April 30, 2024

జయమ్ము నిశ్చయమ్మురా – త్ర్యస్ర గతి

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు j.k.mohanrao

 

పాటలను, పద్యములను వ్రాయునప్పుడు ఒక ప్రత్యేక గతిలో వ్రాస్తే వాటిలో ఒక తూగు నిండియుంటుంది.  మనకు సుపరిచితములైన గతులు – త్ర్యస్ర, చతురస్ర, ఖండ గతులు.  వీటికి వరుసగా మూడు, నాలుగు, ఐదు మాత్రలు ఉంటాయి.  రెండు గతులు కలిసి ఉంటే దానిని మిశ్రగతి అంటాము.  ఈ లఘు వ్యాసములో అన్నిటికంటె తేలికైన త్ర్యస్రగతిని వివరిస్తాను.  సున్నను ఉపయోగించకుండ మూడు సంఖ్యను మూడు విధములుగా మనము పొందవచ్చును.  అవి – 1+1+1, 1+2, 2+1.  1, 2 సంఖ్యలకు బదులుగా వాటికి సరిపోయే లఘువు (I), గురువు (U) గుర్తులను ఉపయోగిస్తే పై అంకెలకు బదులు III, IU, UI మనకు లభ్యము.  చెలియ, చెలీ, చెల్లి పదములు పై అమరికకు సరిపోతాయి. పాటలో గాని పద్యములో గాని ఇట్టి మూడు మాత్రల పదములను పదేపదే ఉపయోగిస్తే అది త్ర్యస్రగతికి సరిపోతుంది. ఉదాహరణకు

 

మనసు నిన్నె గోరె చెలీ

తనువు నీకె వేచె చెలీ

 

అని ఒక పల్లవిని వ్రాస్తే అది త్ర్యస్ర లేక తిస్రగతికి సరిపోతుంది.

 

తెలుగు ఛందస్సులో ఈ గతికి సరిపోయే ఒక రెండు వృత్తములను, కొన్ని పాటలను మీకు పరిచయము చేస్తాను.  III, IU, UI లను వరుసగ న-గణము, వ-గణము, హ-గణము అని తెలుగులో పిలుస్తారు.  కన్నడ ఛందస్సులో ఈ మూడింటిని బ్రహ్మ గణములు అని అంటారు.  ఈ మూటిలో IU కు ఎదురు నడక గలదు. ఎదురు నడక అంటే మొదట లఘువు, తఱువాత గురువు వచ్చే పదములు, ఉదా. హరీ, సఖీ, ఇత్యాదులు.  పాట ఇట్టి పదములతో ప్రారంభమయితే పాడుటకు కొద్దిగా ప్రతిబంధకముగా నుంటుంది కావున దీనిని ఎదురు నడక అంటారు. దీనిని తొలగించితే మిగిలిన న-గణమును, హ-గణము లేక గలమును తెలుగులో సూర్య గణములు అని పిలుస్తారు.

 

త్ర్యస్రగతిలో సాగే వృత్తములో పంచచామరము ఒకటి. ఇందులో వరుసగా ఎనిమిది లగములు (లేక వ-గణములు) ఉంటాయి. అందువలన ఇందులో ఎదురు నడక (లఘువు తఱువాత గురువు) ఉంటుంది.  ఎన్నో స్తోత్రములు పంచచామరములో నున్నాయి,
ఉదా. గణేశ పంచరత్నము ,
రావణకృత శివతాండవ స్తోత్రము .
సీతారామకల్యాణములో ఘంటసాల కూడ శివతాండవస్తోత్రములోని ఒక రెండు పద్యములను పాడారు

 

పంచచామరములో ముందున్న లఘువును తొలగిస్తే మనకు ఉత్సాహలోని ఒక ప్రత్యేకతయైన సుగంధి వృత్తము లభిస్తుంది. అసలు సిసలయిన తెలుగు దేశి ఛందస్సులోని జాతి పద్యము ఉత్సాహ.  ఈ ఉత్సాహకు ప్రతి పాదములో ఏడు సూర్య గణములు ఒక గురువు ఉంటుంది, అనగా – (సూ-సూ-సూ-సూ) – (సూ-సూ-సూ-గురువు). సామాన్యముగా పాటగా పాడేటప్పుడు పాదము చివర మనము ఒక క్షణము ఆపుతాము.  నాలుగు సూర్య గణముల తఱువాత మనము ఉత్సాహలో ఒక అక్షర సామ్య యతిని ఉంచుతాము.  పాటలలో ఇది ప్రాసాక్షరముగా కూడ ఉండవచ్చును. సూర్య గణము రెండు విధములు – III, UI. కాబట్టి ఏడు సూర్య గణములను మనము 27 (సంఖ్య 2ను ఏడు మారులు గుణింతము చేయాలి) అమర్చినప్పుడు, ఒక ఉత్సాహ పాదమును 128 విధములుగా వ్రాయ వచ్చును. ప్రాస నియమము వలన ఒక ఉత్సాహ పద్యమును 2 x 644విధములుగా వ్రాయ వీలగును. చూచారా, ఒక పద్యమును వ్రాయడములో ఎంత వైవిధ్యము ఉన్నదో?

 

ఇది శివరాత్రి సమయము కాబట్టి ఉత్సాహలోని ఒక శివస్తోత్రమును మీకు పరిచయము చేస్తున్నాను.  ఇది ఉత్సాహ మాత్రమే కాదు.  ఇది ఒక సార్థకనామ వృత్తము కూడ, దీనికి నేను హరవిలాస మని పేరు నుంచినాను. హరవిలాస లోని గణాక్షరములే ఈ వృత్తపు గణములు, అనగా, హ/ర/వ/వ/వ/ల/ల/స.

 

హరవిలాస – UI UIU IU IU IU I I IIU. దీనిని ఇలా వ్రాద్దామా? UI UI UI UI – UI UI III U.  ఇప్పుడు ఇందులో ఏడు సూర్య గణములు, చివర ఒక గురువు ఉత్సాహలోవలె ఉన్నవి.  ఆ పద్యము –

 

హరవిలాస- ర-జ-ర-జ-న-గ, యతి (1, 9)

16 అష్టి 31403

 

ఇత్తు నే నమస్సు లెన్నొ – యిష్టుడైన శివునికిన్

గుత్తులైన పూల నా య-ఘోరుడైన భవునికిన్

చిత్తజారి చిద్విలాసి – చెల్వుడైన హరునికిన్

మిత్తిలేని మోక్ష మీయు – మేటియైన గురునికిన్

 

త్ర్యస్ర (తిస్ర ) గతి నడక వేగమును చూపిస్తుంది.  అందుకే ఇది marching songs వంటి పాటలకు సరిపోతుంది.  అట్టిది ఒకటీ విజయనగరద వీరపుత్ర అనే కన్నడ చిత్రములో పి.బి. శ్రీనివాస్ పాడిన అపార కీర్తి గళిసి మెరెవ భవ్య నాడిదు . తెలుగు చిత్రము శభాష్ రాముడులో ఘంటసాల పాడిన జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా అనే పాట కూడ ఈ కోవకి చెందినదే.

 

1. 

2. 

 

చివర ఈ గతిలోని రెండు హింది చిత్ర గీతములను వినండి.  రెంటికి పోలికలను కూడ గమనించండి. అవి –

 

1. అనాడీ – జీనా ఇసీ కా నాం హై – 

2. మేరే సనం – పుకార్‌తా చల హూఁ మైఁ – 

 

ఇకమీద పాటలను వినేటప్పుడు ఇలాటి పాటలు ఉన్నాయేమో అని గమనించండి. ఉంటాను!

 

 

1 thought on “జయమ్ము నిశ్చయమ్మురా – త్ర్యస్ర గతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *