April 30, 2024

హ్యూమరధం – 3

రచన: రావికొండలరావు  ravikondala

హాసం ప్రచురణ

జోక్ చేసిన ఆయనా? మేమా?

 

మద్రాసు చేరిన కొత్తలో పనీ పాటా ఏమీ వుండేది కాదు. వేషాలు వెతుక్కోవడమా – స్క్రిప్టులో, కథలో రాసేయడమా – అనే అలోచల్లోనే తెల్లారి పోయేది. అసిస్టెంట్ డైరెక్టరు ఉద్యోగం వున్నా, షూటింగ్ లేని రోజుల్లో ఖాళీ.. పొట్టి ప్రసాదు, నేనూ పొద్దున్నే బయల్దేరి నుంగంబాకం నుంచి టీ నగర్ వరకు తిరిగేవాళ్లం. బస్సెక్కితే డబ్బులు దండగ. ఆ డబ్బుల్తో కాఫీలు తాగొచ్చు. బయటివాళ్లు అడిగితే, “మార్నింగ్ వాక్”.

నుంగంబాకం జంక్షన్‌లో పెద్ద తూము గట్టుండేది. దానిమీద కొంత సేపు కూచుని, తర్వాత నిలబడి కార్లలో వెళ్లే వాళ్లకీ, వచ్చే వాళ్లకీ ‘సాల్యూట్’ లు చేస్తూ  కాలక్షేపం. కొందరు వూరికే ఓసారి చెయ్యెత్తి నుదుటికి తగిలించుకునే వారు. మేమెవరమో ఎందుకు సాల్యూట్ చెస్తున్నామో వాళ్లకి తెలీదు, వాళ్లెవరో మాకు తెలీదు.

ఓ రోజు ఒక పెద్దాయన కారాపి “సౌఖ్యమా?” అని అడిగాడు తమిళంలో. “ఓ” అన్నాం. “అప్పా అమ్మ సౌగ్యమా? అప్పా ఎంగే? – ఇంగేదానా?” అని ఏదో అడిగేస్తున్నాడు. మాకు ఓ ముక్కా, అర ముక్కా తెలుసుగాని, తమిళం రాదు. అన్నింటికీ తలూపేశాం చిరునవ్వుల్తో.

ఆయన ఇంకా ఏదేదో మాట్లాడి, ఉపన్యసించి, ప్రసంగించి – బయల్దేరాడు. మాకు ఆ భాష అర్థం కాలేదు. ఆయన ఎందుకలా తెలిసినట్టు మాట్లాడాడో అదీ అర్థం కాలేదు. “నా ఉద్దేశం, మనం ప్రాక్టికల్‌గా జోక్ చేశాం గదా, అతనూ ప్రాక్టికల్ జోక్ చేశాడేమోరా” అన్నాను ప్రసాద్‌తో ఏమైన ఆ తర్వాత మళ్లీ ఆ సాల్యూట్‌ల విన్యాసాలు చెయ్యలేదు.

ఉక్కు మొక్క…

 

నాకు ప్రాక్టికల్ జోకులు సరదా అని చెప్పుకుంటే నా గొప్ప నేను చెపుకున్నట్టవుతుందా? చెప్పుకోకపొతే నా ప్రజ్ఞ నాలోనే ఇరుక్కుపోయి ఊపిరి స్తంభింప జేసుకోదా? అని గిరీశం పడ్డ అవస్థలో పడుతూ వుంటాను. ఐనా, తెగించాలి, మొహమాట పడకూడదు. ఇలాంటి జోకులో, చతురోక్తులో ఎవరో ఒకరు చెప్పకపోతే ఎలా తెలుస్తాయి? – ఘటోత్కచుడు చెప్పినట్టు అవతల వాళ్లేనా చెప్పని – సొంతదారులేనా చెప్పుకోవాలి.

విశాఖపట్నంలో ఆ మధ్య మిత్రులతో స్టీల్ ప్లాంట్‌కి వెళ్లాం. ఆ కబుర్లూ ఈ కబుర్లూ చెప్పుకుని బయల్దేరే ముందు, అటూ ఇటూ చూసి, అక్కడో చిన్న మొక్కవుంటే, వేళ్లతో లాగేసి జేబులో పెట్తుకుంటుందే – “అరెరె! ఏమిటిది? నో నో – తప్పు” అని మందలించారు మిత్రులు.

“మరేం లేదు, STEAL PLANT అన్నారు గదా అని…”

 

ఏమార్చలేరు నన్నెవరూ…

 

కొన్నేళ్లక్రితం –

ఒకానొక రోజున ఒకానొక షూటింగ్‌లో అల్లురామలింగయ్యగారు, రాజబాబు, నేనూ ఇత్యాదులం ఉన్నాం. కరెంటు పోయినప్పుడో, షాటుకి ‘దీపారాధన’ జరుగుతున్నప్పుడో నటీనటులు బయట కూచుని బాతాఖానీ వెయ్యడం సహజం. ఆ సహజసమయంలో ఏవేవో టాపిక్కులు. పొద్దున్న ఇడ్లీ తిన్నానని ఎవరైనా అన్నారంటే, అందరూ ఇడ్లీ మీదనే కబుర్లు. ఇడ్లీ అంటే ఇలా ఉండాలనీ, బెజవాడ బాబాయి హోటలు, మరేదో పల్లెటూరు, మద్రాసులో ఎక్కడో ఉన్న కుంభకోణం హోటలూ ఆ పేర్లన్నీ వస్తాయి. “ఫలానా దగ్గర ఇడ్లీ చెత్త’ లాంటివి వస్తాయి. ఆ తర్వాత ఇడ్లీ ఎలా చెయ్యాలీ, ఎలాంటి చెట్నీలుండాలీ అన్నవీ చర్చల్లోకి వస్తాయి. అలా, విజ్ఞానదాయకమైన విషయంలో సాగే చర్చలకి మంచి టైము షాటుకి లైటింగ్ టైము.

ఆ రోజు టాపిక్కు రాజబాబుని ఎవరో ఎప్పుడో మోసం చేశాట్ట – గనక మోసం మీద, మోసాల మీద కబుర్లు లేచాయి. “నువ్వు ఎలాగ వాడి వల్లో పడ్డావురా?” అని రామలింగయ్య విషయం అంతా కనుక్కునారు, విన్నారు. “నన్ను మాత్రం ఎవరూ సులభంగా ఏమార్చలేరు. నేను మాత్రం పడను” అన్నరు రామలింగయ్య స్ట్రాంగ్‌గా.

“అలా ఎలా చెబుతాం? కొన్ని కొన్ని నమ్ముతాం. కొందర్ని నమ్ముతాం. వాడు ఏమారిస్తే ఏం చేస్తాం?” అన్నాన్నేను వశిష్ఠ మహర్షిలాగో, వాల్మీకిలాగో మొహం పెట్టి.

“నన్ను మాత్రం ఎవరూ ఏమార్చలేరు. అంత సులువుగా గోతిలో పడే రకం కాదీ రామలింగయ్య అన్నారు అల్లువారు.

“చూద్దాంలెండి, టైము రాకపోతుందా!” అని నేను అనేలోగా ఇక్కడ టైము వచ్చింది. షాటుకి పిలిచారు.

ఇది జరిగిన ఓ మూడునెళ్ల తర్వాత – “ఏం చేద్దామా’ అనిపించి, ఆలోచించి ‘సరే’ అనుకున్నాను.

ఉదయమే అల్లువారింట ఫోన్ మోగింది. కుర్రాడెవరో తీశారు. “రామలింగయ్య సారు ఉండారా?” అని అడిగాడు ఫోను చేసిన ఆయన. మీరెవరన్నాడు కుర్రాడు. “నేనుదా… మురుగేశ ప్రొడక్షన్సు అనీ,  దాని మేనేజరు మాట్లాడుతుండా, సారు వింటిలో వుంటురా, షూటింగా ఏమి?” అన్నాడు ఫోన్ చేసినవాడు. అతని మాట శుద్ధంగా లేదు. తెలుగు రాదు. సరిగ్గా వచ్చీరాని తెలుగులో ఉంది మాట.. కుర్రాడు చెప్పగా, రామలింగయ్య గారు ఫోన్‌లోకి వచ్చారు – సినిమా కంపెనీ మేనేజరు గనక.

మేనేజరు మళ్ళీ, ముందు చెప్పిందే చెప్పి – “మేము ఒక బొమ్మ తీస్తిమి అరవంలో, అది బాగా నడుస్తాది. అందుకు, మేమే దాన్ని తెలుగులో తియ్యాలని తలిస్తిమి. డైరక్టరు దొడ్డవాడు, బాగా తీస్తుడు. ఆ తమిల్ సినిమాలోని నగేష్ కారెట్రు తమరు వయ్యాల. నేను వచ్చి తమతో డేట్సు రేట్సు అంతా మాట్లాడవాల. ఎప్పుడు, ఈ దిన వస్తునా? తమరు వింటిలో వుంటురా? ఇప్పుడు రమ్మంటే వస్తును. అడ్వాన్సు చెక్కు కూడా తెస్తును. మీ రెమ్యునిరేషను ఎంతయినా, అదేం ఇబ్బంది లేదు. మీరుదా ఆ కారెట్రుకి ఉండవాల – అని డేరక్ట్రు చెప్పినారు” అని చెబుతున్నాడు.

“నేనూ – ఇవాళ నాకు షూటింగు లేదు. ఓసారి బాంకుకి పోయి రావాలి. మీరిప్పుడొస్తానంటే బాంకుకి వెళ్ళను. తర్వాత వెళతాను” అన్నాడు రామలింగయ్య.

“ఇపుడుదా వస్తును సామీ, తొంబిది దాటితే రాగుకాలం వచ్చును. తోడ్తనే వస్తును సారూ, తను ఇల్లు రామకృష్ణ స్ట్రీటులో కధా… తెలుసు సారూ, వస్తును. జూన్ నుంచి షూటింగు, అవును సామీ…. టైముంది… ముందుగా తమకి డేట్సు ఇచ్చేస్తే… అవును సారూ, వస్తును” అని ఫోన్ పెట్టేశాడు. తమలపాకులు నిద్రలో కూడా నమిలి నమిలి, నాలికా నోరూ పళ్ళూ అన్నీ మొద్దుబారిపోయి, ముద్దగా ఉంది అతని మాట. కొంత అర్థమైంది రామలింగయ్య గారికి. సరే, ఎవడైతేనేం – వేషం మంచిది. రెమ్యునిరేషను “బేరం” ఆడనంటున్నాడు. జూన్ నెల నుంచి షూటింగంటున్నాడు. అబ్బో ఇంకా మూణ్ణెల్లుంది అనుకుంది అల్లు మనసు – ఆశగా.

రామలింగయ్యగారు స్నానాదికాలు ముగించుకుని సిల్కు జుబ్బా తొడిగి దర్జాగా కూచున్నారు. మేనేజరు చెప్పినట్టు “తొంబిది” దాటుతోంది రావాలి; మనం కాలు మీద కాలేసుక్కూచుని పక్కన కుర్రాడిచేత భుజాలు నొక్కించుకుంటూ ఉంటే, మేనేజరు రెమ్యూనిరేషను పెంచినా పెంచవచ్చు. ఆ పని కానిమ్మన్నారు రామలింగయ్య, ఫోను మోగింది. ఆయన తీశారు. “సారూ నాన్దా మేనేజరు, మురుగేశన్ ప్రొడక్షన్స్ – ఏమిలేదు సారూ – షూటింగ్ జరుగుతా వుంది అడయార్లో – నేను రావడం మాల్లేదు. మీరు బాంకుకి పోయి రండి. నేను పండ్రెండు గంటకు వస్తును సామీ” అన్నాడు. సరే అన్నారు అల్లు. “ఇక, బాంకు మూడ్ పోయింది. ఇంక వెళ్లను – పన్నెండుకొస్తాడుగా” అనుకున్నారు.

“పండ్రెండ్’కి మళ్ళీ ఫోను. “లంచ్ టైములో ఫ్రీగా ఉంటును. అప్పుడుదా వస్తును సామీ. తాము నిదరపోతార – అప్పుడైతే  నాలుగ్గంటకి వస్తునా – అది బెస్టు సామీ! వస్తును” అంది ముద్దమాట నోరు. లంచ్ తర్వాత నిద్రపోయి, ఆ నిద్రలోనే కాసిన్ని కలలు కూడా కనేసి – తొందరగా లేచిపోయి, మళ్ళా సిల్కు జుబ్బా ధరించి సోఫాని అలంకరించారు రామలింగయ్య. నాలుగు దాటింది. విసుగులాంటిదీ వచ్చింది. పొద్దుటనుంచి ఎక్కడికీ కదలనీయకుండా ఈ మేనేజరు ఇంట్లో కూచోపెట్టినందుకు చిన్న మంట కూడా పుట్టింది. దానీ చుట్టమంటనీ చల్లార్చుకుని, గుమ్మం ముందు వసారాలో తారాడ్డం మొదలుపెట్టారు.

నేను మామూలుగా రామలింగయ్యగార్ని చూడ్డానికి వెళ్ళాను. ఆయన పచార్లు చేస్తున్నారు. నన్ను చూసి రమ్మన్నారు – కూచోమన్నారు. “మీరేదో ఆందోళనతో ఉన్నట్టున్నారు – హడావుడిగా” అన్నాను. “ఏం లేదు” అని మురుగేశ అప్రొడక్షన్ మేనేజరు సంగతి చెప్పారు. “నా పసంతా పాడు చేశాడు. ఎపుడొస్తాడో ఏమిటో” అన్నాడు చిరాకు ప్లస్ విసుగుతో.

“వాడు ఏమి వస్తుడు? వాడు రాడు సామీ” అన్నాన్నేను. ఒక సారి ఆ గొంతు వినిపించగానే చట్టున తిరిగి చూసి – “ఏమిటి – మీరా అది? మీరేనా అలా మాట్లాడి నా పసంతా చెడగొట్తింది? ఏంటయ్యా ఆ పని?” అన్నారు రామలింగయ్య విసుగు ప్లస్ చిరాకులకి చిరుకోపం కూడా మిళాయించి.

“అయ్యా కోప్పడకండి. మూణ్ణెల క్రితం మీరు అన్నారు – మిమ్మల్నెవరు ఏమార్చలేరని – గుర్తుందా? ఆ పని నేనే చేద్దామని ఇలా చేశాను. ఇంతకీ ఇవాళ ఏప్రిల్ ఫస్టు” అన్నాను కూల్‌గా. ఆయనకి మండింది. నోట్లో చుట్ట కూడా మళ్లి మండింది. ఆ మంటల్లోంచి – అగ్నిలోంచి ద్రౌపది పుట్టినట్టు – చిరునవ్వు పుట్టి చిలికి చిలికి, హాసమై అట్టహాసమైంది. “భలే వాడివయ్యా నువ్వు” అన్నారు.

“అప్పుడపుడు ఇలాంటి పన్లు చెయ్యకపోతే హాస్యం పుట్టదు. అందులో రామలింగయ్య గారు కాబట్టి ఎలాంటి ప్రాక్టికల్ జోకైనా చెయ్యొచ్చు” అన్నన్నేనున్నూ పళ్ళు ఇకిలిస్తూ.

 

 

పారడీకి రెడీ…

 

నాకో చిన్న జబ్బుంది. కొంతమందిని అనుకరించడం. ఆరుద్రగారినీ, ఆయన ఉపన్యాస విధానాన్ని అనుకరించేవాణ్ణి – సరదాగా బాపు, రమణగార్ల దగ్గరా అక్కడా, సరస హృదయులు గనక! బాగా ఎంజాయ్ చేస్తారు గనక, గుమ్మడిగారి దగ్గర ఆరుద్రగారి స్పీచ్‌ని అనుకరిస్తూ పారడీ చేశాను. ఆయన పకపక నవ్వి “సరదాగా రికార్దు చేద్దాం.. వినేవాళ్ళు ఆరుద్రగారనే అనుకుంటారా, లేదా చూద్దాం” అన్నారు. ‘ఎందుకు లెండి’ అని నేను మొహమాటపడినా, ఆయన ఎదురుగా టెప్‌రికార్డరు పెట్టి “కానీండి” అనగానే తప్పలేదు. రికార్డు చేసి వినిపించారు. ‘కరెక్టు’ అన్నారు. కాస్సేపు ఆయనతో జోకులు పంచుకుని ఇంటి కెళ్ళిపోయాను.

వెళ్ళిన పావు గంటకి ఫోను కొట్టింది. ఆరుద్రగారి భార్య రామలక్ష్మి గారు! “చాలా బావుంది – ఆరుద్ర ఉపన్యాసం…. పారడీ బావుంది” అన్నారామె. నా గుండె ఝల్లుమంది. ఏమిటి గుమ్మడిగారు చేసింది! వెళ్ళి వెళ్ళి వాళ్ళింటికే వెళ్ళి వాళ్ళకే వినిపించేశారా!… ఇష్టం వచ్చినట్టు పారడీ చేసి మాట్లాడేశానే… అంతలో ఆరుద్రగారు ఫోన్‌లోకి వచ్చారు. “చాలా బాగుంది. నాకంటే బాగా మాట్లాడారు” అన్నరు ఆనందపడిపోతూ. అది అభినందనా – మందలింపా – తెలీలేదు.

అంతలో పకపకమని నవ్వు ఫోన్‌లో  – గుమ్మడిగారు. “ఏమిటి సార్ మీరూ … అంతలో తీసుకెళ్లి ఆయనకే వినిపించేశారా.. ఏం బావుంది” అన్నాను.

“చాల బావుంది. ఆ ఆనందాన్ని వాళ్ళతో పంచుకోవాలని, తెచ్చి వినిపించాను. ఏం అనుకోర్లెండి… బాగా ఎంజాయ్ చేశారు” అన్నారు వెంకటేశ్వరరావు గారు.

ఆరుద్ర గారు చాలా స్పోర్టివ్. తెలుగు మాస్టారి మీద పెట్టి ఆయన మీద ఎన్ని జోకులు వేసినా భరించే హృదయవిశాల్యం ఆయనది. ఐనా… ఈ పారడీ.. గుండె ఓ అరగంటపాటు కొట్టుకుంటూనే ఉంది. “నేను దెబ్బతిన్నానే” అనుకున్నాను. ఇంకా నయం! గుమ్మడిగారి టేపులో ఎన్.టి.రామారావు గారిని అనుకరించడం కూడా ఉంది. అది తీసుకెళ్లి రామారావు గారికి వినిపించేస్తారేమో – మళ్ళీ నన్ను నేనే సమాధాన పరచుకున్నాను. ఆ టెప్ చెరిపేసి వుంటార్లే – అని.

 

కనిపెట్టేస్తే…?

 

ఒకసారి బాపుగారు, రమణగార్లతో కలిసి కారులో ఏదో ఊరు వెళ్తున్నాం. దారిలో చిన్న ఊరు. బాపు గారు బంక్ దగ్గ్గర కారు ఆపి, పెట్రోలు పోయిస్తునట్టున్నారు. ఆ పక్కనే టెంట్ సినిమా హాలుంది. అందులో తెలుగు డబ్బింగ్ సినిమా ఆడుతోంది – పోస్టరు చూశాను.

బాపు గారు ఏదో అడిగారు. నేను మాట్లాడలేదు. మళ్ళి అడిగారు – “మిమ్మల్నేనండీ మాట్లాడరేమిటీ?” అన్నారు. నేను నోరు తెరవలేదు. ఏదో సైగ చేశాను. రమణగారు కూడా ఏమిందన్నట్టు చూశారు. “ఈ డబ్బింగ్ సినిమాలొ నేను ఒక కారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పాను. నేను మాట్లాడాననుకోండి. ఆ సినిమా ప్రేక్షకులందరూ నా గొంతు గుర్తు పట్టేసి, నాచుట్టూ మూగేసి కారు చుట్టూ నిలబడి, ఆటోగ్రాఫ్‌లు అవీ అడిగేస్తారు. అందుకని నోర్ముసుకున్నాను” అన్నాను. ఇద్దరూ నవ్వారు. “అయితే నా వేళ్ళు కూడా చూపించకూడదు. నేను బాపుననని గుర్తుపట్టేస్తారు” అన్నట్టుగా అన్నారు బాపు.

సంపూర్ణంలో అసంపూర్ణం..

 

“సంపూర్ణ రామాయణం’ షూటింగు జరుగుతోంది. నేను మామూలుగా వెళ్ళి బాపుగారిని పలకరించి షూటింగ్ చూస్తున్నాను. షాట్ అయిపోయిన తర్వాత. ఫస్ట్ ఫ్లోర్‌లో ఇంకో సెట్టు వేస్తున్నారని చూడ్డానికి వెళ్లారు బాపుగారు. నేనూ వెళ్ళాను. ఒక గోడకి కొంత వరకూ పెయింట్ వేసి ఆపేశారు.

“ఈ గోడ ఇంకా కంప్లీట్ చెసినట్టులేదే” అన్నాన్నేను ఏదో ఒకటి అనాలిగదా అని.

“బడ్జెట్ అయిపోయింది” అన్నారు బాపు – అందర్నీ నవ్విస్తూ.

జీతమా? వేషమా?

 

“వినాయక చవితి” సినిమా 1957-58 ప్రాంతాల వచ్చింది. సముద్రాల వారు స్క్రిప్టు రచయిత, దర్శకుడూ, అందులో ప్రకాష్ అనే ఆయన జాంబవంతుడు పాత్ర ధరించాడు. ముఖ్యమైన పాత్రే. సినిమాలో బాగా కనిపిస్తుంది. అయితే కృష్ణుడితో యుద్ధం చేసినప్పుడు అతను కాదు. ఎలుగుబంటి తోలు కప్పుకున్న స్టంట్‌మాన్. ఆ తోలు ధరించి నిలబడటం సామాన్యమైన విషయం కాదు. అలవాటుండాలి. అంచేత, చాల షాట్సులో కూడా అతను కాడు. వేరెవరో అలవాటుపడ్డవారు ఆ ‘తిత్తి’లో వుండేవారు. ఆ పాత్రకి డైలగులున్నాయి. అవీ అతను చెప్పినవి కావు. డబ్బింగ్ గాత్రధారి చెప్పారు. ఇంతైనా, అంతైనా ఏమైనా జాంబవంతుడు – ప్రకాష్ పేరుతోనే వచ్చింది.

అలాగే ఆ సినిమాలో వినాయకుడు బొడ్దపాటి. (పేరు కృష్ణారవు. “అసలు పేరు కాకుండా ఇంటి పేరుతోనే పాప్యులర్ అయిన గుమ్మడి, ముక్కామల, రాజనాలలాగే నేనూనూ” అని చెప్పేవాడు బొడ్డపాటి మామ. అతన్ని అందరూ ‘మాఁవా’ అని పిలిస్తే పెద్దవాడీనా, చిన్నవాడీనా ‘అల్లుడా’ అని బొడ్డపాటి పిలిచేవాడు). “పొట్టిగా, బొజ్జా అదీవుందని నాకు వినాయకుడి వేషం ఇచ్చారు. ఏం లాభం? నేనని జనానికి తెలీదే. మొహం అంతా పూర్తిగా మాస్కు తొడిగారు. తొండం ఒకటీ. నా పేరే టైటిల్స్‌లో వేస్తామన్నా, నా మొహం కనిపించే వేషం ఇంకోటేదైనా, చిన్నదైనా ఇమ్మని అడిగాను. ఇంకోటేదో ఇచ్చారు.

“వినాయకచవతి” లో పెద్ద వేషం వేస్తున్నాను. హేరోని నేనే. టైటిల్ రోల్ నాదే.” అని ఆ గొప్ప చెప్పుకుని ఒక నిర్మాతని వేషం అడిగితే, “నువ్వే ఆ వేషం అని నాకు నమ్మకం ఏమిటి? నీ మొహం ఏదీ? కనిపించదే” అని అడిగాడు.” అని బొడ్డపటి ఓసారి చెప్పారు.

ఆయన వేదాలు, సంస్కృత గ్రంథాలు చదువుకున్నారు. పడితుడు. సంస్కారి, చమత్కారీ. ఎన్.టి.రామారావు గారింట్లో పిల్లలకు ట్యూషన్స్ చెప్పేవాడు. “జీతం అడగాలంటే అయాన్నే అడగాలి. ఆయన దొరకడు. తీరా కనిపించక అడగటానికి మొహమాటం, జీతం అడగితే సినిమాలో వేషం ఇవ్వడేమోనని, వేషం అడగటమా, జీతం అడగటమా అని సందిగ్దంలో పడేవాడిని, జ్ఞాపకం వచ్చినప్పుడు “జీతం ఇచ్చారా?” అని అడిగేవారు-రామారావు గారు. అదే సందని “వేషం…” అని గొణిగేవాణ్ణి. ఎలాగైతేనేం- ఆయన సిమిమాల్లో చిన్నదో పెద్దదో వేసేవాడిని. అలా అయన దగ్గర ద్విపాత్రాభినయం చేసినవాణ్ణి” అని చెప్పేవారు బొడ్డపాటి.

కామెడీ ఆఫ్ ఎర్రర్

 

హైద్రాబాద్ ఏర్‌పోర్టులో ఒక సారి నేనూ చంద్రమొహనూ కలిసాం. ఇద్దరమొ మద్రాసే వెళ్తున్నాం. అతను ఎవరిదో షూటింగ్ కోసం వస్తున్నారు. నేను వేరే కంపెనీ షూటింగ్‌కి వచ్చి మద్రాసు బయలుదేరుతున్నాను. ఇద్దరం మద్రాసులో దిగాం. “ఏఁవయ్యా డొంకల్రావు (ఒకోసారి అలా పిలుస్తాడు చంద్రమొహన్) నీ క్కారుందా?” అని అడిగాడు. “ఆఁ కంపెనీ కారొస్తుంది” అన్నాను – వచ్చింది కూడానూ, “నీకు?” అని అడిగాను.

“నాకు వస్తుంది – వాళ్లు టాక్సీ పంపిస్తారనుకుంటాను” అన్నాడు. అంతలో “చంద్రమోహన్” అని పెద్దక్షరాలతో పేరు రాసి ఒకతను బోర్డు పట్టుకుని నిల్చున్నాడు. “అదిగో వచ్చాడయ్యా” – అని నాతో చెప్పి “చంద్రమోహన్‌ని నేనే” అని చేతి పెట్టె పట్టుకుని బయల్దేరాడు. నేను బయటికి వెళ్లిపోయాను.

ఆ తర్వాత చంద్రమోహన్ చెప్పిందిది.

అతన్ని తీసుకుని ఆ కారు ఆఘమేఘాల మీద ఆ కారు రోడ్దు మీదనే పోతుంది. చంద్రమోహన్ ఇంటివేపు వెళ్ళడం లేదు. కొంత వరకూ వచ్చి వేరే రూటు మారింది. “ఇటెక్కడికి?” అని అడిగాడు చంద్రమోహన్.

“మన గెస్ట్‌హౌస్‌కి” అన్నాడు డ్రైవరు. “గెస్ట్‌హౌస్ కా! ఎవరిది?’

“మనదే” అన్నాడతను. చంద్రమోహన్‌కి మతిపోయినట్టయింది. ‘గెస్ట్‌హౌస్ ఏమిటి? మా ఇంటికి కదా వెళ్లాలి’ అనుకున్నాడు. “మా ఇల్లు తెలీదా మీకు?” అని అడిగాడు. తెలీదన్నాడు డ్రైవరు. అప్పుడు అనుమానం వచ్చింది.

“ఇంతకీ ఈ కారు ఎవరిది? ఎవరి కోసం?” అని అడిగితే ఆ డ్రైవరు అదేదో కంపెనీదనీ, అన్నానగర్‌లో వుందనీ గెస్ట్‌హౌస్ కూడా అక్కడే వుందనీ, చంద్రమోహన్ అనే ఆయన ఢిల్లీ నుంచి వస్తారని తీసుకురమ్మని చెప్పి పంపారనీ చెప్పాడు. “కొంప ముంచావు కదయ్యా – ఆపు ఆపు” అని తానెవరో ఏమిటో చెప్పాడు. ఆ చంద్రమోహన్ వేరు అన్నది అర్థమైంది. “ఐతే మీరు ఇక్కడ దిగిపోతారా?” అని అడిగాడు డ్రైవరు. “నా కోసం కారొచ్చివుంటుందయ్యా ఏర్‌పోర్టుకే పోదాం” అని చంద్రమొహన్ ఏర్‌పోర్టుకు వెళితే – అతని కోసం వచ్చిన కారు చూసి చూసి వెళ్లిపోయింది! ఢిల్లీ చంద్రమొహన్ తన కారు కోసం చూసి చూసి అతను వేరే టాక్సీలో వెళ్లిపోయాడు. మరి, సినిమా చంద్రమొహన్ గతి –  ఆటోరిక్షాలో అతను ఇంటికి, ఈ కథ కంచికి! కామెడీ ఆఫ్ ఎర్రర్ అంటే ఇదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *