May 5, 2024

మౌనరాగం … 2

రచన:  అంగులూరి అంజనీదేవిanjanidevi

 

 

 

 

సూర్యుడు దేదీప్య మానంగా వెలుగుతూ, తను చూడని అందం ఇంకెక్కడైనా దాగి వుందా? అని ప్రపంచంపై పరిశోధన చేస్తున్నాడు.
కాలేజీలో క్లాసులు సీరియస్‌ గా నడుస్తున్నాయి.
సీనియర్స్‌ అంతా కలసి ‘మేనేజ్‌మెంట్‌ మీట్‌’ డేట్‌ని డిక్లేర్‌ చేశారు.  అన్ని కాలేజీలకెళ్లి జూనియర్స్‌ని ఇన్‌వైట్‌ చేశారు.
ఉదయం పదిగంటలకి మేనేజ్‌మెంట్‌ మొదలైంది.
సీనియర్స్‌ చెప్పినట్లుగానే జూనియర్స్‌ ‘డ్రస్‌కోడ్‌’లో వచ్చారు.
అభిరాం సీనియర్‌ కాబట్టి వర్క్‌ బిజీలో వున్నాడు.
లక్ష్యాన్వేష్‌ దేదీప్యతో మాట్లాడాలని ఎంత ట్రై చేసినా చాన్స్‌ యివ్వలేదామె. ఇక లాభం లేదనుకొని ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. అతని మనసెక్కడుందో కావ్యకి తెలుసు. దేదీప్యాతో మాట్లాడే అవకాశం కల్పించమని అతను కావ్యను ఎన్నోసార్లు అడిగాడు.  ఎలాగైనా తామిద్దర్ని కలపమని రిక్వెస్ట్‌ కూడా చేశాడు. కావ్య మొబైల్‌కి కాల్‌ చేసి దేదీప్య కిమ్మనేవాడు.  మెసేజ్‌లు పంపి  దేదీప్యకి చూపించమనేవాడు.  మొబైల్‌ వైపు చూడకుండానే ‘‘నాకిలాంటివి నచ్చవు  కావ్యా’’, అనేది దేదీప్య. కావ్యకి ఏం చేయాలోతోచేది కాదు.  దేదీప్య తనని గుర్తించి, ప్రేమించాలన్న పట్టుదల అతనిలో రోజురోజుకి పెరుగుతోంది.
డిఫరెంట్‌ కాలేజీల నుండి వచ్చిన ఇంట్రెస్ట్‌ వున్న జూనియర్స్‌ని పిలిచి సీనియర్స్‌, బిజినెస్‌ క్విజ్‌, బిజినెస్‌ బాజీగర్‌, మార్కెటింగ్‌ వార్‌ ఫేర్‌ గేమ్స్‌ని కండక్ట్‌ చేస్తున్నారు.
దేదీప్య యాక్టివ్‌గా ‘యాకంరింగ్‌’ చేస్తూ అందర్ని ఆకట్టుకుంటోంది. దేదీప్యని ‘మేడమ్‌, మేడమ్‌’ అంటూ అదర్‌ కాలేజి స్టూడెంట్స్‌ ఎవరెవరికి ఎక్కడ గేమ్స్‌ కండక్ట్‌ చేస్తున్నారో డౌట్స్‌ క్లియర్‌ చేసుకుంటున్నారు.
అందరిలో దేదీప్య ఎక్కడ కన్పిస్తే అక్కడ అందమైన బట్టర్‌ఫ్లై వాలినంత అందంగా అన్పిస్తుంటే లక్ష్యాన్వేష్‌ తన సెల్‌తో ఫోటోలు తీసుకున్నాడు.
ఫార్మల్‌ యాక్టివిటీస్‌ ముగిసిన తర్వాత ఇన్‌పార్మల్‌ యాక్టివిటీస్‌ సాయంత్రం ఐదుగంటలకి మొదలయ్యాయి.
ఇన్‌ఫార్మల్‌ యాక్టివిటీస్‌కి కూడా యాంకరింగ్‌ గా దేదీప్యనే చేస్తోంది.  గోల్డ్‌ కలర్‌ శారీలో వున్న దేదీప్య చందనాబ్రదర్స్‌ యాడ్‌లో కన్పించే మోడల్‌లా అన్పిస్తుంటే అందరి చూపులు ఆమె మిాదనే వున్నాయి.
అదే విషయము దేదీప్యతో చెప్పాడు లక్ష్యాన్వేష్‌.
అభిరాం మాట్లాడితే వినాలని, తనని గుర్తిస్తే బావుండని తనవైపు చూస్తున్నాడో లేదోనని మధ్య, మధ్యలో అభిరాంనే చూస్తున్న దేదీప్యకి లక్ష్యాన్వేష్‌ మాటలు రుచించలేదు.  పైగా తన అందానికి దాసోహం అనేవాళ్లు పేలే  ప్రేలాపనలా అన్పించి నిర్లక్ష్యంగా పక్కకి తిరిగింది. ఆమె నిర్లక్ష్యపు నిశ్శబ్దంలో అతనికి పట్టు పరికిణిలో గుండ్రంగా తిరిగే పసిపిల్ల మొండితనం కన్పించింది.
చివరగా `లక్ష్యాన్వేష్‌ ‘దూమ్‌`2’ హిందీ సినిమాలోని సాంగ్‌కి దేదీప్య నే చూస్తూ డాన్స్‌ చేస్తుంటే, తననే చూస్తున్నాడని గమనించి కోపాన్ని పంటి బిగువున అణచుకుంటూ కావ్య దగ్గరికి వెళ్లి కూర్చుంది.
‘‘అన్వేష్‌ ఎంత బాగా డాన్స్‌ చేస్తున్నాడే. అతని బాడీ చూడు ఎంత ప్లెక్సిబుల్‌గా వుందో….’’ అంటూ అతన్నే చూస్తోంది కావ్య. ఒక్క క్షణం కావ్య వైపు చూసి…
‘‘ఆ డాన్స్‌ ఏందో, ఈ ఇంట్రస్ట్‌ ఏందో నాకైతే అర్థం కావడం లేదు’’. అంది దేదీప్య.
ఆ డాన్స్‌ అయ్యాక ‘ మేనేజ్‌మెంట్‌ మీట్‌’ ముగిసింది.
బాగా ఆలసిపోయిన దానిలా ఆవులిస్తూ తన చేతిని నోటి దగ్గర పెట్టుకున్న దేదీప్య సడన్‌గా తన ముందుకొచ్చి నిలబడిన లక్ష్యాన్వేష్‌ని చూసి ఉలిక్కిపడిరది. కావ్యకూడా ఇంచుమించు స్థితిలో వుంది.
‘‘నీ ఆవులింత కూడా నా కళ్లకి అందంగా వుంది దేదీప్యా!’’ అన్నాడు అతని మాటలకి కావ్య బిత్తరపోయింది. దేదీప్య ఏ మాత్రం తడబడకుండా.
‘‘ఓ.కె. ఒప్పుకుంటున్నా. అందంగా వుంది. అయితే ఏంటి?’’ అంది పొగరుగా తలఎగరేస్తు. ఆమెకు అతని దోరణి నచ్చటం లేదు.
వాళ్లు ముగ్గురు కాలేజి నుండి బయటకొచ్చి నడుస్తున్నారు. మేటర్‌ సీరియస్‌ అయ్యేలా వుందన్న భయంతో.
‘‘అన్వేష్‌! నువ్వు నీ కారులో వెళ్లు. మాతో నడవటం ఎందుకు’’? అంది కావ్య.
‘‘ప్రస్తుతం మీతో నడవటమే ఇష్టంగా వుంది. అందుకే నడుస్తున్నాను. నాకు ఆనందం లేని పని నేను ఏదీ చెయ్యను. అలా అని నేను స్వార్థపరుడ్ని కాదు.’’ అన్నాడు లక్ష్యాన్వేష్‌.
‘‘మెటారియలిస్ట్‌వా?’’ అంది కావ్య ‘‘అది కూడాకాదు ఎందుకంటే మెటీరియలిస్ట్‌ అనేవాడు అస్తమిస్తున్న సూర్యుడ్ని చూడటం కూడా టైం వేస్ట్‌ అనుకుంటాడట. నేనలాకాదు. అస్తమిస్తున్న సూర్యుడ్ని చూస్తూ కూడా ఆనందించగలను. అలా ఆనందిస్తూ జీవితానికి స్ఫూర్తినిస్తూ గడిపెయ్యాలనన్నదేనా ఆకాంక్ష’’. అన్నాడు.
దేదీప్యతో వాళ్ల క్లాస్‌ బాయిస్‌ ఎవ్వరూ ధైర్యంగా మాట్లాడరు. అది తెలుసు కావ్యకి.
‘‘ నీకు భయం లేదా అన్వేష్‌?  ఇలా మా వెంట….’’ అంటూ మధ్యలో ఆపేసింది. కావ్య ఏం మాట్లాడబోయిందో అతనికి అర్థమైంది.
‘‘భయం దేనికి కావ్యా! నేను ఇష్టపడ్తున్న అమ్మాయి నడుస్తున్న ఈ నేలను సైతం పదిమందిలో ముద్దుపెట్టుకోవటానికి కూడా నేను వెనుకాడను. అయినా నా మనసులోకలిగే భావాలను బయటపెట్టుకుంటే తప్పేంటి?  అప్‌కోర్స్‌ దానికి కూడా ధైర్యం కావాలనుకో….’’ అన్నాడు అన్వేష్‌.
లక్ష్యాన్వేష్‌ లాంటి వ్యక్తి మనసులో స్థానాన్ని సంపాయించుకున్న ఏ అమ్మాయి అయినా అదృష్టవంతురాలే. ఎందుకంటే అన్వేష్‌ లాంటి వాళ్లు తమలో పుట్టిన భావాన్ని తమ దోసిలిలో నింపుకొని జుర్రుకుంటారు. జుర్రుకోవటమే కాదు, ఆ భావాన్ని వేళ్ల సందుల్లోంచి జారిపోకుండా కాపాడుకుంటారు. అని మనసులో అనుకుంది కావ్య.
‘‘దీనికి నీ ప్రతిస్పందన ఏంటి దేదీప్యా?’ అంది కావ్య
‘‘ ఆ… ఇదో స్పందన! దీనికో ప్రతిస్పందన మళ్లా!’’ అంటూ కోపంగా నడుస్తున్న దేదీప్య కాలికి రాయి తగిలింది.
‘‘అబ్బా…’’ అంటూ ఏ దిక్కుకు చూడాలో తెలియని దానిలా మెల్లగా తన కాలివైపుచూసుకుంది.
‘‘చూసి నడువు దేదీప్యా!’’ అంటూ ఇద్దరు ఒకేసారి కంగారుగా ఆమె కాలివైపు చూశారు.
‘‘ఇట్స్‌ ఓ.కె.’’ అంది దేదీప్య.
అందరు ఇల్ల్లు చేరుకున్నారు.
‘మేనేజ్‌మెంట్‌ మీట్‌’ ఎలా జరిగింది వదినతో చెప్పి తన గదిలోకి వెళ్లింది దేదీప్య.
గదిలోకి వెళ్లాక ఒంటరిగా అన్పిస్తూ, అభిరాం గుర్తొచ్చాడు. ఆమెకు ప్రతిరోజు డైరీ రాసుకునే అలవాటు వుంది.
డైరీ చేతిలోకి తీసుకొని మెల్లగా బయటకొచ్చి బాల్కనీలో లైటు వేసి పూలకుండీల దగ్గర కూర్చుంది దేదీప్య.
వెన్నెల్లో ముడుక్కొని ఊరంతా నిద్రపోతోంది.
అభిరాం తలపుల చలిలో, తడిసిన చామంతిలా ఆమె మనసు వణుకుతోంది.
వెన్నెల్లో కొబ్బరాకునీడ ఆమె మీదపడి గాలికి కదులుతోంది.  తనకు నచ్చిన కౌగిలి నుండి విడివడి బద్దకంగా వళ్లు విరుచుకునే అమ్మాయి జడలోంచి రాలిన విరజాజుల్లా అక్కడే ఏపుగా పెరిగిన సన్నజాజి చెట్టులోంచి పువ్వులు రాలి తన పరిమళాన్ని అందిస్తున్నాయి.
దేదీప్య యాంకరింగ్‌ చేస్తున్నంతసేపు ఆమె చూపులు అభిరాం మీదనే వున్నాయి. అభిరాంని చూస్తున్నంతసేపు గాలికికదిలే నీటి అలల్లా ఆమె హృదయంలో  ఏదో కదలిక కంటిన్యూ అయింది. ఆమె చెక్కిలి చైతన్యం కళ్లలోకిపాకి పెదవి వంపులో కదలి, భావకెరటమై సున్నితంగా అతని చూపుల్ని ముద్దాడింది. ఆమె చెప్పే మాటలకి కదిలే ఆమె పెదవుల్ని అతను తన చూపులతో తాకి పులకించినట్లే ఫీలయింది. ఇప్పుడది ఓ అనుభూతిగా మారి ఆమె మనసులో దాహాన్ని పెంచుతోంది.
ఆ అనుభూతి సంతోషంగా మారి ఆమె పెదవులపై చిరునవ్వు అయింది.
ఆశ్చర్యం కాకపోతే!  ఈ సంతోషం తాకినంత బలంగా యింకే సంతోషం మనసును తాకదా? ఇదే సంతోషమా? తను సరిగ్గా పోల్చుకోలేకపోతోంది కాని దాహమే కాదు ఆకలిగా కూడా వుంది. ఈ ఆకలే ప్రేమేమో! ప్రేమ ఒక ఆకలా? తనిప్పుడు ఆ ఆకలితోనే బాధపడ్తుందా? కడుపు ఆకలి తీరకపోతే మనిషి బ్రతకలేనట్లు ప్రేమ ఆకలి తీరకపోతే మనసుబ్రతకదా?
ప్రపంచంలో అందరు హాయిగా నిద్రపోతుంటే తనొక్కతే ఒంటరిగా నిద్రపట్టక యిలా కూర్చోవటమేమిటి? దీన్నే ప్రేమంటారా?  అంతకన్నా యింకేమీ అనలేరా?  ఏ కవి చెప్పినా ఈ పేరే చెబుతున్నాడు. తనలో కలుగుతున్న ఈ భావానికి, ఈ బాధకి ఈ పేరు సరిపోదేమో యింకేదైనా కొత్తపేరు పెడితే బావుండు.            వెంటనే తన డైరీలో పేజీని తిప్పి` అభిరాంను తలచుకుంటూ తన మనసులోంచి ధారగా కారుతున్న కొన్ని వాక్యాలను ఇలా రాసుకొంది.
అభీ!
ఆకాశం నిండా పరచుకున్న వెన్నెల్ని మేఘాలు కప్పేశాయి

అప్పుడే వచ్చిన చిరుగాలి మేఘాలను ముద్దాడి కరిగించి కదిలించింది…
మేఘాలు అలాతప్పుకోగానే వెన్నెల నావైపే చూస్తోంది…
నా కనురెప్పల చాటున నువ్వున్నావని తెలుసుకొని
నీ అనుభూతుల వేడిలో కాలుతున్న నన్ను చూసి
మళ్లీ మేఘాల చాటుకెళ్లి దాక్కుంది వెన్నెల…
నీ ద్యాసే నా శ్వాసగా మార్చుకున్నానని తెలిసి
నా దగ్గరకి రాకుండా చిరుగాలి దూరమైంది…
నీ ఊపిరిని నా ఊపిరిగా మార్చుకొని.
నీ తలపుల వేడిలో కాలుతూ….
నేనిక్కడ అనుభవిస్తున్న ఈ రంపపు కోత, నీకెలా తెలియాలి? అని ఆఖరు వాక్యం పూర్తి చేస్తుండగా… అవసరార్థం నిద్ర లేచిన అపురూప బాల్కనీలో వున్న దేదీప్యను చూసి
‘‘దేదీప్యా! ఈ టైంలో అక్కడున్నావేం?’’ అంది
‘‘చదవుకుంటున్నాను వదినా!’’ అని దేదీప్య అనగానే నిద్రమత్తులో వున్న  తన కళ్లను సరిగ్గా విప్పకుండానే ఆవులిస్తూ.
‘‘సరే’’, అంటూ అక్కడ నుండి వెళ్లింది అపురూప.
వదిన అలా వెళ్లగానే దేదీప్య కూడా లేచి బాల్కనీలో లైటు ఆపేసి, తన గదిలోకి వెళ్లి పడుకొంది.
డైరీని పిల్లో క్రింద పెట్టుకొంది.
ఇంత రాత్రి వరకు నిద్రపోకుండా ఎప్పుడూ లేదు దేదీప్య.  సంతోషం మిళితమై గుండెను హోరెత్తించే ఈ బాధ ఎవరితోనైనా చెప్పుకోవాలనిపిస్తోంది.
తన ఫ్రెండ్స్‌ గుర్తొచ్చారు.
తనకుండే ఫ్రెండ్సంతా ఆకాశం మీదికి ఆశల్ని విసిరి ఇరుకు, ఇరుకు గదుల్లో చేరి అక్షర తపస్సు చేస్తున్న వాళ్లే. వాళ్ల ముఖాల్లో ఎప్పుడు చూసినా ఇబ్బందులు, బంధాలు, స్నేహాలు, గౌరవమర్యాదలు తాండవమాడుతుంటాయి.  ఏ పుస్తకాల్లో దొరకని జీవితానుభవం వాళ్లలో కన్పిస్తుంది.  ఎప్పుడు చూసినా క్షణం తీరిక లేనివాళ్లలా వుంటారు.  ఇంకొంతమంది లేడీస్‌ హాస్టళ్లలో  వుంటూ అది బాగలేదు,  ఇది బాగలేదు అని మేనేజ్‌మెంట్‌ను తిట్టుకుంటూ, వున్న టైమంతా చేతులారా కాల్చేసుకుటుంటారు.
పోస్టల్‌ కాలనీలో రూములు అద్దెకి తీసుకొని వుంటున్న తన ఫ్రెండ్స్‌ని ఎప్పుడైనా కలసి కొద్దిసేపు వాళ్లతో గడపాలని వెళ్తే….
‘‘ ఏం చెయ్యను దేదీప్యా! నీతో మాట్లాడే ఓపిక కూడా లేకుండా అయింది నాకు. ఈ రోజు నీళ్లు పట్టడం, వంట చేయ్యటం, గది శుభ్రపరచటం నా వంతు.’’ అంటూ ‘‘లైట్‌ తీసుకో’’ అంటుంది.
ఇంకో ఫ్రెండ్‌ దగ్గరికి వెళ్తే…
‘‘నేనొక ఫ్రెండ్‌ రూంలో వుంటున్నాను దేదీప్యా! దాని ఫ్రెండ్స్‌ ఒకరిద్దరు మా రూంకి వస్తూనే వుంటారు. కలసి భోం చేస్తాం.  కబుర్లు చెప్పుకుంటాం.  హాపీ. కాని వాళ్లు వెళ్లేటప్పుడు   నేను రూంలోనే వున్నా  నాకా విషయం చెప్పకుండా వెళ్తారు.  అదేం కర్టసీనో అర్థం కాదు.  నా డైరీని దొంగచాటుగా చదివి నన్ను హర్ట్‌ చేస్తారు.   చిన్న చిన్న వాటికే అలిగి చిరాకుపడ్తారు.  మొహం మాడ్చుకుంటారు. వాళ్లను ఎలా ఓదార్చాలో తెలియక రూంలో ఫ్రీగా వుండలేకపోతున్నా’’ అంటూ కొన్ని ఇబ్బందుల్ని తన పర్సనల్‌ ఫీలింగ్స్‌తో ముడిపెట్టి వాపోతుంటుంది.
మరో ఫ్రెండ్‌ అయితే….
ఎప్పుడు చూసినా హెయిర్‌స్టైల్‌ మార్చటం, జుట్టుకి రంగేయటం, ముఖారవిందం కోసం హెర్బల్‌ షేషియల్‌, ఒంటినొప్పుల ఉపశమనం కోసం బాడీ మసాజ్‌లు శరీరాన్ని తేలిక చేసే స్టీమ్‌బాత్‌లు, ఇలా రకరకాల బాడీ ప్యాకేజిల గురించే ఆలోచిస్తుంది.  ఒక్కటీ ఫర్‌ఫెక్ట్‌గా చెయ్యకుండా ఫలితాలను ఆశిస్తూ, ఆందోళన పడ్తుంది.  ఇకపోతే కావ్య! ఆమె దృష్టిలో అన్వేష్‌ మాత్రమే వీరుడు, శూరుడు, విక్రమార్కుడు. ఇలాంటి తన ఫ్రెండ్స్‌తో తన ఫీలింగ్స్‌ని, తన బాధని ఏమని చెప్పుకోగలదు.  ఏమని పంచుకోగలదు. వాళ్లు గుర్తురాగానే తీగలేని వీణలా అయింది దేదీప్య.
*     *     *     *    *

బాల్కనీలో ` కుండీల్లో వున్న మొక్కలకి విరబూసిన ఎర్రగులాబి రేకులపై చేరుకున్న మంచు బిందువులు నేలమీద పడటానికి సిద్ధంగా వుంటే ఆసక్తిగా చూస్తూ మొక్కలకి నీళ్లు పోస్తున్న దేదీప్యకి ఆరోజు సెమినార్‌ గుర్తొచ్చింది.
సెమినార్‌కి సంబంధించిన టాపిక్‌ని ప్రిఫేర్‌ అయింది. కానీ సరిగ్గా చెప్పగలనో లేదోనని టెన్షన్‌గా వుంది.
అంతలో ‘అపురూపా!’’ అంటూ బామ్మ పైకి రావటంతో అభిరాం గుర్తొచ్చాడు దేదీప్యకి.  అతని దగ్గరికి వెళ్లి ఏమైనా ‘ఇన్‌స్ట్రక్షన్స్‌’ తీసుకోవాలని వెంటనే క్రిందకి దిగింది దేదీప్య.
అభిరాం లేడు. తాతయ్య వున్నాడు.
అభిరాం కోసం వెయిట్‌ చేస్తూ తాతయ్యతో మాట్లాడుతూ కూర్చుంది దేదీప్య.
‘‘అంపశయ్య తీసికెళ్లావు కదా! ఎలావుంది దేదీప్యా?’అడిగాడు తాతయ్య.
‘‘చదువుతుంటే ఇంట్రస్టింగ్‌ గా వుంది తాతయ్యా!’’ అంది దేదీప్య.
‘‘నువ్వు చదవాల్సిన నవలలు ఇంకా వున్నాయి దేదీప్యా!’’ అన్నాడు
‘‘ఏమున్నాయి తాతయ్యా?’’ కుతూహలంగా అడిగింది.  మనసులో సెమినార్‌ భయం వున్నా…..
‘‘అడవి బాపిరాజు రాసిన కోనంగి, నారాయణరావు, తుఫాను, శరత్‌ రాసిన దేవదాసు, శ్రీకాంత్‌, చరిత్రహీనులు, ఉన్నవ లక్ష్మినారాయణ గారి మాలపల్లి బుచ్చిబాబుది చివరకి మిగిలేది. చలం రచించిన జీవితాదర్శం ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా…..’’ అంటూ ఆయన ఇంకేదో అనబోతుంటే.
‘‘ఇవన్నీ లైబ్రరీలో తెచ్చుకొని చదివాను తాత్యయ్యా! విశ్వనాథ సత్యనారాయణ గారి వేయిపడగలు కూడ చదివాను’’.  అంది.
‘‘ ఇవి చాలా మంచివి, చెప్పుకోదగినవి.’’ అన్నారాయన మెచ్చుకోలుగా.
‘‘ మంచి నవలల జాబితాలో ఎవరు చెప్పినా వీటినే చెబుతున్నారు. ఆ రచయితలు కూడా యిప్పుడు లేరు. అఫ్‌కోర్స్‌ రచనలు బ్రతికే వుంటాయనుకోండి! వీటి తర్వాత కూడా మంచి రచనలు వచ్చాయి.  ఆ
రచనల్ని కూడా గుర్తించాలి కదా! మరెందుకు గుర్తించరు? ఎందుకు మెన్షన్‌ చెయ్యరు? ఎందుకు మెచ్చుకోరు? గుర్తించబడాలి అంటే ఆ  రచయితలు చనిపోవాలా? చనిపోయాకనే గుర్తించబడతారా?’’ అంది దేదీప్య.  నెమ్మదిగా అన్నా అంతర్గతంగా కాస్త బాధ ధ్వనించింది.
‘ ఈ మద్య కాలంలో అంత మంచి రచనలు…. ’’ అని ఆయన ఏదో అనబోయేలోపల
‘‘ వచ్చాయి తాతయ్యా! డా॥కేశవరెడ్డి రాసిన అతను అడవిని జయించాడు, మూగవాడి  పిల్లనగ్రోవి మంచి రచనలు కావా? అల్లం రాజయ్య రాసిన కొలిమి అంటుకున్నది.  కూడా మంచి రచనే ఇలా చెప్పుకుంటూ పోతే యింకా వున్నాయి.’’ అని ఆమె అంటుంటే దేదీప్యలోని సాహిత్య పిపాస, పరిజ్ఞానం చూసి మనసులో మెచ్చుకోకుండా వుండలేకపోయాడు.
‘‘ ఈ మధ్యన మీరేమైనా రాశారా తాతయ్యా?’’ అంది దేదీప్య కాలేజీలో క్లాసులు మొదలయ్యాక తాతయ్యను కలవటం అంతగా కుదరటం లేదు దేదీప్యకి.
‘‘రాశాను దేదీప్యా ! ఇప్పుడే పూర్తయింది. ఎలావుందో చదివి చెప్పు? ’’ అంటూ అప్పటి వరకు రాసిన కవితను దేదీప్య కి యిచ్చాడు.  ఆయన అక్షరాలు ముత్యాల్లావుండి ఈజీగా అర్థమవుతాయి. కవిత చదవటం మొదలుపెట్టింది దేదీప్య.
మరచిపోలేని నీ జ్ఞాపకాల కలల కుంచెలోంచి
అసంపూర్ణ చిత్రంలా బయటపడ్డ నిన్ను
నా చేతులలో తడిమి, చైతన్యం రాసి
విజ్ఞానం అద్ది ఒద్దికగా, ముద్దు, ముద్దుగా
పూతరేకుల పొట్లంలా ఒదిగి వుంటానన్న నీకు
స్వేచ్ఛని, స్వచ్ఛమైన విలువల్ని నేర్పి
నువ్వు నువ్వుగా నిలబడగలిగావన్న ధైర్యం నాకొచ్చాకనే
తేనెలమూటల పూటల్లాంటి నీ పెదవుల చివరన మెరిసిన
రసరమ్య పదాలను ఆవిష్కరిస్తున్నా …
నా మనసు కలానికి నిన్ను అంకితమిస్తున్నా …
కవిత చదవటం పూర్తి అయింది.
కవిత చదవమనగానే ఆయన రాసే వ్యాసాల్లాగే కవిత కూడా సీరియస్‌గా వుంటుందేమోనని భయపడింది.  ఒకే వాక్యంగా, ధారగా సాగి మీనింగ్‌పుల్‌గా, మధురంగా వున్న ఆ కవిత దేదీప్యను బాగా ఆకట్టుకొంది.
తాతయ్య యిలాంటి కవితలు కూడా రాస్తారా అని ఆశ్చర్యపోయింది.  కవులెప్పుడు కుర్రవాళ్లే మానసికంగా అనుకొని దీర్ఘంగా శ్వాసించింది.
‘మార్వ్‌లెస్‌ తాతయ్యా! పెంటాస్టిక్‌!’’ అంది వెంటనే ఎమోషన్‌ల్‌గా ఫీలవుతూ.
సంతోషపడ్డాడు నారాయణరావు.
వాకింగ్‌కెళ్లిన అభిరాం లోపలికి రాగానే
‘‘అభీ! నీ కోసం దేదీప్య వచ్చింది.’’ అంటూ గట్టిగా పిలిచాడు నారాయణరావు.
చుట్టుప్రక్కల మామ్మ వుందేమోనన్న భయంతో కంగారుగా అటు, ఇటు చూశాడు. మామ్మ లేదక్కడ.
‘‘నా కోసం దేదీప్య వచ్చిందా? నాతో ఏం పని? మామ్మ చూసిందంటే నా పని అయినట్లే అని మనసులో అనుకుంటూ తాతయ్య పిలిచింది విన్పించినా వినపడనట్లే తన గదివైపు నడిచాడు.
అభిరాంకి అమ్మాయిలంటే భయం లేకపోయినా అతని కోసం ఇంటికి వచ్చే అమ్మాయిలు ఎవరు లేరు.  అలావచ్చే అవకాశం ఎవరికి యివ్వడు.  అందాక ఎవర్ని రానివ్వడు.  అలా రానిస్తే ఇందుమతి సహించదు.  ఇందుమతి అంటే అభిరాంకి భయం.
‘‘అభీ! నిన్నే ! ఇలారా!’’ అన్నాడు నారాయణరావు.
ఇక తప్పదన్నట్లుగా, మామ్మకూడ లేదన్న ధైర్యంతో వెళ్లి తాతయ్యకి ఎదురుగా కూర్చున్నాడు.
‘‘దేదీప్య నీతో పనివుండి వచ్చిందట.’’ అన్నాడు తాతయ్య దేదీప్య మీదున్న అభిమానంతో ఆమె వచ్చిన పనిని వెంటనే చేసిపెట్టాలన్న ఉద్దేశంతో.
‘‘చెప్పు దేదీప్యా! ఏదైనా మెటీరియల్‌ కావాలా?’’ అంటూ ఒక జూనియర్‌ని సీనియర్‌ అడిగినట్లే అడిగాడు.
‘‘రేపు నాకు సెమినార్‌ వుంది. ప్రిపేర్‌ అయ్యాను. కానీ ఏదో భయంగా వుంది’’. అంది తనకిచ్చిన టాపిక్‌ గురించి చెబుతూ.
‘‘ఇందులో టెన్షన్‌ పడాల్సింది ఏం లేదు దేదీప్యా! సెమినార్‌ ఇచ్చేటప్పుడు ఏ ఒకరివైపు చూస్తున్నట్లుగా  కాకుండా క్లాసులో అందర్ని అబ్జర్వ్‌ చెయ్యి. తప్పయినా, రైటయినా తడబడకుండా గట్టిగా చెప్పు.  ఒకవేళ మరచిపోయినా నెక్ట్స్‌ టాపిక్‌ కంటిన్యూ చెయ్యి.  కానీ సడన్‌గా ఆపెయ్యకు. ఈ టాపిక్‌కి సంబంధించిన మెటీరియల్‌ నా దగ్గర యింకా కొంచెం వుంది ఇస్తాను’’. అంటూ తన గదిలోకి వెళ్లి మెటీరియల్‌ తెచ్చి దేదీప్యకి యిచ్చాడు అభిరాం.
అభిరాంకి ‘థ్యాంక్స్‌’ చెప్పి, ‘మళ్లీ కలుస్తాను తాతయ్యా’ అంటూ పైకెళ్లింది దేదీప్య.

*     *     *     *     *

రోజులు గడుస్తున్నాయి.
సౌత్‌ ఇండియా టూర్‌ వెళ్లిన నారాయణరావు, ఇందుమతి ఇంకో రెండు రోజుల్లో ఇంటికొస్తున్నామని అభిరాంకి ఫోన్‌ చేశారు.
ఇంతవరకు రామేశ్వరం, కన్యాకుమారి, చిదంబరం, త్రివేండ్రం, కేరళ చూశామని చెప్పారు.  ఇంకా చూడబోయే కొన్ని ఊర్లపేర్లు చెప్పారు.
అపురూపకి నెలలు నిండాయి.
మెటర్నిటి లీవ్‌ పెట్టి ఇంట్లోనే వుంది.
రాత్రి ఎనిమిది గంటలయింది.
దివాన్‌ మీద కూర్చుని అపురూప టీ.వి చూస్తుంటే, సోఫాలో కూర్చుని దేదీప్య చదువుకుంటోంది.
‘‘కూర్చోలేక పోతున్నాను. దేదీప్యా ! నేను వెళ్లి నా రూంలో పడుకుంటాను. నువ్వు టి.వి.ఆఫ్‌ చేసి చదువుకున్నాక లైటాపేసి పడుకో.’’ అంటూ దివాన్‌ మీద నుండి మెల్లగా లేచింది అపురూప.
‘‘సరే! వదినా!’’ అంటూ ‘రిమోట్‌’ అందుకొని టి.వి.     ఆఫ్‌ చేసింది దేదీప్య.
అపురూప తన బెడ్‌రూంలోకి వెళ్లి పడుకొంది. పడుకోగానే నడుం బాగా నొప్పి అన్పించి, నెమ్మదిగా బెడ్‌మీద నుండి లేచి డాక్టర్‌ ఇచ్చిన టాబ్‌లెట్‌ వేసుకొని మళ్లీ బెడ్‌పై పడుకొని కళ్లు మూసుకొంది.
అపురూపకి నొప్పి ఎక్కువైంది.  ఆ నొప్పిని భరించలేకపోతుంది.  దేదీప్యను పిలిచింది.
వదిన పిలుపు వినగానే, చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి వదిన దగ్గరకి వెళ్లింది.
‘‘నడుం నొప్పి ఎక్కువగా వుంది దేదీప్యా! డాక్టర్‌ దగ్గరకి వెళ్లాలి. ఆటో పిలిపించు’’. అంది బాధను దిగమింగే ప్రయత్నం చేస్తూ వదినకు నొప్పిగా వుందని గ్రహించిన దేదీప్యకి టెన్షన్‌ ఎక్కువైంది.
పని మనిషి ఆరుగంటలకే ఇంటికెళ్లింది.
అన్నయ్య హైదరాబాద్‌లో వున్నాడు.
బామ్మా, తాతయ్య టూర్‌ వెళ్లారు.
ఇరుగు, పొరుగువాళ్లతో దేదీప్యకి పెద్దగా పరిచయం లేదు.
ఇప్పుడెలా? తనేం చేయాలి? ఆలోచనలో పడింది దేదీప్య
రాత్రి తొమ్మిది గంటలు దాటుతోంది.
ఈ టైంలో బామ్మ వుంటే బావుండేది. పెద్దవాళ్లెవరూ లేకపోవడం వల్ల దేదీప్యకి కంగారుగా వుంది. బాధగా, భయంగా వదిన వైపు చూస్తున్న దేదీప్యకి ఏం చేయాలో తోచక చెమటలు పోస్తున్నాయి.
‘‘డాక్టర్‌ గారు ఇచ్చిన డెలివరీ డేట్‌ ఇంకా రాలేదు కదా! అప్పుడే ఈ పెయిన్సేంటి?’’ అని తనలో తను అనుకుంటూ పైకే అనేసింది.
‘‘ ఒక్కోసారి డాక్టర్‌ చెప్పినట్లు జరగకపోవచ్చు. నాకు  డెలవరీ పెయిన్స్‌ స్టార్ట్‌ అయినట్లుగా వుంది’’. అంది అపురూప.
‘‘ ఆ..  ’’ అంటూ వణికింది దేదీప్య.
అన్నయ్యకి ఫోన్‌ చేద్దామని సెల్‌ కోసం వెతుకుతున్న దేదీప్యను వారిస్తూ…
‘‘ఫోన్‌ తర్వాత చేద్దాం. వెళ్లి అభిరాంని పిలువు.
వెంటనే అభిరాం కోసం క్రిందికి దిగింది దేదీప్య.
హోటల్‌ కెళ్లి భోంచేసి రావాలని ‘లాబ్‌టాప్‌’ క్లోజ్‌ చేస్తూ లోపలికి వస్తున్న దేదీప్యను చూసి ఆశ్చర్యపోయాడు.
‘అభీ’ అంటూ ఆత్రంగా పిలిచింది దేదీప్య. ఆమె తన పేరును షార్ట్‌కట్‌లో పిలవడం గమనించాడు అభిరాం.

మామ్మ కూడా లేదు. ఈటైంలో దేదీప్య ఎందుకొచ్చింది. అడగలేదు కాని అదే భావంతో చూశాడు.
‘‘వదినకు పెయిన్స్‌ స్టార్ట్‌ అయ్యాయి. వెంటనే వెళ్లి ఆటోని పిలువు’’. అంటూ ఎన్నో సంవత్సరాలుగా పరిచయం వున్న వ్యక్తితో చెప్పినట్లు చెప్పి, పైకి వెళ్తున్న దేదీప్యను చూసి ఆశ్చర్య పోతూ, ఆటో కోసం వెళ్లాడు.
నిముషాల మీద ఆటో వచ్చి ఇంటిముందు ఆగింది.  అభిరాం పైకి వెళ్లే లోపల దేదీప్య, అపురూప మెట్లు దిగుతూ కన్పించారు.  బరువుగా, బాధగా నడిచే శక్తి కూడా లేనట్లున్న అపురూపను తన రెండు చేతులతో పొదివి పట్టుకొని, నిదానంగా మెట్లు దిగటానికి హెల్ప్‌ చేస్తోంది దేదీప్య.
నిండుగా వున్న అపురూపను క్రిందకి నడిపించే లోపలే దేదీప్యకి ఉచ్చ్వాస నిశ్వాసలు ఎక్కువయ్యాయి.
ఆటో దగ్గర తన బైక్‌ ఆపుకొని నిలబడి వున్నాడు అభిరాం అతన్నలా చూస్తుంటే ‘నేనున్నాను భయపడకండి’! అని ధైర్యం చెబుతున్నట్లుంది.
అపురూపను నెమ్మదిగా ఆటో ఎక్కించి తనూ ఎక్కింది దేదీప్య.
శ్రీదేవి ధియటర్‌కి ఎదురుగా వుండే కళ్యాణి హాస్పిటల్‌కి పోనియ్‌మని ఆటో అతనితో చెప్పారు. ఆటో కదలింది.
అభిరాం బైక్‌ ఆటో వెనకాలే వెళ్లింది.
ఆటో వెళ్లి హాస్పటల్‌ ముందు ఆగింది.
దేదీప్య అపురూపను క్రిందకి దింపి, లోపలకి నడిపించే లోపలే అభిరాం తన బైక్‌ను ఒక సైడ్‌కి పార్క్‌ చేసి, దేదీప్య, అపురూపల వెంట లోపలకి నడిచాడు.
కన్సల్టింగ్‌ రూం ముందు నర్స్‌ నిలబడి వుంది.
అక్కడున్న చెయిర్స్‌లో పేషంట్స్‌ కూర్చుని వున్నారు.
ఎమర్జన్సీ కేసు కాబట్టి అపురూపను ఓ.పిలో కూర్చోబెట్టకుండా, డాక్టర్‌ దగ్గరున్న పేషెంట్‌ బయటకు రాగానే లోపలకి తీసికెళ్లింది నర్స్‌.
అపురూపను టెస్ట్‌ చేసి, ఇంజక్షన్‌  చేసింది. డా॥అంజనీదేవి. వెంటనే అపురూపను తీసికెళ్లి పక్కరూంలో పడుకోబెట్టింది నర్స్‌.
అప్పుడప్పుడు డా॥ అంజనీదేవి వచ్చి అపురూపను చూసివెళ్తోంది.  డాక్టర్‌ చెప్పినట్లే
వదిన్ని జాగ్రత్తగా కనిపెట్టుకొని వున్న దేదీప్య అభిరాం గుర్తురాగానే బయటకెళ్లింది.
ఓ.పి.లో పేషంట్స్‌ పలచబడటంతో చెయిర్సన్నీ ఖాళీగా కన్పిస్తున్నాయి.   అక్కడొక చెయిర్లో కూర్చోని వున్న అభిరాం దేదీప్య ను చూడగానే….
‘‘వదినకెలావుంది దేదీప్యా ?’’ అని ఆత్రంగా అడిగాడు.
‘‘డాక్టర్‌ ఇంజక్షన్‌ ఇచ్చారు. మగతగా పడుకొని వుంది.  డెలివరీ కావాలంటే  ఇంకా  టైం పట్టొచ్చు. ఈ లోపల మీరు  వెళ్లి భోంచేసి రండి!’’ అంది దేదీప్య. లేచి బయటకి నడిచాడు అభిరాం.
దేదీప్యను వెతుక్కుంటూ, పరిగెత్తుకుంటూ వచ్చింది నర్స్‌.
‘‘ మీవారి చేత ఈ మందులు, సెలైన్‌ బాటిల్‌ తెప్పించండి.మీరు మాత్రం మీ వదిన దగ్గరే వుండండి!’’ అంటూ వచ్చినంత వేగంగా వెళ్లింది నర్స్‌.
ఒక్క వుదుటన గేటు దగ్గరకెళ్లి, రోడ్డెక్కిన అభిరాంని పిలిచింది.  దేదీప్య పిలుపు వినగానే దేదీప్య దగ్గరికి వచ్చిన అభిరాం ఆమె చేతిలో వున్న ప్రిష్కప్షిన్‌ తీసుకొని వెంటనే ప్రక్కనే వున్న మెడికల్‌ షాపుకి వెళ్లాడు.
ఆ మందులు ఆ షాపులో దొరకలేదు.
తన బైక్‌ మీద వెళ్లి చౌరస్తాలో వున్న అన్ని మెడికల్‌ షాపులు తిరిగాడు.  ఎక్కడా దొరకలేదు.  వరంగల్‌ వెళ్లాడు.  అక్కడ కూడా లేవన్నారు.  ఆ మందులు రోహిణి హస్పిటల్‌ దగ్గర దొరుకుతాయని మందుల షాపులో ఒకతను చెప్పాడు. వెంటనే అదాలత్‌ దగ్గర్లో వుండే రోహిణి హాస్పిటల్లో వున్న మెడికల్‌ షాపులో అడిగాడు.  అక్కడ దొరికాయి.
అభిరాం కోసం ఎదురు చూస్తూ టెన్షన్‌ ఫీలవుతున్న దేదీప్య  అతను తెచ్చిన మందుల్ని చూసి ఊపిరి పీల్చుకొని, వేగంగా  లోపలకి వెళ్లింది.
మళ్లీ ఏదైనా అవసరం రావొచ్చని, హోటల్‌కి వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు అభిరాం.
డాక్టర్‌ అంజనీదేవి అపురూప దగ్గరే వుంది.
బాటిల్‌ లో వున్న సెలైన్‌ సగానికి పైన ఎక్కటంతో వెంట, వెంటనే పెయిన్స్‌ అందుకున్నాయి.
అపురూపకి బాబు పుట్టాడు.
బాబుని చూసి సంతోషపడ్తూ, వదిన సెల్‌లోంచి అన్నయ్యకి కాల్‌ చేసింది.  దేవేందర్‌ ఆనందపడ్తూ, బాబు ఏడుపు సెల్‌లోంచి వింటూ పరవశించాడు.
అపురూప కళ్లు అలసటతో వున్నా ఆనందంతో నిండి వున్నాయి.
‘‘దేదీప్యా! అభిరాం ఇంటికెళ్లాడా?’’
‘‘లేదువదినా, అవసరమైన మెడిసిన్స్‌ తెస్తూ, మనతో వచ్చినప్పటి నుండి ఇక్కడే వున్నాడు. హోటల్‌కి కూడా వెళ్లలేదు.’’  అంది దేదీప్య. అతను వుండటంతో తనెంత ధైర్యంగా వుండగలిగిందో గుర్తు చేసుకుంటూ.
‘‘అయ్యో! అలాగా! వెళ్లి పిలువు. బాబును చూస్తాడు’’ అంది అపురూప.
అభిరాం కోసం బయటకెళ్లి కారిడార్‌లో నడుస్తున్న దేదీప్యను నర్స్‌ చూసి.
‘‘ మీ వారికి పేషన్స్‌ ఎక్కువండి!  వచ్చినప్పటి నుండి అలాగే కూర్చుని వున్నారు. వెళ్లి పిలవండి బాబును చూస్తాడు’’ అంది నర్స్‌.
ఆ నర్స్‌ తామిద్దర్ని బార్యా, భర్తలుగానే కన్‌ఫాం చేసుకుందని గ్రహించిన దేదీప్యను ఆ నర్స్‌ మాటలు ఎక్కడికో తీసికెళ్లాయి.
నర్స్‌ మాటలు నిజమై అభిరాం తన భర్త అయితే? ఆ ఫీలింగ్‌ ఎంతో మనోహరంగా వుంది.
హాస్పిటల్‌ కావటంతో అంతవరకే ఫీలయిన దేదీప్యకి తను పుట్టినప్పటి నుండి కన్పిస్తున్న పచ్చని చెట్లు, భూమి, ఆకాశం, ఇప్పుడెంతో ఆహ్లాదంగా అన్పిస్తున్నాయి.  ఇంత ఆనందానికి కారణమైన ఆ నర్స్‌కి కానుకగా తనేం ఇవ్వగలదు? ఒక చిన్న చిరునవ్వు తప్ప.
‘‘ మేము భార్యా,భర్తలం కాము’’ అని చెప్పాలనిపించకపోయినా చెప్పేలోపలే నర్స్‌ వెళ్లిపోయింది దేదీప్య  కానుకగా యిచ్చిన చిరునవ్వును ఆస్వాదిస్తూ….
‘‘వదినకు బాబు పుట్టాడు అభిరాం! ముద్దుగా వున్నాడు. రండి చూద్దురుగాని వదిన పిలుస్తోంది.’’ అంది అభిరాంకి దగ్గరగా వెళ్లి….
ట్యూబ్‌లైట్‌ కాంతిలో దేదీప్య ముఖం వెలిగిపోతూ, వెన్నెల్లో కదులుతున్న తెల్లగులాబిలా అన్పిస్తోంది అభిరాంకి. చూపు తిప్పుకోలేక ఎక్కడ దొరికిపోతానో అని వెంటనే మామూలుగా అయ్యాడు.
అభిరాం ఫీలింగ్స్‌ని అర్థం చేసుకొని ఏ మాత్రం తడబడకుండా….
‘‘రండి! వెళ్దాం!’’ అంటూ సంతోషంగా వదిన రూంలోకి తీసుకెళ్లింది అభిరాంని.
బాబును చూడగానే.
‘‘కంగ్రాట్స్‌ రూపక్కా!’’ అంటూ అక్కడే వున్న కుర్చీలో కూర్చున్నాడు అభిరాం.
ఆ టైంలో తమ వెంట వచ్చి, హెల్ప్‌గా వున్న అభిరాంవైపు కృతజ్ఞతగా చూస్తూ…
‘‘థ్యాంక్స్‌’’ చెప్పింది అపురూప
‘‘బాగా టైమైంది మీ యిద్దరు యింటికెళ్లండి!’’ అంది అపురూప.
తన మొబైల్‌ లోంచి టైం చూసుకున్నాడు అభిరాం
సరిగ్గా రెండు గంటలు అయింది.
‘‘ఇంకాసేపట్లో తెల్లారిపోతుంది. అందాక మేమిద్దరం మీకు తోడుగా వుంటాం’’. అన్నాడు అభిరాం. ఒక్కదాన్ని వదిలేసి వెళ్తే మధ్యలో ఏదైనా అవసరం పడి ఇబ్బంది అవుతుందని.
‘‘వద్దు అభిరాం! నాకేదైనా అవసరం అయితే నర్స్‌ వుందిగా’’. అంది అపురూప.
అభిరాం లేచాడు.
‘‘నేనుంటాను వదినా!’’ అంటూ అక్కడే కూర్చుంది దేదీప్య.
‘‘వద్దు దేదీప్యా! అభిరాంతో వెళ్లు’’ అంటూ ఉదయాన్నే తనకేమి కావాలో ఇంటి నుండి హస్పిటల్‌కు వచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్పింది.
వెళ్లక తప్పలేదు  దేదీప్యకి.
తన బైక్‌ దగ్గరకి వెళ్లి స్టార్ట్‌ చేయ్యకుండా రోడ్డు మీదకి చూస్తూ నిలబడ్డాడు అభిరాం. అతనెందుకు నిలబడ్డాడో అర్థం కాక.
‘‘పద అభిరాం!’’  అంది  దేదీప్య.
‘‘ ఆగు దేదీప్యా ! ఆటో వస్తుందేమో చూద్దాం.’’
‘‘ఆటో ఎందుకు? నీ బైక్‌ వుందిగా!’’.
‘‘ నాబైక్‌ మీద నిన్నెవరైనా చూస్తే ‘వీడేంటి ఈ టైంలో అమ్మాయిని  ఎక్కించుకొని రోడ్లమ్మట తిరుగుతున్నాడు’ అనుకుంటారు.  ఆటో వస్తుందేమో చూద్దాం.’’ అన్నాడు.
అతను చెప్పింది నిజమే. కానీ ఈ టైంలో ఆటోలు దొరకటం కష్టం కదా!
‘‘బస్టాండు వరకు నడుస్తూ వెళ్దాం రండి! అక్కడైతే ఆటోలు దొరుకుతాయి.’’ అంది దేదీప్య.
ఆ ఏరియా ఆమెకు బాగా తెలుసు. తన ఫ్రెండ్‌ జ్యోత్స్న కోసం అప్పుడప్పుడు ఇటువైపు వస్తుంటుంది.
అర్థరాత్రి ఆడపిల్ల ప్రక్కన ఒంటరిగా నడవటమా? ఇదేమైనా వేరే ఊరా? రేప్పొద్దున లేచి కాలేజీకి     వెళ్లొద్దా? ఎవరూ చూడకపోతే దేనికైనా ధైర్యం చేస్తాడు కాని, ఎవరైనా చూసి మామ్మతో చెబితే తానిక వరంగల్‌లో వుండగలడా? అమ్మో!!
‘‘అదిగో అభిరాం! ఆటో వస్తోంది.’’ అంది ముందుగా ఆటోని చూసిన దేదీప్య.
‘‘థ్యాంక్‌ గాడ్‌!’’ అని మనసులో అనుకుంటూ….
ఆటోని ఆపి, దేదీప్య ఎక్కగానే ఆటో వెనకాల తన బైక్‌ని పోనిచ్చాడు అభిరాం.
ఇల్లు రాగానే ఆటోని ఆపి, దిగింది దేదీప్య.
డబ్బులివ్వగానే ఆటో వెళ్లిపోయింది.
గేటుతీసి అలాగే పట్టుకొని, అభిరాం లోపలకెళ్లి బైక్‌ పార్క్‌ చేస్తుంటే తిరిగి గేటు వేసింది దేదీప్య.
‘‘ ఆకలిగా వుంది కదూ?’’ అంది దేదీప్య
‘అవును’ అని అనాలనిపించినా, ఏమి అనకుండా తన పాకెట్‌లోంచి ‘కీ’ ని బయటకు తీసి లాక్‌ ఓపెన్‌చేసి, డోర్‌ తీసి లోపలకెళ్లాడు.
స్నానం చేసి ప్యాన్‌ క్రింద కూర్చున్నాడు.
మెట్లు దిగి క్రిందికి వచ్చిన దేదీప్య డోర్‌ తీసివుండటంతో నేరుగా వెళ్లి అభిరాం ముందు కూర్చుంది. ‘మళ్లీ వచ్చావెందుకు?’ అన్నట్లు చూశాడతను. ఆ చూపు చూసి…..
నవ్వింది దేదీప్య. వెన్నెల చిన్న బోయేలా
ఆ నవ్వుకి మైమరచిపోయేంత దైర్యం లేక ఆస్వాదించేలేకపోతున్నాడు కాని, దేదీప్య నవ్వు అద్భుతంగా వుంది.
‘‘ఒంటరిగా మిమ్మల్ని వదిలి పైన వుండాలనిపించక వచ్చాను అభిరాం!’’ అంటూ మనసులో మాట చెప్పింది.
అతని గుండెజల్లుమంది. ఊపిరాడనట్లు చూశాడు.
‘‘  ఈ మనిషి నాకేదో ప్రమాదం తెచ్చేలా వుందే…’’ అని మనసులో అనుకుంటూ, ఆమె కూర్చున్న తీరు అప్పుడే కదిలేలా అన్పించకపోవటంతో అతని గుండె కొట్టుకోవటంలో వేగం కూడా పెరిగింది.
ఒంటరిగా వున్న ఓ అబ్బాయి దగ్గరికి ఏ అమ్మాయి అయినా ఇలా వస్తుందా? వచ్చిందే అనుకుందాం!  ఏ అబ్బాయి అయినా తనలావుంటాడా?
‘‘ అన్నం తినలేదు కదా!  ఆకలిగా వుంటుందని మీ కోసం ఈ చపాతీలు చేసుకొచ్చాను’’. అంటూ తన వెంట తెచ్చిన హాట్‌ బాక్స్‌లోంచి చపాతీలు తీసి అభిరాంకి పెట్టింది.
తినకపోతే ఆమె ఏ టైప్‌లో తినిపిస్తుందో ముందే వూహించుకొని, ఆ ప్రమాదం నుండి బయట పడలానుకున్నాడు.  ఆకలిగా వుండటంతో వెంటనే తిన్నాడు.
అభిరాం అంటే తనకి ఎంత ఇష్టమో, ఎంత ప్రేమో, ఎంత ప్రాణమో ఈ రోజు ఎలాగైనా చెప్పాలని నిర్ణయించుకొంది. ఎప్పుడైనా అమ్మాయి ముందుగా ప్రపోజ్‌ చేయ్యటమనేది జరగనిపని. ఎక్కడో తప్ప. కానీ తనకిప్పుడు తప్పడం లేదు. పప్పుముద్దలాంటి అభిరాం తనని అర్థం చేసుకోవటం ఈ జన్మలో జరిగేలా లేదు. శృతి చేయందే వీణ కూడా పలకదంటారు. ఈ వీణను తనే శృతి చేసుకొని గమకాలను పలికించుకోవాలి.
‘‘ అభిరాం! ఎన్నో రోజులుగా మీకోవిషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు నా సీనియర్‌ అయినందువల్ల చెప్పాలంటే చెప్పలేక ఆగాను. ఇంత ప్రైవసీ మళ్లీ మనకు దొరుకుతుందో లేదో! నేను మిమ్మల్ని
ఇష్టపడ్తున్నాను.’’ అంది దేదీప్య.  ఆ మాటలు చెప్పటానికి ఆమె చాలా శక్తిని కూడదీసుకోవలసివచ్చింది.
అభిరాం మొబైల్‌కి కాల్‌ రావటంతో ఆఖర్లో ఆమె చెప్పింది అతను వినలేదు.
‘ఒక్క నిముషం’ అంటూ దేదీప్యతో చెప్పి కాల్‌ రిసీవ్‌ చేసుకున్నాడు.
అవతల నుండి మామ్మ మాట్లాడుతోంది. తాతగారికి ఆరోగ్యం సరిగా లేనందు వల్ల తిరగటం వీలుకాక, వెంటనే బయలుదేరామని ప్రస్తుతం విజయవాడ దాటామని చెప్పింది.
‘‘దేదీప్యా! మామ్మా! తాతయ్య ‘చార్‌మినార్‌’లో వస్తున్నారు. విజయవాడ దాటారట.’’ అన్నాడు సంతోషంగా.
‘‘మామ్మతో నేను మాట్లాడతాను. ఏదీ ఒకసారి మీ మొబైల్‌ యివ్వండి!’’  అంది దేదీప్య.
‘‘ఇప్పుడు మాట్లాడితే నువ్విక్కడున్నావని మామ్మకి తెలిసిపోతుంది. రేపొచ్చాక మాట్లాడుదువుగాన్లే.  నాకు నిద్ర వస్తుంది దేదీప్య గుడ్‌నైట్‌!’’ అన్నాడు అభిరాం.
అర్థం చేసుకుంది దేదీప్య.  పెళ్లికి ముందు ఒంటిరిగా వున్నామన్నది. పెద్దవాళ్లకి తెలియకూడదన్నదే అతని ఉద్దేశం కావొచ్చని తను కూడా అతనికి ‘గుడ్‌నైట్‌’ చెప్పి పైకెళ్లింది.
తన మనసులోని మాటను అభిరాంకి చెప్పిన వైనం డైరీలో రాసుకొని నిద్రపోయింది.

*     *     *     *     *

సూర్యుడు తన లేత కిరణాలను ప్రసరింపజేస్తూ ప్రకృతిని పరవశింపజేసేందుకు సన్నద్దమవుతున్నాడు.
ఉషోదయం కాకముందే నిద్రలేచిన దేదీప్య బాల్కనీలో లైటు వేసుకొని చదువుకుంటూ పనిమనిషి రాగానే హాస్పిటల్‌కి వెళ్లాలన్న విషయం గుర్తొచ్చి, వదినకి అవసరమైనన్నీ బ్యాగ్‌లో పెట్టించింది.
తన మనసులోని మాటను అభిరాంకి చెప్పినప్పటి నుండి దేదీప్య మనసు తేలికై               ఉత్సాహంగా వుంది.  ఎం.బి.ఎ. పూర్తయ్యక పెళ్లి చేసుకొని…అతను మేఘమై వర్షిస్తే తను భూమిలా మారి పులకించిపోవాలని వుంది.
కారణం లేకుండానే ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్న దేదీప్యను చూసి ‘బాబు పుట్టాడన్న సంతోషం ఎక్కువైంది దేదీప్యమ్మలో’ అనుకొంది పనిపనిషి.
పనిమనిషిని తీసుకొని హాస్పటల్‌కి బయలుదేరింది దేదీప్య.
దేదీప్య వెళ్తున్న ఆటో అంబేద్కర్‌ స్టాచ్చూ దగ్గరకి రాగానే ఆగింది. కారులో వెళ్తున్న లక్ష్యాన్వేష్‌ ఆటోలో వున్న దేదీప్యను చూశాడు.
దేదీప్య ఎక్కడికి వెళ్తోంది?
తెలుసుకోవాలని, ఆమె వెళ్తున్న ఆటో వెనకాలే కారుని పోనిచ్చాడు అన్వేష్‌.  ఆటో హాస్పిటల్‌ ముందు ఆగగానే కారు కూడా ఆగింది.
దేదీప్య, పని మనిషి ఆటోదిగి హాస్పిటల్‌ లోపలికి వెళ్లారు.
గదిలోకి వెళ్లగానే బాబును ముద్దుపెట్టుకొని, వదినను పలకరించింది దేదీప్య పనిమనిషి తన వెంట తెచ్చినవి టేబుల్‌పై వుంచింది.
టూర్‌ నుండి వచ్చిన ఇందుమతి అపురూపను చూడటం కోసం అప్పుడే హాస్పిటల్‌కి వచ్చింది.
అభిరాం, దేదీప్య రాత్రి తనకెంత హెల్ప్‌ చేశారో అపురూప చెప్తుంటే, ఆ టైంలో తను లేకపోయినందుకు బాధగా చూసింది ఇందుమతి. తొలికాన్పు కాబట్టి పెద్దవాళ్లు ఆసరా చాలా అవసరం లవ్‌ మ్యారేజి అయినందువల్ల అపురూపకి ఆ అవకాశం లేకుండా పోయింది.
దేదీప్యకి, అభిరాంకి మధ్యన ఏర్పడిన ఒంటరితనాన్ని వెంటనే అర్థం చేసుకొంది ఇందుమతి. అపార్థం చేసుకోలేదు.  సమయం, సందర్భాన్ని బట్టి తన మనవడు చూపించిన మానవత్వాన్ని  చూసి గర్వపడిరది. తన పెంపకానికి తనలో తనే పొంగిపోయింది.
బామ్మ, అపురూప మాట్లాడుకుంటుంటే డాక్టర్ని కలవటానికి బయటకెళ్లింది దేదీప్య.
గదిలోంచి రాగానే దేదీప్యకి అన్వేష్‌ కన్పించాడు.  అతన్ని చూసినా చూడనట్లే ‘హాయ్‌’ కూడా చెప్పలేదు దేదీప్య. ఈ మధ్యన అతని బిహేవియర్‌ ఆమెకు కష్టంగా అన్పిస్తోంది. ఎస్సెమ్మెస్‌లు పంపంటం, క్లాసులో ఆమెనే చూడటం, బ్రేక్‌ టైంలో మాట్లాడాలని చూడటం…. మొన్నొక రోజు ‘బిజినెస్‌ రీసెర్చ్‌ మెథడాలజి’ బుక్‌ తీసుకొని యివ్వకుండా కాంటిన్‌కొస్తే యిస్తానని తీరా వెళ్లాక ‘ఐలవ్‌యు’ చెప్పటం దేదీప్యకి ఏ మాత్రం నచ్చలేదు.
దేదీప్య తనని పలకరించకుండా  పరాయివాడిలా చూస్తుంటే తట్టుకోలేక నిస్సంకోచంగా వెళ్లి  ఆమెను క్రాస్‌ చేసి, ఎదురుగా నిలబడ్డాడు. అపురూపకి, బామ్మకి డోర్‌కి ఎదురుగావున్న అన్వేష్‌ స్పష్టంగా  కన్పిస్తున్నాడు.  దేదీప్య మాత్రం గోడ అడ్డుగా వుండటంతో వాళ్లకి కన్పించటం లేదు.
‘‘ఎవరీ అబ్బాయి? ఎవరికోసం వచ్చాడు?’’ అన్నట్లుగా వాళ్లు అన్వేష్‌ వైపు చూశారు.
‘‘దేదీప్య! మొన్న కాంటిన్‌లో చెప్పినట్లే యిప్పుడు కూడా చెబుతున్నా విను. ‘ఐ లవ్‌ యు’ అన్నాడు స్పష్టంగా. అతని మాటల్లోని స్థిరత్వం చూసి నివ్వెరపోయారు అపురూప, ఇందుమతి.
‘‘ ఇప్పుడు కూడా చెబుతున్నా అంటున్నావ్‌! నేను అడిగానా నిన్నిలా చెప్పమని?’’ అంటున్న దేదీప్యలో ఏమాత్రం తొట్రుపాటు లేదు.
‘‘నువ్వు అడిగినా, అడక్కపోయినా, నా మనసులో వున్నది చెప్పాను. ప్రేమించమని అడిగితే ప్రేమ పుట్టదు.  అడిగితే పుట్టేది ప్రేమ కాదు.’’ అన్నాడు అన్వేష్‌.
‘‘మనసులో ఏదనిపిస్తే అది చెప్పేస్తావా? నన్ను చంపేయాలనిపించిందనుకో. చంపేస్తావా?’’ అంది.
ఆ మాటలు వినగానే ఆమెను  అలాగే చూశాడు. ఆ చూపుల్లో పదునులేదు. కోపం లేదు. జాలి లేదు.
‘‘ నీ బాడీకున్న మెచ్యూరిటీ నీ మనసుకి లేదు. అదెప్పుడొస్తుందో ఆ దేవుడికే తెలియాలి’’ అంటూ క్షణం కూడా అక్కడ ఆగకుండా వేగంగా అడుగులేసుకుంటూ వెళ్లి తన కార్లో కూర్చున్నాడు అన్వేష్‌.
అక్కడ నుండి కదిలి నేరుగా డాక్టర్‌ దగ్గరికి వెళ్లి మాట్లాడి వచ్చింది దేదీప్య.
దేదీప్య రాగానే ఆ అబ్బాయి ఎవరని అపురూప కాని, ఇందుమతి కాని అడగలేదు.  వాళ్లకేమిా తెలియనట్లే, వాళ్లేమిా చూడనట్లే వున్నారు.
మూడీగావున్న దేదీప్యను చూసి….
‘‘దేదీప్యా! ఇంటికెళ్లి రెస్ట్‌ తీసుకో. రాత్రంతా నీకు నిద్రలేదు.’’అంది అపురూప.
‘‘సరే! వదినా!’’ అంటూ, బామ్మతో కూడ ఇంటికెళ్తున్నట్లు చెప్పి ఇంటికెళ్లింది దేదీప్య.
దేదీప్య ఇంటికెళ్ళగానే అపురూప, బామ్మల మాటలు దేదీప్య మీదకి మళ్లాయి.
‘‘చూశావా మామ్మ! ఈ రోజుల్లో అబ్బాయిలు ఎలా వున్నారో?’’ అంది అపురూప. ఆ మాటలకి
జ్ఞానిలా నవ్వింది ఇందుమతి.
‘‘ ఏ రోజుల్లో అబ్బాయిలైనా యిలాగే వుంటారు రూపా! వాళ్లకు కావాలనుకున్నది ఏదైనా సరే సొంతం చేసుకోవాలనుకుంటారు.  మంచీ`చెడు ఆలోచించాలన్న జ్ఞానం వుండదు. ఇలా తయారవుతాడనే మా అభిరాంని కాస్త భయంగా పెంచాను.  నేనెలా చెబితే అలా వింటాడు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో…. నా మాటే కాదు వాళ్ల అమ్మ మాట కూడా అక్షరం దాటడు.  దీనివల్ల మా అభిరాం భవిష్యత్తు బావుంటుందని మేమంతా అప్పుడప్పుడు అనుకుంటుంటాం.’’ అంది గర్వంగా అన్వేష్‌తో తన మనవడ్ని పోల్చి చూసుకొని…
‘‘ఇప్పుడెలా మామ్మగారు దేదీప్య పరిస్థితి? దీనికి పరిష్కారం ఏమైనా వుంటే చెప్పండి?’’ అని అడిగింది అపురూప.  అమెకు ఇప్పుడు దేదీప్యదే పెద్ద సమస్య అయింది.  అందులో దేవేందర్‌ లేకుండా తనొక్కతే వరంగల్‌లో దేదీప్యను పెట్టుకొని ఒంటరిగా వుండాలంటే ఈ సమస్య ఎక్కడికి దారితీస్తుందో నన్న భయంతో ఇందుమతిని సలహా అడిగింది.
‘‘పెళ్లే దీనికి పరిష్కారం రూపా! దేదీప్యకి పెళ్లిచేయడటం మంచిది’’. అంది ఇందుమతి.
‘‘ఎవరితో ఆ అబ్బాయితోనా?’’ అంది అపురూప.
‘‘కాదు. మీ వాళ్లలో ఎవరినైనా వెతికి వీలైనంత త్వరగా చెయ్యండి! లేకుంటే ఇదిగో ఇలాగే ప్రేమబిక్ష పెట్టమంటూ ముష్టివాళ్లలాగ వెంటబడ్తుంటారు. ఇంతకు ముందే కదా చూశాం.’’ అంది అన్వేష్‌ని తేలిక చేసి మాట్లాడుతూ.
‘ఇప్పటికిప్పుడు పెళ్లంటే దేవేందర్‌ ఏమంటారో మామ్మా! దేదీప్యను ఎం.బి.ఎ. చేయించాలనే ఆ కాలేజిలో జాయిన్‌ చేశారు.  ‘ఫష్ట్ సెమ్‌’ కే పెళ్లంటే ‌ఒప్పుకుంటారో లేదో….’’ అంది సందేహంగా.
‘‘ఫస్ట్‌ సెమ్మా! సెంకడ్‌ సెమ్మా!  అన్నది కాదిక్కడ కొశ్చన్‌ రూపా! అమ్మాయి అందంగా వుంది కాబట్టి పాపిష్టి కళ్లుపడకుండా కాపాడుకోవాలి. దేదీప్యా అమ్మా, నాన్నలు లేనందువల్ల దీని గురించి మీరే తల్లిదండ్రులై ఆలోచించాలి.’’ అంది ఇందుమతి.
ఆలోచనలో పడిరది అపురూప.
‘చదువుకున్న దానివి, ప్రపంచం పోకడ తెలిసిన దానివి, దేదీప్య గురించి బాధ్యతగా ఆలోచించి దేవేందర్‌ తో నువ్వు చెప్పేది చెప్పు… నువ్వు చెప్పింది విన్నాక అతను కూడా ఆలోచిస్తాడు కదా!’’ అంది ఇందుమతి నెమ్మదిగా బాబు ఏడుస్తుంటే మెల్లగా చేతుల్లోకి తీసుకొంది.
‘‘సరే! మామ్మా! ఆయన హైదరాబాద్‌ నుండి రాగానే విషయం చెప్పి నిర్ణయం మాత్రం ఆయనకే వదిలేస్తాను. ’’ అంది అపురూప.
దేదీప్య విషయం అంతటితో వదిలేసి… నీళ్లలో ఎలక్ట్రాల్‌ పౌడర్‌ కలిపి బాబుకి ఒక్కో బొట్టు త్రాగించింది ఇందుమతి.  బాబు నిద్రపోయాడు.
ఇందుమతి తన టూర్‌ కబుర్లు చెబుతుంటే వింటూ పడుకొంది అపురూప.

*     *     *     *     *

దేవేందర్‌ హైదరాబాద్‌ నుండి రాగానే హాస్పిటల్‌కి వెళ్లి, డాక్టర్‌ తో మాట్లాడి, బిల్‌ పే చేసి అపురూపను బాబును ఇంటికి తీసుకొచ్చాడు.
బుక్‌ తెచ్చుకోవాలని జ్యోత్స్న వాళ్ల యింటికెళ్లింది దేదీప్య. జోత్య్స దగ్గరకి వెళ్తే దేదీప్య త్వరగా     రాదని అపురూపకి తెలుసు.
హాస్పటల్లో జరిగిన సంఘటన నెమ్మదిగా భర్తతో చెప్పింది. ఒక చెవితో విని, ఇంకో చెవితో వదిలేశాడు దేవేందర్‌
‘‘దేదీప్య వెంట ఒక అబ్బాయి వస్తున్నాడని చెప్పినా మీరెందుకిలా విని వదిలేస్తున్నారో అర్థం కావటం లేదు. అదే మీ అమ్మ, నాన్నగారు బ్రతికుంటే యిలా విని వదిలేసేవారు కాదు.’’  అంది బాబుకి పాలు పడుతూ నిష్టూరంగా అపురూప.
‘‘ఎం.బి.ఎ.లో జాయిన్‌ చేసింది పెళ్లి చెయ్యటానికా? ఇంకో సంవత్సరం ఓపిక పడితే ఏదో ఒక కంపెనీలో జాబ్‌ వస్తుంది. ఇప్పుడే పెళ్లి చేస్తే రేప్పొద్దున పరిస్థితులు ఎలా వుంటాయో, ప్యూచర్లో ఎలా బ్రతుకుతుంది? అంటూ తన అభిప్రాయాన్ని భార్యకి అర్థమయ్యేలా చెప్పాడు.
‘‘పెళ్లి చెయ్యమనేది బ్రతకటానికే,అంతకన్నా ఆడవాళ్లకి మంచి జాబ్‌  ఏముంటుంది చెప్పండి? ’’ అంది బాబు చేతివేళ్లతో మెల్లగా ఆడుతూ.
‘‘మనసును మభ్యపెట్టుకుంటూ మాట్లాడుతున్నావు రూపా! ఇలా మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చిందిప్పుడు?’’ అంటూ కోప్పడ్డాడు.
‘‘వచ్చింది కాబట్టే మాట్లాడుతున్నాను. లేకుంటే నాకేమైనా సరదానా?’’ అంది మూతి ముడుస్తూ.
‘‘వాడెవడో వెంటబడ్తున్నాడని భయపడి ఇప్పటికిప్పుడు పెళ్లి చేసి దేదీప్య జీవితం నాశనం చెయ్యటం నాకిష్టం లేదు.’’ అంటూ ఖచ్చితంగా అన్నాడు.
‘‘పెళ్లి చేస్తే జీవితం నాశనం అవుతుందని మీ నోటి వెంటే వింటున్నాను. అదే నిజమైతే  అమ్మాయిలకి పెళ్లికొడుకుల్ని వెతకరు.  ఉద్యోగాలు వెతుకుతారు. అయినా మా ఆడవాళ్ల బాధలు మీ మగవాళ్లకి అర్థం కావులెండి!’’ అంటూ బాబును ఉయ్యాలలో పడుకోబెట్టి విసురుగా లేవటంతో ఆమె వాలుజడ త్రాచులా కదిలింది.
‘‘ఇందులో అంత పెద్ద బాధేముంది చెప్పు? ఆ అబ్బాయి ఎవరో కనుక్కొని అభిరాంతో చెబితే సరిపోతుంది. అతను సీనియర్‌ కాబట్టి ఏమైనా చెయ్యగలడు.’’ అన్నాడు ఆమెను కన్విన్స్‌ చేస్తూ, అభిరాంపై వున్న నమ్మకంతో.
‘‘ఏదైనా ఏం చేస్తాడండి! ఆ అబ్బాయి మనసులో వున్న దేదీప్యను తొలగించగలడా?’’ అంది.
‘‘తొలగించడు. నాలుగు తన్నులు తంతే వాడే దారికొస్తాడు.  మళ్లీ దేదీప్య జోలికి రాడు’’ అన్నాడు.
‘‘దెబ్బలు తినగానే గోడ కుర్చీవేసి గుంజీలు తియ్యటానికి ఆ అబ్బాయేమైనా ఎల్‌.కె.జి. చదువుతున్నాడా?’’ అంది.
ఏంచేయాలో తెలియనివాడిలా ఆలోచనలో పడి వెంటనే  ఏదో గుర్తొచ్చినవాడిలా.
‘‘ మా కంపెనీ డైరెక్టర్‌ సమ్మిరెడ్డికి వాళ్ల కాలేజి డైరెక్టర్‌  బాగా తెలుసు రూపా! ఆయనతో చెప్పిస్తాను. వినకపోతే యింకో మార్గం ఆలోచిస్తాను.’’ అన్నాడు.
‘‘ఇంత వయొలెన్స్‌తో కూడిన చదువు అవసరమంటారా?’’ అంది.
‘‘ మరి ఇప్పటికిప్పుడు పెళ్లంటే దేదీప్య ఒప్పుకుంటుందంటావా?’’
‘‘ ఒప్పుకోదన్న అనుమానం వున్నప్పుడు చెప్పకండి!’’
‘‘ చెప్పకుండా పెళ్లి చెయ్యటమా?’’ అంటు నిర్ఘాంతపోయాడు.
‘‘ దేదీప్య విషయంలో మీరన్నీ చెప్పే చేస్తున్నారా? తను వేసుకునే డ్రస్‌లు, అప్పుడప్పుడు మీరిచ్చే గిఫ్ట్‌లు చెప్పకుండానే తెస్తున్నారు కదా! అయినా ఆమె శ్రేయస్సు కోరేకదా ఈ పెళ్లి చెయ్యాలనుకుంటున్నారు.’’ అంది.
‘‘చెప్పకపోయినా పర్వాలేదు అనుకోటానికి ఇది డ్రస్‌ కాదు, గిఫ్ట్‌ కాదు. జీవితం!’’  అన్నాడు దేవేందర్‌.
‘‘జీవితంలో అన్నీ చెప్పే చేస్తున్నారా? జరిగేవన్నీ చెప్పాకనే జరుగుతున్నాయా? తప్పనిసరి అయినప్పుడు, చెప్పకపోవటం తప్పుకాదని, ఎవరికి చెప్పకుండా మనం పెళ్లి చేసుకోలేదా?’’ అంటూ యింకో వైపుకి తిరగటంతో వాలుజడ మళ్లీ కదిలింది.  బరువుగా, నల్లగా, కదిలినప్పుడు  అందంగా అన్పించే ఆ వాలుజడ పాశాన్ని తట్టుకోలేకనే ఎవరికీ చెప్పకుండా, పెళ్లి చేసుకొని కాస్త అటు, ఇటు తేడాతో కథ సుఖాంతం చేసుకున్నాడు.
మరి తన చెల్లి పరిస్థితి?
‘‘సరే, రూపా! నేను ఆలోచిస్తాను’’. అన్నాడు దేవేందర్‌.
అపురూప బాబుకి నాప్‌కిన్‌ మార్చే ప్రయత్నంలో పడి దేవేందర్‌ తో యింకేం మాట్లాడలేదు.

*     *     *     *     *

తెల్లవారింది.
సముద్రంలో ఈదులాడి తడిబట్టలతో ఒడ్డుకి చేరినట్లు ఒక్కో మేఘం ఆకాశం క్రింద ఒకదాని వెంట ఒకటి కదులుతున్నాయి.
దేదీప్య తన పుట్టినరోజు సందర్భంగా అన్నయ్య తెచ్చిన గ్రీన్‌కలర్‌ డ్రస్‌ వేసుకొని గుడికి వెళ్లే ప్రయత్నంలో వుంది.
గేటు ముందుకొచ్చి, స్కూటీపై కూర్చుని, తనొచ్చినట్లు హారన్‌ కొడుతోంది జ్యోత్స్న.  వెంటనే బయటకొచ్చి, కిందకి తొంగిచూస్తూ …
‘‘దీనికసలు పైకొచ్చే ఓపిక వుండదు. ఒక్క నిముషం వస్తున్నా ఆగవే’’.  అంటూ ఒక్క వుదుటన మళ్లీ లోపలకి వెళ్లింది దేదీప్య.
‘‘వదినా! జ్యోత్స్న వచ్చింది.  భద్రకాళి గుడికి వెళ్లిరానా?’’అంటూ వదిన దగ్గర పర్మిషన్‌ అడిగింది.
ఊయలలో వున్న బాబు బోసి నవ్వుల్ని చూసి మురిసిపోతూ తనవైపు చూడకపోయినా చూస్తున్నట్లే వూహించుకొని, ముద్దు ముద్దుగా మాటలు చెబుతూ తన మనసులోని మాదుర్యాన్ని తన బిడ్డ అర్థం చేసుకోవాలన్న తపనతో, అదే పనిలో వున్న అపురూప….. తనకి దగ్గరగా వచ్చిన దేదీప్య ఆ డ్రస్‌లో యింకా బాగుండటంతో అలాగే చూస్తూ.
‘‘సరే ‘వెళ్లిరా!’’ అంది ఆప్యాయంగా
అన్నదే తడవుగా చక, చక మెట్లు దిగి, స్కూటీని సమీపించి, జోత్స్న భుజాలపై చేతులు వేసి, వెనకాల కూర్చుంటూ.
‘‘ఇక పోనియ్‌ వే.’’ అంది దేదీప్య.
స్కూటీ కదిలి వేగాన్ని అందుకొంది.
వాళ్లు వెళ్తున్న స్కూటీ సరిగ్గా చౌరస్తా రాగానే ఆగిపోయింది.
ఇద్దరు దిగారు! ‘ఏమైంది’ అనుకుంటూ దానివైపు చుశారు. జ్యోత్స్న కిక్‌ రాడ్‌ని కాలుతో కొడుతూ, ఒక చేత్తో, ఎక్స్‌లేటర్‌ని రేజ్‌ చేస్తూ,  స్కూటీని స్టార్ట్‌ చెయ్యటానికి ట్రై చేస్తోంది.
అదెంతకీ స్టార్ట్‌ కాలేదు.
‘‘నువ్వుండవే. నేనుట్రై చేస్తాను.’’ అంటూ జ్యోత్స్నను ప్రక్కకు నెట్టి దేదీప్య ట్రై చేసింది.
ఈ లోపల దూరంగా జ్యూయలరీ షాపు దగ్గర ఆగివున్న అన్వేష్‌ కారుని చూసింది జ్యోత్స్న.
‘‘ఎప్పటిదే ఈ డొక్కు స్కూటీ? కొట్టలేక చస్తున్నా! వదిలిపెట్టవా దీన్ని? సెల్ఫ్‌ స్టాటర్‌ వున్న బండిని తీసుకోవచ్చుగా కనీసం దీనికైనా  సెల్ఫ్‌ స్టాటర్‌ పెట్టించుకోవచ్చుగా.’’ అంది ఆయాసపడ్తూ దేదీప్య.
‘‘ ఆపవే నీ గోల! అది  అన్వేష్‌ కారు కదూ? బాబోయ్‌ యిప్పుడతను చూశాడంటే ఈ స్కూటీ స్టార్ట్‌ అయ్యేంతవరకు వదలడు.  ఒకవేళ స్టార్ట్‌ కాలేదనుకో మనతో పాటు ఈ స్కూటీని కూడా తన కార్లో ఎక్కించుకుంటాడు.  నువ్వంటే అంత పిచ్చి, త్వరగా స్టార్ట్‌ చెయ్‌!’’ అంది జ్యోత్స్న.
దేదీప్యంటే అన్వేష్‌కి బాగా ఇదని, అదని వాళ్ల క్లాసులో తెలియనివాళ్లు లేరు.‘‘ఏం చేయాలి? స్టార్ట్‌ కాందే!’’  అంది దేదీప్య.  ఆమె ముఖంపై నీరెండతాకి, అప్పటికే చిరు చెమట పట్టింది.
‘‘నువ్వాగు. నేను ట్రై చేస్తాను.’’ అంటూ జ్యోత్స్న ట్రై చెయ్యగానే స్కూటీ కదిలింది.
ఇద్దరు ముందుగా భద్రకాళి గుడికి వెళ్లారు.
అక్కడ నుండి వరంగల్‌ ఫోర్ట్‌కి వెళ్లారు.
ఫోర్ట్‌ దగ్గర కొద్ది సేపు తిరిగి, ప్రక్కనే వున్న గార్డెన్‌లోకి వెళ్లి నిలబడ్డారు.  అక్కడొక చోట అభిరాం కన్పించగానే దేదీప్య మనసు ఉత్సాహంతో కేరింతలు కొట్టింది.  మనసేమో సుడిగాలిలా, మనిషేమో నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్లి నిలబడిరది.
‘‘హాయ్‌! అభిరాం!’’ అంది.
అతనామెను పట్టించుకోకుండా ఏకాగ్రతగా ఎటో చూస్తున్నాడు అక్కడ అతను దేన్ని చూస్తున్నాడో అర్థం కాక దేన్నో వెతుకుతున్న దానిలా చుట్టూ చూసింది దేదీప్య.
‘‘అభిరాం గారు ! నా అజ్ఞానాన్ని మన్నిస్తే నేనో మాట అడగాలనుకుంటున్నాను. అంత దీక్షగా చూస్తున్నారు.  అక్కడ మీకేం కన్పిస్తోంది?’’ అంది దేదీప్య
ఒక్కక్షణం ఆమె ముఖంలోకి చూశాడు.
‘‘తెలియనట్లు నటించేవాళ్లు కూడా అజ్ఞానులేనా? అక్కడంత స్పష్టంగా చెట్లూ, పూలు, ఆకులు….. మధ్యలో సీతాకోక చిలుకలు కన్పిస్తుంటే….’’ అంటూ అక్కడున్న పువ్వులను ప్రేమమయ దృక్కులతో స్పృశిస్తున్నాడు అభిరాం.
దేదీప్య మనసు చివుక్కుమంది. అవి తనకన్నా అందంగా వున్నాయా? తనని పట్టించుకోకుండా వాటినే చూస్తున్నాడు?
‘‘ఇంత సేపటి నుండి ఇక్కడే వున్న నేను కన్పించనప్పుడు’ అవన్నీ మీకెలా కన్పిస్తున్నాయా’ అని డౌటొచ్చి అలా అడిగాను లెండి!’’ అంది దేదీప్య.
‘‘నువ్వెందుకు కన్పించలేదు? ఓ…. విష్‌ చెయ్యలేదనా! ఏదో ఆలోచనలో వుండి నిన్ను గమనించలేదు’’.  అన్నాడు నొచ్చుకుంటూ.
‘‘ఇట్స్‌ ఆల్‌రైట్‌,’’ అంది దేదీప్య.
అతని దృష్టి అంతా పూలపైవాలి అందంగా కదిలి ఎగురుతున్న సీతాకోక చిలుకలపైనే వుంది.
‘‘ఒక్కరే వచ్చారా?’’ అంది చుట్ట్టూ చూస్తూ, అతన్ని ఏదో ఒక నెపంతో మాట్లాడించాలని.
‘‘ఫ్రెండ్‌తో…..’’ అన్నాడు పొడిగా
ఇంకేం మాట్లాడాలో తోచలేదు దేదీప్యకి తన గురించి అడుగుతాడనుకొంది. అలాంటిదేం కన్పించలేదు.  ఆమె డ్రస్‌లోని ప్రత్యేకతను కూడా అతను గమనించలేదు.
‘‘ ఈ రోజు నా  పుట్టిన రోజు అభిరాం! భద్రకాళి టెంపుల్‌కి వచ్చి ఖిలా కూడా చూడాలనిపించి జ్యోత్స్నతో వచ్చాను’’. అంది.
‘‘హ్యపీ బర్త్‌డే, ’’ అన్నాడు వెంటనే అభిరాం.
అతను చెప్పిన విధానం ఆమె ఆశించిన రేంజ్‌లో లేదు.  నిరాశగా అతని ముఖంలోకి చూస్తూ.
‘‘ఇదిగో! దీన్నేనా మీరింతగా చూసేది?’’ అంటూ ఓ బటర్‌ఫ్లైని పట్టుకొని కిలకిల, అల్లరిగా, అందంగా నవ్వుతూ, దాన్ని అతని కళ్లకి దగ్గరగా చూపిస్తూ నిలబడిరది.  అతను కాస్త బెదిరినట్లు చూశాడు. ఆమె పట్టించుకోలేదు.  ప్రేమ గాఢంగా వున్నప్పుడు పట్టింపుగాని, గమనింపు గాని వుండవు.
నిస్సహాయంగా చూస్తూ అతను కూడా నవ్వాడు. అలా నవ్వుకుంటూ ఒకరికి ఒకరు  దగ్గరగా నిలబడి వుంటే జ్యోత్స్న తన కెమెరా సెల్‌తో ఫోటో తీసింది.
ఆమె చేతివేళ్ల మధ్యలో చిక్కుకుని గిలగిల కొట్టుకుంటున్న బటర్‌ఫ్లై ని చూస్తూ.
‘‘ పాపం! దాన్ని వదిలెయ్‌ ! నలిగిపోతుంది.’’ అంటూ జాలి పడ్డాడు అభిరాం.
‘‘ నేను నా పుట్టిన రోజు సందర్భంగా యిలా వచ్చాను.  మీరెందుకొచ్చారో చెప్పండి! వదిలేస్తాను.’’ అంది దేదీప్య.
‘‘ కాలేజీలో జరిగిన ‘ప్లేస్‌మెంట్స్‌’లో నాకు జాబ్‌ వచ్చింది కదా! ఫోర్త్‌ సెమ్‌ ఎగ్జామ్స్‌ అయిపోకముందే నన్ను ట్రైనింగ్‌లో జాయిన్‌ కమ్మని కాల్‌ లెటర్‌ వచ్చింది.  ఎలాగూ వెళ్తున్నాను కదా! ఒకసారి ఇవన్నీ చూసి వెళ్దామని వచ్చాను.’’ అని అతను అనే లోపలే వాళ్ల ఫ్రెండ్‌ అక్కడికి వచ్చాడు.
అతనికి జాబ్‌ రావటం దేదీప్యకి సంతోషాన్ని కల్గించింది.  వెంటనే సీతాకోకచిలుకను వదిలేస్తూ.
‘కంగ్రాట్స్‌’ చెప్పింది.
దేదీప్యకి ‘థ్యాంక్స్‌’ చెప్పి ‘ఓ.కె.బై’ అంటూ తన ఫ్రెండ్‌ బైక్‌ మీద కూర్చుని వెళ్లిపోయాడు అభిరాం. అతను యిక ముందు వరంగల్‌లో వుండడు కాబట్టి అంతకముందు రోజే బైక్‌ని అమ్మేశాడు.
దేదీప్యను యింకా కొన్ని ఫోటోలు తీసింది జ్యోత్స్న.
అక్కడ నుండి నేరుగా స్కూటీపై జోత్స్న వాళ్లింటికెళ్లారు. జ్యోత్స్న తన సెల్‌తో తీసిన ఫోటోలను డేటాకేబుల్‌ ద్వారా లాబ్‌టాప్‌ లోకి ట్రాన్స్‌ఫర్‌ చేసింది.  ట్రాన్స్‌ఫర్‌ చేసిన ఫోటోలని సీ.డి. లోకి కాపీ చేసింది. ఆ సీ.డీని అప్పుడే తీసికెళ్లి నయీంనగర్‌లో ఉన్న చిత్రా డిజిటల్‌ స్టూడియోలో యిచ్చారు.  అటునుండి అటే దేదీప్యను ఇంటి దగ్గర డ్రాప్‌ చేసి వెళ్లింది జ్యోత్స్న.

*     *     *     *     *

దేవేందర్‌ హైదరాబాద్‌ నుండి వచ్చిన వెంటనే కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లి, క్లాసులో కూర్చునివున్న దేదీప్యను మధ్యలోనే ఇంటికి తీసుకొస్తుంటే ఏం జరిగిందో అర్థం కాలేదు దేదీప్యకి  వదినకి గాని, బాబుకు గాని ఏమైనా జరిగిందా అని మనసులో భయపడిరది.
‘‘ఎందుకన్నయ్యా ఇంటికి తీసికెళ్తున్నావ్‌? ఏం జరిగింది? అంటూన్న ఆమె గొంతులోని ఆదుర్థాను కనిపెట్టాడు దేవేందర్‌.
‘‘ఏం జరగలేదమ్మా! నిన్ను చూడటానికి నాకు తెలిసిన వాళ్లు వచ్చారు. ఇంకొద్ది సేపట్లో నీకు పెళ్లి చూపులు.’’  అన్నాడు మామూలుగా.
పెళ్లి చూపులనగానే నిర్ఘాంతపోతూ
‘‘ఇప్పుడే ఎందుకన్నయ్యా పెళ్లి? నా ఎం.బి.ఎ. పూర్తయాక చేసుకుంటే బావుటుంది కదా!’’ అంది తేరుకుంటూ.
కంప్యూటర్‌ ఆమె ప్రొఫెషన్‌ కాకపోయినా ఫస్ట్‌ నుండి కంప్యూటరంటే ఇంట్రెస్ట్‌ వున్నందువల్ల కాలేజి నుండి ఇంటికొచ్చాక రోజు ఒక గంట కంప్యూటర్‌ క్లాస్‌కు వెళ్తుంది. ప్రస్తుతం ఒరాకిల్‌, డాట్‌నెట్‌ అయిపోవచ్చింది.
‘‘నేనిక్కడే వుంటే అలాగే చేసేవాడ్ని. స్టేట్స్‌ వెళ్లాలనుకుంటున్నాను.  నీ పెళ్లి అయితే ఓ బాధ్యత తీరిపోతుంది నాక్కూడా నిశ్చింతగా వుంటుంది’’ అన్నాడు దేవేందర్‌.
ఇల్లు రాగానే బైక్‌ ఆపుకొని లోపలకెళ్లారు.
దేదీప్యను  చూడగానే రెడీ అయి రమ్మని చెప్పింది అపురూప.ఇందుమతి కూడా అక్కడే వుంది.
లోపలకెళ్లి డోర్‌ పెట్టుకొంది దేదీప్య.
గదిలోకి వెళ్లగానే అభిరాం గుర్తొచ్చాడు.
ఒకవైపు చదువుకుంటున్నా అభిరాంని ప్రేమించి ఆనందపడింది. ఆ ఆనందాన్ని ఫీలవుతున్నంత సేపు తనంత అదృష్టవంతురాలు లేదనుకొంది.  పెళ్లి కూడా అభిరాంతోనే జరగాలనుకొంది.  ఇప్పుడిలా వేరేవాళ్లతో పెళ్లి చూపులకి కూర్చోవడం నచ్చటం లేదు. ఇష్టం లేని పెళ్లి చూపులకి ఏ డ్రస్‌ అయితే ఏముందన్నట్లుగా చేతికి అందిన డ్రస్‌ తీసుకొంది.
‘‘ చీర కట్టుకో దేదీప్యా! వాళ్లు నిన్ను చీరలో చూడాలంటున్నారు. డ్రస్సింగ్‌ టేబుల్‌ పక్కనే  చీర పెట్టాను చూడు’’. అని డోర్‌ అవతల నుండి అపురూప అంటుంటే.
‘‘అలాగే వదినా.’’ అంటూ ఆ డ్రస్‌ అవతల పడేసి చీరకట్టుకొంది.
ఇల్లు అలకగానే పండగకాదు అన్నట్లు పెళ్లి చూపులు జరగానే పెళ్లికాదు కదా అని మనసుకి సర్ధి చెప్పుకొంది. అయినా కూడా ఆమె మనసు ప్రశాంతంగా లేదు.  ఎటూ ఆలోచించుకోలేకపోతోంది.
మునిగి పోతున్నామని తెలిసినప్పుడు కడుపునిండా నీళ్లు త్రాగి, చావటమే మేలన్నట్లు పెళ్లిచూపులు తప్పవు కాబట్టి ప్రస్తుతం వాళ్లముందుకెళ్లి కూర్చోవటమే మంచిదనుకొంది.
దేదీప్యను తీసికెళ్లి వాళ్లకెదురుగా కూర్చోబెట్టింది అపురూప.
దేదీప్యను చూడగానే….
‘‘దేదీప్యా! ఎం.బి.ఎ. ఏ కాలేజీలో చదువుతున్నావమ్మా?’’ అన్నాడు అబ్బాయి తండ్రి బలరామయ్య దేదీప్య గొంతు వినాలన్న ఆసక్తితో.
‘‘అల్లూరి కాలేజీ అండి!’’ అంది దేదీప్య.
‘‘ మా అబ్బాయి ఎం.కామ్‌. చేశాడు డిగ్రీ బేస్‌ మీద గవర్నమెంట్‌ జాబ్‌ చేస్తున్నాడు. పేరు దీపక్‌.’’ అన్నాడు బలరామయ్య.
దీపక్‌ తల్లి భ్రమరాంబిక ఏం మాట్లాకుండా చూస్త్తూకూర్చుంది. తల్లి కూడా ఏదైనా మాట్లాడితే బాగుండనుకున్నాడు దీపక్‌.
పెళ్లిచూపుల పేరుతో చాల మంది అమ్మాయిల్ని చూశారు. వాళ్లలో దీపక్‌కి నచ్చిన                         వాళ్లు కూడా వున్నారు. వాళ్లతో అతను కొంతకాలం ఫోన్లోకూడా మాట్లాడాడు. కానీ వాళ్లు అతని తల్లిదండ్రులకి నచ్చక పోవటంతో ఏ కారణం లేకుండానే వాళ్లను వదిలేశాడు.
దేదీప్య వాళ్లందరికి నచ్చింది. అందుకే ప్రసన్నంగా కూర్చున్నారు.
దీపక్‌ వైపు చూసింది దేదీప్య.
ఎవరో చూడమంటే కాదు.  తనంతటే తనే చూసింది. దీపక్‌లో ఏదైనా వంక దొరికితే అన్నయ్యతో చెప్పి కాన్సిల్‌ చేపిద్దామని చూసింది.
గూని గాని, మెల్లగాని, బట్టతల గాని, చివరకు చట్టి ముక్కు అయినా వుంటుందేమోనని వెతికి మరీ చూసింది.  అవేంలేకపోవడంతో ప్రాణం వుసూరుమంది. వాళ్లకి తను నచ్చకపోతే బావుండని మనసులో దేవుడ్ని తలచుకొంది.
నడవమంటే .. కుంటుతూ నడవాలనుకొంది.
పాడమంటే…. చెండాలంగా పాడాలనుకొంది.
ఇవేం వాళ్లు అడక్కపోవటంతో తల నేలకేసి కొట్టుకోవాలనిపించింది. అందరు తనవైపే చూస్తున్నట్లనిపించి ఆగిపోయింది.
దేదీప్యను లోపలికి తీసికెళ్లమని అపురూపతో చెప్పాడు దేవేందర్‌
‘‘అబ్బాయి బాగున్నాడు మాకు నచ్చాడు.’’ అని దేవేందర్‌  వాళ్లతో అనటం గదిలోకి                        వెళ్తున్న దేదీప్యకి విన్పించింది.
‘‘అన్నయ్యేంటి నన్నొకమాటైనా అడక్కుండా అబ్బాయి నచ్చాడని తన నిర్ణయం చెప్పేశాడు? నాకు నచ్చక్కర్లేదా? నా నిర్ణయం అడగరా? అడిగివుంటే అభిరాంని ఇష్టపడ్తున్నానని చెప్పి వుండేదాన్ని కదా! నాకీ చిన్న అవకాశం కూడా లేకుండా పోయిందే’’. అని బాధపడ్తూ, పంటిక్రింద పెదవిని మడిచి ఆలోచిస్తూ ఒక్కక్షణం ఆగి తిరిగి లోపలకెళ్లింది.
అన్నయ్య చేసేది తప్పుకాదా?
ముమ్మాటికి కాదు. ఎందుకంటే? ‘చదివిన చదువు చాల్లే ’ అని అమ్మాయిల్ని తల్లిదండ్రులే యింట్లో కూర్చోబెడ్తున్న తరుణంలో తనని చదివించి, తగిన సంబంధం తెచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాడు. తండ్రికన్నా ఎక్కువగా ప్రేమనందిస్తున్నాడు.
అయితే!! ఇతనితోనే పెళ్లి జరిగిపోతుందా?
అభిరాంతో జరగదా?
అభిరాంతో పెళ్లి జరగదేమోనన్న ఊహనే తట్టుకోలేకపోతుంది. దేవులపల్లి కృష్ణ శాస్త్రి పుస్తకాల్లో కన్పించే వెన్నెల, కొబ్బరాకు మాయమై,  కలలు కరిగిపోయి అంతా శూన్యంగా, అగమ్యగోచరంగా అన్పిస్తోంది.

*     *    *     *     *

ఇంకా వుంది…….

2 thoughts on “మౌనరాగం … 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *