May 4, 2024

పద్యమాలిక – 3

 IndrudiSabhalo

 

VoletiSrinivasaBhanu

 

పాల సంద్రము మథియించు వేళయందు

ఉద్భవించిన కలశాలు మూడు తెలియ

ఒకటి మోహిని చేతిలో నొదిగె నాడు

రెండు అమరావతినియేలె నిండు గాను

 

రసికరాజా యంచు రాగాలు పండించి

గాన తత్త్వమెరుగు జ్ఞాని యొకడు

మధువనమ్మున రాధ యెద పొంగి నర్తించు

పాట నాలాపించు మేటి యొకడు

శివశంకరీ యంచు అవలీల దర్బారి

కానడ చిలికించు ఘనుడొకండు

దునియా కె రఖ్వాలె వినుమయ్య నా బాధ

అనుచు గీతంబైన యార్తి యొకడు

 

భువిని గాన జలధి ముంచెత్తి ఇరువురు

అమర జగతి లోన యడుగులిడగ

ఆసనమ్ము నొసగి నాలించి యుగళమ్ము

మాన్యుడింద్రు డచట ధన్యుడాయె

 

ఎన్నడైన గనుడు ఇంద్రుని కన్నుల

భయము తొంగి చూచు పదవి కొరకు

నేడు చూడ వేడ్క నిండుగ పొంగెను

ఘంటసాల రఫి ల ఘనత వలన

 

NagaJyothiRamana

నిలువుము వాలుకనులతో

కలుసుకునిన గుబులవునని-గాయకయుగళిన్

పలువిధముల పాడగ విని

విలాసముగ సురపతితన -విధులను మరచెన్

 

హాయిగ హాయిగ ఆమని

రేయని మన ఘంటసాల – రేపగ మరులన్

కోయిల కుహు కుహు బోలని

హాయిగ రఫియును పలుకగ-హా! యనిరి సురల్!!

ఆంధ్రుల పాటల దైవము
ఇంద్రసభను రఫినిగూడి ఇంపుగపాడన్
ఆంధ్రా హిందీ జమిలికి
ఇంద్రుడుమైమరచి యొసగె-సింహాసనమున్

 

VenkataSubbaSahadevuduGunda

ఏపాటఁ బాడిరో హరి

తా పీఠమ్మొసగి తూలి తన్మయమొందెన్

సాపాటున్ దిన నొప్పక!

కూపీ లాగగ మొయిలులఁ గూడిరి దివిజుల్!

శహభాషంచును రఫినీ,
యహహో యని ఘంటసాల నచ్చట జేర్చెన్!
తహతహల కులిశి వారల
నహల్య యందమ్ము బొగడ నాశగ గోరెన్!

( కులిశి=ఇంద్రుడు)

 

అప్సరసల యందంపు నంతు దెలిసి
తామెరుగని భామల చిరునామ కొరకు
ఘంటసాల రఫీలకు గద్దె నొసఁగి
పాడమనె సురరాజట పట్టు బట్టి!

 

VanamVenkataVaraprasadarao

 

‘చల్వుడుజారె పంచి’ యను చక్కగ తాను రఫీ విపంచినన్

చెల్వుడు ఘంటసాల సుధ చిందులుగా ‘పయనించె చిల్క’యన్

పిల్వుడురా మనాళ్ళ జరిపింతు పురస్కర మంచునింద్రుడన్

తల్వుడురా మనోళ్ళనగ ధన్యుల! జే జయదేవుడన్ననూ!

 

నింగిన ఇంద్రు డొక్కడుర నిండిరి చంద్రులు యిద్ద రిద్ధరన్

పొంగిన గానవాహినులు పొందుగ ఉత్తర దక్షిణమ్ములన్

ముంగిలి గండుకోయిలలు ముద్దుగ హిందిన తెల్గునన్ సినీ

రంగము నాడు నే డచట రా రఫికిన్ మన ఘంటసాలకున్

 

వంగినదది నడుము నభము

పొంగినవగు గానసుధల పొందులు హరికిన్

గంగ ఘంటసాల గళము

రంగుల’కల’యికరఫీతొ రాగమ?మల్హర్!

 

 

GoliSastry

సీ: జానపదమొకండు – జనులు మెచ్చగపాడు

పద్యంబు నొక్కడు – పాడగలుగు

లలితగీతమొకడు – లయబద్ధముగబాడు

శ్లోకంబుకొక్కడు – శోభదెచ్చు

శాస్త్రీయమొక్కడు – శ్రావ్యంబుగాపాడు

కీర్తనల యొకండు – కీర్తిబొందు

భక్తి గీతమొకడు – రక్తిగా పాడును

పాశ్చాత్యమొక్కడు – పలుక గలుగు

 

ఆ.వె: ఎట్టిపాటగాని యే శ్లోకములుగాని

పద్యమైన మరియు గద్యమైన

నవరసంబులొలుకు నాయాసమేలేక

ఘంటసాలవారి గళమునందు

 

తెలియ ఘంటసాల తెలుగులో రఫియేను

నార్తు ఘంటసాల నయము రఫియె

మరువలేము వారి మధురమౌ గాత్రమ్ము

విందు పంచగనను విందు విందు.

 

పూలకు గొంతుక యుంటే

యేలాగున బాధజెప్పి యేడ్చునొ, పలికెన్

ఆలాగు ఘంటసాలయె

మేలుగనది పూలగోయ మెదలును మదిలో.

 

గీతను బాడుచు మధురపు

గీతను తా ఘంటసాల గీసెను సుధతో

ప్రీతిగ నెవ్వడు నేటికి

గీతను దాటంగలేదు గీతాచార్యా !

 

ఇందరు భారత జనులే

విందురు ప్రతిరోజు చెవుల విందుగ నేదో

యుందని తావిన గాత్రము

నిందురుడే నిలిపె పైన నిష్టత వీరిన్.

 

చూడు మన ఘంటసాలయె

పాడె నమో వెంకటేశ పాటయు మరియున్

ఏడూకొండల సామిని

ఏడేడులు దాటి వినగ నెప్పుడు క్రొత్తే

 

ఘన స్వరములె రంగులుగా

తన గాత్రమె కుంచెగాగ తనగానముతో

మన మదిని ఘంటసాలయె

వినుతించగ బొమ్మలనిడి వినువీధి జనెన్.

 

హిందీ తెలుగుల పాట ప

సందుగ రఫి ఘంటసాల ” సరిగా ” నేర్పన్

ఇందురుడే విద్యార్థిగ

ముందర తా గూర్చొనెనట ముచ్చట గొలుపన్.

 

చిలిపి పాటలు నీనోట చిందులాడు
భక్తి గీతమ్ము భగవంతు పట్టిలాగు
దుఃఖరాగాలు గుండెల దూరి తొలుచు
గానగంధర్వ నీపాట ఘనము ఘనము

 

చోద్యమయా నీ గాత్రము
పద్యము, నవరసములొలుకు పాటలు, గీతన్
గద్యము, నెవ్విధి వినినన్
హృద్యముగా ఘంటసాల ! యిష్టత గలుగున్.

 

( ఇంద్రుడి పలుకులు )

మీ పెదవి దాటు పాటయె
నా పదవిని మించియుండు నదినిజమేగా
మీ పాట వినినవారికి
ఆపగ నాతరమ స్వర్గ మందును సుమ్మీ !

 

ఇర్వురు గతమున గన గం
ధర్వులె శాపవశమునను ధర బుట్టిరిగా
సర్వుల కమృతము పంచగ
సర్వము శాపమ్ము దొలగి స్వర్గము దొరకెన్.

 

బంగరు గాత్రపు పాటల
సింగములే ఘంటసాల శ్రీ రఫి గార్లే
హంగుగ పాడిన పాటలు
సింగారములొలికి నిలిచె చిరకాలమిటన్.

సింగాలు సింగిన సాంగుల పై సరదా ప్రయత్నం….

‘ సింగరు ‘ లిర్వురు పాటల
సింగములే, ఘంటసాల శ్రీ రఫి గార్లే
‘ సింగిన సాంగులు ‘ మొత్తము
సింగారములొలికి నిలిచె చిరకాలమిటన్.

 

రప్ఫి గారి పాట “రప్ఫన్నదే” లేదు
ఘంటసాల పాట ఘంట మ్రోత
గొప్ప యెవ్వరనగ గుర్తించలేకను
ఇర్వురొక్కటనెను ఇంద్రుడపుడు.

 

SrinivasaBharadwaj Kishore

 

ఘంటసాల రఫుల గంధర్వులను మించు

మధుర గానమందు మరచి మేను

గద్దెకూడ వారికర్పించి యింద్రుడే

నేలమీద కూర్చునేను చూడు

 

వేణుగానలోలు వేడేటి పాటలన్

ఘంటసాల రఫులు ఘనముగాను

మొదలుపెట్టినంత మూగి మేఘములపై

దేవ గణములవిగొ తేలెనటుల

(తేలెనచట)

 

బంధించెడి మీ పాటకు

కందుగ వజ్రాయుధమ్ము కరిగిన కూడా

విందును కడవరకు యనుచు

ఇంద్రుడు కూర్చుండెనచట ఇది వింతగదే

 

రాకపోతిరెన్ని రాగాలు పాడినా

ఎంతసేపుచూతు మిందురుడిని

మేడ వీడి రండి మీకోసమేమేము

వేచి యుండ కాచె వేయి కనులు

 

గద్దె నిలుపుకొనగ గారడీ చేయునే

ఇంద్రుడెటులతానె యిచ్చెనేడు

దివిని పొందిరేమొ దేవేంద్రునోడించి

రఫియు ఘంటసాల రాగములతొ

 

మేఘ మల్హరమ్ము మీరిర్వురూపాడ

మబ్బులెల్ల కరిగి మాయ మవగ

నెలవు గోలుపోయి నేలపై కూలమే?

వేరె పాట పాడ వేడుకొనెద

భూమి మీద మీవి ఫోటలు ప్రతిచోట

దివిని ఫ్యానులైరి దేవతలును

చూపి కరుణ నన్ను స్టూడెంటు చేసుకో

పాట నేర్చుకుందు పట్టుదలతొ

 

ఘంటసాల, రఫీలనుద్దేశించి దేవేంద్రుడు ఈ విధంగా అంటున్నాడు

గంధరువులుగా కొలుతురు
అందరు మిము భూమిపైన అది యిచ్చెను మా
కందరికీ గుర్తింపును
అందుకు మిము సత్కరింతుమందుకొనుడిదే

 

రఫియు ఘంటసాల రమ్యమ్ముగా పాడ
మదిర తాగి నట్లు మైకమెక్కి
దేవతా గణములు దేవేంద్రుడే రాగ
చేరిరచట యా కచేరి వినగ

 

భూమి మీద మీవి ఫోటలు ప్రతిచోట
దివిని ఫ్యానులైరి దేవతలును
చూపి కరుణ నన్ను స్టూడెంటు చేసుకో
పాట నేర్చుకుందు పట్టుదలతొ

 

J K Mohana Rao

హరి దరిసెనమునకోస

మ్మిరువురు మనమార స్వర్ణ – మేరువు జేరన్

హరి కనరాడే, వేఱొక

హరి వారినిఁ బిల్చి పాడ – నాహ్వానించెన్

 

పయనించిన యా చిలుకలు

శయనించఁగ హాయిగాను – స్వర్గము చేరన్

జయజయ నినాదములతో

జయంతజనకుండు బిలిచె – జంటగఁ బాడన్

 

హాయిగ నామని సాగెను

హాయిగ కుహుకూహు మంచు – నమరావతిలోఁ

దీయఁగఁ గోయిలలు పలుక

దోయిగ గళమెత్తి పాడఁ – దొడఁగిరి వారల్

 

గంగానది యొక్కరు పఱ-

గంగా యమునయ్యె నొకరు – గానమునందున్

సంగీతమున త్రివేణీ-

సంగమ మది దేవలోక – శైవాలినితోన్

 

వాలుకనులదానా నీ

వాలించుము ప్యారి ప్యారి – యనుచును తామీ

భూలోకమ్మును విడి స్వ-

ర్లోకమ్మును జేరి పాడ – లులితము లవరే

 

రాముని నామముకన్నను

భూమిని లేదేమి యంచు – మోదముతోడన్

ప్రేమను భద్రాద్రి నలరు

స్వామినిఁ గొలువంగ వారు – పాడిరిగాదా

 

అమరేంద్రునిసభలో రఫి,

సముచితముగ ఘంటసాల – చనె జన్నతుకున్

రమణీయమ్మౌ గానము

నమరుల్ వినిరప్డు, వినిరి – యల్లా హరియున్

 

భవనపు సిరి వల దొకనికి,

భువనములో భూతనాథుఁ – బొగడె నొకండున్

కవనములో భుజగములన్

నవనవముగ బాడినారు – నాకమునందున్

 

అనె నొక్కఁడు మధురమ్మని,

బెనవేసికొనంగ వలెను – బ్రియ ననె నొకఁడున్

స్వనముల ఘనముగ సకల భు-

వనజనులకు సంతసమ్ము – పఱచిరి వారల్

హరిదర్శనమున నెల్లరు
మురియుదురని బాడ నపుడు – మురిసెను హరియున్
హరియను పద మా హరికే,
యొరులకుఁ గాదనుచు నెఱుగ-కుండెను హరియున్

 

అందమె యానంద మ్మా-
నందమె మకరందమంచు – నలుగురి చెవులన్
సుందరమై ప్రసరించిరి
విందుగ భూలోకమందు – వేలుపు బ్రోలున్

 

వారు చిరంజీవులు భువి,
వారమరులు నమరలోక – వనసీమలలో
వారో స్వర గంధర్వులు
వారిద్దఱు ముద్దులొల్కు – వాణీపుత్రుల్

 

మ్రోఁగించిరి సన్నాయిగ
రాగమ్ముల కంఠమందు – రహితో నవమై
యోగమ్మది నరులకు నను-
భోగమ్మది సురుల కయ్యె – భువి నింద్రసభన్

 

ఇంటింటను మ్రోఁగును ప్రతి
గంటయు విన ఘంటసాల – గానమ్ము, రఫీ
కంఠ మ్మటులనె, నేఁడా
కంఠమ్ములు మ్రోఁగె నింద్రు – గంధర్వసభన్

 

మధువనమున రాధిక స-
మ్ముదముగ నాడంగ కృష్ణ – మురళియు మ్రోఁగెన్
సుధ చిందఁ బ్రణయ పదముల
ముదముగఁ బాడంగ రాధ – మోహనుఁ డూఁగెన్
(మధుబన్ మే రాధికా నాచేరే, గిరిధర్ కే మురలియా బాజేరే – రఫీ; పాడవేల రాధికా ప్రణయ సుధా గీతిక – ఘంటసాల)

 

Maddali Srinivas

పయనించే చిలుకను త-

న్మయమున బిలువంగ వారు – మబ్బుల వెనుకన్

నయమున వినిరట సురులును

జయమని పల్కెను సురపతి జయమిర్వురికిన్

 

గంగా యమునా సంగమ

రంగస్ధలి యాకసమట రసధుని పారన్

సింగారించుకు కిన్నెర

లుం గంధర్వులు వినిరట లోలితులగుచున్

 

బస్తీ దొరసానికి వాహ్!

ముస్తాబును జేయగాను ముచ్చట తోడన్

మస్తనిపించే పాటను

రుస్తుంలై పాడి నారు ఋజువా సురులే!!

దయగనమని పాడగ నా

దయలొసగే ప్రభువు తానె దయ నర్ధించెన్

దయతో వారలు పాడిన

జయగీతములన్ సురులకు జయమగు ననుచున్

 

ఇంద్రుని మనసులోని మాట

———————————

గానవాహిని యందు గాఢాను రక్తిని

పొంగిపోయెదనిప్డు పోరు మఱచి

అసురాధములకు నేడనువైన సమయము

ఆక్రమింపగ నాకమాప బోను

సంగీత సామ్రాజ్య సామ్రాట్టు లిర్వురు

సందడింపగ నేడు సంతసమయె

నేల సుఖములింక నేలనీ పదవులు

గానామృతము గ్రోలి గారవింతు

 

నారదాది ఘనులు నాకమందు గలరు

వారి గాన మహిమ పాడి యగును

చేరి ఘంతసాల చెలిమిని రఫితో-క

చేరి చేయ వినుదు “శ్రీలు” గురియ

 

ధ్రువ తారలు నాకమునన్

సవరింపగ గాత్ర మంత శచిపతి విని తా

చవులూరెడి సంగీతము

నవలీలగ పాడ గాను నలరుచు మురిసెన్

 

తనియించు గాన మధురిమ

వినినను కొండలు కరుగవె విననే మునుపున్

మును కొండల వజ్ర ముతో

తునియలు చేసితిని నేను దురుసుతనమునన్

 

దయగనమని పాడగ నా
దయలొసగే ప్రభువు తానె దయ నర్ధించెన్
దయతో వారలు పాడిన
జయగీతములన్ సురులకు జయమగు ననుచున్

 

బస్తీ దొరసానికి వాహ్!
ముస్తాబును జేయగాను ముచ్చట తోడన్
మస్తనిపించే పాటను
రుస్తుంలై పాడి నారు ఋజువా సురులే!! “ఓహో బస్తీ దొరసానీ> ఘంటసాల గారు” యు లేకే పెహ్ల పెహ్లా ప్యార్> రఫీ జీ

 

గంగా యమునా సంగమ
రంగస్ధలి యాకసమట రసధుని పారన్
సింగారించుకు కిన్నెర
లుం గంధర్వులు వినిరట లోలితులగుచున్ “తూ గంగా కి మౌజ్ ,మై జమునా కి ధారా”>రఫీ

 

పయనించే చిలుకను త-
న్మయమున బిలువంగ వారు – మబ్బుల వెనుకన్
నయమున వినిరట సురులును
జయమని పల్కెను సురపతి జయమిర్వురికిన్

చల్ ఉఢ్ జారే ఓ పంచీ- రఫీ జీ
పయనించే ఓ చిలుకా-ఘంటసాల గారు

Thimmaji Rao Kembayi

 

అమరగాయకుండుఆంధ్రుడు దివికేగి

అమరవరులు మెచ్చ అమరగాన

మాలపించశారదాంబ యగ్రాసన౦

బిచ్చి గౌరవిం చె మెచ్చుకొనుచు

 

అమరలోక నివాసుల కతి ప్రియమగు
జానపద గీతముల క్రొత్త బాణి యందు
శ్రావ్యముగ పాడ బిరుదు నొసంగినారు
ఘంటసాలకు గాంధర్వ గాయకుడన

 

Gopala Krishna Rao Pantula

గాన గంధర్వులిర్వురు గగన తలము

చేరి నారన్న సంగతి చెవిని బడగ

సాదరముగ శచీపతి స్వాగతించి

ప్రార్థనము జేసి వారల పాడ మనుచు

తాను కూర్చుండె వారిపాదాల చెంత.

 

SontiPrabhakaraSastry

తేటగీతి కాని ఆటవెలది కాని

కంద పద్యమల్ల కవిని గాను

అసలు పద్యమంటె అర్థము కాదులే

యతులు ప్రాసలంటె హడలు నాకు!

 

Bss Prasad

 

చల్లని వెన్నెల లో మరు

మల్లెల జావళి ప్రసాద మాధుర్యములన్

జల్లుము ఓ గాంధర్వా

మెల్లగ గ్రోలెదన మృతము మేనుప్పొంగన్

 

చౌద్వి నీ చందురునిమించు అంద మేది

“రఫి” గళము పాడని మధుర రాగ మేది

విందు జేయుము నో గాన బంధు లార

స్వర్గ సీమ వాసము బల్కు స్వాగ తమ్ము

 

అక్కినేని మీ పాటకు అడుగులేసె

నందమూరి మీ పాటకు నడుమునూప

జగము వారికి జైకొట్టి జయము పలికె

అమర లోకమ్ము తామంత అతిథు లైరి

స్వర్గ పతియు నర్తించ మీ స్వరము గూడి

రంభ మేనక లాటలు రమ్య మౌను

 

దయనీయంగా పంచీ

పయనించెనుఒకని నోటి పాటకు పలుకై

పయనించే ఓ చిలుకా

పయనించెను ఒకని నోటి పల్లవి చిలుకై

ఘంటసాలకు జంటగ కంఠ మిచ్చి

యుగళ గీతమ్ముపాడిరి మగువ లంత

జానకి సుశీల జిక్కిల గాన లహరి

వలపు లోగిళ్ళు ముంచునే వయసు నైన !

 

ఆమీ తూ మీ వారే !

హేమా హేమీ జగాన హిట్టే భాయీ !

మామా మామా అంటూ

భామలు పాడగ పసందు పంటే కాదా !

ఎవరి గొంతును వారికే ఏస పెట్టి

పాడె ఘంటసాలనటుల మాట బట్టి

అక్కినేనికి పాడగ నొక్కి పెట్టి

నంద మూరికి పాడెను చిందు లేసి

తుంబుర నారద పోటీ
అంబరమే వేది కవగ ఆహ్వాన మిదే
తంబూరా మన గుర్తుగ
సంబరమేజరుగునింక సర్వులు జూడన్ (సఖులే జూడన్ )

రాగ యుక్తమ్ము పాటకు రఫియె రాజు
మనసు కోరును వినమని మారు మారు
పూలు తాకినట్లు తనువు పులకరించు
కనులు మూయగ తియతీయ కలలు నింపు

 

ChandramouliSuryanaryana

మధుబన్ మె రాధికా, మనుతర పతు, చలి

చలి రే పతంగ్ మేరి చలిరె యనిన

కూహూ కుహూ బోలె కోయలియాయన్న

మహమద్ రఫీ గొంతు మధువులొలుకు

రసికరాజయనిన రాగమయియనిన

పదపదవే గాలి పటమా యనియనిన

పాటనమృతధార ప్రవహింపగా జేసె

గానగంధర్వుడు ఘంటశాల

ఉత్తరాది గాయ కోత్తముడు రఫీయె

ఘనుడు తెలుగులోన ఘంటశాల

ఇంద్రలోకమందు నింద్రుని మురిపించ

దిగ్గజములిరువురు దివికిజనిరి

మధుబన్ మె రాధికా, మనుతర పతు, చలి
చలి రే పతంగ్ మేరి చలిరె యనిన
కూహూ కుహూ బోలె కోయలియాయన్న
మహమద్ రఫీ గొంతు మధువులొలుకు
రసికరాజయనిన రాగమయియనిన
పదపదవే గాలి పటమా యనియనిన
పాటనమృతధార ప్రవహింపగా జేసె
గానగంధర్వుడు ఘంటశాల
ఉత్తరాది గాయ కోత్తముడు రఫీయె
ఘనుడు తెలుగులోన ఘంటశాల
ఇంద్రలోకమందు నింద్రుని మురిపించ
దిగ్గజములిరువురు దివికిజనిరి

 

Srinivas Iduri

ఘంటసాల, రఫీల గాన మాధుర్యంలో ఇంద్రుడు తేలుతుంటే పాపం మేనక, ఊర్వశి ఇలా….

మేనక ఊర్వశి పాపము

ఆనక మరొక గతి యైరి ఐటెం బాంబుల్

మానక ఇంద్రుడు మునుగగ

గానకళా విదుల దీటు గాత్రములందున్

ఉత్తర భారతపు రఫీ

మత్తు గొలుపు ఘంటసాల మస్తుగ గలిసెన్

తత్తరపడి ఇంద్రుడు సుతి

మెత్తగ కోరెను పదములు మెచ్చుచు మదిలో

హాయిగ తెలుగూ హిందీ

భాయీ భాయీ అనియెడి భావము తోడన్

చేయగ కచేరి ఇరువురు

మాయగ తోచెను, సురపతి మతియే పోయెన్!

 

SubrahmanyaChakravarthiOruganti

విజయమో వీరస్వర్గమో అంటారు. యుధ్ధంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళి స్వర్గ సుఖాలు అనుభవిస్తారుట. స్వర్గసుఖాలంటే ఏమిటో మనందరికీ తెలిసిందే..

ఘంటసాల, రఫీలు దేవేంద్రునితో ఇలా అంటున్నారు….

(తేటగీతి)

శక్తి చాలక రణములో చచ్చినట్టి

పీనుగులతోడ రతములో పెనిగినట్టి

అచ్చరల నాట్య మేలరా? అమరనాధ!

కాస్త మాగానవిభవమ్ము గాంచవయ్య!

 

Shankar Boddu

గాన సుధారసమ్మొలికి కాలము జేసియు స్వర్గసీమలో
వీనుల విందుచేయ నొక వీణను మీటుచు నేక కంఠులై
గానము చేయుచుండిరట కౌశల మొప్పగ ఘంటసాలయే
పూని రఫీని గూడుచు నమోఘ ప్రదర్శన నిచ్చెనచ్చటన్!

 

Arka Somayaji

వారా? వారమరేంద్రు గాయకులు ! వహ్వారే ! “మహమ్మద్ రఫీ”
సారప్రజ్ఞుడు “ఘంటసాల” యుగళ ప్రస్తార గానామృత స్వీ
కారంబందు మహేంద్రజాల, రసస్వర్గంబద్ది ! నిత్యోత్సవ:
పారావార………….తరంగ డోలికల శోభా ప్రాభవ శ్రీలవే !

 

Sivaramakrishna Prasad

తేగీ . బొట్టు నునుదుటవద్దని బుద్ధి చెప్పు
బడులు ఎక్కువ వచ్చెను పతన మంద
వెరసి బోట్టే కదాయని పీకి వేయ
పీక కోసెద పిడికిలి పిసికి వేతు

తేగీ . వంద నమిదివీరులకిది వంద నమిది
దేశ హితుముకోరుజనుల ఆశ యమది
మాకు నెపుడుము వ్వన్నెల మాధ్వజముకు
కీర్తి బొట్లునుడుటనద్ద స్పూర్తి దీర

తేగీ . చింది సైనికరుధిరమానందమీయ
శ్రమచె ఘర్మజలములక్ష్మి ధామమవ్వ
శక్తి యుక్తులు మాఖ్యాతి జగతి తెలుప
భువికె బొట్టుగ భారత భూమి నిలిచె

ఏమో ఏమో ఇదిమా
కేమో ఏమో అయినది గిరిజా నాధా
మామీ దికదయ చూపుమ
మేమూ రఫిఘంటసాల మేటిల వింటూ

సురులున్న దేవ లోకము
సురగా నముభువి నవింటు సుడిపడి పోవన్
ధరఘం టసాల రఫిగాం
చిరయము పిలిచెత మచెవుల చిలుములు వీడన్

స్థితిమతులై మనుజేంద్రు లనేకులుసింధువులైవిలసిల్లినభా
రతకవిరాజ విరాజితమైన పురాకృత కావ్యమరంద మహో
న్నతులనుకోర సనాతనశైలి ఘనంబుగ ఘంటమునాడుచుస
త్కృతులిటజారెను ఋత్వి జుడైకృ తికృత్య మిడన్ కవిహృద్యముగా

 

Sudharshan Kusma

గాన గంధర్వులైనట్టి ఘంటసాల
రప్ఫి లిరువురు నొక్కటై రంజితముగ
అమరపురిలోని దివిజుల నలర జేసి
ప్రీతి పాత్రులై నిలిచిరి పేర్మి తోడ

 

Devarakonda Subrahmanyam

స్వరరాజు లిర్వురు కుాడి
సురలోకములోన గానమాలాపింపన్
సురరాజు మైమరచె
సరి యెవ్వరు వీరికి గానమాధుర్యమునన్

 

Sailaja Akundi

సరిలేరుగ మీకెవ్వరు
సురలోకమునందుగాని సురభిన గానీ!
చిరజీవులు మీ పాటలు
తరతరములు మరువలేరు తధ్యము సుమ్మా!!!

రఫియు ఘంటశాల రాగాలు వినినంత
పరవశించి పోయె హరిహయుండు
పుడమి జేసుకున్న పుణ్యంబులేమొకొ
మహతి కఛ్ఛపిటుల మనుజులైరి !!!

రారా కృష్ణయ్య వినగ
చేరును గద నల్లనయ్య చెలులందరితో
భారత కీర్తిని పాడిన
హారతు లిచ్చెనుగనాడు హాలీవుడ్లో!!!

కఠిన ఫాషాణ మైనను కరగి పోవు
సాగు వాయువుల్ చెవియొగ్గి యాగివినును
పుడమిపరితోషమొందును పుత్రులనుచు
వాగు వంకలు నదములు ప్రమదమొందు
పుణ్య భారత మాతయె పులకరించు
ఘంటశాల రఫి మధుర గానమువిని!!!

గద్యము వినగా మధురమె
పద్యము పాడంగకరుగు గండశిలైనన్
హృద్యమ్ముసుమా పాటలు
నధ్యాయము ముగిసెనేమి? యమరులు మీరే!!!

 
Venkat Tekumalla

అక్కినేనికి పాటలు – అచ్చు గుద్దె
ఎంటివోడికి పద్యాలు – ఎక్సలెంటు
నటులు వందలు “ఘం”ఠాన – నడిచె నాడు
వాసవుండును నేడట – వాద్య గోష్టి.

 

Bharathi Katragadda

తే. గాన గంధర్వ కంఠాన ఘనము గాను
తీయని స్వర ఝరియపారి తేనెలయ్యె!
జనుల ఎదలెల్ల పులకించె జగతి లోన
స్వర్గ పురిలోను అడుగిడె స్వరపు రేడు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *