నాయిక స్వరాజ్యం మనస్తత్వం మొదటినుంచీ తన గురించి కన్నా యితరుల గురించే యెక్కువ ఆలోచించే మనస్తత్వం. అందుకే పెద్దవాళ్ళ నిస్సహాయతను గుర్తించి రమణమూర్తి పెట్టిన షరతులకు లోబడి పెళ్ళి చేసుకుంది. పెళ్ళయాక ఆ యింటికే అంకితమయిపోయి, పుట్టింటినుంచి తను తెచ్చుకున్న బంగారంకూడా ఆడపడుచుని గొప్ప యింటిలో యివ్వడానికి తనంతట తనే యిచ్చేసింది. ఆఖరున కూడా తన తల్లీ, మేనత్తలకోసమే రమణమూర్తి దగ్గరకి వెడదామనుకుంది. కానీ, ఎప్పుడయితే మేనకోడలు స్రవంతి, ‘నువ్వు అలా వెడితే నిన్నే మాకు ఆదర్శంగా చూపిస్తారు’ అని చెప్పిందో అప్పుడు కూడా అదే మనస్తత్వంతో తనకోసం కాకుండా తన తరవాతి తరంవారికోసం తిరుగుబాటుకు నాంది పలికింది.
3. మీవి కొన్ని బ్లాగ్ పోస్ట్ లూ, ఒక కథ “అమ్మ మారిపోయిందమ్మా” మీ పేరు లేకుండా ఎవరో షేర్ చేసారు కదా!దానికి మీ స్పందన ఏమిటి?
జ) నా పేరు లేకుండా షేర్ అయినందుకు బాధగా అనిపించింది.
4. మీ కథ”అమ్మ మారిపోయిందమ్మా” కథ, దానితో పాటు మీరు పాపులర్ అయిపోయారు దానికి మీ స్పందన ఏమిటి?
జ) సంతోషంగా అనిపించింది.
5. మీకు రచనలు కాకుండా ఇంకా ఏ కళల్లోనైనా ప్రవేశం ఉందా?
జ) ప్రవేశం మాత్రమే వుంది.
6. రచయిత్రి రచన చేసేటప్పుడు దేనిని గుర్తు పెట్టుకోవాలి?
జ) తన చుట్టూ వున్న సమాజాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఆ రచయిత చేసే రచన వల్ల సమాజంలో ఒక నేరస్తుడు మంచివాడుగా మారాలి కానీ, ఒక మంచివాడు నేరస్తుడుగా మారకూడదు.
7. రచనల్లో స్త్రీ పాత్రలను యెలా చిత్రీకరించాలి?
జ) స్త్రీలు కూడా మనుషులే. వారికి కూడా వ్యక్తిత్వం వుంటుంది. అటువంటి వ్యక్తిత్వం గలవారిగా చిత్రించాలని నా అభిప్రాయం.
8. ఇక హాస్య కథలు గురించి హాస్యకథలు రాయడానికీ, సీరియస్ కథలు రాయడానికీ మధ్యగల తేడా యేమిటో చెప్పండి.
జ) చాలా తేడా ఉందండీ. సీరియస్ కథలనబడే కరుణ రసాత్మక కథలూ, అణచివేత కథలూ, ఆకలి కథలూ, సమస్యలకు పరిష్కారాన్ని చూపించే కథలూ వంటివి రాస్తున్నప్పుడు ఆ రసం పండడానికి ఆ సన్నివేశాన్ని ఎంత ఎక్కువగా వర్ణించితే పాఠకులు అంత ఎక్కువగా ఆస్వాదిస్తారు.
కానీ, హాస్యకథలు రాసేటప్పుడు ఆ సన్నివేశాన్ని పండించడానికి అలా ఎక్కువగా రాస్తే ఆ హాస్యం పాఠకుడికి వెగటు పుట్టిస్తుంది. తక్కువగా రాస్తే ఆ హాస్యం పండదు. అందుకే హాస్యరసాన్ని చాలా బాలన్సెడ్ గా రాయాలి.
9. బాలన్సెడ్ గా అంటే? ఏమైనా జాగ్రత్తల్లాంటివి తీసుకోవాలా?
జ) అవునండీ. హాస్యం రాసేటప్పుడు అది ఎదుటి మనిషిలోని అవకరాన్నిగానీ, లోపాన్నిగానీ యెత్తి చూపించి పాఠకులని నవ్వించే ప్రయత్నం చెయ్యకూడదు. ఒక మనిషి అరటితొక్కమీద కాలేసి జారిపడినట్టు లాంటివి రాస్తే, అది ఎదుటి మనిషి పడే బాధని మనం హాస్యంగా తీసుకున్నట్టవుతుంది. అది పాఠకుడిలో ఉండకూడని గుణాన్ని మనం పైకి తీసుకొచ్చినట్టవుతుంది. అందుకే హాస్యరచయిత(త్రి) మరింత జాగ్రత్తగా రచనలు చెయ్యాలి.
10. “వదినగారి కథలు” లో వదినగారి గురించి అలా రాసినందుకు మీ వదినగారు ఏమీ అనుకోలేదా?
జ) హ హ. . చాలామంది అలాగే అడుగుతుంటారండీ. కానీ, నా వదినగారికథల్లో వదిన నేను సృష్టించిన పాత్ర. మా వదినలెవ్వరూ అలా లేరు. కొంతమంది మనుషులు వాళ్ళు చేసిన పని తప్పయినా సరే, తప్పని వాళ్లకి తెలిసినా సరే అస్సలు ఆ తప్పు ఒప్పుకోరు. పైగా వాళ్ళ మాటల చాతుర్యంతో ఆ తప్పుని ఒప్పుగా ఎంచక్కా దిద్దేస్తారు. దానికి చాలా తెలివితేటలూ, సమయస్ఫూర్తీ, వాక్చాతుర్యం లాంటివి కావాలి. అలాంటి పాత్ర సృష్టే ఈ వదిన. అందుకె ఈ వదినంటే నాకెంతో ఆరాధన.
11. మీరు ఇంకా ఏమైనా చెప్పదలచుకుంటే చెప్పండి.
జ. తప్పక చెపుతానండీ. ఇలా నా అభిప్రాయాలను పంచుకోవడానికి దోహదపడిన మీకూ, పత్రికా సంపాదకులకూ నా ధన్యవాదాలు.
లక్ష్మిగారు మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి.

ప్రఖ్యాత రచయిత్రి మన్నెం శారదగారు చిత్రించిన ముఖ చిత్రముతో ఉన్న జి. యస్. హాస్య కథలు / వదినగారి కథలు అన్ని పుస్తక షాపులల్లోనూ దొరుకుతుంది. వందరూపాయిలకు కొనుక్కొని కడుపుబ్బ నవ్వుకోండి.

తుషార మాలిక లఘు సమీక్ష …!!

రచన: మంజు యనమదల

కవితలకు, కథలకు సమీక్షలు రాయడం అంటేనే చాలా కష్టమైన పని. సిరి వడ్డేగారు రాసిన త్రిపదలకు అది కూడా 1300 ల త్రిపదలకు నేను సమీక్ష రాయడమంటే సాహసం చేయడమే. అక్షరాలకు అందమైన పదభావాలను జత చేసి ముచ్చటైన మూడు వాక్యాల్లో త్రిపద కవితలను సిరి వడ్డే మనకు “తుషార మాలిక” తొలి త్రిపద సంపుటిగా అందించారు. ముందుగా వారికి నా ప్రత్యేక అభినందనలు.

ఒక్కో వాక్యానికి 20 అక్షరాలకు మించకుండా మూడు వాక్యాల్లో ముచ్చటైన కవితలను అందించిన తీరు చదువరులను ఆకట్టుకుంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక తుషార మాలికలో మొదటి త్రిపదం జన్మనిచ్చిన అమ్మతోనే మొదలు. చరాచర సృష్టికి మూలం అమ్మ. ఆ అమ్మ ఒడి ఓనమాలతో మొదలై జీవిత పాఠాలు నేర్చుకునే వరకు చదువుల తల్లి శారదమ్మలా మనకు బాసటగా ఉంటుందని చెప్పడం. అమ్మని కూడా పసిపాపను చేస్తూ మనల్ని కొట్టి అమ్మ కూడా ఏడవడాన్ని ఎంత బాగా చెప్పారో..

అమ్మ కూడా పసిపిల్లనే …
నన్ను కొట్టి ,
తను ఏడుస్తోందేమిటో…అలా వెక్కి వెక్కి..!!

పాపాయి బోసి నవ్వులతో నేర్చుకోవడం మొదలైన అమ్మ చదువుకోవడంలో ఎప్పటికి నిత్యా విద్యార్థిగానే ఉందని చెప్పడంలో భావుకురాలి గొప్పదనం తెలుస్తోంది. జ్ఞాపకాల గురించి చెప్పినప్పుడు వాడని పున్నాగపూల పరిమళాన్ని వీడని జ్ఞాపకాల మడతలతో పోల్చడం, ఇష్టమైనవాళ్లు విసిరిన చిరునవ్వు ఎదను హత్తుకున్న అమ్మ చేతి స్పర్శతో పోల్చడం, పాపాయి అలిగి అన్నం తినకపోతే అన్నం తినని అమ్మ అలకని తన చిన్నతనంలో పోల్చుకుని చెప్పడం, నాన్నతో అనుబంధాన్ని జీవితపు అవినాభావ సంబంధంగా, గుప్పెడుగుండేలో ఒదిగిన ప్రేమ అమ్మానాన్నల స్పర్శగా అనుభూతించడం, మానవత్వాన్ని చాటిచెప్పేవి పల్లెలే అని, ప్రపంచాన్ని, పుట్టిన పల్లెటూరును తూకం వేస్తె అనుబంధాలకు తూనిక తమ పల్లెలే అని తేల్చి చెప్పడం, అనుభవ పాఠాలను నేర్పే జీవితాన్ని గురువుగా భావించడం, వెన్నెల్లో విహరిస్తున్నా మాటల అమృతాన్ని మదినిండుగా గ్రోలడంలో ఓ రకమైన తీయని విరహాన్ని చెప్పడం, మనసు కొలనులో స్వప్నసుమాలను, చేజార్చుకున్న స్మృతుల మూటల వేడుకులాటలు, రెప్పలా మాటున దాగిన కలల మంత్రంనగరి మర్మాన్ని ఛేదించడం, కాలాన్ని పట్టి ఆపేసిన జ్ఞాపకాల డైరీని, అల కల దూరాల తీరాలని, నిశీథి సుమాలను ఏరి వెన్నెల నవ్వులకివ్వడం, మది వేదన శిశిరాన్నిదాటి ఆశతో పోల్చడం, కలిసిన క్షణాలన్నీ అందెల మువ్వల నవ్వులే అని, దైన్యాన్ని దాటి ధైర్యాన్ని అందుకోవడం, మౌన ధ్యానంలో వరమైన ప్రేమని, విధి పంపకాలను అప్పగింతలుగా, హృదయపు తికమకలను, మనోనేత్రపు మనసును, ప్రక్రుతి, సనాతన ఆవర్తనాలను, సెలయేటి గలగలలు, మబ్బు గిన్నెలు తొలకరి వర్షపు పూలజల్లులను, ఆకులపై అలరాలే చినుకుల ముత్యాలను, పాత పరిచయాన్ని పడే పడే పలవరించడం, చిగురాకు సవ్వడిలో పూమొగ్గల పరిమళాన్ని ఆస్వాదించడం, తలపుల తాకిడిని పెనుగాలికి రాలిపోయే పూలతో పోల్చడం, నది నడకలను, రాకను, పోకను కూడా సంధ్యానాదంతో పోల్చడం చాలా చాలా బావుంది. కదిలే మేఘాలను, పొద్దుపొడుపుల అందాలను, చీకటి దుప్పటిలో వెన్నెల నక్షత్రాలను, జ్ఞాపకాల తుంపర్లను, ప్రేమలో విజయ కేతనాన్ని, ధీరత్వాన్ని జీవితంలో ఆటుపోట్లకు వెరవని మనసని చెప్పడం, పొగడ్త మంచిదికాదని, సాగర సంగమం జీవితమని, పున్నమి, కలువల అనుబంధాన్ని, కలల నిరీక్షణలో వేసారిన కనురెప్పలకు, రెప్పల పరదాలను వేయడం చాలా అద్భుతమైన భావం.

రెప్పల పరదాలను వేసేసాను…
కనుల సౌధానికి,
నీ కలలను గుట్టుగా దాచుకుందామనే..!!

ఇలాంటి ఎన్నో అద్భుతమైన త్రిపదలు ఈ సంపుటి నిండా పరుచుకుని మనలను ఆపకుండా చదివిస్తాయనడంలో సందేహం లేదు. అన్ని సమీక్షించడం కన్నా చదవడం బావుంటుంది. ఓ చక్కని తుషార మల్లికను అందించిన సిరి వడ్డేకి మరోసారి మనఃపూర్వక అభినందనలు.

అంతర్వాణి – సమీక్ష

సమీక్ష: నండూరి సుందరీ నాగమణి

‘అంతర్వాణి’ – శ్రీ కొసరాజు కృష్ణప్రసాద్ గారి కవితాసంపుటి పేరుకు తగినట్టే స్వగతంగా వ్రాసుకున్న కవితలతో కొనసాగుతుంది. చక్కని పద ప్రవాహంతో, లయతో సాగిన ఈ కవితలు అన్నీ విభిన్న కవితావస్తువులతో అలరించాయి.

‘మాతా పిత: నమామి’ అంటూ అమ్మానాన్నల తలచుకొంటూ, వారికి ప్రణామములు అర్పిస్తూ మొదలైన కవితా వాహిని, ఆద్యంతమూ చదువరుల మనసును ఆకట్టుకునే విధంగా కొనసాగింది. ‘వ్రాసితిని వ్రాసితిని’ అనే కవితలో తన కవితకు స్ఫూర్తి దాయకులైన కవులను – అలనాటి రాయల నుంచి, ఇటీవలి మహాకవి శ్రీశ్రీ వరకూ అందరినీ స్మరించారు. రైతు గొప్పదనాన్ని ‘కృషీవలుడు’ అనే కవితలోనూ, తెలుగు నేల ఘనతను ‘తెలుగుతల్లి’ కవితలోనూ, శిల్పి చేతిలో శిల్పంగాను, పెద్ద పెద్ద భవంతులకు పునాది గానూ నిలిచే ‘రాయి’ని ‘రాయి’ అనే కవితలోనూ చక్కగా వర్ణించారు. ‘భడవ’, ‘చిట్టితల్లి’ అనే కవితలలో తమ సంతానం గురించి పితృ వాత్సల్యంతో వారిద్దరినీ వర్ణించారు.

వచనకవితలు వ్రాసే కవులందరికీ అజ్ఞాత గురువు శ్రీశ్రీ గారే… ‘శ్రీశ్రీ’ అనే కవితలో వారిని స్మరించుకున్న తీరు, ‘అమ్మ’ కవితలో అమ్మ గురించి వ్రాసుకున్న రీతి అమోఘంగా ఉన్నాయి. ‘మంచోళ్ళవండే’ కవిత నేటి రాజకీయ నాయకులపై, రాజకీయ పరిస్థితులపై ఒక చక్కని వ్యంగ్యాస్త్రం.

ఇంత మంచి కవితాసంపుటిని రచించిన శ్రీ ‘కొసరాజు కృష్ణప్రసాద్’ గారిని, అందంగా అచ్చువేసిన మన జేవీ పబ్లికేషన్స్ అధినేత శ్రీమతి జ్యోతి వలబోజు గారిని అభినందిస్తూ, పుస్తకం అందుకొని చదివేద్దామా మరి!
***
నండూరి సుందరీ నాగమణి

కాఫీ విత్ కామేశ్వరి – సమీక్ష

రచన: నండూరి సుందరీ నాగమణి

కం.
కామేశ్వరితో కాఫీ
ఆమే చెప్పెను కబుర్ల నలవోకనిదే
గోముగ విహరించగనే
తామిక రండి, ముదమున తనివిని పొందన్!

‘కాఫీ విత్ కామేశ్వరి’ – అండ్ కబుర్లు… అదేనండీ, కామేశ్వరితో కాఫీ మరియు తను కమ్మగా చెప్పే కబుర్లు అన్న మాట! రోజుకో చక్కని అంశం తీసుకుని, వేడి వేడి ఆనంద్ సినిమాలాంటి కాఫీని తా(లా)గిస్తూ తన కబుర్లతో ఎక్కడెక్కడికో తీసుకుపోయి మళ్ళీ తీసుకువచ్చేస్తుంది కామేశ్వరి… ఒకటా రెండా, డెబ్భై ఏడు కాఫీ ఉదయాలు… అక్కడక్కడ మధ్యాహ్నాలు… ఎప్పుడైనా ‘ఛాయ్ విత్ చెంగల్వల’ అంటూ సాయంత్రం కబుర్లూను…
పుస్తకం గురించి మాట్లాడుకునే ముందు రచయిత్రి గురించి ఓ నాలుగు మాటలు… ‘నేను రచయిత్రిని సుమా!’ అని గర్వంగా అనుకోదు, మన సొంత అక్కలా ఆప్యాయత పంచుతుంది… పిల్లల్లో పాపాయి, పెద్దల్లో అక్కాయి కామేశ్వరి చెంగల్వల. ఈమెతో నాకున్న తీయని అనుబంధం మమ్మల్ని ఆత్రేయపురం అందాలలో విహరింప జేసింది… ఆనందపుటంచులలో నిలిపింది… పాపికొండల పరిష్వంగంలో పరవశించేలా చేసింది… చూసే ప్రతీ దృశ్యాన్ని, కలిగిన ప్రతీ భావనను, చెప్పాలనుకున్న ప్రతీ మాటను అందంగా, ఎదుటివారి మనసుకు హత్తుకునేలా అక్షరీకరించటం అందరికీ సాధ్యం కాదు… అదిగో అలాంటి విషయాల్లో అందెవేసిన చేయి మన కామేశ్వరిది. తాను వ్రాసిన ‘కాఫీ విత్ కామేశ్వరి’ అనే (కథల వంటి) కబుర్ల పుస్తకాన్ని ఎంతో అందంగా, సరియైన సమయానికి అచ్చొత్తించి మనకి అందించిన మన జ్యోతి అనగా జేవీ పబ్లికేషన్స్ అధినేత శ్రీమతి జ్యోతి వలబోజు ఎంతైనా అభినందనీయురాలు.
ఇక పుస్తకం విషయం లోనికి వచ్చేద్దాం. ఇంచుమించుగా అన్ని అధ్యాయాలూ ఒక మంచి, కమ్మని, తీయని గీతంతో శుభారంభంగా ప్రారంభించింది. చెప్పే విషయాలు ఎన్నో, ఎన్నెన్నో… బాహుబలి సినిమా గురించి, మగవారి వంటల గురించి, కార్మిక సంక్షేమం గురించి, మనసుతీరా పంచే నవ్వుల గురించీ, మనసైన జంటల గురించీ, అమ్మ గురించీ, అంత్యాక్షరి గురించీ… ఏదీ వదలలేదు కామేశ్వరి… ఎంతో చక్కగా కళ్ళకు కట్టేలా, మనసుకు పట్టేలా వివరించారు…
మనం మర్చిపోయిన ఉత్తర రచన, అప్పటి తరానికి ఇప్పటి తరానికీ ఆలోచనలలోనూ, ఆచరణలోనూ ఉన్న వ్యత్యాసం, అప్పటి పండుగ వాతావరణం, ఇప్పటి ప్లాస్టిక్ తరుణం – వీటిగురించి చదువుతూ ఉంటే మనసు స్పందించక మానదు. కాలం చాలా వేగంగా మారిపోతోంది అనటానికి మన తరమే సాక్ష్యం.పూలజడలూ, పట్టు పరికిణీలు, రంగవల్లులూ, గొబ్బెమ్మలూ, పండుగలూ గతంలోకి వెళ్ళిపోయి దాక్కున్నాయి. ఈ విషయాన్ని ఎంతో హృద్యంగా చెప్పారు రచయిత్రి.
వేసవి కాలంలో ఆవకాయ పచ్చళ్ళ గురించీ, ఈనాటి అత్తల్నీ, మొగుళ్ళనీ, కోడళ్ళు పెట్టే ఆరళ్ళ గురించీ, ఓర్చినమ్మకు తేటనీరని ఎంతో ఒద్దికగా కాపురాలు చేసిన చేస్తున్న చెల్లెళ్ళ గురించీ (వారి చెల్లెలు పద్మ పొందిక నాకూ తెలుసు మరి!), చిట్టి మనవరాళ్ళ జళ్ళ గురించీ, వీధి వీధికీ వెలిసిన కూరల కూడళ్ళ గురించీ – కామేశ్వరిగారు వ్రాసిన విషయాలు చదివి తీరాల్సిందే, మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవలసిందే…
ఈ రచయిత్రి చాలా నిజాయితీగా తన పొరపాట్లను ఒప్పేసుకుంటారు… తాను పని చేయకుండా, కర్ర పెత్తనం చేసే విషయంలో; అమాయకత్వం, అల్లరి వలన బాగా లావుగా ఉండేవారి మీద జోకులు వేసుకోవటం లాంటివి… చాలా ముచ్చట వేసింది నాకైతే… ఎంత మంది ఉన్నారు ఇలా తెలియక, చిన్నతనం కొద్దీ అలా అనుకునే వాళ్లమంటూ మనతో మనసు పంచుకొనే వారు? అందుకే ఈమె ఆత్మీయతకు వ్యక్తిగతంగా కూడా దాసోహం!
అలాగే అప్పుడెప్పుడో చిన్నతనంలో ఎవరైనా పడిపోతేనో, వాళ్లకి ఏమన్నా జరిగితేనో [అప్పటికి మన పగ వాళ్ళన్న మాట] ‘అచ్చిగచ్చిగ’ అని కసిగా ఏడిపించటం – అసలు ఈ మాట ఎంత మందికి తెలుసో నాకు తెలియదు కానీ మేము చిన్నప్పుడు చాలా చాలా విరివిగా వాడేవాళ్ళం ఈ పదాన్ని… మళ్ళీ ఇన్నాళ్ళకి, ఈ పుస్తకంలో చదివాను ఈ పదం… ఆహా, ఎంత చక్కని, తీయని నోస్టాల్జియా?
ఇప్పుడిక కామేశ్వరి గారి రచనా శైలి గురించి… చక్కని భాష, అలవోకగా చదివింప జేసే పదాల పొందిక, వేగం ఈమెకు వాణి ఇచ్చిన వరం. పుస్తకం తెరవడమే ఆలస్యం., మీరు చదవరు, పుస్తకమే చదివింపజేస్తుంది… ఇంత చక్కని పుస్తకాన్ని రచించిన శ్రీమతి కామేశ్వరి చెంగల్వల గారికి, నా మన:పూర్వక ధన్యవాదాభినందనలు!
మరి ‘మహారాణీ కామేశ్వరీదేవి’ గారి ఈ మంచి పుస్తకాన్ని చదివేయటానికి మీరు సిద్ధమేనా? వచ్చేయండి!
***

కొత్త కథలు – సమీక్ష

రచన: ఎమ్మెస్వీ గంగరాజు

అలనాటి మేటి తారకలు, శాంతా రంగస్వామి, పూర్ణిమా రావు, అంజుమ్ చోప్రా, డయానా ఇడుల్జీ మొదలగు వారూ, ఈనాటి తారకలు మిథాలీ, దీప్తీ, మంధానా, హర్పీత్, జూలన్ మొదలగు వారూ కలసి అద్భుతంగా ఆడుతూ అలరిస్తున్న క్రికెట్ మాచ్ ని వీక్షిస్తూంటే కలిగే అనుభూతి లాంటిదే, నిన్నా. మొన్నటి మేటి రచయిత్రులూ, నేటి వర్ధమాన రచయిత్రుల కలాల నుండి జాలువారిన ఈ 33 “కొత్త కథలు” కదంబాన్ని అవధరించడంలో కలుగుతుంది అని చెప్పక తప్పదు. క్రొత్త పాతల మేలు కలయిక అంటే ఇదేనేమో!

అలనాటి తారకలు పరుగుల వరదలు కురిపించకపోయినా వారి లేట్ కట్ లూ, స్క్వేర్ కట్ లూ ప్రేక్షకులను అలరించినట్లే, సీనియర్ రచయిత్రుల కథలలో ఉండి ఉండీ మెరిసిన తళుకులు పాఠకులను అలరించి తీరుతాయి.

దొరికిన అవకాశాన్ని చక్కగా అందిపుచ్చుకుని ప్రతిభను ప్రదర్శించిన జూనియర్ ఆటగాళ్ళ(ఆటగత్తెల)కు మల్లె వర్ధమాన రచయిత్రులు తమ ప్రతిభ ప్రదర్శించారు కథలలో.

నాలుగో, అయిదో కథలు కాస్త నిరుత్సాహం కలిగించినా కథలు భేషుగ్గా ఉన్నాయనే చెప్పాలి. మొత్తం మీద ‘సినారె’ బెనిఫిట్ మాచ్ ని – అదేనండీ, సంస్మరణ కథా సంకలనాన్ని – రక్తి కట్టించేలా చేశారు నిర్వాహకులు వంశీ రామరాజు గారు!

రచయిత్రులచే విరచితమవ్వడం వలన కాబోలు ఎక్కువ శాతం స్త్రీ పాత్రల ప్రాధాన్యత గలవే! ఉదా:
శృతి (శృతి అనకూడదు, శ్రుతి అనాలనుకోండి.) కథ”దుష్ట రక్షణ”.ఈ కథలో శ్రుతి ఏదో ఆధారం చూపించి నిందితునికి శిక్ష పడేలా చేస్తుంది అని చివరి వరకూ ఆశించిన పాఠకుడికి కాస్త నిరాశ కలుగుతుంది), రమ్య(నెల పొడుపు కథ.’కథని పూర్తిగా అరటి పండు ఒలిచి పెట్టినట్టు చెప్పేస్తే పాఠకుడిని చిన్న చూపు చూసి నట్టే అవుతుంది. అతడి ఊహకి కూడా కొంత విడిచి పెట్టాలి.’ అంటాడు సుప్రసిద్ధ కథకుడు చెహోవ్!నిజమే! అయితే, ఈ కథలో రమ్య ఆశయం ఎలా నెరవేరుతుందో పూర్తిగా పాఠకుని ఊహకి విడిచి పెట్టేశారు రచయిత్రి. అంతా పాఠకుడే ఊహించుకుంటే ఇక కథకులెందుకు?), ఇందిర(పెండ్లి అంటే ఇది), జానకి(పొద్దు తిరుగుడు పువ్వు), మాలతి(ఉత్తరం), వెంకట లక్ష్మి(స్వాభిమానం), చైతన్య(చైతన్య), జయ(గోడలు కదిలాయ్), ప్రణీత(ఈ ప్రశ్నకు బదులు ప్రశ్న కాదు), ప్రియాంక(పేరు), వైజయంతి, మారియా(మానవత్వపు స్పర్శ), సుజాత(విచక్షణ), ధార(వేగు చుక్క పొడిచింది కథ- సామాజికంగా ఇది పరిష్కారం కాదేమోనని పించింది) , ప్రవల్లిక(అమ్మా, నాన్న – ఒక పెళ్ళి), సావిత్రి(ఆలంబన), సుమ(నిర్లక్ష్యం వెల).

కొన్ని కథలు పురుష పాత్రలకూ ప్రాధాన్యత ఇచ్చాయి. ఉదా:
శేఖర్(ఇది కథ కాదు), కొడుకు(వచ్చే జన్మకైనా),వంశీ మాధవుడు, రాజారావు(ప్రేమంటే భయం ఎందుకు?),రామకృష్ణారావు(హుండీ).

సెంటిమెంట్ ప్రధానంగా కలవి – పాత సామాన్లు, వెన్నెల పుష్పాలు. విలక్షణమైన కథ”ఇద్దరు”. ‘మనిషి జాడలు’ లో రచయిత్రి ఒక క్రొత్త విషయం చెప్పారు. కారు ఓనర్లకుపయోగ పడవచ్చు. ఆర్ద్రతతో కూడిన కథ ‘బడుగు నీడ’. తమాషా కథ “శ్రద్ధగా పని నేర్చుకో నాన్నా”(పొత్తూరి విజయలక్ష్మిగారి బ్రాండు! “మైక్రో ఫైనాన్స్” లోని కష్టాలు తెలిపే కథ. మంచి సెటైర్ తో కూడిన కథ “తెలుగు రాని దానివని దిగులు చెందకు.”.

33 రచయిత్రులను ఏక ధాటిగా చదవడం ఒక చిత్రమైన అనుభవం. చివరగా, క్రికెట్ పరిభాషలో ప్రారంభించాం కాబట్టి అదే ఒరవడిలో ముగింపు పలుకుదాం!”ఉత్తరం”, “స్వాభిమానం”, “ప్రేమంటే భయం ఎందుకు?”, “హుండీ” కథలు సెంచరీలతోనూ, “ఇది కథ కాదు”, “”అమ్మ, నాన్న – ఒక పెళ్ళి”, అర్థ సెంచెరీలతోనూ అలరించాయని స్వాభిప్రాయం!

“ఆదివాసి రాసిన ఆదివాసీ శ‌త‌కం”

స‌మీక్ష‌ : జ్వలిత

శ‌త‌కం అంటే మ‌న‌కు భ‌క్తి శ‌త‌కాలు, నీతి శ‌త‌కాలు, కొండొక‌చో శృంగార శ‌త‌కాలు గుర్తుకు వ‌స్తాయి. కానీ, అస్తిత్వ శ‌త‌కాలు అసలు లేవు అన‌వ‌చ్చు. కోసు ప్ర‌సాద‌రావు తూర్పు గోదావ‌రి జిల్లా, రంప‌చోడ‌వ‌రం మండ‌లం, బంద‌ప‌ల్లి ఆశ్ర‌మ పాఠ‌శాల ఉపాధ్యాయులు. “ఆదివాసీల‌” మీద శ‌త‌కం రాసిన వాళ్ళ‌లో మొద‌టివారై ఉంటారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన వీరు మొత్తం నాలుగు శ‌త‌కాలు ర‌చించారు. అవి (1) మాతృశ్రీ గండి పోశ‌మ్మ శ‌త‌కం, (2) శ్రీ షిర్డి సాయి శ‌త‌కం (3) శ్రీ రంప మ‌ల్లిఖార్జున శ‌త‌కం, (4) ఆదివాసి శ‌త‌కం, ఇంత‌కుముందు రాసిన మూడు ఆధ్యాత్మిక శ‌త‌కాలు అయితే జ‌న్మ‌తః ఆదివాసి అయిన‌వారు “ఆదివాసీల శ‌త‌కం” రాయ‌డం అభినంద‌నీయం. దీనిని వారి త‌ల్లి దండ్రుల‌కు అంకిత‌మిచ్చారు. ఆదివాసీల స్థితిగ‌తుల గురించిన సామాజిక అంశం పై రాసిన శ‌త‌కం ఇది. ఇందులో మొత్తం 108 ప‌ద్యాలున్నాయి. “మ‌కుటం ప‌ల్లెవాసి మాట పసిడి మాట”
శ‌త‌కం ప్రారంభానికి ముందు అల్లూరి సీతారామ‌రాజుకు నివాళి అర్పించారు. ముందు మాట‌లు రంప‌చోడ‌వ‌రం ఎమ్మెల్యే వంత‌ల రాజేశ్వ‌రి, బంద‌ప‌ల్లి ఎమ్‌పిటిసి కారం బాప‌న్న దొర‌,ఏజెన్సీ స‌ర్పంచుల అధ్య‌క్షుడు పండా రామ‌కృష్ణ‌, క‌ర్రా కార్తికేయ‌ శ‌ర్మ రాశారు.
మొద‌టి ఏడు భ‌ర‌త‌మాత గొప్ప‌త‌నం, రామాయ‌ణ, భార‌తాల ప‌ల్లెలు, పాడి పంట‌లు వంటి వానిని పొగిడారు. ఎనిమిద‌వ ప‌ద్యంలో ఆదివాసీల తెగ‌ల గురించి చెప్పారు. కోయ‌లు, వ‌ల్మీకి,కొండ‌రెడ్లు, భ‌గ‌త కొండ‌కాపు, కొండ దొర‌లు, కొండ క‌మ్మ‌ర‌లుంటార‌ని వివ‌రించారు.
తొమ్మిద‌వ ప‌ద్యంలో ఆదివాసి అంటే అమ‌లిన సంత‌తి అని మాయ మ‌ర్మాలు తెలియ‌ని వారిని నీతి ధ‌ర్మ‌మున‌కు క‌ట్టుబ‌డి ఉంటార‌ని వారి స్వ‌భావాన్ని వివ‌రించారు.
ఆదివాసీల‌లో చ‌ట్టాల తెలియ‌వు, న్యాయ‌స్థానాలు ఉండ‌వు. కోయ‌గూడెం పెద్ద‌లు గ్రామ పెద్ద‌గా న్యాయంతో తీర్పులు చెబుతుంటారు. వారికి విద్య అందుబాటులో లేద‌న్న విష‌యం ప‌ద‌కొండ‌వ ప‌ద్యంలో ఇచ్చి పుచ్చుకోవ‌డం వారి సంప్ర‌దాయం. “క‌లం కాగితం క‌ల‌లోన ఎరుగ‌రు” అంటారు.
“అడ‌విలోని బాట ఆదివాసుల వేట – గిరుల‌లోని పంట సిరులు ఇంట – వంట వార్పుల‌న్ని పంట చేల‌లోనంట” – అంటూ ఆదివాసీ ప్ర‌జ‌ల జీవన చిత్రాన్ని మ‌న ముందుంచుతారు.
పోడు వ్య‌వ‌సాయంలో ఆదివాసీల పంట‌ల గురించి వివ‌రించారు.
కొండ పోడు నందు కొర్ర‌, సామ‌లు, జొన్న‌, కంది వంటి ప‌ప్పు దినుసులు, అడ‌విలో దుంప‌లు, ఆకుకూర‌లు వారి పంట‌. చింత‌పండు, సీకాయ‌, చీపుర్లు, న‌ల్ల‌జీడి పిక్క‌లు, రెల్లి చెక్క‌,అడ్డ‌నార‌, తేనె మొద‌లైన వాటిని ఆదివాసీలు సేక‌రిస్తారు. కోవెల జిగురు, న‌ల్ల‌మ‌ద్ది చెక్క‌, చిల్ల పిక్క‌, ముసిడి గింజ‌లు, ఉసిరికాయ‌లు, ప్రిడెము, కొమ్ము కూర‌, వెదురు బియ్య‌ము,బ‌లుసు కూర‌, మాడి టెంక‌ల పులుసు, గొడ్డు కూర వంటి వంట‌కాలు వారి ఆహార దినుసుల గురించి చెప్పారు.
“చింత‌గింజ ప‌ప్పు చితికి జావ‌ను గాచి, గురుగు కూర నంజి ఆర‌గింతురు” అని వివ‌రిస్తారు. తాటి మొవ్వ‌కూర – తంగెడు గింజ‌లు – చీమ చింత‌కాయ‌, చేమ‌కూర – చింత చిగురు ప‌ప్పు, చేమ దుంప‌ల కూర‌, పుట్ట కొక్కు కూర‌, పూరేడు మాంస‌ము, జొన్న సామ అన్న‌ము, వెదురు కొమ్ము కూర రుచిని మాట‌ల్లో చెప్ప‌లేము అంటారు.
చింత‌కాయ పులుసు – సావిడేల పులుసు – సామ‌ల కూడు, ప‌చ్చిమిర‌ప‌కాయ ప‌చ్చ‌డి రుచులు, అడ‌వి దొండ దుంప‌, ఆదొండ‌కాయి, ఇసుక రాతి కూర‌, ఈత పండ్లు వంటి తిండి ప‌దార్థాలు వారి ఆహార‌పు అల‌వాటును తెలుపుతాయి.
(16 నుండి 22) వ‌ర‌కు చెప్పారు.
గుంట‌రోలు, తిర‌గ‌లి వంటి వ‌స్తు స‌ముదాయ‌ము పండుగ రోజు ఆనందం గురించి “ప‌ర్వ‌దిన‌ము నాడు ప‌డుచులంద‌రు గూడి – ఆట‌లందు రేల పాట‌లందు – ఆడి పాడి గెలిచి ఆనంద మిత్తురు” అంటారు.
తాటి క‌ల్లు, విప్ప‌సార విందులో తాటితేగ‌ను మిర్చిరోట‌లో దంచి నంజుకుంటూ త‌న్మ‌య‌త్వం చెందుతార‌ని
విందుల్లో ఆడ మ‌గ తేడ లేకుండ ‘క‌ల్లు’ను సేవించి ఆర‌గిస్తార‌ని, పండుగ‌లు ఉత్స‌వాల్లో ప‌ట్నంవాసులు ఆదివాసీ మ‌హిళ‌ల‌ను మోసం చేయ‌డం. ఆదివాసీల గూడెంల‌లో జీవ‌నం గుడిసెల
31 ప‌ద్యంలో.. త‌లుపులేని ఇండ్లు, తాటాకుల గుడిసెలు – ఉట్టి మీద కూడు ఉల‌వ‌చారు – అగ్గి నెగ‌డు ఇంట ఆల మంద‌లు తోడ‌.
అడ‌వుల‌లో నివాస‌ముండే వీరికి అగ్ని నెర‌డు 360 రోజులు వెలుగుతూనే ఉంటాయి. అడ‌వి జంతువులు జ‌న ఆవాసాల‌కు రాకుండా ఉండేందుకు ఇవి ర‌క్ష‌ణ నిస్తాయి.
32 ప‌ద్యంలో.. మొల‌కు గోచిపెట్టి, త‌ల‌కు పాగా చుట్టి – చెవిని అడ్డ చుట్ట, చేతి విల్లు, చంక‌లోన క‌త్తి
33 ప‌ద్యంలో.. “ముక్కుకు అడ్డ‌ పూస‌, మురుగులు, క‌డియాలు – ప‌చ్చ‌బొట్టు, నుదుట ఏడుబులందు – చెవికి పోగులుండు, శిగ తోడ చెలికాడు” అంటూ స్త్రీ, పురుషుల అలంకారం గురించి చెప్పారు.
34 ప‌ద్యంలో.. పెండ్లి చూపులేదు పెద్ద‌లే కుదిరించు – వెర్రిదైన, మూతి మొర్రియైన – త‌ల్లిదండ్రులాజ్ఞ త‌ప్పలే గిరిజ‌నులే అంటారు.
57 ప‌ద్యంలో.. ఏటి చెలిమ‌ల తాగు నీరు సేక‌ర‌ణ గురించి చెప్తూ మ‌ట్టికుండ వంటి మాయి జీవిత‌మ‌ని నైరాశ్య చెందారు.
40 ప‌ద్యంలో.. చీమగుడ్ల కూర‌? అన్నారు. చొడి, గంటె జావ, జొన్న కూడు, ప‌న‌స తొన‌లు వంట గురించి చెప్పారు.
అడ‌వి దున్న‌ల కొమ్ముల‌తో త‌ల‌పాగా త‌యారుచేసి దానికి నెమ‌లీక లుంచి కొమ్ము డోలు ఆట గురించి
41 ప‌ద్యంలో.. మూఢ భ‌క్తి గిరిజ‌నుల‌ది శివ‌భ‌క్తులు అంటారు.
48 ప‌ద్యంలో.. చెట్టుకు, పుట్ట‌కు నియ‌మ నిష్ట‌ల‌తో పూజ చేసే వీరికి పాప‌భీతి కూడా ఎక్కువ.
44 ప‌ద్యంలో.. ప్ర‌కృతి దేవ‌త‌ల‌కు కొత్త పంట‌ను ఫ‌ల‌హారంగా కొర్ర‌, సామి, కంది, చిక్కుడు వండి స‌మ‌ర్పిస్తారు.
45 ప‌ద్యంలో.. వాన‌ల కోసం పాడే పాట “గుమ్మి టీ”లు అవి చాలా మ‌ధురంగా
46 ప‌ద్యంలో.. భూదేవి పండుగ పేరుతో కోళ్ళ‌ను, పందుల‌ను కోసి పండుగ‌
47 ప‌ద్యంలో.. కోలాట పండుగ‌ల‌కు కోళ్ళు, మేక‌లు కోసి వ‌రాల‌డుగుతారు.
48 ప‌ద్యంలో.. మామిడాకు తోర‌ణాలు క‌ట్టి మంకెన పూలు దూప‌దీపాల‌తో మేక‌పోతును బ‌లిస్తారు.
52 ప‌ద్యంలో.. వేట స‌మ‌యంలో దూల‌గొండి దెబ్బ, దోమ‌కాటుకు రోగాల‌తో వైద్య సౌక‌ర్యం లేక బాధ‌ప‌డ‌తారు.
53-56 ప‌ద్యంలో.. నాటు వైద్యులు, మంత్ర‌గాళ్ళు మోసం చేస్తారు.
57 ప‌ద్యంలో.. భూత వైద్యుల‌ను న‌మ్మారు. ఇప్పుడు ఆంగ్ల వైద్యుల‌కు అల‌వాటు ప‌డ్డారు అంటారు.
63 పద్యంలో. కొమ్ము దాస‌రి చెట్టు కొమ్మ పై కూర్చుని పాట‌లు పాడి బిక్ష పెట్ట‌క పోతే ప‌డి చ‌స్తాన‌ని బెదిరిస్తాడ‌ని వివ‌రించాడు.
64 పద్యంలో. అడ‌వి గిరిజ‌నుల హ‌క్కు కాని, అట‌వీ శాఖ అవినీతి వారిని దోచుకున్నదంటారు.
66-68 వ‌ర‌కు ప‌ద్యాల‌లో…. గిరిజ‌నుల అలంకారాల గురించి, స‌హ‌జంగా నిష్క‌ల్మ‌షంగా ఉంటార‌ని, వారి అమాయ‌క‌త‌ను వివ‌రిస్తే
68 ప‌ద్యంలో మ‌న్నె ప్రాంతంలో ప‌ని చేసిన ఉపాధ్యాయులకు వంద‌నాలు స‌మ‌ర్పిస్తారు.
69-70 పద్యంలో.. ఇప్పుడు మెరుగైన ప‌రిస్థితిని వివ‌రిస్తూ పాఠ‌శాల‌లు వెలిసి, విద్య నేర్చిన గిరిజ‌నులు చ‌ట్ట స‌భ‌ల‌కు చేరార‌ని,
71-72 పద్యాలలో పోడుసాగు వ‌ద‌లి పొలాలు సంపాదించారు. భ‌ల్లూక వేట మాని విద్య నేర్చారు.
73-74 పద్యాలలో గిరిజ‌న పురుషులు ముడి పెట్టిన సిగ‌లు క‌త్తిరించి. చ‌క్క‌గా క్రాపులోకి వ‌చ్చి, ఆదివాసి స్త్రీలు మూడ బార‌ల చీర రైక లేకుండేవారు. ఇప్పుడు నిండైన వ‌స్త్రధార‌ణ‌తో ఆనందంగా క‌నిపిస్తున్నారంటారు.
75 పద్యంలో పంట పొలాల్లో కూలీలుగా ఉండే ఆదివాసీలు చ‌ట్ట స‌భ‌ల్లో ప‌ద‌వులు పొందార‌ని,
76 పద్యంలో.. నాటు మంత్ర‌సానుల నైపుణ్యాన్ని చెప్తే
77-78 పద్యాలలో.. గ్రామ దేవ‌త‌ల పూజ‌లు గంగ జాత‌ర‌ల్లో శివ‌మూ వారు బ్ర‌హ్మ విష్ణువుల‌ను పూజిస్తున్నార‌ని అంటారు. బ్రాహ్మ‌ణీకం జొర‌బ‌డిన‌ద‌ని చెపుతారు ప‌రోక్షంగా.
79-80 పద్యాలలో.. ఆదివాసీల బంధు ప్రేమ‌ను – ప‌ట్నాల‌కు వ‌ల‌స వెళ్ళ‌టాన్ని గురించి చెప్తారు.
85 పద్యంలో.. నాగ‌రిక‌త ఎంత నేర్చినా గిరిజన‌ సంస్కృతిని మ‌ర‌వ‌ద్ద‌ని హెచ్చ‌రిక చేస్తారు.
83-84 ప‌ద్యాల‌లో ఆదివాసీల‌పై వ‌ల‌స మ‌తాల‌ ప్ర‌భావం, హితం లేని మ‌తం. మ‌తం పేర ఉగ్ర‌వాదం వ‌ద్దంటారు.
81-82 పద్యాలలో.. ఆదివాసీల‌కు విద్య ప్రాధాన్య‌త చెప్పారు. బాల గిరిజ‌న విద్యార్థి విద్య నేర్చి ఉద్యోగి యై తిరిగి రావాల‌ని ఆశించేవారు.
86 పద్యంలో.. పితృ స్వామ్యాన్ని ప్ర‌శ్నిస్తే.
87 పద్యంలో.. విద్య, ఇత‌ర అభివృద్ధి ప‌థ‌కాల గురించి చెప్తారు.
88 పద్యంలో.. గిరిజ‌నాభివృద్ధి కోసం ఏర్ప‌డ్డ ITDA ను ఎంతో ఉప‌యోగ‌ప‌డిందంటూనే
89 పద్యంలో.. గిరిజ‌నేత‌ర ఉద్యోగులు ITDAలో ఉంటున్న సంగ‌తి
90 పద్యంలో.. ITDAలో అవినీతిని ప్ర‌శ్నిస్తే వ‌చ్చే బ‌దిలీ భ‌యం గురించి చెప్పారు.
91 నుండి 108 ప‌ద్యాల వ‌ర‌కు ఉత్త‌రాలు క‌నుమ‌ర‌గ్వ‌డం చిన్న పిల్ల‌ల‌పై సెల్లు ప్ర‌భావం, పెరిగిన సాంకేతిక ఫాక్స్ వ‌చ్చి టెలిగ్రామ్‌లు అంత‌రించిన సంగ‌తి
సెల్ ప్ర‌భావంతో, మాతృ భాష గొప్ప‌ద‌న్న మ‌మ్మీ డాడీల భాష‌, ప‌ర‌భాష వ్యామోహ‌, ఆరోగ్య‌క‌ర ఆహార నియ‌మాలు, ధూమ‌పాన‌, మ‌ద్య‌పాన అన‌ర్థాలు, బాల్యం గొప్ప‌త‌నం, దానాల్లో అన్న‌, విద్య‌, ర‌క్త దానాల గురించి , పేద‌రికం – త‌ల్లిదండ్రులను నిర్ల‌క్ష్యం చేసే సంతానం, నైతిక విలువ‌లు వ్య‌క్తిగ‌త క్ర‌మ‌శిక్ష‌ణ‌ల‌ను చెప్పి చివ‌రి ప‌ద్యంలో అమ్మ ప్రేమ‌తో ముగించారు.
66 పద్యంలో.. ప‌ద్యాలు ఆదివాసీల గురించి మిర్చి (26) చికెను (27) ఫారెష్టు (64) టెంటు – టేబుళ్ళు (65) ఐటిడిఏ – (88) ట్రైబ‌ర్ – నాన్ ట్రైబ‌ల్ (89) ప్రాజెక్టు (90) సెల్లు ఫోన్ (92, 93, 94) ఫాక్స్ – టెలిగ్రామ్ (94) మ‌మ్మీ డాడీ – ఆంటీ అంకుల్ (96) కాఫీ టీ – (100)
15-20 ప‌ద్యాల‌లో ప‌దాలు ఆంగ్ల ప‌ద ప్ర‌యోగం చేశారు.
అయితే ఆదివాసీల‌పై జ‌రుగుతున్న జులుంను గురించి ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. (ప్ర‌భుత్వానిదైనా – ప్ర‌జా ప్ర‌తినిధుల‌దైనా)
మందుల కంపెనీలు త‌మ మందుల‌కు (ఉత్ప‌త్తుల‌కు) గిరిజ‌నుల శ‌రీరాల‌ను శాంపీళ్ళుగా (ప్ర‌యోగాల‌కు) ఉప‌యోగించ‌డం గురించి ఎక్క‌డా ప్ర‌సావించ‌లేదు. అంటే వివాదాస్ప‌ద అంశాల జోలికి పోకుండా శ‌త‌కాన్ని పూర్తి చేశారు. దీనిని ఆగ‌స్టు – 2016లో ప్ర‌చురించారు. గిరిజ‌న నృత్యాల ఒక గిరిజ‌నుడు విలంబుల‌ను ప్ర‌యోగిస్తూ ఉన్న ముఖ చిత్రంతో ఉన్న ఈ శ‌త‌కం అంద‌రికీ ఆద‌ర్శం. త‌మ త‌మ అస్తిత్వాల‌తో రాయ‌వ‌ల‌సిన సంద‌ర్భంలో ఇటువంటి శ‌త‌కాలు రావ‌డం ఆహ్వానించ‌ద‌గిన అంశం. కోసు ప్ర‌సాద‌రావు త‌మ ఆదివాసి తెగ‌ల గురించి మ‌రిన్ని ర‌చ‌న‌లు చేస్తార‌ని ఆశిద్దాం.

బహుజన సమీకరణకు ‘సమూహం’

రచన: జ్వలిత డెంచనాల

కులాల గుట్టు రట్టు చేసే మార్గం అంతర్‌ వివాహాలు మాత్రమే అని చెప్పారు అంబేద్కర్‌. అస్తిత్వవాదం ఇప్పుడు మొదయింది కాదు. జ్యోతిరావుపూలే తన రచను బోధన ద్వారా చేసినది అదే. పుట్టుకతో అందరూ సమానులే అయినా చదువు లేని కారణంగా బానిసలుగా, పాపులుగా భావించబడు శూద్ర, అతిశూద్రు సమానమని వారు ఐక్యంగా కలిసినపుడు ద్రోహపూరిత వ్యూహాను తిప్పికొట్టగలుగుతామని, కులం కన్న, మతం కన్న మానవత్వం గొప్పదని, విద్య అందించిన జ్ఞానం వల్లనే మానవీయత సాధ్యమని చాటిన గొప్ప మార్గదర్శకుడు. మరి పూలే రచను, బోధను మరుగున పెట్టిన కుట్రలు ఇప్పుడు బీసి అస్తిత్వ వాదుల ఐక్యతను కూడా చీల్చుతాయి. స్త్రీ విద్య మహా పాపమని కొన్ని వంద వే సం॥ల స్త్రీని విద్యకు, స్వేచ్ఛకు దూరంగా ఉంచిన బ్రాహ్మణ భావజాలం ఇప్పటికి మన బహుజనులను ప్రభావితం చేస్తూనే ఉంది.

బీసీ కవులు ఏమి రాయాలి జరిగిన మోసాలు, ద్రోహాలు, జరుగుతున్న కుట్రల గురించి రాయగలగాలి, తేనె పూసిన కత్తుల వంటి ప్రచారాలను అడ్డుకునే చైతన్యాన్ని, జ్ఞానాన్ని కలిగించాలి. బీసీలు కాని ఇతర కవులు రాసిన బహుజన హిత సాహిత్యాన్ని చదవాలి. బీసీలు మనువాదాన్నే మోసే ఏజంట్లు అనడగానికి కారణాలను గుర్తించాలి. మన లోపాలను, బహీనతలను నిజాయితీగా అంగీకరించాలి. అప్పుడే వాటిని సరిదిద్దుకోగలుగుతాం. పురాణాల్లో ఇతిహాసాల్లో బహుజనుల పాత్రను వక్రభాష్యాలను అర్ధం చేసుకోవాలి అంటే తప్పనిసరిగా పూలే, అంబేద్కర్‌ రచనలను చదవాలి. బుద్ధుని బోధలను చదవాలి. మూఢనమ్మకాలు మంత్ర తంత్రాలను నమ్మేది అధికభాగం బహుజనులు కనుక హేతువాద పద్ధతిలో అర్థం చేసుకోవాలి. అంబేద్కర్‌ రాసిన కులం దాని పుట్టుక నుండి కొండలరావు రాసిన బీసిలవాదం వరకు చదవాలి.

ఆధ్యాత్మికత, భక్తి వేరు, మనువాదం బ్రాహ్మణవాదం వేరు అనే విషయాన్ని గ్రహించాలి. దానికి విద్య ఒక్కటే మార్గం. విద్య అంటే అక్షరజ్ఞానం డిగ్రీ సముపార్జన కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.

అన్నింటి కంటే ముఖ్యంగా బహుజనుంతా ఐక్యతను సాధించడానికి కృషి చేయాలి. ఆ బాధ్యత బహుజన రచయితపై ఉన్నది అని గ్రహించాలి. ప్రస్తుతం ముఖ్యంగా బహుజనులకు సంధికాలం, కష్టతరమైన కాలం. మనకు ఒక ఐకాన్‌ కావాలి అది జ్యోతీబాపూలే అని గ్రహించాలి.

అంతేకాదు భావజాలంతో పాటు మన భాష మారాలే, మనం మనని మోసిన వారిని అగ్రకులాలు, పెద్దకులాలు అంటున్నాము. వారిది ఆధిపత్య కులాలని మనమే ‘పెద్ద’ వారు అని అంగీకరిస్తూ, మనని చిన్నవాళ్ళుగా ఆత్మన్యూనతను వ్యక్తపరుస్తున్నాము.

బహుజను కవిత్వాలు కూడా చాలా అసహనంగా ఉంటున్నాయి. వ్యక్తపరచాలిసినది అసహనాన్ని కాదు, ధిక్కారాన్ని. అది సామాన్యులకు ఆత్మ విశ్వాసాన్ని కలిగించాలి. మనకోసం కొందరున్నారనే ధైర్యాన్ని ఇవ్వాలి. ఉద్యమస్ఫూర్తిని కలిగించాలి. కష్టాలు, కన్నీళ్ళు మాత్రమే కాదు పొందాల్సిన ప్రోత్సాహాన్ని సాహిత్యం అందించాలి. డా॥ చింత ప్రవీణ్‌కుమార్‌ సంపాదకత్వంతో వచ్చిన సమూహం ఆ బాధ్యతను మోస్తూ ముందుకు వచ్చింది.

అందరు మాట్లాడుకోవాలె, మనలో మనం, మనతో మనం మాట్లాడుకోవాలె. అందుకు పుస్తకంలో కవుల చిరునామాలు, ఫోన్‌ నెంబర్లుండాలి. ఒక సమిష్టి బాధ్యత సామాజిక బాధ్యతతో అచ్చువేస్తున్న పుస్తకాలలో అందులో రచయితలు ఒకరితో ఒకరు మాట్లాడేందుకు సాధ్యపడుతుంది. పాఠకుడు విమర్శను కాని, ప్రశంసను కాని తెలియజేయడానికి వీలవుతుంది, అస్తిత్వ స్పృహతో రాసే కవి పాఠకుడు కలిసి సామాన్యులను సమీకరించగలరు. అప్పుడు ఆ రచన యొక్క లక్ష్యం నెరవేరుతుంది. ఐకమత్యాన్ని చైతన్యాన్ని పెంపొందించడానికి వీలవుతుంది.

ఒక ప్రయోగాన్ని గురించి లేదా ఒక వంట గురించి రాస్తున్నపుడు, పరికరాు వస్తువు, నిర్మాణం, తయారు చేసే పద్ధతి, ప్రయోగం, ప్రయోజనం అని సైడ్‌ హెడ్డింగ్ పెట్టి రాసినట్టు, అస్తిత్వ కవిత్వ ప్రయోజనాన్ని సాధించాలి. మనమంతా నిజంగా ఒక్కటైతే మన మధ్య అంతరాలు తొలగడానికి, కుల నిర్మూలన జరిగి మనవంతు కృషి మనం చేయాలి. బీసీల్లో అనైక్యతను తొలగించడానికి బహుజన కులాలు ఒక కులం మరొక కులంతో వివాహాలు జరగాలి అప్పుడు ‘‘నేనెక్కువ నువ్వెక్కువ’’ ప్రశ్న ఉండదు. బహుజనుంతా ఒకే కుటుంబంగా ఏర్పడి రాజ్యాధికారం కోసం ఉద్యమించడానికి ఉపయోగపడతది. అంతేకాదు బహుజనులకు ప్రత్యేక రాజకీయ పార్టీ కావాలి. దాని మ్యానిఫెస్టో బహుజనుల సంక్షేమమే అయి ఉండాలి. ఇది ఇప్పటికప్పుడు సాధ్యమైనా కాకపోయినా భవిష్యత్తు తరానికి మార్గదర్శకంగా మాత్రం పని చేస్తుంది. ప్రభుత్వాలను ఏర్పాటు చేయకపోయిన బహుజను వాదన చట్ట సభకు చేరగలదు.

పూలే అంబేద్కర్‌ బోధను పాటిస్తూ ఆ భావజాలాన్ని ప్రచారం చెయ్యాలి, ‘‘బిసి రైటర్స్‌ వింగ్‌’’ ఆ పని తన భుజాలపైన వేసుకోవాలి. కవులు, సాహిత్యకారులు ముందుచూపుతో అస్తిత్వ చైతన్యాన్ని కలిగించాలి. కవి సమ్మేళనాలు, సాహిత్య సభలు నిర్వహించి వాటికి కేవలం కవులు రచయితలు కాకుండా సామాన్య ప్రజానీకాన్ని ఆహ్వానించాలి. కళ కళ కోసమే కాదు కవిత్వం కేవలం సాహితివేత్తల కోసం కాదు దానికొక సామాజిక బాధ్యత ఉన్నది కనుక, కవిత తన కవిత్వం ఉద్దేశం, దాని దృష్టికి వెనుక అనుభవాలను రాయవలసిన అవసరం, సాధించవలసిన ప్రయోజనాన్ని పాఠకునికి వివరించగలగాలి, చైతన్యపరచాలి, ఐక్యత సాధించాలి కవులు ఒక ప్రత్యేక వర్గం అనే భావాన్ని వదిలి ప్రజతో మమేకం కాగలిగినపుడే అస్తిత్వ సాహిత్య ప్రయోజనం చేకూరుతుంది అని నా అభిప్రాయం.

ఈ మధ్య ఒక కవి, తన రచనను అంకితమిచ్చి పదవిని పొందిన కవి, కుల సంఘాల గురించి ఎంతో చులకనగా మాట్లాడారు. ‘‘బుడ్డ గోసి కుల సంఘాలు’’ ఏమి చేస్తయి. డిమాండ్లు నినాదాంటూ ఒర్రుతరు ఏమి జరుగుతది అని తమ అమ్యూల అభిప్రాయాన్ని సెవిచ్చారు. ఏ కళ అయినా ప్రజాప్రయోజనం కోసమే అని తెలియని వారు గతంలో కవు రాజకీయాలు చెయ్యొద్దు అని సెవిచ్చారు. స్వయంగా వారే రాజకీయాలు చేస్తూ ఇటువంటి కవులు అస్తిత్వ వాదులయినా మనకు ఒరిగేదేముండదు.

చైతన్యవంతులయిన కవులు అన్ని కాలాల్లో ఉండరు. తెలంగాణ ఉద్యమం అందించిన స్ఫూర్తి ఇప్పటి అస్తిత్వ సాహిత్యంపై ఎంతో ప్రభావం చూపుతున్నది. నేను చరిత్రలోకి వెళ్ళను కాని తెలంగాణ ఉద్యమం మిగిలిన అస్తిత్వ ఉద్యమాలను మింగేసింది. స్త్రీవాదం రూపుమార్చుకొని మరొక వాదంలోకి ఒదిగిపోయింది. కొందరు స్త్రీవాదులు దళితవాదులయితే మరికొందరు మానవీయ వాదులయ్యారు. ఒక్కరిద్దరు దిక్కుతోచక ఎటూ ఒదగలేక మౌనాన్ని ఆశ్రయించారు. సాహిత్యమంతా ముఠాలుగా విడిపోతున్న సందర్భంలో ‘‘సమూహం’’ ఒక మెరుపులాగా బీసీకుల మార్గదర్శనం చేసేందుకు ముందుకు వచ్చింది. ఉక్కు కండరాలు, ఇనుప నరాలున్న యువత సమాజానికి తమ కంచు కంఠంతో అస్తిత్వాన్ని చాటడానికి ముందుకొచ్చారు. ‘‘బిసి రైటర్స్‌ వింగ్‌’’ వేదికగా డా॥ చింత ప్రవీణ్‌కుమార్‌ చేసిన ప్రయత్నం చారిత్రాత్మకమైనది. ఇంతకు ముందు ఇటువంటివి జరగలేదా అంటే జరిగాయి ‘‘వెంటాడే కలాలు ` వెనుకబడ్డ కులాలు’’ (2011) వచ్చి దాదాపు 15 సంవత్సరాయినా మళ్ళీ బహుజనుల తరుపున ముఖ్యంగా బీసీ కవులను, బీసీ అస్తిత్వాన్ని సమిష్టిగా ముందుకు తెచ్చిన వారు లేరనొచ్చు. బీసీ సాహిత్యం వచ్చింది కథలు, వ్యాసాలు వచ్చాయి అవి ఎవరికి వారు వ్యక్తులుగా రాసారు కాని సంకలనం రాలేదు. ‘రుంజ’ 2013లో వచ్చినా అది విశ్వకర్మ కవుల కవిత్వం మాత్రమే. ఇంకా కొన్ని బీసీ కులాలు ప్రయత్నించారు. బీసీ కవులందరి కవిత్వం మాత్రం ‘సమూహం’ అనొచ్చు. ‘‘బిసి అస్తిత్వవాద యువ కవిత్వం’’ అనే ట్యాగ్‌తో వచ్చేసరికి నాలాంటి చాలా మంది బీసీ కవులు ఇందులో లేరు. నేను ‘‘వెంటాడే కలాలు’’లో లేను ‘‘సమూహం’’లో లేను. మరి నేను బీసీ రచయితను కాదా? కథలు, వ్యాసాలు, కవిత్వం బిసి అస్తిత్వంతో రాసాను. నా మొదటి కవిత సబ్బండ జాతుల ఆడది. అంటే కొంచెం అసంతృప్తే. నాలాంటి వాళ్ళు బహుజన అస్తిత్వంతో రాసేవాళ్ళు ఇంకా కొందరున్నారు. ఇది విమర్శకాదు.

‘‘సమూహం’’లో ముప్పై తొమ్మిది మంది రచనులుంటే అందులో బీసీ రచయిత్రులు ఏడుగురుండడం నాకు చాలా ఆనందంగా ఉన్నది.
1) సొన్నాయి కృష్ణవేణి ‘‘మారని బతుకు’’ అనే కవితలో ‘‘మార్చే ప్రయత్నం చెయ్యమని నా కొడుక్కు జెప్పాలె’’ అని రేపటి తరానికి వాయిదా వేసింది
2) డా॥ కందాళ శోభారాణి ‘‘మరణానికి దగ్గరైన కులాలు’’ కవిత జరిగిన మోసాలు గురించి చెప్పింది. ‘‘బ్రాహ్మణ ఛాందన సారాన్నే ప్రభుత్వాలు పాటిస్తున్నాయి’’ అన్నారు
3) రామారత్నమా తన కవితలో నేతన్నకు సంక్షేమ పథకాలు రూపక్పన జరగాలన్నారు.
4) అంబటి భాగ్య అనే కవయిత్రి ‘‘చదువుకున్న సావిత్రిబాయిలు’’ అంటూ ఆత్మ విశ్వాసాన్ని ప్రకటించింది.
5) వంగా యశోద ‘‘పేరైతే ఉంది’’ అనే కవితలో సంచారజాతు గురించి రాసింది
6) గూడూరు ఉమ ‘‘మనసు కఠినం కాదు’’ అనే కవితలో శ్రీశ్రీ కూడా కటికసాయి అన్నాడు అని ఆవేదన వ్యక్తపరిచింది ఆయన ఆదిపత్యకులస్తుడే కాదు.
7) జగం హైమావతి ‘‘పోగుగూడు’’ అనే కవితలో నేతన్న గురించి రాస్తూ ‘‘బహుజన రాజ్యపు కుర్చీ’’ గురించి రాసింది. ముందుమాటలో ‘‘సీతారాం’’ రాసినట్లు కవితల్లో ధిక్కారస్వరం లేకపోవచ్చు కాని అస్తిత్వవాదం పుష్కలంగా ఉన్నది. హైద్రాబాద్‌ బుక్‌ ఫెయిర్‌లో ‘‘సమూహం’’ ఆవిష్కరణ సమయంలో ఒక్కరిద్దరు మొదటి కవిత నాది అన్నట్టు గుర్తు.

చిర్రా రాజేష్‌ఖన్నా తన కవితలో ‘‘మనుషు మనవాళ్ళేరా లొ మొదళ్ళు మాత్రం శత్రువులది అన్న అంబేద్కర్‌ మాటను గుర్తు చేస్తూ మన మెదళ్ళు మార్చుకోవసిన అవసరాన్ని చెప్పాడు. ఆధిపత్యకులాల కుర్చీ రాజకీయాల నాటకాల్లో బీసీలు పాత్రదారులై పరికరాలుగా మారిన అనేక సంఘటలను ‘‘లక్ష్మీపేట’’ వంటివి జరగకూడదు, తెలివిడితనం అలవరచుకోవాలి బీసీలు.

‘‘కొండ్రు బ్రహ్మం’’ ‘మేమే పాలించుకుంటం’ అని ప్రకటించుకుంటూ ఓట్లాయుధాలతో సిద్ధంగున్నం అంటే, ‘‘కొలిపాక శ్రీనివాస్‌’ సముద్రం తలాపునుంటే సరిపోదు సముద్రం మనదవ్వాలి`అంటూ రాజ్యాధికారం కావాలని ఆశ వ్యక్తపరిచాడు. ‘రాపాక శ్రీనివాస్‌’ బసిన సింహాన్ని బరిగొడ్లు తరుముడు చూసిన అంటూ మనం ఏమి చెయ్యాలో చెప్పాడు. ‘‘కటుకోజ్వల రమేష్‌’’ విశ్వకర్మ పరిస్థితికి చింతిస్తున్నాం, విచారిస్తున్నాం అన్నారు. దేవరకొండ భగవాన్‌ ఐక్యత లోపం అని వ్యక్తపరిచారు. రోగ క్షణం తెలిసింది కనుక నివారణ త్వరగానే జరుగుద్ది. ‘‘అగపాటి అరుణ్‌’’ ఇంకెన్నాళ్ళు సహిస్తవ్‌ అని కత్తులు నూరాడు. ‘‘దార్ల నాగేంద్రాచారి’’ కొలిమి కవితలో బ్రతుకుదెరువు కోసం వెతుక్కునే స్థితిని తెలిపాడు. ‘‘బిల్లా మహేందర్‌’’ ఆదిపత్యాలకు చరమగీతాన్ని పాడాలన్నారు. జయవీర్‌ కోటగిరి కులమూలాలు ఊడబీకి సంఘజ్ఞానం కావాలన్నాడు. వజ్జీరు ప్రదీప్‌ ఇది పీష్వాకారులం కాదు బహుజనకారులం అని ప్రకటించాడు. రణమో రాజ్యమో తేల్చుకోవాంటాడు అడపరాజు. చింతం నాగరాజు జారుకుంటు వచ్చిన ప్రతిమెట్టు మళ్ళీ పైకెక్కాలని కర్తవ్యబోధ చేసాడు. అనంతోజు మోహనకృష్ణ మళ్ళీ కంసాలోళ్ళనే కలిసి రమ్మంటున్నడు, ఇంకెక్కడి ఐకమత్యం. కంచర్ల శ్రీనివాస్‌ చచ్చినా సమానత్వం లేదంటాడు. చేరా సుధాకర్‌ బడుగుకాపు రైతు గురించి రాస్తే, రేనా ఈశ్వరయ్య స్త్రీ గొంతుతో దొమ్మరిదనే ముద్రతో పుట్టిన దాన్ని అంటూ ఒక ఆధిపత్య కులం తమని ఎంత దిగజార్చిందే చెపుతూ తనను యస్‌.సి.ల్లో చేర్చాంటాడు. ఇక్కడ నా కవిత ‘‘మేమెవరం’’ రాస్తూ ఎఫ్‌.బి.లో చూసి భోగమోళ్ళం అని రాసాను. అది నీచార్ధం దాన్ని మార్చాలి అని ఫోను చేశారు. కులం పేరు నేనే మార్చుతాను అర్థం కాలేదు. గాంధీగారు దళితులను హరిజనులు అన్నారు కదా అన్నారు. హరిజనుడు అనడం కరెక్టు కాదు అనే విషయం వాళ్ళు తెలుసుకున్నారు. బీసీకు తెలియటం లేదు. మనం ఇంకా చాలా నేర్చుకోవలసి ఉన్నది.

వడ్లసాయిుచారి తన కవితలో ‘‘ఆకాశమంత ఎత్తుకు ఎగిరి త ఎత్తుకు జీవించేలా చెక్కిన పెద్ద బాడిసి దిక్కులేనిదై దిగులు పడుతుంది’’ అని వృత్తుల ధ్వంసం అయిన విధానాలు చెప్పాడు. గిరివర్మ చింతం పాతిక లక్షల జనాభాలో పాంచ్‌ శాసనసభ్యులు అంటూ తన వాటా అడుగుతున్నాడు. ‘‘సమూహం’’ సంపాదకు చింతం ప్రవీణ్‌ బీసీలకు కూడా అట్రాసిటీ కావంటాడు. మిసిలినీయస్‌ ఖాతా అంటూ సంచార జాతుల గురించి ప్రశ్నించారు. యోచన అనే కవి ‘కాలుతున్న తనువు’ అనే కవితలో అంటరానితనం వెంటాడుతూ ఒంటరిని చేసిందంటాడు. వెంకటకిష్‌ ఇట్యా మనందరి బాపూ జ్యోతిపూలే అంటూ పూలే భావజాల వ్యాప్తి ఒక్కటే బీసీలకు రాజ్యాధికారమిప్పించదని అంగీకరించాడు.

‘‘సమూహం’’ అచ్చు వెయ్యడమే కాదు మొత్తం తెలంగాణ జిల్లాన్నింటికి పర్యటించి ఆవిష్కరణ సభలు నిర్వహిస్తూ బహుజన వాదాన్ని ముందుకు తీసుకువెళ్ళిన చింత ప్రవీణ్‌కుమార్‌ ఐ.పి.యస్‌. ప్రవీణ్‌కుమార్‌ స్థాయికి ఎదిగి ఆయన దళిత విద్యార్థుల కోసం చేస్తున్న కృషిని ఆదర్శంగా బీసీలకు చెయ్యాని కోరుకుంటున్నాను.

చివరగా పండ్లు కాసే చెట్టుకే రాతి దెబ్బంటాయి. పనిచేసే వాళ్ళకే విమర్శలుంటాయి కనుక విమర్శను బలాన్నిచ్చే టానిక్‌గా ఉపయోగించుకుంటూ ముందు ముందు ఇంకా బీసీ సాహిత్యాన్ని సంకనాలుగా తేవాలని, అదొక ఉద్యమంలా కొనసాగాలనీ రాజ్యాధికారమే అంతిమలక్ష్యంగా బీసీ కావు ఉద్యమ కార్యకర్తలుగా ముందు నడవాలని కోరుకుంటూ నా వంతు కలంగా గళంగా అవసరమయిన చోట ఉంటాననీ హామీనిస్తూ….““

‘వేయి పడగలు’ అక్షర యాత్రకు దారి

రచన: విజయలక్ష్మీ పండిట్

 

“విశ్వనాథ ‘వేయిపడగలు’ లోని కొన్ని ముఖ్యాంశాలు, విశ్వనాథ గురించి కొందరు ప్రముఖుల భావాలు” అనే డా.వెల్చాల కొండలరావుగారి సంకలనం ఈ తరం కవులు, రచయితలు చదవవలసిన సంకలనం.
వివిథ వర్ణాల సుగంథభరిత పూలతో, వైవిధ్యభరిత వృక్షాలతో మనోహరంగా ఉండే దట్టమైన ఒక అందమైన అడవిలో మనిషి ప్రయాణించడానికి ఆ అడవి అందాలను పూర్తిగా అనుభవించడానికి, దారి తెన్ను తెలపడానికి ఒక నావిగేషన్ మ్యాప్ (navigation map) కావాలి.
అలాగే కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి ‘వేయిపడగలు’ బృహత్ నవలలోకి సామాన్య పాఠకులను చేయిపట్టి నడిపిస్తూ అందమైన వర్ణనలు, కథలు, జానపద గాథలు, అలౌకిక ఉపమానాలతో వైవిధ్యభరిత పాత్రలతో కూర్చిన బృహత్ ఇతిహాస నవలలో అక్షరయాత్ర చేయడానికి ఒక గైడ్, మార్గదర్శిగా ఉపయోగపడుతుందీ సంకలనం.
ఈ సంకలనంలో ‘వేయి పడగలు’లోని కొన్ని ముఖ్యాంశాలు అనే ఔపోద్ఘాత శీర్షికలో కొండలరావుగారు ‘వేయిపడగలు’నవల గురించి అన్న ముఖ్యమైన మాటలు వారి మాటల్లో…
“వేయిపడగలు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ చదవవలసిన గొప్ప నవల, గొప్పతనం గురించి మంచితనం గురించి సవివరంగా, సందర్భోచితంగా, తరువాత వృత్తాంతాల ద్వారా, కథల ద్వారా, పాత్రలద్వారా, ఉదాహరణల ద్వారా రచించిన నవల”.
“మనిషి మానవుడు ఎలా కావాలో, ఎలా కావడంలేదో చెపుతారు వేయిపడగలలో, నిజమయిన గొప్పవాడే నిజమయిన మంచివాడని అంటారు విశ్వనాథ”.
తరువాత “వేయిపడగలు ఎందుకు చదవాలి?” అనే శీర్షికతో ‘వేయిపడగలు’ నవల గురించి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యగారి తొమ్మిది పేజీల అభిప్రాయం చదవడంతో ‘వేయి పడగలు’ నవల గురించి ఒక సమగ్ర అవగాహన, ఆ నవల హృదయం, ఏ ఎఱుకతో ఆ నవలను పరిశీలించాలో వివరిస్తారు.
కోవెల సుప్రసన్నాచార్య ఒక కవి/రచయిత మనస్సులో ఒక వస్తువు గురించి జరిగే పరివర్తనా క్రమాన్ని గురించి వ్రాస్తూ.. విశ్వనాథవారు ఈ నవలలో ఏ ఏ దశలుగా పరివర్తనం చెందుతూ నవలను వ్రాశారో చెపుతారు.
సుప్రసన్నాచార్య మాటల్లో..
“కవి రచనావేళ ఒకానొక వ్యక్తావ్యక్త స్థితిలో సంధి దశలో విశ్వ చైతన్య గర్భం నుంచి ఎన్నుకున్న అంశాలు, ప్రతీకలై బింబాలై ఉపమానాది అలంకారాలై శిల్ప మార్గాన పయనించి లౌకిక స్థితిని అలౌకిక స్థితిగా పరిణమింపజేస్తాయి. అందువల్లే రచయిత (విశ్వనాథ) ఆ తాదాత్మ్యస్థితిలో నుంచే “వేయి పడగల పాము విప్పారుకొని వచ్చి కాటందుకున్నదీ కలలలోన రాజునూ” అని ప్రారంభించారు నవలని.
కథాకథన దశలో ఆ మొత్తం నవలలోనూ రచయిత (విశ్వనాథ) ఒక పారవశ్య స్థితికి, స్వప్నస్థితికి తిరిగి ప్రయాణం చేస్తుంటారు. ఈ భూమిక మీద ఈ నవలలో రచయిత సూత్రధారుడవుతాడు, కథానాయకుడవుతాడు. కథ చెప్పుతూ, చెప్పుతూ తన ఆత్మకథలోకి వెళ్లిపోతాడు. ఆత్మకథలోంచి సాగి, జగత్మథనం, ఇహపరలోకాల అనుబంధాన్ని వాటి అవినాభావ స్థితినీ వ్యాఖ్యానిస్తాడు” అని అంటారు. ఆలోచిస్తే ఇది ప్రతి కవి/రచయితకు అన్వయిస్తుంది. కవులు/ రచయితలు తమ రచనలలో వస్తువును విశదపరిచే క్రమంలో తమను తాము వివిథ అవస్థలలో వ్యక్తపరచుకోవడం అనేది సర్వసాధారణం. కవితలు, కథలు, నవలలు, ఆయా కవుల, రచయితల మనోప్రపంచ ఆలోచనల, అనుభవాల అనుభూతుల మథనంలో అక్షరరూపం దాల్చినవే క దా!
“కోవెల సుప్రసన్నాచార్య” వేయిపడగలు నవల గురించి వివరిస్తూ..
“వేయిపడగలు”ఇతిహాసం తాళం తెరిచేందుకు కావలసింది జానపద గాథావిజ్ఞానం అంటారు. జానపద గాధాప్రవృత్తిని ప్రవేశపెట్టడంతో ఈ ఇతిహాసం భూమ్యాకాశాల మధ్య సేతువుగా నిలువబడ్డది” అని వ్యాఖ్యానించారు.
వారు “వేయిపడగల”లోని వివిధ పాత్రల ప్రాముఖ్యతను, కథాసారాంశాన్ని వివిధ విష్యాలపై సంక్షిప్తంగా చెపుతూ “వేయిపడగలు”లో గ్రామీణ ఆర్ధికవ్యవస్థ శైథిల్యం చెప్పడం ఎంత ముఖ్యమైన అంశమో , కుటుంబ వ్యవస్థకు మూలమైన దాంపత్య జీవనం, వివాహ వ్యవస్థ శిథిలమైన సంగతి చెప్పటమూ ముఖ్యాంశమే అంటారు. సమాజంలోని అన్ని వ్యవస్థలకు అన్ని థర్మాలకు, అన్ని పురోగామి శక్తులకు, అన్ని జీవన మాధుత్యాలకు, అన్ని పరలోక సంభావనలకు, అన్ని విశ్వకుటుంబ తత్వములకు, ఈ వివ్వాహవ్యవస్థే మూలమని, ఈ దాంపత్యమే మూలమని రచయిత గాఢంగా విశ్వసించాడు. అందుకే సమాజ వ్యవస్థ ఆధారంగా చేసుకున్న ఒక వివాహాన్నీ, ప్రణయం మూలాధారంగా ఉన్న మరొక వివాహాన్ని శరీరాలకు అతీతంగా జీవాత్మ, పరమాత్మల సంయోగ హేతువుగా సంసిద్ధిగా మరొక వివాహాన్ని ఆయన మూడు కేంద్రాలుగా నిర్మించి ఈ త్రిభుజం చుట్టూ పరిక్రమించవలసిన మానవ జీవన ధర్మచక్రాన్ని “వేయిపడగల”పేర ఆయన నిర్మించాడు” అని అంటారు.

సుప్రసన్నాచార్య మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసిమ్హారావుగారు (1982)లో విశ్వనాథగారిని గురించి ప్రసంగంలోని వాక్యాలను మననం చేసుకొన్నారు. “విశ్వనాథ తన రచన ద్వారా పాశ్చాత్య, సాంస్కృతిక సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం ఇంకా కొనసాగవలసి ఉన్నది. మన చరిత్రలో వ్యక్తిత్వం లేనివారుగా చిత్రించి, ఆర్య ద్రావిడులుగా విభజించి మన మతాలను, అపరిణత వ్యవహారాలుగా ప్రదర్శించి, మన వేదాలను ప్రకృతికి భయపడ్డ మానవుని ఆర్తగీతాలుగా చిత్రించి, మనల్ని మన మూలాల నుంచి దూరంగా విసిరివేసే ప్రయత్నం చెసిన మహాప్రయత్నం నుంచి మనం విముక్తులం కాలేదు. విశ్వనాథ తనకు పూర్వం హెన్రీ డిరేజియో, రాజా రామ్మోహనరాయ్, దయానంద సరస్వతి, వివేకానంద, శ్రీ అరబిందో మొదలైనవారు సాగించిన ఈ ఆధ్యాత్మిక, సాంస్కృతిక పార్ష్వాలన్నింటినీ సమన్వించుకుని భారతీయ సమాజాన్ని పునరున్మిలితం చేయటానికి వాజ్మయం ద్వారా ఉద్యమం సాగించాడు. ఈ గొప్ప ఉద్యమం సందర్భంలోని కొన్ని కొన్ని అవగాహనలు ఈనాడు మనకు సమంజసంగా కానరాకపోవచ్చు. కానీ సమగ్ర దృష్టితో చూస్తే ఆయన ప్రాణాలు దేశంకోసం, సంస్కృతి కోసం, భాషలకోసం, నిరంతర జాగరూకత కోసం ప్రయత్నించబడ్డవి” అని అన్నారని వ్రాశారు.
భారతజాతి శక్తి చావరాదన్నది విశ్వనాథగారి ప్రతిపాదన. అదే స్ఫూర్తితో “ఒక జాతి సర్వత ఉన్మీలితమైనా గావచ్చు కాని శక్తి చావరాదు” (25 అధ్యాయం) వేయిపడగలకు కేంద్రమైన వాక్యమిది. మూలము నుంచి పెళ్లగించడం జరిగిన సహజంగా అంతరికమైన ప్రాణశక్తి నిలిచివుంటే దాన్ని పునరుజ్జీవింపజేసుకొనవచ్చును”.
ఈ శక్తిధీరుడు మొదటి ఆధ్యాయం, చివర దర్సనమిచ్చిన ‘మహాపురుషుడు’ ధర్మారావు. అతడు చివరి అధ్యాయంలో అరుంధతిని చూచి “నీవు మిగిలితివి. ఇది నా జాతి శక్తి” అంటాడు. ఈ విధంగా వేయిపడగలు మొత్తం గ్రంధం ఈ శక్తి ఉద్యమాన్ని నశించకుండా నిలబెట్టడాన్ని సూచిస్తూ ఉన్నది.
పర్యావరణ పరిరక్షణ గురించి ఎనభై ఏళ్ళ క్రితమే విశ్వనాథ ఈ నవలలో చర్చించారన్నారు సుప్రసన్నాచార్య. వారి మాటల్లో.
“ఈనాడు పర్యావరణ శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా ఏయే అంశాలను గూర్చి చర్చిస్తున్నదో వాటిని వేయిపడగలు ఎనభై ఏళ్ళ క్రితమే చర్చించింది. ప్రకృతిలో ఉండే సంతులనాన్ని భంగం చేయడం వల్ల మానవ జీవితం ఎంత దుఃఖభాజన మవుతున్నదో ఇంతటి అభినివేశంతో చర్చించిన నవల మన దేశంలోనే అరుదైనది. చెట్లను నిర్మూలించడం, మెట్ట పొలాలను లేకుండా చేయడం, వాణిజ్య సస్యాలకు ప్రాధాన్యం వచ్చి తిండి గింజలు తగ్గిపోవడం, ఇవన్నీ పాశ్చాత్య నాగరికత తెచ్చిపెట్టిన బస్తీల పెరుగుదలతో వచ్చిన ఇబ్బంది. ఇంతేకాక సృష్టి అంతా మానవుడి సుఖభోగాల కోసమే ఏర్పడిందని భావించినట్లు ఈ నాగరికత ప్రవర్తిస్తుంది. మిగిలిన జీవకోటికి ఆశ్రయభూతమైన ప్రకృతి అంతా వికవికలు చేయబడింది. ఇరువదవ అధ్యాయంలో ఈ కల్లోలం ఆశ్చర్యకరమైన విధంగా చిత్రింపబడింది. వృషన్నిది అన్న మేఘ వృత్తాంతం. ఈ మేఘం ఆదివటం మీద నిలుస్తుంది. ఆ చెట్టు, ఆ మేఘముల మైత్రి ఊరు పుట్టినప్పటినుండి కొనసాగుతున్నది. అంటే అనంతకాలం నుండి కొనసాగుతున్నది. అది ఈ క్రొత్త నాగరికత వల్ల విశదమయింది. ఆదివటము విద్యుద్దీపముల కొఱకు విచ్చేదమైపోవడం వల్ల ఆ మేఘానికి ఆ గ్రామాన్ని గుర్తుపట్టడం కష్టమయింది. వృషన్నిధి అక్కడ కురియలేదు. అయితే వృషన్నిధికి కూడా ఒక తుపాకీ గుండు తగిలింది. ఈ గుండు సామరస్యాన్ని త్రోసివేస్తూ ఆక్రమిస్తూ వున్న నాగరికత, ఈ గుండు వల్ల నాగరికతా మోహంలో ఆత్మ విస్మృతి పొందిన ప్రజల నూతన భావఝరుల వల్ల ఈ మేఘము ఏదో నీరక్కరలేది ఒక గుట్ట పైభాగాన కూలబడిపోయింది. మేఘాన్ని ప్రియా సందేశ వాహకంగా కాళిదాసు నిర్మిస్తే, ఆధునిక కాలంలో పృథ్వీ చైతన్యంలో ప్రాకృతిక అసంతులనం వల్ల ఏర్పడ్డ విషాదాన్ని వ్యక్తం చేయడానికి ఈ వృషన్నిధిని తీర్చిదిద్దాడు విశ్వనాథ” అంటారు సుప్రసన్నాచార్య.
“ఇన్ని కథన పార్ష్వాలను ఇముడ్చుకున్న ఈ ఇతిహాసం, ఈ మహాకావ్యం, ఈ నవల బహిరూపాన్ని బట్టి అదేమిటొ గుర్తించటం సులభ సాధ్యం కాలేదు. ఇది నవలే కాదన్న వాళ్ల దగ్గర నుంచి దీనికంటే గొప్ప నవల లేదనే దాకా, విమర్శకులు వైవిధ్యంతో ముక్తకంఠంతో గొంతెత్తి పలికారు” అంటూ. “వేయిపడగలు” రచించిన విశ్వనాథ సత్యనారాయన తెలుగు వాజ్మయ పరిమితులను, భారతీయ వాజ్మయ పరిమితులను దాటి ఈ ఆంగ్ల పరివర్తనతో విశ్వసాహిత్య పరిధులలోనికి ప్రవేశిస్తున్నాడు అని ఆయనకు స్వాగతం పలుకుతున్నాడు సుప్రసన్నాచార్య.
ఈ సంకలనంలో వున్న /చర్చించిన వివిథ శీర్షికలు..
1. విద్య గురించి విశ్వనాథ,
2. భాష, సాహిత్యం – కావ్యం, వాజ్మయం, రసం గురించి విశ్వనాథ,
3. మతం – సంప్రదాయం, ప్రేమ వివాహ వ్యవస్థ తదితరాల గురించి విశ్వనాథ.
4. విశ్వనాథగారి కొన్ని వర్ణనలు,
5. కొన్ని కథలు, కొన్ని సామెతలు,
6. “Some Valuable Views on Vishwanatha” అనే శీర్షికతో ఆంగ్లములో ప్రముఖ కవులు, రచయితలు, విద్యావేత్తలు, మేధావుల పరిశీలనలు వున్నాయి.

ఈ సంకలనం కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గురించి, వారి సాహిత్య రచనా వ్యాసంగాల గురించి అన్ని కోణాలలొ దర్శించడానికి, ఆ ఎఱుకతో “వేయి పడగలు” నవలలో ప్రవేశించి చదివి అర్ధం చేసుకొని ఆనందించడానికి దోహదం చేసే ఒక మంచి సంకలనం.

వేదిక – విశ్లేషణ

రచన: నండూరి సుందరీ నాగమణి

వేదిక!
ఎంత చక్కని శీర్షిక!!
గోతెలుగు వారపత్రికలో ఈ నవల ధారావాహికంగా వెలువడినప్పుడు నేను అనుసరించలేకపోయాను. కానీ పుస్తకరూపం లోనికి వచ్చాక చదువుతూ ఉంటే మనసంతా ఎంతో ఆనందంతో నిండిపోయింది.

రచయిత్రి శ్రీమతి కోసూరి ఉమాభారతి గారు నాకు చక్కని మిత్రురాలు, సన్నిహితురాలు. క్రిందటేడు ఆమె మాతృభూమికి వచ్చినప్పుడు శ్రీమతి మంథా భానుమతి గారి గృహంలో వారిని కలిసే భాగ్యం నాకు కలిగింది. అంత గొప్ప నృత్యశాస్త్ర కోవిదురాలు అయినా కూడా కించిత్ గర్వమైనా, అహంభావమైనా లేక ఎంతో ఆత్మీయంగా పలకరించి, మనసారా మాట్లాడారు. వారి స్నేహితానికి పాత్రత కలిగి వారికి సన్నిహితురాలినైనందుకు ఆ కళాభారతి పాదాలకు భక్తి పూర్వక కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను.

సహజంగా తానూ నర్తకి కావటం వలన కథానాయకి చంద్రకళ పాత్రలో తాను లీనమైపోయి వేదిక నవలా రచన సాగించారు రచయిత్రి. మేజర్ సత్యదేవ్, గాయని శారదల సంతానం చంద్రకళ, వినోద్ లు. చంద్రకళకు చిన్ననాటి నుండీ నాట్యకళపై మక్కువ ఎక్కువ. తల్లి శారద ప్రోత్సాహంతో, ఇంటి దగ్గరగా చేరిన డాన్స్ స్కూలు మాష్టారి ప్రోత్సాహంతో నృత్యాన్ని నేర్చుకుంటుంది. కళల పట్ల ఎంతో అభిమానం కల తల్లిదండ్రులకు వారసురాలు కావటం చంద్రకళ అదృష్టం. ఆమె విద్య కోసం, ఆమెకు కాస్ట్యూమ్ కుట్టించడం దగ్గరనుంచి, పాట పాడుతూ అభ్యాసం చేయించడం, మేకప్ చేయటం వంటి పనులన్నిటిలో తన కుమార్తెకు ఎంతో చేదోడు వాదోడు గా ఉంటుంది శారద. అలాగే సత్యదేవ్ కూడా తన పిల్లల ఆనందం కన్నా వేరే ఏమీ కోరుకోని ప్రియతమ పితృదేవుడే.
సత్యదేవ్ స్నేహితుడైన భూషణ్, ఆయన భార్య నిరుపమలు చంద్రకళను ఎంతగానో ఆదరించటమే కాక, తమ కుమార్తె అయిన రాణి తో సమానంగా ఆమెను ప్రేమిస్తారు… ఆమె నృత్యకళకు భూషణ్ ఎన్నో సోపానాలు వేస్తాడు. ఎన్నో వేదికలను ఆమె అభివృద్ధికి గాను అమరుస్తాడు. అలాగే మేనత్త కొడుకు జగదీష్ తో చంద్రకళ అనుబంధం, ప్రేమలను ఎంతో హృద్యంగా చిత్రీకరించారు ఉమాభారతి గారు తనదైన చక్కని శైలిలో… జగదీష్ కూడా మరదలు, ప్రేయసి అయిన చంద్రకళతో ఎంతో ప్రేమగా, చనువుగా ఉంటూనే, స్నేహితురాలైన రాణితో, ఆమె తల్లిదండ్రులతో కూడా ఎంతో అభిమానంగా ఉంటూ ఎన్నో సమస్యలలో వారికి తోడుగా, నీడగా ఉంటాడు.

బాలికగా ఉన్న చంద్రకళనుంచి, యవ్వనంలో అడుగిడిన చంద్రకళతో పాటుగా, ఆమె మనసుతో పాటుగా, ఆమె కళా సేవతో పాటుగా, ఆమె భావాలతో పాటుగా మనమూ పయనిస్తాము. చివరికి అమెరికాలో కూడా విజయకేతనం ఎగురవేస్తుంది చంద్రకళ. నృత్యకళాకారిణి, మరియు ఆచార్యురాలైన శ్రీమతి తేజస్విని గారి ద్వారా అక్కడికి వెళ్ళి, ఎన్నెన్నో ప్రదర్శనలు ఇవ్వటమే కాకుండా, అక్కడే కొన్నాళ్ళుండి చాలా మంది విద్యార్థినులకు నాట్యవిద్యలో శిక్షణను ఇస్తుంది. చివరికి ఆమె భారతదేశానికి తిరిగి రావటం ద్వారా కథ ముగింపుకు చేరుకుంటుంది. అయితే చంద్రకళ తన బావ జగదీష్ చేయిని అందుకుందా లేదా అన్న విషయం తెలుసుకోవాలంటే మాత్రం నవల ఆద్యంతమూ చదవక తప్పదు.

‘వేదిక’ నవల మకుటమే ఎంతో అందాన్ని, ఆనందాన్ని తెచ్చింది ఈ గ్రంథానికి. చదువుతూ ఉంటే సమయం తెలియదు, పేజీలు మాత్రం తిరిగిపోతూనే ఉంటాయి. కథానాయికతో పాటు మనమూ నాట్యమాడుతాము… పార్టీలలో హాయిగా ఆనందిస్తాము. జగదీష్ తో విహరిస్తాము. ఎవరైనా ప్రతికూలంగా మాట్లాడినా, అసూయతో తూలనాడినా సంయమనం వహిస్తాము. ఇలా ఎన్నెన్నో సుగుణాలను మనకు తెలియకుండానే ప్రధాన పాత్ర అయిన చంద్రకళ ద్వారా మనము నేర్చుకుంటాము. అలాగే బిడ్డల ఉన్నతి కోసం, తల్లిదండ్రులు ఎలా ఉండాలో, ఉంటారో శారద, సత్యదేవ్ పాత్రల ద్వారా తెలుస్తుంది. పెంపకం ఎలా ఉండకూడదో రాణి తల్లిదండ్రులు భూషణ్, నిరుపమల పాత్రల ద్వారా అవగతమౌతుంది. మరొక చక్కని ఆత్మీయమైన పాత్ర కోటమ్మత్త. ఆప్యాయతానురాగాల మేలు కలయిక.
నవలలో ఎన్నెన్నో చక్కని కీర్తనలు… వాటికి అభినయాలు… తరంగాలు, అష్టపదులు… అన్నమయ్యా, త్యాగయ్యా, క్షేత్రయ్యా పలుకరిస్తూనే ఉంటారు ఆత్మీయంగా… మువ్వల సవ్వడి మన కనుల ముందూ, మనసులోనూ మారుమ్రోగుతూనే ఉంటుంది. సర్వం, సకలమూ సరస్వతీమయమే అవుతుంది.
ఇంత మంచి నవలను, చక్కని సులభ శైలిలో మనకోసం అందించిన శ్రీమతి కోసూరి ఉమాభారతిగారు నిజంగా అభినందనీయులు. వారి కలం నుంచి మరిన్ని మంచి రచనలు రావాలని మనసారా ఆకాంక్షిస్తూ, ఉమాభారతిగారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

పుస్తకము తెరచి చదవటం మొదలుపెట్టింది మొదలు మనమూ ఆ పాత్రలతో సహా నడుస్తాము…

అనుబంధాల టెక్నాలజీ – సమీక్ష

రచన: లక్ష్మీ రాఘవ
పరిచయకర్త: మాలాకుమార్


లక్ష్మీ రాఘవగారి పుస్తకం “అనుబందాల టెక్నాలజీ”, పేరేదో కొత్తగా ఉందే అని చదువుదామని తీసాను. మొదటి కథనే “అనుబంధాల టెక్నాలజీ”. చదవగానే ఇదేదో మన కథలానే ఉందే అనుకున్నాను. అవును మరి ఈ తరం అమ్మమ్మలు, బామ్మలు, తాతయ్యలు మనవళ్ళతో గడపాలంటే అంతర్జాలంలోకి ప్రవేశించక తప్పదు.
మొదటి కథ చదివిన అనుభూతితో అలా అలా మిగితావీ చదివేస్తూ పోయాను.
జెల్ పాడ్ చదవగానే మా ఇంట్లో ఎలుకల కోసం ఎవరో దీని గురించి చెపితే నా ఫీలింగ్స్ గుర్తొచ్చి , అచ్చం రామచంద్ర కూడా నాలాగే ఫీలవుతున్నాడే అనుకున్నాను.
అవిటితనాన్ని ఎలా జయించాలో “గెలుపు గుర్రం” లో ,
విక్కీ లీక్స్ గురించి హాస్యంగా “వెంకీ”లో ,
తల్లి ఆరోగ్యం కోసం వెంకటేశు “బలి” కావటం టచ్చీగా లో,
చేసిన సహాయం మనుషులు ఎలా మర్చిపోతారో “ఇలా జరుగుతుంది మరి!”లో,
రోజూ ఆలశ్యంగా వస్తూ , వచ్చిన తరువాత కూడా డల్ గా ఉండే కొడుకు కార్తీక్ కోసం ఆరాటపడే తల్లి భారతి, స్నేహితుని కోసం చిన్న వయసులోనే పరితపించి , సహాయం చేసేందుకు ఆరాటపడ్డ కొడుకు కార్తీక్ ల గురించి ఉదాత్తంగా “మానవత్వం” లో,
ఇలా ఏ కథ తీసుకునా అదే ప్రత్యేకంగా ఉన్నట్లుగా ఉన్నాయి. మొదటి నుంచి చివరి వరకు మొత్తం ముప్పైరెండు కథలూ ఏకధాటిన చదివాక , ఓ సారి రచయిత్రితో మాట్లాడుదామనిపించింది!
వెంటనే మెసేజ్ బాక్స్ లోకి వెళ్ళి,
నేను:”హలో లక్ష్మీరాఘవగారు, “అని పలకరించాను.
లక్ష్మీరాఘవ:”హలో అండి. ”
నేను:”మీతో మీ గురించి మాట్లాడుదామనుకుంటున్నాను మాట్లాడవచ్చా ?”
లక్ష్మీరాఘవ:”అలాగే”


నేను:”ముందుగా మీ రచనల గురించి మాట్లాడుకుందాం. . మీరు రచనలు ఏ బేస్ మీద చేస్తారు? అంటే ఏదైనా సంఘటన చూసి చలించి రాయాలనుకుని రాస్తారా? ఏదో ఒక విషయం రాయాలని అనుకుని రాస్తారా?లేక ఏదో విషయం తోచి రాస్తారా?”
లక్ష్మీరాఘవ:” ఏదైనా విషయం నా హృదయాన్ని కదిలించి నన్ను ఆలోచింప చేస్తే, ఏదైనా వార్త చదివినప్పుడు అది నన్ను కదిలిస్తే రాస్తాను. అందుకే నా కథ ల్లో కల్పితాలకంటే వాస్తవాలు ఎక్కువ కనబడతాయి. చదివినవారికి తమ జీవితాల్లో ఎక్కడో ఇలా జరిగింది అన్న ఫీలింగ్ వస్తుంది. ”
నేను: అవును అది నిజమే. కొన్ని కథలల్లో నేనే వాటికి కనెక్ట్ అయ్యాను 🙂 మీకు ఎలాటి రచనలు చేయటం ఇష్టం. ”
లక్ష్మీరాఘవ:”సహజంగా, సరళంగా హాయిగా చదువుకునే రచనలు చేయటం ఇష్టం. ”
నేను: ” మీ రచనల్లో మీకు నచ్చింది ఏది? ఎందుకు?”
లక్ష్మీరాఘవ:” నేను రాసిన కథల్లో నావాళ్ళు. మారుతోన్న తరం, మహాలక్ష్మిలో మార్పు, స్వచ్చ భారత్ ఇలా నచ్చినవి చాలా వున్న్నాయి. ఎందుకు అంటే ఎప్పుడూ నాకు తోచిన చిన్న పరిష్కారం ఇవ్వటమే కాకుండా ప్రాబ్లెంస్ ఇలా వుంటాయి అని చెబుతాను కనుక”
నేను:”మీకు నచ్చనిది, ఇంకా బాగా రాయాల్సింది అని అని అసంతృప్తిని కలుగచేసిన రచన వుందా?”
లక్ష్మీరాఘవ:”లేదు. పూర్తి సంతృప్తి కలిగేంతవరకూ మళ్ళీ మళ్ళీ ఆలోచించి రాస్తాను కనుక. ”
నేను:” మీకు ఎలాటి సాహిత్యం ఇష్టం? అనుబంధాల టెక్నాలజీ మీకు నచ్చినవి, నచ్చనివి కథలు ఏమిటి?”
లక్ష్మీ రాఘవా “వర్తమాన సాంఘిక సాహిత్యం ఇష్టం, అనుబంధాల టెక్నాలజీ లో నాకు నచ్చినది బలి, ఎర, రాజ మార్గం, స్వచ్చ భారత్, నిలబడి నీళ్ళు లాటివి కొంచెం ఎక్కువగా. . . ప్రతి కథలోనూ ఒక చిన్న హెచ్చరిక, ఒక పరిష్కారం వున్నాయి కనుక నచ్చనివి ఏవీ లేదు. ”
నేను: “పరిష్కారం” కథ నన్ను ఆలోచనలో పడేసింది. రోజంతా నన్ను వెంటాడుతూనే ఉంది. దాని గురించి మిమ్మలిని ఓ ప్రశ్న అడిగేముందు కథను మళ్ళీ గుర్తుచేసుకుంటాను. ప్రభు విజయ భార్యాభర్తలు. వారికి సంతానము కలుగలేదు. అందుకని విజయ స్నేహితురాలు డాక్టర్. సంధ్య సంతాన సాఫల్య కేంద్రము నడుపుతున్నది. ఆమెను సంప్రదించారు. ప్రభుకు స్పెర్మ్ కౌంట్ తక్కువ వలన సంతానం కలగటము లేదని చెప్పి, కృత్రిమ ఫలదీకరణ ప్రయత్నిద్దామని చెప్పింది. ఆలోచించుకునేందుకు సమయము కావాలని చెప్పి తిరిగి వచ్చేసారు. ప్రభు, విజయ ఒక రోజు సెకెండ్ షో సినిమా కు వెళ్ళి వస్తుండగా ఒక రౌడి వారిని అటకాయించి, ప్రభును కొట్టి, విజయపై అత్యాచారం చేస్తాడు. ఆత్మహత్య ప్రయత్నం చేయబోయిన విజయను వారిని, సంధ్య దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించి ఓదారుస్తాడు ప్రభు. ఆ అత్యాచారం ఫలితంగా విజయ గర్భవతి అవుతుంది. ఎబార్షన్ చేయవచ్చు అన్న సంధ్య ను వారించి ఆ బిడ్డను నా బిడ్డగా పెంచుతాను. తాగుబోతు, అత్యాచారాలు చేసే తండ్రి బుద్దులు రాకుండా ఒక మంచి పౌరునిగా పెంచుతాను. అంతే కాదు, నాకున్న కొద్దిపాటి ఆస్తిని అమ్మి, నా సైట్ లో ఒక ప్రత్యేక శరణాలయాన్ని నిర్మిస్తాను. దానిన్లో అమానుషంగా , అనాగరికతతో పురుషుని ఉన్మాదానికి గురైన ఆడపిల్ల ను ఆదరిస్తాను అంటాడు. స్తూలంగా ఇదీ కథ. ఈనాడు ఎక్కడ చూసినా ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల గురించే వార్తలు కనిపిస్తున్నాయి. ఆ నేపధ్యం లో రాసిన ఈ కథ నన్ను కదిలించింది. లక్ష్మీగారూ. ఈ పరిష్కారం కథ లో మీరు సూచించినట్లు భర్త ఓదార్పు, ఆశ్రమం స్థాపించడం సంభవమే అంటారా?”
లక్ష్మీరాఘవ:”సంభవం అవ్వాలనే ఉద్దేశం! ఇలాటి వ్యక్తులు, ఇలాటి ఆలోచనలు కూడా ఉంటాయని తెలియ చెప్పడం బాగుంటుంది అనిపించిది . సమాజంలో మార్పులు రావాలంటే ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి. . సుబ్రహ్మణ్య భారతి లాగా మార్పులు తేగలమని కాదు. . . . రచనలో ఒక ప్రయత్నం ఎందుకు చేయకూడదు?”
నేను:”అవునండి నిజమే అలా చేయగలిగితే బాగుంటుంది. సరే ఇంకో కథ “ఈ ఎడబాటు వద్దు!”కథ లో నాయిక వ్రాసిన లేఖలోని భావాలు, నేను మా అమ్మాయి డెలివరీకి యు. యస్ వెళ్ళినప్పటి నా భావాలే అనుకున్నాను. మావారి బిజినెస్, మా అబ్బాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉండటం మూలముగా నేనొక్కదాన్నే వెళ్ళాల్సివచ్చింది. ఈ విషయం ఎందుకు చెప్పానంటే , మీ కథలోని కొడుకు స్వార్ధంతో తండ్రిని కాకుండా తల్లిని ఒక్కదాన్నే రమ్మని టికెట్ పంపిస్తాడు. ఈ కథ అనే కాదు , సినిమాలల్లో , చాలా కథలల్లో అమెరికా వెళ్ళిన పిల్లలని స్వార్ధపరులుగా చిత్రీకరిస్తున్నారు. అది నాకు నచ్చటం లేదు. మీరు కూడా అలా రాసేసరికి కొడుకు స్వార్థం కాకుండా వేరే ఆలోచించి వుండవచ్చుకదా ? అని అడగాలనిపించింది”
లక్ష్మీరాఘవ:” నిజమే అలా ఆలోచించాను కూడా. . . ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని ఒక్క టికెట్టు పంపుతున్నట్టు కొడుకు చెప్పి వుండవచ్చు. . కానీ తల్లిని మాత్రమే పిలిపించుకోవడానికి వెనుక పనికి సహాయపడుతుందనే ఉద్దేశ్యం ఉన్న కొడుకులు వుండటం లేదా? అది చెప్పాలని కూడా అనిపించింది. అంతేకాదు లేటు వయసులో “ఎడబాటు” ఎంతగా ఫీల్ అవుతామో చెప్పడం ముఖ్యోద్దేశం. స్వార్థం లేని కొడుకుల గురించే రాస్తే ఆ “ఎడబాటు” లేఖ ఇంకోలా వుండేది. ఇంత ఎఫెక్ట్ వుండేదా? మీరే చెప్పండి. ”
నేను:”ఏమో మరి , ఆ కథ లో మీరు కొడుకును తొలి నుంచీ స్వార్ధపరుడిగానే చిత్రీకరించారు కాబట్టి అది సరిపోయిందేమో!కాకపోతే ఆ లేఖలోని కొన్ని భావాలతో నేను కనెక్ట్ అయ్యాను కాబట్టి మా అబ్బాయిలా అనిపించి నచ్చలేదేమో 🙂 కొన్ని కొన్ని వాక్యాలు ముఖ్యంగా “జీవన మలి సంధ్యలో నాతో మరింత చేరువైన మీరు. . . ” అబ్బ ఎంత నచ్చేసిందో! మా గ్రూప్ లో ఈ వాక్యం సమస్యాపూర్ణంగా ఇవ్వబోతున్నాను, విత్ యూర్ పర్మిషన్ 🙂
నేను:”సరేనండి, మరి రచనలు కాకుండా ఇంకా మీకేమైనా హాబీస్ ఉన్నాయా?”
లక్ష్మీరాఘవ:” నాకు చిన్నప్పటి నుండీ కళలపై మక్కువ. ఎలిమెంటరీ స్కూ ల్లో వున్నప్పడే పెన్సిల్ తో బొమ్మలు వేసేదాన్ని. ఏడవతరగతిలో నాకు డ్రా యింగ్ లో మొదటి బహుమతి వచ్చింది. డాన్స్ చేయడం ఇష్టం. స్కూ ల్లో అనేకసార్లు డాన్సులు చేయడమే కాదు. ప్రైజులు కూడా వచ్చాయి. కాలేజీ వచ్చాకకూడా అంతే. హైదరాబాదు
రెడ్డీ కాలేజీ తరఫున వేసిన ఇంటర్ కాలేజీ నాటక పోటీలో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఇంకా పెయింటింగ్స్ వేయటం ఇష్టం. వాటర్ కలర్, ఆయిల్ పెయింటింగ్స్ వేయటం చాలా ఇష్ట పడతాను. పోట్రెయిట్ పెన్సిల్ స్కెచెస్ వేసాను. ఇప్పటికీ చేస్తున్నాను. శారీస్ మీద బ్లాక్ ప్రింటింగ్ చేస్తాను. క్రియేటివ్ డిజైన్ చేస్తే ఏంతో సంతృప్తి గా వుండేది. ఫాబ్రిక్ పెయింటింగ్ ఎన్నో చేసాను . వేస్టు వస్తువులతో ఎన్నో వస్తువులు చేసాను. కలకత్తా లో వున్నప్పుడు ఎక్జిబిషన్ పెట్టాను కూడా. మా వూరు చేరాక వీటిని చూసిన కొంతమంది ప్రోద్బలంతో స్కూల్స్ లో కూడా ఎక్జిబిషన్ పెట్టాను.
తరువాత పిల్లలు కూడా చాలా క్రియేటివిటీ చూపడం ఆనందం కలుగచేసింది.
ఇంకా చెప్పాలంటే టైలరింగ్ ఇష్టం. పిల్లలకు నేనే బట్టలు కుట్టేదాన్ని.
ఏది కొత్తగా చూసినా చేసేసేయ్యాలనే తపన అందుకే కలకత్తా లో కాపురం వున్నప్పుడు చాలా నేర్చుకున్నాను Rajasthan Jharokas. Murals. Earthan pots with 3 dimensional figures, 3D name plates. Tanjore paintings, Decoupage, Lamosa ఇలా ఎన్నో నేర్చుకున్నాను. చేసిన ప్రతిసారి ఎంతో చాలా సంతృప్తి చెందుతాను.
రిటైర్మెంట్ తరువాత మా స్వంత వూరు కురబలకోట అనే చిన్న పల్లె చేరాక కావలసినంత తీరిక దొరికిన మళ్ళీ [మొదటికథ ప్రింట్ అయ్యింది 1966 లో ] రచనలు చెయ్యడంతో నాకు రోజుకు 24 గంటలు చాలవని అనిపిస్తుంది . బతికున్న ప్రతిక్షణం సద్వినియోగం చేసుకోవాలన్న తపన వుంది.
నేను:”అబ్బో గ్రేట్. మీరు బ్లాగ్ కూడా నిర్వహిస్తున్నారుకదూ. . మీ బ్లాగ్ పేరు ఏమిటి? ఇంకా నిర్వహిస్తున్నారా ?”
లక్ష్మీరాఘవ:”నా బ్లాగ్ పేరు “బామ్మగారి మాట“ దానిని 2007 లో స్టార్ట్ చేసినా ఈమధ్య ఎక్కువ రాయటం లేదు. ఫేస్ బుక్. వాట్స్ అప్ అలవాటు అయ్యాక బ్లాగులో రాయటం తగ్గించాను. కానీ ఇప్పటికీ నా మనోభావాలు రాసుకోవడానికి బ్లాగే సరి అయినదని అబిప్రాయం. ”
నేను:”మీరు ఇన్ని పనులు చేస్తున్నారంటే , మీ చదువు, మీ కుటుంబం గురించి తెలుసుకోవాలని ఉంది. కుటుంబ సభ్యుల సహకారము లేకుండా చేయలేరు కదా అందుకన్నమాట. ”
లక్ష్మీ రాఘవ: ” M. sc దాకా హైదరాబాదులో చదువుకున్నాను. తరువాత పెళ్లి అయ్యింది . మాశ్రీవారికి హైదరాబాదులోనే ఉద్యోగం కావడంతో ఇంట్లో ఒంటరిగా వుండటం ఇష్టం లేక ఉద్యోగంలో చేరాను. పిల్లలు ముగ్గురూ పుట్టాక, వాళ్ళు కాలేజీ చదువులకు ఎదిగాక నాకు Phd చేయాలనే కోరిక కలిగి నీ నలభై రెండ ఏట Phd చేసాను.
అత్తవారింట మా శ్రీవారికి ఒక తమ్ముడు, ఒక చెల్లెలు వున్నారు. మాకు ముగ్గురు ఆడపిల్లలు. అందరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. మా మామగారు మరణించిన తరువాత మా అత్తగారు తొంబై ఏళ్ళదాకా మాతోనే వున్నారు. అలా పెద్దవారికి సేవ చేసుకునే భాగ్యం కలిగింది. ఆవిడ సావాసంతో ఎన్నో నేర్చుకున్నాను. కొన్ని కథలకి ఆవిడ స్పూర్తి అయ్యారు. ”
నేను. “ఓ పక్క కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ, పెద్దవారిని చూసుకుంటూ, ఇన్ని కళలలో రాణిస్తున్నారంటే చాలా గ్రేట్. ఈ మహిళాదినోత్సవ సంధర్భంగా మీ లాంటి బహుముఖప్రజ్ఞాశాలిని కలవటం ఎంతో ఆనందంగా ఉంది. ఓపికగా నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ”
“అనుబంధాల టెక్నాలజీ” పుస్తక రచయిత్రి శ్రీమతి. లక్ష్మీరాఘవగారి పరిచయముతో కూడిన “అనుబంధాల టెక్నాలజీ” పుస్తక పరిచయములో కొన్ని కథల గురించే ప్రస్తావించాను. అన్నం ఉడికిందో లేదో తెలుసుకునేందుకు అన్నం మొత్తం పట్టి చూడక్కరలేనట్లు పుస్తకం గురించి తెలుసుకునేందుకు కొన్ని కథలు రుచి చూపించాను. మిగిలినవి మీరే జె. వి పబ్లికేషన్ ద్వారా పబ్లిష్ ఐన “అనుబంధాల టెక్నాలజీ ” 100రూపాయలకు కొని చదివి మీ అభిప్రాయాలను తెలపండి.

ఈ పుస్తకం అన్ని పుస్తకాల షాపులల్లోనూ , జె. వి పబ్లికేషన్ అధినేత్రి జ్యోతి వలబోజు వద్ద కూడా లభ్యమవుతాయి.

రచయిత్రికి నేరు గా మీ అభిప్రాయాలు తెలపాలంటే రచయిత్రి సెల్ నంబర్ :9440124700 కు కాల్ చేయండి.