May 5, 2024

“తెలుగు వెలుగుల స్నేహం” – చారిత్రక సాహిత్య కథలు – 8

 

రచన: మంథా భానుమతిmantha bhanumathi

“మిత్రమా!”

మరునాడు తన శిష్యులకు బోధించవలసిన ఛందో లక్షణాలను ఒకసారి పరికించి చూసుకుంటున్న

జినవల్లభునకు వినిపించలేదు.

అతని ఏకాగ్రత అటువంటిది. అందుకే అతను చతుర కవిత్వ రచనలో సుప్రసిద్ధుడిగా పేరుపొందాడు.

సత్పురుషులకు విద్య నేర్పడంలో అతనికున్న ఆసక్తి మెండు. అంతే కాదు.. ఏ పద్యమయినను రాగయుక్తంగా, శ్రావ్యంగా గానం చెయ్యడమేకాక అదే విధముగా శిష్యుల చేత కూడా పాడిస్తాడు.

కొద్ది సేపు స్నేహితుని దీక్షను ప్రసన్నవదనంతో తిలకిస్తూ అలాగే ఉండిపోయాడు మల్లియ రేచన.  “మిత్రమా!” ఈ సారి మరింత హెచ్చుస్థాయితో పిలిచాడు.

జినవల్లభుడు తత్తరపాటుతో లేచి నిలబడ్డాడు.

“నువ్వే వచ్చావా రేచనా! కబురంపితే నేనే నీ వద్దకు వచ్చేవాడిని కదా!” సాదరంగా ఆహ్వానించి,

తన పక్కనే కూర్చుండ బెట్టుకున్నాడు.

స్నేహం, బాధవ్యం కన్నా మిన్న అని, కుల మతాలకి అతీతమని, బీదా గొప్పా తారతమ్యం

లేనిదనీ వారిరువురినీ చూస్తే తెలుస్తుంది.

మల్లియ రేచన వేములవాడలో క్రీ.శ. 940 ప్రాంతాల, పేరొందిన సంపన్నుడైన వైశ్య ప్రముఖుడు.

ఎందరో కవులకు ప్రోత్సాహమిచ్చిన కారణాన “కవిజనాశ్రయుడు” అని బిరుదు పొందిన వాడు. ఆదికవి పంపన్న, జిన వల్లభులవలే అతను కూడా జైనుడు. జైనాగామాలని క్షుణ్ణంగా

చదువుకున్నాడు. జినమత హితుడు.

“కార్యార్ధినై వచ్చాను జినా!”

స్నేహితుని వంక ఆశ్చర్యంగా చూశాడు జినవల్లభుడు.

“ఏ కార్యమందైననూ నేను నీకు చేయగల సాయమేది రేచనా?”

“ఇద్దరమూ కలిసి ఒక బృహత్కార్యమును చేపట్టవలె. సంస్కృత కన్నడ భాషల్లో లక్షణ

గ్రందాలనేకం ఉన్నాయి. తెలుగు భాషలో సాహిత్య రచనలు వస్తున్న ఈ సమయంలో ఒక లక్షణ గ్రంధం రచించవలెనని ఆకాంక్ష కలిగింది.”

జినవల్లభుడు కన్నులుమూసికొని కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు.

“జినా!”

రేచనకి కొద్దిపాటి సందేహం కలిగింది. తానూ శక్తికి మించి ఆశిస్తున్నాడా?

“ఆ! మంచి ఆలోచన మిత్రమా. రాబోయే కాలంలో తెలుగులో గ్రంధాలు విరివిగా వచ్చే అవకాశం ఉంది.

కన్నడ భాషవలే తెలుగునకు కూడ ప్రాచుర్యం లభించనుంది. ఈ రచనలో తప్పక తోడ్పడతాను.

ఇద్దరం కలిసి పరిశోధన చేసి రచిద్దాము.”

“అయినా.. మంచి ముహూర్తము చూసి ప్రారంబించెదము. నాకు చాలా ఆనందముగా నున్నది.”

…………….

మల్లియ రేచన శ్రావకాభరణుడు. జినవల్లభుడు వాచకాభరణుడు. ఇద్దరి తండ్రుల పేర్లూ భీమనలే.

అందువలనే నేమో ఇరువురి స్నేహం అజరామరమై నిలిచింది. ఒకరు చెప్పేవారూ, ఒకరు వినే వారూ ఉంటే అంతకు మించిన చక్కని స్థితి ఏముంది?

తన గ్రంధం ఆరభంలోనే భూసురుల వరప్రసాదం వలన తా “విమల యసోభాసురనిరతుడ” నయ్యానని చెప్పుకున్నాడు మల్లియ రేచన. . భూసురులంటే జైన బ్రాహ్మణులని అతడి భావం. అప్పటికే జైనంలో కూడా వర్ణాశ్రమ ధర్మాలు చోటు చేసుకున్నాయి.

“పరగిన విమల యశోభా

సురనిరతుడు బీమనాగ్ర సుతు డఖిలకళా

పరిణతుడయ్యెను భూసుర

వరప్రసాదోచిత ధ్రువ శ్రీయుతుడై.”

“జన సుత భీమ తనూజుడు”వినయ సంపన్నుడు కనుకనే భూసురుల ఆశీర్వాదముతో తానింత

వాడనయ్యానని వ్రాసుకున్నాడు.

తనకి గ్రంధం వ్రాయడంలో సహకరించమని అడగడమేకాదు, తన కృతిలో ఆవిషయం చెప్పడం రేచన

సంస్కారాన్ని సూచిస్తుంది.

“అసమాన దానరవి తన

య సమానోన్నతుడు వాచకాభరణుడు ప్రా

ణ సమాన మిత్రు డీ కృతి

కి సహాయుడుగా నుదాత్త కీర్తి ప్రతిన్.”

తన మిత్రుడు సాయపడినట్లే కాక, అతను దాన ధర్మాలను చెయ్యడంలో దాన కర్ణుడికి

సమానమయిన వాడని కీర్తించాడు.. ఎంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం!

తెలుగులో ఇదే ప్రధమ ఛందో గ్రంధం. సంస్కృతంలో వైదిక, లౌకిక వాజ్మయాల ఛందస్సులను

సూత్రీకరించి చెప్పిన పింగళ ఛ్ఛందమునే కాక ఇతర లక్షణ గ్రంధాలను కూడా అధ్యయనం చేసి

రచించిన గ్రంధరాజం ఇది.

“ అనవద్య కావ్యలక్షణ

మొనరుగా గవి జనాశ్రయుండు మల్లియ రే

చన సుకవి కవిజనాశ్రయ

మను ఛందము తెనుగుబాస నరుదుగ జెప్పెన్.”

కన్నడ భాషకూ, తెలుగుకు కూడా సంస్కృత ఛందో గ్రంధాలే ప్రామాణికాలు. ఇంద్ర, సూర్య చంద్ర

గణాలను రేచన తన కవిజనాశ్రయంలో నిర్వచించాడు.

అలాగే అప్పటికే ప్రాచుర్యంలో నున్న గద్యకావ్య లక్షణాలు కూడా చెప్పాడు. .

“హృద్యాన వద్యకావ్యము

గద్యము పద్యమని చెప్పగ ద్వివిధమగున్

గద్యమ పార పదానిక

రద్యోతి తనవ రసార్ద రచనల నెగడున్.”

మల్లియ రేచన పరాక్రమశాలి. సంపన్నులందరికీ యుద్ధ విద్య యందు ప్రావీణ్యత ఉండవలసిందే.

అందులో వణిక్ ప్రముఖులకి మరీ.. దూర దేశాలనుంచి వస్తు విక్రయాదులను నిర్వర్తించాలంటే దారి

దోపిడుల దండయాత్రల నెదుర్కొనక తప్పదు.

యుద్ధ విద్యలలో మెళకువలు నేర్పే పంపనగారి తమ్ముడు జినవల్లభుని పరాక్రమం గురించి

చెప్పుకొనేదేముంది.. మిత్రునికి చేదోడు వాదోడుగా వెనువెంటే నుంటాడు.

మల్లియ రేచన తన కృతిలో అన్ని పద్యాలలోనూ తనని తాను సంబోధించుకున్నాడు. తాను

రమణీప్రియుడనని కూడా చెప్పుకున్నాడు. జిన వల్లభ్హుడైతే తానూ “అంగనా రమయితుం” అని

శాసనంలో నే చెక్కించుకున్నాడు. స్నేహితులిరువురూ శృంగార పురుషులే.

ఛందో గణాలలో శ్రావ్యత కూడా ముఖ్యమనిచెప్పాడు రేచన. అది కావాలంటే పాదాలూ, పాద

మధ్యాలు విరవాలని చెప్పాడు. అదే యతి.

“విశ్రాంతి, విరతి, విశ్రమ

విశ్రామ, విరామ, విరామ విరమణ లనగా

విశ్రుతమగు యతి కృతి కధి

క శ్రావ్యంబై బెడంగుగా నిడవలయున్.”

మొత్తం గ్రంధం అంతా తేట తేట తెలుగు పదాలతో తియ్యగా సాగుతుంది. లక్షణగ్రంధం కూడా కావ్యం

లాగ ఆసక్తితో చదివింప చేస్తుంది.. మధ్యలో శృంగార చెమక్కులతో.

రేచన తన కృతిలో తనని తాను చెప్పుకోవడం, స్నేహితుడైన జినవల్లభుడు తనకు సహాయం

చేశాడనడంతో ఆగి పోలేదు.. స్నేహితుని కూడా చెప్పుకోమనడమే కాక శాసనంలో

చెక్కించుకునేలాగ ప్రోత్సహించాడు. వృషభాద్రిపై చెక్కిన శాసనాలలో మూడు కంద పద్యాలు

చెక్కించాడు. అందులో మచ్చుకి ఒకటి..

“జిన భావనములెత్తించుట

జిన పూజల్ సేయుచున్న జినమునులకు న

త్తిన యన్న దానమీవుట

జినవల్లభు బోలగలరె జిన ధర్మపరుల్.”

ఇంత కష్టపడి మిత్రులిరువురూ కలిసి రాసిన ఛందో గ్రంధము, “కవిజనాశ్రయము”ను, రేచన కాదు

రాసింది, వేములవాడ భీమకవి అని చాలా శతాబ్దాలుగా ప్రచారంలో ఉంది.

దానికి కారణం, రేచన వైశ్యుడవడమేమోనని చాలా మంది అభిప్రాయము. ఏది ఏమైనా.. కొంచెం

అతిగా అనిపించినా రేచన ప్రతీ పద్యంలోనూ తన గురించి చెప్పుకోవడం మంచిదే అయింది. పైగా

స్నేహితుని గురించి చెప్పడం బలమైన సాక్షం అయింది.

ప్రస్థుత కరీంనగర్ జిల్లా బొమ్మలగుట్టపై నున్న శాసనాలను చెక్కించిన జిన వల్లభుడు తెలుగు

వారికి, భారత దేశ చరిత్రకి మహోపకారం చేశాడు. తెలుగులో తొలి ప్రామాణిక గ్రంధం రచించిన మల్లియ రేచన, తెలుగు కావ్యానికి ఒక అందం తీసుకొని వచ్చాడు. ఇరువురూ తెలుగు వెలుగులే.. వారు స్నేహం అజరామరమైనది.

 

 

*————————*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

1 thought on ““తెలుగు వెలుగుల స్నేహం” – చారిత్రక సాహిత్య కథలు – 8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *