April 30, 2024

అండమాన్ డైరీ – 3

రచన: దాసరి అమరేంద్రamarendra

 

హేవలాక్ అండమాన్ పరిభాషలో ఓ పెద్ద ద్వీపం.

ఉత్తర దక్షిణాలుగా ఓ పదిహేను కిలోమీటర్ల పొడవు, సగటున అయిదు కిలో మీటర్ల వెడల్పు – అంతా కలసి నూటపది చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం, ఆరేడువేల జనసంఖ్య. పోర్ట్ బ్లెయిర్‌కు దగ్గరగా ఉండటం దీని పాపులారిటీకి ఒక కారణమయితే వర్ణనాతీతమయిన సాగర సౌందర్యం ముఖ్యమైన కారణం..

జెట్టిలో దిగగానే మా లోకల్ గైడు – ప్రకాష్ ఏర్పాటు చేసిన మనిషి వచ్చి పలకరించాడు. జెట్టీ పక్కనే ఉన్న పీడబ్ల్యూడి వారి అతిథిగృహంలో మా నివాసం.  మా గైడ్ సాయంతో ఆ అథిథిగృహం కేర్ టేకర్‌ను వెదికి పట్టుకొని అతని అనుమానపు చూపుల్నీ, అనవసరపు సందేహలనూ దాటుకొని – ముందు చూపులో ప్రకాష్ ఏర్పాటు చేసిన వారి వారి ఇంటర్నల్ కమ్యూనికేషన్ ప్రతిని అతనికి చూపించి-చివరికి మంచి గదిలో స్థిరపడ్డాం. “మీరు సాయంత్రం దాకా రిలాక్సవ్వండి. ఈ రోజు రాధానగర్ బీచ్‌కు వెళదాం. రేపు ఎలిఫెంట్ బీచ్. ఇది బాగా చిన్న ఊరు. ఇంతకు మించి మీరు చూడవలసినవి ఏమీ లేవు” అని చెప్పి వెళ్లబోయాడు మా మార్గదర్శి. నాకెందుకో ఏదో లోపం కనిపించింది. సాయంత్రం  గాదు మూడింటికల్లా రండి రాధానగర్ వెళదాం” అని తేల్చి చెప్పాను. ‘అంత ఎండలో ఎందుకు సార్’. అని సణుగుతూ వెళ్లాడతను.

 

మధ్యాన్నం మూడు అన్నానే గాని ఓ గంట గడిచి పదకొండు అయ్యేసరికి కాళ్లు ‘పదపద’ అన్నాయి. బయట కొంచెం ఎండగానే ఉంది.. ‘మీరు వెళ్లి రండి’ అని అనుమతి ఇచ్చేసింది లక్ష్మి. బయట పడ్డాను. ఓ రెండుగంటల టైముంది. ‘ఎక్కడికి వెళ్లాలీ?’ సందేహం. ‘ఎక్కడో ఒక చోటికి.. ఇన్ని వేలమైళ్లు గాల్లోనూ, నీళ్లలోనూ ప్రయాణంచేసి వచ్చింది ఇలాంటి బంగారు ఘడియల్ని హోటలు రూమ్‌కి అంకితం చెయ్యడానికి గాదుకదా..’. సమాధానం… అడుగులు మొదలయ్యాయి.

పక్కన ఓ అంతగా ఆకర్షించలేని టూరిస్టు సమాచార కేంద్రం. గోడమీద ద్వీపపు విపులమైన మ్యాపు. అక్కడున్న కుర్రవాడిని అడిగితే ‘బ్రోషర్లు అయిపోయాయి సార్.. ఎన్ని సార్లు చెప్పినా మా పోర్టు బ్లెయిర్ వాళ్లు పట్టించుకోవడం లేదు’ అని స్నేహంగా వాపోయాడు. ‘ఇంత చక్కని ద్వీపంలో, టూరిస్టు సమాచార కేంద్రంలో, కనీసం బ్రోషరైనా లేకపోవడం క్షమించరాని నేరం’ అని అంతే స్నేహంగా కోప్పడి,’ బాబ్బాబూ.. నీకు పుణ్యం ఉంటుంది. హేవ్‌లాక్‌దీ, నీల్ ది ఒక్కొక్క బ్రోషరు సంపాదించి పెట్టు. నీ పేరు కలకాలం గుర్తుంచుకొంటాను’ అని అసలు సిసలు కార్యసాధకుడిలా ఆ కుర్రాడిని – సమీర్ భౌమిక్ అతని పేరు- బ్రతిమాలను. జాలిపడి, వెళ్లి, ఓ పావు గంట జెట్టీలో తిరుగాడి, బాగా నలిగిపోయిన బ్రోషర్లు సంపాదించి తెచ్చాడా మహానుభావుడు భౌమిక్!

 

ఆ ద్వీపంలో ఉన్న ఆరువేలమంది ద్వీపపు ఉత్తర భాగంలో ఏడు ‘గ్రామాల్లో’ నివసిస్తారట. చాలావరకూ బెంగాలీలు- అందులోనూ 1972 లో బంగ్లాదేష్ నుంచి తరలి వచ్చిన వారు! ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఏడు గ్రామాలకూ తమ తమ ‘నెంబర్లు’ ఉండడం!! జెట్టీ ఉన్న ప్రాంతం గ్రామం నెంబర్ వన్. దాని పక్కనే రెండో నెంబరు గ్రామం – వీటికి పేర్లు లేవు!. ద్వీపపు మెయిన్ బజారు ఉన్న గోవిందనగరపు నెంబరు మూడు. ద్వీపపు నడిబొడ్డున ఉన్న నాలుగూ, ఆరో నెంబరు గ్రామాల పేర్లు శ్యాంనగర్, క్రిష్ణానగర్- దక్షిణాన పడమటి తీరాన ఉన్న అయిదో నెంబరు గ్రామం- విజయనగర్. తూర్పు తీరాన ఉన్న ఏడో నెంబరు గ్రమం రాధానగర్! ఇలా ఊళ్లకు నెంబర్లు ఉండటం, ఒకటి రెండు ఊళ్లకు అసలు పేర్లే లేక పోవడం. అదో వింత, విచిత్రం. ఆసక్తికరం!!

ఊరూ నెంబర్ వన్‌లో బయట పడ్డాను. మూడో నెంబరు గోవింద నగరానికి దారి తీస్తోన్న రోడ్డు పట్టుకొన్నాను. అసలక్కడ ఉన్నది ఆ ఒక్కటే రోడ్డు. చక్కటి రోడ్డు, పచ్చని పరిసరాలు. అక్కడక్కడ ఇళ్లు… అరటి చెట్లు.. కొబ్బరి చెట్లు.. చిరుఎండ – కానీ సముద్రం మాత్రం అందీ అందని చేలాంచలంలా ఓ వంద మీటర్ల దూరంలో – అదో అసహనం! రోడ్డుకూ సముద్రానికి మధ్య అనేకానేక రిసార్ట్లు.. కొన్ని గంభీరమైనవి.. మరికొన్ని గ్రామీణమైనవి.. ఆ గ్రామీణపు రిసార్ట్లో అత్యాధునిక వూరిళ్లు.. హిప్పి బాణీలనూ, విదేశీయువా – వాసారాల్లో ఉయ్యాలలూగడానికి హేమక్‌లు.. తలుపులమీద ప్రపంచంలోని అన్ని బాణీలనూ గుర్తుకు తెచ్చే వర్గ చిత్ర విన్యాసాలు.. డిజైనులు..

నేను కోరుకొంటొన్న ‘స్థానికులతో సంపర్కం’ అసంకల్పితంగా సమకూరనుందని స్పురించింది… వారాలు, నెలల తరబడి ఉండిపోయే విదేశీయులనూ స్థానికులే అనుకొంటే ఆ కోరిక బాగా నెరవేరిందా రెండు గంటల్లో… ఏభై ఏళ్ల క్రితం స్థాపించిన ఓ సీనియర్ సెకండరీ స్కూలు కనిపించింది-వెళ్లి పిల్లా పెద్దలతో కబుర్లు-మూడో నెంబరు గోవిందనగర్‌లో బజారు వాతావరణం.. షాపులు.. కాఫీ అంగళ్లు.. బ్యాంక్.. ఏటీఎమ్.. రంగురంగులో ఉండి ఆకర్షిస్తోన్న కూరగాయల బజారు. అందులో ఓ పావు గంట పచార్లు… మర్నాటి హోలీ రంగుల పండుగ సందర్భంగా పిచికార్లు చేతబట్టి నవ్వులు చిందిస్తోన్న మువ్వురు హాలెండు వనితలు.. రోడ్డు పక్కకు మళ్లీ సముద్రం వేపు అడుగు వేయగా దట్టంగా కొబ్బరితోవులు- సముద్ర తీరాన మడచెట్లు – తెల్లని ఇసుక — లోతులేని రంగురంగుల సముద్రం.. చిన్న చిన్న పడవల మీద ఏమాత్రమూ హడవుడిలేకుండా విహారాలు చేస్తోన్న విదేశీ యువతీ యువకులు (వీళ్లు టూరిస్టులు గాదు  ట్రావెలర్ల్సు!) ఓ కాఫీ దుకాణం, అడిగి వివరించి మరీ చేయించుకొన్న పెద్ద కప్పుడు , చిక్కని కాఫీ.. ఆ షాపులో నాతోపాటు చేరిన ఇద్దరు ఎస్టొనియా దేశపు నడివయసు ట్రావెలర్లు.. ‘ఇంత చక్కని ద్వీపంలో ఏమిటీ అపరిశుభ్రత .. ఎందుకీ రోడ్ల మీద చెత్త చెదారం.. కాస్తంత సివిక్ సెన్సు ఉంటే ఈ స్వర్గం ఇంత నరకప్రాయమవదు గదా’ అన్న వారి చిత్తశుద్ధితో కూడిన ఆవేదన – ఆ రెండు గంటల్లోనే నేను ఓ బయట నించి వచ్చిన వ్యక్తిగా గాక, ‘ఇన్‌సైడర్’ గా పరిణామం చెందడం.. స్పందించడం.. అతి ముఖ్యమైన అనుభూతి!

రాధానగరం బీచి… పొర్టు బ్లేయిర్‌లోనూ, హేవలక్ ద్వీపపు గ్రామం నెంబర్ వన్ లోనూ ఈ బీచ్ అందాలను జనాలు కీరిస్తోంటే – ‘పోన్లే.. ఆ మాత్రం స్థానిక సముద్ర భక్తి ఎవరికైన సహజం’ అంటూ భరించాను. కానీ ఒక్కసారి బీచిలోకి అడుగుపెట్టే సరికి నేను అందరినీ మించిన భక్తుడినయి పోయాను!

బీచి మొదలు వరకూ చక్కని రోడ్డు.. కారుదిగి ఇసుకలోకి అడుగు పెట్టగానే అటూ ఇటూ అర్థ చంద్రాకారంలో రెండు కిలో మీటర్ల మేర అద్భుత సౌందర్యం.. స్నేహంగా పలకరించే నీలాలజలాలు.. చిన్న చిన్న అలలు.. తెలుపూ గోధుమ రంగుల ఇసుక.. తీరానికి ఏభై మీటర్లలో అంతట పరచు కొన్న చిక్కని చక్కని పచ్చని అడవి.. నిడుపాటి వృక్షాలు.. వాటికి అల్లుకొన్న లతలు.. ఆ అర్థచంద్రాకారపు రెండు కోసల్లోనూ దూరాన ‘సముద్రంలోకి చొచ్చుకువస్తొన్న చిరుగిరి శిఖరాలు. మళ్లీ వాటి  నిండుగా వృక్షాలు.. ఏదో అంటారే వేయితలల ఆదిశేషుడుగారే ఆ సౌందర్యాన్ని వర్ణించగలరు! ఒకటి మాత్రం నిజం.. నేను కన్యాకుమారి నుంచి అటు గోవా గుజరాత్‌ల దాకానూ, ఇటు పాండిచ్చేరి బెంగాళ్ల దాకానూ ఎన్నో ఎన్నెన్నో బీచ్‌లను చూసాను. యూరప్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, సింగపూర్లలోనూ చూసాను. నాపరిమిత పరిజ్ఞానంలో చెప్పాలంటే ఈ రాధానగర్ బీచ్‌ను మించిన బీచ్‌ను నేను చూడలేదు!!

 

నాలుగు దాటలేదేమో… ఇంకా ఎండగానే ఉంది.. సందర్శకుల సంఖ్య అతిస్వల్పం.. ‘సౌఖ్యానికి సౌందర్యానికి మధ్య ఎంచుకోవలసి వస్తే సౌందర్యాన్ని ఎన్నుకొన్నవాడే చిట్ట చివరికి సుఖిస్తాడు అని నా ఫిలాసఫీ.. ఈ పడక్కుర్చీ ఫిలాసఫీనికి తాటాకులు కట్టే లక్ష్మి సహచర్యం.. రెండు కిలో మీటర్లూ నడిచి కొలిచి రావాలన్న నా తపన.. ‘వెళ్లు నాయనా, నాకీ నీడపట్టుచాలు’ అన్న తన ఆలోచన.

రవీంద్రుడి స్పూర్తితో ఒంటరిగా సాగాను. కానీ మనిషి ఎనాడూ ఒంటరిగాదు-అందులోనూ రాధానగర్ బీచ్ లాంటి సుందర సీమలో.. ‘ఓ సారి చూసి వద్దాం’ అన్న నీళ్లు వదిలి అడవిలో అడుగు పెడితే’ అంకుల్ మా ఫోటో తియ్యరా’ అని అడుగుతోన్న ఓ పాతికేళ్ల అమ్మాయి… కాస్త దూరాన ముసి ముసి నవ్వులలో ఆవిడ హనీమూన్ సహచరుడు.. ‘తీస్తాగానీ మరి దానికి నువ్వు ఫీజు ఇవ్వాలి.. నీ లేసుటోపి మహా సుందరంగా ఉంది.. దానితో నన్ను ఫోటో తీసుకోనివ్వాలి’ –  నా బేరం. సంతోషంగా ఒప్పుకోలు.. కబుర్లు.. ఫోటోలు.. గుజరాత్ నుంచట వాళ్లు – హేవలాక్ లోనే ఒకవారం.. మంచి నిర్ణయం…

 

లేసుటోపి ఎపిసోడు తర్వాత ముందుకు నడచీ నడచీ కొండకొన సముద్రంలోకి చొచ్చుకు వస్తోన్న ప్రాంతం చేరాను.. ఎవరూ లేని ఎకాంతం..’ ఇంత సౌందర్యమూ నాదే నాదే’ అని మనసు గంతు లేసింది. ‘అంత స్వార్థం వద్దు’ అని బుద్ధి బుద్ధి చెప్పింది. చలంగారన్న ‘సౌందర్యం నాదే అనుకోవడంగాదు.. సౌందర్యం నేనే అనే స్థితికి చేరాలి ఉపదేశం గుర్తొచ్చింది.’ ‘అలాంటి స్థితీ అంటే ఎన్నో ఎన్నెన్నో మెట్లు ఎక్కాలి గదా – పోనీ ఆరంబిద్దాం’ అనిపించింది…

తగ్గుమొహం పడుతోన్న ఎండ.. ఆహ్లాదకరంగా వీస్తోన్న సాగరపు చిరుగాలి.. అడపాదడపా సముద్రపు పక్షులు (సీగల్స్!).. అడవిలోంచి జాగ్రత్తగా వింటే తియ్యటి పక్షుల శబ్దాలు – సుతిమెత్తని ఇసుక స్థానంలో కొండల బండరాళ్లు.. జారకుండా జాగ్రత్త పడుతూ వెళ్లగలిగినంత దూరం వెళ్లడం.. ఆ సాగర సౌందర్యంలో ఉనికినే కోల్పోవడం.

ఎంత మన ఉనికి మనమే మరచి పోయినా తోడుగా ఏళ్ల తరబడి నడుస్తోన్న, వేలమైళ్లు కలసి వచ్చిన మనిషి సంగతో!! ఆవేపు అడుగులు వేసాను.. అయినా మనసు చంచలా.. దారిలో కనిపిస్తోన్న సహ టూరిస్టులు.. పలకరించగానే వులకరించిపోయే సమయమూ సందర్భమూ.. అప్రయత్న చిరునవ్వులు– అలాంటి సమయంలో నీళ్లలో ఆడుకొంటోన్న మోచేతుల దాక దంతపుగాజులు దొంతర ఉన్న నాలుగు చేతులూ, ఇద్దరు యువతులూ..

వారు రెండు హానీమూన్ జంటలకు చెందిన ‘బెటర్ హాఫ్’లు.  ఆ ఉదయం మాతో కలసే ఓడలో వచ్చిన వారు.. గుర్తింపులు – పలకరింపులు.. ఉత్తర భారత దేశంలో పెళ్లైన తర్వాత రెండు మూడు వారాలు (ఇంకా ఎక్కువేనేమో!) అలా చేతులకు నిండుగా గాజులు ఉంచుకొనడం కద్దు.. అవి ఆయా పెళ్లి బట్టలతో సరిభాగంగా అమరిపోతాయి. కానీ మరివీళ్లు-పెద్ద వాళ్ల ఆజమాయిషీలు లేవుగదా – జీన్సు, టీషర్టుల్లో తిరుగాడుతున్నారు. గాజులు మాత్రం యధా ప్రకారం ఉన్నాయి. ఆ విశేషాన్ని కెమేరాలో బంధించాలనిపించి అనుమతి అడిగాను. మహదానంగా, యమాస్పోర్టివ్‌గా చేతులు ముందుకు జూపారు.. ఈలోగా వారి వారి భర్తలు ఒకవేపు నుంచీ.. మా లక్ష్మి ఇటు వేపునుంచీ వచ్చి చేరారు.. తీరా జూస్తే వీళ్లు మా ఊరి వాళ్లే – ఢిల్లీ. మరింకేం.. కబుర్లే కబుర్లు!

 

చూస్తూ ఉండగానే పగలు ముగిసిపోయి సంధ్య సమయం ఆరంభమయింది. సూర్యాస్తమయ సౌందర్యానికి రాధానగర్ బీచి పెట్టింది పేరు. కొండచెరియ సముధ్రంలోకి చొచ్చుకు వస్తోన్న పశ్చిమ దిక్కున, ఆ బిందువు దరిదాపుల్లోనే సూరీడు డ్యూటీ దిగిపోయే స్థలం! మరింకేం – అందానికేం కొదవులేదు. అప్పటిదాకా కేకలూ, కేరింతలతో గలగలలాడిన రాధానగర్ బీచ్ ఒక్కసారిగా ‘మౌనం’ వహించింది. అందరి దృష్టీ అస్తమిస్తోన్న భానుబింబం మీదే- అడపాదడపా క్లిక్కుమంటోన్న కెమేరాలు.. అన్నట్టు అంత సుప్రసిద్ధ బీచిలోనూ ఆనాటి సాయంత్రం రెండు మూడువందలకన్నా ఎక్కువ మంది లేరు.. ముఖ్య భూభాగానికి వందలమైళ్ల దూరాన ఉండటం నిజానికి అండమాన్ల పాలిటి వరం అదే గోవాలోని కలాగూట్ బీచ్‌లో అయితే ఇదే సమయంలో వేలకొద్దీ టూరిస్టులు పొగుపడి ఉండేవారే!!

మూడు రోజులు గడిచిపోయాయి. హేవలాక్‌లో ఇరవైగంటలు.. అంటే చనువు వచ్చేసింది. కొత్తదనం దూరమయింది.. గైడు గారి కోసం ఎదురుచూడ్డం అన్న ప్రసక్తే లేదు.. నా అలవాటు ప్రకారం ఆ నాలుగోనాడు ఉదయం అయిదున్నర కల్లా రూంలోంచి బయటపడ్డాను.. రోడ్డును పక్కన బెట్టి తిన్నగా ఉండలేను కాని దారుల్లో సముద్రతీరం చేరాను.

ప్రకృతి నిజంగా వరప్రసాదిని. ఎర్లీ పక్షులకు కీటకాలు దొరకడం సంగతి ఎలా ఉన్నా నాకు మాత్రం ఆ అయిదుగంటల ముప్పైనాలుగు నిమిషాలకు దొరికిన అ ఉదయ సంధ్యా దృశ్యం నిజంగా వరప్రసాదమే! ఆకాశం నిండా పరచుకొంటోన్న ఉదయ సంధ్యా వర్ణాలు, దిగువన నిశ్చల జలధిలో వాటివాటి ప్రతిబింబాలు.. ఆకాశానికీ సముద్రనికి తేడా కనిపించని క్షితిజరేఖ.. కంటికి ఆహ్లాదం కలిగించే మంద్రపురంగులు.. శోభాయమాన దృశ్యమది!

 

3 thoughts on “అండమాన్ డైరీ – 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *