May 10, 2024

పద్యమాలిక – 4

 

padyamalika4

Goli Sastry

 

చూపులు నాపై బెట్టుచు
నో పని మనిషీ వినుమనె నోయమ్మా ! సార్
చీపురు పట్టుచు నిట్టుల
వీపును ముందునకు వంచవే యనుచుండెన్

 

భామ ! ప్రక్కకు నెట్టుచు పనుమనిషిని
ఏల నీపని మీకంచు నెగిరి పడకు
” స్వచ్ఛ భారత ” మునకేగు సమయమునకు
ఊడ్వ నేర్చుట మేలని యూడ్చుచుంటి.

 

చీ ! పురుషుడింటి లోపల
చీపురుతో కసువునిట్లు చిమ్ముట తగునా
ఈ పనికి ” మనియె ” వేస్టని
ఈ పనిమనిషిని వలదన నేమన వలయున్.

 

పనిమనిషి కసువు చిమ్మగ
పనిగట్టుకు మరల చిమ్మి ప్రక్కకు నెట్టన్
పనియేమి ? స్వచ్ఛ భారత
పని యింటను జేయ బూను ఫలితమ్మిదియా !

 

Chandramouli Suryanaryana

 

తుచ్ఛము నీవిట్టులనుట
స్వచ్ఛత పనిమనిషిదనుట సరికాదుసుమా
సచ్చీలురందరిట్టుల
స్వచ్ఛందముగ కదలండి పరిశుభ్రతకై

నువ్వీ విధముగ నూడ్చిన
నవ్వులపాలౌదుమాపు నాధుడ ఒంట్లో
కొవ్వు కరగింప దలచిన
దవ్వుగ జాగింగు జేయ తరగును కొవ్వే

చెత్త శుభ్రపరచ చీపుర్ని పట్టితి
మోడిగారి పిలుపుతోడ నేను
స్వచ్ఛభారతంబు సాధించు వరకును
నిద్ర పోను నేను నీరజాక్షి

మత్తకోకిల :
కొత్తవేషమిదేల మీమతి కోలుపోతిరె ఓ ప్రభూ
చిత్తగించుడు నాదుమాటను చీపురెందుకు చేతిలో
చెత్తనూడ్చమనింటనుండిన స్వీపరెందుకు చెప్పరే
బొత్తిగాపరువంత యిక్కడ పోవుచున్నది చాలికన్

చిమ్మిన చిమ్ముడు చాలిక
గమ్మున చీపురును వదలి కదలుడు స్వామీ
మిమ్ముల మించిన శుభ్రత
నిమ్మహి పాటించతరమె ఎవ్వరికైనన్

 

J K Mohana Rao

 

ఊడ్చఁగ రండి మలమ్మును,
బూడ్చఁగ రండిపుడు మీరు – పుచ్చిన కుళ్లున్
దుడ్చఁగ రండీ గోడల
మోడ్చఁగ రండి కరములను – బొగడఁగఁ దల్లిన్

స్వచ్ఛముగా నుండుట యొక
యిచ్ఛయె భారతమునందు – నిది సత్యమ్మే
దుచ్ఛముగ నెంచు మురికిని
స్వేచ్ఛకు చిహ్నముగ వెలయు – స్వచ్ఛత భువిపై

అమలము జల మెల్లెడ, న-
త్యమలము నేలయును గాలి – యమల మ్ముడుపుల్
విమలముగా నుండు మదియు
విమలముగా నుండు నడత – ప్రియదేశమునన్

పరిశుద్ధుడైన దేవుని
తఱువాత ధరిత్రియందు – దైవము నిజమై
పరిశుద్ధతయే కావున
బరిసరముల శుభ్రపరచ – వలయును గాదా
(Cleanliness is next only to godliness)

 

శుభ్రము చేయుఁడు మనసును
శుభ్రము చేయుండు తనువు – సుందరమవఁగా
శుభ్రము చేయుఁడు గృహమును
శుభ్రము చేయుండు వీధి – సొంపుల నిడఁగా

Annapareddy Satyanarayana Reddy

 

నీదు పనిలోన శుభ్రత లేదటంచు
అమ్మ నాచేత నూడ్పించు ననుచు నయ్య
నేర్పుచున్నాడు పనినాకు నోర్పుతోడ
నయ్య పనితనము కనగ నద్భుతమ్ము

ఉదయమందున పనిపిల్ల యూడ్చినట్టి
కసువు నెదురూడ్చుటకు నెద్ది కారణమ్ము?
కసువునంతయు వెస సైడు కాల్వ విడిచి
కంపుఁ జేయుచు నున్నది కొంపముందు
స్వచ్ఛ భారత మను మోడి వచనమువిని
ప్రతినౕఁ జేసితి నేనును పదుగురెదుట
నిలుపుకొనగ నాప్రతినను నిష్టతోడ
చేయు చుంటిని శుద్ధిని చెలియ నేను
వేఱు తలపేమియును లేదు వెఱుగు పడకు
నిజము తెల్పితి నమ్ముము నీరజాక్షి

బుచ్చెమ్మా! చీపురునిడి
యచ్చిక బుచ్చికలనాడు మానందముగా
స్వచ్ఛతపని నేఁ జూచెద
వచ్చెనుకనుమమ్మనీకు వరములనివ్వన్

చీపురును పట్ట విజయమ్ము చిక్కుననుచు
నన్ని పార్టీలు వెస దాని నందుకొనగ
నూడ్చుటే యొక సరికొత్త యుద్యమముగ
సాగుచుండ, నే నాదారి నేగుచుంటి

స్వచ్ఛభారత మని ప్రజ స్వాగతించి
మోడి యిచ్చిన పిలుపుతో వేడి పుట్టి
గెలిచి యింటను పిదుపను గెలువ రచ్చ
మొదలు పెట్టితి నిచ్చోట ముద్దు గుమ్మ

శుచిని గూర్చిన పద్ధతుల్ శ్రుతులు నుడువ
శుద్ధి మనజీవితముల ప్రసిద్ధి కెక్కె
పూర్వ దెస వీడి ప్రజ లిప్డు పోవుచుండ
మురికి కూపములుగమారె సరములన్ని
స్వచ్ఛతనుగూర్చి మోడి తా వచన మాడ
శుద్ధి మొదలుపెట్టెను గృహి బుద్ధిగాను

ఎండ మావులందున నీర ముండునెటుల?
కాపచలిని కంప్యూటరె ట్లోపు సకియ
గాఢ పరిరంభమందున వేడి నిడుదు
రమ్ము రారమ్ము రయమున రమ్య గాత్రి

ఊడ్చు పందెమునందున నూరిలోన
మొదటి బహుమతి తప్పకఁ బొందవలయు
ననుచు చేపట్టె చీపురు నయ్య గారు
యేమి చోద్యమో యిది నాకు నెఱుకలేదు
వేగ పనినేర్పమంచు నా వెంట బడియె
సిగ్గుతోడను నామది మొగ్గ యయ్యె

దాని పనినిచెరపుటేల దండిమగడ
కొంపలోనికి రమ్ము నీ కుపనిగరప
సిద్ధమైయుందు నచ్చోట శీఘ్రముగను
పాయసమ్మును బెట్టెద స్వామి నీకు

 

పాచి నూడ్చు పనిమనిషి ప్రక్క నుంచి
చీపురేల బట్టితివీవు చెప్పుమయ్య?
స్వచ్ఛ భారత సాధనే యిచ్చ యనుచు
మోడి జెప్పిన మాటల మోదమొంది
చేయు చున్నాను మొదలెట్టి సేవ నిచట
నమ్మనీయన మాటల నమ్మలేను
చెప్పు నీవైన నిజమును చిత్తరాంగి?
అమ్మ! నాతప్పు లేదమ్మ! నమ్ము మమ్మ!
అందమైనట్టి నీచేయి కందు ననుచు
అయ్య! చేపట్టె చీపురు నమ్మ తోడు!
క్రొత్త చీరయు తాఁగొని యిత్తుననియె

స్వచ్ఛత కరవైన కతన
వచ్చెను స్వైన్ ఫ్లూ పిశాచి పలుపురములలో
మెచ్చగ మోడీ మనలను
స్వచ్ఛపు భారత్ నుగాంచ శ్రమగొనుడయ్యా!

నటన బడుగుల మదిలోన నాటదెపుడు
పోజులిచ్చిన వారల బూజుదులిపి
నిజపు సేవకు నిత్తురు విజయమెపుడు
తెలుపు మమ్మనీ వయ్యకు తెల్లముగను

కరము దృఢమగు దేహముఁ గాంచ, నడుము
వంచి పనిచేయు టే సదా మంచి దనుచు
చీపురును పట్టె నయ్య విచిత్రముగను
పని చెఱుపకుమంచయ్యను పనుపుమమ్మ

 

NagaJyothi Ramana

 

అమ్మో ఎఫ్ బీ రంధితొ
బొమ్మల మంటల కనుగొని -భోగమ్మనుకో
కమ్మా నువు భ్రమజెందక
లెమ్మా నిజభోగిమంట –లెస్సగజూడన్

అరరే యత్తా జూడుము
పొరకను గొని నూడ్చ మగడు -పోదా పరువే?
సరెలే అరవకు పోవే
సరియగు స్వచ్చ్ భారతనుచు-సంబర పడవే!!

అయ్యో ఇదేమి చోద్యము
కయ్యిమనుచు మగని చేత-కసవూడ్పింపన్
సయ్యాటగ దలచితివా
గయ్యాళివి సతి వయితివి-కయ్యము జాలున్

 

Bss Prasad

 

కొందరు ముందుకు వస్తే
చిందర తొలగింపుకి మరి చీపురు తీస్తే
సుందర స్వచ్ఛత రాదా !
అందరు భామల మనసుల అలజడి పోదా

 

పచ్చగ వెలయుచు దేశమె
స్వచ్ఛత తో యిమిడి యున్న సంపద రాదా ?
నచ్చక వెడలిన పెద్దలు
వెచ్చని గూటికి గిరగిర వేగము రారా ?

 

స్వచ్చ దేశ పిలుపు స్వాగతించి యతడు
చెత్త తీయ బూని చీపు రెత్తె
పరుగు పెట్టె నాలి పరువు పోవు ననుచు
అమ్మ గార్ని చూసి అడలె దాసి

లింగ భేదము నీతులు లెస్స కాదు
ఇంటి శుభ్రత బాధ్యత ఇంతి కిచ్చి
కొమ్ము బలిసిన మగరాజు గమ్ము నుంటె
కమ్ము కొన్నట్టి మురికిల కంపు మిగులు !

చెత్త పోగు పెట్టి చేర్చగా రోడ్డుపై
కోప గించి అయ్య కుప్ప లెత్తె
తప్పు తనది దెల్సి దాసియు వాపోయె
వింత జూసి అమ్మ విస్తు బోయె

 

Sivaramakrishna Prasad

 

ప్రతిరోజుజేయుశౌచబాధ్యతల్ ప్రపం
చితమౌగజేసెనొక్కచీపురెత్తిభా
రతదేశగౌరవంబురంజిలెన్ ప్రస
న్నతగూరెనంత మోదినాదరించగా

 

Madhav Rao Koruprolu

 

లేజీ మగడా, కొట్టకు..
పోజే గొప్పగ., బరబర పొరకన్ ద్రిప్పన్..
మోజేలా ? ‘మోడి’గారికి
రాజీ లేదోయ్..తలచియు రాజ్యము దిద్దన్..!

 

పిల్లా..!వంచుము నడుమున్ ..
అల్లా చూస్తే అగునటె ? అంతా శుభ్రం..!
ఎల్లా చేయును ‘మోడీ’.?
గల్లీ..గల్లీ.. తిరిగియు కలలోనైనా..!

 

పరిశుభ్రతయే అసలౌ
పరమాత్మయను నిజమును పలుకక పల్కెన్..
నరవరుడౌ మన ‘మోడీ’
నరులే సురలౌదురోయి..నయముగ వింటే..!

 

స్వచ్ఛ భారతమది సాధ్యమ్ము, సత్యమ్ము..
ఎవరి ఇల్లు వారు ఇంతి కూడి..
ముందు శుభ్రపరచ ముచ్చట పడినంత ..
మనసు పెట్టి వినుము మాధవోక్తి..!

 

చేయనిమ్ము మగని చేయార శుభ్రమ్ము..
అచ్చెరువది యేల ఆగు బిడ్డ..!
స్వచ్ఛ భారతమ్ము సాధించు తరుణాన..
మనసు పెట్టి వినుము మాధవోక్తి..!

 

చివరకు మిగిలేదేమిటి..!
ఎవరికి వారే మరచియు నేదో చేయన్..
సవరణ ‘చీపురు’ చేయును
అవసర మేదో తెలిసియు అప్పటి కపుడే..!

 

వంచిన శిరసెత్తకనే..
మంచిని చేయగ నిలుమని ‘మోడీ’పలుకన్..
కొంచెము శ్రద్దగ నడుమును
వంచిన మగని గని మగువ వహ్వా..!యనెనే..!

 

రక్షణ తంత్రము లెన్నో..
తక్షణ మిచ్చే పొరకను తన్నకుమోయీ..!
శిక్షగ భావించకుమో..
శిక్షణ నీకిది యనియెడు శ్రీమతి గనుమో..!

 

 

Srinivas Iduri

 

చీపురు పట్టుట చాలును
ఆపుము తుంటరి పనులను ఆయన గారూ
ఊపున ముందుకు బోయిన
చూపుట తప్పదు నరకము చూస్కో మగడా

 

అయ్యో! ఇదేమి చోద్యము
సయ్యాటగ చెంతకొచ్చి సరసము లాడెన్
అయ్యా అదేమిటనగనె
వయ్యారముగా పొరకతొ వంకలు బోయెన్

 

Sirasri Poet

 

పనిమనిషి తన అమ్మగారితో:

చీపురునే లాక్కొని మరి
యీ పనియేలయ్యగారికిదియేంపాడో!
ఆ పీయెమ్మొచ్చి యిటుల
నాపనికే యెసరుపెట్టెనమ్మో! అయ్యో!

 

అతను ఆమాద్మి పార్టీ గురుతును పట్టి
విధిగ మోడి చెప్పెననుచు వీధులూడ్చి
రెండుపార్టీలను కలిపె మెండుగాను
స్వచ్ఛభారత నిర్మాణచతురుడతడు

 

Venkata Subba Sahadevudu Gunda

 

పనిమనిషి తో యజమానమ్మ:
అందరిల్లలోన నలుపెరుగక నీవు
స్వచ్ఛ భారతంబు సలుపు చుండ
నీదు గృహము నందు నేవచ్చి చూడగా
భర్త జేయు చుండె బాగు బాగు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *