April 30, 2024

విజయగీతాలు – 3

హాసం ప్రచురణ:                                                                                                                                                              

పింగళి నాగేంద్రరావు

 Pingali_Nagendra_Rao

1901లో బొబ్బిలి తాలూకా రాజాంలో జన్మించిన పింగళి నాగేంద్రరావు విద్యార్థి దశ బందరులో సాగింది. కొంతకాలం బడిపంతులుగా పంచిచేసిన పింగళి, తిరుపతి వెంకటకవుల వల్ల ప్రభావితుడై స్వాతంత్ర్యపోరాట సమయంలో భరతమాతను కీర్తిస్తూ గీతాలు వ్రాసి జైలు శిక్ష అనుభవించారు.

ఖర్గపుర్‌లో రైల్వేశాఖలో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో బెంగాలీ రచయిత ద్విజేంద్రలాల్‌ రాయ్ నాటకాన్ని “మేంవాడు పతనం” పేరిట తెలుగులోకి అనువదించి ప్రదర్శించారు. “శారద” పత్రికకు పనిచేసిన రోజుల్లో ఆస్కార్ వైల్డ్ రచన ఆధారంగా ‘వింద్యరాణి్’ నాటకం వ్రాయగా బందరులోని ఇండియన్ నేషనల్ థియేటర్ వారు ప్రదర్శించారు.

1941లో జగన్నాధ్ దర్శకత్వ వహించిన “భలేపెళ్ళి” చిత్రం ద్వారా రచయితగా సినీరంగ ప్రవేశంచేసిన పింగళి మలిచిత్రం “వింధ్యరాణి”. ఈ రెండు పరాజయం పొందినా, పింగళిలోని స్పార్క్‌ను గ్రహించిన దర్శకులు కె.వి.రెడ్డి “గుణసుందరికథ”కు (దీనికి మూలం షెక్స్‌పియర్ నాటకం- ‘కింగ్‌లియర్’) రచయితగా అవకాశమిచ్చారు. అది అఖండవిజయం సాధించింది.

ఆ వెంటనే విజయావారి “పాతాళభైరవి” కె.వి. – పింగళి కాంబేనేషన్‌లో రూపొందించి సంచలన విజయం సాధించి నాటి నుంచి విజయావారు నిర్మించిన జానపద (“చంద్రహారం”, “జగదేకవీరునికథ”, “ఉమాచండీ గౌరీ శంకరుల కథ”) పౌరాణిక (“మాయాబజార్”, “సత్య హరిశ్చంద్ర”) చిత్రాలకు మాటలు, పాటలు, “పెళ్ళిచేసి చూడు”, మిస్సమ్మ”, “అప్పుచేసి పప్పుకూడు”, “గుండమ్మ కథ”, “సి,ఐ,డి”. సాంఘిక చిత్రాలకు రసవత్తరమైన పాటలు వ్రాసారు.

బయటి సంస్థలు నిర్మించిన “పెళ్ళినాటి ప్రమాన్ణాలు”, “శ్రీకృష్ణార్జున యుద్ధం”, “భాగ్యచక్త్రం”, “మహామంత్రి తిమ్మరుసు”, “శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు”, “మహాకవి కాళిదాసు”, “రాజకోట రహస్యం” వంటి చిత్రాలకు కూడా రచన చేసారు పింగళి.

ఆయన సృష్టించిన – నేపాళమాంత్రికుడు, నిక్షేపరాయుడు, హంవీరుడు వంటి పాత్రలు యెన్నో! ఆయన రాసిన మాటలు డింగరి, డింభకా, ఘాటుప్రేమ, ముద్దొచ్చావులే బుల్‌బుల్, సాహసం సేయర డింభకా, హలా, విళమా, శిల్పం, గిల్పం, అస్మదీయులు, తస్మదీయులు – వంటివి, ప్రజల నోళ్లలో పలుకుబడులుగా మారాయి.

1971ఓ మరణించిన పింగళి నాగేంద్రరావురచన చేసిన చివరి చిత్రం కె.వి.రెడ్డి దర్శకత్వంలో యన్.టి.ఆర్ నిర్మించిన “శ్రీకృష్ణసత్య”!

విజయావారి చిత్ర విజయాలకు తన కలంద్వారా వూపిరులూదిన సాహితీ స్రష్ట, తన సాహితీ విన్యాసంతో ప్రేక్షకుల్ని రంజింపచేసిన సాహితీ మాంత్రికుడు పింగళి నాగేంద్రరావు.

 

 

 

పెళ్ళిచేసి చూడు

(29.2.1952)

 

“కట్నముకోరకై పుస్తెలు తెంచే

కఠినులదే యీ యుగమమ్మా”–

సామాన్య కుటుంబాలను అతలాకుతలం చేసే ‘వరకట్న’ దురాచార జాడ్యం పై విజయావారు చక్రపాణి పదునైన స్క్రిప్ట్ ద్వారా, ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం ద్వారా సంధించిన వ్యంగ్యాస్త్రం “పెళ్ళిచేసి చూడు” చిత్రం.  ఈ సినిమా 1952లో విడుదలయినా యీ యాభై అయిదేళ్ళలో ఆ పరిస్థితిలో యే మార్పు లేకపోయినా యింకా వికృత రూపం దాలుస్తూనేవుంది.

పిల్లలపై చిత్రీకరించిన పాటలు (బ్రహ్మయ్య, అమ్మా నొప్పులే) ఊటుకూరి సత్యనారాయణ వ్రాయగా మిగతా పాటలన్నీ పింగళి నాగేంద్రరావు వ్రాసారు. వాటికి సంగీతం ద్వారా ప్రాణం పోసారు ఘంటసాల.

గొడపాడు ఎలిమెంటరీ స్కూలు టీచరు రాజు (జోగారావు). స్కూలు వార్షికోత్సవ సందర్భంగా “పెళ్ళిచేసి చూడు” అనే నాటకాన్ని రాజు నేతృత్వంలో ఆ స్కూలు పిల్లలు ప్రదర్శిస్తారు. రాజు శిష్యుడు సిసింద్రి – పేరుకు తగ్గ గడుగ్గాయి. ఆ నాటకంలో హీరో ఆ కుర్రాడే (మాస్టర్ కుందు)! అతనితోపాటు పెళ్లికూతురుగా బేబీ రాజకుమారి, బ్రహ్మయ్యగా మాస్టర్ కోటిలింగం నటించారు. సరళమైన భాషతో ఆ గీతం గిలిగింతలు పెడుతుంది. పాట పాడినవారు, కోమల, రాణి, ఉడుతా సరోజిని.

:బ్రహ్మయ్యా, ఓ, బ్రహ్మయ్యా-

లోకమునే మురిపించే –

చక్కని ఓ చుక్కను

నాకు పెళి చేయనిచో –

ఇంక బ్రతుకలేనయ్యా!!

బ్రహ్మ : ఏరికోరి తెస్తినిరా –

నీకు తగిన పిల్లరా;

మారుమాట పల్కదురా –

మురిపెమెల్ల తీర్చుకోరా

సిసింద్రీ                   :               అహహా!…. ఎంత గొప్ప దేవుడవో – నాదుకోర్కె తీర్చినావు

ఇంక నేను ధన్యుడను – నీదు మేలు మరువనయ్య!

ఏయ్ – ఇదిగో – చూడు – నిన్నే – నేను – నీ భర్తని – అరె పల్కదేం ?

మారు పల్క దేమయ్యా మూగపిల్ల నిచ్చావా ?                               !!బ్రహ్మయ్య!!

నోరునిచ్చి కావవయా – భక్తులతో పరిహాసమా ?

బ్రహ్మ                     :               మేలుకోరి మూస్తినిరా! గళము విప్పమనకురా!

నోరుగల భార్యలతో  నరులు వేగలేరురా !

సిసింద్రీ                   :               నీ కెందుకు నే వేగెద – నోరువిప్పి పోవయ్యా !!

బ్రహ్మ                     :               అయితే ఇక నీ కర్మం – అనుభవించు తిమ్మయ్యా!!

సిసింద్రీ                   :              ప్రేయసి ! ఓ ప్రియా ! నా ప్రియా !

ఆమె                       :              ప్రియమో చౌకో – నోరుమూసుకొని కొనితేవోయ్

వాయిల్ సిల్కూ – సెంటూ – పౌడర్ – బీచికి పోయె బ్యూక్ కార్

గోల్డువాచీ – ముఖమల్ స్లిప్పర్ – ముచ్చటగొలిపే బొచ్చుకుక్క

కోరినవన్నీ నోరుమూసుకొని కొని తేవాలోయ్ !

లేకపోతే విడాకులోయ్ !

సిసింద్రీ                   :              అఁ ఔర! ఎంత గయ్యాళిని మెడకు గట్టినావయ్యా!

హోరు తాళలేనయ్యా! నోరు మరల మూయవయ్యా

ఆమె                       :              నా నోటిని మరల మూయ ఎవరికైన తరమౌనా!

ఏదీ రమ్మని చూద్దాం బ్రహ్మ ప్రజ్ఞ తెలిసేను.

బ్రహ్మ                     :              ఔనమ్మా! ఔనౌనమ్మా నాచేతను కాని పని స్త్రీల నోరు మూయడమే

తల్లీ! నే వాగలేను పోయివత్తు సెలవిమ్మా!

సిసింద్రీ                   :              ఇంతేనా నీ తెలివి ఏమి వ్రాత వ్రాశావోయ్                          !!బ్రహ్మయ్య!

 

రాజు చెల్లెలు అమ్మడు(జి.వరలక్ష్మి). ఆమెకు పెళ్ళిసంబంధం కోసమని వరసకు మేనమామ అయిన గోవిందయ్య (దొరస్వామి) యింటికి శిష్యుడితో సహా వెళతాడు రాజు. గోవిందయ్య అతని భార్య చుక్కమ్మ (సూర్యకాంతం) వాళ్ళ కూతురు చిట్టి (పుష్పలత)ని రాజుకు కట్టబెట్టాలని ఆలొచిస్తారు. ఆ చిట్టిని భీమన్న ప్రేమిస్తాడు. చిట్టి కోసం పెళ్ళిచూపులకు రాబోతున్నారని తెలుసుకొని “ఎవడొస్తాడో చూస్తాగా” అంటూ సవాలు చేస్తాడు, వస్తాడు భీమన్న. తాలింఖానాలో వెయిట్ లిఫ్టింగ్ పరికరాలుంటాయి. వాటికి తగ్గ మ్యూజిక్‌ బిట్స్ యిచ్చి భీమన్నకు తగ్గట్టు గాత్రాన్ని సవరించి గంభీరంగా పాడారు ఘంటసాల. ఆయనతో పాటు గిడుగు భారతి అనే గాయని చిట్టి పాత్రకు గాత్రదానం చేసారు. ఆ గీతం….

భీమ్ : ఎవడొత్తాడో సూత్తాగా –

పోటీ – యెవడొత్తాడో సూత్తాగా

సిట్టెమ్మా నువ్వు నా భార్యవ్ –

నువు పుట్టిందే నాకోసం

మీసం పెట్టిందే నీ కోసం

పల్టీ కొట్టేదే మన పెళ్ళికోసం – హుప్ – హుప్                                                   !!ఎ!!

చిట్టి : అబ్బో! అబ్బో! బయమేత్తోందే –

అమ్మా నానా తెత్తున్నార్లే

వొత్తునార్లే పెళ్ళికొడుకులూ

సూత్తాగా ఏం చేత్తావో యిక

భీమ్ : ఏం చేత్తానా రానీ, సెపుతా

కుత్తీబడతా – యెత్తికుదేత్తా

గోడవతల యిసిరేస్తా! అంతే –

బీమన్నకు కోపమె రాదూ-

వొత్తే తిరిగేదే లేదు –                                                                                             !!ఎ!!

 

పెళ్ళిచూపులకు వెళ్ళిన రాజును భీమన్న హడలగోడతాడు. వాడు కోపంతో యింటికి తిరిగివచ్చి అమ్మడుకు తగ్గ సంబంధం చూసేదాకా యింటి ముఖం చూడనని శపథం చేసి ప్రయాణమౌతారు. పాట తాలుకు ఎత్తుగడ సంగీతం వినిపిస్తుండగా రాజు, సిసీంద్రి పెళ్లి పెద్దలకు తగ్గ దుస్తులు వేసుకొంటారు.

మొదటి చరణం వీధిలోనూ, రెండో చరణం రైలు పెట్టెలోనూ, మూడో చరణం బండిమీద, నాలుగోచరణం పడవమీద చిత్రీకరిస్తారు. అదే విధంగా మొదటి చరణంలో యేయే వూళ్ళలో వెతకాలి, రెండో చరణంలో పెళ్ళికొడుక్కి యేమేం కావాలి, ఎట్లా వుండాలి, మూడో చరణంలో పెళ్ళిలో యేయే పిండివంటలు ఘుమఘుమలాడాలి, నాలుగో చరణంలో పెళ్ళి వాతావరణం యేయే వాయిద్యాలు హోరుతో కళకళలాడాలి వివరిస్తారు.

ఒక పాటకు యింత స్పాన్ వుండటం అప్పటికి బహుశః అదే ప్రథమం గావచ్చు. జోగారావుకు పిఠాపురం నాగేశ్వరరావు, కుందుకు అతని సోదరుడు రామకృష్ణ పాడిన ఆ గీతం….

పెళ్ళి చేసి చూపిస్తాం – మేమే పెళ్ళి పెద్దలనిపిస్తాం

బందర్ నెల్లూర్ హైదరబాద్ – మద్రాస్ గిద్రాస్ మథనంచేసి

అవసరమైతే యెంతైనా సరే – అడిగిన కట్నం మొహానవేసి !!పెళ్ళి!!

కోటూ పంట్లాం వాచీ గొల్సూ – వాటమైన క్రాపింగ్ కరల్సూ

పెళ పెళలాడే పెళ్ళికొడుకునూ – జబర్దస్తిగా పట్టుకువచ్చి !!పెళ్ళి!!

బజ్జీ బొండా బర్ఫిలడ్డూ-గారె బూరె ఇడ్లీ పెసరెట్ – అహాహా

గంగాళాలతో కాఫీపోసి – ధుమాధుమాగా విందులుచేసి !!పెళ్ళి!!

రంగురంగుల పూసపల్లకి – తాషా మరఫా తుతురు తుతురుతూ

బాకాబ్యాండ్ భజంత్రీలతో – అవల్ రైట్‌గా ఢంకా కొట్టి !!పెళ్ళి!!

 

వరాన్వేషణలో ధూపాడు చేరిన గురుశిష్యులు పూటకూళ్ళ వెంకమ్మ యింటి దగ్గర ఆగారు. అక్కడేవున్న చిచ్చుబుడ్డి (బేబి గిరిజ)ను చూసి శిష్యుడు సిసింద్రీ మతిపోగొట్టుకొని ఆ యింట్లోకి వెళతాడు.. చిచ్చుబుడ్డి వాళ్ళ వివరాలు అడగడం, సిసింద్రీ చెప్పటం ముచ్చటైన పాటలో మురిపెంగా చిత్రీకరించారు దర్శకులు. రామకృష్ణ, శకుంతల వినిపించిన ఆ హుషారు గీతం…

చిచ్చు     : ఎచ్చటనుం డొచ్చినారూ – బల్ చక్కటి రాజులు మీరూ

సిసింద్రీ   : గురు శిష్యులము మేము భామా! గోడపాటి నివాసుల మేము

చిచ్చు     : అంత పండితులయ్య మీరూ అయితె దండంబు దండంబు స్వామీ

సిసింద్రీ   : అక్షయంబుగ కోమలాంగీ! నీవు వర్ధిల్లవే వానరాంగీ!

చిచ్చు     : ఏల వేంచేస్తిరో యిటులా?

సిసింద్రీ    : పెండ్లి సంబంధమున కొస్తిమిటుల

చిచ్చు     : అయితే ఘనులార! మీరు కూర్చోండి

సిసింద్రీ   : సరియె సంతోషమాయెనే సఖియా!

సంబంధం వేటలో ధూపాటి వియ్యన్న (ఎస్.వి.రంగారావు) యింటికి వెళతారు గురుశిష్యులు, “ఎక్స్‌ జిల్లా బోర్డు నెంబరు పంచాయితీ బోర్డు ప్రసిడెంటు ధూపాటి వియ్యన్న యింటికి వచ్చి భోంచెయ్యకుండా వెళ్ళటమా, ఇన్‌సల్డ్” అంటూ నేత్ర సంచాలనంతో కలిపి ముక్కుపుటాలను విచిత్రంగా కదిపే పాత్రను ఎస్.వి.రంగారావు అద్భుతంగా ఆవిష్కరించారు. (మద్రాసు సెంట్రల్ స్టేషన్‌లో ఆ మేనరిజం వున్న వ్యక్తిని చూసారట రంగారావు) నీ చెల్లెలికి మంచి సంబంధం చూసే బాధ్యత నాది అని భరోసా యిచ్చి తన కూతురు సావిత్రి (సావిత్రి)తో రాజు పెళ్ళి ఫిక్స్ చేస్తాడు వియ్యన్న. ఆ భవంతిలో అతిథిగా వున్న రాజుకు రాత్రివేళ కమ్మటి కల వస్తుంది. అందులో రాజు ఊర్వశి వలపు నిరాకరించే అర్జునుడు. అతన్ని కవ్వించే వూర్వశి సావిత్రి, సిసింద్రీ, చిచ్చుబుడ్డి వారిపై పూల బాణాలు సంధించే రతీమన్మథులు.

కళదర్శకులు గోఖలే-కళాధర్ సృష్టించిన దవలోకంలో పసుమర్తి కృష్ణమూర్తి నృత్య భంగిమలతో ఆ గీతాన్ని వెరైటీగా చిత్రీకరించారు చాయాగ్రాహకులు బార్‌ట్లీ. సాహిత్యంలో ఊర్వశిది సాముదాయకపు వలపు పంపిణిగా అభివర్ణిస్తారు రచయిత పింగళి. దీనికి కారణం-ఇంద్రపదవికి ఎవరు తపస్సు చేసి ఎసరు పెట్టినా, వారిని ఊర్వశి తన నృత్యగాన ప్రణయ భంగిమలతో వ్రతభంగం గావించేది. అలా ఎందరికో తన వలపును పంచి యిచ్చింది గనుక ఊర్వశిది సాముదాయకపు వలపు పంపిణిగా వర్ణించటం సమంజసం. ఎంతో కాలంగా ఎన్నో లోకాల్లో అనే అర్థం వచ్చేలా “యుగయుగాలుగా జగజగాలను” అంటూ అర్థం వచ్చేలా పింగళి చేసిన ప్రయోగం ప్రశంసనీయం. జగజగాలను అనే మాట సృష్టించినట్టే ఉరూగించిన అనే మాట కూడా పుట్టించారు పింగళి. పాట పాడినవారు – లీల, పిఠాపురం, రామకృష్ణ.

ఊర్వశి   :               (సాకి) ఎక్కడోయీ – హాప్రియా!… హా ఎక్కడోయీ

ప్రియా! ప్రియా! ఓ ప్రియా! ప్రియా

యుగయుగాలుగ – జగజగాలనూ

ఊగించిన – ఉర్రూగించిన మీ ఊర్వశినీ,

ఊర్వశి సూర్వశి సూర్వశినీ నీ ప్రేయసిని !!ఎ!!

అర్జు        :               ఇక్కడే – నే నిక్కడే – యుగయుగాలుగ – జగజగాలనూ

ఊగించిన – మా ఊర్వశివా – అందరి ప్రేయసివా….

చాలు చాలు నీ సాముదాయకపు వలపు పంపిణికి నమస్తే – నమస్తే

మన్మ     :              అయ్య ఇక్కడ – అమ్మ అక్కడ యిద్దరికి పొత్తు యెక్కడి?

ఇక యిద్దరికి పొత్తు యెక్కడ?

ఊర్వశి   :               ఇంత వలచిన వనితను – చులకనసేతువ? నరుడా! పామరుడా!

ఇదొ బృహన్నలవుగా శాపమిడెదరా – జనుడా అర్జునుడా!

అర్జు        :              ఆదరించెదవా? బెదరించెదవా?

మన్మ     :              దొరకనిదోయీ! వదలకుమోయీ! – హాయీ, ఈరేయీ!

ఊర్వశి    :              అంతేనోయీ! నను విడకోయీ! – ప్రియా! ప్రియా! 

మర్నాటికి సావిత్రి ఊర్వశి వంటిది కాదని, సౌమ్యురాలని తెలుస్తుంది. రాజు పెళ్లికి సరేనంటాడు. సావిత్రి, రాజుల పెళ్ళి అవుతుంది. వియ్యన్న అన్నమాట ప్రకారం గడ్డిపాడులో వున్న వెంకటపతి (డా!!శివరామకృష్ణయ్య) కొడుకు రమణ (యన్.టి.రామారావు)తో పదిహేను వేల కట్నానికి అమ్మడితో పెళ్ళి ఖాయం చేస్తాడు. వెంకటపతి డబ్బుమనిషి. పెళ్ళిపీటలమీద తాళి గట్టి సమయానికి గోవిందయ్య దుర్భోధవల్ల వెంకటపతి ముందుగా డబ్బు కావాలంటాడు. వియ్యన్న యిదిగో అని తమాషాగా మేనేజ్ చేస్తాడు. మూడుముళ్ళు పడ్డాయి. అక్షింతలు వేసారు. వియ్యన్న డబ్బుకు బదులు ప్రోనోటు వెంకటపతి చేతిలో పెడతాడు. వెంకటపతి అగ్గిరాముడై మండిపడి పీటల మీద నుండి రమణను తీసుకెళతాడు.

ఇక్కడో విశేషం గమనించాలి. ‘పాతాళభైరవి’ చిత్రంలో సినిమా మొదలెట్టిన 45 నిమిషాల తరువాత దుష్టపాత్ర నేపాళమాంత్రికుడు కధా ప్రవేశం. ‘పెళ్ళిచేసి చూడు’ లో సినిమా ప్రారంభమైన 50 నిముషాల తర్వాత హీరో పాత్ర వస్తుంది. అంటే కథను బట్టి ఆర్టిస్టు గానీ ఆర్టిస్టును బట్టి కథకాదు అనేది ఆనాడు వారు నమ్మిన సత్యం.

రాజు యింట్లో వున్న నగా నట్ర తీసుకెళ్ళి వెంకటపతికి యిచ్చి ప్రాధేయపడతాడు. ఆయన కరగడు. రమణను వేడుకొంటాడు. విద్యావంతుడు, న్యాయవాది అయిన రమణ తండ్రి ఎదుట ఆగ్రహం నటించి, రాజుకు భరోసా యిచ్చి అత్తవారింటికి వస్తాడు.

ఆ హుషారులో సావిత్రి, అమ్మడు సమక్షంలో చిచ్చుబుడ్డి, సిసింద్రీ డ్యూయట్ పాడుకొంటారు. అందులో సినిమా హీరోయిన్లమీద సైటెర్ వేసారు పింగళీ. రామకృష్ణ, శకుంతల వినిపించిన ఆ పాట.

చిచ్చు     :               (సాకి) ఓహో

సిసింద్రీ   :               హై ఏవూరిదానవే వన్నెలాడి బల్ –

ఠీవిగా ఉన్నావె గిన్నెకోడీ

ఠీకు ఠాకుగ వచ్చావె టక్కులాడీ!

ఠాకు ఠీకూగ వచ్చావె టక్కులాడీ!

చిచ్చు     :              ఓ… ఊరులన్ని నావేనోయ్ చిన్నవాడా!

ఊరి – గోడలని నావేనోయ్ వన్నె కాడా!

నేను – సినిమాస్తార్‌నోయ్ కొంటెవాడా!

సిసింద్రీ   :               భేషైన దానవే బోసితారా ! నీవు

వేషాలేమి వేశావె పాతాస్టారా ! నీవు

వేషాలేమి కట్టావే – పాతతారా!

సెభాషు – నిన్ను మెచ్చార ఊర ఊర?

చిచ్చు     :               ఓ… హీరోయిన్నె వేశానోయ్ పిచ్చివాడా!

ఎంద్రొ హీరోయిల్ని మింగానోయ్ వెర్రివాడా!

ఎంద్రొ హీరోల్నె చంపానోయ్ గోడగోడ

నాకు బ్రహ్మరథం పట్టారోయ్ వాడవాడ

ప్రజలు బ్రహ్మరాధం పట్టారోయ్ వాడవాడ

అత్తవారింట్లో మేడమీద రాజు తబలా వాయిస్తుంటే, కొత్త పెళ్ళి కొడుకు రమణ హార్మోనియం శృతి చేస్తూ ఓ లలిత గీతం వినిపిస్తాడు. షేక్స్‌పియర్ వ్రాసిన “ది వరల్డ్ ఈజ్ ది స్టేజ్, వియ్ ఆల్ అర్ ఆర్టిస్ట్స్” అనే భావాన్ని స్పురించేలా పింగళి వ్రాయగా, ఆ గీతాన్ని ఘంటసాల ఆలపించారు.

ఈ జగమంతా నిత్యనూతన నాటకరంగం

ఈ జనమంతా అందలి చిత్రచిత్ర పాత్రధారులు

ఈ జగన్నాటక సూత్రధారి ఆ సర్వసాక్షి ఈశ్వరుడే!

జగమంతా ఒక నాటకరంగం

జగమంత యిక పాత్రధారులే!

రాజు యిల్లంతా సందడిగా వుంది. రమణ-అమ్మడు శోభనం తంతుకూడా పూర్తయింది. హీరో మాంచి హుషారుగా వున్నాడు. మళ్ళా గానాబజానా మొదలైంది. రాజు తబలా, సిసింద్రీ మౌత్ఆర్గన్, హీరో హార్మోనియం, వారికి కాఫీలందించటం అమ్మడివంతు. ఇహ హీరో సందేశ గీతాన్ని వినిపిస్తాడు. ఈ పాటలో యన్.టి.ఆర్ చాల రొమాంటిక్‌గా వుండటమే కాదు ‘ఇంటాబైటా జంటకవులవలె అంటుకు తిరగాలోయ్’ అంటూ నాయికను కళ్లతోనే కవ్విస్తాడు. నాటి నుంచి నేటి దాకా ఘంటసాల అభిమానులు వేధికల పై వినిపించే ఆ సందేశగీతంలో భావకవులపై ఒక విసురు కూడా వుంది.

 

1 thought on “విజయగీతాలు – 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *