June 14, 2024

వీరీ వీరీ గుమ్మడి పండూ, వీరీ పేరేమి?

 

రచన : లలిత.జి.

 

“సాయంత్రం పూట పిల్లలు ఆడుకుంటున్నారు. అందరిలోకీ పెద్ద పిల్ల అందరికంటే చిన్న అమ్మాయి కళ్ళు మూసి ఆమె చేతికి ఒక బెత్తం ఇచ్చి చుట్టూ ఉన్న వారిని ఒక్కొక్కరినే చూపిస్తూ, “వీరీ వీరీ గుమ్మడి పండూ వీరీ పేరేమి?” అని అడుగుతోంది. ఆ అమ్మాయి పేర్లు సరిగ్గా చెప్పలేకపోతోంది. వాళ్ళు పారిపోయి దాక్కుంటున్నారు.  అందరూ వెళ్ళి దాక్కున్నాక కళ్ళు మూసిన అమ్మాయి “దాగుడు మూతా, దండా కోర్, పిల్లీ వచ్చే ఎలకా చోర్, ఎక్కడి దొంగలు అక్కడే, గప్ చిప్ సాంబార్ బుడ్డీ!” అని పాట ముగించి చిన్న అమ్మాయిని దొంగలని పట్టుకోవడానికి వదిలేసింది. ఆ చిన్న పిల్ల మరీ కష్టపడుతోందనుకున్నప్పుడు తెలిసీ తెలియకుండా పెద్దమ్మాయి సాయం చేసి మొత్తానికి దొంగలందరూ పట్టుబడేలా చేసింది. ఆ సరికి దీపాలు వెలిగించే సమయం అయ్యింది. అందరికీ ఇళ్ళనుంచీ పిలుపులొచ్చాయి. పిల్లలందరూ ఇళ్ళకు పరిగెత్తారు. స్నానాలు చేసి శుభ్రమైన బట్టలు తొడుక్కుని భోజనాలు చేశారు. ఆరుబయట వేసి ఉన్న మంచాల మీద ఎక్కి పడుకున్నారు. చుక్కల్ని లెక్కపెట్టుకుంటూ, చంద్రుడ్ని గమనిస్తూ, మబ్బుల వెంబడి ప్రయాణం చేస్తూ, అమ్మలూ, మామ్మలూ, అమ్మమ్మలూ, చెప్పే కథలు వింటూ నిద్రల్లోకి జారుకున్నారు. ”

 

పలకరింపు కోసం వచ్చిన పక్కింటి బామ్మ గారు పిల్లలకి తన చిన్ననాటి ముచ్చట్లు కథగా చెప్తోంది.  అది విని సుమ మనసులో “Hide and seek కి వచ్చిన తిప్పలు కావూ ఇవి? ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి కళ్ళు ముయ్యడం ఎందుకో. ఎంచక్కా నెంబర్లు లెక్కపెట్టుకుంటూ ఎవరికి వారే కళ్ళు మూసుకుని ఒక నెంబరు దగ్గిర ఆగి వెతికితే పోయేదానికి. పిల్లలు పెరిగే కొద్దీ వాళు నేర్చుకునే నెంబర్లు పెరిగి లెక్కపెట్టే సంఖ్యా పెరుగుతుంది. చదువుకి చదువూ, ఆటకి ఆటా. ఈ బామ్మ గారి మాట విని రేప్పొద్దున నుంచీ నన్ను వాళ్ళ కళ్ళు మూసి పేరు చెప్పించమంటారు కాబోలు. ఇప్పుడు నాకింకో కొత్త పని. అసలు అమెరికాలో ఉంటూ కూడా ఇదెక్కడి గోలో. తెలుగు వాళ్ళమని తెలిస్తే చాలు తలుపు కొట్టి లోపలికి వచ్చేస్తారు.” అని తెగ బాధ పడిపోసాగింది.  ఎలాగైతేనేం, ఆ కబురూ ఈ కబురూ చెప్పి  వాళ్ళ కోడలు ఆఫీసునుంచి వచ్చే సమయానికి పక్కింటి బామ్మ గారు బయటకి కదిలింది.

 

“ఆమె కోడలిదే అదృష్టం. ఇంకా పిల్లా జెల్లా కూడా లేరు. ఇంటి పనంతా ఈ ముసలావిడ చేస్తే ఆమె పనికెళ్ళి వస్తుంది. రోజూ సాయంత్రం షాపింగులు. ఇల్లు అందంగా డెకరేట్ చేసుకుంటుందంటే చేసుకోదూ మరి!” అని మనసులోనే విసుక్కుంది సుమ. తన అత్తగారు వచ్చినప్పుడు వంటింట్లోకి ఆమె అడుగు పెడితే ఆమెకి ఎక్కడ అధికారం వస్తుందోనని తనే అన్ని పనులూ చేసుకుంటూ  ఆమె తనకి అస్సలు సాయం చెయ్యదని వాపోవడం గుర్తుకు రాలేదు. ఆ సమయంలో. అమ్మ వచ్చినప్పుడేమో ఆమెకి బోరు కొడుతుందని ఆ పనీ ఈ పనీ చెప్తూ తను ఆఫీసు పని ఇంకో గంట ఎక్కువ చేసుకోవడమూ గుర్తుకు రాలేదు.

 

పొరిగింటావిడ ఇంకొకామె ఈ సమయంలో గుర్తుకు వచ్చింది. ఆమెకి తెలుగంటే ఇష్టమట. తెలుగులో బలే బ్లాగులు వ్రాస్తుందట. ఆమె వ్రాసే విషయాలని మెచ్చుకుంటూ వ్యాఖ్యలు కూడా వస్తాయట. పిల్లల కోసమని పని మానేసి ఇంట్లో కూర్చుంటొంది. కాలక్షేపం కోసమని కొత్తగా ఇది మొదలు పెట్టింది. సుమ వాళ్ళాయనేమో అంతర్జాలంలో ఏదో వెతుకుతూ ఆమె వ్రాసినదేదొ పట్టుకుని చదివి మెచ్చుకున్నాడు. అంతే, ఆమె మీద సుమకి కసి పెరిగిపోయింది. పైసా వచ్చే పని కాదు. ఆ వ్రాసేదేదో బిజినెస్ గురించో, డబ్బులు సంపాదించేలా హిట్లు సంపాదించడానికో ఐనా ప్రయోజనం. ఊరికే వ్రాసి మెచ్చుకుంటే వచ్చేదేముంది?” మరి తను ఒక మెచ్చుకోలు మాట ఆమె గురించి వినగానే ఇంత సతమతమైపోతోంది ఎందుకనో అని ఆలోచన రాలేదు సుమకు.

 

“పైగా అమెకి స్త్రీవాదులతో స్నేహాలొకటి!” మరి తన భర్త చేసే ఇంటి పనులు, తనూ ఇంటి భారం మోస్తున్నాను అనిపించాలని ఉద్యోగం వదలకపోవడమూ, సంపాదించకుండా తిని కూర్చుంటోందని తోడికోడలిని గురించి తక్కువగా అనుకోవడమూ గుర్తు రాలేదు అప్పుడు.

 

ఈ విధంగా తనకు గుర్తొచ్చిన వారిలో తనే అందరికంటే బాధ్యతగా, తెలివిగా, మంచిగా తన జీవన శైలిని సాగిస్తున్నానీ, తన కంటే ఇంకెవ్వరూ ఎక్కువ కష్టపడట్లేదనీ తెలుసుకుని తృప్తిగా నిట్టుర్చింది. ఇక పనులలో పడి పిల్లలు నేర్చుకున్న కొత్త ఆట గురించి మర్చిపోయింది. పనులన్నీ ముగించుకుని పక్క మీద చేరి నడుము వాల్చింది. అంతట్లోనే ఆమెకి సన్నగా ఎవరో ఆడుకుంటున్న అలికిడి వినిపించింది. మెట్లు దిగి కిందకి వచ్చి చూస్తే పెరట్లో దాగుడు మూతలు ఆడుతున్నారు ఎవరో.

 

ఈ ఆటలో ఏదో తేడా ఉంది. కళ్ళు మూసుకుని కూర్చున్న అమ్మాయి పేరు చెప్పాక, కళ్ళ పై చేతులు ఉంచిన ఆమె, ఆమె చూపించిన వారిని దూషించి పొమ్మంటున్నది. ఆ ఆట ఇలా సాగింది.

“వీరీ వీరీ గుమ్మడి పండూ, వీరీ పేరేమి?”

“స్త్రీవాది”

“స్త్రీవాదులంటే నాకసహ్యం! వాళ్ళకి మగవాళ్ళని పీడించడం, పురుషులు దయతలిచి ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చెయ్యడమే తెలుసును! పారిపో!”

“వీరీ వీరీ గుమ్మడి పండూ, వీరీ పేరేమి?”

“బ్లాగరి”

“బ్లాగరులంటే నాకసహ్యం! ఇంట్లో ఉన్న సమస్యలన్నీ అంతర్జాలంలో పెడతారు. చదివే వారు సానుభూతి చూపిస్తుంటే సరదా పడతారు. బ్లాగుల్లో సలహాలిస్తూ కుటుంబాన్ని పాడుచేసుకుంటుంటారు. పారిపో!”

“వీరీ వీరీ గుమ్మడి పండూ, వీరీ పేరేమి?”

“గృహిణి”

“గృహిణులంటే నాకసహ్యం. ఇంట్లో పని చెయ్యకుండా తేరగా మొగుడు తెచ్చిన సొమ్ము తింటూ ఉండడం మాత్రమే తెలుసు వీరికి. పారిపో!”

“వీరీ వీరీ గుమ్మడి పండూ, వీరీ పేరేమి?”

“ఉద్యోగం చేసే ఇల్లాలిని”

“ఉద్యోగమూ, ఇల్లూ రెండూ వెలగబెడ్తున్నావంటే నమ్మమంటావు. ఉద్యోగం పేరుతో ఇల్లు వదిలి బయట బలాదూర్ తిరిగి వస్తావు. ఇంటికొచ్చాక అలసిపోయానంటూ ఇంటి పనులకి ఎగనామం పెడతావు. పారిపో!”

“వీరీ వీరీ గుమ్మడి పండూ, వీరీ పేరేమి?”

“తల్లి”

“తల్లివట మహా చెప్పొచ్చావు. తల్లివైతే పిల్లలని పట్టించుకోకుండా బ్లాగరి, స్త్రీవాది స్నేహితులతో కూర్చుని సమయం వృథా చేసుకుంటావా? పారిపో!”

“వీరీ వీరీ గుమ్మడి పండూ, వీరీ పేరేమి?”

“నేనూ ఒక మనిషిని”

“మనిషివైతే నా లాగా కష్టపడి పని చేస్తావు. ఇంటి పనులూ బయట పనులూ అన్నీ సమర్థవంతంగా నెరవేరుస్తావు. ఒక్క తప్పు చెయ్యవు. పొరపాటు చేసే వాళ్ళు మనుషులు ఎలా అతారు? పారిపో!”

“దాగుడు మూత, దండాకోర్! పిల్లీ వచ్చే ఎలకా చోర్! ఎక్కడి దొంగలు అక్కడే! గప్ చుప్ సాంబార్ బుడ్డీ!”

అక్కడ ఉన్న వారంతా పారిపోయి ఎవరిళ్ళకు వారు వెళ్ళిపోయారు. కళ్ళు మూసిన అమ్మాయి చేతులు తీసింది. విచిత్రం ఇద్దరు అమ్మాయిలూ ఒక్కరే. ఆ ఇద్దరూ తనే!

అలారం మోగితే హఠాత్తుగా మెళుకువ వచ్చి లేచి కూర్చుంది సుమ. అప్పటిదాకా తను చూసింది కల అని తెలిసి ఊపిరి తీసుకుంది.

కల గురించి ఆలోచించే తీరిక ఆమెకి ఎక్కడ ఉందీ. తన నిత్య కార్యక్రమాల్లో పడి కల వచ్చిన విషయమే మర్చిపోయింది. తన చుట్టూ ఉన్న వారి గురించి తను తీర్పులిచ్చుకుంటూ మానసికంగా అందరినీ దూరం చేసుకుంటున్న విషయం లీలగానైనా ఆమెకి అర్థం కాకపోయింది.

 

గమనిక: ‘సుమ’ పాత్ర చిత్రీకరణ ఒక రకం మనస్తత్వానికి ఓ మాత్రం వెలుగు చూపించే చిరు ప్రయత్నం మాత్రమే. ఆ ‘గుమ్మడి కాయల్లోనూ’ అన్నీ ప్రశస్తమైనవే అని కాదు. ఇటువంటి మనస్తత్వాన్ని తక్కువ చేసి చూపించడమూ కాదు. రచనకి ఒక వస్తువు, వ్యక్తీకరణకు ఒక సాధనం, పాఠకులకు ఒక కాలక్షేపం ప్రస్తుత కథనం ఆశించే ప్రయోజనాలు.

 

 

6 thoughts on “వీరీ వీరీ గుమ్మడి పండూ, వీరీ పేరేమి?

  1. ఎన్నెల, జ్యోతిర్మయి, కృష్ణప్రియ, శశికళ, కథ నచ్చినందుకు ధన్యవాదాలు. కథలలో ఇలంటి విషయాలు వ్రాయడానికి ధైర్యం చెయ్యలేదు ఇంతవరకూ. ఒకలా మొదలైనా, నచ్చకపోతే ఆపేస్తానులే అని సాగనిచ్చాను. ఎన్నో సార్లు అలా ఆపేశాను కూడా. ఈ సారి అలా మొత్తం ఒక రూపు దిద్దుకోనిచ్చాక ఒక్క క్షణమే ఆలోచించి పంపేశాను. మీ వ్యాఖ్యలు చుసి పరవాలేదు సున్నితంగానే వ్యక్తీకరించగలిగాను అని సంతృప్తి పడుతున్నాను.

  2. వీరి వీరి గుమ్మడి పండూ వీరిపేరేమి?
    లలిత గారు
    లలితా గారు లలితా గారూ పారిపోండి..ఇంత మంచి కథలు వ్రాసే మీరు నాకు అస్సలు నచ్చలేదు..హహహహ్హ
    కథ బాగుందండీ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *