May 3, 2024

పద్యమాలిక – 4 (2)

 padyamalika

Venkata Subba Sahadevudu Gunda

1.

పగలంత పిల్లలెల్లరు

తెగవాడగ కంప్యుటర్ను ,తిమిరపు వేళన్

సెగబుట్టెడు మంట లెగయ

బెగడెడు బామ్మ చలిఁ గాచె బిగుసుకు పోకన్!

 

2.

అహమందు నుగ్రవాదుల

దహనమ్ముల వార్త దూరదర్శని జూపన్!

తుహినపు తాకిడి నోర్వక

యుహుహూ యని వడకు బామ్మ యుడుకును గాచెన్!

 

3.

త్రీడీ టీవీ యైనన్!

బోడీ! సెగఁగాచునటుల పోజేలమ్మా!

కూడును వండగ పదవే

వేడిసెగల వంటశాల వెచ్చగ నుండున్!

4.

టీవీ ముందర నిటులన్

దేవీ! చలిఁ గాచు మంట తీర్చుట మేలా?

రావే యిటు వంటింటికి

నా వల్లను గాని పనుల నలుగుచు నుంటిన్!

 

J K Mohana Rao

ఉగ్రత లేదుక దీ యు-

ష్ణోగ్రత కీవేళఁ జలియు – సున్నకుఁ గ్రిందన్

నిగ్రహమునఁ దెరపైఁ గల

యుగ్రజ్వాలలను గనుచు – నోర్వఁగవలయున్

 

Chandramouli Suryanaryana

సులువౌనెల్ల పనులునీ

యిలలో మనయింటనుండనింటర్ నెట్టే

చలిగాచు కొనుచునుండెను

కలకంఠి తనింటిలోని కంప్యూటరులో

 

చలికాచు కొనెదవా ఓ

కలికీ నీ పిచ్చిగాని – కంప్యూటరులో

వెలిగెడు మంటకు కైలిడ

కలుగునె యింతైనవేడి కాంతా వినవే

 

ఇంతీ నీకున్నతెలివి

నెంతైనను పొగడవచ్చునెల్లపనులలో

వింతైన తీరు నీదిగ

కాంతా చలిమంటనాపి కాఫీతేవోయ్

 

NagaJyothi Ramana

ఇంటికి ముందర భోగిన

మంటను పెట్టని పతిగని -మండిన వేళన్

వంటను మానిన సతి నెర

కంటను మంటల గనియెగ –కంప్యూటరులో

 

అమ్మో ఎఫ్ బీ రంధితొ

బొమ్మల మంటల కనుగొని -భోగమ్మనుకో

కమ్మా నువు భ్రమజెందక

లెమ్మా నిజభోగిమంట –లెస్సగజూడన్

 

Goli Sastry

1

చలిమంట బయట వేసితి

చలిగాచగ రమ్మనంటి, ” చలి ” రానంటూ

చిలిపిగ నాన్లైన్లోనే

సెలుఫోనున సుతుడు బంప చలిగాస్తావా !

 

2

చలిమంటను మీనాన్నే

‘ పులిపాకను ‘ వేయుచుండ భోగిని నేడే

సిలికాన్ వ్యాలీలో నువు

చలిమరగదిలోన నెట్టు సఖి, ” సీయింగా ” !

 

3

వంటను మానిటు గదిలో

నొంటరిగా నెట్టుముందు నూట్యూబ్ లోనే

” మంటలు ” సీర్యల్ వదలక

” మెంటల ” చూస్తావు రావ ! మేనే మండెన్.

 

4.

చలికే వణుకుచు నీవే

చలి ‘ గాచుట ‘ కొరకు ‘ వేడి ‘ సరి తగులుటకున్

చెలి ! యగ్ని దేవు ‘ వేడిన ‘

కలనైనను ‘ గాచగలడె ‘ కంప్యూటరులో !

 

Sailaja Akundi

పెట్టితి భోగీ మంటను

హిట్టందురు నెట్టులోన నిది జూడగనే

చుట్టము లందరు వరుసగ

కొట్టరె మరిలైకులనుచు కోమలి మురిసెన్!!!

 

Bss Prasad

అంతర్జాల నిషా లో

కాంతలిపుడు సాహసించ కాలుని ప్రభలో (ప్రభకై)

భ్రాంతుల రోగము ప్రబలున్

చింతలు తప్పవు ? సఖులను సెగలే కాల్చన్

 

Madhav Rao Koruprolu

సరసీ! రావే..దరికిన్..

అరమోడుపు కనుల తోడ ఆ నగవేలా..?!

మురిపించు వేళ ‘కంప్యూ-

టరు’ చలి మంటయ్యె నీకు.. టక్కరునీకే..!

 

ఏమా ‘టీవీ’ మంటను..

భామా! తగునా.. నిలువగ ? పాపా! చలియా!

రామా! తీర్చగా వేచిన

కామాతురుడౌ మగనిక గనుమీ భోగిన్..!

 

లలనా ఉలుకవు పలుకవు..

కులుకుల్ లోలో జిలుకుచు కూర్చోన నేలా..?!

చలి కాచుకొనుచు భోగిన్..

చెలునే చూడక నిలువగ చిత్తమదేలా..?!

 

Srinivas Iduri

చలిగాచుకొనగ నాకౌ

గిలి చాలును కద మనలకు గిరిజా, వినవే

నులివెచ్చని ముద్దులనెడు

గిలిగింతలతో చెలి నను గిల్లగ రావే

 

Srinivas Bharadwaj Kishore

పటమున నుండెడి దేవుడు

ఎటులిచ్చేనో వరములనీయమనడుగన్

అటులనె తెరపైనున్నను

చిటపటలాడేటిమంట సెగనిచ్చుగనన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *