May 10, 2024

వెటకారియా రొంబ కామెడియా 7

రచన: మధు అద్దంకి

సీరియలాయణం

“కాముడు” అని పిలిచాడు రామా రావు..

ఉహూ పలకలేదు

“ఏమోయ్” అంటూ ఇంకొంచం గట్టిగా పిలిచాడు రామారావ్ ..ఉహూ జవాబు లేదు

” ఏమోయ్య్ ఎక్కడున్నావ్” అని అరిచాడు రామారావు.

చడీ చప్పుడూ లేదు..

ఏమయ్యిందబ్బా  అనుకుంటూ హాల్లోకి వచ్చాడు.. అక్కడ సోఫాలో కూర్చుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది కాముడు.. ఏమయ్యిందేంటో అని కంగారు పడి దగ్గరగా వచ్చి “కాముడూ” అని పిలుస్తూ భుజం మీద చెయ్యేశాడు.. అంతే ఘొల్లుమంది కాముడు..”అంతా అయిపోయిందండీ..ఏమి మిగల్లేదు..ఈ ఘోరం నేను తట్టుకోలేకపోతున్నా రేపటి నుండి ఎలా గడుస్తుందండీ..అయ్యో అప్పుడే వెళ్ళిపోయావా ” అనుకుంటూ శోకాలు పెడుతుంటే ఇంకా కంగారు ఎక్కువయ్యి ” ఏమిటే ఎవరు పోయారు? మీ పుట్టింటి దగ్గర నుండి ఫోనేమైనా వచ్చిందా లేక మా వాళ్ళు ఏమన్నా ఫోన్ చేశారా ” అనడిగాడు రామారావు..

సమాధానం చెప్పకుండా ఇంకా కుళ్ళి కుళ్ళి ఏడుస్తూనే ఉంది కాముడు.. అయ్యో భగవంతుడా ఏమి జరిగిందో ఏమో అనుకుంటూ వెంటనే ఫోన్ దగ్గరికి పరిగెత్తి గబ గబా నాలుగు ఫోన్లు చేసి మాట్లాడి అందరు క్షేమం అని తెలుసుకున్నాక వచ్చి కాముడు పక్కన కూర్చుని మళ్ళా అడిగాడు ” అలా ఏడవకుండా చెప్పి చావు ఎవరు పోయారో” అని..అప్పుడు కాముడు అంది కదా ” తొక్కలో కుటుంబం” సీరియల్ లో “చవటేశ్” చచ్చిపోయాడండీ.. వాడు పోయాక ఇంకా ఆ సీరియల్ చూడలేమండీ, వాడే ఆ సీరియల్ కి ఆయువు పట్టు అంటూ మళ్ళా ఏడుపు మొదలెట్టింది..

అంతే సహనం కోల్పోయి ఒక్క రంకె వేశాడు రామారావు.. ఆ రంకెకి ఉలిక్కిపడి దడుచుకుని దెబ్బకు నోరు మూసింది కాముడు..

” నీ వెధవ సీరియల్ తగలెయ్యా..పొద్దున్నే మొదలు పెట్టావ్..నేను అఫీస్ కెళ్ళే టయింకే ఇలాంటి చెత్త సీరియల్స్ చూడటమెందుకు అలా ఘొల్లు ఘొల్లున ఏడవడమెందుకు? మొగుడికి టిఫిన్ పెట్టాలన్న ధ్యాస లేదు నీకు” అని రంకెలేసుకుంటూ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు రామారావు.

సాయంత్రం ఆఫీస్ అయ్యాకా ఉస్సూరంటూ ఇంటికి వచ్చాడు.. చెప్పులు విప్పి లోపలికి అడుగుపెట్టి అక్కడ దృశ్యం చూసి షాక్ తిన్నాడు..అక్కడ విచిత్ర వేషం వేసుకుని చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ బహు చిత్రం గా కదులుతూ పిచ్చి చూపులు చూసుకుంటూ వెర్రి నవ్వు నవ్వుతున్న భార్యని చూడగానే ” దీనికి పిచ్చి పట్టలేదు కదా” అనుకుని

“ఏమోయ్ అయ్యాయా నీ వెకిలి వేషాలు ? కాస్త కాఫీ నీళ్ళు పడేస్తావా మొహాన” అనరిచాడు రామారావు

” అబ్బా ఉండండీ ఈ సీరియల్లో హీరోయిన్లాగ తయారయ్యి మంచి అభినయం చేసి ఆ వీడియో క్లిప్ పంపిన వాళ్ళకి హీరోయిన్ పనిమనిషిగా చాన్స్ ఇస్తారుట.. దానికోసం ట్రై చేస్తున్నా ఆ కాఫీ నీళ్లేవో మీరే కలుపుకు తాగి నాక్కూడ ఇవ్వండి” అని తిరిగి తన చేస్టల్లో మునిగిపోయింది..

“హారి భగవంతుడా టీ.వీ కొన్నందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి అనుకుంటూ” కాఫీ కలుపుకోడానికి వంటింట్లోకి వెళ్ళాడు..

అలా ఒక గంట తర్వాత తను పనులు చూసుకుని తిరిగి హాల్లోకి వచ్చి చూస్తే మెటికలు విరుస్తూ, కోపంగా చూస్తూ బూతులు తిట్టుకుంటూ ఉన్న భార్య కనిపించింది.. ఇంక లాభంలేదు డాక్టర్ కి చూపించాల్సిందే అనుకుంటూ

“కాముడూ ఏమి చేశావ్ డిన్నర్ కి ఆకలి దంచేస్తోంది ” అనడిగాడు రామారావు..

 

ధన ధన మంటూ వచ్చింది కాముడు. బాబొయి పిలవంగానే ఇలా వచ్చిందేంటి అనుకున్నాడు.

ధన్ మంటూ ప్లేట్ ని టేబిల్ మీదకి విసిరేసింది..వంట గిన్నెలు తెచ్చి పడేసింది..ఈ పనులన్నీ పిచ్చి తిట్లు తింటూ చేసింది.

ఏమి జరుగుతోందో అర్ధం కాలేదు.. ముందు అన్నం తిని తర్వాత తెలుసుకుందామనుకుని ఒక ముద్ద కలుపుకుని నోట్లో పెట్టుకుని గతుక్కుమన్నాడు.. ఉడికీ ఉడకని అన్నం ,వేగీ వేగని కూరా..పైగా కూరంతా ఉప్పు కశం..

“కాముడూ ఏమిటీ వంట” అనరిచాడు..

విసవిసలాడుతూ వచ్చి ” ఆడవాళ్ళని వంటిటి కుందేళ్ళని చేసి ఆడించాలనుకునే మీ లాంటి మగవారిని దయ తలచకూడదనే వంట ఇంత ఘోరంగా చేశాను.. ఇప్పటికైనా ఆడదాని విలువ తెలుసుకోండి” అంటూ అరిచింది.. చిర్రెత్తుకొచ్చి కంచాన్ని ధన్ మంటూ పడేసి ఒక్క రంకె వేశాడు రామారావు.

అదిరిపడి షాక్ తిని నోరు మూసుకు నిలబడి పోయింది కాముడు.. ” వెధవ సీరియల్స్ చూసి నీ బుద్ధి గడ్డి తింది..మొగుడికి సరిగ్గా వంట చేసి పెట్టాలన్న బుద్ధి లేదు నీకు..రేపే కేబిల్ కనెక్షన్ కట్ చేయించి పడేస్తా” అంటూ రంకెలేసుకుంటూ బయటకి వెళ్ళిపోయాడు..బయట హోటల్లో సుష్టుగా భోంచేసి ఇంటికోచ్చాడు రామారావు…

“ఏమండీ నన్ను క్షమించండీ.. మీ పట్ల అమానుషంగా ప్రవర్తించాను” అని అతన్ని వాటేసుకుని భోరు భోరున ఏడ్చింది కాముడు.

” వదులు వదులు నా బొమికెలు విరిగేట్టున్నాయి అని సరే క్షమించేశా గాని ఇంకా ఆ సీరియళ్ళ జోలికి పోక..ఇంత సడెన్ గా నీలో మార్పు ఎలా వచ్చింది కాముడు” అనడిగాడు రామారావు..

” పత్నీ పిశాచి” సీరియల్ ఇవాళే యిపోయిందండీ.. అందులో ఆ పిశాచి చివరాఖరుకి తన తప్పు తెలుసుకుని ” పతియే ప్రత్యక్ష దైవం” అతని తర్వాతే ఏదైనా అని గొప్ప నీతి చెప్పిందండీ. నేను కూడ అలా పిశాచిలా మిమ్మల్ని పీక్కుతినకూడదని నా తప్పు నేను తెలుసుకుని మిమ్మల్ని క్షమాపణ అడిగాను” అన్నది కాముడు.

“పోనీలే వెధవ సీరియల్ అయిపోవడం వల్ల నీకు నాకు మనశ్శాంతి దొరికింది” అన్నాడు.

అవునండీ వెధవ సీరియళ్ళు చూసి చూసి నిజంగా తలకాయ వాచిపోయింది..ఇక మీదట సీరియళ్ళూ చూడకూడదని డిసయిడ్ అయ్యాను” అంది కాముడు

“నిజంగానా? ఎంత మంచి వార్త చెప్పావు కాముడు” అని ఆనందపడ్డాడు రామారావు భార్యని దగ్గర తీసుకున్నాడు.

అవునండీ ఈ సీరియల్స్ తో మిమ్మలని ఎంతో బాధపెట్టాను.. అందుకని ఇక మీదట సీరియల్స్ చూడను..రియాలిటీ షోలు చూస్తా..ఇవాళే ” మీ ఇంట్లో దొంగలు దోల” రియాలిటీ షో మొదలయ్యింది.. అందులో దొంగలని తరిమి కొట్టాలి..ఇదిగో ఇలాగా”అంటూ చిందేసి చూపించింది..

“ఆహ్ దేవుడా” అంటూ మూర్చపోయాడు రామారావు.

3 thoughts on “వెటకారియా రొంబ కామెడియా 7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *