May 4, 2024

వీణ

రచన: జయలక్ష్మి అయ్యగారి

jayalakshmi

వీణ  అనిన  తంత్రీ  వాద్యమని  అర్ధము.  ప్రాచీన  గ్రంధములలో  వీణను  రెండు  విధములుగా  వర్ణింపబడినది.  దైవీ  వీణ,  మానుషీ  వీణ.

దైవీ  వీణ  అనగా  భగవంతునిచే  నిర్మింపబడిన  మానవ  కంఠమందుగల  స్వరపేటిక  (Larynx) అనియు, మానుషీ  వీణ  అనగా  మానవ  నిర్మితమయి, నేడు  మనం  చూస్తున్న వీణ  అని  తెలియుచున్నది.

వీణ కడు ప్రాచీన  వాద్యము. వేదకాలం  నుండి  వీణ ప్రస్తావన ఉంది.  వాగ్దేవి  చేతులలో   నున్నట్లు వర్ణింపబడినది.  అందువల్లే  మనము  సరస్వతీదేవిని  వీణా, పుస్తకధారిణీ  అని  కీర్తిస్తుంటాము.  క్రీస్తుశకము 1550లో  రామామాత్యుడు  రచించిన “స్వర  మేళ కళానిధి” వీణకు సంబంధించిన మిక్కిలి ముఖ్యమయిన  గ్రంధము.

వీణ  తంత్రీ  వాద్యము.  నేడు వాడుకలోనున్న స్వరరాగ మేళ  వీణను రామామాత్యుని  కాలములో  స్థిరపరచబడినది. దానికి  పూర్వము  వీణ స్వరూపము  నేటి  వీణకు  కొంత  వేరుగా  నుండెడిది.  వీణపై  మూడున్నర స్థాయిలు పలుకుతాయి. ఇన్ని  స్థాయిలు  పలికించగలిగిన  ఏకైక  వాద్యము  వీణ.

త్రిలోక  సంచారియగు  నారదుడు వీణను ఈ లోకమునకు తెచ్చినట్లు నానుడి.  ఈ  వాద్యమందు  22 శ్రుతులు  పలుకుచున్నవి  గాన,  ఇది మిక్కిలి  ప్రశస్త్యమైన  వాద్యముగా పేరొందింది. వీణ  మానవ  శరీరమును  అనుసరించి   నిర్మింపబడుట వలన  లక్ష్య , లక్షణాయుతమైన  సంగీతము  అమూలాగ్రము  ఈ  వాద్యముపై  అభ్యసించుటకు   వీలుగానున్నది. వీణను  పనసకర్రతో  తయారు చేస్తారు.  దక్షిణ  భారతదేశమందు  తయారగు  వీణలు  ఆకారమందు,  గానమాధుర్యమందు  కూడా  చాలా  ప్రాశస్త్యం  పొందినవి..

పూర్వము  వీణను  నిలబెట్టి  వాయించుట  ఆనవాయితీగా ఉండెడిది.  క్రమ క్రమముగా  నేడు  వాడుకలో  నున్న  విధముగా   వీణను  అడ్డముగా పెట్టుకుని  వాయించుచున్నారు. దక్షిణ  భారత  దేశంలో  వీణా  వాయిద్యము  చాలా  మక్కువతో  అభ్యసిస్తారు. దక్షిణ భారతదేశంలో  వీణలో  మూడు  సంప్రదాయాలు  ప్రాశస్త్యం  పొందాయి.  తంజావూరు,  మైసూరు,  విజయనగరం  బాణీలు. అన్ని  సంప్రదాయాల్లో  దిగ్గజంలాంటి  వైణికులు  ఎంతో  సాధన  చేసి,  ఆ సాధన ఒక  తపస్సులా  భావించి  వీణ  గొప్పతనాన్ని  మరింత  ఇనుమడించారు.

వీణలో  ధనమ్మాళ్, కారైకుడి  సాంబశివ అయ్యర్,  K.S. నారాయణ  స్వామి,  S.బాలచందర్,  పిచ్చుమణి,  కల్పకం  స్వామినాధన్, బేబీ  గాయత్రీ,  వీణా  శేషన్న, దొరైస్వామి  అయ్యంగార్,  విశ్వేశ్వరన్,  మైసూర్  కృష్ణమూర్తి, పిఠాపురం సంగమేశ్వర   శాస్త్రి, వీణా వెంకటరమణ  దాసు,  వాసా   కృష్ణమూర్తి,   అయ్యగారి  సోమేశ్వరరావు,  మంచాల  జగన్నాధరావు,  పప్పు సోమేశ్వర రావు,  ఈమని శంకర  శాస్త్రి,  చిట్టిబాబు,  అయ్యగారి శ్యామసుందరం గారిలాంటి  వారే  కాక,  సమకాలీన వైణికులు  ఎందరెందరో  గొప్ప గొప్పవారున్నారు.

అందరి  ఆశయం  ఒక్కటే.  మన ప్రాచీన  వారసత్వ  సంపద,  మన భారతీయ  సంస్కృతీ  సంప్రదాయానికి  చిహ్నమైన  వీణను  భావితరాలకు  అందించి, వారి  భవితవ్యాన్ని  అందంగా  ఆనందంగా  తీర్చిదిద్దడమే.

( వైణికుల  పేర్లు  మరచినా,  వరుసక్రమం  క్రమంగా లేక పోయిన  క్షంతవ్యురాలను)

3 thoughts on “వీణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *