April 27, 2024

మొండిగోడలు .

రచన: దామరాజు విశాలాక్షి.

ఏమో ! నీకవి మొండిగోడల్లా  కన్పిస్తున్నాయేమోగాని
నా కంటికవి ఒకప్పటి మహాప్రాసాదాలు
అభాగ్యుల ఆకలితీర్చిన  అంతఃపురాలు.
ఆపన్నులను  ఆదుకున్న  అమృతవాసాలు
త్యాగానికి .శౌర్యానికి తరగని గనులు .
ఆత్మీయతకు ,అనుబంధాలకు అద్దంపట్టిన లోగిళ్ళు .
ఏమో ! నీకవి మొండిగోడల్లా  కన్పిస్తున్నాయేమోగాని
నా కంటికవి ఒకప్పటి మహాప్రాసాదాలు.
ఆ అరుగులపై ఒకే తీర్పుతో జీవితాలు తీర్చి దిద్దబడినాయి
ఆ చావడిలో ఒక్క మాట మంత్రమై
మహత్కార్యాలు చేసింది .
ఒక్క అదిలింపుతో అస్తవ్యస్తమైన పరిస్థితులు
అక్కడికక్కడే చక్కబడ్డాయి .
ఒక్క తీక్షణమైన చూపుతో  చిచ్చులా వ్యాపించాల్సిన
అవనీతి చప్పున చల్లారిపోయింది.
ఏమో ! నీకంటికవి మొండిగోడల్లా  కన్పిస్తున్నాయేమోగాని
నాకంటికవి ఒకప్పటి న్యాయస్థానాలు.
ఆముత్యాల ముంగిళ్లలోనే కదూ,
మానవత్వమెన్నోసార్లు మారాకుతొడిగింది.
ఆచల్లని చెట్లనీడల్లోని  సమావేశాలేకదూ
జఠిలమైన సమస్యలనైనా సునాయాసంగా తేల్చిచెప్పి౦ది
ఆ పెరటిలో మొక్కల పసర్లూ,వేర్లేకదూ,
మృత్యు ముఖ౦లోని కెల్లిన  మనషి కైనా మళ్ళీ
జీవంపోసింది
ఏమో ! నీకంటికవి మొండిగోడల్లా  కన్పిస్తున్నాయేమోగాని
నా కంటికవి ఒకప్పటి దేవాలయాలు.
ఆపొగచూరిన పెద్ద వంటిల్లేకదూ !
అర్ధరాత్రి అపరాత్రని భేదాల్లేకుండా ఆకలి కేక వినిపిస్తే చాలు ఆదుకొని అన్నంపెట్టింది
అదుగో ఆకొట్టంలో గోమాతలేకదూ !
గంగడోలు దువ్వుతుంటే కడవల పాలిచ్చింది .
ఏమో ! నీకవి మొండిగోడల్లా  కన్పిస్తున్నాయేమో గాని
నాకంటికవి ఒకప్పటి  అన్నప్రాసాదాలు.
అదుగో  ఆధాన్యపు కొట్టు లోనే కదూ తరగని
ఆ ధాన్యపురాసులు తాండవమాడింది
ఇదుగో ఈ భోషాణం పెట్టే కదూ బోలెడన్ని
సంపదలు బొజ్జలో దాచింది
ఏమో ! నీకవి మొండిగోడల్లా  కన్పిస్తున్నాయేమోగాని
నాకంటికవి ఒకప్పటి రాజ ప్రాసాదాలు.
ప్రాణ స్పందన తో కళకళ లాడిన జీవనాలయాలు
నా ప్రాదుర్భావ  వత్సరాలలో నను జీవింప జేసిన
తేజో మూర్తుల మమతానురాగాలు
నీకు కనిపిస్తున్నవి మొండి గొడలేమో కానీ
నాకు అవి ప్రాతఃస్మరణీయ సజీవ చిత్రాలు

2 thoughts on “మొండిగోడలు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *