May 5, 2024

అద్దం

రచన: పసుపులేటి గీత

ఎవరు, ఎప్పుడు
తగిలించారో గానీ
మకిలి పట్టిన మా పడమటింటి గోడకు ఓ అద్దాన్ని
అమ్మకంట్లో నీటిచుక్కలా
అదెప్ప్పుడూ అలా గోడనంటి పెట్టుకుని
వేలాడుతూనే వుంటుంది
మసిబారిన దాని మీద ఏ అమ్మ బొమ్మయినా
ముసురు పట్టిన మబ్బు తునకలా కనపడుతుంది.
అమ్మ నుదుట కుంకుమ వెనుక దాగిన ముడతల్లా
అద్దం వెనక అణగారిన
ప్రతిబింబాలెన్నో!
ఎన్ని ముఖాకృతులకు
ఎన్ని ఎగదన్నే దుఃఖచిత్తరువులకు
పౌడరు అద్దిందో
కాటుక రేఖలు తీర్చిందో
కుంకుమ దిద్దిందో
ఆ అద్దం?
ఎన్ని దుఃఖాకృతులకు
మేలి ముసుగులు వేసిందో ఆ అద్దం?!
ఏడ్చి ఏడ్చి చెదరిన కాటుకను
ఆ అద్దంలో చూసే సరి దిద్దుకునేది మా అక్క
ఫెళ్ళున పగలబోయే జీవితంలొకి
మెళ్ళో మంగళసూత్రంతో
మెట్టిన మా ఇంటి ఆడవాళ్ల ఐదోతనానికి ఆ అద్దమే సాక్షి
గర్భాదానం గదిలోకి వెళ్ళే
మా ఇంటి ప్రతి ఆడపడుచూ
ఆ అద్దం ముందే అలంకరించుకునేది
చిటికెడు కుంకుమ కోసం
చచ్చిపోయిన చిరునవ్వులన్నీ
ఆ అద్దం వెనుకే మణగిపోయాయి
ఎన్ని మీసాలు దువ్విందో,
ఎన్ని క్రాపింగులు సరి చేసిందో
మా ఇంటి అద్దం
మగవారి దర్పానికి తళతళా వణికేది
ఎన్ని కళ్ల ఎర్ర జీరలలో
కాలిపోయిందో మా ఇంటి ఆడతనపుటద్దం!
వెన్ను విరిగిన ప్రతిబింబాలెన్నో!
అద్దాన్ని అడిగితే చెబుతుంది
ఐదో తనానికి అమ్ముడుపోయిన
అమ్మల గురించి, అమ్మమ్మల గురించి!!

1 thought on “అద్దం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *