May 4, 2024

‘దివ్య ద్విగళగీతాలు’

 రచన:నండూరి సుందరీ నాగమణి

మన సినీ వినీలాకాశంలో ఎన్నెన్నో తారలు. కొన్ని తారలు తెర ముందు అద్భుతమైన  అభినయాన్ని పండిస్తే మరి కొన్ని కనిపించని తారలు ఆ అభినయానికి రాగాల వన్నెలు అద్దుతాయి. వారే నేపథ్య గాయకులు. సీరియస్ గా సాగిపోతున్న చిత్రంలో అలవోకగా మెరిసే గీతాలు మనసుకు ఎంతో హాయిని కలిగిస్తాయనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. అలాంటి మనోహరమైన  పాటల గురించి ముచ్చటించుకోవటం కూడా చక్కని విషయమే కదా.

ఆ రోజుల్లో మహిళా గాయనీ మణులు చాలా తక్కువ మంది ఉండే వారు. మంచి గాత్రం తో పాటు, శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉండటం ప్రాథమిక అర్హత. అలాంటి గాయనీ మణులలో శ్రీమతి పి.లీల, శ్రీమతి పి.సుశీల, శ్రీమతి యస్.జానకి, శ్రీమతి పి.భానుమతి, శ్రీమతి జిక్కీ [పి.జి.కృష్ణవేణి], శ్రీమతి బి.వసంత, శ్రీమతి జమునారాణి, ఎల్లారీశ్వరి ముఖ్యులు. తదుపరి కాలంలో సినీరంగంలోకి అడుగు పెట్టిన యస్.పి. శైలజ, వాణీ జయరామ్, కే యస్  చిత్ర గారలు  కూడా తమ పాటలతో ప్రేక్షక శ్రోతలను ఎంతో అలరిస్తున్నారు. దృశ్య మాధ్యమం జీవితంలో ఒక భాగమై పోయిన ఈ రోజుల్లో, టీవీ ఛానల్స్ నిర్వహించిన పోటీల ద్వారా మధురమైన మంచి గళాలు మరిన్ని మనకి దొరకటం తో ఎంతోమంది నవ యువ గాయనీ మణులు మన చిత్ర సీమకు పరిచయమై తమ గాన మాధుర్యంతో ఈనాడు మనల్ని అలరిస్తున్నారు.

అలనాటి చిత్రాలలోని కేవలం ఇద్దరిద్దరు మహిళా గాయనీమణులు మాత్రమే కలిసి పాడిన ద్విగళ గీతాల గురించి ముచ్చటించుకొనే అవకాశం మహిళా దినోత్సవ సందర్భంగా మనకు కలిగింది.

susheela leela

గాయని లీల గారు సుశీల గారితో కలసి ఎన్నో మధురమైన గీతాలను ఆలపించారు. ‘కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో, తరుణం కాని తరుణంలో నా మది ఈ గుబులెందుకనో…’ [అప్పుచేసి పప్పుకూడు], ‘జలకాలాటలలో, కల కల పాటలలో… ఏమి హాయిలే హలా!’, ‘వరించి వచ్చిన మానవవీరుడు ఏమైనాడని విచారమా?’, ‘ఆదీలక్ష్మి వంటి అత్తా గారివమ్మా!’ [జగదేకవీరుని కథ]; ‘అల్లీ బిల్లీ అమ్మాయికి చల్ల చల్లని జోస్యం చెబుతాము’, ‘విన్నావా యశోదమ్మా’  [మాయాబజార్]; ‘స్వాగతం, సుస్వాగతం… స్వాగతం కురుసార్వభౌమా…’ [శ్రీకృష్ణ పాండవీయం]; ‘విరిసే చల్లని వెన్నెల’, ‘రామన్న రాముడూ’, ‘రామ కథను వినరయ్యా…’, ‘వినుడు వినుడు రామాయణ గాథ’, ‘శ్రీ రాముని చరితమునూ తెలిపెదమమ్మా’, ‘లేరు కుశలవుల సాటీ’, ‘శ్రీ రామ పరంధామ’, ‘ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా’ పాటలు (లవకుశ) దేశాన్ని ఒక్క ఊపు ఊపాయి అంటే అది వట్టిమాట కాదు.

janaki-susheela

ఇక సుశీల, జానకి గారితో కలిసి పాడిన పాటల జాబితాకు అంతం లేదు. ఎన్నెన్నో మధుర గీతాలు… ‘రాసక్రీడ ఇక చాలు, నీకై రాధ వేచె వేయేళ్ళు…’ [సంగీత లక్ష్మి]; ‘సరిలేరు నీకెవ్వరూ…’ [కంచుకోట], ‘కరుణించవే కల్పవల్లీ…’ [శ్రీకృష్ణ తులాభారం]; ‘కనులకు వెలుగువు నీవే కావా…’ [భక్త ప్రహ్లాద]; ఆరనీకుమా ఈ దీపం, కార్తీక దీపం [కార్తీక దీపం]; ‘ఇదేనన్న మాట, ఇది అదేనన్నమాట’ [కొడుకు-కోడలు]; తం తననం తాళంలో, నవ రాగంలో… [కొత్త జీవితాలు]; నీ రాధను నేనే, ఎడబాయగలేనే [భీష్మ]; ‘పాటకు రాగాలు కోటి’ [రాముడే దేవుడు]; దిక్కులేన్ని మీటాడో సుందరాంగుడు’ [రాజపుత్ర రహస్యం]; ‘ఎంతెంత దూరం?’ [మానాన్న నిర్దోషి]; ‘నోచిన నోముకు ఫలము’ [బంగారు కానుక]; ‘అమ్మా, నీవే లేనీ తావే లేదు’ [పచ్చని సంసారం]; ‘తలలూ చేతులు తగవులు పడితే తబలా దరువే మాలిష్’ [కటకటాల రుద్రయ్య]; నిండు పున్నమి నెలా [ఋణానుబంధం]; ‘నల్లవాడే` [విషాద గీతం-దసరా బుల్లోడు]; ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో మధుర గీతాలు.

suseela vasanta

మరొక మంచి గాయని బి.వసంత గారితో కలిసి సుశీలమ్మ గారు పాడిన పాటలన్నీ మన మనసులకు హాయిగా అనిపిస్తాయి. ‘నిజం చెప్పవే పిల్లా, ఎలాగుంది ఈవేళా?’ [డాక్టర్ చక్రవర్తి], ‘అమ్మా, అమ్మా… ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో… ఇక్కడ వెదికీ అక్కడ వెదికీ పట్టుకో…’ [జీవన జ్యోతి]; ‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ’ [మాతృదేవత]; ‘నా చిట్టీ, నా చిన్నీ… ఆనక అన్నీ చెబుతాలే లిల్లీ లిల్లీ…’ [చెల్లెలి కాపురం]; గల గల గల గల గజ్జెల బండీ… [పవిత్ర బంధం]; మారాజులొచ్చారు, మా ఇంటికొచ్చారు, మాకెంతో నచ్చారూ… [ఆత్మగౌరవం]; శ్రీకరమౌ శ్రీ రామ నామం; భీషణమౌ శ్రీరామ బాణం [శ్రీ రామాంజనేయ యుద్ధం]; ఇవన్నీ కూడా మధురాతి మధురమైన గీతాలు.

P-Suseela-award-for-Vani-Jayaram

గానకోకిల సుశీల గారు, మరొక మధురగాయని వాణీ జయరామ్ గారితో కలిసి పాడిన మధుర గీతాలు అతి తక్కువే అయినా  కూడా అవి  మన మనసులను అలరిస్తాయి. ‘బంగారు తీగకు ముత్యాల పూలు, అందాల అక్కయ్యకు అంతకు మించిన సుగుణాలు’ అంటూ ఎంతో మధురంగా సాగిపోయే అక్కా చెల్లెళ్ళ పాట [గీత-సంగీత]; ‘ఈరోజు మంచి రోజు, మరపు రానిది మధురమైనది, మంచితనం ఉదయించిన రోజు…’ అని ఆహ్లాద పరచే క్రిస్మస్ సాంగ్ [ప్రేమలేఖలు]; ‘ఆడనా? పాడనా?’ అంటూ సాగే పోటీ పాట [రామకృష్ణులు]; రెండు అసామాన్య ప్రతిభ గల గళాలు కలిస్తే ఎంత అబ్బురంగా ఉంటుందో తెలియజేసే గీతాకుసుమాలని చెప్పక తప్పదు.

ఇప్పుడు కొన్ని అరుదైన గళాల సంగమం గురించి చర్చించుకుందామా?

నట గాయనీమణి శ్రీమతి భానుమతీ రామకృష్ణ గారు సంగీత విదుషీమణి అని కూడా అన్న విషయం మనకందరికీ విదితమే. అటువంటి భానుమతి గారు ఇద్దరు గాయనీ మణులతో కలిసి రెండు పాటలు పాడారు. ‘కనులకు తోచీ చేతికందని ఎండమావులున్నై, సోయగముండీ సుఖము నోచనీ బ్రతుకులున్నవీ కొన్నీ’[బాటసారి] అనే పాటలో జిక్కీ గారి స్వరంతో తన స్వరాన్ని కలిపారు భానుమతి గారు. ‘శ్రీ సూర్య నారాయణా మేలుకో, మేలుకో… మా చిలకమ్మా బులబాటము చూసి పో… చూసిపో…’[మంగమ్మ గారి మనవడు] అని మనవరాలిని ఆట పట్టించే అమ్మమ్మగా వాణీ జయరామ్ గారితో కలసి పాడారు. ఈ రెండు పాటలూ కూడా ఎన్ని తరాలైనా వన్నె తరగని స్వర మాధుర్యాలే. యస్.వరలక్ష్మి గారు కూడా నట గాయనీ మణియే. వీరు కూడా ‘నవనీత చోరుడు నంద కిశోరుడు’ [కృష్ణ ప్రేమ] అనే పాటను జిక్కీ గారితో, ‘తిరుమల తిరుపతి వెంకటేశ్వరా…’ [మహామంత్రి తిమ్మరుసు] గీతాన్ని సుశీలగారితోనూ ఎంతో హృద్యంగా గానం చేసారు. ఈ రెండు పాటలూ మణిపూసలే.

‘సుందరాంగ మరువగ లేనోయ్ రావేలా?’[సంఘం] అని సుశీల గారు, భగవతి గారితో కలిసి పాడిన పాట ఎంత బాగుంటుందో… ‘చేప రూపమున  సోమకు చంపీ’ [రంగులరాట్నం] దశావతారముల వర్ణనతో వసంత గారు ఎ.పి.కోమల గారితో కలిసి పాడారు. ‘నీవన్నది నీవనుకున్నది…’ [కలెక్టర్ జానకి] జమునారాణి గారితో కలిసి సుశీల గారు పాడిన పాట. ‘అల్లరి కృష్ణుడు, అందరికిష్టుడు’ [ఇల్లాలు] పాటను యస్పీ శైలజ గారూ, సుశీల గారూ కలిసి పాడారు. గాయని యస్ జానకి గారితో అల్లరి పాటల ఎల్లారీశ్వరి గారు కలిసి పాడిన ‘గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు’ [ఇదా లోకం] ఇటు భక్తులనూ, అటు రస హృదయులనూ అలరిస్తూనే ఉన్నది. ‘తూర్పూ పడమర ఎదురెదురు’ [తూర్పు-పడమర] అని, సుశీల గారు శ్రీమతి కోవెల శాంత గారితో కలసి పాడిన పాట ఎంత మధురం? జానకి గారు, జిక్కీ గారు మరదలిని ఏడిపిస్తూ పాడిన ‘చిన్నారీ మరదలికీ పెళ్లవుతుందీ…’ [రామాలయం], జిక్కీ, సుశీల గారల వదినా మరదళ్ల పాట ‘మరదలా మరదలా తమ్ముని పెండ్లామా ఏమమ్మా, వైనమేమమ్మ?’ [వరకట్నం] ఇప్పటికీ ప్రేక్షక శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. ‘డీడిక్కు  డీడిక్కు డీడిక్కు డిగా’ [మంగమ్మ శపథం] జానకి, జిక్కీ గార్ల జంట స్వరాల్లో చక్కగా హుషారుగా సరదాగా సాగిపోతుంది. ‘చిట్టి పొట్టి బొమ్మలూ, చిన్నారి బొమ్మలు…’ [శ్రీమంతుడు] సుశీల, జిక్కీ గార్ల స్వర సంగమమై చిన్నారుల బొమ్మల పెళ్ళి వేడుకలను మన కనుల ముందు నిలుపుతుంది. ‘తూనీగా, తూనీగా’ [మనసంతా నువ్వే] పాటలో ఉష, సంజీవని పంచిన మధురిమలు మరచిపోగలమా? అన్ని తరాలవారినీ ఉర్రూత లూగించిన పాట అది. ‘జాలిగా జాబిలమ్మా… రేయి రేయంతా… రెప్ప వేయనే లేదు, ఎందు చేతా?’ [స్వాతి కిరణం] కరుణ రసాన్ని కంటి రెప్పల్లో చిప్పిల్ల జేసే ఈ గీతాన్ని హృదయపు లోతులను స్పృశించేలా గానం చేసిన వాణీ జయరామ్, చిత్ర గార్లకు, వారి గాత్రాలకు ఎన్నని  కృతజ్ఞతలు చెప్పుకోగలం? ‘అల్లిబిల్లి కుందేలు పెళ్ళికొడుకు, జాబిల్లి కుందేలు పెళ్ళికూతురు…అందాల కుందేళ్ళ కళ్యాణము,  అడివంత కళ్యాణ వైభోగము!’ [నిండు నూరేళ్ళు] అంటూ జంతువులనే పాత్రలు చేసి, కమనీయ కళ్యాణాన్ని మనకి తమ గాత్రాల ద్వారా కనిపింప జేసిన సుశీలగారు, శైలజ గారు ఎంతైనా అభినందనీయులు.  ‘వెలుగూ రేఖల వారు తెలవారే  తామొచ్చి, ఎండా ముగ్గులు పెట్టంగా…’ [సీతారామయ్య గారి మనవరాలు] అంటూ, తాతయ్య, బామ్మల షష్టి పూర్తి మహోత్సవాన్ని కన్నులపండువగా మన కన్నుల ముందు నిలిపిన జిక్కీ, చిత్ర గారల స్వర మాధుర్యం కొనియాడ తరమా మనకు?

ఇప్పటి వరకూ మహిళా సంగీతజ్ఞుల ద్విగళ గీతాల గురించి చెప్పుకున్నాము కదా, వారి త్రిగళ గీతాలను గురించి కూడా ఓసారి స్పృశించుదామా?  ‘తుళ్ళీ తుళ్ళీ పడుతోంది తొలకరి వయసు’ [మంచి కుటుంబం] పాట గుర్తుంది కదా, ఆ పాటను అంత మధురంగా పాడిన వారు సుశీల, జానకి, వసంత గారలు. ‘వేణు గానమ్ము వినిపించెనే… చిన్ని కృష్ణయ్య కనిపించడే…’ [సిరి సంపదలు] అని బాల కృష్ణుని లీలల గురించి మనకు చెబుతారు వారి మధుర గానంతో సుశీల, జానకి, జిక్కీ గారలు.  ‘అలనాటి రామచంద్రుడి కన్నింటా సాటి, ఆ పలనాటి బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి!’ అని తెలుగింటి వివాహాన్ని అత్యంత వైభవోపేతంగా మన కనుల ముందు ఆవిష్కరించిన త్రిగళాలు సునీత, సంధ్య, జిక్కీగార్లవే.

ఇంత మంచి పాటలను, మనసు మీటే మధురగీతాలను తమ అమృత స్వరాలతో మనకు అందించిన  గాయనీమణులకు,  వారు కలిగించిన  ఆనందానికి ప్రతిగా ఏమివ్వగలం?  వారి పాటలను వింటూ  మైమరచి, మనసారా వారిని శ్లాఘించటం తప్ప!

***

 

17 thoughts on “‘దివ్య ద్విగళగీతాలు’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *