April 27, 2024

ధీర – 1 విరిసీ మురిసిన సుమం

శిరి

మనం తరచూ వింటుంటాం. చదువుతుంటాం. ప్రముఖ మహిళలు  అని.. ఎవరు వాళ్లు?? పుట్టుకతోనే ప్రముఖులు ఐనవారా? కృషితో శ్రమించి ప్రముఖులైనారా?  పెద్ద పెద్ద అవార్డులు, రివార్డులు, పత్రికలలో ఫోటోలు వస్తేనే ప్రముఖ మహిళలు అవుతారా??..పత్రికలలో, టీవీ చానెళ్లలో వచ్చేవాళ్లే ప్రముఖులా?? కాదు.. సమాజంలో, మన కుటుంబంలో, స్నేహితులలో సాధారణం కంటే ఎక్కువగా శ్రమించే, సాధించే మహిళలు ఎందరో ఉన్నారు. వారికి గుర్తింపు ఉందా? కనీసం వారిని తగురీతిలో గుర్తించి, ప్రశంసించి గౌరవిస్తున్నామా? ఏమో??

మన చుట్టూ ఉన్న ఎందరో అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు, బామ్మలు, అత్తగార్లు, అమ్మమ్మలు … వీరిలో కొందరు స్పెషల్ అనిపిస్తుంది.. తమకోసం కన్నా తమ కుటుంబం, పిల్లల కోసం ఎన్నో కష్టాలకోర్చి  విజేతలవుతారు. కాని వారు అది ఒక ఘనకార్యంగా భావించరు. సరే కష్టపడ్డాంలే అనుకుంటారు. ఒక్కసారి ఆలోచిస్తే వారి విజయం వెనుక ఎంత శ్రమ, త్యాగం, కష్టం ఉందో అర్ధమవుతుంది. అలాటి అసామాన్యుమైన మహిళల గురించి మాలిక పత్రిక పరిచయం చేసే వినూత్న  శీర్షిక  “ధీర”..

మొదటగా పరిచయమవుతున్న ధీర.. శిరీష… హైదరాబాదు వాస్తవ్యురాలు.. ఇటీవలే పరిచయమైంది.. కాని తన గురించి తెలుసుకున్న తర్వాతే నాకు అలాటి మహిళలను పత్రిక ద్వారా నాకు వీలైనంత సమాచారం సేకరించి ధీర శీర్షికన పరిచయం చేయాలనిపించింది. తను పి.హెచ్.డి చేసింది. అనుకుంటే అది సర్వసామాన్యమే. చదువుకోవాలనే  కోరిక, డిగ్రీలు పెంచుకోవాలనే ఆకాంక్ష ఉన్నవాళ్లకు డిగ్రీ, పిజి తర్వాత పి.హెచ్.డి. సర్వసాధారణం. కాని శిరీష అసలు కథ వింటే వాహ్వా అనకుండా  ఉండలేము..

తన కథను తన మాటల్లోనే తెలుసుకుందాం మరి…

నా పేరు శిరీష. ఒక మధ్యతరగతి  కుటుంబంలో వరంగల్ పట్టణంలో పుట్టాను.  వరంగల్ లోని మంచి కాన్వెంట్ స్కూలులో చదువుతున్నాను. చిన్నప్పటినుండి పెరిగిన వాతావరణం, తల్లిదండ్రులు, టీచర్లు, స్నేహితులు, ఇరుగు పొరుగువారు అందరూ మంచివారే. ఒక మనిషి వ్యక్తిత్వం, సంస్కారం పుస్తకాలు చదివితే మెరుగుపడదు.. అతను పెరిగిన వాతావరణం. పరిసరాలు, చుట్టూ ఉన్న వ్యక్తులు చాలా ప్రభావితం చేస్తారు.  నేను స్కూలులో, కాలేజీలో మరీ వెనకాల బెంచి స్టూడెంట్ ని కాదు. మంచి మార్కులే అంటే ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చేవి.  పాస్ అవుతున్నా బానే ఉంది కదా అనిపించేది కాని నేను ఇంకా ఎక్కువగా సాధించాలి అన్న ఆలోచన రాలేదు. హ్యాపీగా స్కూలు, కాలేజీ, డిగ్రీ, పి.జి .. ఇలా పూర్తి చేసుకుంటూ వెళ్లా.  ఆ తర్వాత అధ్యాపక వృత్తిని ఎంచుకుని ఉద్యోగంలో చేరా.  అక్కడ కూడా నాకు వచ్చిన ఫీడ్ బాక్ best గా లేదు bad గా కూడా లేదు.  అంతే కాక నువ్వు ఇంకా ఎక్కువ శ్రమపడాలి. ఇది సరిపోదు. ఇంకా ఎక్కువ సాధించాలి అని ఎవరూ చెప్పలేదు. నాకు కూడా తట్టలేదు. చదువైంది, మంచి ఉద్యోగం . ఇంకేం చేస్తాంలే అని గడిపేసా.  పెళ్లయింది. కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త చుట్టాలు, .. మొదట్లో కాస్త  ఉక్కిరిబిక్కిరి అయ్యాను. వీటితో పాటు భర్త నుండి కంప్లెయింట్లు… ప్రతీదాంట్లో ఎత్తిపొడుపులు, ఆరోపణలు, ఆక్షేపనలు.. ఇన్నేళ్లుగా నన్ను ఎవరూ నువ్వు బాగా చేయట్లేదు. నీకేమొచ్చు. ఏమీ రాదు. అని అనలేదు.  కాని మావారు మాత్రం “నువ్వు బట్టలు ఇంకా బాగా మడత పెట్టొచ్చుగా. హోటల్ కెళితే  ఎంత కావాలో అంత ఆర్డర్ చేయాలి . లేకుంటే వేస్ట్ అవుతోంది. ఆ మాత్రం తెలీదా.., నీకు లెటర్ రాయడం సరిగా రాదు. ఏం చదువుకున్నావ్. ఇంకా బాగా రాయలేవా??, నీకు ఈ కలర్ బావుండదు. మళ్లీ కట్టకు. అసలు ఎప్పుడైనా నీకు నువ్వు చూసుకున్నావా? నీకెలాంటి డ్రెస్సులు సూట్ అవుతాయో నీకు తెలుసా?కాలేజీలో ఇంకా బాగా చేయొచ్చుగా, రోజూ వెళ్లడం, పాఠాలు చెప్పడం, రావడం, నెలకోసారి జీతం తీసుకోవడం. ఇంతేనా.., మావాళ్లతో అలాగేనా మాట్లాడేది. మరీ అంత నిర్లక్ష్యమా? “అన్న ప్రశ్నలు ఎదురయ్యేవి. చాలా బాధపడ్డాను. ఇప్పుడు బానే ఉన్నా కదా ఇంకా ఎక్కువగా ఏం చెయ్యాలి. చెయ్యగలను. ఎందుకు చేయాలి?? అనుకునేదాన్ని. ఎవరి గొప్పతనం వాళ్లది. నేనెందుకు ఇంకా గొప్పగా ఉండాలని ఆరాటపడాలి నేనిలాగే ఉంటాను అంతే.. అని అనుకునేదాన్ని.

attagaru

నా పిల్లలు తమ చదువులో పాస్ మార్కులు వస్తే చాలు ఫుల్ మార్కులు ఎందుకు రాలేదు అని కూడా పట్టించుకోలేదు. ఇవన్నీ చెప్తున్నా అని అత్తగారింట్లో నేనేదో కష్టాలు పడ్డాను. రాచి రంపాన పెట్టారు అని కాదు. పిల్లల కోసం, కుటుంబం కోసం కార్పోరేట్ ఉద్యోగం వదులుకుని కాలేజీలో లెక్చరర్ జాబ్ ఎంచుకోవడం మీద అందరూ మెచ్చుకున్నారు. అత్తారింట్లో నాకు తెలియనివి చెప్తూ, మెచ్చుకుంటూ, తప్పు చేస్తే సర్ది చెప్తూ ఉండేవారు. అలా ఒక్కొక్కటి నేర్చుకుంటూ, సర్దుకుని పోతూ అందరి మెప్పులు పొందాను.  ఇక మావారి కోసం ఇంకా కృషి చేయాలి. సాధించాలి. నాలోని సమర్ధతని నిరూపించాలి అన్న పట్టుదల మొదలైంది. అయిష్టంగానే మొదలెట్టినా మెల్లిమెల్లిగా నా జీవితం   మెరుగుపడసాగింది అనిపించింది. నా ఆలోచనా సరళి మారింది. పుస్తకాలు చదవడం. పెద్దవాళ్లను కలవడం, చర్చించడం, ట్రెయినింగ్ మొదలైనవి నాలో మార్పును తీసుకొచ్చాయి. మనిషిని, మనని ఒక వస్తువులా భావించుకుని  అయిష్టంగా, బాధటో, కోపంగా ఏదో సాధించాలి అని కాకుండా ఒక మనిషిలా చూడాలి అని అర్ధమైంది.   మనం పోయేటప్పుడు తీసుకుపోయేదేమీ లేదు. ఈ డబ్బు, ఈ పేరు, గుర్తింపు ఏదీ మన వెంట రాదు. అందుకే బ్రతికున్నప్పుడైనా సంతోషంగా మనకు నచ్చింది మన ఆత్మసంతృప్తి కోసం ఏదైనా సాధించాలి. సాధించగలం అనిపించింది.  రాన్రానూ విజ్ఞాన సముపార్జనతో పాటు వివేకం కూడా మరింతగా ఇనుమడించింది. అన్నీ ప్రణాలిక ప్రకారం చేయసాగాను. భర్త కోసం అయిష్టంగా మొదలెట్టినా అది నాకు . కాలేజీలో, పిల్లల చదువుల విషయంలో, అన్నింట్లో ఎంతో లాభపడిందని అర్ధమైంది. ఇంకా ఏదో నేర్చుకోవాలి. సాధించాలి అనే తపన మొదలైంది. ఈ విజ్ఞానతృష్ణకు అంతులేదనిపించింది..

తీరిగ్గా కూర్చుని ఆలోచిస్తే అనిపిస్తుంది..  నిజమేకదా ఇప్పుడు నేను జీవితంలోని అవకాశాలను సమర్ధంగా అందుకొన్నాను. సద్వినియోగపరుచుకున్నాను. నన్ను నేను మెరుగుపరుచుకున్నాను. మార్చుకున్నాను … ఈ మార్పు నాకు చదువు, ఉద్యోగంలోనే కాదు. కుటుంబం, స్నేహితులు, భర్త పిల్లలు, సమాజం అన్నింటా లాభించింది. ఈ మార్పు ఒక్కరోజులో వచ్చింది కాదు. అనుభవజ్ఞులైన వారితో పరిచయాలు, చర్చలు, పుస్తక పఠనం, కొత్త ఆలోచనలు, కొత్త భావాలు, ఆత్మనిబ్బరం ఇవన్నీ నా వ్యక్తిత్వాన్ని విశ్లేషించుకుని, మెరుగుపరుచుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేసింది. దీనికంతటికి ముఖ్యకారణం నా జీవిత భాగస్వామి విశ్వనాథ్.. మొదట్లో తన మాటలు నచ్చక, కోపం వచ్చినా, తిట్టుకున్నా, తను చెప్పింది నా మంచికోసం కదా అని తర్వాత తెలిసొచ్చింది. తను చెప్పిన ఈ మాట ఎప్పటికి మర్చిపోలేను.. “శిరీషా.. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. ఇప్పుడు చిన్నవాళ్లు కాబట్టి ఏది కావాలన్నా నీ దగ్గరకే వస్తారు.నిన్నే అడుగుతారు. కాని వాళ్లు పెద్దవాళ్లయ్యాక కాలేజీకి వచ్చాక కూడా వాళ్లు ఏదైనా తెలియకుంటే నిన్ను అడగాలని నీకుండదా.. వాళ్లకు ఇంగ్లీషు గ్రామర్‌లో వచ్చే డౌట్లు, ప్రాజెక్ట్ వర్కులు, ఏదైనా సందేహాలు, సంకోచాలు అన్నీ నీతో పంచుకోవాలనుకోవా. పిల్లలకు అనుక్షణం, అన్ని విధాలుగా అందరికంటే  ఎక్కువగా అందుబాటులో  ఉండేది తల్లి మాత్రమే. అలాంటప్పుడు వాళ్ల అవసరాలకు కూడా సరియైన రీతిలో తల్లి ఉండాలి కదా. తల్లి చెప్పలేనప్పుడు వాళ్లు ఇతరత్రా మార్గాలు వెతుక్కుంటారు. చెడు స్నేహాలలో పడవచ్చు. మరి వాళ్లకు తగిన స్నేహితురాలిగా, గురువుగా, శ్రేయొభిలాషిగా, తల్లిగా నువ్వు ఉన్నావా? ఒక్కసారి ఆలోచించుకో..”

 family pic

అందుకే నేను ఇంకా చదువుకోవాలి.  పి.హెచ్.డి  చేయాలి, నన్ను నేను up to dateగా ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాను.  నా ఈ విజయంలో ఎంతో మంది తోడుగా ఉన్నారు. తోడ్పాటునిచ్చారు. రిసెర్చ్ కోసం బయట ఊళ్లకు వెళ్లినా, ఇంటికి రావడం ఆలస్యమైనా అత్తగారు ఏమనేవారు కాదు. పిల్లలను తనే చూసుకునేవారు, వాళ్ల భోజనం, సాయంత్రం పార్కుకు తీసికెళ్లడం,  రాత్రికి తినిపించి పడుకోపెట్టడం అన్నీ చేసేవారు. కాకతీయ యూనివర్సిటీలో రిజిస్టర్ చేసుకోవడం వల్ల ఐదేళ్లలో కనీసం అరవై సార్లన్నా వరంగల్ వెళ్లి ఉంటాను. సమాచారం సేకరించడానికి సుమారు మూడువేల మంది నిపుణులని కలవడం జరిగింది. కొందరు ముఖాముఖీ, కొందరు మెయిల్స్, కొందరు ఫోన్‌లు..  కుటుంబం, చిన్నపిల్లలు, అత్తమామలు, ఉద్యోగం అన్నీ చేస్తూ పి.హెచ్.డి చేయడం కష్టమే కాని అసాధ్యమేమీ కాదు అన్న నమ్మకం, ధైర్యం నాలో  కలిగింది.  కుటుంబ సభ్యులు సరే కాని నా చదువు, పరీక్షల సమయంలో ఇరుగు పొరుగు వాళ్లు కూడా సహకరించడం అదృష్టమే కదా.. ఒకసారి మావారి తన బిజినెస్ పని మీద విదేశాలకు వెళ్లి నప్పుడు నా కొడుకు నెలల పిల్లవాడు. అప్పుడే పరీక్షలు. పిల్లాడితో ఎలా రాయగలను, పరీక్ష వదిలేద్దామనుకున్నా.  కాని మా కుటుంబ స్నేహితురాలు డా.సరసిజగారు నేను అడగకుండానే నా పరిస్థితి తెలుసుకుని తనంతట తానే చొరవ తీసుకుని నాకు ధైర్యం చెప్పి ,నాతో వచ్చి పరీక్ష రాసినంత సేపు పిల్లాడితో బయట కూర్చున్నారు ఎటువంటి లాభాన్ని ఆశించకుండా, ఎటువంటి స్వార్ధం లేకుండా సాయం చేసే ఇలాంటివారిని చూసి నేను కూడా అవసరమైనవాళ్లకి తప్పకుండా సాయం చేయాలని నిర్ణయించుకున్నాను..

 

ఇక ముగిస్తానే..

నా థీసిస్ ఓక్ జర్మన్ పబ్లిషర్ పుస్తకంలా ప్రచురించాలని ఆలోచిస్తున్నారు. కాలేజీలో కూడా ప్రమోషన్, పిల్లలు చదువులో, సంగీతంలో రాణించడం… ఓహ్.. జీవితం ఎంత సంతోషంగా తృప్తిగా ఉంది అనిపిస్తుంది. ఇంకా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. సాధించాలి అనిపిస్తుంది. కొన్ని ఏళ్లుగా జరిగిన ఈ ప్రయాణంలో జీవితంలోని ఎన్నో కోణాలను, ఆశలను, కష్టాలను, ప్రశ్నలు, సమాధానాలు. ఎన్నో ఎన్నో గుర్తించి, నేర్చుకోవడం సాధ్యమైంది..

 

మట్టిలో విత్తనం గింజ నాటగానే సరిపొదు. ఆ మట్టిలోని సారం, మంచి నీరు, గాలి , వెలుతురు, చీడపీడలనుండి, జంతువులనుండి రక్షణ, అనుకూల వాతావరణం ఉంటేనే ఆ విత్తనం మొక్కై  వృక్షంగా ఎదుగుతోంది.

ధన్యవాదాలు

శిరీష

shiree

19 thoughts on “ధీర – 1 విరిసీ మురిసిన సుమం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *