April 28, 2024

సరిగమల గలగలలు – 5 తాతినేని చలపతిరావు

రచన: మాధవపెద్ది సురేష్ suresh

 

శ్రీ తాతినేని చలపతిరావుగారు అన్నయ రమేష్‌ని Playback Singer గా, నన్ను Instrumental Playerగా సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. 1971లో ‘దత్తపుత్రుడు’ సినిమాలో ‘మనసైన ఓ చినదాన’ అనే పాట నాగేశ్వరరావు గారికి ఘంటసాలగారు పాడారు. ఆయనతో పాటు ‘యోడ్‌లింగ్స్’ అన్నయ్య పాడాడు. ‘నవ్వులు’ రమోలా గారు పాడారు. తరువాత గురువుగారే ‘ఆడపిల్లల తండ్రి’ సినిమాలో నాగభూషణం గారికి సోలో సాంగ్ పాడించారు. ఆ సినిమాకు శ్రీ కె. వాసుగారు దర్శకుడు.

చలపతిరావుగారు లక్ష్మి కాలనీలో (టి.నగర్) డా!! గాలి బాలసుందరరావుగారింట్లో అద్దెకుండేవారు. రెండు ఇళ్ళు దాటి మా బాబాయి గోఖలేగారు, సత్యంగారు ఉండేవారు. ఎదురింట్లో పింగళి నాగేంద్రరావుగారుండేవారు. తరువాత ఆ ఇల్లు ఘంటసాలగారు కొన్నారు. మా నాన్నగారు, చలపతిరావు గారు మంచి స్నేహితులు. గురువుగారికి మా కుటుంబ సభ్యులు అందరూ బాగా తెలుసు.

అన్నయ్యని ముందు Asst. Music Director గా ఆయన వద్దే ఉంచారు. అన్నయ్యని చాలా ఎంకరేజ్ చేశారు. మంచి పాటలు పాడించారు. ‘రాముని మించిన రాముడు’ లో నగేష్ గారికి, ‘వనజ-గిరిజ’ లో రెండు డ్యూయెట్స్ సుశీల గారితో (జీవితమే ఒక కవితగా, ఇంకోపాట) ఇలా చాలా పాటలు పాడించారు. నన్నూ ఎంతో ప్రోత్సహించారు. ఆయన భార్య అన్నపూర్ణమ్మగారికీ, పాపకీ, ఆయన కుటుంబసభ్యులందరికీ అన్నయ్య, నేనూ, మా కుటుంబాలు ఎంతో ఋణపడి ఉన్నాము.

1971లో ఆంధ్ర రాష్ట్రవతరణ రజతోత్సవ ఉత్సవంలో హైదరాబాద్ లో చలపతిరావుగారు ఓ నృత్యరూపకానికి సంగీత దర్శకత్వం వహించారు. అప్పటికింకా నేను విజయవాడలోనే ఉన్నాను. అన్నయ్య చెప్పటంతో నేను రూపకంలో ‘ఎకార్డియన్’ ప్లే చేశాను. అప్పుడు చలపతిరావుగారి అసిస్టెంట్స్ సూరపరాజు గారు,  వయొలిన్ ప్లేయర్ శ్యామలరావు గారు, తబలా ప్లేయర్ సుబ్బారావుగారు, మాండొలిన్ ప్లేయర్ నరహరిగారు పరిచయమయ్యారు. అన్నయ్య, షరావతి గారు పాడారు. అందరూ నా ‘ప్లేయింగ్’ అంటే ఎంతో ఇష్టపడ్డారు, ఎంతో ప్రోత్సహించారు. అయితే నాకు నొటేషన్స్ చూసి వాయించటం తెలియదు. అప్పుడు నరహరిగారు బార్స్ కౌంటింగ్, నొటేషన్స్ రాసే పద్దతీ, అవన్నీ ఒక గంటసేపు విశదంగా, అర్ధమయ్యేటట్లు చెప్పారు.

tatineni

అప్పటినుండే నేను నొటేషన్స్ క్లియర్‌గా రాయటం, చూసి వెంటనే వాయించటం అలవాటు చేసుకున్నాను, అందుకే ఎప్పుడూ నరహరిగారంటే గురుభావం నాకు.

తరువాత మా నాన్నగారు చనిపోయాక 1973 డిసెంబర్ 4న మద్రాస్‌లో స్థిరపడటానికి వెళ్లాను. గోపు – బాబు వాళ్ళ ఆర్కెస్ట్రాలో మొదటగా ఎకార్డిన్ వాయించేవాన్ని. తరువాత 1974 మార్చిలో ‘పరివర్తన’ సినిమాలో నాకు ఎకార్డియన్ ప్లేయర్‌గా అవకాశం ఇచ్చారు. జెమిని థియేటర్‌లో మొదటిపాట రికార్డింగ్, శ్రీ కె.హేమాంబధరరావుగారు దర్శకులు. చంద్రమొహన్, లక్ష్మి హీరో హీరోయిన్స్. మొదటి పాట శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు (లిరిక్ గుర్తులేదు). మొదటి పేమెంట్ 75 రూపాయలు. ఆయన దగ్గర ‘Joy’ అనే ఆయన కీబోర్డు వాయించేవారు. ఆయన టిప్‌టాప్‌గా డ్రస్ చేసుకుని, సూటూ బుటూ వేసేవారు. ఆయన టైం పెర్‌ఫెక్ట్ గా మెయింటేన్ చేసేవారు.

ఆయన రికార్డింగులు  చాలా త్వరగా అయిపోయేవి. ఉదయం 7 గంటలకి మొదలుపెడితే 2, 3 గంటల్లో పాట పూర్తి చేసేవారు. ఆయన డిసిప్లిన్ చూసి ఇండస్త్రీలో ఆయన్ని ‘అయూబ్‌ఖాన్’ అనేవారు. ఆయనకి ఎస్.రాజేశ్వరరావు గారంటే ఎంతో ఇష్టం, గురుభావం. సి.నారాయణరెడ్డిగారన్నా ఎంతో ప్రేమ. చలపతిరావు గారు ముఖ్యంగా ఇల్లరికం, మంచి మనిషి, పునర్జన్మ మొదలైన చిత్రాల్లో గొప్ప పాటలు చేశారు. ‘మంచి మనిషి’  సినిమాకి ఎస్.రాజేశ్వరరావుగారితో కలిసి పని చేయటం నా పూర్వజన్మ సుకృతం’ అనేవారు.

ఆయన దగ్గర Grundig Spool Tape Recorder ఉండేది. ఎవరైన పాడినా, Instruments వాయించినా రికార్డ్ చేసేవారు. ఎస్. జానకిగారి పాటలెన్నో ఆయన రికార్డ్ చేశారు.

ఆయన బి.వసంత, సావిత్రి, రమేష్, షరావతి, టి.అర్.జయదేవ్ ఇలా ఎంతోమంది గాయకులకు ఆయన ప్రోత్సహించారు. గానకోకిల శ్రీమతి ఎస్. జానకి గారిని తమిళంలో నేపథ్యగాయనిగా పరిచయం చేశారు. (సినిమా పేరు విధివిళయాట్టు) శ్రీ S.P.B. గారికి ‘ఎరక్కపోయి వచ్చాను’ పాట (ఎ.ఎస్.ఆర్.గారికి పాడింది) అప్పట్లో మంచిపేరు తీసుకువచ్చింది. గురువుగారు చేసిన ఎన్నో పాటల్లో ట్రంపెట్ వాయుద్యం ఎక్కువ వినపడేది. (టి.చలపతిరావు గారు కదా!  T ఉంది కాబట్టి Trumpet ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనుకునే వాళ్ళం) జనరల్‌గా ఇక్కడే ఒక విషయం చెప్పాలి. అప్పట్లో ఆల్మోస్ట్ అందరు మ్యూజిక్ డైరక్టర్ల దగ్గర ఆర్కెస్ట్రా వీలున్నంత వరకూ పెర్మనెంటుగా ఉండేవారు. అందుకని తప్పని సరిగా అందరికీ BGMS లో చోటు ఇవ్వాల్సి వచ్చేది. వయోలిన్స్, రిథం సెక్షన్, బ్రాస్ సెక్షన్, అకార్డియన్, పియానో ఇలా అందరూ మాన్యుయల్‌గా వాయించేవాళ్ళు. అందుకనే మనకు ఆల్‌మొస్ట్‌గా అన్ని పాటల్లో ఇన్‌స్ట్రుమెంట్స్ అవే వినపడేవి.

ఈ టీమ్‌ని మార్చిన వ్యక్తి ఇళయరాజా. ఇన్‌స్ట్రుమెంట్స్ ఎక్కువగా అవే ఉన్నా వాడే పద్దతిలో ఒక విప్లవం తీసుకు వచ్చారనే చెప్పాలి. పైగా ఆర్కెస్ట్రా సెక్షన్ ఆయన చేసినట్లుగా సౌత్ లో బహుశా మరే సంగీత దర్శకుడూ చేయలేదనే చెప్పాలి. అందుకనే ఆయన పాటల్లో BGMS కానీ రీరికార్డింగ్ గానీ ఎనర్జటికల్‌గా ఉండేవి. డెప్త్ ఎక్కువగా ఉంటుంది.

చలపతిరావుగారి అమ్మాయి కవిత బాగా పాడుతుంది. ఒకసారి విజయా గార్డెన్స్‌లో వాయిస్ టెస్ట్ చేశాను. కానీ ఆ అమ్మాయి చేత పాడించటానికి సందర్భం కుదరలేదు. కొంచేం బాధపడ్డాను కూడా! ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్ళిచేసుకొని అమెరికాలో స్థిరపడింది. నేనూ, అన్నయ్య అభివృద్ధిలోనికి రావటం చూసి వారు, వారి కుటుంబం ఎంతో ఆనందపడేవారు. మా అబ్బాయి ఉపనయనానికి ఆయన ఆరోగ్యం బావుండకపోయినా అన్నపూర్ణమ్మగారితో వచ్చి ఆశీర్వదించారు. అందరం ఎంతో ఆనందించాము. మా అబ్బాయి ఉపనయనానికి ఒక మంచిపని చేశాను. మహాదేవన్‌ దంపతులు, బాలుగారి దంపతులు, నాగిరెడ్డిగారు దంపతులు, చలపతిరావుగారి దంపతులకీ బట్టలు పెట్టి వారి ఆశీర్వాదం అందుకున్నాము. ఈ నాలుగు కుటుంబాలనీ నేను మరణించేవరకూ మరచిపోలేను. కృతజ్ఞతా భావంతో ఉంటాను. నేననుకుంటాను… ఈ సంబంధం ఈ జీవితంలో ఏర్పడింది కాదు. ఎన్నో జన్మల సుకృతఫలం.

ఎన్నో మంచి పాటలని మనకందించిన గురువుగారు చలపతిరావు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన సంగీతం మనలందర్నీ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులందరూ జీవితాంతం ఆయురారోగ్యాలతో కలకాలం సుఖంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా!

తాతినేని చలపతిరావు గారికి వీణ బాగా అలవాటు. ట్యూన్ చేయవలసి వచ్చినా సరే వీణపైనే త్వరగా పలికేది ట్యూన్.

1974 – 75లో హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆయనకు ఘన సన్మానం జరిగింది. అది ఆయన సినీ రజతోత్వవ సభ. ఆ సభను నేటి నిర్మాత అర్.వి.రమణమూర్తి నిర్వహించారు. సాధారణంగా అటువంటి సభలో ఎవరైనా సరే అన్నీ తన పాటలే ఉండాలని కోరుకుంటారు. కానీ చలపతిరావుగారు అలా అనుకోలేదు. తన అభినందన సభకు వచ్చిన సంగీత దర్శకులు, గాయనీ గాయకులు అందరూ మరిచిపోలేని విధంగా ఆ సభ జరగాలని కోరుకున్నారు. ఆ ప్రకారమే జరిగింది కూడా! ఎస్.రాజేశ్వరరావు, ఎస్.హనుమంతరావు, మాస్టర్ వేణు, పెండ్యాల, సుసర్ల దక్షిణామూర్తి, కె.వి.మహదేవన్, జి.కె.వెంకటేష్, రాజన్-నాగేంద్ర, సత్యం, చక్రవర్తి, బాలు, ఆనంద్, రమేష్, సుశీల, జానకి, వసంత, ఎల్లారీశ్వరి, రమోలా, షరావతి ఇంకా ఎందరో గ్రూప్ సింగర్స్ ఇలా స్టేజంతా నిండిపోయింది. వచ్చిన వారి కన్నుల పండుగ… వేచిన వారికి వీనుల విందు… అదీ కొత్త రకంగా…

అదెలా అంటే… ఒకొక్క సంగీత దర్శకుడు స్టేజి మీదికి వచ్చి చలపతిరావు గారిని అభినందించి వెళ్ళాలి. అలా వచ్చినవారు తాము స్వరపరచగా హిట్ అయిన ఓ సినీ గీతాన్ని ఆ సభకు హాజరైన గాయనీ గాయకులతొ పాడించి మరీ వెళ్లాలి.

అందులో ముఖ్యంగా అందర్నీ ఆకట్టుకున్నది, అలనాడు సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వంలో లతా మంగేష్కర్ పాడిన ‘నిదురపోరా తమ్ముడా’ పాటని అదే సుసర్ల గారి నిర్వహణలో శ్రీమతి ఎస్.జానకి పాడడం, ఆ సభకు హాజరైన వారెవ్వరూ మరచిపోలేని మధురానుభూతిని అందించిన చలపతి గారిని కొనియాడని వారు లేరానాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *