April 30, 2024

మాయానగరం – 2

రచన: భువనచంద్ర  bhuvana

హాలీవుడ్ సినిమాని బాలీవుడ్డూ.. బాలీవుడ్ సినిమాని టాలీవుడ్డూ అనుసరించినట్టు గుడిసెలవాళ్లు కూడా మహానగర ‘రస్తా’లని అనుకరిస్తూ ఆ సందులని ‘గాంధీ’ రోడ్డనీ, అంబేద్కర్ రోడ్డనీ, ఇందిరాగాంధీ రోడ్దనీ పేర్లు పెట్టారు. ఆ నాలుగ్గజాల సందులకే పేర్లు పెట్టటానికి సందులోని వాళ్లంతా కనీసం నలభై మీటింగ్స్ పెట్టి అసెంబ్లీలోలాగా నానా గలాటాలూ చేసారు. ఆ సందుల్లో మనుషుల్తోపాటు పందులూ, యధేచ్చగా తిరుగుతుంటాయి. ఒక్కోసారి మంత్రిగారు ‘విజిట్’ చేసినట్టు ఇళ్ళల్లోకి (గుడిసెల్లోకి) చొరబడుతూ ఉంటాయి. నిజం చెబితే, ఆ వీధుల్లోని పిల్లలకంటే పందులే ఆరోగ్యంగా ఉంటాయి. ఒక్కోసారి పడమరగాలి వీచినపుడు మాటల్తో పాటు ‘మూలుగులు’ కూడా చెవిన బడతాయి. ఆ ‘మూలుగులు’ అనేకం. ఆకలి మూలుగొకటైతే, అనారోగ్యపు మూలుగు ఇంకొకటి. విసుగుని ‘వివరించే’ మూలుగు ఒకటైతే, ‘సుఖం’ ధ్వనించే మూలుగు ఇంకొకటి.

అమెరికన్లు ఏ ‘వ్యూ’కి ఎలా రియాక్టవుతారో తెలీదుగానీ, కిటికీలోంచి  గుడిసెల ‘వ్యూ’ చూస్తే యీ ప్రపంచంలా ‘గుడిసెలమయం’ అనిపిస్తుంది. ‘మధురమీ జీవితం’ అని కూసిన కవిగాడ్ని కసిగా తన్నాలనిపిస్తుంది. ‘జీవితం మధురం కాదు మధనం .. అది మూలుగుల మయం…’ అని డిక్లేర్ చెయ్యక తప్పదు.. ‘మురికిపేటల ముత్యాల సరాల్ని చూడు. ఆకలిరాణి విన్యాసాలు అవలోకించు..’అనాలనిపిస్తుంది.

కొత్తగుడిసేటి వాళ్లిద్దరూ మరో చోటికి మారి (మరో గుడిసెని)అర్జంటుగా ఓ పిల్లాడ్ని కూడా ప్రపంచంలోకి తేవటంతో, బడ్జెట్ కుదరక ‘నూతన మాత’ కూడా చిత్తు కాయితాలు ఏరే హాబీలోకి దిగిపోయింది. అక్కడా ‘నాయకులూ’ నాయికలూ’ ఉన్నారు. వీళ్ల నోళ్ళూ కాకుల్లా పలువాగ్దానాల ‘కావు’ కేకల్ని పెడూతూనే వుంటాయి. కిటికీలోంచి సూటిగా చూస్తే కుడివైపు మూడో సందుపేరు మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ వీధి ముద్దుగా GMK వీధంటారు. (గాంధీ మోహన్‌దాస్ కరంచంద్). తెలుగులో గా.మో.క వీధంటారు. ఆ వీధిలో వాళ్లకి గాంధీగారి కంటే సేట్ చమన్‌లాల్ గురించే ఎక్కువ తెలుసు.

ఇంతకీ ఆ గా.మో.క వీధిలో మూడో యిల్లు ‘బోసుబాబు’ అని పిలవబడే ఏసుపాదానిది. అయిదో తరగతి దాకా చదివి .. చదివింది చాలనుకుని ఓ రౌడీగారి దగ్గర ‘అసిస్టెంటు’గా చేరి అనతికాలంలోనే అధికార పార్టీ తీర్థం పుచ్చుకుని బలహీన వర్గాల ప్రతినిధిగా ఆపద్భాధవుడిగా గుడిసెల వార్డుకి మెంబరైపోయాడు. ఎలక్షనెలక్షనుకీ ‘మూటల్ని’ సగం పంచీ, సగం దాచీ గుడిసెలోళ్ళ దృష్టిలో ‘కుబేరు’డైపోయాడు. అయినా ఆయనది( లేక) ఆ ‘బాబు’ది నిరాడంబర జీవితం గనక ‘

గుడిసె’లోనే ఉన్నాడంటారు కొందరు. అదంతా పై పై యవ్వారం. “ఆడికి నగరంలో మూడూ మేడలున్నై. మన మీద ‘పట్టు’  పోవద్దని ఇక్కడుండాడు!” అంటారు మరి కొందరు.

నాయకులు ‘హీరో’ల్లాగా డైలాక్కో ‘డ్రెస్సు’ మార్చరు. నిదానంగా ‘నీళ్ళు’ కదలకుండా ఉన్నచోటే ఊరికే ‘ప్రతాపం చూపిస్తారు. వాళ్ల నెత్తిమీద గాంధీ టోపీనో, భుజం మీద ‘పార్టీ కండువా’నో వేసుకుని ప్రజలకు మాత్రం ‘కుచ్చుటోపీలు పెడుతూనే ఉంటారు. అంతేకాదు “చూశారా.. ఆ పార్టీవాడి టోపీ ఎంత అసహ్యంగా ఉందో! అసలది టోపీయేనా? వాడెవడు? వాడికేం తెలుసు? ఎప్పుడైనా ‘మన’ గుడిసెల్లో ఉన్నాడా? ఆకలంటే వాడికి తెలుసా? మా విషయం వేరు. మేం మీ మధ్య వున్నాం. టోపీలు కుట్టడంలో.. పెట్టడంలో తరతరాల అనుభవం  మాకుంది.. కనుక అయ్యలారా.. అమ్మలారా నేడే మీరు మా పార్టీలోకి దయచెయ్యండి. మా యీ.. సుందరమైన టోపీతో మీ తలని అలంకరించే భాగ్యం మాకు ప్రసాదించండి..! “అంటూ అనర్గళ ఉపన్యాసాలు ఇస్తూనే అంటారు.’తినగ తినగ వేము తియ్యనుండు’ లాగే వినగా వినగా ఉపన్యాసాలూ తియ్యబడతాయ్. నరనరాలా నల్లమందులా ఎక్కేస్తాయి. అందుకే నేటి వక్తే రేపటి ఓటుభుక్త. సరే..! బోస్ ఉండేది ‘గుడిసె’ అంటే గుడిసెకే అవమానం. అదో ‘కొంప’లాంటి గుడిసె. అందరికీ అందులో ‘ప్రవేశం’ లేదు. లోపల మాత్రం ‘ఇంద్రభవనం బలాదూర్’ అని చూసొచ్చిన వాళ్లు చెవులు కొరుక్కుంటారు.

‘బోస్’కి కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. ప్రతీ ప్రొలిటిషియన్‌లాగే, ఏ పని చేసినా ప్రజాభిప్రాయం మేరకే చెయ్యాలంటాడు. ప్రజలకెప్పుడూ ఒకే అభిప్రాయం వుండదని పదవి రుచ్చూసిన ప్రతి పొలిటిషయన్‌కీ తెలుసు. పేరు మాత్రం ‘ప్రజాభిప్రాయం.’  ‘పేరులోనే ఉన్నదోయ్ పెన్నిధి’ అని సామెతించినవాడు నిజంగా గొప్పవాడు. వాడికి ఆవుదం, ఆహారం లాగా ‘లౌక్యం’ వంట పట్టేసి వుండాలి. లేకపోతే, ‘వాటీజ్ ఇనే నేం’ అన్న షేక్స్‌పియర్‌ది ‘తప్పని’ ఇంత చులాగ్గా ఎలా నిరూపించగలడు? సరే… (ప్రజాభిప్రాయం అన్న నామకరణం చేశాక, ఏ వెధవ పని చేసినా చెల్లుతుందనేది బోసు అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాడు.

‘వృద్ధ హీరోలు’ ‘కుర్ర’ హీరోయిన్లతో రొమాంటిక్ డ్యూట్లు కొట్టేది ప్రజాభిప్రాయాన్ని బట్టే! పొలిటిషియన్లు పార్టీ మార్చినా, ప్రభుత్వం ప్రొహిబిషన్ పెట్టినా, తరవాత దాన్నెత్తేసి బెల్టు షాపుల్ని వెలయించినా ప్రజాభిప్రాయాన్ని బట్టే! అంతెందుకూ అపోజిషన్ పార్టీలు అల్లర్లు చేసినా, బంద్‌లూ, హర్తాళ్లూ నిర్వహించినా, ‘ప్రజాభిప్రాయాన్ని’బట్టి అని స్పష్టంగా గ్రహించాడు బోసు. అందుకే ఓ బ్రాందీ షాపుకీ, రెండు ప్రభుత్వ సారాయి దుకాణాల సైసెన్సులు ‘సంపాయించి’ ఉడతాభక్తిగా ప్రజలకు తనవంతు సేవ కూడా చేస్తున్నాడు.

అయితే ఒక మాట చెప్పుకోవాలి… ఏం చేసినా ‘తెర’ వెనక ఉండి చేయించాలన్న ‘కిటుకు’ని మాత్రం రాజకీయ ‘గురువుల’నించే నేర్చుకున్నాడు. అందుకే ‘వేలు’విడిచిన ఓ యంగ్ విడోని తెచ్చి ఆవిడ పేరుమీద ప్రభుత్వ ‘తీర్థం’ ప్రజలకు నిరాటంకంగా అందిస్తున్నాడు. అయితే ఆ ‘తీర్థాన్ని’ తను ఏనాడూ తాగలా..

ఆ ‘తీర్థం’ తాగటం వల్ల జరిగే జనాభా నియంత్రణ చూస్తూనే ఉన్నాడు గనక విదేశీ ‘తీర్థాన్ని’ మాత్రమే పుచ్చుకుంటాడు. అది కూడా ‘నగరం’లో ఉన్న గెస్ట్ హౌస్‌లో. అలా తాగడాన్ని ‘డిప్లొమసీ’ అంటారని గురువుగారతడితో చెప్పారు.

బోస్ ‘గురువు’ పీఠాధిపతిలాంటివాడు. లెక్కలేనంతమంది శీష్యులు. వారి పని ‘ధర్మాధర్మ విచక్షణ’ సాగించడం. రాజకీయాల్లో కూడా ‘ధర్మాధర్మాలు’ ఉంటాయా? అన్న ధర్మ సందేహం ఎందుకూ? ఖచ్చితంగా ఉంటై.

‘పార్టీ పెద్దల’ మార్గాన్ని అనుసరించడం ధర్మం. అనుసరించకపోవడం అధర్మం. ‘పెద్ద తలకాయ’ పార్టీ మార్చేస్తే కుర్ర తలకాయలు కూడా వెంటనే పార్టీ మార్చేయాలి. మార్చకపోతే కానీకి కొరగాడు. ఆయనా మతగురువులందరిలాగే అంత లావూ ఇంతెత్తూ ఉంటాడు. పొలిటిషియన్లు ‘పిల్లి’లాంటివారంటే ఆయన వొప్పుకోడు. ఎందుకంటే ‘గోడ మీద పిల్లి’ ఇటో అటో దూకి తీరుతుంది. ‘పొలిటిషియన్’ మాత్రం ఆ గోడ మీద అలాగే నిశ్చలంగా ఉండగలడు అనేది ఆయన సిద్ధాంతం. నల్ల కళ్లద్దాలు ధరించడం ఆయన హాబీ. పగలూ రాత్రీ కూడా నల్ల కళ్లద్దాల్ని తియ్యడు. ‘అదేం?’ అంటే చిర్నవ్వు నవ్వి ‘మన కళ్లల్లో భావాలు ఇతర్లు గమనించకుండా, వాళ్ల భావాల్ని మనం గమనించడానికిదొక్కటే మార్గం’ అని చమత్కరిస్తాడు. ఇప్పుడు వయసుడిగిన హీరోలు కూడా కంటికింద చారలు కనిపించకుండా కళ్లద్దాలు వాడుతున్నారు. ఇది మరో విషయం. అదీగాక కళ్లజోడెట్టేస్తే కావలసినంత ఫేషన్…! గురువుగారు కళ్లజోడు పెట్టడమే కాదు, కనుసైగల్తోటి మాత్రమే సూచనలిస్తాడు. అదొక ప్రహసనం. జోడుని తీసి, పంచతో తుడుస్తున్నట్టు అభినయిస్తూ చెయ్యవలసినవాడికి ‘సైగ’చేసి పంపటం ఆయన ప్రత్యేకత. “వెధవ టేప్‌రికార్డర్లోచ్చి మన నోరు కట్టేశాయి.. సెల్‌ఫోన్ల తంటా మరీ ఎక్కువ. అయినా అమెరికన్ ప్రెసిడెంటంతటివాడికి ‘బగ్గింగ్’ తప్పలా.. మనమెంత?” అని  వివరణ కూడా ఇస్తాడు. ఆయన పేరు మనకొద్దు. “రూపనామములేల రొక్కమూనకూ” అన్న సూక్తి ఆయన ప్రవచించినదే! “Time is Money’ అన్నది ఆయన మరో సిద్ధాంతం. ‘మనిషి’ విలువని ‘డబ్బు’తో మాత్రమే కొలవగలగటం ఆయన ప్రత్యేకత. ‘డబ్బు సంపాదించ లేకపోవడం ఓ జబ్బు’ అంటాడు. అవకాశం లేకపోతే? అని అడిగినవాళ్లకి అవకాశాలు రావు. అవకాశం వచ్చేదాకా వేచి వుండేవాడు మామూలు మనిషి. అవకాశం సృష్టించుకునేవాడే అసలు సిసలు పొలిటిషియన్” అని బోధిస్తాడు.

బోస్‌నీ, గురువుగార్నీ కాసేపు ఒదిలిపెట్టి మూడో కిటికీ తెరిస్తే..

అది గోవిందరాజస్వామి వీధిలో పదో నంబరు ఇల్లు. మొత్తం మూడు వాటాలు. మూడోవాటాకి ఓ కిటికీ, రెండు ద్వారాలూ ప్రత్యేకం. ఎప్పుడో  ఒకప్పుడు ఎకనమిక్సు బరితెగించినప్పుడు ఎవరో ఒకరికి “అద్దెకివ్వొచ్చుననే’ ముందు చూపులో ఓ ముసలాయన  ‘పుట్టని’ కూతుర్ని దృష్టిలో పెట్టుకుని కట్టించిన సెపరేట్ వాటా అది. అందులో ఓ బ్రహ్మచారి నెలకి పదిహేడు వందలు కడుతూ ‘తలా, ఒళ్ళూ’  దాచుకుంటున్నాడు. ఆ ముచ్చటైన కుర్రాడికి ఏడు తక్కువ ముప్పై ఏళ్లు,సన్నని మీసకట్టు, నిరంతర దరహాసంతో వాలుకుర్చీలో హాయిగా పడుకుని కలలు కనడం అతని హాబీ. ‘దిండు’ తలకింద కంటే ‘పక్కన’ ఉంటేనే ‘బాగుంటుందన్నది’ ఆయన అభిప్రాయం. ఇక అతను కనే కలల్లో సూపర్ మోడల్స్… సినీ స్టార్లూ.. కన్నెరాయంచలేగాక  కవులూ…. విమర్శకులూ సాహిత్య స్రష్టలూ కూడా అడుగిడుతుంటారు. కోపం వచ్చినా ‘పళ్లు’ కొరక్కండా ‘కళ్లలో’ చూపించడం అతని ప్రతిభకి నిదర్శనం. ‘అవునా కాదా… వెదర్ టూ ఆర్ నాట్టూ’ అన్న సందేహం కలిగినప్పుడు ‘వైనాట్’ అనగలిగే ధైర్యం కూడా తనకుందని అతనికి తెలుసు. అంగుళం తక్కువగా ఆరడుగులున్న ఆ శాల్తీ పేరు ‘ఆనందరావ్’ అతనికుండే ‘దుర్గుణాల్లో’ మొదటిది ఠంచనుగా మొదటి తారీఖునే అద్దె చెల్లించడం. రెండోది అమ్మాయిలు ఎదురుగా వున్నా వాళ్ల వంక ‘ఆబగా’ చూడకుండా ఏదేదో ఆలోచించడం. సినిమాలు చూడకుండా” సాహిత్య చర్చలు’ చెయ్యడం మూడో మహా దుర్గుణం. సరే… ఆ చిన్నవాడు ఉంటున్న వాటా కిటికీ చాలా పెద్దది. ఆ కిటికీని ఆల్‌మోస్టు ఆనుకుని ‘ఇంతెత్తు’ ఎదిగిన సన్నజాజి తీగ ‘తెగ’ పూలు పూసేస్తూ చుట్టుపక్కల అమ్మాయిల్ని ఊరిస్తుంటుంది.

బ్రహ్మచారీ… బ్రాందీ.. కన్నెపిల్లలకు నిషేధం. అంటే ప్రౌఢలు బ్రాందీ ‘కొట్టొ’చ్చని అర్ధం కాదు. దూరం నుంచి చూడొచ్చు. ముక్కూ మూతీ విరవొచ్చు. దగ్గరగా పోతేనే ధర్మసందేహాలొస్తాయి.

రాత్రిపూట వెన్నెల్నీ, సన్నజాజి పూవుల్నీ, వాటి పరిమళాన్నీ ఆస్వాదిస్తే అతనికి ప్రపంచం మీద జాలి కలుగుతుంది. “వై? ఎందుకీ ప్రపంచం వెన్నెల్నీ, పువ్వుల్నీ పట్టించుకోకుండా ‘మెషినైజ్’ అయిపోతోంది?” అని తన మనసులోనే ప్రశ్న వేసుకుంటాడు.

ఇహ అతని గదిలో ప్రవేశిస్తే అనేకానేక పుస్తకాలు ‘బ్రహ్మచర్యం’ పాటిస్తూ ఉంటాయి. ఫెమినైన టచ్ లేదు కదా…

అతడికి సిగరెట్లూ, విస్కీ బ్రాందీలాంటి ‘మధుర’ పదార్ధాలంటే బోలెడు ఎలర్జీ. సమాజం మీద బోలెడంత కసీ, ప్రేమ సమపాళ్లలో ఉన్నాయి. విప్లవ రచయితలన్నా, విషాద గీతాలన్నా అతనికి ప్రాణం.

OK

అశృవులు కార్చి కార్చి అర్ధం లేని ప్రశ్నల్లో మునిగి మునిగి ఆదమరిచి నిదురించిన ఆడపాత్ర ఒకటి….

కిటికీ తెరుచుకుని లోకాన్ని దర్శించే మాధవీరావ్ పాత్ర మరొకటి..

‘ప్రజాభిప్రాయం’ ప్రాతిపదికపైన పదవికెగబాకిన బోస్ బాబు పాత్ర ఇంకొకటి..

‘సో క్యూట్’ జరీవాలాతో సందడి చేసే సుందరీబాయి పాత్ర వేరొకటి..

పానకంలో పుడకల్లా వచ్చే ‘గుడిసేటి పాత్రలు’ మాత్రమేగాక…

సాహిత్య సమాలోచనలు చేస్తూ సన్నజాజి పువ్వుల్ని ప్రేమించే ‘ఆనందరావు’ పాత్ర వేరొకటి..

…. ఇవీ…

 

(మాయా)’నగరం’ అనే యీ నవలకి గోడలూ, స్తంభాలూ, తలుపులూ అవే!!

1.

 

మిసెస్ మాధవీరావ్ నడుస్తూ ఆలోచిస్తోంది. పొద్దున్న కిటికీ తెరిచినపుడు కనబడిన వ్యవహారం ఇంకా ఆమెకి ‘కలవరం’ కలిగిస్తూనే ఉంది. ఆవిడో ఫ్రీలాన్సర్. తనకిష్టమైనవీ, కుతూహలం కలిగించేవీ ‘మధించి’ పత్రికలకు పంపుతూ వుంటుంది. తను పంపాల్సినవి చాలానే వున్నాయనీ, అయినా పంపుతున్నవి బహు తక్కువనీ ఆవిడ అభిప్రాయం. అనవసరంగా విచారించే ప్రపంచాన్ని చూసి అత్యవసరంగా కన్నీరు కార్చడం ఆవిడ దుర్గుణం. మాటల్లోనూ, చేతల్లోనూ కూడా కరుణా, జాలి, దయా కురిపించడం అవిడ రెండో దుర్గుణం. జీవితాన్ని అనేక కోణాల్నించి పరిశీలించి ‘అర్ధం’ చేసుకోవడం ఆవిడకున్న దుర్గుణాల్లో అతిచెడ్డది. ‘పాపం’ పోవాలని ‘పతితులు గంగలో మునిగొస్తే గంగ ఏం చేస్తుందీ. అలాగే .. మిసెస్ మాధవీరావ్ జీవితం కూడా ‘పవిత్ర గంగ’లాంటి ఓ పెద్ద కథ. ‘పెద్ద కథ’లంటే ప్రజలకి ఎలర్జీ.. తన కథని తనే చెప్పుకోవడం మాధవికి ఎలర్జీ.

సరే ఇంతకీ పొద్దున్న జరిగిన విషయం ఏమిటంటే చీపురుపుల్ల మొగుడు చీపురుపుల్లని ‘రాత్రివేళ కాకుండా ‘పగలే’ చితక్కొట్టాడు. ఆ కొట్టడంలో కూడ ఒక లయా శృతీ వుండటం వలన ‘చీపురుపుల్ల’ ఏడవలేదు గానీ.. సడెన్‌గా కళ్లు తిరిగి పడిపోయింది. ఆ పడటం దగ్గర్లో ఉన్న రాతి మీద పడటం వల్ల తల చిట్లి ఒంట్లో వున్న ‘కాస్త’ రక్తం ధారగా నేలపాలయ్యింది. ఆ యొక్క ‘సంఘటన’ చూడగానే మిసెస్ మాధవీరావుకి కన్నీళ్ళే కాక, ‘వీళ్ల బ్రతుకులిక మారవా? హే భగవాన్. ఇంతటి ఘోరాల్ని నువ్వెలా చూస్తున్నావూ? అసలు నువ్వున్నావా లేదా? ఉంటే ఎందుకు ఊరుకుంటున్నావ్?” లాంటి ప్రశ్నలు మబ్బుల్లా ముసిరి ఆవిడని కలవరపెట్టాయి…

ప్రస్తుతం ఆవిడ ఆలోచిస్తూ నడుస్తోంది..

 

 

 

2 thoughts on “మాయానగరం – 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *