May 4, 2024

సైరంధ్రి (నవపారిజాతం)

రచన: డా వి.సీతాలక్షీ

sairandhri

 

 

ఆంధ్ర మహాభారతములోని పదునెనిమిది పర్వములలో కవిబ్రహ్మ విరచితము, ’చతుర్థము’, ’హృదయాహ్లాది’, ’ఊర్జిత కథోపేతము’, ’ నానారసాభ్యుదయోల్లాసి’ అయినది విరాటపర్వము. ఉపాఖ్యానములు లేని చక్కని, చిక్కని కథ గల్గిన ఐదాశ్వాసముల పర్వమిది. పాండవులు ద్రౌపదితోపాటు మారుపేర్లతో, మారు వేషాలతో విరాటరాజు కొలువులో అజ్ఞాతవాస వ్రతాన్ని నిర్వహించడం ఇందలి ముఖ్యాంశం. ఒక సంవత్సర కాలం జరిగిన కథగల ఈ విరాటపర్వంలో పాత్రల ప్రవేశ్వం, వారి సంభాషణలు, అంగీకాభినయాలు, సన్నివేశాలు, కథాగమనం – ఇవన్నీ ఈ పర్వాన్ని దృశ్యకావ్యంగా భావింపజేస్తాయి.  కీచకవధ, దక్షిణగోగ్రహణం ఇందులో నాయకుడు బీముడు, నాయిక ద్రౌపది, ప్రతినాయకుడు కీచకుడు. ఇందు ద్రౌపది నిర్వహించిన పాత్ర సైరంద్రీ జాతి స్త్రీ – పేరు మాలిని.

 

ఈ వృత్తినే ద్రౌపది ఎంచుకొనుటకు కారణము సైరంద్రీ జాతిలో మహిళలు సౌజన్యంలో, పాతివ్రత్యంలో సాటిలేనివారుగా ప్రజలచే కీర్తించబడటమే. ఆవృత్తి నవలంబించి సముచిత సంభాషాణలతో, ఎనలేని గౌరవంతో కులప్రశస్తినినుమడింప జేయగలనన్న సంపూర్ణ విశ్వాసమామెది. తన అభిజాత్యముపై ఆమెకుగల అభిమానమట్టిది. విరాటరాజు కొలువులో ధర్మజుడు ’కుంకుభట్ట’ను పేరుతో యతీంద్రునిగాను, ’వలలుడ’ను పేరుతో భీముడు పాచకునిగాను, ’బృహన్నల’ అను పేరుతో పేడివాని రూపములో అర్జునుడు నాట్యాచార్యునిగాను, ’దామగ్రంధి’ అని పేరుతో నకులుడు అశ్వశాల కధ్యక్ర్షునిగాను, ’తంత్రీపాలు’ డను నామధేయముతో సహదేవుడు విరాటుని గోరక్షకునిగాను తమ తమ నైపుణ్యాన్ని వెలార్చడానికి నిశ్చయించుకున్న సమయంలో ద్రౌపది తాను సైరంద్రినగుదునని పేర్కొనుట ఆమె ఆలోచనా సరళికి తార్కాణము.

 

సైరంద్రి వృత్తి కేవలము పరిచారిక కాదు. మాహారాణిని రకరకములుగా ఆలంకరింపజేసి, వివిధ లలితకళల ప్రావీణ్యంలో ఆయా వేళలలో, ఆరాణి కపూర్వోల్లాసం కలగించడం. తనకనువుగా నుండు ఆ వృత్తి నెంచుకొనుట ద్రౌపది బుద్ధి కుశలతకు, ఆభిజాత్యానికి మొదటిమెట్టు.తక్కిన పర్వాలన్నింటిలో కలిసి ద్రౌపది ఒక ఎత్తైతే ఈ పర్వంలో సైరంద్రి పాత్ర పోషించిన ద్రౌపది ఒక ఎత్తు. నవరస నాయికగా ఆమె ఇందు దృగ్గోచరమౌతుంది. అసమాన సౌందర్యరాశిగా, ధీరగా, సరసవచోనిపుణగా, చతురగా, అభిజాత్యమే ఆభరణమైన అతివగా, మానవతిగా, కరణేషుమంత్రిగా, సంయమనశీలిగా, సహనికి ప్రతిరూపంగా, వివేకిగా, ఉచితానుచితముల నెరింగిన ఊవిదగా, అన్నింటినీ మించి అభినయకౌశలము గల్గిన అతివగా, పరమభక్తురాలిగా, పతివ్రతగా, తన భర్తల శౌర్య పరాక్రమాల పట్ల అమితమైన విశ్వాసంగల ధర్యపత్నిగా, ఒక మహాశక్తిగా ఈ విరాట పర్వంలో ద్రౌపది ఆలరిస్తుంది. చలన చిత్రంలోని నాయికను చూచినంత స్పష్టంగా తిక్కనామాత్యుడు తన రచనా దర్శకత్వంలో పాంచాలిని సైరంధ్రిగా కనుల ముందు వర్తింపజేసాడు.

 

ద్రౌపదిలోని ఉచితజ్ఞ్తత ఇందనేక చోట్ల మనకు ప్రదర్శితమౌతుంది. తాను సైరంధ్రిగా సుదేష్ణ కొలువులో అజ్ఞాతవాస సమయాన్ని గడపగలనని ద్రౌపది పల్కిన పిమ్మట ధర్మజుడు “మన వంశాన్ని, ప్రవర్తనను, గొప్పతనాన్ని రక్షించగలిగిన పుణ్యసతివి. దుర్జునులైన తుంటరుల మనస్సులోని ఆలోచనలను తెలిసికొని ఏ మాత్రం ఏమరుపాటు లేకుండా మెలగవలెను సుమా!” అని హెచ్చరించాడు.  ఈ మటల్లో కీచక వృతాంతాన్ని తిక్కన స్ఫురింపజేసాడు. అదివిని యాజ్ఞిసేని ’అనాదర మందస్మిత సుందరవదనారవింద” అయింది. ఇక్కడ ద్రౌపదిని ఒక ప్రత్యేక్షమైన మందహాసం. “ నాకు తెలియదా” అనే భావం కనిపిస్తుంది. అయితే సైరంధ్రీ  జాతివారి ప్రత్యేకతను స్పష్టంగా చెప్పింది.

 

“అరయ నెందును గౌరవ

భారం బెడలంగ నీక పాతివ్రత్యా

చారముమై వర్తింతురు

సైరంధ్రీజాతివారు సౌజన్యమునన్”                                                                    (విరాట 1-112)

“అంతేకాదు నాకు తగిన పనులే చేస్తాను.  మితభాషా విరచనమును, అజ్ఞాతవాస నియమాలును, గౌరవంబును, పాపభీతియును నాకుచితములై ఉంటాయి,” సైరంధ్రిగా తనను మలుచుకోవడంలోనే ద్రౌపది ప్రజ్ఞాపటవాలు ప్రదర్శితములు.

పాండవులొక్కక్కరుగా విరాటరాజు కొలువులో మారుపేర్లతో ప్రవేశించిన పిమ్మట ద్రౌపది సైరంధ్రిగా రంగ ప్రవేశం చేసింది.  సైరంధ్రి  దేశాచారం ప్రకారం తన కేశాల్ని వలపలిదిక్కునకు కొద్దిగా ఒరిగేటట్లు కొప్పునమర్చుకున్నది. కొద్దిగా మాసిన చీరపై ముదుకైన నారవస్త్రమును పైకొంగుగా ధరించి పరిచారిక లక్షణాలు స్పష్టపడేటట్లుగా పుర ప్రవేశం చేసింది.  పెద్దమబ్బుచే కప్పబడిన నెలవంకవలె, తెలిమంచు జడిలో వన్నెతరిగిన పద్మంవలె, పొగచూరిన దీపకళికవలె, ధూళినిండిన లతిక వలె, పురవీధులలో నడిచిపోవుచున్న సైరంద్రిని జూచి జనులు నిశ్చేష్టులయ్యారు.  ఆకాశవీధిలో అధ్భుత కాంతులతో విరాజిల్లే తేజోమూర్తి రోహిణియో, తన సౌశీల్యంతో, తనను చూచిన వారిని పవిత్రులను చేసే అరుంధతియోగాని ఈమె సామాన్య మానవాంగన కాదని వారు తలచారు. ఆమె సౌందర్య సౌశీల్యాలు జన వంద్యాలు. అయితే ఆమె సౌందర్యం ఆమెపాలిటి శత్రువు. సౌశీల్యం ఆమెకెనలేని రక్షణకవచం. ఈ రెండింటి మధ్య సంఘర్షణే ఆమె జీవితం.  ముఖ్యంగా విరాటపర్వంలో జనాకర్షణమైన ద్రౌపది సౌందర్యం ఆమె సౌశీల్యాన్ని విపరీతమైన వేదనకు గురుచేసింది.

ఆమె అతిలోక సౌందర్యాన్ని అలవోకగా చూచిన మహారాణి సుదేష్ణ స్వయంగా ఆమెను తన వద్దకు పిలిపించుకున్నది. మందగమనంతో సుదేష్ణను సమీపిస్తున్న సైరంధ్రి సౌందర్యాన్ని తిక్కనగారాలంకారికంగా అలంకరించి అలరించారు.

 

“పదతలంబుల కెంపు పరిగిన తలము కుం

కుమ లిప్తమైనచందము వహింప

నంగంబునునుగాంరి యడరినగోడలు

వేదులు మణిమయవిధమునోంద

గనుఁగవ మెఱుఁగులు గదిరిన ముందఱ

ౠష్పోపహారంబు పొలుపుదాల్ప

వెనలికప్పు పరినమీఁదు నీల దు

కూలంబుమేల్కట్టు కొమరు వడయఁ

దాను జొచ్చిన కతన మత్స్యక్షితీశు

నింట నిమ్మెయిఁ గ్రొత్త మొప్పసక మెసఁగ

నమ్మహాదేవి యున్నెడ కల్లనల్లఁ

బాండురాజ తనూభవ పత్ని యరిగె’                                                                                   (విరాట I-308)

 

ఆమె అడుగిడినంతనే విరాటుని అంత:పురం క్రొంగొత్త కాంతులతో ప్రకాశించింది. సుదేష్ణ సాదరంగా ఆమె నహ్వానించింది. వివరాలడిగింది.

“నేను సైరంధ్రీజాతి సంభూత, నభిదానంబు మాలిని. పురుష పంచక సనాధనైయుండుదు; నొక్క కారణంబున మధ్ధతులగు విరోధుల చేతం బతుల సన్నిధిం దలపట్టి యీడ్వంబడి వనంబున కరిగి ………….. నియమాచరణంబునకు నొక్క సంవత్సరము గొఱంత కలదు. నీవు ధర్మవర్తిని వని వినుటం జేసి నానేర్చుపనుల వెంట నీకడ నిలువం దలంచి యిందు వచ్చితి” అని పేరు తప్ప తన విషయములన్ని సత్యంగానే వచించింది.  సైరంద్రి తన విధులను నిష్కర్షగా తెలియపరచింది.

 

“కలపములు గూర్ప, బహువిధ తిలకంబులు వెట్ట…… (విరాట I-320)

 

అంతేకాదు తనను దేవకాంతగా తలచి నిజముచెప్పుమన్న సుదేష్ణను చూసి దరహాసంచేసింది. అంటే తను నిజం చెబుతున్నా ఆమె నమ్మడం లేదు.  అందువల్ల ఇంకొంత వివరణ ఇచ్చింది.  “అమ్మా! ఇదివరలో నేను తొలుత సత్యభామ వద్ద, పిమ్మట ద్రౌపది దగ్గర పనిచేసి ఉన్నాను. వారివద్ద పరిచారికల విధుల నన్నింటిని సమర్ధవంతంగా నిర్వహించాను. అంతేకాదు ద్రౌపది నన్ను ప్రాణానికి ప్రాణంగా భావించి తాను నేను ఒక్కటే అన్నట్లు ఆదరించింది. నీవుకూడ నేను నీచమైన పనులకు తగనని తెలిసికొని గౌరవమైన పద్ధతిలో నన్ను స్వీకరించి నా సైరంధ్రీజాతి ఆచారం తప్పకుండునట్లు నిర్వహించెదను” అని స్పష్టంగా తనవృత్తి ధర్మాల  నుట్టకించిన నేర్పరి సైరంధ్రి. పనిలోపనిగా తన పతులైన గందర్వుల అలఘు విక్రమమును తెలియజేసినది.

 

“నీచమతి నన్ను నెవ్వఁడు

సూచిన నారత్రిలోనఁ జూతురు దెగఁ దా

రాచపలు హరిహరాదులు

గాచిన బలవిక్రమము లఖర్వము లైనన్”                                                       (విరాట I-324)

“కావునఁ ఋరుషులు నాకడం దేఱి చూడను వెఱతురు”                            (విరాట I-326)

 

కీచక వధకు సూచన తిక్కన ఈ పద్యవచనాలలో సూచించాడు. సుదేష్ణతో ’పురుషులు నాకడం దేఱి చూడను వెఱతురు’ అన్న సైరంధ్రి మాటలలోని ధీమా, కీచక ఉప కీచకుల వధానంతరం ఆమెను చూసి హడలి పరుగులెత్తుతున్న ప్రజల వెఱపు నిజం చేస్తుంది.

 

అద్భుత సౌందర్యరాశి, ఆడువారే చూపులు  మరలుచుకోలేని అంధాల బొమ్మ సైరంధ్రిని చూచి కీచకుడారాటపడుట అబ్బురము కాదు. అతిలోక సౌందర్యం ద్రౌపది స్వంతమని కీచకుడామెను వర్ణించిన  అనేక పద్యాలలో స్పష్టము. మాలిని మనోహరమైన సౌందర్యమనే ఉచ్చులోచిక్కిన జింక కీచకుడు. అపూర్వ బలసంపన్నుడు, మత్స్యపతి బావమఱది, దండనాధుడు, కీచకాగ్రజుడు, రూపాభిమాని, దుర్విదగ్ధుడు, బలగర్వ్తుడు, భీమునితో సమానమైన బలపరాక్రమములు గల్గిన సింహబలుడు తన సోదరి సుదేష్ణ సమీపమున వర్తించు సైరంధ్రిని చూచినాడు. ’ఎందునునిట్టి రూపు నరులెవ్వరు గాంచిరె?” అనియు, ’ఇత్తలోదరింజెందక గానుప్పుగాదె ఫలసిద్ది పురాతన పుణ్యవృద్ధికిన్’ అని ఆమె సౌందర్యానికి వశుడై అనేక విధముల ఆమె చక్కదనాన్ని ప్రశంసించాడు.

 

“కుసుమ బాణుని బాణముల్ గూడనైదు

గరఁగి నేరిమివాటించి కరుపుగట్టి

పోసిచేసి చైతన్య సంపుటముదగ ఘ

టించిరో కాక యిట్టి చేడియలు గలరె’                                                                                (విరాట II-27)

 

అని విస్తుపోయాడు. అతడి వికారపు చూపులను పసిగట్టిన సైరంధ్రికి కలతతో శరీరం నిండా చెమట పట్టింది. వణకు పుట్టింది, ముఖం వెలవెలబోయింది. ఆమెనే గమనిస్తున్న నీచ కీచకునకీ భావాలన్నీ ఆమెకు తనపై గల్గిన వలపు భావలన్పించడం కామెర్లవాని దృష్టియే.  నిర్లజ్జగా ఆమె వివరాలడిగాడు. జుగుప్పాకరమైన ఆ దుష్టాత్ముని మాటలు వినీవిననట్లుగా, నిర్వికారచిత్తయై ద్రౌపది మిన్నకున్నా ఆ నీచుడు ఆమె అందాన్ని అభివర్ణించడం మానలేదు. మదోన్మాదముతో మరొక్కసారి ఆమె సౌందర్య ప్రశంసచేసాడు.

 

“నెత్తమ్మి రేకుల మెత్తఁదనముదెచ్చి

యచ్చునఁ బెట్టినట్లంద మొంది

చక్రవాకంబుల చందంబు గొనివచ్చి

కుప్పలు సేసినట్లొప్పు మెఱసి

చందురునునుఁ గాంతికం దేర్చి కూర్చి బా

గునకుఁ చెచ్చిన యట్లు గొమరుమిగిలి

యళికులంబులకప్పు గలయంతయును బుచ్చి

నాఱు వోసినభంగి నవక మెక్కి

 

యంఘ్రితలములుఁ గుచములు నాననంబుఁ

గచ భరంబును నిట్లున్న రుచిరమూర్తి

యనుపమాన భోగములకునాస్పదంబు

కాదె యీత్రిప్పు లేటికిఁ గమలవదన !”                                                                (విరాట II-52)

 

అని ఉచితానుచితాలు కూడ మఱచి పరస్త్రీని వర్ణించాడు, ఆమె నిరాకరించినా ఆమె సౌందర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఆమెపై మెహముతో పరితపించాడు. సుదేష్ణ బలవంతపు మాటలపై మదిర తెచ్చుటకు కీచక మందిరమునకు తప్పనిసరిగా పోయిన సైరంధ్రిని మరల కీచకుడు బ్రతిమాలాడాడు.

 

“కాణ్తి దళ్కొత్తు నీకడకంటి చూడ్కితో…….

…… ……  …..  ….  … ………….”

అని పల్కి “నన్నుబంటుగా నేలుము నలినపదన”                                            (విరాట I-324)

అని ప్రాధేయపడటంలో ద్రౌపది మహోత్క్పష్ట సౌందర్యం సువ్యక్తము. ’శుభలక్షణాంగి యీ సుందరి సైరంధ్రి’ అని విరాటులు కొల్వులోని జనుల మాటలు సైతము సైరంధ్రి సౌందర్యమునకు ప్రశంసలే. ఇట్టి లావణ్యరాశి సైరంధ్రికి తన సౌందర్యమే తనకు మూడుమార్లు శత్రువైనది. భగవద్దత్తమైన ఆమె అపురూప లావణ్యం బాహ్య స్వరూపం. ఇక అంతర్గతమైన ఆమె సౌశీల్యం ఎన్నో శాఖోపశాఖలుగా విస్తరిల్లిన సుగుణాల సుగంధ పారిజాతం.  సౌందర్య సౌశీల్యాల మధ్య ఘర్షనే ద్రౌపది జీవనయానం.

ద్రౌపది ఈ విరాటపర్వంలో సైరంధ్రిగా సుదేష్ణవద్దకు రావడంలోనే ఆమె సౌశీల్యంలోని మొదటిమెట్టు ప్రదర్శితము. అసలు ద్రౌపదిలో ఆకర్షణీయమైన గుణం ఆమె వ్యక్తిత్వం. ఆమె ధీర. తనను పరిచారికగా స్వీకరించుమని సుదేష్ణను కోరుటలో కూడ ఎక్కడా మచ్చునకైనా ఆమెలో దైన్యము గోచరింపదు. ద్రుపదరాజు నందినిగా పుట్టినింటా, పాండవుల పట్ట మహిషిగా మెట్టినింట నిత్యము పరిచారికా సమావృతయై సేవలందుకున్న విశిష్ట మహిళ. అవభృథస్నాత – ఇట్లు పరిచారికగా మత్స్య భూపతిరాణిని కొలుపు కోరుట విధివిలాసమైనను, ద్రౌపది మాటలలోని ఠీవి, దర్పము సుదేష్ణను సైతము శాసించునట్లున్నవి. అపూర్వ బలసంపన్నుడు, సాక్షాత్తు తనకు కొలువునిచ్చిన సుదేష్ణ సోదురుడైనను ఆమె కీచకుని సరకు చేయలేదు. అతని పట్ల జుగ్గుప్సని, క్రోధాన్ని సైరంద్రి తన హావభావాలద్వారా ప్రదర్శించిన తీరు ఆమె సహజ ధీరగుణమునకు ప్రతీకలు. తొలుత కీచకుని మాటలని వినీ విననట్లు ప్రవర్తించి నిర్వికారయై ఊరకుండి పోయినది. తరువాత ఎన్నివిధాల అతడామె సౌందర్యాన్ని ప్రశంసల జల్లులతో ముంచెత్తినా ఆమె తన చిరాకును తొలుత బహిర్గతము చేయలేదు. చాల సామంగా ’అన్నా’ అని కీచకుని సంబోధించింది. కష్టాలలో ఉన్న తన పరిస్థిని అర్థంచేసికొమ్మన్నది. ’పోనీలె’మ్మని హితువు చెప్పింది.

 

“చనునె యిమ్మాటలాడ సజ్జనుల? కాఁడుఁ

బుట్టువులతోడ నీవును బుట్టినాఁడ

వట్లుఁ గాకయి హీనవంశాభిజాత

నై పతివ్రత నగు నన్ను నడుగఁదగునె?”                                                              (విరాట II-50)

 

ఈనాటి స్త్రీలు కూడ తమను వేధించే పురుషులను “నీకక్కచెల్లెళ్ళు లేరా?” అని అడగడం పరిపాటి. అదే ద్రౌపది కీచకుణ్ణి అడిగింది.  అయినా ఆ నీచకీచకుడు తన బుద్ధిని సరిచేసికొనక పదే పదే ఆమెకు తన కోర్కెను తెలియ జేసేసరికి సహజంగానే ఆమెకు కోపం వచ్చింది. నయాన మాట వినని వాణ్ణి భయపెట్టే ప్రయత్నంచేసింది. కీచకుణ్ణి బెదిరించడానికి కూడ జంకని ధీరవనితగా దర్శనమిస్తుంది. సైరంధ్రిని శృంగార నాయికగా కీచకుడు తలపోస్తే ఆమె రౌద్ర భయానక రసాల్ని తన మాటల్లో ప్రదర్శించింది. ’అన్న’ అన్న సంబోధన, ’కీచకా’ అని మారిపోయింది. తిక్కనామాత్యుడు ఒకే పర్వంలో ఒకే పాత్రనోట ఒకే పద్యాన్ని వేర్వేరు సన్నివేశాలలో పలికించడం ప్రత్యేకతను సంతరించుకునే విషయమే ఆ పద్యమిదే:

 

“దుర్వారోద్యమ బాహుమిక్రమసాస్తోక ప్రతాపస్ఫుర

ద్గర్వాంథప్రతివీరనిర్మథనవిద్యాపారగుల్ మత్పతు

ల్గీర్వాణాకృతు లేవు రిప్డునిని దోర్లీలన్ వెసం గిట్టి గం

ధర్వుల్ మానముఁ బ్రాణముం గొనుటా తథ్యం బెమ్మెయిం గీచకా”  (విరాట II-55 & విరాట II-172)

ఇంకను,

 

“చనుఁ జనదని చూడక యం

దనిమ్రాఁకులపండ్లు గోయఁదలఁచుట హితమే

మును చెడినరావణాదుల

విని యఱుఁగవె యన్నఁడును వివేకవిహీనా”                                                      (విరాట II-58)

అని పరుషంగా ద్రౌపది హెచ్చరించి ఛీత్కరించేసరికి కీచకుని మొగము చిన్నబోయింది. అయినా ఆ దుష్టుడు పద్దతి మార్చుకోలేదు. అది విషయాంతరం. ద్రౌపది సింహబలుని అదలించిన తీరు ఆమె ధైర్యగుణానికి నిదర్శనం. పైగా స్త్రీ వ్యామోహము వంశ నాశన హేతువని హెచ్చరించింది.

ప్రణాళిక ప్రకారం సుదేష్ణ సైరంధ్రిని మద్యం కోసం కీచకుని మందిరానికి పంపదలచింది. ద్రౌపది ఎంత నిరాకరించినా సుదేష్ణ నిష్టురోక్తులకామె బయల్దేరక తప్పలేదు. నిర్వేదస్థితిలో శోకరసాన్ని వహించిన నాయికగా కన్నీళ్ళుకారుస్తూ బయల్దేరినా ఆమె ధైర్యాన్ని వదలలేదు. భయం, సంకోచం, దు:ఖం, ప్రయత్నం చేసింది. ఆమె ధైర్యానికి ఆలంబనం ఆమెకంతర్గతంగా ఉన్న అచంచలమైన దైవభక్తి. భర్తల దోర్బలానికి, తన దైవభక్తి తోడుగా ధైర్యలక్ష్మిని మనస్సున నిల్పుకున్నా ప్రస్తుతం నిస్సహాయరాలైన ఆ యిల్లాలు తన కష్టం గట్టెక్కడానికి కర్మసాక్షి ఆదిత్యునకు నమస్కరించింది.

 

“పాండుపుత్రుల కేను దప్పనిమనంబు

గలుగుదానన యేని కమల మిత్త్ర

కీచకుని దెస న న్నొక కీడు తెరువు

వొరయ కుండఁగ రక్షింపు కరుణతోడ”                                                                                  (విరాట II-108)

 

అని ప్రార్థించిన ఆమెకు రక్షగ సూర్యుడొక బలఢ్యుడైన రాక్ష్సుణ్ణి అదృశ్యరూపంలో పంపించాడు.  విశిష్టమైన ఆమె భక్తితత్పరతకు పుండరీకాక్ష, పుండరీకవల్లభులు సాయ్పడగలరను ధైర్యం సైరంధ్రిది.  అయితే అంత ధీరయు భయాందోళనలు ముప్పిరిగొనగా ’బెబ్బులి యన్న పొదరు సొచ్చు లేడి చందంబున’ కీచకుని మందిరంలో ప్రవేశించింది.

తనకెంతమాత్రము అంగీకారముకాని నీచమైన కృత్యమునకు తప్పనిసరిగా ఆమె తల ఒగ్గింది. తాను తిరస్కరిస్తే తత్ఫలితంగా తన ఉనికి బహిర్గతమై స్వస్వరూపం అందరిముందు వెల్లడి అయితే తనవల్ల తనకు, తన భర్తలకు మరల అరణ్యాజ్ఞాతవాసాలు తప్పవు. నిప్పు పడికట్టుకున్నట్లు ఆ యిల్లాలు ఈ దురవస్థను ధైర్యంతో, పంటిబిగువున భరించింది. ఆ మందిరంలో కూడ కీచకుని వెకిలిచేష్టలను భరిస్తూ తాను వచ్చిన పని చెప్పింది. ఆ అవివేకి కుసంస్కారమైన మాటలను పెడచెవినిబెట్టి, ’ధీర కావున విగత వికారయగుచు’ ముక్తసరిగా “మదిరివోయింపుడద్దేవి యెదురుచూచు, నలుగు దడవైన మగుడ బోవలయు” అని నిబ్బరంగా అన్నది. కీచకుడు పోగాలము దావురించిన వాడు. హిత, ప్రియవచనములతడి చెవికెక్కవు. ఎన్నో విధాలుగా ఆమెను ప్రలోభపెట్ట ప్రయత్నించాడు. కాని ఆమెకు రక్షణగా వచ్చిన రక్షసశక్తి ఆమెనావహించగా ధైర్యంతో ఆమె ఆనెచుని చేతిని విదిల్చి ఆ యింటినుండి బయటపడింది.

ద్రౌపది ధైర్యముతోబాటు సమయజ్ఞత, సమయస్పూర్తి, వివేకం ఉచితానుచిత ప్రసంగం, సంయమనం చాల ఎక్కువ. ఎంతటి ఆగ్రహాన్నైనా నిగ్రహించుకొని  సమయపాలనను సక్రమంగా నిర్వహించింది. కీచకుని మందిరం నుండి వెలుపడిన పిమ్మట న్యాయం కొఱకు ఆమె విరాటుని కొలువులో ప్రవేశించింది. ఈ సన్నివేశంలో ద్రౌపది సైరంధ్రిగా మాటలాడిన తీరు, ప్రశ్నించిన వైనం ఆమె అసాధరణ సంయమనానికి సాక్ష్యం.  విరాటుని కొలువులోనికి ద్రౌపదిని వెంటాడుతూ కీచకుడు కూడ వచ్చాడు. సభసదులందర ముందు పెద్ద గ్రద్ద ఆడుపామును వేగంగా ఒడిసిపట్టబోయినట్లు ఆ దుష్టుడు ఆ చిగిరిబోడి సైరంధ్రి జుట్టుముడి పట్టిలాగి, నేలపడద్రోసాడు. మళ్ళీ ద్రౌపది నావహించిన అసురశక్తి ఆ కీచక మృగాన్ని నేలపడద్రోసింది.

ఈ సన్నివేశాన్ని కళ్ళారచూసాడు అన్నగరితో పాటు కొలువులో కూర్చున్న భీముడు. ఆగ్రహోదగ్రుడయిన ఆయన ముఖకవళికలని, చూపులను గుర్తించిన ధర్మరాజు నిగూఢభాషణముతో అతి కష్టముపై ఆయన కోపాతిశయాన్ని తగ్గించాడు.  ఇక్కడ ద్రౌపది ప్రవర్తించిన తీరు, మాటలాడిన పద్ధతి ఆమె వివేకానికి పెద్దపీట వెస్తాయి.

సైరంధ్రి ఇంత అవమానాన్ని భరిస్తూనే వారిద్దరి ముఖ కవళికలను, చేష్టలను గమనించింది. మాటల్లోని గూఢార్ధన్ని పసిగట్టింది. ఇట్టి అవమానం ఆమెకిది మూడోసారి. ఆమె సౌందర్యంలోని ఉజ్జ్వలత్వమే ఇన్నిమార్లు ఆమె పరాభవానికి హేతువయింది.  ఒకసారి జరిగిన అవమానం, తదనంతర పరిణామాలే ఇన్ని సంవత్సరాల అరణ్యాజ్ఞాతవాసాలు. మొన్న కౌరవ సభలో ఆ అసమాన సౌందర్యరాశి హృదయాన రాజుకొన్న అవమానాగ్ని, నిన్న అరణ్యవాసంలో వావివరుసలు విడిచిన సైంధవుని దుష్టబుద్ధితో ప్రజ్జ్వరిల్లి, నేడు కీచకుని వేధింపులతో దావానలమైంది. ఈ సన్నివేశంలో సత్వజన వంద్యయైన పాండవపట్టమహిషి దైన్యరూపాన్ని తిక్కన వర్ణించిన తీరు సౌందర్య దైన్యాల సమ్మేళనమై ఆమె శారీరక, మానసిక స్థితుల నద్భుతంగా ఆవిష్కరించింది ఆమెలోని తెగింపునకు సంయమనం తప్పనిసరియైంది.

సమయభంగమగునేమో యను సంశయ మొకవైపు, అతిశయించిన కోపమింకొకవైపు ముప్పిరిగొనగా తన భర్తలను తీక్షణంగా చూసి అందరూ వినేటట్లుగా గద్గద స్వరంతో ఆమె ఆక్రోశించిన తీరు, సాభిప్రాయమైన విశేషణాలలో, నిజం బహిర్గతం కాకుండా తన భర్తలను పరోక్షంగా నిలదీసి ప్రశ్నించి విధము ఆమె మానసిక వేదన, రోదనలకు సాక్ష్యం.  సభాసదుల నుద్దేశించి ప్రశ్నించినా ఆమె గూఢంగా మరోమారు తాను పతివ్రతాగుణాస్పందిత వర్తననని, పరమ సాధ్వినని, ఆనిందితశీలన్ని, అట్టి తనను కీచకుడవమానిస్తే “అందరిలో కొందరికైనా దయ చూపించే తరుణం కాదా!” అని పాండవులను నిష్ఠురోక్తులాడింది.  అసామన్య సంయమనం కలిగిన స్త్రీ అయినా ధర్మాన్ని, న్యాయాన్ని సూటిగా ప్రశ్నించే మనస్తత్వమామెది.  ’రాజా రాష్ట్రకృతం పాపం’ అన్నట్లు ఈ ధర్మరాహిత్యానికి కారకుడు విరాటుడు.  ద్రౌపది నిర్భయంగా

 

“ననుఁ దన్నఁ కీచకునిఁ జూచియు నూరక యున్కి పాడియే?”

అని రాజునే నిలదీసింది. కీచకుని దండించడానికి శక్తిలేని విరాటుడాతని నెట్లో అనునయించి పంపివేసాడు. ఈ సన్నివేశంలో ద్రౌపదిలోని అవమానాగ్ని, మానసిక వేదన ధర్మజుడు తన్ను అంతఃపురమునకు మరలిపొమ్మని చెప్పిన మాటను సైతము మన్నింపనీయలేదు. పైగా ధర్మజుడు “విచ్చలవిడి నాట్యంబు సలుపు చాడ్పున నిచటన్ గుల సతుల గఱవ చందము దొలగగ నిట్లునికి దగున్” అని మందలించడం ఆమెను రోషావేశాలకు గురిచేసింది. ఆ ఒంటిరి పోరాటంలో ఆమెకు ఓదార్పు, ధైర్య వచనాలు మిక్కిలి అవసరం. మందలింపుల నామె మన్నించే స్థితిలో లేదు. అందువల్లనే సైరంధ్రి సాభిప్రాయంగా ఇట్లన్నది.

 

“నాదు వల్లభుండు నటుఁడింత నిక్కంబు

పెద్దవారి యట్ల పిన్నవారు

గొనఁ బతుల విధమకాక యేశైలూషిఁ

గాననంగ రాదు కంకభట్ట!”                                                                                    (విరాట II-152)

“అట్లగుటంజేసి నాకు నాట్యంబును బరిచితంబ మత్పతి శైలూనుండ కాఁడు కితవుందునం గావున జూదరి యాలికి గఱువతనం బెక్కడియది?” అని సునిశిత వాబ్బాణాలను సంధించి అక్కడి నుండి కదలినది. రక్షింపవలసిన భర్తే రక్కసి మాటలాడితే ఏ ఆలి సహింపగలదు? ద్రౌపది ప్రతిమాట, ప్రతికదలిక, ఆమె అంతర్గత సంక్షోబానికి నిదర్శనం. ఇంతటి వేదనలోను, అవమానమ్లోను సైతము ఆమె అజ్ఞాత, వివేకం, మనోరంజకమైన హితోపదేశం ఈ పర్వంలో అడుగడునా ప్రదర్శితమౌతాయి.

దుష్టుడైన కీచకుని యింటికి తనను బలవంతంగా పంపిన ధూర్తురాలైన సుదేష్ణను నిందించాలని ఎంత అనిపించినా, తన నిస్సహాయతకు కన్నీళ్లు ధారపాతంగా ప్రవహించగా, బావురుమని దుఃఖిస్తూ, శరీరకంపనముతో, తూలుతూ దీన వదనయై సైరంధ్రి సుదేష్ణకు ద్రౌపది జరిగింది స్పష్టంగా చెప్పింది. ఆమె ఓదార్చే ప్రయత్నం చేసినా లక్ష్యపెట్టకుండా, తన పగను తన భర్తలే తీర్చెదరని హెచ్చరించడంలోనే ద్రౌపది రాచఠీవి, భర్తల యెడగల అచంచల విశ్వాసము సువ్యక్తము. ఆగ్రహాన్ని ఆలోచనతో అణచి, పగదీర్చుకునే ఉపాయాన్ని అన్వేషించింది. భీముడొక్కడే కీచకుణ్ణి జయించగల సమర్థుడని నిర్థారించుకున్నది. దుఃఖావేశమున, విచక్షణను కోల్పోక, కీచక సంహారానికి మార్గాన్ని కనుగొన్నది. ఈ దుష్ట సంహారానికి, భీముని భుజబలానికి తోడు దైవబలం కూడ తప్పక సమకూరుతుందని విశ్వసించిన భక్తవరేణ్య ద్రౌపది.

ద్రౌపది ఎన్నో పర్యాయములు ధీరగా, వివేకవతిగా మనకు కన్పించినా, కీచక వధకు మార్గమామెకు స్ఫురించిన పిమ్మట ఆమె చూపిన చొరవ, ధైర్యము, నేర్పు, వాజ్నైపుణ్యము నాన్యతో దర్శనీయము.  ఆ రాత్రివేళ ఆమె శయ్యాతలంబు విడిచి, మేనిధూళికడిగి, ధౌతపరిధాన పరీతయై భీమసేనుడి వద్దకు వెళ్ళింది. అతడు వంట యింటిలో నిశ్చింతగా నిదురించుట చూచి స్త్రీ సహజమైన అసహనంతో.

 

“నన్నుఁ బరాభవించి సదనంబునకుం జని కీచకుండు ము

న్నున్న తెఱంగు దప్పక సుఖోచితశయ్యను నిద్ర సేయ నీ

కన్ను మొగుడ్చునూఱటకుఁ గారణ మెయ్యది? భీమసేన! మీ

యన పరాక్రమమ్బు వలదన్ననొకో దయమాలి తక్కటా!”

(విరాట II-166)

అని అధిక్షేపించింది. తన పాణి స్పర్శచే మేల్కాంచిన భీమునకు తన అవమాన గాథనంతా వివరించి, కీచకుణ్ణి తానేవిధంగా హెచ్చరించిందో ’దుర్వారోద్యమ……’ పద్యం మరలా భీమునకు వినిపించి తెలియజేసింది.

ద్రౌపది వివేకవతి.  అంతకుముందు ఇదే పద్యం ద్వారా కీచకుణ్ణి హెచ్చరించింది. ఇప్పుడు తనభర్తల ప్రతాపాన్ని కీచకునివద్ద ఎలా ప్రశంసించిందో భీమునకు చెప్పి, దాన్ని సత్యం చేయమని సూచించింది. జరిగిన అవమానం వివరించింది.

 

“మీసుభటత్వమున్ బలము మిన్నక పోవఁగ దుస్ససేనుఁ డ

ట్లా సభలోన నన్ బఱిచె, నంతియ కాక జయద్రథుండు సం

త్రాస భరంబు లేకనిచితం బొనరించినఁ జెల్లిపోయె, నే

డీ సభికుల్ గనుంగొనఁగ నిట్లయితిన్ వగ నాకువింతయే!”

(విరాట II-176)

 

అని వాపోయింది. వీరపత్ని కెంతదుర్గతి? ఆమె సౌందర్యమే ఆమెకు శత్రువైనది.  ఆడుదాని ఏడుపును, ఆవుల అరుపుని పరులైనా గమనించి రక్షించడం లోకపరిపాటియై యుందగా “నన్నుఁ  గీచకుండు దన్నంగ నట్టులు, సూడనేర్చె ధర్మ సూనుఁడపుడు” అని ద్రౌపది ఈ సందర్భంలో ధర్మరాజును నిర్దయుడుగా నిష్టురము లాడుట, ’మీఅన్న పెద్దతనము’ అని ఇంతకు ముందు ఎత్తిపొడుపుగా పల్కుట ఆమె పొందిన అవమానభార ఫలితమేగాని అన్యము కాదు, ఇది క్షణికమే.

 

ద్రౌపది ఉచితజ్ఞురాలు. ధర్యజుని ప్రవర్తనలోని ఆంతర్యాన్ని భీముడు వివరించగా ఆమె పశ్చాతప్తురాలైనది. తన జీవితంలో కుంతికి గాని, పాండవులకు గాని చివరకు దైవానికైనా భయపడలేదు. కాని ’అత్యంత కలుషాత్మ విరటుని కాంతకు నేవెఱతుఁ బనులు గావించునేడన్’ అన్నది. కీచకుని వలస తన కవమానము కల్గినదను దుఃఖావేశంలో కలతవల్ల ధైర్యాన్ని కోల్పోయి అట్లు పల్కినదిగాని, ధర్మరాజు ధర్మనిష్ఠ తెలియక కాదని నొచ్చుకున్న ద్రౌపది, ధర్మరాజుని ఎంతగానో ప్రశంసించినది. తన తప్పిదాన్ని క్షణంలో గ్రహించి తప్పుదిద్దుకొన్న వివేకి ఆమె. ధర్మరాజు కేవలం మర్త్యుడు కాదని ఆయన ఔన్నత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది.

 

’ఎవ్వని వాకిట నిభమదపంకంబు రాజభూషణరజోరాజినడఁగు

……………………………………………….’                                                     (విరాట II-191)

 

అని ధర్మజుని ప్రశంసిస్తుంది. పిమ్మట భీమసేనుని బలపరాక్రమాలను కీర్తిస్తుంది. బక హిడింబాసురులను సంహరించిన అసమాన బల సమన్వితుడగు భీముడు తన భుజ బలాన్ని వంట కట్టెలు కొట్టడానికి ఉపయోగించడం, క్రూర మృగాలతో పోటీపడటం చూచి తాను నిత్యం దుఃఖపడుతూ ఉంటానని అతనిపట్ల, తన అభిమానాన్ని స్పష్టం చేసింది. ద్రౌపది జీవితం విచిత్ర సన్నివేశాల, సంఘటనల, సమ్మానాల, తిరస్కారల సమాహారం. తన అవమానాన్ని భర్తతో వివరించిన ద్రౌపది “కావున మదీయ పరభవాతి రేకంబునకు నీవుద్రేకించిన జనంబులు మనల భేదింతురు. నీకుం బోలిన భంగి రహస్యభంగంబుగాకుండ నరిభంగము సేయుము” అని విజ్ఞతతో పల్కినది. యుధిష్ఠర, భీమసేనులను మాత్రమేకాక తక్కిన పాండవుల పరాక్రమ వైభవములని స్తుతించుచు చెప్పిన పల్కులామెకు పతుల పట్లగల అవిరళ విశ్వాసానికి, అనురాగానికి చిహ్నాలు. అసమాన పరాక్రమశీలురు, విద్యాధికులు, అస్త్రశాస్త్ర పాండితీ ప్రకర్షులు అయిన తన భర్తల ప్రస్తుతపు దుస్స్థితికి ఆమె మనస్సు క్రుంగిపోయినది. ప్రత్యేకించి తా మరణ్యవాసమునకు బయల్దేరినపుడు కుంతీదేవి సహదేవుని ప్రత్యేకముగ తనకప్పగించిటను తలచుకొని, అజ్ఞాతవాస సమయంలో అత్తగారి మాటల నాచరణలో నుంచలేకపోతినని ఆక్రోశించినది. యుక్తాయుక్తము లెరిగి, పెద్దల మాటల పట్ల మిక్కిలి మన్నన కల్గిన ఉత్తమరాలు ద్రౌపది.

చివరగా ఆమె తన్నుగూర్చి “ద్రుపద భువిభుడు పుత్రులకంటె నెంతయు బెంపుసేయుచు గారవింపబెరిగితిని. ’పాండురాజు కోడలైన ద్రౌపది పుణ్యాంగన’ అని రాజన్యమాన్య ప్రియాంగనలందెల్ల పొగడ్త గంటిని. ప్రతిష్ఠాత్మకమైన రాజసూయ యాగములో బ్రాహ్మణాశీర్వాదాన్ని పొందిన దానను.  ఇవి యన్నియు మీ మన్ననల వలననే నాకు లభించినవి. విధి వైపరీత్యాము వలన నేను మానాభిమానములు కోల్పోయి పొట్టకూటి కొఱకు సుదేష్ణ కనుసన్నలలో మెలగుతూ పరిచారికలా బ్రతుకీడ్వడం మీకేమాత్రము దుఃఖమును కల్గించుట లేదు. చందనమరగదీయిట లోను, సుదేష్ణకు పరిచర్యలు గావించుటలోను నా అరచేతులు కాయలుగాచిన చందము నీవు గమనించితివా?” అని భీమసేనుని వక్షస్థలముపై కన్నీటితో తడిసిన తన మోమునాన్చి దుఃఖించినది. ఈ సన్నివెశములో ద్రౌపది అసలుసిసలు తెలుగింటి ఆడపడుచుగా, కోడలుగా, భార్యగా తనపై తానే జాలిపడినది. ఇది అత్యంత సహజమైన స్త్రీ స్వభావం. పనులు చేసినప్పుడు కలిగే అలసటకన్నా భర్త తన కష్టన్ని గుర్తించలేదనే బాధ ఆమెను విపరీతంగా వేధిస్తుంది. ఇది ఒక సున్నితమైన, అతిసహజమైన స్త్రీ మనోవేదన.

భీముడామె కన్నీరు తుడిచాడు, ఓదార్చాడు. ద్రౌపది తేరుకున్నది. కాని ఆమెకు మళ్ళీ ఆగ్రహం వచ్చింది. “ధర్మజుడే మన వంశానికి వాటిల్లిన ఈ భంగపాటంతటికీ కారణం” అని మాట తూలింది. ఆమెలో ఎన్నిరకాల భావపరంపరలు,  ఆవేశ తరంగాలు, ఆలోచన వీచికలు!” మళ్ళీ తన కష్టాలు పూర్వజన్మ కర్మఫలమని తలచింది. “ఎటులైనా ఆపదల నోర్చుకుందునుగాని కీచకుడు మున్ముందేమిచేయునో అని భయముతో వణికి పోతున్నాను.”

 

“వానిఁ దెగఁ జూడ వైతేని వాయుపుత్ర

నీవు గనుగొన నురినైన, నీరనైన

నగ్నినైన విషంబున నైన నేను

మేను దొఱఁగుదు నెట్టు నీయాన సుమ్ము”                                                       (విరాట II-229)

 

అని ద్రౌపది బ్రహ్నాస్త్రం ప్రయోగించింది. తాను వచ్చుసరికి నిద్రిస్తున్న భీముణ్ణి మేల్కొల్పి తన పరాభవాగ్నితో అతనిలోని క్రోధాగ్నిని రగుల్కొల్పి కీచకుని పట్ల అతడు తన పరాక్రమాగ్నిని ప్రదర్శించుటకు నిర్ణయించుకొనునట్లు సంభాషించింది. ఈ త్రేతాగ్నులావిర్భావం కీచక సంహారానికే. ఆమె శోకముతో మాటలాడుచునే తాననుకున్న ప్రయోజనాన్ని (కీచక సంహారం) సాధించేటట్లుగా ప్రవర్తించింది. ఆమె కరణేషుమంత్రి. ఆమెకవమానాలు క్రొత్తకాదు. కాని నేటి విపత్తునామె శీఘ్రంగా తొలగించుకోక ఆత్మహత్య చేసికొనుట పరాక్రమ వంతులైన తన భర్తల కాత్మహాత్యా సదృశం. ధర్మానికి కట్టుబడి కురుసభలోను, బాంధవ్యానికి కట్టుబడి అరణ్యవాసంలోను, మాటకు కట్టుబడి విరాటరాజు కొలువులోను ఆమె అవమానాన్ని తప్పనిసరిగా భరింపవలసి వచ్చింది, కీచకవధకు భీముని కర్తవ్యోనుమఖుణ్ణిచేసి సఫలీకృతురాలైనది. తత్ఫలితముగా భీమసేనుడు కీచకుని ఒంటరిగా నర్తనశాలకు వచ్చునట్లు చేయుమని ద్రౌపదికి చెప్పి, తన ప్రణాళికను వివరించాడు. ఆమె శాంతించింది. భీముని మాటపై ఆమెకున్న విశ్వాసం గొప్పది.

ద్రౌపది ఆత్మస్థైర్యం గల్గిన ధైర్యశాలిగా, అవసరార్థం అద్భుతంగా నటించగల్గిన అతివగా, దుష్టశిక్షణకు భర్తకు బాసటగా నిల్చిన ఆదర్శపత్నిగా ఆమె ముందడుగు వేసింది. అవివేకియైన కీచకుడు సైరంధ్రిని ఒప్పించుటకు మరునాడు మరల సుదేష్ణ యింటికి వచ్చాడు. ద్రౌపది చూచునట్లు వికారపు చేష్టలు చేయుచు, అనేక విధముల ఆమెను బ్రతిమలాడాడు. తన పరాక్రమ విశేషాలను వివరించాడు, అనేక విధముల ఆమెను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసాడు. ద్రౌపదికి మార్గం సుగమమైంది. ఇచ్చట ద్రౌపది అభినయం, మాటనేర్పు, గూఢార్థ భరితమై పఠితలనెంతైనా అలరిస్తాయి. అతడివైపుచూసింది. పైగా అతడి అభ్యర్ధనను సుతారమైన మందలింపుతో అంగీకరిస్తునట్లు గడుసుగా.

 

“మగ లడఁకువ నుండక తమ

తగులమ పాటింతు రెట్టి తగులంబైనన్

మగువల యెడలన యడఁగుం

దగవు విడిచి యడిచిపడరు ధైర్యము పేర్మిన్”                                                           (విరాట II-261)

 

అన్నది. స్త్రీ పురుషుల సహజ స్వభావాలని ప్రదర్శించే ఈ పద్యంలో ద్రౌపది, కీచకుడు పురుషుడుకాన ఆతని కోరిక బహిర్గతమైనదనియు, స్త్రీ కాబట్టి తను తన కోరిక (కీచకవధ) నణచి ఉంచితిననియు గూఢంగా పల్కింది.  నర్యకర్భమైన సైరంధ్రి మాటలామె కీచక వధకు పన్నిన పన్నాగమునకు తొలిమెట్టు.

జగ్రత్తగా మాటలాడుచునే, ఆగ్రహాన్నణచుకుంటూనే “నీ (అధర్మ) వాంఛకు తగిన ఫలం ఎటువంటిదో అటువంటి ఫలాన్ని(మృత్యువును) పొందు”మని ఆశపెడుతూ నిగూఢమైన హెచ్చరికను చేసింది. ఆమె అంతరంగాన్ని అర్థం చేసికోలేని ఆ నీచకీచకుడు మహదానంద భరితుడయ్యాడు. తన ఉచ్చులో కీచక మృగం చిక్కిందని గ్రహించిన ద్రౌపది సమయానుకూలంగా కీచకుడు ఒంటరిగా తనను కలవడానికి రావలసిన సంకేతస్థలాన్ని, సమయాన్ని సూచించింది. అచటనుండి తన్ను కలవడానికి రావలసిన సంకేతస్థలాన్ని, సమయాన్ని సూచించింది. అచటనుండి వంటయింటికేగి భీముని నిగూఢ కోపాగ్నిని తన చరోక్తులతో ప్రజ్వలింపజేసింది. ద్రౌపది వాక్చాతుర్యం ఆమె మనోవికాసాన్ని ప్రకాశింపజేసే శంపాలత తళుకులు.

 

“నాకొఱఁత దీర్చి వచ్చితి

నీకొఱంతయ యింక సూతునిం దెగఁజూడన్

లోకము వంచింపను దగు

చీఁకటిరేయొదవ నేమి సేసెదొ చెపుమా”                                                             (విరాట II-271)

 

“నాపని నేను చేసేసాను. ఇంక నువ్వు చేయాల్సిందే మిగులు” అని భర్తకు బాధ్యతను గుర్తుచేసింది. అయితే కీచకుని పట్ల భీముని తీవ్రకోపావేశానికి ఉలిక్కి పడింది. ఎంత ప్రతీకార వాంఛ మనసులో రగులుతున్నా భీముని ఆగ్రహం తమ అజ్ఞ్తాతవాసానికి భంగకారి కాకూడదని తలచింది.  అజ్ఞాతవాసం బహిర్గతం కాకుండా శత్రువును సంహరించడమే తన అభిమతమని, ’అటుగాక తక్కినను వలదు సుమీ’ అని ఎంతో సంయమనంతో భీముని సముదాయించింది. ఆమె చెప్పిన విషయమును తాను మనస్సునందుంచుకునే కీచక వధ చేయ ప్రయత్నిస్తానని భీముడామె మాటల నమోదించాడు. జయలక్ష్మిని చేకొమ్మని వీరపత్ని ద్రౌపది భీమునకు శుభాశంసనాలు తెలిపింది.

ఒక్కొక్కసారి బేలగా కన్పించే ద్రౌపది ఒక్కొక్కసారి అమితమైన ధైర్య సాహసాలు ప్రదర్శిస్తుంది. అర్థరాత్రి చిమ్మచీకటిలో కీచకవధకై భీముని చేతిని పట్టుకొని నర్తనశాలలో ప్రవేశించింది. భీముడామెను ఆనాట్యమందిరంలోని లీలా పర్యకానికి కొద్ది దూరంలో కీచక సంహారాన్ని కనులారా కనుగొనుటకు వీలుగా ఆమెను దాచాడు.  భీమసేనుడు తానాపర్యంకము మీద ఆసీనుడయ్యాడు, ’ఉత్కంఠాసవపాన విధన వ్యాసంగతరంగితాంతరంగుడగుచు, సింగంబున్న గుహానికేతనమునకు శీఘ్రంబున వచ్చు మాతంగము’వలె కీచకుడు ఆత్రుతగా నర్తనశాలలో ప్రవేశించి, పర్యంకాసీనుడైన కిమ్మీరవైరిని ద్రౌపదిగా భావించి  నానావిధ వికారపు చేష్టలను ప్రదర్శించినాడు. ’నను ముట్టినీవు వెండియు వనితల సంగతికి బోవువాడవే’ అనుచు భీముడు గ్రక్కున లేచి కీచకునిపై విజృంభించాడు. భీమసేన కీచకుల మధ్య పోరాటాన్ని ద్రౌపది ఆ చీకటిలో ఎంతవరకు గమనించగలిగిందో, ముష్టిఘాతాల మ్రోతల్ని ఏ మాత్రము వినగలిగిందోగాని భీముడు రహస్యంగా తీసికొని వచ్చిన నిప్పు వెలుగులో కీచకుని శవాన్ని సంభ్రమాశ్చర్య ప్రియములు ముప్పిరిగొనగా చూసింది. ఆ మృతదేహాన్ని చూస్తూ

 

“……… చేరి వ్రేల్మిడుచుచుం దలయూఁచి, విలక్షచిత్తయై

యాచపలాక్షి ముక్కుపయి నంగుళముం గదియించి, దీనికై

’కీచక! యింతసేసితి సుఖిత్వముఁ బొందుదుగాక యింక న

ట్లేచిన నిట్లు గా కుడుగునే!’ ………………………..”                                            (విరాట II-356)

 

అంటూ ఆశ్చర్యపోయింది. అతడి దుర్మార్గానికి అతడే బలియైపోయాడని, తన ప్రతీకార వాంఛనెరవేరిందని సంతృప్తి అయింది.  జానపద వనితలా హావభావ చేష్టలను ప్రకటించిన ద్రౌపది విలక్షణ మనస్విని. ఆమె హావభావాలు, ఆంగికాభి నయాలు ఈ సన్నివేశంలో అత్యంత సహజంగా ప్రదర్శితమౌతాయి. సింహబల మర్దనుని చూసిన ద్రౌపది మనస్సు సంతోషంతో వెల్లివిరిసింది. భర్తను ప్రశంసలతో ముంచెత్తింది.

 

“……………………………………………………………………………………………….

లోక దుర్జయుఁడగు నీ కీచకునిని వ్రేల్మిడి రూపుమాపిన కడిమి సొంపు

సూడఁ, దలపోయ మెచ్చ సంస్తుతి యెనర్ప, నాదరంబె!…………………………………..” (విరాట II-360)

 

అని అల్పాక్షరాలతోడి అలతి పదాలలో అనల్పమైన భీమ పరాక్రమాన్ని స్తుతించింది. తాను ’మహిత విస్మయానంద నిర్మగ్ననైతి’నని అమితానందంగా పల్కింది. శోకాన్నైనా, సంతోషాన్నైనా సూటిగా వెలువరించే నిష్కపటి పాంచాలి. అంత స్వచ్చమైన హృదయ సౌందర్యమామెసొత్తు కావుననే కొండకచో సాహసిగా కూడ సాక్షత్కరిస్తుంది.  భీముడామెను నర్తనశాలవద్దే వదలి తనస్థావరం చేరిన అనంతరం ద్రౌపది నర్తనశాల వెలువడి ఒక ప్యూహం ప్రకారము కావలివారిని పిలిచి ఇట్లన్నది.

 

“నపతు లగుగంధర్వుల

చేపడి మృతిఁ బొందె వీఁడె సింహబలుండీ

పాపాత్మునిఁ జూడుఁడు దు

ర్వ్యాపార ఫలంబు గాంచె………………………….”                                                      (విరాట III-3)

తెల్లవారాక ప్రజలు కీచక మరణం గుఱించి పరిపరివిధముల మాటలాడకుండా, వారి ఆలోచనలకు తెరపడునట్లుగా, కీచకుల వంటి నీచులకు హెచ్చరికచేసింది. తన భర్తలైన గంధర్వుల పరాక్రమాన్ని, కుప్పగా పడిన కీచకుని శవాన్ని చూసి గ్రహించి జంకుతారని తద్వార ఇకముందు తనకే ఆపదారాదను ధైర్యంతో దౌపది కీచకుని శవయాత్ర చూడటానికి అచటనే నిలిచింది. కాని ఆ మానవతిని ఉపకీచకులు క్రోధంతో తమ అన్న సింహబలుని శవంతో పాటు దహనం చేయాలని బంధించారు.

త్రేతాయుగంలో సీతాదేవికి రావణుడొక్కడే శత్రువు. ద్వాపరయుగానికి వచ్చుసరికి ద్రౌపదికి ’గజానికొక గాంధారికొడుకు’ ఎదురుయ్యాడు. ఆ శీలవతిని ఉపకీచకులు తమ అన్న శవం మీద పడేసి కట్టేసారు. నిత్యశుచి, పుణ్యశీల, ఉదాత్త అయిన ఆ పాంచాలి ఊహించని ఈ విపత్తుకు విహ్వలయై ప్రాణభయంతో ఎలుగెత్తి ఏడ్చింది.

 

“అనద నైతి నిచట నాలికుయ్యాలింపుఁ

డకట మీరు గలుగ నాక్రమించి

నన్నుఁ గట్టి సూతనందను లిమ్మెయి

విఱపు లేక భంగపఱచువారు”                                                                                              (విరాట III-19)

 

అని “ఓ జయా! జయంత, విజయ, జయత్సేనా, జయద్భవా!” అనుచు తన (గందర్వ) పతులను వచ్చి రక్షింపుమని పేరుపేరునా పిలిచింది.  ఆ ఆక్రోశాన్ని విన్న భీముడు రహస్యంగా శ్నశానం చేరి నూటయేవురుపకీచకులను నుగ్గు నుగ్గు చేసి దౌపదిని విడిపించి సుదేష్ణ మందిరానికి పంపాడు.  ఆమె నడచి వస్తుంటే ప్రజలామెను తేరిచూడటానికి వణికారు.  పులిని చూసిన జింకల్లా పరుగులెత్తారు. ద్రౌపది ’అంతరంగమున నిండిన హాస్యరసంబు మోముపై వెలివిరియంగ నీక చని మహానసశాల వాకిట నిలిచిన భీముని’ జూచి హృదయము పొంగగా, ఎవ్వరు గమినించ కుండునట్లు జనాంతికముగా పల్కిన మాటలు ఆమె కృతజ్ఞతాబుద్ధి విశేషమునకు తార్కాణము.

 

“కీచకుల దెసఁ బుట్టిన కిల్బిషంబు

పాచి నన్ను రక్షించిన పరమధర్మ

రతికి గంధర్వపతికి నిరంతరంబు

భక్తియుక్తిమైఁ బ్రణమిల్లి బ్రదుకుదాన”                                                                                   (విరాట III-39)

 

ఆపదలో నున్న భార్యను రక్షించుట భర్త కనీసధర్మమైనప్పటికినీ, ఆమె తన ప్రాణమును కాపడిన భీమునకు ’ప్రణమిల్లి బ్రథుకుదాన’ ననుట ఆమె దొడ్డ గుణమునకు సాక్ష్యము. తనకు కీచక, ఉపకీచకుల మరణ విశేషముల నడుగుచున్న బృహన్నలతో సైరంధ్రి సాభిప్రాయంగా సంభాషించినతీరామె సహృదయమునకు నిదర్శనము. తొలుత బృహన్నలతో నిష్థురముగా

 

“కన్నియల కాట గఱపుచు నున్ననీకు

నకట సైరంధ్రి యిప్పుడేమయ్యెనేని

ఖేద మెద నించుకయు లేమిఁ గాదె సస్మి

గాననంబుతో న న్నిటు లడుగు టెల్ల”                                                                                  (విరాట III-48)

 

అని పల్కినను, తన అజ్ఞాతవాస వేషము రిపుమర్దనమునకు సహకరించదని గుప్త సాభిజ్ఞానముగా బృహన్నల తెలుపుగా ’స్మిత కమనీయ కపోల’ యగుచు ఆర్ద్రంగా పల్కిన మాటలు పాండవుల అజ్ఞాతవాస నియమాలనామె ఎంత క్రమ శిక్షణతో పాటించివలెనని నిర్ణయించుకున్నదో వ్యక్తము చేయును. అంతేకాదు బృహన్నలతో….

 

“అట్ల కాక యింత యన నేల నీమది

తెఱఁగు గొంత యేన నెఱఁగ కున్న

దానఁ గాను నగరఁ దగవుమైనీవు వ

ర్తించుటయ కరంబుప్రియము నాకు”                                                                                    (విరాట III-53)

 

అనిన సహృదయ నైరంధ్రి, పిమ్మట కన్యకాపరివృతయై అంతఃపురమును చేరింది.  ఉప్పొంగుతున్న సంతోషంతో ఆమె మనస్సు నిండిపోయినా దాన్ని ముఖంలోగాని, చేతల్లోగాని బహిర్గతంచేయకుండా కట్టడిచేసిన భావ నియంత్రిణి ద్రౌపది. సోదరుల మరణమునకు శోక సముద్రయైన సుదేష్ణ వద్దకు, వారి మరణమునకు సంతోష తరంగిణియైన ద్రౌపది వచ్చింది.  సంతోషం వల్ల కలిగిన ప్రీతిని ముఖంలో కనబడనీయకుండా, కన్నుల్లోని కాంతి విలాసాల్ని ప్రయత్న పూర్వకంగా ప్రక్కకు తోస్తూ, అమితమైన సంతోషంతో వచ్చే వివశత్వాన్ని బలవంతంగా అణచుకుంటూ, మనస్సులోని సంతోషం మాటల రూపంలో బయటకు రాకుండా జాగ్రత్తపడుతూ, అతి మెలకువతో తన మనోభావాలను నియంతిస్తూ సైరంధ్రి సుదేష్ణను సమీపించింది.

సైరంధ్రిని చూడగానే భయ శోక భావములు పెనుగొనగా సుదేష్ణ ఆమెను వినయపూర్వకంగా పల్కరించింది.  ద్రౌపది సౌందర్యం తమ రాజ్యానికే చేటు కాగలదను తలంపుతో నున్న భర్త మాటలపై సైరంధ్రి పంపివేయాలని సుదేష్ణ నిర్ణయించుకున్నది. దానికితోడు సోదరవధకు కారణభూతురాలైన సైరంధ్రిని ఆమె సహించలేకపోతున్నది.

 

“బిరుదుగల మగలు గలరని జనములను నీవు చంపించుటచే మా ప్రజలు నిన్నిగని భయభ్రాంతులగుచున్నారు. అడుగడుగునా ద్రౌపదికి కష్టాల సుడులే.  అయినా ఆమె ధీరగాన సూటిగా, నిక్కచ్చిగా తన అభ్యర్ధనను మహరాణితో వెల్లడి చేసింది. ఒక్క పదమూడు దినములు మాత్రము ఆమె మందిరమున తాను వసించుట కంగీకరించుమనియు, అట్లైనచో తదుపరి దినమున గంధర్వులు తమ నిజ రూపములతో దృశ్యమాన మగుదురనియు,  మత్స్యరాజ్యమునకు వారివలన శుభము కలుగుననియు పల్కి రాణిని ఒప్పించే ప్రయత్నము చేసి సఫలికృతురాలైనది.  అంతేకాదు తన పతులు

 

“కృత మెఱఁగుదు రుపకార

వ్రతమున వర్తింతు రెపుడు వదలరు కరుణా

న్వితు లీనరపతికి శుభ

ప్రతిపాదకు లగుదు రేమిభంగుల నైనన్”                                                             (విరాట III-63)

 

అనగా సుదేష్ణ సమ్మతించింది.  సైరంధ్రి వాజ్నైపుణ్యము మరొక మారు ఆమె ఉనికిని రక్షించింది.  ఆమె మాటల్లోని నిజాయితి, ఋజుత్వం, కృతజ్ఞత సుదేష్ణను మాటాడనీయలేదు.

ఉత్తర గోగ్రహణ సందర్భములో సైరంధ్రిగా ద్రౌపది రెండుమార్లు తటిల్లత వలె తళుక్కున మెరిసి సందర్భోచితంగా హితవులాడుటేగాక రెండుమారులు విరాటుని రాజ్యానికి మేలుజరిగే మాటలే చెప్పినది.

సారధిని అన్సేషిస్తున్న ఉత్తరుని మాటలు విని, బృహన్నల సూచన ననుసరించి ఉత్తర నొప్పించి ఉత్తరునితో బృహన్నల సారధ్య వైశిష్ట్యము నుగ్గడించింది. బృహన్నలను గూర్చి చులుకనగా మాటలాడిన ఉత్తరునితో బృహన్నల పరాక్రమాన్ని గుఱించి ఇట్లన్నది.

 

“కౌరవసేన గాదు త్రిజగంబులు నొక్కట నెత్తివచ్చినం

దేరు బృహన్నలావశగతిం జరియించిన గెల్వవచ్చుఁ ద

ద్వీరగుణంబులొంపు పృథివీవరనందన ము న్నెఱుంగుదుం

గారణజన్మ మై తనువికారము వచ్చినఁ బెంపు దప్పునే

(విరాట IV-22))

సమయోచిత సంభాషణాచాతుర్యం సైరంధ్రి సొత్తు. సూటిగా, స్పష్టంగా సహృదయ రంజకంగా సాగే ఆమె వచనాలు ప్రపుల్ల కిరణాలు.

ఉత్తరగోగ్రహణ సందర్భములో కౌరవులను గెలిచిన బృహన్నలను ప్రశంసిస్తున్న కుంకుభట్టుని విరాటుడు దురుసు తనముతో తన చేతిలోని పాచిక విసిరి గాయపరచినప్పుడు ద్రౌపది మెరుపలా భర్త వద్దకు వచ్చి తనపైటతో ఆయన రక్తాన్ని అద్ది, తన అరచేతిని నీటితో తడిసి, ఆ తడిచేత్తో గాయాన్ని తుడిచింది. రక్తపు బొట్టు నేలరాలకుండా జాగ్రత్తపడింది.  తన చేతకు కారణం విరాట రాజుకు స్పష్టంచేసింది.

 

“విమలవంశంబునను బుణ్యవృత్తమునను

వఱలునీతనిరక్తంబు వసుమతీశ

ధరణిపై నెన్నిబిందువుల్ దొరఁగె నన్ని

వర్షములు గల్గు నింనావర్షభాయము”                                                                                 (విరాట V-261)

 

అంతేకాక “ఉత్తమ ద్విజలోహితపాతం బెట్లునుం గీడు కావున నీకు నొక హాని పుట్టుటకు జాలక యిబ్భంగించేసితి’ నన్నది. మరల అదే కృతజ్ఞత ఆమె మాటలలో తమకాశ్రయమిచ్చిన రాజు నిరాశ్తయుడు కారాదను సద్భావమామె మాటలలో స్పష్టముగా వ్యక్తమగును. ధర్మజుని నుదుట ప్రవిస్తున్న రక్తాన్ని తుడుస్తూనే ఉన్నది  అజ్ఞాతవాసం ముగిసే చివరి క్షణాలలో కూడ ఆమె బహిర్గతము కాలేదు. సమయ స్ఫుర్తితో సమయానుకూలంగా తన చేతను సమర్థించుకున్న తీరు పఠితులను ముగ్ధులను చేస్తుంది.  తనను ఎన్ని కష్టాల కల్లోలాలు కలవరపరచినా తనవారితో పాటు తాను అజ్ఞాతవాస నియమాలను సక్రమంగా సమర్థవంతంగా పాటించి సమయ పాలన చేసిన ద్రౌపది సైరంధ్రిగా చిరస్మరణీయురాలు. ఆమె రూపములోని సౌదంర్యమెంత విశ్వమోహనమో, ఆంతరంగిక సౌందర్యమంతకన్నా అద్భుతమైనది.

పంచ మహాపతివ్రతల్లో స్థానం సంపాదించుకున్న ద్రౌపది తక్కినవారికన్నా బిన్నమైన జీవితాన్ని గడిపి అద్వితీయమైన వనితగా వాసికెక్కినది. ఈమె వ్యక్తిత్వం నేటివారికి సైతము ఆదర్శమే. ప్రతి మహిళ సమస్యలను సమయస్పూరితో సమయానుకూలంగా సరియైనరీతిలో సమన్వయించుకుని, అవసరమైనచో ధైర్యంగా ఎదిరించి పోరాడే మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండాలని సైరంధ్రిగా ద్రౌపది హెచ్చరిక. ఒక మాహామహిమాన్వితమైన మహిళను ఇన్ని సుగుణాల సమాహారంగా మన కనుల ముంది నిలిపి మనస్సును, బుద్ధిని పరమళింపజేసిన ఉభయ కవిమిత్రుని ఋణం తెలుగుజాతి తీర్చుకోలేనిది.

 

*   *   *   *   *

2 thoughts on “సైరంధ్రి (నవపారిజాతం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *