April 27, 2024

చిగురాకు రెపరెపలు

రచన: మన్నెం శారద

నా ముందు మాట

జ్యోతి వలబోజుగారు నన్ను మాలిక కోసం ఏదైనా రాయండి అని అడగ్గానే సరే అన్నాను కాని… ఏం రాయాలో నాకు తోచలేదు.  సరే అని తప్పించుకోవడం నాకు గత పదేళ్ళుగా అలవాటయింది.

కారణాలు అనేకం.

ఒక దశలో నేనసలు రచయిత్రిని కాదనే గట్టి నమ్మకం కూడా ఏర్పడింది. మరి దాదాపు వేయి కధలు, నలభయిపైన నవలలు-ఫీచర్స్, నంది అవార్డులు పొంధిన  టి.వి. సీరియల్స్, రేడియో నాటికలు… ఇంకా ఏవేవో రాసిన మన్నెం శారదని నేను కాదా!… మరెందుకిప్పుడిలా నా కలం కదలడం మానేసింది అని నన్ను నేను అనేకసార్లు ప్రశ్నించుకున్నాను. ఏమో తెలియదు… నేనిక రాయలేను అని మాత్రమే జవాబు వచ్చేది.

ఇక్కడ సంధర్భం కాకపోయినా ఒక సంఘటన చెబుతాను.

ఒకసారి నామిని గారు మా ఇంటికి వచ్చారు. అదే మొదటిసారి నేను ఆయన్ని చూడటం. నేను ఎక్కువగా సాహితీ సమావేశాల్లో పాల్గొనలేదు. చాలామందితో నాకు ముఖపరిచయాలు కూడా లేవు. నాకంత టైము వుండేది కాదో, ఆసక్తి లేదో….నా ప్రపంచం చాలా చిన్నది. నామినిగారు ఆంధ్రజ్యోతి ఎడిటర్ హోదాలో వచ్చారు. నేను సాదరంగా ఆహ్వానించి గౌరవించాను. ఆయన నన్ను ఆంధ్రజ్యోతికి ఒక సీరియల్ రాయమని అడగటం కోసం వచ్చారు.

మేము మాట్లాడుతుండగా ఆయన పదే పదే ‘ఎంత అన్యాయం’ అంటూ చెంపలు వేసుకోవడం నాకు ఆశ్చర్యాన్ని కల్గించింది. నేను చివరికి అడిగితే ఆయన చాలా బాధపడుతూ ‘ఎలా చెప్పను శారదగారూ! మీ ఎడ్రస్ కోసం ప్రయత్నిస్తే…చాలా మంది ఆవిడ లేదు, చచ్చిపోయింది అని చెప్పేరు”  అన్నారు బాధగా.

నేను బాధపడలేదు,  నవ్వాను.

‘మరీ ఇంత అన్యాయమా, ఎవరో చెబితే ఫర్వాలేదు, సాటి రచయితలు చెప్పిన మాట ఇది!’ అన్నారు ఎంతో నొచ్చుకుంటూ.

‘అది నిజమే నామిని గారూ, రచయిత్రిగా నేను చచ్చిపోయానని చెప్పివుంటారు లెండి.  ప్రస్తుతం ఏమీ రాయడం లేదు కదా!?

అని సమర్ధించేను.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నా కలం ఎంత స్తబ్దతకి గురయిందో…తెలియజేయడానికి మాత్రమే.

తిరిగి అప్పుడప్పుడూ నవ్య కధల పోటీకి కధలు రాయడం తప్ప దాదాపుగా నేను రాయడం మానేసినట్లే లెక్క.  తిరిగి ఇప్పుడు జ్యోతి అడిగినప్పుడు కూడా రాయనని చెప్పలేదు గాని రాస్తానా అనుకుంటూ “ఊ” అన్నాను.

ఎన్నాళ్ళగానో నా మిత్రులు, బంధువర్గంలో కొందరు నా చిన్నతనం గురించి రాయమని ప్రోత్సహించడం జరుగుతూనే వుంది. నేను అలాగే  అనడం కూడ జరుగుతూనేవుంది. అది క్రియారూపం మాత్రం దాల్చలేదు.

చివరికి జ్యోతికి అదే చెప్పేను.

జ్యోతి సరేనన్నారు.

మూడురోజులుగా నా ఆలోచనలు అస్పష్టంగా వున్నాయి.  బహుశా నేను నా చిన్నతనంలోకి వెళ్ళిపోయాను. ఏవేవో కదలికలు, ఆ రోజులు గుర్తుకొచ్చి మనసు అనేక ఒత్తిడిలకి గురయింది.  హార్మోనియం మెట్లు నొక్కినప్పుడు రకరకాల రాగాలని   పలికినట్లు   మనసు ఏవేవో రాగాలు ఆలాపించింది.

ఫిక్షన్ రాయడం వేరు. నిజాన్ని రాయడం వేరు. వాటిని ఎక్కడ మొదలెట్టాలి, ఎలా చెప్పాలి, పాఠకులకి అవి నచ్చేట్లు రాయగలనా… ఏదో మీమాంస!

రెండురోజులుగా ఏదో రాస్తున్నాను. నచ్చడం లేదు. జ్యోతికి కుంటిసాకులు చెబుతున్నాను.

చివరికి ఈ నిద్రలేని రాత్రి నే ను పూర్తిగా నా మనసుని ఆక్రమించిన వేరే ఆలోచన్లని బలవంతంగా బయటికి నెట్టి  నా చిన్నతనంలోకి వెళ్ళేను. కొంత స్పష్టత వచ్చింది.

ఇంకో సంగతి మీకు విన్నవించేది…ఇది సరదాగా మాత్రమే చదవండి. నేను సరదాగానే రాస్తున్నాను. అంతే!

 

 

చిగురాకురెపరెపలు

 

నా చిన్నతనం అనగానే వెంటనే గురొచ్చేది కాకినాడ. కాకినాడ అనగానే మాకు ప్రాణం లేచొచ్చేసేది. మనసు రెక్కలు సాచి గాలిలో రివ్వున ఎగిరిపోయేది!

కాకినాడ మాకు ప్రాణం!

అక్కడే మేం పుట్టాం, ప్రతి శెలవులకి కాకినాడ పరిగెత్తేసేవాళ్ళం! రైలెక్కిన దగ్గరనుండి కాకినాడ జేరేవరకు ఒకటే ఆరాటం! ఆ గాలి తగలగానే చెప్పలేని సంభ్రమం, సంతోషం!

కాని… అదే కాకినాడని ఇప్పుడు వెళ్ళడమే లేదు. ఎప్పుడో ఏ పెళ్ళిళ్ళకో, నిర్యాణాలకో! తప్పదంతే!

మూడు సంవత్సరాల క్రితం ఒక పెళ్ళికి వెళ్ళేను. కాస్త ఖాళీ దొరగ్గానే.. మేము చిన్నతనాన్ని గడిపిన చోటకి వెళ్ళాలని మా అన్నయ్యని కారడిగేను.

ఏముందే అక్కడ ?  ఏం చూస్తావ్, నీ మొహం! అన్నాడు. ఇప్పుడు వీళ్ళంతా సర్పవరం జంక్షన్ వైపు వచ్చి ఇళ్ళు కట్టుకున్నారు.

“లేదురా, ఒక్కసారి నన్ను వెళ్ళనియ్యి” అన్నాను.

“సరే, వెళ్లు” అన్నాడు.

కారు జగన్నాధపురం బాక్ వాటర్ బ్రిడ్జి దాటుతుండగా చాలా థ్రిల్ ఫీలయ్యాను. నా కళ్ళు బాగా విస్పారితమై పరిసరాల్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి.

అవును, జగన్నాధపురం ఏమీ మారలేదు…  ఆ వీధులు…  చాలా వరకు ఆ యిళ్ళు…  చాల పురాతనమై, దిగులుగా నిస్సత్తువ గా, రేపో మాపో కూలిపోతాం అన్నట్లు నిలబడలేక నిలబడినట్లున్నాయి.

చర్చి స్క్వేర్ రాగానే నా గుండె గబగబా కొట్టుకోవడం నాకే వినిపించింది.

అక్కడ మేం ఆడిన ఆటలు, చేసిన పనులు… గిర్రున బుర్రలో తిరగడం పారంభించేయి.

కారు మలుపు తిరిగి మా వీధిలోకి అడుగుపెట్టింది.

ఆ వీధిలో అన్నీ మా యిళ్లే ఒకప్పుడు.

పెద్దగా మారిందేమీ లేదు కాని… నిలువునా స్ధాణువు చేసింది మేం  పెరిగిన మండువా ఇల్లు!

పూర్తిగా ఆనవాలు పట్టలేనట్లుగా కూలిపోయింది.

దాన్లో బిచ్చగాళ్లు కాపురాలు పెట్టేసారు.

ముందు మేం ఎన్నో ఆటపాటలాడిన ఖాళీస్ధలం చెత్తాచెదారంతో నిండిపోయింది.

నేను కారు దిగి చుట్టూ తెలిసినవాళ్లెవరైనా కనబడతారేమోనని చూశాను. ఎవరూ లేరు. కొందర్ని ఆపి కొన్ని  పేర్లడిగేను.. “ఊహూ” తెలియదండీ అన్నారు.

ఆ ఇంట్లో దేవతలా తిరిగిన అమ్మమ్మ, చంఢశాసనుల్లా నిలబడి వుండే ఆరడుగుల మా మామయ్యలు, చూస్తేనే గజగజ వణికించే మా దొడ్డమ్మ, పిల్లల్ని అత్యంతంగా  ప్రేమించే మా పెదనాన్న.. అంత భయంలోనూ మా అళ్లర్లని ప్రోత్సహించే మా అక్క మణిమాల.. ఎవరూ లేరు..

రాత్రి వెన్నెల్లో ఆడిన ఆటలు, నవ్వులు, తెల్లారేవరకు సినిమాలా వూరిస్తూ కథలు చెప్పే మంగాయమ్మత్త.. అన్నీ మాత్రం గుర్తొచ్చి మనసు బాధగా మూలిగింది. గత్తంతరం లేక… కారుని అలా చార్టీస్ హైస్కూలుదాకా వెళ్లనిచ్చి నేను చదివిన ప్రాంతాలు చూసి వెను తిరిగేను. నిస్పృహతో.

నాకు అయిదో సంవత్సర వయసునుండీ అన్నీ గుర్తున్నాయి. అప్పుడు మా నాన్నగారు ఒంగోల్లో  పని చేస్తున్నారు. అసలు మా నాన్నగారి వూరు ఒంగోలే. కాని.. మేం ఇప్పటికీ, ఎప్పటికీ కాకినాడనే మా వూరని చెబుతాం. అది నిజానికి అబ్మమ్మగారి వూరు. కాని… మా అనుబంధాలన్నీ కాకినాడతోనే ముడిపడి వున్నాయి.

నేను ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా ఇంట్లోనే చదివేను. మా నాన్న మేం స్కూలుకి వెళ్లడం ఇష్టపడేవారు కాదు. మా అమ్మగారు ఎంథ కఠినంగా ప్రవర్తించినా చదువు పట్ల ఆమెకి ఆసక్తి ఎక్కువ. ఇంట్లో సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చాలా ఉండేవి. ఆవిడ ఎప్పుడూ చదువుతూనే వుండేవారు.

అందువల్ల మాకు కూడా ఆసక్తి ఏర్పడిందేమో!

ఒకసారి కిటికి దగ్గర నిలబడ్డ నాకు కిటికీలో చచ్చిన బల్లి కనబడింది. అదెప్పుడు చచ్చిపోయిందో…కట్టెలా అయిపోయింది.

నేను అంతకుముందే… మా చుట్టాల్లో ఒక కర్మ కాండ మొదటిసారి చూసాను. వెంటనే ఒక కార్యక్రమం నా మనసు లో రూపు దిద్దుకుంది.

అంతే!

వెంటనే మా గాంగ్ కి చెప్పేసేను.

వీళ్ళంతా సరే, అంటే సరే అన్నారు.

ఇక దొడ్లో కొబ్బరి పుల్లలు తెచ్చి పాడె కట్టి దాన్ని పడుకో బెట్టేం. పూలు, పసుపు కుంకుమ వేసి..అందరం లబో దిబోమని ఏడ్చేం. మా అక్క- మూడో అత్తలా నోటికి గుడ్డ అడ్డం పెట్టుకుని వెక్కెక్కి ఏడ్చింది. ఒక చిన్న ముంత తెచ్చి పెద్దవాళ్ళు చూడకుండా రెండు నిప్పులు వేసి శాస్త్రోక్తం గా ముందు నడుస్తూ చర్చి స్క్వేర్ కి వెళ్ళేం. చర్చి స్క్వేర్ అంటే అక్కడ రెండు పెద్ద చర్చిలు వుండేవి. ఆడుకోడానికి, ఒక పెద్ద ఇసుకపోసిన మైదానం వుండేది. పిల్లలందరూ అక్కడే రకరకాల ఆటలాడేవారు. పెద్దలు బెంచీల మీద కూర్చుని విశ్రాంతి తీసుకునేవారు.

కాకినాడలో డచ్ బిల్డింగ్స్ ఎక్కువ. ఎదురుగా అమెరికన్ కాన్వెంటు వుండేది.

మేం బల్లి శరీరాన్ని ఎవరూ తొక్కని స్థలం చూసుకుని… గొయ్యి తీసి ఖననం చేసేం. మా పెద్దమామయ్య కూతురు మళ్ళీ ఏడవాలని చెప్పింది. అందరం గొల్లుమన్నాం. అక్కడే బెంచీ మీద కూర్చున్న ఒక పెద్దాయన ‘ఏం జరిగింది!’అనడిగేరు కంగారుగా. మేం తలలు అడ్డంగా వూపి తెచ్చిన పూలు బల్లిని పూడ్చిన చోట వేసి ఇళ్ళకు వెళ్లేం.

‘ఎవర్నీ ముట్టుకోకుండా స్నానాలు చెయ్యాలి కదా!’ అన్నాను  నేను. అంతే! అందరూ బాత్రూం లో దూరి పనిమనిషి

 

నింపిన గోళీలు, గంగాళాలూ ఖాళీ చేసేసాం.

బట్టలు తడిపేసి విచారంగా దొడ్లో చేరి కూర్చున్నాం.

ఇదంతా మా మూడో అత్త అరుంధతి కనిపెడుతూనే వుంది. ఆవిడంటే మా కసలు భయం లేదు. కాని.. మామయ్యంటే మాత్రం వణుకే..

“మీ మావయ్య రానివ్వండి, మీ సంగతి చెబుతా, ఈ శారద వుంది వేలెడంత గానీ…ఏదో ఒకటి చేస్తుంది. ఇప్పుడు నీళ్ళెక్కడి నుండి తేవాలి! అని అరిచింది.

నేను ఎవరు తిట్టినా రెట్టింపు నవ్వేదాన్ని.

నేనలా నాన్ స్టాప్ గా నవ్వుతుంటే మనం విచారంగా వుండాలని మా మావయ్య కూతురు నిర్మల హెచ్చరించింది.

చివరికి మా అత్త కాళ్ళు పట్టుకున్నాం.

ఆవిడ శాంతించి, మా అమ్మకి, దొడ్డమ్మకి నీళ్ళ గురించి అబద్ధం చెప్పి మాకు తన్నులు లేకుండా చేసింది.

చివరికి బల్లి దినానికి వెనుక పెరట్లో చేసుకునే వంటలకి కూడా అన్ని యిచ్చి జాగ్రత్తలు చెప్పి సహకరించింది.

మేం చాలా శాస్త్రోక్తంగా కాకులకి పిండం పెట్టడం దగ్గర్నుండీ ఆచరించి భోజనాలు చేసాం.

చివరిక్షణాల్లో ఈ సంగతి మా అమ్మకి తెలిసి పోయి కర్ర తీసుకువచ్చింది.

ఎవరు, ఎవరీ దరిద్రమంతా చేసింది!అని అందర్నీ నాలుగంటించేసరికి అందరూ నా వైపు చూపించేరు.

అంతే! నా వీపు మా అమ్మకి లీజు కిచ్చేసేను.

‘నువ్వున్నావే! నువ్వుంటే అందర్నీ చెడగొడతావు! అంటూ ఎడాపెడా వాయించేసింది.

కొన్ని రోజులు పెద్దవాళ్ళకి బల్లి దినం గురించే టాపిక్!

మా అమ్మమ్మ నన్ను నాలుగు ముద్దుగా తిట్టి ‘అలాంటి వెధవ పనులు’ చేయకూడదని వీపుకి వెన్న రాసింది! ఏమైతేనేం బల్లి ఆత్మ శాంతించిందని వెనక్కి తిరిగి కిసుక్కున నవ్వ్కున్నాను….

వచ్చే సంచికలో మరికొన్ని సంగతులు.

 

11 thoughts on “చిగురాకు రెపరెపలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *