May 4, 2024

రాగలహరి – కళ్యాణి

రచన: భారతీప్రకాష్

piano-music-notes-6

సంగీత, సాహిత్యాలలో భావ సౌందర్యాన్ని అనుభవించగలమే కాని, నిర్వచించలేము. అటువంటి అనుభవము అప్రయత్నంగా, సహజంగా కలిగేది. మన భారతీయ సంగీత సాంప్రదాయంలో “రాగపధ్ధతి” అనేది ఒక అద్భుతమైన లక్షణం. ప్రతీ రాగానికీ కూడా కొన్ని నిర్దుష్టమైన లక్షణాలు వుంటాయి.దానితో పాటు ప్రతీ రాగమూ కూడా కొంత ప్రత్యేకత కలిగి వాటి గుర్తింపును కలిగి వుంటాయి. ఈ ప్రత్యేకతల వలన సంగీతంలో మంచి శిక్షణ కలిగినవారు ప్రతీ రాగాన్నీ సులభంగా గుర్తించగలుగుతారు. చెవికి యింపుగా వినపడే స్వర సమ్మేళనమే రాగం.మనసును రంజింపజేసేదే రాగం.

శాస్త్రీయ పధ్ధతిలో రాగాలు రెండు విధాలుగా విభజించబడ్డాయి.

1. జనక రాగాలు (72)

2. జన్య రాగాలు (లెక్కపెట్టలేనన్ని)

—————————————————————–

 

కల్యాణిరాగం..

 

రాగలక్షణములు…

65 వ మేళకర్త రాగం

కటపయాది సూత్రం కోసం “మేచ” అనే రెండు అక్షరాలను ముందు చేర్చి “మేచ కల్యాణి “అంటారు.

11 వ చక్రమైన “రుద్ర” లోని అయిదవ రాగం.

అతి ప్రసిధ్ధమైన ప్రతిమధ్యమ రాగం.

చాలా ప్రఖ్యాతమైన రాగం.

మూర్ఛనకారక మేళకర్త రాగం.

ఈరాగం లోని

“రి” ని షడ్జమం చేస్తే హరికాంభోజి,

“గ” ని  షడ్జమం చేస్తే నటభైరవి,

“ప” ని  షడ్జమం చేస్తే శంకరాభరణం,

“ద” ని  షడ్జమం  చేస్తే ఖరహరప్రియ,

“ని” ని  షడ్జమం  చేస్తే తోడి…

రాగాలుగా మారుతాయి.

 

ఆరోహణ… అవరోహణలు..

ఆరోహణ—-àస రి గ మ ప ద ని స

అవరోహణ–à స ని ద ప మ గ రి స

 

షడ్జమం పంచమంతో కలిపి ఈ రాగం లోని స్వరాలు:

చతుశృతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, చతుశృతి దైవతం మరియు కాకలి నిషాదం.

 

ఇది సంపూర్ణ రాగము.

సర్వ స్వర గమకవరీక రక్తి రాగం.

ఆరోహణ, అవరోహణ లోని అన్ని స్వరాలు కూడా రాగ ఛాయా స్వరాలు.

“రి, గ, ద, ని ” లు  న్యాస స్వరాలు.

“గ, ప “లు ఆధార స్వరాలు.

“రిరి గగ మమ దద

గగ మమ దద నిని,

మమ దద నిని సస

అనే జంట స్వర ప్రయోగాలు.

 

“ని గ రి ని ద ని రి ని ద మ

గ ని ద మ గ రి ”

అనే దాటు స్వర ప్రయోగాలు ఎంతో విశేషమైన ప్రయోగాలు.

 

“గగ దద నిని రిరి ”

లాంటి మధ్యమవర్జ ప్రయోగాలు,

“ద ని రి గ మ ద ని  రి ని ద మ గ రి ని ”

లాంటి షడ్జమ, పంచమ వర్జ ప్రయోగాలు ఈ రాగానికి ఎంతో అందాన్నిస్తాయి.

 

ఇది ఎంతో రాజసం గల రాగం.

రాగ విస్తారానికి ఎంతో అవకాశం గల రాగం.

అన్ని కాలాల్లోనూ పాడదగిన రాగం.

కాని సాయంత్రం వేళల్లో పాడితే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది.

ఈ రాగంలో ఉన్న తీవ్ర స్వరాల వలన కచేరీ మొదటిభాగంలో పాడితే బాగా రక్తి కడుతుంది.

పద్యాలు, శ్లోకాలు కూడా ఈ రాగంలో పాడుకోవచ్చు.

 

సంచారము:

గమపదనిసా -సనిదపామగరి-

గమపదనిదాపామ- పదనిసా-

సనిదా-దనిద గరిసనిదా-

దనిసరిసనిదపామగరి-

గమగనిదాపామ-దదపమగారి

నిరిగమపామగగరిరిసనిదరిసా||

 

ఈ రాగంలో గల కొన్ని ముఖ్య రచనలు..

1. గీతం…కమలజాదళ…త్రిపుటతాళం

2. వర్ణము…వనజాక్షిరో…ఆదితాళం

3. వర్ణము…వనజాక్ష…అటతాళం…శ్రీ పల్లవి గోపాలయ్యర్

4. కృతి…నిధి చాల …చాపుతాళం…శ్రీ త్యాగరాజు

5. కృతి… సుందరి నీ దివ్య.. ఆదితాళం ..శ్రీ త్యాగరాజు  (తిరువత్తూర్ పంచరత్నం)

6. ప్రహ్లాద భక్తివిజయం…వాసుదేవయని.. ఆదితాళం.. (opera)

7. కృతి…కమలాంబ…ఆదితాళం…శ్రీ ముత్తుస్వామి దీక్షితార్

8. తల్లి నిన్ను నెర…మిశ్ర లఘు….శ్రీ శ్యామశాస్త్రి

9. జావళి…ఎంతటి కులుకే…రూపక.. శ్రీ పట్టాభిరామయ్య

 

శ్రీ త్యాగరాజు ఈ కల్యాణి్రాగం లో ఈ కృతిలో శ్రీ బాలాత్రిపుర సుందరి యొక్క శుక్రవారపు సేవను ప్రస్తుతించారు.

కల్యాణిరాగం ఆదితాళం రచన ….శ్రీత్యాగరాజు

సుందరి నీ దివ్యరూపమును-

జూడదనకు దొరికెనమ్మ  ||

మందగమన నీదు కటాక్ష బలమో

ముందటి పూజా ఫలమో త్రిపుర  ||

భువిలో వరమౌ శ్రీమదాది

పురమున నెలకొన్న నీ సొగసు విని

సువివేకులైన బ్రహ్మాది- సురలు గుంపు గూడి

కవి వాసరపుసేవ కనుంగొన

కలుగునాయని కరగుచు మదిలో

దివి దత్తరము పడుచునుండగా

దీన జనార్తిహారిణి త్రిపుర   ||

కలిలో దీనరక్షకి యని సభ

కలిగిన తావున బొగడుదునమ్మా

సలలిత గుణ కరుణాసాగరి నీ- సాటి యెవరమ్మా

అలసి వచ్చినందుకు నా మనసు

హాయి చెందునా యని యుండగ మఱి

కలకలమని సురసతులు వరుసగా

గొలుచు శుక్రవారపు ముద్దు త్రిపుర   ||

నన్ను గన్న తల్లి నా జన్మము

నాడు సఫలమాయెనమ్మా ఇపుడు

ఘన దరిద్రునికి పైకమువలె కనుల పండువుగా

వనజనయన ఎండుపైరులకు జలమువలె శుభదాయకి కామ

జనకుని సోదరి శ్రీ త్యాగరాజ మనోహరి గౌరి   ||

 

ఈ కృతిలో శ్రీ బాలాత్రిపురసుందరి యొక్క శుక్రవారపుసేవ ప్రస్తుతించబడినది.

ఓ సుందరీ నా పూర్వజన్మ భాగ్యము వలననూ, నీ కటాక్ష బలము వలననూ నీ దర్శనభాగ్యము కలిగినది. భూలోకమున “ఆదిపురమున” నీవు వెలసి శుక్రవారపు పూజల నందుచుండగా నీ సొగసు దర్శించవలెనని మురియుచూ బ్రహ్మాది దేవతలు ఆకాశమందు గుంపుగూడియున్నారు. ఓ తల్లీ! కలిలో దీనులైనవారిని కాపాడు దయామయివని పలు సభలలో నీ కీర్తిని పాడుకొందును. నాకు నీ దర్శనము ప్రాప్తించినందుకే నా మనస్సు బ్రహ్మానందమొందుచుండగా, దేవకాంతలు కూడ వచ్చి, ముచ్చటగా శుక్రవారపుసేవ సేయుచుండగా చూడగల్గుటచే నా జన్మ సఫలమైనది. పేదవానికి అప్రయత్నముగా ధనము లభించినట్లు, ఎండలచే ఎండిపోతున్న పైరులకు చక్కని వర్షము కురిసినట్లు నా కనులపండువుగా నీ సేవాభాగ్యము కలిగినది. ధన్యుడనైతిని తల్లీ! యని ఆ త్రిపురసుందరీదేవిని శ్రీ త్యాగరాజు కీర్తించినారు.

 

ఇదే కల్యాణిరాగంలోలలితసంగీతంలో శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావుగారు ఒక అద్భుతమైన పాట పాడారు.

ఆపాటే  ఈపాట..

“తలనిండ పూదండ దాల్చిన రాణి

మొలక నవ్వుల తోడ మురిపించబోకే…

మైమరపించబోకే…”

 

సినిమా పాటలలో ఎన్నో పాటలు ఈ కల్యాణిరాగంలో స్వరపరిచారు.

అందులో నాకు ఎక్కువగా నచ్చిన పాటలు..

౧. మది శారదాదేవి మందిరమే…(జయభేరి)

౨. సలలితరాగ సుధారస సారం..(నర్తనశాల)

౩. మనసుపాడింది సన్నాయిపాట..(పుణ్యవతి)

__________________________________________________________

 

 

 

 

 

5 thoughts on “రాగలహరి – కళ్యాణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *