May 5, 2024

అరిపిరాల ఊహల చిత్రం

సమీక్ష: అపర్ణ తోట

Cover
అరిపిరాల సత్యప్రసాద్. అడపా దడపా చదివే కథల్లో రచయిత పేరు. దరిమిలా నా ఫేస్ బుక్ ఫ్రెండ్ గా కూడా మారారు. కథల పై చర్చలు, మొపాసా కథల అనువాదాలూ చూస్తే కాస్త సీరియస్ కథా రచయితే అనుకున్నా. క్రమంగా పాఠకుడిగా ఆయన పరిధి, రచనాధోరణులపై ఉండే వివేచనా ఇంకొంచెం ఆయన గురించి చెప్పాయి.కానీ నా దృష్టిలో కథా రచయితలు రెండు రకాలు.కథను కెరీర్ గా మార్చుకుని సంవత్సరానికిన్ని కథలని టార్గెట్లు పెట్టుకుని పూర్తిచేసేవారు మొదటివర్గం ఐతే, అసలు కథలు రాయకపోతే ఉండలేననుకునేవారు రెండో రకం. రెండు వర్గాలలోను మంచి కథలు అందించినవారున్నారు కానీ వ్యక్తిగతంగా రెండో వర్గానికే నా పక్షపాతం. కథ రాయకుండా ఉండలేకపోవడం ఒక ప్రేరణ, ఇబ్బంది అయి ఒక ఫోర్సుతో రాస్తేగానీ కథలో ఆ బిగి, కనెక్షన్ సరిగ్గా ఏర్పడదనిపిస్తుంది. పాఠకులు కన్నా ముందు, రచయిత కథతో ఎంత బాగా కనక్ట్ అవడం చాలా ముఖ్యం- కథలో ఆత్మ ఇక్కడే ప్రతిబింబిస్తుంది. అరిపిరాల కథల్లో ఆత్మ స్పష్టంగా కనిపించడమే కాదు, కథావస్తువులో, కథనంలో నిజాయితీ ఉన్న రచయిత!

అరిపిరాల కథల్లో ఆయన శైలి, కథాశిల్పం బలంగా ఉన్న కథల్లో, స్థాయిలనుబట్టి కథలను విభజించవచ్చు. కథల్లో ‘ఊహాచిత్రం’ ఒక స్టాండ్ ఔట్! ఈ కథ ఆయన లోని రచయితను బాగా సానబెట్టి రాసినట్లున్తుంది.  ‘చినుకులా రాలి’, ‘మబ్బుతునక’, ‘ఏడు తరువాత’, ‘తుదిబంధం’ చెప్పుకోదగ్గ కథలైతే, మిగిలిన కథలు మామూలుగా ఉన్నాయి. వానర వీరుడు’ ప్రయోగం కోసం మాత్రమే రాసినట్లుంది. ఓపెన్ టైప్ ఎందుకు రాశారో అర్థం కాలేదు.

కానీ ‘ఏడు తరవాత’ కథ- టీవీ సీరియళ్ళ ప్రభావం నుంచీ, మేధావుల పలాయన వాదం, విద్యా సంస్థల ఆలోచనలు, చిత్రకారుడి రంగుల లోకం, ఆటగాడి లక్ష్యం, కార్పరేట్ ఉద్యోగుల వారాంతపు గాధా, రాజకీయాలూ, సగటు కుటుంబీకుడి ఆర్ధిక బాధలూ ఆఖరున పకీరుమాటలతో రచయిత ముక్తాయింపు- ఈనాటి పరిస్థితి కళ్ళకు కట్టునట్లు- మూడుముక్కల్లా  మూడు పేజీలలో  తేల్చేసారు.

‘కథల్లో ఆయన శైలి గురించి చెప్పాలంటే ‘చినుకులా రాలి’ కథ చినుకు తన స్వపరిచయం తో ఇలా మొదలవుతుంది.   “మా నాన్న పేరు మేఘం. అమ్మ పేరు ధరిత్రి. నాన్న అమ్మకి వ్రాసిన ప్రేమలేఖనే నేను. నా పేరు చినుకు.”

అలాగే ఉత్సాహంగా భూమి మీదికి దూకాలని ఉవ్విళ్ళూరుతున్న చినుకుతో మేఘం ఇలా అంటుంది. “ పిచ్చి తల్లీ…తొందర నీ జీవన లక్షణం. కానీ అక్కడ ఎన్నో అవాంతరాలు ఉంటాయి…ఎత్తిపడేసే జలపాతాలు, కట్టిపడేసే ఆనకట్టలు వీటన్నిటినీ దాటాలి….నేను నిన్నుఒక్క కంట కనిపెడుతూ ఉంటాలే…జాగ్రత్తగా వెళ్లిరా..”

ఇందాకే చెపినట్లు బలమైన శైలి, కథా శిల్పం, కథనం, పదాలలో సాంద్రత తెలిసినందుకు ఆయన్ని అభినందించాలని ఉన్నా, బలహీనమైన ఇతివృత్తాలను ఎన్నుకున్నందుకు కోపం కూడా వస్తుంది. కాని తను ఉండే ఈ సాధారణ జీవితంలో మనుషులు మిస్సయ్యే ఒక చిన్న కోణం మీద ఒక కాంతిరేఖను వదులుతాడు.

పుస్తకం లో చివరి అట్ట మీద రాసిన ఆ ముగ్గురు రచయితల మాటలతో ఏకీభవిస్తానుగానీ ఈయనిలా ఇంత మామూలు ప్లాట్స్ రాసి తన టాలెంట్ ని వేస్ట్ చెయ్యడం ఒప్పుకోలేను. ఎక్కడో ఆ ‘విగర్’ పోతుంది అనిపిస్తుంది నా సైన్సు బుర్రకి.

ముప్పైఆరేళ్ళు దాటని ఈ కార్పోరేట్ ఉద్యోగి తెలుగు భాషాభిమానానికి, పఠనా పరిశ్రమకి ఆశ్చర్యపోతూనే, తన రచనా శైలిలో ఉండే పదునును సరిగ్గా వాడనందుకు చిన్నగా చివాట్లు వేస్తూ, ఉహాచిత్రం వంటి రాబోయే ఎన్నో మంచి కథలకు  ముందుగానే కృతజ్ఞతలందిస్తూ ముగిస్తున్నాను.

ఈ పుస్తకం ప్రముఖ పుస్తకాల దుకాణాలలో లభిస్తుంది.
అంతేకాదు కినిగె ద్వారా కూడా ఈ పుస్తకం కొనుగోలు చేయవచ్చు..http://kinige.com/kbook.php?id=2371&name=Ooha+Chitram

2 thoughts on “అరిపిరాల ఊహల చిత్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *