May 5, 2024

మదిర – మధుశాల

      రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు    j.k.mohanrao

 

 

నన్నయభట్టు వ్రాసిన ఆంధ్రమహాభారతములో శకుంతలోపాఖ్యానము చాల ప్రసిద్ధమైనది.

దుష్యంతమహారాజు మృగయావినోదములో ఆసక్తుడై అడవిలో వేటాడి, తరువాత కణ్వాశ్రమమును సమీపిస్తాడు. అప్పుడు ఆ ఆశ్రమమును వర్ణిస్తూ నన్నయభట్టు వ్రాసిన రెండు పద్యములను క్రింద పరిచయము చేస్తున్నాను –

 

మానిని లేక మదిర  – భ/భ/భ/భ/భ/భ/భ/గ,  యతి [ 1, (7,) 13, (19) ]

ఏచి తనర్చి తలిర్చిన క్రోవుల – నిమ్మగు ఠావుల జొంపములం-

బూచిన మంచి యశోకములన్ సుర-పొన్నల బొన్నల గేదగులం

గాచి బెడంగుగ బండిన యా సహ-కారములం గదళీ తతులం

జూచుచు వీనుల కింపెసగన్ విను-చున్ శుకకోకిల సుస్వరముల్

– నన్నయభట్టు, మహాభారతము, ఆదిపర్వము 4-20

 

కవిరాజవిరాజితము లేక హంసపద – న/జ/జ/జ/జ/జ/జ/లగ, యతి [ 1, (8,) 14, (20) ]

చనిచని ముందట నాజ్యహవిర్ధృత – సౌరభధూమలతాతతులన్

బెనగిన మ్రాకుల కొమ్మలమీద న-పేత లతాంతములైనను బా-

యని మధుపప్రకరంబుల జూచి జ-నాధిపుడంత నెఱింగె దపో-

వనమది యల్లదె దివ్యమునీంద్రు ని – వాసము దానగు నంచునెదన్

– నన్నయభట్టు, మహాభారతము, ఆదిపర్వము 4-20

 

దారిలో బాగుగా పెరిగి ఉన్న వెదురు చెట్లు, అందముగా ఉండే పొదలు, విరబూసిన మోదుగు చెట్లు, పొన్నలు, మొగలి, మామిడి, అరటి మున్నగు పుష్ప, ఫల వృక్షాలను చూస్తూ, చిలుకల, కోయిలల పాటలను వింటూ నడుస్తున్నాడు. అలా ముందు నడుస్తుంటే నేతిని హోమకుండములలో పోయగా వచ్చిన మంచి సువాసనతో నిండిన పొగలను, చెట్లను చుట్టుకొన్న తీగలపై శోభిల్లే పూలను వీడని తుమ్మెదలను చూచి ఇది ఒక తపోవనము లేక ఒక మునిపుంగవుని నివాస స్థానము అని అనుకొంటాడు. ఇది ఈ పద్యముల భావార్థములు.

 

ఇందులో మొదటి పద్యము మానినీ వృత్తములో వ్రాయబడినది. ఆ తపోవనములో దుష్యంతుడు మానినీమణి అయిన శకుంతలను దర్శించి పెండ్లి చేసికొంటాడు. అందువలన మానినీ వృత్తములో పద్యమును వ్రాయడము ఉచితమే కదా! ఈ మానినీ వృత్త పాదములకు వరుసగా ఏడు భ-గణములు (UII), చివర ఒక గురువు (U) ఉంటుంది. ఈ మానినీవృత్తములోని మొదటి  గురువుకు బదులు రెండు లఘువులను ఉంచితే మనకు రెండవ పద్యపు అమరికయైన కవిరాజవిరాజితము లభిస్తుంది.  ఈ రెండు పద్యాలకు నన్నయ ఒక్క యతినే వాడాడు. తరువాతి కాలపు కవులు నేను కుండలీకరణములలో ఇచ్చిన వాటితోబాటు మూడు యతులను ఉంచినారు.

 

మానిని, కవిరాజవిరాజితములకు లయ ఒక్కటే, ఏడు చతుర్మాత్రలు, చివర రెండు మాత్రలు.  సంస్కృతములో మానినిని మదిరా అనియు, కవిరాజవిరాజితమును హంసపద మనియు అంటారు. ఈ కవిరాజవిరాజితములో ఆది శంకరులు యమునాష్టకమును  , రామకృష్ణకవి  సుప్రసిద్ధమైన మహిషాసురమర్దిని స్తోత్రమును    వసంతకుమారి గాత్రములో   రచించారు.  ఈ వృత్తములు గొప్ప తాళ వృత్తములు, అనగా వీటిని చక్కగా తాళముతో పాడుకొనవచ్చును.  అన్ని పద్యాలను రాగయుక్తముగా పాడుకొనవచ్చును, కాని అందులో కొన్నిటికి మాత్రమే తాళయుక్తముగా పాడుకొనడానికి వీలయ్యే అమరికలు ఉంటాయి. ఇట్టి చతుర్మాత్రలు ఉండే అమరిక మరొకటి కూడ ఉన్నది, ఆ వృత్తమును బంధురము అంటారు.  క్రింద సుమారు పండ్రెండు సంవత్సరాలకు ముందు నేను వ్రాసిన ఒక బంధుర వృత్తము.

 

బంధురము – న/న/న/న/మ/స/స/స, యతి (1, 9, 15, 21)

 

లవ కుశు లిరువురు – లలిత పదాలన్ – రాగముతో పలు – రామ కథల్

యువ నవ మధురత – లుబుకు గళాలన్ – యోగి మహర్షియు – నొజ్జవగన్

శ్రవణములకు నతి – సరసత తోడన్ – సా-గ-ని మా-పని – సామ మనన్

వివిధ కవనముల – బిరబిర పాడన్ – వేగెను జానకి – వెన్నునికై

 

ఇది వాల్మీకి ఆశ్రమములో లవకుశులు రామాయణమును నేర్చుకొనే సందర్భములో సీత రామునికోసం బాధపడే దృశ్యము. ఈ పద్యములో మఱొక గమ్మత్తు కూడ ఉన్నది. ఇందులోని మొదటి 14 అక్షరాలు కమలవిలసిత లేక సురుచిర అనే వృత్తమునకు, తఱువాతి పది అక్షరాలు పంక్తి అనే పద్యానికి సరిపోతాయి.  అనగా బంధురము అనే వృత్తములో కమలవిలసితము, పంక్తి అనే రెండు వృత్తాలను ఇమిడించవచ్చును.  అనగా బంధురము మాతృక, కమలవిలసిత పంక్తులు తనయలు. క్రింద ఆ వృత్తములు –

 

కమలవిలసితము – న/న/న/న/గగ, యతి (1, 9)

లవ కుశు లిరువురు – లలిత పదాలన్

యువ నవ మధురత – లుబుకు గళాలన్

శ్రవణములకు నతి – సరసత తోడన్

వివిధ కవనముల – బిరబిర పాడన్

 

పంక్తి – భ/భ/భ/గ, యతి (1, 7)

రాగముతో పలు – రామ కథల్

యోగి మహర్షియు – నొజ్జవగన్

సా-గ-ని మా-పని – సామ మనన్

వేగెను జానకి – వెన్నునికై!

 

ఈ బంధుర వృత్తపు సంగతి, గర్భకవిత్వము ఆసక్తి ఉన్నవారికి ఉపయోగపడవచ్చును అని మీకు తెలిపాను.  ఇంతకు ముందే మానినికి మదిరా అని పేరున్నదని మీకు చెప్పాను. మదిర ఎక్కడుంటుంది?  మదిర మధుశాలలో ఉంటుంది గదా?  ఈ ఏడు చతుర్మాత్రల లయతో, చివర ఒక గురువుతో మాత్రాఛందస్సులో 1935లో హరివంశరాయ్ బచ్చన్ మధుశాల అనే ఒక ఖండకావ్యాన్ని   హిందీలో వ్రాసారు. ఓమర్ ఖయ్యాం రుబాయీల ప్రభావము ఇందులో కనబడుతుంది. సూఫీ సిద్ధాంతాలను కూడ ఇక్కడ గమనించవచ్చును. ఈ పుస్తకము త్రాగుడును ప్రోత్సాహము చేస్తుందని కొందఱు పుకారు చేయగా, మహాత్మునివంటి వారు, అది సరికాదన్నారు.

 

మధుశాలలోని ఛందస్సు వివరాలు – ప్రతి పద్యానికి నాలుగు పాదములు, పాదమునకు ఏడు చతుర్మాత్రలు, ఒక గురువు, మొదటి, రెండవ, నాలుగవ పాదములకు అంత్యప్రాసలు. మొత్తము 135 పద్యములు ఉన్నాయి ఇందులో. కొన్నిటికి తెలుగులో అదే ఛందస్సులో నా అనువాదాలను చదువవచ్చును.  నేను కూడ ప్రతి పాదమునకు ఏడు చతుర్మాత్రలు, ఒక గురువును ఉపయోగించాను, ప్రతి రెండు పాదములకు ప్రాసను వాడినాను. అంత్యప్రాసను ఎల్లవేళలలో పాటించుటకు వీలుకాలేదు. కొన్ని చోటులలో చివరి అక్షరమునకు గురువుకు బదులుగ లఘువును వాడినాను, కాని పాడేటప్పుడు, అది గురుతుల్యమే.  ఐదవ చతుర్మాత్రాగణముతో అక్షరయతినో లేక ప్రాసయతినో ఉపయోగించాను.

 

మృదు భావోం కే అంగూరోం కీ ఆజ బనా లాయా హాలా,

ప్రియతమ, అపనే హీ హాథోం సే ఆజ పిలాఊఁగా ప్యాలా,

పహలే భోగ లగా లూఁ తేరా, ఫిర ప్రసాద జగ పాఏగా,

సబసే పహలే తేరా స్వాగత, కరతీ మేరీ మధుశాలా 1

 

మదిరను జేసితి నీకై నేనిట – మృదు భావమ్ముల ద్రాక్షలతో 

అధరమ్ములకును నందించెద ప్రియ – యా మధుపాత్రను జేతులతో

నీకే ముందుగ నైవేద్యమ్మది – నిఖిలమ్మున కా పిదపేగా

నీకే ముందుగ నా మధుశాలయు – నిజముగ స్వాగత మన్నదిగా 

 

ప్రియతమ, తూ మేరీ హాలా హై, మైం తేరా ప్యాసా ప్యాలా,

అపనే కో ముఝమేం భరకర తూ బనతా హై పీనేవాలా,

మైం తుఝకో ఛక ఛలకా కరతా, మస్త ముఝే పీ తూ హోతా,

ఏక దూసరే కీ హమ దోనోం ఆజ పరస్పర మధుశాలా 3

 

నీవే నా మదిరవుగా ప్రియతమ – నేనే తృష్ణకు పాత్రనుగా 

నీవో నిన్నే నాలో నింపుచు – నీవయ్యెదవు సురాసువుగా

నే నిను నింపెద తొణికిసలాడగ – నీవో త్రాగెద వీనన్ను

నేనును నీవును జేరగ నయ్యెను – నేడిక్కడ మధుశాలగను

 

మదిరాలయ జానే కో ఘర సే చలతా హై పీనేవాలా,

’కిస పథ సే జాఊఁ?’ అసమంజస మేం హై వహ భోలాభాలా,

అలగ-అలగ పథ బతలాతే సబ పర మైం యహ బతలాతా హూఁ –

’రాహ పకడ తూ ఏక చలా చల, పా జాఏగా మధుశాలా 6

 

మదిర పిపాసియు వెడలగ దలచెను – మధుశాలకు నింటిని వదలి

అది సరి దారియె యిది సరి దారియె – యని కలగెను మదిలో గదలి

ఇది సరి యది సరి యను నొక్కొక్కరు – యెది సరియో నే జెప్పెదను

పదములతో నొక ద్రోవను ద్రొక్కుము – మధుశాలను జూతువు తుదకు  

 

జగతీ కీ శీతల హాలా సీ పథిక, నహీం మేరీ హాలా,

జగతీ కే ఠండే ప్యాలే సా పథిక, నహీం మేరా ప్యాలా,

జ్వాల సురా జలతే ప్యాలే మేం దగ్ధ హృదయ కీ కవితా హై,

జలనే సే భయభీత న జో హో, ఆఏ మేరీ మధుశాలా 16

 

ఎల్లెడ సురవలె నా మధు విక్కడ చల్లగ నుండదు పయనికుడా

ఎల్లెడ గల యా గిన్నియవలె నిది చల్లగ నుండదు పయనికుడా

మండెడు చషకము మండెడు మదిరయు మండెడు హృదయపు కవిత గదా

మండుచు నంచును భయపడ వద్దీ మధుశాలకు రా ధైర్యముగా

 

ఏక బరస మేం, ఏక బార హీ జగతీ హోలీ కీ జ్వాలా,

ఏక బార హీ లగతీ బాజీ, జలతీ దీపోం కీ మాలా,

దునియావాలోం, కిన్తు, కిసీ దిన ఆ మదిరాలయ మేం దేఖో,

దిన కో హోలీ, రాత దివాలీ, రోౙ మనాతీ మధుశాలా 26

 

ఒక వరుసములో ఒక మారే యా హోలీ పండుగ వచ్చునుగా

ఒక వరుసములో ఒక ఆటే గద ఒక మారే దీపావళిగా

రండీ మధుశాలకు నెపుడైననురండోయీ చూడండోయీ

పండుగ యెప్పుడు రేతిరి దివ్వెలు పగలగు హోలీ యిచటోయీ

 

ఇటీవలే దివంగతులయిన మన్నా డే కంఠములో మధుశాలలోని రుబాయీల నిక్కడ   వినవచ్చును.

 

 

 

 

 

 

 

3 thoughts on “మదిర – మధుశాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *