April 28, 2024

మాతృస్వామ్య రాష్ట్రం మేఘాలయ

రచన: పి.యస్.యమ్. లక్ష్మి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల హక్కుల పోరాటంకోసం మొదలయినా తర్వాత తర్వాత అనేక దేశాలలో అనేక విధాలుగా జరుపుకుంటున్నారు.  దానికి కారణం ఈ పోరాటం మొదలయినప్పటికీ, ఇప్పటికీ మహిళల పరిస్ధితుల్లో కొంత మార్పు రావటం, మహిళలకు ప్రాముఖ్యం పెరగటమే.  అయినా మహిళలు తమ పురోభివృధ్ధిలో సాధించాల్సింది ఇంకా ఎంతో వున్నది.

అయితే ఈ మహిళా దినోత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం లేనివాళ్ళు కూడా వున్నారంటే నమ్ముతారా   అదీ మన దేశంలో.   నమ్మి తీరాలండీ.  ఎందుకంటే….

అసలు మన దేశంలో అనాదికాలంనుంచీ మహిళలని చాలా గౌరవించారండీ.  దీనికి ఉదాహరణ పరమ శివుడే.  ఆయనంతటివాడు శక్తి లేనిదే తాను లేనని ఆ పరాశక్తిని సగభాగంగా ధరించాడు కదా.  అలాగే త్రిమూర్తులనే పసిపాపలుగా చేసినవారూ, సూర్యగమనాన్నే ఆపినవారూ, రాజ్యాలు ఏలి రాణించినవారు, కవులుగా మహాఖ్యాతి బడసినవారూ, అత్యంత మేధావులూ, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాలలోనూ ఆరితేరిన మహిళలు పూర్వ కాలంలోనే వున్నారు.

మరి మన దేశంలో మహిళా దినోత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం లేనివాళ్ళున్నారన్నాను కదా.  పురాణ కధలు చెబితే మీరు నమ్మరని నాకు తెలుసు.  అందుకే నేను చూసిన విషయాలే మీకు చెబుతాను.  మీకూ తెలుసుకోవాలని వున్నదికదా.  మరి చదవండి.

వాళ్ళెక్కడ వున్నారంటే సెవన్ సిస్టర్ స్టేట్స్ గా పేరుపొందిన ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన మేఘాలయలో.  మేఘాలయ చూడాలని, పేరుకు తగ్గట్లే కిందనుంచే వెళ్ళే మేఘాలతో నిండి వుంటుందని, ఇంచక్కా మనమీద నుంచి వెళ్ళే మేఘాలతో ఆడుకోవచ్చని ఎంతో సరదాగా వెళ్ళాము.  కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది .. అలా ఆడుకోవాలంటే వర్షాకాలమో, శీతాకాలమో రావాలని.  మేము వెళ్ళిందేమో ఏప్రిల్ లో.  అప్పుడు వెళ్ళటంవల్ల హైదరాబాదు ఎండలనుంచీ ఓ వారం రోజులు విముక్తి పొందాము.  అక్కడ వాతావరణాన్నికూడా తట్టుకోగలిగాం.  అదే వర్షాకాలమో, శీతాకాలమో అయితే అక్కడి వాతావరణం తట్టుకోగలమో లేదో.
మేఘాలయలో వేసవి కాలం మార్చినుంచీ జూన్ దాకా, వానాకాలం జూన్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ దాకా, చలికాలం నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా.  చలికాలంలో ఉష్ణోగ్రత 2 డిగ్రీలుంటుందిట.

1972 ముందు మేఘాలయ అస్సాం రాష్ట్రంలో భాగంగా వుండేది.  అప్పుడూ షిల్లాంగే రాజధాని.  1972 జనవరి 21నుంచి మేఘాలయ ప్రత్యేక రాష్ట్రమయింది.  షిల్లాంగ్ మేఘాలయకి మాత్రమే రాజధానిగా ఏర్పడింది.  మేఘాలయ రాష్ట్రం లో మూడు వంతులు అటవీమయం.  తూర్పున ఖాసీ, జైంతియా, పశ్చిమాన గారో పర్వత శ్రేణులున్నాయి.   వీటన్నింటికన్నా ఎత్తయినది షిల్లాంగ్ పీక్.  రాష్ట్రం మొత్తం ఖాశీ, గారో అనే రెండు కొండల వరసలమీద వున్నది.  అందుకనే  ఎత్తు పల్లాలుగానే వుంటుంది.  కొండ ప్రాంతంగనుక గిరిజనులు ఎక్కువ వుంటారు.  వారిలో జైన్ట్యా, ఖాసీ, గారో ముఖ్యులు.  ఈ జాతులవారే ఈ రాష్ట్రానికి మొదట వలస వచ్చినవారు.

గౌహతినుంచి షిల్లాంగ్ వరకు రోడ్డు మార్గమొక్కటే వున్నది.   ఆ  దోవలో జోరాబట్ నుంచి కొంత దూరం రోడ్ కి అటువైపు మేఘాలయ, ఇటు వైపు అస్సాం అని డ్రైవర్ గారిచ్చిన సమాచారం. ఒకే రోడ్డుమీద రెండు రాష్ట్రాల మధ్యనుంచీ వెళ్ళటం  .. అదో ధ్రిల్.

ఆడవాళ్ళకి ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే…మేఘాలయ మాతృస్వామ్య రాష్ట్రం.  అంటే ఇక్కడ ఇంటి పెద్ద తల్లి.  మనం అమ్మాయి పెళ్ళి చేసి అప్పగింతలు పెడుతూ తెగ బాధ పడిపోతాము.  అక్కడ ఆడపిల్ల తల్లిదండ్రులకా బాధ వుండదు.  అబ్బాయే పెళ్ళయిన తర్వాత కలిసి జీవించటానికి అమ్మాయి ఇంటికొస్తాడు.    అలాగే ఉద్యోగం, వ్యాపారం వగైరాలన్నీ స్త్రీలే చూసుకుంటారు.  అక్కడ ఇంటి బాధ్యత పురుషులదే.  పిల్లలకి తల్లి ఇంటి పేరు వస్తుంది.  భలే బాగుంది కదూ.

ఈ రాష్ట్రంలో టూరిస్టుల సందర్శనార్ధం అనేక జలపాతాలూ, గుహలూ, పార్కులూ లాంటి ప్రదేశాలు వున్నా, మహిళా దినోత్సవ సందర్భంగా కనుక నేను ఇప్పుడు చెప్పబోయేది స్త్రీల కధలతో ముడిపడిన కొన్ని ప్రదేశాల గురించే.  ఇందులో మొదటిది….

lake
బారాపానీ లేక్, షిల్లాంగ్
షిల్లాంగ్ పట్టణానికి 15 కి.మీ. ల ముందే ఈ  సరస్సు వస్తుంది.  విశాలమైన ఈ సరస్సు ఇక్కడి పిక్నిక్ స్పాట్.  ఇక్కడ కయాకింగ్, బోటింగ్, వాటర్ సైక్లింగ్ లాంటి ఎడ్వంచర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చెయ్యచ్చు.  ఇక్కడ ఫ్లోటింగ్ రెస్టారెంటు కూడా వున్నది.  పర్యాటకులు ఈ లేక్ కి దగ్గరగా వుండాలనుకుంటే  దీనికి సమీపంలో ఆర్చిడ్ టూరిస్ట్ హోం వున్నది. ప్రకృతి రామణాయకతతో విలసిల్లే ఈ సరస్సు గురించి ఇక్కడివారు చెప్పుకునే కధ ఈ సరస్సు ఒక దేవత కన్నీటితో ఏర్పడిందని.
ఆ కధేమిటంటే స్వర్గంలో వున్న దేవతలలో ఇద్దరు అక్క చెల్లెళ్ళు వుండేవాళ్ళు.  వాళ్ళు ఒకసారి మేఘాలు దోబూచులాడే మేఘాలయ అందాలు చూడాలనుకుని స్వర్గం నుంచి దిగి మేఘాలయ వచ్చారు.  ఆ వచ్చే దోవలో అక్క చెల్లెళ్ళల్లో ఒకరు కనిపించకుండా పోయారు.  ఒకావిడ మాత్రమే మేఘాలయ చేరుకున్నది.  కనిపించకుండా పోయిన తన సోదరి కోసం మేఘాలయ వచ్చిన సోదరి అమితంగా దుఃఖించింది.  ఆ కన్నీరే ఈ సరస్సుగా మారింది.
షిల్లాంగ్ లోని చూడవలసిన ప్రదేశాలలో దీనిని కూడా ముఖ్యంగా చెబుతారు. దీనినే ఉమియమ్ (కన్నీరు) లేక్ అని కూడా అంటారు.  టూరిజం డిపార్టుమెంటు వారు దీనిని ఇంకా అభివృధ్ధి పరచి పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నంలో వున్నారు.

నోకాలికాయ్ ఫాల్స్ (NOHKALIKAI FALLS), చిరపుంజి

nokalia falls
ఇది ప్రపంచంలోనే నాల్గవ పొడవైన జలపాతం.  ఈ జలపాతం 1100 అడుగుల ఎత్తునుంచి పడుతుంది.  ఈ జలపాతం దూరం నుంచయినా చాలా అందంగా వుంటుంది.  ఎండాకాలంలో కూడా నీరుంది.  వానాకాలమయితే నీరెక్కువగా వుంటుంది.  అయితే మబ్బులు, మంచు వల్ల కొన్నిసార్లు ఈ దృశ్యం సరిగ్గా కనబడదంటారు.  వీటి దగ్గరకి వెళ్ళటం  టూరిస్టులందరికీ కష్టం. అయితే వీటన్నింటికీ కాకపోయినా కొన్నింటికి దగ్గరగా వెళ్ళచ్చు.   దాని గురించి ప్రత్యేకించి ప్రణాళిక వేసుకుని, అవసరమైన రిజర్వేషన్స్ చేసుకుని వెళ్ళాలి.

ఈ జలపాతానికి ఈ పేరు రావటానికి ఒక విషాద భరితమైన కధ వుంది.  పూర్వం ఇక్కడ లికాయ్ అనే పేరుగల యువతి వుండేది.  ఆవిడకి ఒక కూతురు.  ఆవిడ కొన్ని కారణాలవల్ల రెండో పెళ్ళి చేసుకుంటుంది.  ఆవిడకి కూతురంటే వున్న ప్రేమని చూసి రెండో భర్త సహించలేక పోతాడు.  మన దగ్గర సవతి తల్లిలాగా.  ఒక రోజు లికాయ్ పనికి వెళ్ళినప్పుడు (మేఘాలయ మాతృస్వామ్య దేశమని గుర్తుందికదా) ఆవిడ రెండవ భర్త ఆవిడ కూతురిని చంపి మాంసాన్ని భోజనంలోకి వండుతాడు.  లికాయ్ ఇంటికి వచ్చాక కూతురి గురించి అడిగితే తనకి తెలియదు అని చెప్తాడు భర్త.  కూతురుని వెతకటానికి వెళ్ళేముందు ఉదయంనుంచి పని చేసి రావటంతో ఆకలి తట్టుకోలేక భోజనం చేస్తుంది.  తర్వాత కూతురి వేళ్ళు అక్కడ ఒక బుట్టలో చూస్తుంది.  విషయం గ్రహించి, బాధ భరించలేక అక్కడున్న కొండపైనుంచి దూకి మరణిస్తుంది.  అప్పటినుంచి ఆ జలపాతానికి నోకాలికాయ్ అంటే లికాయ్ దూకిన జలపాతం అనే పేరు వచ్చింది.

అక్కడినుంచి బంగ్లాదేశ్ లోయలు కూడా కనబడతాయి.  జలపాతం చూద్దామని కొంచెం ముందుకు వెళ్ళిన నా సెల్ ఫోన్ లో వెల్ కం టు బంగ్లాదేశ్ అని వచ్చింది.

అక్కడ చిన్న చిన్న షాపులున్నాయి.  మిగతా వస్తువులతోబాటు అక్కడ కనిపించినవి తేజ్ పత్తా (బిరియానీ ఆకు), దాల్చిన చెక్క (పొడుగు కర్రల్లా వుంటే ఏమిటని అడిగితే చెక్క అని తెలిసింది) అమ్ముతున్నారు.  మేము ఒక చిన్న పేకెట్ బిరియానీ ఆకు పది రూపాయలకు తీసుకున్నాం.  ఇవతల ఇంకో షాపులో తమిళుల గ్రూప్ వచ్చారు వాళ్ళు పెద్ద ప్లాస్టిక్ కవర్ నిండా తీసుకున్నారు పత్తా.  ఎంత అంటే 20 రూ. అని చెప్పారు.  మరి మాలాంటి వాళ్ళకోసమే ఇన్ని వివరాలు చెప్పేది.

7 సిస్టర్స్ ఫాల్స్, చిరపుంజి

seven-sisters-fall
7 సిస్టర్స్ ఫాల్స్ వ్యూ పాయింట్ నుంచి  సన్నగా పైనుంచి పడుతున్న ఒక ఫాల్ దూరంగా కనబడింది.  పక్కనే ఇంకోటి వుందా అనిపించింది.  వర్షాకాలం బాగుంటుందిట  అక్కడి దృశ్యం.   బాగా వర్షాలు పడుతున్న సమయంలో పక్క పక్కనే జలపాతాలు కనబడతాయి.  అందుకే వాటిని 7 సిస్టర్స్ ఫాల్స్ అంటారు.

షిల్లాంగ్ దాకా వెళ్ళినవాళ్ళు చిరపుంజి కూడా చూడండి.  షిల్లాంగ్ నుంచి ఉదయం వెళ్ళి సాయంకాలానికి వచ్చెయ్యచ్చు.  అత్యధిక వర్షపాతంపడే ప్రదేశంగా గిన్నిస్ బుక్ లోకి కూడా ఎక్కిన చిరపుంజి ఈ మధ్య ఈ రికార్డులో కాస్త వెనకబడుతోందిట.  మేమున్న ఆరు రోజుల్లో అక్కడ కొంచెం సేపు చిన్న వర్షమేగానీ పెద్ద వానలేమీ లేవు.  దాని మూలంగా దూరంగా వున్న జలపాతాలు, ప్రకృతి దృశ్యాలు కూడా బాగా కనిపించాయి.  మబ్బులు వుంటే ఇవి సరిగా కనబడవు.

చిరపుంజిలో మేము చూడలేదనుకున్నది అక్కడివారు చెట్ల వేళ్ళతో వంతెనలు అల్లుతారు.  దీనికోసం 10, 15 సంవత్సరాలు పడుతుందిట.  అయితే ఇవి వందల సంవత్సరాలపైన దృఢంగా వుంటాయి.  వాళ్ళు ఇప్పటికీ ఉపయోగిస్తున్న ఇటువంటి ఒక వంతెన వయసు 500 సంవత్సరాల పైనేనట.

చిరపుంజిలో అధిక వర్షం కురిసినా తాగునీటికి ఇబ్బందే.  ఇక్కడవారు తాగునీటికోసం ఎన్నో మైళ్ళు వెళ్ళాల్సి వుంటుందిట.  అడవులు భారీగా ఆక్రమణకు గురికావటంతో విస్తారంగా పడే వర్షాల కారణంగా మట్టి పై పొరలు కొట్టుకు పోతుంది.  దాంతో ఈ అడవుల్లో నీటి పారుదలకు తీవ్ర విఘాతం ఏర్పడుతుంది.

ఈ ప్రదేశాలకి వివిధ సమయాలలో వెళ్తే వివిధ అనుభూతులు పొందవచ్చు.  అన్నీ చూస్తూ సరదాగా గడుపుదామనుకునేవాళ్లు వేసవికాలం వెళ్ళండి.  జలపాతాల సౌందర్యాన్ని ఆస్వాదిద్దామనుకునేవాళ్ళు వర్షాకాలం వెళ్ళి తడిసి ముద్దవ్వండి.  మేఘాలతో ఆడుకోవాలనుకునే వాళ్ళు, ఒణికించే చలిలో సరదాగా ఒణుకుదామనుకునే వాళ్ళు చలికాలం వెళ్ళండి.

గౌహతిలోనూ, షిల్లాంగ్ లోనూ హోటల్స్ వివిధ రేట్లల్లో దొరుకుతాయి.  ఆహారం కూడా బాగానే వుంటుంది.  ఎటొచ్చీ ప్రయాణం సమయమే చాలా పడుతుంది.  గౌహతిదాకానే రైలు మార్గం  వుంది.  అక్కడ  నుంచి  మేఘలయ అంతా రోడ్డు మార్గమే.  సర్కారువారి బస్సులు, పేకేజ్ టూర్లు, ప్రైవేటు టూర్ ఆపరేటర్ల టూర్లతోబాటు టాక్సీలు, మినీ టాక్సీలు, సుమోలు వగైరాలు లభ్యమవుతాయి.

4 thoughts on “మాతృస్వామ్య రాష్ట్రం మేఘాలయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *