April 27, 2024

పద్యమాలిక – 5

padyamalika 5

 

NagaJyothi Ramana

 

నలభీములదే వంటని
నలుగురిలోనీ పురుషులు -నవ్వగనేలా?
అలిగిన ఆ ఇల్లాళ్ళట
తొలగిరి ఫేస్బుక్ తమకిక-తోడుగ దొరకన్

కుడి ఎడమేమున్నది లే
సుడిగల భార్యలు తమకును-సులువగ దొరకన్
వడివడి గా భర్తలు తము
పడిపడి జేతురు పనులను-పక్కా ప్రేమన్ !!

సంపాదనతో సతులే
నింపాదిగ జేబు తమది -నిండుగ నింపన్
పెంపొందగ ననురాగము
సొంపుగ జేతురు పనులను-సోమరి పురుషుల్ !!(షోకుగ పురుషుల్)

 

 
Srinivas Iduri

 

పరువా పోయే మనకది
గురువా చూడీ నరకము గుంటల పనియే
బరువే వండుట, ఉతుకుట
కరువా దారులు కనుగొన కటకట బాపన్

టీవీ కిరణములాపగ
యూవీ గ్లాసులు కనులకు యున్నవి గానీ
బీవీల నుండి రక్షకు
ఏవీ గనరావు గదర ఎక్కడి ఖర్మో

ఇంటరునెట్టులొ మునిగిరి
వంటలు జేయుట వదిలిరి వనితలు నేడూ
గంటెలె దిక్కా మనకిక
కంటకముల బాపవలెను కరుణామయుడే

నాకవిత పేలలేదని
మాకళనడిగితి బదులియమనియొక కైతన్
లైకుల లెక్కను తెలుపుచు
పాకము నాపైకి వదలె పాటలగంధీ

ఘనమగు మొగుడిని వంటకు
తను దింపెననుకొని కులుకు తరుణుల జూడూ
కనుగొన సత్యము ఇదియే
మన పాకము మనము తినుట మనకే ఈజీ

 

Bss Prasad

 

బండ్లు ఓడలు , ఓడలు బండ్లు యవును
కాల రీతి ఆలు మగల “రోలు” మారు
కాపు రములున్న చాలదే కలసి మెలసి
నేర్చు కొనిన మంచిది చూసి నేటి నీతి !!

అంతర్జాలమహిమతో
ఇంతులదేరాజ్యమంట ఇలలో నరుడా
వంతగ పాడిన మంచిది
చింతలుకొంతైన తగ్గు సేవలు జేయన్ !!

పక్కన నిలబడి పనులన
నిక్కముగా సాయపడగ నివ్వెర లేలోయ్
ఉక్కిరి బిక్కిరి యలుపును
తక్కువజేసినపతులకు దక్కును తీపోయ్

మగబిడ్డ డనుచు ముందటి
తెగ బింకపుమురిసిపాటు తీరులు ముగెసెన్
వగలే నేర్చిన పడతకి
దిగువయ్యె పురుషులచోటు దిక్కుల సాక్షిన్

పాచి పనులు జేసి పాకశాస్త్రము నేర్చి
సవ్య సాచి వంటి స్వామి యుండ
ఈజి ఛైరు లెక్కి ఇంటిపనులు మాని
ల్యాపు టాపు మహిళ టాపు లేపు

 

Voleti Srinivasa Bhanu

 

ఆర్యా యేమని చెప్పుదు
భార్యల హైటెక్కు పనుల భారము హెచ్చెన్
కార్యాలయమిల్లాయెను
ఫిర్యాదులు మాని గరిట పెనిమిటి దిప్పెన్

 

Chandramouli Suryanaryana

 

దోసంబేమియులేదు సుమ్మ పతులీ తోయంబుగా నింటిలో
నాసంగంబును జూపిజేయ పనులిల్లాండ్రందరున్ హాయిగన్
కూసింతైనను విశ్రమించు దిగులేకోశంబు లేకుండగన్
మాసంబందున నొక్క రోజు పతులీమాత్రంబునున్ జేయరే

చీపురు పట్టి యూడ్చ నను చేయకు హేళన సుందరీమణీ
యేపనినైన చీదరగనెంచకు శుభ్రము చేయనేకదా
యీపనివారలుండిరని యింటిని వారికి యప్పగించి నీ
వేపని చేయకున్నగనుమెంతగ పట్టెనొ కొవ్వు మేనిలో

పక్కింటాయనతో మీ
యక్కస్సంతయును గ్రక్కనక్కర లేదీ
టక్కరి తనంబు మానుడు
చక్కంగా వంటజేసి చావుడు ముందున్

టెక్కులు పెరిగెను జూడుము
నిక్కంబుగ నేటిస్త్రీలనేమనలేమోయ్
నిక్కుచు నీల్గుచు పతులే
చక్కంబెట్టవలెనిల్లు సతమతమవుచున్

ఇంతులింటనుండ ఇంటిపనులజేయ
వింతగయనిపించునెంతయైన
మంతనములుజేసి సంతసింతురెగాని
యింత సాయమిడరె చెంతనిలచి

వంటయువార్పుయు వచ్చిన
యింటాయన దొరకినాడె యింతీ యిక న
ట్టింటనె చాటింగులతో
గంటలకొలది సరదాల గడుపగవచ్చున్

పుట్టింట పనులు నేర్వరు
మెట్టిన గడపందు పాదమిడరీ గుమ్మల్
పట్టిన పట్టును విడువరు
నెట్టుండగ పతుల సుతులనే మరతురుగా

పెళ్ళాలను మెప్పించగ
నొళ్ళును వంచిపనిజేయుడోపతులారా
పళ్ళికిలించుచు లోకులు
కళ్ళింతగజేసిచూడ కలవరమేలోయ్

వారము మొత్తము పెనుపని
భారముతో సతమతమవు భార్యామణికిన్
వారాంతపు సెలవునొసగ
నేరాద్దాంతంబుకూడదేరికినైనన్

పట్టితినే వంటగరిటె
బట్టలుతుకుచుంటివీవు పత్నీవ్రతమున్
గట్టిగపాటించుటలో
పట్టానివ్వంగవలెను బ్రదరూ మనకే

మేరే ప్యారీ పత్నీ
సారా హఫ్తా రసోయి సంభాల్తీహై
పూరా రవివార్ కేదిన్
ఆరాం దేతాహు ఉస్కొ అచ్ఛా హైనా ?

 

Goli Sastry

 

ఇల్లరికమనగ సుబ్రావ్
ఎల్లాగోనుండుననుచు నెగిరితి నాహా !
అల్లుడిట గిల్లుడగుగా
ఇల్లాగే చూడు మింక నెరిగితివా ! హా !

ఇంటరు నెట్టులొ పాసై
ఇంటను నేవంట జేతు నింతికి నింతే !
ఇంటరునెట్టున ” జాబ్ ” తో
ఇంటిని తా నెట్టు, చెప్పుమిక నీ స్టోరీ !

భార్యలు వెడలగ నుదయము
కార్యాలయములకు నన్న ! కదలిటు రమ్మా !
మిర్యపు చారిచ్చెదలే
సీర్యలు మరి ” పప్పు సుద్ద ” చేరుచు గనగా !

కోకలన్ని దోచు కొంటె కృష్ణుడు నాకు
మనసు నచ్చినట్టి మాన్యుడయ్య
వంటలెన్నొ జేయు వలలుడె జూడగా
మాన్యుడయ్య నాదు మాట వినుము.

అట్లనె భార్యకు వేసే
బట్లరు నేనేలె వినుము బావా ! సరెలే
అట్లనె నేనున్ భార్యవి
బట్లారగ వేయువాడ, బలె బలె బావా !

 

Madhav Rao Koruprolu

 

ఏమిటి మగడా నా గతి..
ఏమిటి? ఈ రాతిరికిక ఇంట్లకి రావా..?
నీ మతి మెచ్చియు ‘మోడీ’..
ఏ మిడు? పొరక విడుమింక యీ సతి నేలన్..!

కుల సతులు కుదురుగ చదువ..
నల భీములగుచు పతులు వినయ మతులగుచున్ ..
కలనైన అన్ని పనులను
కలహించక చేతుమనుచు కాచిరి ” బెట్టుల్ ”

మగువలు చక్కగ నుండగ..
తగవులు లేక పని చేయు ధర్మము తోడన్..
మగవారలు అన్ని పనులు
నగుమోముల సలుపుటయది నయమై ఒప్పున్..!

కార్య కుశలురగు భర్తలు..
భార్యలకుండిన మగువల భాగ్యము పండున్..
ఆర్యులు గమనించియు నౌ
దార్యముగా మసలుటెరుగ ధరలో శుభమౌ..!

పండుగ రోజుల భర్తలు
వండుట ఉతుకుట మొదలగు పనులన్..
దండిగ చేసిన.. భార్యలు
మెండుగ సంతస మందియు మెత్తురు కాదే..!

సండే..మండే తేడా –
లుండే పని లేదు చూడ..యుండే దొకటే..
తిండే..ఆపై నుతుకుల్..
మెండే మగలే పనులను మెండుగ జేయన్..!

సీరియసుగ చదివేరే..
సీరియలులు మాని..సతుల చిత్తము లాహా..!
నూరుట, వండుట, యుతుకుట..
జోరుగ పతులే సలిపిన జోహారనుచున్..!

నల్లని మీసము ద్రిప్పెను..
బెల్లపు లడ్డులు సతి తిని భేషని మెచ్చన్..!
తెల్లగ సతి బట్టలుతికి..
చల్లగ నామె యలుక పలుచబడగ జేసెన్..!

పోపు ఘుమాయింపుకు..
చూపులు ద్రిప్పిన సుదతిని జూచియు గెంతెన్..!
టాపుగ చెలి బట్టలుతికి..
టాపున యారగ నిలిపెను టక్కరి కాదోయ్..!

 

‘కలుపుము పప్పును బాగుగ’..
కలువ కనుల సతి పలుకగ గరిటెన్ ద్రిప్పెన్..
అలిగిన సతి దుస్తులుతికి..
చెలి కనురాగము తెలిపిన చిలిపిని గనరే..!
Venkat Tekumalla

 

ఆదివార మనుచు అసలేమి కదలక
ఎఫ్బి మునుగునండి యెందరొ తరుణులు
బట్టలుతక మనును భర్తను మహిళలు
వంట గూడ మాను వనిత జూడు!
Gopala Krishna Rao Pantula

 

కాంత చేతి లోన కంప్యూటరుండగా
గరిట చేత బట్టె ఘనుడు మగడు
రోల్సు మారి నాయి రోజులు మారగా
ఆలు మగల కిదియె హాయి గూర్చు

 

Annapareddy Satyanarayana Reddy

 

ప్రక్కవానితోడ వ్యర్థ వాగుడు నాపు
కూర మాడు చుండె కొంటె మగడ
కుదురుగుండలేవు కొద్దిసమయమైన
గొంతు కోసె నాన్న కూర్చి నిన్ను

పేకాటకు సమయంబయె
సాకులతో తప్పుకొనుట సాధ్యంబగునే?
నీకాంత కాంచు చున్నది (నీకంత సీను లేదయ)
పాకమును ముగించిరమ్ము పాకకు సఖుడా

వంటలు చేయుట తెలియని
కంటికి నింపైనసతికి కట్టితితాళిన్
వంటగదికి రానంటది
తంటాలను పడుచునుంటి తప్పనిసరిగా

చాటింగులోన భార్యలు
కాటన్ చీరెల గురించి కాలముగడుపన్
మీటింగులోన భర్తలు
ఆటలు సాగక గృహముల నారట పడుచున్

సతులు గేములాడి సంతోషపడుచుండ
పతులు చేయుచుండ్రి పనులనన్ని
సెలవుదినములందు శ్రీమతులకు రెష్టు
భర్త లైర రష్టు వాసమందు

సాప్టు వేరు పడతియని సంబరపడి
చేసుకొని చిక్కితిని సతి చేతిలోన
హార్డు పనులఁ జేయుమనితా నార్డరివ్వ
ఉతుకుటే నాదినపుచర్య ఉదయమందు
వంట రాదని తెలిసియు వెంట బడితి
నలుని మించిన పసగల నాథుడంచు
వంట యింటికి నన్నిపు డంట గట్టె
వంట యిల్లె నాకిప్పుడు స్వర్గమయ్యె

కిట్టీ పార్టీ లంచును
కట్టుగ వచ్చిన వనితలు కరమగు తుష్టిన్
కట్టడి సలిపిరి సతితో
పట్టుకు పోవుటకునన్ను వంటలు చేయన్

మంచి భర్తను కొనియిచ్చె నంచు సతము
పొగడు చున్నది తండ్రిని తెగడి నన్ను
కట్టు బానిస వని వంట గదికి కట్టె
కట్నమును గొని చిక్కితి కాంత చేత

బట్టలన్నియును వదలి బుట్టలోన
చీరె లేలేవు నాకంచు చెప్పుచుండె
పెండ్లికే రాననుచు తాను పెట్టె తంట
ఉన్నచీరెలన్నియు తీసి ఉతుకు చుంటి

పరులపనులని తలంచక
కరమగుతుష్టిన్ చలుపుడు కాంతల పనులన్
పురుషుల సేవల మరువక
సరిచేయుదురుసతతమ్ము సరసమ్ములతో

ధనమును గూర్చి తలంచను
పనినా దైవంబనుచును పలికితి సతితో
ఘనుడగుపతిదొరికెననుచు
పనిచెను వంటపనిఁ జేయ పరవశ పడుచున్

ఏపాటు లేక నాకును
సాపాటు దొరకునటంచు సంబరపడినే
నీపాప చేయిఁబట్టితి
నాపాణికి గరిటెనిచ్చి నలుడని పొగడెన్

వాషింగు మిషనులేకను
వాషింగే చేయననుచువాయించుచుతా
భీషణ ప్రతినను చేయగ
క్యాషుని సమకూర్చలేక క్షారకుడైతిన్

 

Venkata Subba Sahadevudu Gunda

 

మా యక్కకు నా పేపర్,
మీ యక్కకు ల్యాపుటాపు మీదనె ప్రేమల్!
సాయము జేయగ నెంచరు
నోయమ్మో వీరె జేసిరుద్యోగంబుల్!

 

Chandra Mouli Dasu

 

మరుగ బెట్టెతి సాంబారు మంట మీద
వడియమప్పడములు తీపి వంటకాలు
చెమట ధారగా … కారగా …. చేసినాను
నీవు తినెదవా !? తినిపించ నేనె రాన

నట్టింట దొంగ పడినా
నెట్టును వదిలేయబోరు నేడీ యువతే !
గుట్టుగ కాపురమా !? _చే
పట్టిన పతి పిలువకూడ పరవా లేదే

అత్త మామల వాసనే యసలు పడదు ;
కొత్త జంట కోరును వేరు కుంపటెపుడు
కాదనిన కాపురములోన కలహమెపుడు
ఉన్నమాటిది _కాదిది ఉత్త మాట

వలచినచొమీకడకునెన్నొవచ్చునయ్య
గండపెండేరములెకాక గడుసు కవిని
కొలువవత్తురేసత్తువకలిగియున్న
ప్రగ్జ్య గలవారికివితృణప్రాయముగద

అప్పడము కాల్చు వాసన యసలు రాదె !
AC గదినుండివాసన ఎటులవచ్చు !?
చూసి చేయుమయ్యా శ్రీనివాస నలుడ !
వండి వడ్డించ తిని మెచ్చ వలయు నంత ! !

కేజీ వంటకములనే
ఈజీగా మెక్కగలరు ఇంట్లో వండన్
లేజీ భర్తలు మనకడ ! ;
హాcజీ ! ఐసా నహీ హై అమెరిక దేశ్మే

 

Sirasri Poet

 

టెక్కుకాదిది నేటి హైటెక్కు జగతి
వీరు వారౌచు బతుకులే తారుమారు
జంబలకిడిపంబ యనెడి చలన చిత్ర
చోద్యమే సత్యమాయెగా చూడ నేడు

 

Dhanikonda Ravi Prasad

 

ఎంత నూనె వేయవలయు , నెంత యుప్పు
కారమెంతయో తెలియదు గాన మీకు
సిస్టమును చూచి చెప్పెద చెప్పినట్లు
వంట చేయుడు హోం సైన్సు పద్ధతిగను

నెలలోన మూడు దినములె
వలలుని వలె మాకు నాన్న వంటలు వండెన్
వలచిన రంభయె ఇదిగా
కలకాలము నాకు వంట కర్మగ మారెన్

 

Maddali Srinivas

 

మగధీరుడు వంటలలో
తగు శూరుడు గాడె నేడు ధరణిని చూడన్
సగభాగమైన లలనయు
తగురీతిగ తోడునుండ ధనలక్ష్మి వలెన్

నూరేళ్ళ పంట యనగా
నారాట పడితిని; పెండ్లి యనగా వంటే?!
పారాణి యారక మునుపె
నా రాత తెలిసెను బావ నాగతి వినుమా!

ఔరా రోలే మద్దెల
తో రొద బెట్టిన విధమున దురపిల్లుదువే?
చీరారని చో దండెము
నారేయబడునట బావ నా తోలకటా !

అప్పడములు కాల్చితి నే
నిప్పులపై చూడ రమ్ము నిజ నల పాకం
బొప్పగ తరుణియె మెచ్చగ
చప్పున జేసితిని వంట క్షణమున నార్యా!

బట్టల నుతుకుట మునుపే
గట్టియు తలపెట్టడయ్య, ఘనుడను నేనే ,
జెట్టిని యీ విద్యను, నా
పట్టును పొగడంగ గలరె పండిత సభలన్

 

Sivaramakrishna Prasad

 

కం.ఇంటింటావంటలతో
పంటికి పలురుచు లనిచ్చు పతిభీముడు,నలు
డంటుపడతులుపిలువరే!
తంటగనీవంటచేయతలచినతరుణుల్

తేట. ఇంటిలోనయింతిమగనిధాటినిలిచి
నరిగె పురుషుల ధీరంబుననచనచట
ఇంతి నెఱపనికార్యంబునిహముకలదె?
మహినయామెకుసాటగు మగడుఎవడు?

 

Sonti Prabhakara Sastry

 

భార్యసేవ మిగుల భారమే ఆర్ధిక
నిపుణకైన లెక్కనివ్వ, జాతి
సంపద గణనందు సరియగునే భర్త
జీతమన్న పనులుజేయ తగునె?

 

Sailaja Akundi

 

బట్టలు బాదుచు నీవట
బట్టితి మరి గరిటె నేను బావా! గనుమా!
నెట్టున కులసతులుండగ
పట్టదె! నాధులకు బాధ పంకజనాభా !!!

 

నట్టింటనుండు సతులే
నెట్టింట్లో పీఠమేసి నేర్పుని జూపన్
గుట్టుగ సంసారంబును
నెట్టగ కుడియెడమలైన నేరము గాదే!!!

 

 

1 thought on “పద్యమాలిక – 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *