May 7, 2024

ప్రమదాక్షరి ఉగాది జ్ఞాపకాలు..

ugadi

ఫేస్బుక్ లో ప్రమదాక్షరి సమూహం ద్వారా పరిచయమైన మహిళా రచయితల ఉగాది జ్ఞాపకాలు ఈ విధంగా ఉన్నాయి..

నండూరి సుందరీ నాగమణి
“అమ్మా, రేపు ఏం పండగ?”
“సంవత్సరాది తల్లీ…”
“అంటే ఏంటి?”
“కొత్త సంవత్సరం అన్న మాట.”
“మరి మా టీచర్ ఉగాది అని చెప్పారు?”
“చంటీ, ఈపండుగను అలా కూడా అంటారురా…” నాన్న.
“నాకు కొత్త గౌను అందుకేనా?”“అవునురా, రేపస్సలు అల్లరి చేయకూడదు. చక్కగా దేవుడికి దణ్ణం పెట్టుకొని, ఉగాది పచ్చడి తినేసి, ఎవరితోనూ ఏమీ అనిపించుకోకుండా, సంతోషంగా ఉండాలి.” నాన్న.
“ఎందుకు?”
“ఎందుకంటే, ఏడాదిలో మొదటిరోజు మనం ఎలా ఉంటే ఏడాది అంతా అలాగే గడుస్తుంది గా మరి?”
“ఓహో…”
మర్నాడు – “ఇదేమిటీ, ఉగాది పచ్చడి ఇలా ఉంది? అన్నంలో కలుపుకునే రోటి పచ్చడి లా ఉండదేమీ?” నా సందేహం.
“పచ్చడి అంటే రోటిలో రుబ్బిందే కాదురా, దీన్ని కూడా పచ్చడి అనే అంటారు” సర్ది చెప్పింది అమ్మ.
అలా మొదలైంది నా ఉగాది పండుగ. రెండో తరగతో, మూడో తరగతో చదువుతున్నప్పుడు తెలిసింది ఈ పండుగ గురించి మొదటి సారి నాన్న నోట.
ప్రతీ ఉగాదీ ఎంతో చక్కగా గడిచేది. ఉదయమే అమ్మతో బుద్ధిగా కుంకుడు పులుసుతో తల అంటింపించుకొని, కొత్త డ్రెస్ వేసుకొని, అమ్మ చేసిన ఉగాది పచ్చడి తినేసి, అమ్మతో పులిహోర, పూర్ణం బూరెలు చేయించుకునే దాన్ని. అసలు పచ్చడి చిన్న గిన్నె తో ఇస్తే సరిపోయేది కాదు. అందుకని అమ్మ శాస్త్రానికన్నట్టు కాకుండా కాస్త పెద్దగిన్నె తోనే చేసేది. రెండేసి సార్లు తినేదాన్ని. తమ్ముడు కూడా అంతే.
కొంచెం పెద్ద అయ్యాక, ఉగాది పచ్చడి కోసం, వేపపువ్వు వలిచి, బెల్లం తరిగి, కొత్త చింతపండు పులుసు తీసి, అరటిపండు ముక్కలు చేసి, కొబ్బరి చిన్న ముక్కలుగా తరిగి, మామిడికాయ చెక్కు తీసి ముక్కలు చేసి, చిటికెడు ఉప్పేసి, అన్నీ నేనే గిన్నెలో కలిపి పచ్చడి చేసేదాన్ని.
ఇప్పటికీ నేను చేసే ఉగాది పచ్చడి బాగుంటుంది. చెంచాతో తీసుకుని తినేలా [ఫ్రూట్ సలాడ్ లా] ఉంటుంది. కావాలని కొంచెం వేపపువ్వు తక్కువే వేస్తా! నా దగ్గర తమ్ముడు నేర్చుకుని, ఇప్పుడు వాడు చేసే పచ్చడి తోనే వాళ్ళింట్లో ఉగాది మొదలు అవుతోంది.

సుజల గంటి
ఉగాది ప౦డగ- ఏ ప౦డగైనా అమ్మ తల౦టు పోసేది. ఎక్కువమ౦ది పిల్లల౦ కదా! నా దగ్గరకొచ్చేసరికి అ౦దరూ పెద్దవాళ్ళయిపోయారు.నేను ఆఖరన్నయ్య అమ్మకు చిక్కేవాళ్ళ౦. సాయ౦కాల౦ కు౦కుడుకాయలు కొట్టి నానబెట్టమనేది శెషక్కయ్యను. నాకు మా అమ్మ తల౦ట౦టే భయ౦. భయ౦ ఎ౦దుక౦టారా వేడివేడి నీళ్ళు పోసేది ఒళ్ళు కాలిపోయి పెరడ౦తా పరుగెట్టేదాన్ని అది తప్పి౦చుకు౦దుకు. అదేమిటో ఆవిడ వేడిలేదనేది నాకు వేడిగా ఉ౦డేవి. కు౦కుడుకాయ రస౦ కళ్ళల్లో పడి మ౦డేది.( మనలో మన మాట. కళ్ళుమూసుకోమ్మా అ౦టే మూసుకోకపోతేను కళ్ళల్లో పడదూ!) తల౦టు ప్రహసనమయ్యాక స్నాన౦ చెసిన వె౦టనే ఉగాది పచ్చడి తినాల౦టూ అసలు పచ్చడి చెయ్యమని అక్కకు చెపితే అది చేసే లోపల కాస్త వెప పువ్వు చి౦తప౦డు, బెల్ల౦ముక్క కలిపి నాకు అన్నయ్యకూ నోట్లో కుక్కేది. ఆ పైన ఆకలికి ఆగలేమని, మా ఇద్దరికీ చద్దన్న౦ తరవాణి వేసి పెట్టేది (అప్పట్లో టిఫినీలు లేవుగా) కడుపు ని౦డా చద్దన్న౦ తినేసి, కొత్త గౌను తొడుక్కుని, ఆటలకు వీధిలోకి పరుగు. అమ్మ స్నాన౦ చేసి,మడి కట్టుకుని, పొయ్యి వెలిగి౦చేది. పనె౦డయ్యాక అమ్మ చేసిన పరవాణ్ణ౦, గారెలు కమ్మని వ౦టలు అ౦దరూ తినేవారు.అమ్మ పూజ టైమ్ కి అక్క ఉగాది పచ్చడి చేసేది. నేనెప్పుడూ తినేదాన్ని కాను. పొద్దున్న తిన్న వెప పువ్వు చేదు ఇ౦కా నోట్లో ఉ౦డేది. అది ఇ౦చక్కా అమ్మ చెసే సేమ్యా పరవాణ్ణ౦,లేకపోతే బెల్ల౦ పరమాణ్ణమో ఇ౦చక్కా తినేదాన్ని.

చిన్నప్పట్ని౦చీ నాకు తీపి చాలా ఇష్ట౦. అ౦దులో పరమాన్న౦ అ౦టే మరీను.మా పెద్దన్నయ్య దగ్గరకు వెళ్ళాక మా అన్నయ్య కూతురు నా ఈడుదే దానికి తీపి ఇష్ట౦ ఉ౦డేది కాదు. దాన్ని బతిమాలి దాని కోటా కూడా నేనే తినేసేదాన్ని.అమ్మ మధ్యాహ్న౦ కాస్సెపు నడు౦ వాల్చి, సాయ౦కాల౦ గుళ్ళొ ప౦చా౦గ శ్రవణానికి వెళ్ళేది. తొమ్మిదేళ్లొచ్చాక అప్పుడు అన్నయ్య దగ్గర మెదక్ లో ఉ౦డేవాళ్ళ౦. సాయ౦కాలమే పనిమనిషి కళ్ళాపి చల్లితే నేను, మా మేన కోడలు కలిపి ఇ౦ట్లోనూ బైటా ముగ్గులు పెట్టేవాళ్ళ౦. సాయ౦కాల౦ స్కూల్ ని౦చి వస్తూ దోస్త్ లతో కలిసి వెప పువ్వు, మామిడి పి౦దెలూ చెట్లెక్కి కోసుకొచ్చేవాళ్ళ౦. తెల్లారాక తల౦ట్లు పోసుకున్నాక వదిన సహాయ౦ తో నేను ఉగాది పచ్చడి చెయ్యడ౦ నేర్చుకుని నేనే చేసేదాన్ని.ఆ తరువాత ఆ పచ్చడి చెయ్యడ౦లో చాలామెలకువలు నేర్చుకున్నాను. అస్సామ్ లో మాకు వేప పువ్వు దొరక్కపొతే వేపాకులే పచ్చడిలో వేసేవాళ్ళ౦. ఇ౦కా ఉన్నా తీపి జ్ఞాపకాలు స్థల౦ లేదుగా అ౦దుకని రాయట౦ లేదు. మీరెప్పుడైనా చిల్లి గారెలు కరకరమ౦టూ౦టే వేలికి తొడుక్కుని తిన్నారా
! హద్దిరబన్నా దాని రుచేవేరు ఈ సారి ట్రై చెయ్య౦డి అ౦దులో కూడా మూడు పెట్టుకుని ము౦దు కాస్త ముక్క కి౦దది మళ్ళి పైది అలా తినాలన్న మాట.

ఉగాది, ఏంటో ఏమిగుర్తురావడము లే దు. వచ్చింది ,వచ్చింది. అరటిపళ్ళు , చెరకుగడ , బెల్లం, చింతపండు, అన్ని కొని పడమటి ఇంటిలో పేట్టారు అమ్మ. వేపపువ్వు
సరే సరి.శుబ్రం గా బాగు చేసి చాట లో ఉంచారు.
మన పిల్ల సైన్యం ఒక్కక్కరే వాటిని చూడటము నోరు ఊరించుకొడము.
ముందు ఉగాది పచ్చడి తిని తలంటు పోసుకున్ టానని మారము చేసే దానిని. అందరి తలంట్ల కార్యక్రమము అయ్యే లోపు పచ్చడిఐపోతుందని భయము. పిల్లలని మా వంట సూరమ్మ గారు కాస్త బెల్లం ఎక్కువ వేసే వారు. మరి ఉగాది షట్రుచులు
ఏమో కాని ,అమ్మని విసిగించి మొత్తానికి ఒక గ్లాస్ ఉగాది పచ్చడి,ఎవ్వరు చూడకుండా అమ్మ పేట్టి న రెండు తిని ఆనందించినట్లు చాల గుర్తు. ఉగాది రోజు ఏమి చేస్తే అదంతా సంవత్సరము మొత్తము చేస్టారు అని అందరు ఆ రోజుబుద్హిగా వుండ్ద్వారు. మనము ఎంచక్కా
పచ్చడి తో పాటు తిన్నవి సంవత్సరమంతా తినే వారము. నా బాల్యం అంత మధురం. టామ్ గర్ల్. సంధ్య .

కమల పర్చా
మా అమ్మాయి పెళ్ళికాగానే , అమ్మాయి అల్లుడు అమెరికా వెళ్ళిపోయారు..ఏడు సంవత్సరాల తరువాత ఇద్దరు పిల్లలతో హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు.వాళ్ళు వచ్చిన నెలకే ఉగాది పండుగ వచ్చింది.ఏదో ఆషాడపట్టీ అని , పుట్టినరోజని, పెళ్ళిరోజని బట్టలు పోస్ట్ లో పంపటమేకాని పాపం అల్లుడికి ఏ ముచ్చటా అచ్చటా తీర్చలేదు అని నేను తెగ ఫీలైపోయి అల్లుడిని , అమ్మాయిని పండగకు పిలుద్దామండీ అని నేను చెప్పగానే, మావారు ఒప్పేసుకున్నారు. అల్లుడి కోసం మంచి నూనె, కుంకుడుకాయలు సిద్దం చేసి , మా పనివాడు రామయ్యకు అల్లుడికి చక్కగా నూనె మర్ధన చేసి తలంటాలి అని చెప్పి, రాత్రే వచ్చేయండి ఎంచక్కా తలంటల కార్యక్రమం కూడా పెట్టుకోవచ్చు అన్నాను మా అమ్మాయితో.లేదమ్మా నాకు రాత్రంతా కాల్స్ వున్నాయి , పొద్దున్నే వస్తాములే అన్నది.హుం ఏంచేస్తాను . ఇంతలో మా అమ్మాయి కాల్ చేసి అమ్మా మీ అల్లుడికి నువ్వుచేసే దోసకాయపప్పంటే ఇష్టం.రేపు చేయమని నీకు చెప్పమన్నాడు అంది.వాకే డన్ అనేసాను.మార్కెట్ కు వెళ్ళి మంచి దోసకాయలు ఏరి తెచ్చాను. మరి అలుడా మజాకా!ఇల్లంతా కడగటం ముగ్గులు పెట్టటం రెండురోజుల క్రితమే ఐపోయింది.మనవరాలికి పసుపు రంగుకు ఎర్రంచు పట్టులంగా , మనవడి పట్టు జుబ్బా ముందే కొనేసాను.సరే అల్లుడి కీ అమ్మాయికీ కూడా బట్టలు సిద్దం!పండుగ రోజు పొద్దున్నే మామిడాకులు కోసి గుమ్మాలకు కట్టి, ఓ రెండు మామిడికాయలూ , వేపపువ్వు మండలూ కోసుకొచ్చి పెట్టాడు రామయ్య. ముందు రోజు నుంచి పోరుతుంటే తీరిగ్గా కోసుకొచ్చాడు.హేమండీ . . . హేమండీ . . . ప్లీజ్ ప్లీజ్ అని తెగ బతిమిలాడితే మావారు పాపం వేపపువ్వు చక్కగా మండల నుంచి వేరు చేసి , ఏరి పెట్టారు.ఎంతైనా మా ఆయన బంగారం కదా!భోజనాలయ్యాక అల్లుడి , అమ్మాయికీ పంచాగం చదివి వినిపిస్తానని ముచ్చటపడిపోయి ఆయన పొద్దున్నే వెళ్ళి పంచాగం కొనుకొచ్చుకున్నారు.పట్టుబట్టలు కట్టుకొని విభూది రాసుకొని సిద్దంగా వున్నారు.అల్లుడడిగిన దోసకాయపప్పు,అమ్మాయి కి ఇష్టమైన గుత్తివంకాయకూర,మామిడికాయపచ్చడి,పొట్లకాయపెరుగుపచ్చడి ,ముక్కలపులుసు,పులిహోర,పాయసం,బక్షాలు చేసాను.
పిల్లలొచ్చారు.పట్టుపరికిణీలో మనవరాలు ఇల్లంతా పరుగులు పెడుతుంటే ఇంటికి పండగ సందడి వచ్చింది. పట్టుజుబ్బాలో గున గునా పాకుతూ బుజ్జిగాడు ఎంత ముదొస్తున్నాడో!పూజ , నివేదనా ఐపోయింది.
ఉగాది పచ్చడి తీసుకొని అల్లుడి దగ్గరకు వచ్చాను. అతను లేచి నిలబడి భక్తిగా చేయి పట్టాడు. నేను అంత కన్నా భక్తి గా ఉగాది పచ్చడి కొద్దిగా వేసాను
మా అమ్మాయి టెన్షన్ గా చూస్తోంది.
అల్లుడుగారు మరీ భక్తి గా కళ్ళకద్దుకొని నోట్లోపోసుకున్నాడు. . .
అంతే వాక్ మంటూ నోటికి చేయి అడ్డం పెట్టుకొని వాష్ బేసిన్ దగ్గరకు పరిగెత్తాడు.వాటీజ్ దిస్ ప్రసాదం ఇంత చేదుగా వుందేమిటి? అని ఇంగ్లీష్ లో ఆక్రోశించాడు!అవును మరి అతనికి మన ఉగాది పచ్చడి గురించి తెలీదు ఎందుకంటే అతను కన్నడిగ!
నేనూ, మావారు నిశ్చేష్టులమయ్యాము.కొద్దిసేపు నిశబ్ధం* * *
అందరమూ తేరుకొని డైనింగ్ టేబుల్ దగ్గర చేరాము. వేడి వేడి అన్నం కంచం లో వేసి దోసకాయపప్పు వడ్డించాను అల్లుడుగారికి.ఆయనా ప్రసాదం చేదులో నుంచి తేరుకొని పప్పు అన్నం లో కలుపుకొని నోట్లో పెట్టుకున్నాడు.
అల్లుడిగారికి ఇష్టమైనది వండి వడ్డించాను అని నేనూ సంతోషం గా ఆయనగారి వైపు మెప్పుకోలు కోసం టెన్షన్ గా చూస్తున్నాను.
ముద్ద నమిలి నా వైపు దీనంగా చూసాడు. తల తిప్పి భార్య వైపు , మామగారి వైపు చూసి లేచాడు. . .
వాష్ బేసన్ వైపు వెళ్ళి నోరు శుభ్రంగా కడుక్కొని వచ్చాడు మళ్ళీ ఏమొచ్చిందిరా దేవుడా అని . మేమంతా అలా చూస్తూ వుండిపోయాము. మావారు దోసకాయ పప్పు కలుపుకొని , ముద్ద నమిలి గబుక్కున వెళ్ళి వుమ్మేసి వచ్చి,”దోసకాయ చేదు చూడకుండానే పప్పులో వేసావా? పప్పంతా చేదు విషం.” అన్నారు కోపంగా!
“నైవేద్యం పెట్టేవి ముందుగా రుచి చూడకూడదు కదా అందుకని చూడలేదు. సారీ బాబూ.”గొణిగాను.
ఆ తరువాత ఏ కూరైనా ఎవరో వకరు రుచి చూసాకే అతను కంచం లో వేసుకున్నాడు!మొత్తానికి భోజనం ముగిసింది. ఆ తరువాత ఉగాది పండగ లో తరువాతి కార్యక్రమం పంచాంగ శ్రవణం అని మావారు ఉషారు గా పంచాంగం తీయగానే ” సారీ అంకుల్ నాకు మీటింగ్ వుంది వెళ్ళాలి.” అని మా అమ్మయి ఇదేమీ కష్టమైన ప్రోగ్రాం కాదు అని చెబుతున్నా వినకుండా నువ్వు తరువాతరాలే అని హడావిడిగా వెళ్ళిపోయాడు!
పంచాంగం మావారివైపు దీనంగా, మావారు నావైపు కోపంగా , నేను గోడ వైపు అభావంగా . . .
ఇక చెప్పేందుకేముంది? అప్పటికీ , ఇప్పటికీ మా అల్లుడుగారు ఉగాది రోజు మా ఇంటి చుట్టుపక్కలకు కూడా రారు ఉగాది పచ్చడి పెట్టము అని వాగ్దానం చేసినా. . .

ఉమాదేవి
చైత్రము కుసుమాంజలి
ప్రభవతో మొదలై అక్షయతో ముగిసే తెలుగువత్సరాలలో ఇరవైతొమ్మిదవ మన్మథనామ సంవత్సరానికి ప్రమదాక్షరి కుహూరవాలతో స్వాగతం పలకమని ఆహ్వానించినవారికి,
ఆలోచనకు పుటంపెట్టి మా మనసులోని జ్ణాపకాలను తట్టిలేపిన వారికందరికీ మన్మథనామ సంవత్సర శుభాకాంక్షలు.ఇక నా జ్ఞాపకాల తోటలోకి నాతోపాటు మీరు నడవండి మరి.
ఉగాది పండుగనగానే బాల్యంలో ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది అమ్మచేతి కమ్మనైన పిండివంటలు. పండుగనగానే అమ్మ,అమ్మమ్మ సూర్యుడితో పోటీపడేవారు. దినకరుడు లోకాన్నవలోకిస్తే అమ్మమ్మ వంట ఇంటిలోకి, అమ్మ పూజగదిలోకి తొంగి చూసేవారు.ఇక బూరెలు,గారెలు,పాయసమో, పరమాన్నమో ప్రసాదంగా దేవుడిముందుకు చేరేవి. నాన్న కొనిచ్చిన కొత్తబట్టలు రాత్రంతా కలల్లో మురిపించి మరిపించేవి.అందుకే మరికాసేపు నిద్రపోవాలని ఉన్నా పండుగ హడావిడి చెవినబడగానే లేచి తలస్నానం కానిచ్చి గబగబా తయారయేవాళ్లం నేను,మా అక్క!ఆ రోజుల్లో టి.విలు లేవు.వారానికో సినిమా ఆనవాయితీ కూడా కాదు.ఇక రేడియోలో పంచాంగశ్రవణం. మధ్య మధ్యలో పలకరించే వార్తలు.చక్కటి ఆపాత మధురాలు. మామిడాకుల తోరణాలు.పూలదండల తూగుటూయలలు!
కొత్తబట్టల రెపరెపల ఆహార్యం,పసందైన ఆహారం! ఇంతకు మించిన ఆనందమేముంది ఆనాటి బాల్యానికి?మా ముఖాలలో ప్రతిఫలించే ఆనందాన్ని చూచి నాన్న గుంభనంగా నవ్వుకునేవారు. అమ్మ, అమ్మమ్మ చిరుచెమటలను ఆనందంగా ఆస్వాదిస్తూ అన్నీసిద్ధం చేసేవారు. పూజ కాగానే వేపపూత,తురిమిన బెల్లం, మిరియాలపొడి లేదా కారం,ఉప్పు,మామిడికాయ ముక్కలు,కొత్త చింతపండు కలగలిసిన ఉగాది పచ్చడి చేతిలో పడగానే గుటుక్కున మింగేసేవాళ్లం.వెంటనే కళ్లు దేవుడిముందున్న ప్రసాదంవైపుకు మళ్లేవి. అమ్మమ్మ అమాయకంగా నవ్వినట్లు అనిపించినా చిద్విలాసమే ఎక్కువ కనపడేది.పరమాన్నంలో చిన్నపాటి గరిట పెట్టేలోగానే చెయ్యి చాపేసేవాళ్లం.నాలుక మీది చేదును తియ్యని పరమాన్నం మాయం చేసేది.
ఆనాటి ఉగాది ఆనందహేల, చైత్రమాసపు అతిథి కోయిలల రాగమాలిక! అప్పటి తీపిగురుతులను మనసునుండి తవ్వితీసినపుడు ఆనందంతోపాటు అమ్మనాన్నలిక కనపడరన్ననిజం ఉగాది పచ్చడిలోని చేదులా కలుక్కుమనిపిస్తూనే ఉంటుంది. కాని ఉగాదిపచ్చడి సమవర్తిలా కష్టసుఖాలను సమభావంతో చూడమంటుందనేది నిజంకదా! సంతోషానికి గుర్తుగా తియ్యదనాన్నిచ్చే బెల్లం,విషాదాన్ని తెలిపే చేదైన వేపపువ్వు,కోపానికి సంకేతం కారం,భయాన్ని తెలిపే ఉప్పు,విసుగును ప్రదర్శించే పులుపు, ఆశ్చర్యానికి వగరైన మామిడి!ఇదీ ఉగాదిపచ్చడి అంతరంగం.అందరికీ ఉగాది శుభాకాంక్షలు.

1

సుజాత తిమ్మన
“మళ్ళి ఉగాది ..”
“ఎల్లుండే ఉగాదండి.. చింత పండు..కొత్త బెల్లం…కొత్త కుండ ..మామిడికాయ..” అంటూ సరుకుల జాబితా చెపుతూ అమ్మ చాటలో బియ్యం ఏరుతూ ఉంది…
“అవునవును..పాపకి మంచి గౌను కూడా తీసుకోవాలి..” వరండాలో పడక కుర్చీలో కూర్చున్న నాన్నగారు గుర్తుచేసుకున్నారు..
అక్కడే తాతయ్య వలిచి ఇచ్చిన బత్తాయి తొనలను అపురూపంగా తింటూ..”ఉగాది అంటే ఏంటి నాన్నగారు?”.అన్నా…కొత్త గౌను వస్తుందన్న సంతోషంతో..
“మనం తెలుగు వాళ్ళం కదా….సంవత్సరానికి మొదటగా వచ్చే నెల చైత్రం..ఆ నెల మొదటి రోజున మనం పండగ చేసుకుంటాం..ఆ పండగనే ఉగాది అంటాం…రా పాపడు..” అని వివరంగా చెప్పారు నాన్న..
“ఓహో..”అనుకున్నా ..అప్పుడు నాకు ఐదేళ్ళు ఉండచ్చేమో!
“లేమ్మా పాపా..! పండగ పూట పొద్దున్నే లేవాలమ్మా..” అంటూ అమ్మ మేలుకొలుపు, ఆపై శీకాయతో తలంటి స్నానం…
పెరట్లోని వేప చెట్టు నుండి పువ్వులున్న కొమ్మలను కోయించి తెచ్చారు నాన్న. అందులోనుండి పూరేకులను జాగ్రత్తగా విడదీస్తూ…తాతయ్య.. ( అసలు ఆయనకి ఎంత ఓపికో అని ఇప్పుడనిపిస్తూ ఉంటుంది.)
కొత్త కుండలో ఉగాది పచ్చడి కలుపుతూ ఉన్న అమ్మ దగ్గర చేరి, “అదేంటమ్మా కుండలో చేస్తున్నావు?” అనడిగా విస్మయంగా.
మామిడి కాయ ముక్కల్ని చిన్నగా కత్తిపీటతో తరుగుతూ..” ఇది ఉగాది పచ్చడమ్మా! చేదు, ఉప్పు, కారం, పులుపు, తీపి, వగరు కలగలిసిన ఆరు రుచులతో తయారుచేస్తాము. కొత్త సంవత్సరం మొదలు కాబట్టి..ఇలా కొత్త కుండలో కలుపుకుంటాం…దేవుడికి నైవేద్యం పెట్టి పూజచేసి మనం తీసుకోవాలి.” చెప్పింది అమ్మ..
“మామిడికాయ పులిహోర..పూర్ణం పోళీలు…ఆహా! అమృతం ..ఉగాది పచ్చడి..”
మమకారాల మేళవింపుల ఆ “ఉగాది” మళ్ళీ మరుజన్మకి కూడా నా దరి చేరాలని ప్రార్ధిస్తూ

2

కామేశ్వరీదేవి చెల్లూరి
భానుమతి గారు,బాల్యంలోని ఉగాది ముచ్చట్లు రాయమనగానే,నేను నా బాల్యంలోకి వెళ్ళిపోయాను.కానీ,కాగితం మీద పెట్టడానికి ఇంత టైం పట్టింది. కారణం నేను రచయిత్రిని కాను కనుక మీతో కలిసి రాయడం పెద్ద సాహసమే నాకు smile emoticon
మొదటిగా నాకు గుర్తొచ్చింది మా ఇల్లు. 12 గదులున్న విశాల భవనం. చుట్టూ పెద్ద తోట. అరుగు మీద పడక్కుర్చీలో దర్జాగా పడుకుని అందరికీ ఆర్డర్లు వేసే మా నాన్నగారు.
ఉగాదికి ముందు రోజే,అమ్మ పెరట్లోని గోరింట ఆకుల్ని కోసి తెమ్మని. బాగా పండడానికి,కావిరి వేసి,మెత్తగా రుబ్బి ,
నాకూ,మా అక్కకి ,చెల్లాయలికి గోరింతాకు పెట్టేది. కాళ్ళకు,చేతులకీ కూడా పెట్టేసేదేమో , అన్నిటికీ అమ్మనే వేపుకు తినే
వాళ్ళం. మర్నాడు ఎర్రగా పండిన చేతుల్ని చూసుకుని మురిసిపోవడం నాకు గుర్తే . ఆ గోరింట సువాసన కూడా నాకు చాల ఇష్టం. ఇప్పుడు ఈ కోన్స్ లో ఆ సువాసనే ఉండదు. ఉన్నా అన్నిరోజులు ఉండదు.
తెల్లారగట్టే నీళ్ళ కాగు పెట్టి,మమ్మల్ని లేపేసేది అమ్మ.కొత్త బట్టలు గుర్తొచ్చి,చటుక్కున్న లేచేదాన్ని నేను.కుంకుడు కాయల్నిమందార ఆకుల్ని ,మెత్తగా ఘూటం తో చితగ్గొట్టి,వేడి నీళ్ళతో,నానబెట్టి తెచ్చుకుంటే ,అమ్మ తలంటు పోసేది . ఫస్ట్ నేనే కొత్తబట్టలు వేసుకుని రెడీ అయిపోవాలి అన్నమాట . పెరట్లోని చెట్లవే మామిడి కాయలు, అరటిపళ్ళు,కొబ్బరి ముక్కలు ,వేప పువ్వులతో , చెరుకు ముక్కలు,బెల్లం ,కొద్దిగా ఉప్పు ,చింతపండు పులుసులో కలిపి పెద్ద గిన్నెడు ఉగాది పచ్చడి చేసేది అమ్మ. అమ్మ చేత్తో ఏది చేసినా మధురమే. మళ్లీ మళ్లీ అడిగి తినేదాన్ని నేను.
నాన్నగారు కట్టించిన మామిడి తోరణాలతో ,బంతి పూల దండలతో,వంటింట్లో పిండివంటల సువాసనలతో , పండగ వాతావరణంతో ,ఇల్లు కలకలలాడిపోతూ ఉండేది.

3

నాగలక్ష్మి కర్రా
“పాపా లేవాలి నీళ్ళుమరిగిపోయేయి , మురళీ (పాప నాలుగో అన్నయ్య)గాడు ముందు తలంటు కుంటాడుట” . నాన్నగారి మేలుకొలుపు తో కళ్ళు నులుముకుంటూ లేచింది పాప . ఇంకా చీకటి గానే వుంది బయట . నలుగురు అన్నయ్యలు ,అమ్మ,నాన్న అందరు లేచిపోయే రు. పాపే లేటు . గబగబా పరుగెత్తి నట్లుగా నీళ్ళ కుండి దగ్గరకి వెళ్లి బ్రష్షు మీద పేష్టు వేసుకొని పళ్ళు తోముకొని పరుగెట్టుకొని వంటింట్లోకి వెళ్ళింది పాప. అమ్మ పౌడర్ పాలతో కాఫీ కలుపుతోంది నాన్నగారికి . “ఇప్పుడేం పాలు తాగకూడదు యివాళ ఉగాది తలంటు పోసుకొని కొత్తబట్టలు కట్టుకొని దేవుడికి దణ్ణం పెట్టుకొని ఉగాది పచ్చడి తిన్నతరువాతే పాలు ” మామిడి కాయని శ్రద్దగా తరుగుతూ అన్నాడు మురళి . “నేనేం పాలకోసం రాలే వంటలోకి “పాపకి ఉక్రోషం వచ్చింది. “పాప చిన్నపిల్ల పాలుతాగొచ్చు మురళిగాడికి ఏమి తెలీదు నువ్వు పాలు తాగెయ్యి ” పెద్దన్నయ్య నాని వూరడింపు . “నీకెమ్ తెలీదు నాని పాలు తాగగానే తలంటు పోసుకుంటే కడుపు నొప్పెడుతుంది కదూ నాన్నగారు “. మామిడి ముక్కలు తరగడం అయిపోగానే కొబ్బరి ముక్కలు తరుగుతూ అన్నాడు మురళి . “అమ్మా పాపకి నీళ్ళు తోరిపి పెట్టేను రెండు బకెట్లు . మళ్ళ పొయ్యిలో కొత్త కర్రలు పెట్టేను ఆరెండు బకెట్లు అయిపోగానే ఈ నీళ్ళు కూడా వేడెక్కుతాయి “. పాప రెండో అన్న తంబి కేక పెట్టేడు పెరట్లోంచి . “నేను కుంకుడు పుల్ల తీసి కుండి గట్టుమీద పెట్టేను ” పాప మూడో అన్నయ్య రాము .
అమ్మ పాపకి నూనె రాసి నలుగు పెట్టి ఆ చిరు చిరు చలిలో వేడినీళ్లు పోసింది . “మురళీ పాపకి నీళ్ళు పాళంగా వున్నాయో లేదో చూడు ” నాన్నగారి మాట పూర్తి కాకుండానే రివ్వుమని వచ్చి నీళ్ళల్లో చెయ్యి పెట్టి చూసి “సమంగానె వున్నాయి నాన్నగారు ” అన్నాడు మురళి .
“చలేస్తోందా ? “అని అడుగుతూ ఉ అంటే వేడినీళ్ళు చెంబుతో పోస్తూ తలంటు అయ్యేంతవరకు పక్కనే నిలబడే వున్నాడు తంబి . అన్నయ్యలని పేర్లు పెట్టి పిలవడ మే అలవాటు పాపకి .
కొత్తగౌను బుట్టచేతులది అమ్మే డిజైను చేసింది కొత్త రిబ్బన్లు ,కొత్త గాజులు పట్టుకొని రాము పాప కోసం ఎదురు చూస్తున్నాడు.
” కంట్లో కుంకుడు పుల్లపడిందా ? ”
“లేదు నాన్నగారు ” కొత్త గౌను కట్టుకుంటూ పాప సమాధానం .
“ఏది నీ గోరింట చేతులు చూపించు యెలా పండిందో చూడనీ ” కొత్త గాజులు వేసుకొని నాన్నగారికి గోరింట చేతులు చూపించింది . “ఏది నన్ను చూడనీ నన్ను చూడనీ ” అన్నయ్యలు అందరు ఒకేసారి పాప చేతులు చూడడానికి యెగబడ్డారు చ “నాన్నగారు పాప చేతులు బాగా పండే యండి ,పాప గాజులు బావున్నాయండి” .
” ఆడపిల్లని అంత ముద్దు చెయ్యకూడదు రేపు అత్తారింటికి వెళ్ళవలసిన పిల్ల అక్కడ ఈ ముద్దులుండవు ,ఇలాగేనా పెంచుతారు ఆడపిల్లని అని కోర్రులు కొడతారు ” అమ్మ విసుగు
రేపెక్కడికో వెళ్తాము కాబోలు అనుక్కుంది పాప
మురళి ఉగాది పచ్చడి పాప చేతిలో వేసేడు రాము , తంబి , నాని మిరపకాయ ముక్కలుగాని వేపపువ్వ్వుగాని లేకుండా మరొక్కమారు వెతికి ఇంకా పచ్చడి తినమని అనుజ్ఞ యిచ్చేరు .మురళి ముందే అవేవి పాప చేతిలో పడకుండా జాగ్రత్త పడ్డాడు .
కొత్తబట్టలు కట్టుకొని వీధిలో అందరికి చూపించి వాళ్లిచ్చిన సంపెంగలు , జాజులు , తలలో తురుము కొని తిరిగి యింటికి వచ్చి చూస్తే అమ్మ చెంబు పట్టుకొని వీధి గదిలో కూర్చొని , వంటింట్లో తంబి పులిహార కలుపుతూ , మురళి బూరెలు దేవుతూ కనబడ్డారు (ఉగాదికి బూరెలు, పులిహోర చేసేవారు ఎందుకంటే పాపకి అవే ఇష్ఠమ్ ) నాని కాఫీ గిన్నెలు కడుగుతున్నాడు ,రాము ఇల్లు వుడుస్తున్నాడు . అంటే అమ్మ = నాని+ తంబి+రాము+మురళి+ పక్కింటావిడ . ఎందుకంటె పాపకి జెడలు వెయ్యాలిగా . పాపకి మా అమ్మే జడలు వెయ్యాలి అంటే మా అమ్మే వెయ్యాలి అని పక్కింటి ‘నెప్పు’ ఎదురింటి ‘డడ్డూలూ ‘పోటీ పడేవారు .వాళ్ళ యింట్లో నలుగురేసి మొగపిల్లలే . ప్రతి పండుగా యించు మించు గా యిలాగే జరిగేవి . “పాపకి తలంటి కొత్తబట్టలు వేస్తె ఇంటికి పండగొస్తుంది ” అనేవారు నాన్నగారు .
అప్పుడు పాపకి వయస్సు మూడు,మురళీకి యేడు , రాముకి తొమ్మిది , తంబికి పదకొండు, నానికి పదమూడు .
యాభై అయిదేళ్ల నన్ను తిరిగి మూడేళ్ళ పాపగా మార్చిన భానక్కకి కృతఙ్ఞతలు.

4

భారతీ ప్రకాష్
” తల్లి మనసు”
నాకు ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు. మొదటినుంచీ నేనెక్కువ పని చెయ్యననే అభిప్రాయం మావాళ్ళందరకీ ఉండేది. కాని నా పెళ్ళయి వచ్చాక, మా అత్తగారి దగ్గర చాలా చాలా నేర్చుకున్నానని మా వాళ్ళు అందరూ అంటూ ఉండేవాళ్ళు. మా అక్కలు, చెల్లెలు కూడా నేను మా అత్తగారిని, మామగారిని చాలా బాగా చూసుకుంటానని మా అమ్మ, నాన్నగార్లతో చెప్పేవారు. కానీ మా అమ్మ గారు అంత నమ్మినట్లు ఉండేవారు కాదు. మా నలుగురు అక్కచెల్లెళ్ళం హైదరాబాదు లోనే ఉండడంతో మా అమ్మగారూ, నాన్నగారూ తరచుగా ఇక్కడకి వస్తూ ఉండేవారు. నేను ఎన్నిసార్లు మాఇంట్లో ఉండమని అడిగినా, వాళ్ళు మా ఇంట్లో ఉండేవాళ్ళు కాదు. దానికి నాకు పని రాదని ఒక వంకయితే, నేను ఉద్యోగానికి వెళ్ళిపోతాననేది ఇంకో కారణం. బతిమాలగా, బతిమాలగా ఒక సారి ఇక్కడకి వచ్చినపుడు మాఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు. అది కూడా నెల్లాళ్ళకోసం. ఇంక నా సంతోషానికి అడ్డులేదు. వాళ్ళు మాఇంట్లో ఉంటారనేది ఒక కారణమయితే, నాకు కూడా పని చాలా వచ్చు అని నిరూపించుకోవడానికి నాకొక చక్కని అవకాశం దొరికిందనేది ఇంకొక కారణం. మా అమ్మగారు ముందే నా దగ్గర ఒక ప్రామిస్ తీసుకున్నారు. అది ఏమిటంటే, .. “నేను మా అమ్మ, నాన్నగార్లని నా అత్తా, మామగార్లలాగా చూసుకోవాలి.” అని.
మొదటి వారం రోజులూ మా అమ్మనన్ను గమనిస్తూ ఉండిపోయారు. ఒక రోజు చూడడానికి వచ్చిన మా మామయ్య కూతురుతో మా అమ్మగారు, ” మాభారతి వాళ్ళాయనకి అన్నమే పెట్టదు.” అన్నారు. ఒక్కసారిగా నాకు మతిపోయింది. ” అమ్మా! అలా అనకమ్మా, అందరూ నిజమనుకుంటారు. ఆయనకి చపాతీలిష్టమని అవి చేసి పెడ్తాను ఆయనకి. ” అని నేనంటే మా కజిన్‌ తో సహా అంతా నవ్వుకున్నాము.
రెండోవారం లో మా అమ్మగారికి నామీద (నా ఉరుకులు, పరుగులు చూసి ) జాలివేసి, ” మీరొట్టెలు, కూరలు మీ డబ్బాలకి కావలసినవి మీరు చేసుకోండి. మాకు ఏదైనా కూర నేను చేస్తానంది. ఇంతలో ఉగాది పండుగ వచ్చింది. మావారు బజారునుంచి, కూరలు, పళ్ళు, మామిడాకులు, తమలపాకులు, మామిడికాయ, వేపపూవు, పూజకి బోలెడన్ని పూలూ, కొత్త పంచాంగం (వెతికి మరీ పిడపర్తి వారిది … అంటే మేము పిడపర్తి వారం కదా ) అలా అన్నీ తెచ్చేసారు. (మావారు, శ్రీవారు, మామంచివారూ….అంటూ ఏమీ పాడలేదులెండి… ) ఇంక హడావుడి మొదలైంది. ముందురోజే పనిమనిషిచేత ఇల్లంతా దులిపించడం, కడిగించడంలాంటివన్నీ అయిపోయాయి. సరే… ఆరోజు పూజ, భోజనాలు అయ్యాక వంటిల్లు సర్దేసి, అమ్మవాళ్ళ రూములోకెళ్ళి కూర్చున్నాను. మా అమ్మ నాన్నగారితో చెప్తోంది. ” ఇది మన భారతేనాండీ, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పండుగ ఎంత బాగా చేసిందో చూసారా… ? మావిడాకుల, బంతిపూవుల తోరణాలూ, .. వంట.. ఎలా చేసిందో చూసారా… ఆబొబ్బట్లు… ఎంత బావున్నాయో.. ” అంటూ పొగుడుతోంది. నన్నుచూసి నాన్న” రా అమ్మా! మీ అమ్మ నిన్ను తెగపొగుడుతోంది.” అన్నారు. నేను నవ్వేసాను. మా అమ్మ అక్కడితో ఊరుకోకుండా … ఇక్కడ వుండి చూస్తే తెలుస్తోందే … అసలు అరవ చాకిరి అని మన వాళ్ళు అన్నది ఇందుకేనేమో … (మా అత్తగారూ వాళ్ళు అరవ్వాళ్ళులెండి) అదేమి వంటలే తల్లీ… అన్నింటికి రుబ్బిపెట్టాలా.. ? పైగా ఏ పండుగకి ఆ మెనూ కూడానా… అవే చెయ్యాలా… అలాగే చెయ్యాలా ? అంటూ ప్రశ్నలు వేస్తూనే వుంది. ఇంతలో మావారు పిలిచారు. వెళ్ళి, మళ్ళీ అమ్మదగ్గరకి వచ్చి,” అమ్మా! మా అత్తగారి దగ్గరకి వెళ్ళి వస్తాం. వచ్చాక కాఫీ కలిపి ఇస్తాను. కాసేపు పడుకోండి. ” అన్నాను. దానికి అమ్మ, ” కాస్త రెస్ట్ తీసికుని వెళ్ళమ్మా..అసలు ఇప్పుడెందుకు అక్కడకి ?” అంది. లేదమ్మా, ఆయన ఇప్పుడే వెళ్దామంటున్నారు. ప్రతీ పండుగకీ వెళ్ళి, పెద్దవాళ్ళందరకీ మొక్కి రావాలమ్మా..” అంటూ తయారయి వెళ్ళాము. వచ్చాక పంచాంగ శ్రవణం… ఆరోజంతా అలా అయిపోయింది.
అప్పటి నుండి అమ్మ ఎప్పుడూ నన్ను తల్చుకుంటూ, ” భారతి వాళ్ళ అత్తగారి దగ్గర అన్నీ నేర్చుకుని, అన్నీ వాళ్ళ పద్ధతిలో చేస్తోంది. ” అని అంటూ ప్రతి ఉగాదికీ వారం రోజులు ముందుగానే, నాన్నగారి వెనకాలపడి, ” అది పంచాంగానికి పూజచేసి, పంచాంగ శ్రవణం అంటూ మధ్యాహ్నం చదువుతుంది. ముందు దానికి పంపించండి. ” అంటూ ఆయన నాకు పంచాంగం పంపేదాకా ఊరుకునేదికాదు. అదే తల్లి మనసు. మర్చిపోలేముగా మరి..

5

మణి కోపల్లె
ఉగాది పండగ ముచ్చట్లు … అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడే! చిన్నప్పటి ఙ్ఞాపకాలు మా అమ్మ చేసే ఉగాది పచ్చడి. అందులో తీపు, పులుపు,చేదు ఉప్ఫు కారం వగరు అన్నీ ఉన్నా మేము జాగ్రత్తగా వేప పూలు తీసివేసే వాళ్ళం. చేదు లేని ఆ పచ్చడి తీయగా పుల్ల పుల్లగా, కారంగా తురిమిన మామిడి కోరు ఇలా ఎంతో బాగుండేది. ఉదయాన్నే లేచి మొహం కడుక్కుని గ్లాసు లో వేడి వేడి కాఫీ తాగి నా వంతు వచ్చి కుంకుడు కాయల రసంతో స్నానం … తలంటు స్నానం గంటసేపు నలుగు పెట్టి, కుంకుడుకాయ రసం కళ్ళలో పడి మండుతుంటే ఎర్రగా మారిన కళ్ళు మంట తగ్గటానికి గుడ్డని వేడి గాలితో ఊది కళ్ళమీద పెట్టుకునే వాళ్ళం… అదో తతంగం… పూర్తయ్యాక అందరం …ఉగాది పచ్చడి తినేవాళ్ళం. అసలు ఉగాది చిన్నపిల్లల పండగే … కొత్త బట్టలు కట్టుకోవడం, సినిమాలకి వెళ్ళడం. అంతే. ఇప్పటి లాగా పార్కులు, హోటళ్ళు లేవు. సినిమాలు పెద్ద ఎంటర్ టైన్ మెంట్. పండగ రోజు తప్పకుండా కాసేపయినా క్లాసు పుస్తకాలు చదివే వాళ్ళం. .ఇద్దరు అన్నయ్యలు, అక్కయ్య, ఇద్దరు చెల్లెళ్ళు అందరం కలిసి ఆరోజు సరదాగా గడిపేవాళ్ళం. పండగంటే ఆరోజు ఆటవిడుపు. ఏదో చేయాలి. కొత్తగా వుండాలి. కుదిరితే కొత్తబట్టలు కట్టుకుని ఆరోజు స్నేహితుల ఇంటికి వెళ్ళి ఆడుకోవడం చేసే దాన్ని.. మా వీథిలో సుజాత అనే అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం పిల్లలంతా కలిసి. ఎందుకంటే వాళ్ళింట్లో మాత్రమే పెద్ద గొలుసుల బల్ల ఉయ్యాల ఉండేది. అందరం కలిసి ఊగేవాళ్ళం. సమయం తెలిసేది కాదు.చిన్నపిల్లని కదా ఆ అమ్మాయిని చూస్తే గొప్పగా వుండేది. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. శంకర్ విలాస్ బిల్డింగ్ తో పాటు చుట్టుపక్కల చాలా మేడలు వారివే మా వీధిలో వారిదే పెద్ద ఇల్లు. పండగ కాని సెలవులకి కాని పిల్లలం అంతా వాళ్ళింట్లోనే మకాం. ఉగాది రోజు మా అమ్మ చేతి వంట కూటు, పులిహోర, పరమాన్నం ఎంతో రుచి… అసలు అమ్మ ఏది చేసినా భలే రుచి. ఇంకా ఎన్నో ఙ్ఞాపకాలు…. ఉగాది పచ్చ డిలో చేదు తప్పించి తినేదాన్ని. కాని ఇప్పుడు చేదులాంటి నిజం మా చిన్ననాటి స్నేహితురాలు మేము కలిసి ఆడుకునే సుజాత మరణించటం జీర్ణించుకోలేని చేదు నిజం. అందమైన ఙ్ఞాపకాల మధ్య ఇలాంటివి కూడా వున్నాయి.

6

మీనాక్షీదేవి చెరకువాడ
బాల్యం అనగానే ఎవరికైనా గుర్తు వచ్చేది ముందుగా అమ్మా, పండుగలూ… ఎందుకంటే మన చిన్నప్పుడు పండుగలకి ఆ ప్రత్యేకత ఉండేది…నాకు మాత్రం వాటితో బాటు మా అమ్మా..వదినా కలిసి పెట్టిన టార్చర్ కూడా గుర్తుకొస్తుంది…మరి తెల్లవార్ఝాము మూడింటికి లేపి తలంటు అంటూ కూర్చోబెడితే అదీ నా లాంటి కుంభకర్ణికి అది టార్చర్ కాదా మరి…ప్రతీసారీ ,ఇంట్లో ఎంతమంది ఉన్నా నేనే నా అంటూ పేచీ పెడితే…ఒకటే మాట నాది రుప్పజుట్టుట…రుద్దడానికి చేతులు పడిపోతాయట, బోలెడంత టైం , అరకేజీ కుంకుళ్ళు, రాగి డేగిశాడు వేడినీళ్ళు…ఇద్దరు మనుషులు…అందుకే అప్పుడు మొదలుపెడితే నా జుట్టుని ఉతికి,ఆరేసి,ఎండేసి…అది మళ్ళీ నా అధీనంలోకి రెండు పూలజడలుగా జడకుచ్చులతో వచ్చిపడేవి…మరి ఇప్పటిలా హైర్ డైయర్స్ లేవుగా…అందుకే అత్తా-కోడళ్ళిద్దరూ కూడబల్లుక్కుని నా పని పట్టేవారు…
నాకు అమ్మా, వదినా ఇద్దరూ గుర్తుకొస్తారు…మరి నా పదోతరగై వరకూ నేను మా అన్నావదినల దగ్గరే పెరిగాగా… అమ్మ మా అక్క ఉద్యోగం ఊళ్ళో దానికి ఎస్కార్ట్ గా ఉండేది దాని పెళ్ళి అయ్యేవరకూ. పండుగలకు మాత్రం వాళ్ళు కూడా మా దగ్గరకే వచ్చేసే వారు.
అలా పూల జడలేసుకుని…పట్టుపరికిణీ, బుట్టచేతుల జాగెట్టు, దండ వంకీ, మెడలో పిల్లకాసులపేరు, కాళ్ళకి ఘల్లు ఘల్లు గజ్జెలూ…అప్పుడు అసలు నడక తెలీదుగా ఎప్పుడూ పరుగే..తెల్లారేసరికి ఇలా తయారయి నేనూ…నా తోక మా తమ్ముడూ మా వీధిలోనే ఉన్న ప్రెసిడెంట్ గారింటికి వెళ్ళి వెపపువ్వు (పచ్చడికి) మిగాతా అన్ని రకాల పూలు పూజకి, చెరకు ముక్కా, మామిడి పిందెలూ, మామిడాకులూ గట్రా గట్రా తీసుకొచ్చేవాళ్ళం…అప్పటికి మా అమ్మ అందరి స్నానాలు గట్రా పూర్తి అయి తను మడికట్టుకుని ఉగాది పచ్చడి చేసేది…అయితే పూజ పూర్తయి ఆ పచ్చడి దేముడికి నివేదిస్తే కానీ మాకు పెట్టేది కాదు…అది తిని మా ఇంటి దగ్గరలో ఉన్న రామాలయం లో పంచాంగ శ్రవణం జరుగుతుంటే అక్కడకి వెళ్ళేవాళ్ళం…వినడానికి మాత్రం కాదు..అల్లరి చెయ్యడానికి, ఆడుకోడానికి…మళ్ళీ భోజనాల వేళకి ఇల్లు చేరడం…తిండికి తిమ్మరాజు…పనికి పోతురాజు అన్న మాట…అప్పట్లో పండుగనాడు పిండివంటల కంటే కూడా ఆ రోజు
మిఠాయి కిళ్ళీ కొనిపెట్టేవారు…దాని కోసం ఎదురుచూసేవాళ్ళం…
మిగతా రోజుల్లో బయటకు వెళ్ళనివ్వకపోయినా, ఉగాది, శ్రీరామనవమి, అట్లతద్ది రోజుల్లో మాత్రం ఆటవిడుపు…ఏదిఏమైనా ఆ బంగారు రోజులే వేరు…ఒక్కసారి మళ్ళీ వస్తే ఎంతబాగుంటుంది…ఆశ..దోశ…అప్పడం…వడ…పోనీలెండి ఆ రోజులు రాకపోయినా మీ పుణ్యాన ఆ జ్ఞాపకాలు వచ్చాయి అదే పదివేలు…మరి మీ అందరికీ నా ఉగాది..శుభాకాంక్షలు…ఉగాది అందరిదీ…శుభాకాంక్షలు మాత్రం నావి…మరి సెలవ్…విత్ లవ్.

7

జి.ఎస్.లక్ష్మి
ఉగాది ఉగాది ఉగాది
తలపుల నెలవుల సుధాబ్ధి
నా జ్ఞాపకాలలో ఉగాది గురించి చెప్పమన్నారు భానక్క. ఉగాదంటే యుగాదని అందరికీ తెలిసినదే. తెలుగుసంవత్సరం కాలగణనం ఆరంభం అవుతుందనీ, ఆరోజు యెలా గడిపితే ఆ సంవత్సరమంతా అలాగే వుంటుందనీ కూడా తెలుసు. ఉగాదిపచ్చడి, తలంట్లు, పండగపిండివంటలు మళ్ళీ మళ్ళీ ఆనందించే జ్ఞాపకాలే. కానీ, ఆ జ్ఞాపకాలలో నాస్వంతమైనది యేదైనా వుందా అనుకుంటూ ఒక్కసారి ఉంగరాల బొంగరాలు గింగిరాలు కొట్టేటట్లు రింగులు గిర గిరా తిప్పేసాను.
అదిగో..తెల్లని కాంతి వెనకాల అరుణ కిరణాలు. ప్రొద్దుతిరుగుడుపూవు ఒక్కొక్క రేకే విప్పుకుంటున్నట్టు చిన్నప్పటి జ్ఞాపకాలతెరలు ఒక్కొక్కటీ నా కనులముందు దృశ్యాలై కదులుతున్నాయి.
గూగుల్ మేప్ లో లాగా ముందు భూమండలం.. అందులో జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య వాయవ్యప్రదేశే, పవిత్ర గౌతమీ నదీతీరే, రాజమహేంద్రపట్టణే, దానవాయిపేటే.. ఆ ఆ అదిగో.. అదిగో కనిపించింది పార్క్..ఆ పార్క్ పక్కనే వున్న మావిడిచెట్టిల్లు..మొన్నీమధ్య వెళ్ళినప్పుడు కూడా చూసేను.. అలాగే వుంది ఆ యిల్లు. చుట్టూ చాలా యిళ్ళు బహుళంతస్తుల భవనాలయినా ఆ మావిడి చెట్టిల్లు మటుకు అలాగే వుంది.
ఆ యింట్లో ముందుగదే ఓ పెద్ద హాలంత వుంటుంది. అక్కడ నిలబడున్నాడు మా టైలర్ మల్లికార్జునుడు. ఆ వీధి చివర అరుగుమీదే అతను మిషన్ పెట్టుకుని వుండేవాడు. చిన్నప్పుడు బొమ్మలకి బట్టలకోసం అతను కత్తిరించి పడేసిన ముక్కలు అపురూపంగా తెచ్చుకునేవాళ్ళం.
అతని చేతిలో ఉగాది పండగకోసం మా అమ్మగారు కొన్న పువ్వుల పువ్వుల బట్ట వుంది. యెంచక్క గులాబీరంగుమీద ఎర్రటి పూలు. రేకులు పొడుగ్గా వుండి, చివర్న పసుపురంగుతో మెరుస్తుంటే, అక్కడక్కడ ఆకుపచ్చని ఆకులు వంకీలు తిరిగి యెంత బాగున్నాయో. ఆ బట్ట నాకోసమే తెచ్చారు మా అమ్మగారు. మురిసిపోయాను. కానీ అంతలోనే అంతులేని దుఃఖం. ఆ బట్ట కుట్టడానికి మా అమ్మగారు అంతకుముందు పండక్కి కుట్టించిన పరికిణీ, జాకెట్టూ ఆదికోసం యిస్తున్నారు. అంటే.. నామాట మా అమ్మగారికి లెఖ్ఖలేదన్న మాట. క్రితం పండక్కే చెప్పాను నేను. “నాకు పరికిణీ, జాకెట్టూ వద్దూ.. గౌనే కావాలీ..” అని. అప్పుడేమో..” సరే.. ఈసారి గౌనే కుట్టిస్తాలే..” అనేసేరు కదాని అప్పుడా పరికిణీ కట్టుకున్నాను. అక్కడికీ నిన్న చెప్పేను కూడానూ.. “నాకు గౌనే కావాలీ..” అంటూ.. “నీ మొహం.. ఏడేళ్ళొచ్చేయీ, ఇంక గౌన్లు బాగుండవ్. పరికిణీలే కట్టుకో..” అనేసేరు. అంటే.. ఈ పండక్కి కూడా గౌను కుట్టించరన్న మాట.
నాకు ఫ్రాకులంటే చాలా ఇష్టం. స్నోవైట్, సిండ్రెల్లా బొమ్మలకథలు చదివేసి, అందులో వాళ్ళు యెంచక్కటి లేసులతో అందమైన ఫ్రాకులు వేసుకోవడం చూసి, అవంటే యెంతో ఇష్టంగా వుండేది. అలాంటి ఫ్రాకులు వేసుకుని, గొప్పగా ఫీల్ అయిపోవాలని వుండేది. ఆరోజుల్లో ఫ్రాకులని గౌన్లనే అనేవారు.
ఇక్కడ పరిస్థితి చూస్తే ఈ ఉగాది క్కూడా పరికిణీయే కుట్టించేసేలా వున్నారు మా అమ్మగారు. నా ఆశ తీరదా.. కుచ్చుల కుచ్చుల గౌను నాకింక అందని ద్రాక్షేనా..దుఃఖం పొంగుకుని వచ్చేస్తోంది. నాకు యేంచెయ్యాలో తోచలేదు.
కాసేపు అదేపనిగా ఆలోచిస్తూ కూచుంటే అప్పుడు నా చిన్నబుర్రకి ఓ అవిడియా వచ్చిందన్నమాట. వెంటనే ఆ టైలర్ దగ్గరికి పరిగేఠుకుంటూ వెళ్ళిపోయి, ఆ పువ్వులబట్టతో మా అమ్మగారు రెండు గౌన్లు యే ఆదితో వస్తే ఆ ఆదికి కుట్టమన్నారని, ఇందాకా చెప్పడం మర్చిపోయేరనీ చెప్పి, ఆదికోసం ఇచ్చిన పరికిణీ జాకెట్టూ వెనక్కి తెచ్చేసి మా అమ్మగారికి కనపడకుండా దాచేసేను.
మామూలుగానే టైలర్ పండగముందు పదిసార్లు తిప్పించుకుని, ఉగాదిరోజు ఉదయాన్నే కుట్టినబట్టలు తెచ్చిచ్చేడు. ఇంకేవుందీ.. నా నిర్వాకం బయటపడిపోయింది. కానీ, ఉగాదికదా.. యేమీ అనలేదుకానీ, ఆ తర్వాత యెప్పుడు బట్టలు కొన్నా మా అమ్మగారు నామీద ఓ కన్నేసి వుంచేవారు.

8

ఉమాదేవి కల్వకోట
ఉగాది ముచ్చట్లు.
నాకు ముగ్గురమ్మాయిలు.ముగ్గురికీ ఉగాది పచ్చడంటే చాలా ఇష్టం.వాళ్ళు చిన్న గా వున్నప్పుడు పచ్చడి కొంచెంగా చేసేదాన్ని.మేము ఐదుగురమూ కొద్దిగా తిన్నాక,ఇంటికి ఎవరైనా వస్తే ఇవ్వడానికని కొంచెం అట్టే పెట్టేదాన్ని.ఎవరైనా వస్తే సరే, లేదంటే ఆ కొంచెం పచ్చడి కోసం ముగ్గురూ పోట్లాడుకునేవారు సాయంత్రం.ఎందుకొచ్చిన గొడవ అనితరువాత ఎక్కువగా చేయడం ప్రారంభించాను.ప్రొద్దున స్నానాలు చేసి తినేవారు.మళ్ళీ మధ్యాహ్నం,
సాయంత్రం వాళ్ళ ఇష్టమొచ్చినప్పుడల్లా గిన్నెల్లో వేసుకొని,స్పూనుతో ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళు.
చూస్తుండగానే ముగ్గురూ పెద్దవాళ్ళయిపోయారు.పెళ్ళిళ్ళయిపోయాయి.ఇద్దరమ్మాయిలు అమెరికా వెళ్ళిపోయారు.పెద్దమ్మాయి మాత్రం ఇక్కడే హైదరాబాద్లోనే వుటుంది.తను కూడా ప్రతీ ఉగాదికి,వాళ్ళ అత్తగారింటికి,
కాకినాడ వెళ్తుంది.ఇప్పుడు చిన్న గిన్నెతో ఉగాది పచ్చడి చేసినా మిగిలి పోతుంది.తినే వారెవ్వరు?లింగు,లిటుకు అంటూ..మేమిద్దరమే.పిల్లల చిన్నతనం
..మా ఒంటరితనమూ బాధగా అనిపిస్తుంది.అయితే బాధగా అనిపిస్తుంది.అయితే పెద్దమ్మాయి, అమ్మా!నువ్వు చేసేఉగాది పచ్చడి
మిస్సవుతున్నాను.ఎలాగూ పండగ తెల్లారే మేము వచ్చేస్తాము కాబట్టి
నా కోసం కొంచెం పచ్చడి తీసిపెట్టు, అంటుంది.అందుకని తన కోసం కొంచెం అట్టే పెడతాను.స్టేషన్ నుండి మా ఇంటికి వస్తే నువ్వు చపచ్చడి
నా కోసం కొంచెం పచ్చడి తీసిపెట్టు, అంటుంది.అందుకని తన కోసం కొంచెం అట్టే పెడతాను.స్టేషన్ నుండి మా ఇంటికి వస్తే తింటంది, లేదంటే పనమ్మాయికే.కష్టమైనా..సుఖమైన్నా పిల్లలతోనే
జీవితం…వాళ్ళతోనే ఆనందం .వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా వుంటే అదే పెద్ద పండగ.అదే తుత్తి.ఏమంటారు?

9

లక్ష్మీ వసంత
ఉగాది పండుగ దూసుకుని వచ్చేస్తోంది .. రాద్దాం రాదాం అంటూ మీన మేషాలు లెక్క పెట్టడం మానేసి ఇదిగో ఇలా రాద్దాం అని కూర్చున్నాను ..
మా ఇంట్లో పండగలంటే మా చిన్నతనం లో ముందు అందరి తలంట్లు ఓ పెద్ద హడావిడి ..నలుగురు ఆడ పిల్లలం ..ఇద్దరు మగ పిల్లలు ..అందరిళ్ళల్ళో లాగా పెద్ద పెద్ద పిండి వంటలు అవీ చేయడానికి మా అమ్మ కి ఇంక ఓపిక మిగిలేది కాదు ..
సులువుగా అయిపోయే పులిహోర పర వాణ్ణం ..ఇలాంటివి చేసి పెట్టేసేది ..ఎప్పుడూ ఇవేనా అని నాన్న గారు కాస్త రుస రుసలు చూపించినా , మరో మార్గం లేదు ..అని తేల్చి చెప్పేసేది .
ఇలా కుళాయి తిప్పితే ఇరవై నాలుగు గంటలు నీళ్ళూ కాదు కదా, అప్పుడు ఇంతమందికి నీళ్ళూ మోసి , వేడి నీళ్ళూ కాచి తలంట్లు అయేసరికే , తెల్లగా తెల్లవారి వంట కి సమయం అయిపోయేది ..ఇది కాక పూజ .అదేమిటో మరి ఇంత మంది ఆడ పిల్లలం ఉన్నా అమ్మ కి సాయం చేసే వారం కాదు ..అదేమి ముద్దో మాకు అలా జరిగిపోయింది ..మరి ..
ఇంక ఉగాది కి తప్పనిసరిగా కొత్త బట్టలు ఉండేవి ..ఏడాది కి మాకు ముచ్చట గా మూడు సార్లు కొత్త బట్టలుండేవి ..పెద్ద్ద పండగ కి ఉగాది కి ..పుట్టిన రోజులకి ..
ఉగాది రోజు ఉగాది పచ్చడి తినడం ఒక పెద్ద శిక్ష లా ఉండేది మాకు ..అప్పట్లో ఎందుకో చేదు అని నచ్చేది కాదు ..మా అమ్మ గారు చేదు గా ఉండదు ,ఈ సారి రుచి చూడండి అని ఓ చెంచా తో చేతిలో పోసేవారు ..కొంచం తింటే చేదు తెలియదని ..నాకు మటుకు ఆ వేప పూవు చేదంతా నాకే వచ్చేది అనిపించేది ..
ఉగాది రోజు ఏం చేస్తే ఆ ఏడాది అంతా అలా గే ఉంటాం అని మటుకు గట్టిగా నమ్మేవారం ..రోజంతా ఆటలు పాటలు తో గడిచి పోయేది ..పిల్ల లం కొట్టుకున్నా గట్టిగా ఏడుపులు అవి లేకుండా జాగ్రత్త పడేవారం ..లేకపోతే ఉగాది నాడు ఏడుపులు ఏమిటర్రా ? అంటూ అమ్మ కేకలేస్తుందని ..
నాకు ప్రత్యేకం గా ఒక్క ఉగాది అని వివరాలు గుర్తు రావటం లేదు ..పెళ్ళి అయాక ఉగాది పచ్చడి ఎలా చేయాలా ? అని దీర్ఘం గా ఆలోచిస్తూ బెంగ పడిన జ్నాపకం ఉంది ..
అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఎందుకు నేర్చుకోలేదా ? అని ..మా రెండో వాడు ,అమ్మా ఈ ఉగాది పచ్చడి రోజూ ఎందుకు చేసుకోరు ? అంటూ ఓ పెద్ద గిన్నె నిండా తాగేస్తూ అడిగినప్పుడు మటుకు చాలా సంతోషం వేస్తుంది ..
షడ్రుచుల ఉగాది పచ్చడి లెగసీ ని కాపాడుతూ ..మా పిల్లల వరకూ పంచాను అని .
మన పండగల విశిష్టత , మన తో నే అంతరించి పోతుందా ? అని అప్పుడప్పుడు బెంగ పుట్టినా , నిరంతరం కొనసాగుతుంది అని మరో నిశ్చింత మళ్ళీ రెప రెప లాడుతుంది ..ఉగాది పచ్చడి కి ఇంతకూ ఎవరైనా పేటేంట్ తీసుకున్నారా ? లేదా ? లేకపోతే నేనే ముందు తీసుకుంటాను ..ఎవరైనా కలుస్తారా మరి నాతో ? రండి రండి ..

10

వి.బాలామూర్తి
ఉగాది ముచ్చట్లు.
నా బాల్యం అంతా ఇతర రాష్ట్రాలలో నే గడిచింది. దసరా దీపావళి పండుగలు చేసుకున్నంత హడావిడి, ఉగాదికీ ఉండేది కాదు. మా అమ్మ ప్రతీ పండుగకు తనకు వీలున్నంతలో చేసేది. ఉగాదికి పచ్చడి చెయ్యడం, పిండివంటలు చెయ్యడం, మాకందరికీ కొత్త బట్టలు కుట్టి తోడిగేది. పండుగ ప్రాశస్త్యం మా నాన్నగారు తెలిపే వారు. ఉగాది అంటే మన కొత్త సంవత్సర ఆరంభం అనేది బాగా తెలుసు.
అందరూ వాళ్ళ వాళ్ళ ముచ్చట్లు రాసేస్తుంటే, నేను నా అనుభవం మీతో పంచుకుందామనిపించింది. మా పెళ్ళైన వెంఠనే వచ్చిన మా తొలీ ఉగాదికి, సెలవ లేదనీ మా వారు మా పుట్టింటికి బాంబే రాలేక పోయారు. నాకప్పటికి అహ్మదాబాద్కి ట్రాన్స్ఫర్ రాలేదు. మరుచటి సంవత్సరం ఉగాదికీ మేమిద్దరం ఆహ్మదాబాద్ లో మా తోలి ఉగాది జరుపు కున్నాం.
ఇద్దరం ఆఫీస్ కి సెలవ పెట్టేసాం. పొద్దుటే లేచి స్నానం పానం ముగించి, మడిగా వంట మొదలు పెట్టేసాను. ఉగాది పచ్చడికి కావలసిన సరంజామా అంతా ముందు రోజే అమర్చేసుకున్నం. వేంపువ్వు ఎక్కడా దొరకలేదు. అక్కడ పూత ఆలస్యంగా వస్తుందని తెలిసింది. ఏం చేయ్యడమాని ఆలోచించి లేత వేప చిగురు వేసి కల్వం లో వేసి కచ్చాబచ్చాగా దంచేసాను. కొంచెం కష్ట పడ్డా పచ్చడి బాగానే వచ్చింది. పులిహారా, పరమాన్నం తో వంట ముగించి, నైవేద్యం పెట్టి పచ్చడి తినేసాం. కొత్త బట్టలు కట్టుకొని, పక్కనే ఉన్న గుడికెళ్ళి దైవ దర్శనమ్ చేసుకొచ్చీ, భోజనం చేసేసాము.
అంతకు ముందే మా వార్కి తోలి బోనస్ 400/- రూపాయలు వచ్చింది. అది పెట్టి ఒక చిన్న గాడ్రెజ్ బీరువా, చిన్న బుక్ షెల్ఫ్ కొందామని అనుక్కున్నాము. పద వెళ్లి కొనుక్కొద్దామని అంటే ఇద్దరం బయలుదేరాం. బయటకు రాగానే బస్ వస్తూ కనిపించింది. పరిగెత్తు కుంటు వెళ్ళి ఎక్కేసాము. లోపల చాలా మంది నిల్చున్నారు. నేను దారి చేసుకుంటూ ముందుకీ వెళ్ళేను. ఈయన టికెట్ తీసుకుని మున్డుకోచ్చేపటికి నెక్స్టట్ స్టాప్ దగ్గర పడింది. దగ్గరకొచ్చి పద పద దిగుదాం అనీ నా చెయ్యి పట్టుకుని లక్కేళ్ళారు. ఏమైందంటే చెబుతా పద ముందరకి అనీ ఆటో స్టాండ్ కేసి లాకెళ్ళారు. ఆటో ఎక్కేక మెల్లిగా అసలు విషయం చెప్పేరు. ఏమిటో మీరూహించ గలరా!? ఆయన హిప్ పాకెట్ లో పెట్టుకున్న పర్సు, ఎవడో కొట్టేసాడు! ఇంకేముంది మొహాలు వేలాడేసుకుని ఇంటికి చేరుకున్నాం. ఇదండీ మా ఉగాది ప్రహసనం. ముచ్చట్లనలేమేమో కదు…..!

11

మణి వడ్లమాని
ఉగాది అనగానే నాకు చాలా చిన్నతనం లో జరిగిన సంగతి ఒకటి బాగా గురుకు వస్తుంది.. మేము నాన్నగారి ఉద్యోగ రీత్యా మద్రాసు లో ఉండే వాళ్ళము. అక్కడ నుండి కొత్తగా ట్రాన్స్ఫర్ అయి కాకినాడకు వచ్చాము. రాజమండ్రి లో మా మేనత్త ఉండేవారు.మా మేనత్తగారి భర్త పెద్ద పేరు మోసిన ప్లీడరు.వారిది పెద్ద ఉమ్మడి కుటుంబం కూడా. ఆయన తమ్ముడు కూడా ప్లిదరే.. వారింటికి బోలెడు మంది చుట్టాలు,వస్తూ ఉండేవారు.
మా అత్తయ్య పిల్లల తో చిన్న చిన్న చిలిపి తగాదాలు వస్తూ ఉండేవి. అందు లో భాగం గా ఒకటి సముద్రం గొప్పది అని నేను, లేదు మా గోదావరే గొప్పది అని వాళ్ళు అంటూ ఉండేవారు. ఇంకొక్కటి మాకు మద్రాసు లో బాగా శీకాయి పొడి అలవాటు తలంటు కోవడానికి.ఇక్కడ వీళ్ళకేమో కుంకుళ్ళు అలవాటు.
అసలు సంగతి కి వస్తున్నా. అమ్మవాళ్ళు మా పెద్ద తమ్ముడుకి తలనీలాలు ఇవ్వడం కోసం మద్రాసు వెళ్లారు. నన్ను మా చెల్లెలిని రాజమండ్రి లో మా మేనత్త ఇంట్లో దింపారు. అప్పట్లో మొత్తం కుటుంబం వెళ్ళడం అంటే డబ్బు ఉండాలి కదా! ఇంకా ఉగాది నాలుగు రోజులులలో ఉంది. మా దగ్గర కొత్త బట్టలు ఏవి లేవు. వాళ్ళింట్లో అందరూ బజారు వెళుతూ మమ్మలిద్దరిని కూడా తీసుకుని వెళ్లారు. మా అత్తయ్య తోటికోడలికి అన్నీ బాగా తెలుసు. అందుకని ఆవిడ తో పంపిచారు.చిన్నతనం కదా నాకు దిగులగా ఉంది మనకేమి కొత్త బట్టలు కొనరు అనుకున్నాము. . వాళ్ళ పిల్లలకే కొంటారు.అని కూడా అనేసుకున్నాము. నేను చెల్లెలు కూడా. బజార్ అంత తిరిగాము. ఆడపిల్లకి తెలుపు నీలం పువ్వుల తో ఉన్నక్లాత్ ని తా నులోంచి తీసారు. ,మగ పిల్లలకి గళ్ళ చొక్కాల ,నిక్కర్ల క్లాత్ తీసుకున్నారు . అప్పుడు నేను మా చెల్లెలు తో అన్నాను చూసావా . మనకేమి తీసుకోలేదు. వాళ్ళ పిల్లలం కాదు కదా అని.ఉడుకుమోత్తనం వచ్చేసింది.
ఆరోజు ఉగాది పండగ. అన్నట్లు అప్పటికి మా అత్తయ్య తోటి కోడలకి ఇంకా పిల్లలు లేరు. ఆవిడే మా ఇద్దరికీ తలంట్లు కుంకుడు కాయ పులుసు తో పోసింది.. అది కళ్ళలో పడి పొతే ఉప్పు తెచ్చి తినమని.అంది. తల తుడిచి,జడలు వేసి,ఇద్దరికీ అప్పుడు కొత్త గౌను లుకుట్టించాను ఇవిగో అంటూ మాకు తొడిగింది. . ఇప్పటికి నాకు బాగా గుర్తు. టైలర్ కి చెప్పిందిట. వాళ్ళు మద్రాసు నుంచి వచ్చారు ఫాషన్ గా కుట్టమని. వాడు భలే గ కుట్టాడు.ఇంక పండగ ఆనందం అంతా మా కళ్ళలోనే. తరువాత ఈ విషయం మా అమ్మకి చెప్పాము. పెద్ద అయ్యాక ఆవిడతో ఎన్ని సార్లో చెప్పానో ఈ సంగతి. ఆవిడ ఒకటే నవ్వు. మిమ్మల్ని surprize చేసానర్రా అని అంది. ఇదండీ నా చిన్నతనం లోని మర్చిపోలేని ఉగాది పండగ జ్ఞాపకం.

12

సమ్మెట ఉమాదేవి
ఉగాది అనగానే ..
దాన్ని దొంగతనమంటారో ఏమంటారో తెలియదు గాని .. ఇంటింటికీ వెళ్లి, మామిడాకులు కోసుకుంటామని చెప్పి, డాబా ఎక్కేసి మామిడిపిందెలు .. వేప పూత కోసుకుంటామని చెప్పి, ములక్కాడలు, కరివేపాకు.. సంచిలో నింపుకుని.. పూల చెట్లన్నీ తురిమి తెచ్చుకున్న రోజులు .. మదిలో మెదులుతున్నాయి. పండగ స్నానాలు ఓ ముఖ్యమయిన ఘట్టం .. ముందురోజే తప్పని సరిగా కుకుండు కాయలు కొట్టి డబ్బాలో పోసుకుని.. మర్నాడు ఉదయానే నానా బెట్టి. నలుగు పెట్టుకుని కుంకుడు రసంతో తలస్నానం ..చేయడం అదో ప్రహసనం ..
అమ్మమ్మ తన చేతితో స్వయంగా మాకు బట్టలు కుట్టి పంపేది అవి యీపుదేప్పుడు వేసుకున్తమా నాయి ఎదురు చూస్తున్డేవారం.. ఆ కోరిక ఉగాది రోజున తీరేది. అవి వేసుకుని ఒకటే మురిసిపోయేవాళ్ళం.
మామిడాకుల తోరణాలు కట్టి .. పూజలో పెద్దవాళ్ళ పక్కన కూర్చొని. త్వరగా పూజ అయిపోతే బాగుండు అని ఎదురుచూపు .. అమ్మపెట్టె బొబ్బట్లు, పరవన్నం, మామిడికాయ పులిహారా కోసం నోరు ఊరుతుండగా ఎప్పటికో పూజ ముగుస్తుంది. .నైవెద్యము పెట్టగానే కొబ్బరికాయ కొడతారు నాన్న .. హారతి ఇస్తుంది అమ్మ. ఆ తరువాత ఉగాది పచ్చడి చిన్ని గ్లాసుల్లో ఇస్తుంది పుల్ల పుల్లగా తియ్య తియ్య గా కాస్త చిరు చేదుగా భలే ఉంటుంది. ఆ తరువాత అందరికీ తీర్థం అటు తరువాత సలిమిడి వడపప్పు ప్రసాదం, ఆ తరువాత అరటి పండు కొబ్బరి ముక్కల ప్రసాదం.. ఇస్తుంటుంది. అప్పుడు రేడియోలో పంచాంగ శ్రవణం వింటుండగా .. అమ్మ త్వరగా వంట వీటన్నిటి పూర్తి చేస్తుంది. అందరం కబుర్లు చెపుకుంటూ భోజనం చేస్తాం..
అప్పుడిక మేమయితే ఆటలూ పాటలు కాని.. అమ్మలకు విశ్రాంతి ఎక్కడా ?.
మనం బాల్యంలోని ఏ ఘట్టం లోకి వెళ్ళినా.. అమ్మకే ప్రధమ పీఠం.. ఈ గతాల డోలలో, అమ్మ జ్ఞాపకం అవివార్యం. అసలయిన ఉగాది పచ్చడి అంటే అది అమ్మ పెంపకమేమో.. అందులో షడ్రుచులు ఉంటాయి. అమ్మ నవనీతంలా అతి మెత్తనిది. వజ్రంలా చాల కఠినమయినది ..
మేనమామలు వాళ్ళ స్నేహితులు వస్తూ పోతుండే ఇల్లు మాది. నాన్న చిన్న ఉద్యోగంలో అమ్మ ఇల్లు నడిపిన తీరు.. అద్భుతం ఆశ్చర్యంలో మునిగి పోతుంటాను. అమ్మ చేతిలో అమృతం ఉంటుంది ఎందుకో అమ్మ వండినట్లు వండాలని చూస్తే.. అసలు అలా రాదు. ఆమె చేతిలో ఎమ్మున్నదో గాని … అలా అమ్మ ఉగాది రోజు చేసే అద్బుత పానీయం .. పాల పండ్లు ..
సగానికి మరిగించి ఉంచిన పాల గిన్నెని కుండలో పెట్టి చల్ల బరుస్తుంది. తర్భూజ పండు ముక్కలు, వలిచిన కమలా తొనలు, కాసిన్ని దానిమ్మ గింజలు.. అరటి పండు ముక్కలు.. అన్నీ అందుకో కలిపి .. చిన్న చిన్న గిన్నెల్లో వేసి అందరికి ఇచ్చేది. అదిగో అక్కడ కనపడేది స్వర్గం అంటే . ఇవాళ ఏ ఫ్రూట్ సలాడ్ తిన్నా ఆ రుచి రాదు ..
అలాగే ఆ రోజు తప్పక కాస్సేపు కూర్చుని చదువుకోవాలని పట్టు బట్టి చదివించేది.. ఉగాది రోజు చదువుకుంటే … సవత్సరమంతా బాగా చదువు వస్తునదని ఈ రోజు అనీ మంచి పనులే చెయ్యాలని అలా చేస్తే ..సవత్సరమంతా మంచి పనులే చేస్తుంటామని చెప్పేది .. మా పిల్లలు కూడా ఎక్కువగా అమ్మమ్మ దగ్గరే పెరిగారు కాబట్టి అన్ని విషయాల్లో అమ్మమ్మనే గుర్తు తెచ్చుకుంటుంటారు. అవి బంగారు రోజులు . ఇప్పుడు అవి బంగారు జ్ఞాపకాలు ..

13

వారణాసి నాగలక్ష్మి

ప్రభాత స్నానం కావించి
ధవళ కాంతుల పేటిక తెరిచి
సప్త వర్ణాల సొగసులద్దుకుని
ఉగాది వస్తోందిట!
దేనితో స్వాగతించను?
ఏమీ తోచలేదు…
అరవయ్యేళ్ల పాత పెంకుటిల్లు
ఆరంతస్తుల అపార్ట్మెంట్ కాంప్లెక్స్ గా మారే క్రమంలో
గూళ్లు కోల్పోయిన గువ్వలతో పాటే
అంతరించిపోయిందేమో,
ప్రతిసారీ కుహూ కుహూ అంటూ ఉగాదిని స్వాగతించే
కోకిలమ్మ వినిపించకుండా పోయింది !
ఇన్నేళ్లూ శిశిరంలో ఆకులు రాల్చేసి
వసంతాగమనంతో చిగురులు తొడిగి
పూలతో కాయలతో పిల్లలూగే ఉయ్యాలలతో
కళకలలాడిన చెట్లతో పాటే
మావిపూతల్లో చెలరేగిన కూతలమ్మ కూడా
మౌనగీతమై కనుమరుగై పోయింది !
అన్ని ఋతువుల్లోనూ ఒకలాగే నిలిచే
ఆకాశ హర్మ్యాల నడుమ
తలదాచుకునే గూడులేక
తరలిపోయిన శుకపికాల నిష్క్రమణం చూశాక
కొమ్మా రెమ్మా కనిపించని కాంక్రీటు అడవిలో
శిశిరానికీ వసంతానికీ తేడా ఏముందని ఆమని అలిగింది !
పచ్చని తరుశాఖల పందిరిపై
రంగు రంగుల విరులు పేర్చి
సీతాకోకమ్మలని ఆహ్వానించే ఆమని
అశోకవనంలో సీతమ్మలా శోకముద్రలో మునిగింది !
పూలరెక్కల్లొ ఒదిగి నిదురించి
గాలిపాటల్లో కదిలి నర్తించే వసంత భామిని
విడిది చేసే చోటులేక
వడిలిపోయింది, వెడలిపోయింది !
ఇపుడు వసంతం వెంట లేకుండా ఉగాది ఒంటరిగా వస్తుందా ?
గుమ్మలకి వాడని ప్లాస్టిక్ ఆకుల తోరణాలతొ స్వాగతిస్తే,
సెల్ ఫోను రింగు టోనులో కోకిల కూతలు పలకరిస్తే
షడ్రుచుల పచ్చడి కూడా
కొట్లో కొని తెచ్చిన రెడీమిక్స్ గా కనిపిస్తే,
ఉగాది ముంగిట్లోకి వస్తుందా ?
అవమానపడి వెనుతిరిగిపోతుందా ?
మనసు నొచ్చుకున్నా, మార్పులు నచ్చకున్నా
మానవాళిని మన్నించి
చీకట్లని చీల్చే కొత్త వేకువై
తూరుపు వాకిట్లో ప్రత్యక్షం కమ్మని వేడుకుంటే
ఉగాది కాదంటుందా ?
విధ్వంసాలకి స్వస్తి చెప్పి, వసుధకు వన్నెలద్దుదాం రమ్మంటే
హరిత విప్లవానికి పునాదులేద్దాం పదమంటే
ఉగాది రానంటుందా ?
వస్తుందేమో…
ఎన్నిసార్లు విరిగి పడినా తిరిగి పైకెగసే కడలి కెరటంలా
ఎంత అవమానించినా ఋతు చక్రంతో పాటుగా
తిరిగి తిరిగి ఆగమించే ఆమని
ఈసారి ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టేందుకో,
ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించే అలవాటుకు స్వస్తి పలికి
తీరు మార్చుకోకపోతే, ప్రకృతి సమతుల్యత పట్టించుకోకపోతే
తుడిచిపెట్టేస్తానని తర్జని చూపించేందుకో ..
ఉగాది వస్తుందేమో !
వసంతం గ్రీష్మమై మండిపడేదాకా
ఉగాది ఉగ్రవాదై ఉరిమేదాకా
సుప్తశిలలై నిలిచిపోకుండా
మనతరం చేసిన తప్పిదాలన్నిటినీ తక్షణమే దిద్దుకుని
పర్ణశాలల ప్రాంగణాల్లో వసతులిచ్చి
తూనీగల సంగీతం వినిపిస్తే ,
రాలిన పూరెక్కల తివాచి పరచి భ్రమర గీతాలతో స్వాగతిస్తే
వసంతాన్ని వెంట పెట్టుకుని వన్నెల వెన్నెలమ్మలా
వెలుగుల వేకువమ్మలా ఉగాది వచ్చేస్తుంది !
వయసు మళ్ళిన సంఘాన్ని వ్యర్ధ ప్రలాపాలిక చాలించి
యువతరానికి దారిమ్మనీ, నవ భావాలకు చోటిమ్మనీ
ప్రేరేపిస్తూ ఉగాది వస్తుంది!
స్వార్ధ శక్తులకు కాలం చెల్లిపోయిందని హెచ్చరిస్తూ
నోటిస్తే వోటిచ్చే రోజులు మారాయనీ
యువశక్తి ప్రభంజనమై దూసుకొచ్చి
దేశపటాన్ని పునర్లిఖిస్తుందనీ
జాతి భవితను తీర్చిదిద్దుతుందనీ
భరోసా కలిగిస్తూ ఉగాది వస్తుంది !
అన్నదాతకు అప్పుల్లేని జీవితాన్నీ
పీడకలలు లేని సుఖనిద్రనూ ప్రసాదించి,
సకల జనావళికీ కూడూ గూడూ
ఒనగూడే ఒరవడిని సృష్టించేందుకు
ఉగాది వడి వడిగా వస్తుంది !
కుళ్లిన వ్యవస్థలోంచే కొత్త మొలకలు పుట్తుకొస్తాయని
ఆశల చిగురుల గుబురుల్లో
నవరాగాల మృదు గమకాలు పల్లవించే
కోకిలల కొత్త గొంతులు వినిపిస్తూ
కలరవాల కలకలమై అదిగో…
అదిగదిగో …ఉగాది వస్తోంది !
మళ్ళీ మన నేలను హరిత సీమగా మార్చేందుకు
వాసంత సమీరాలపై మల్లెల సువాసనల్ని మోస్తూ
మకరందాల పిలుపులతో మరులు గొలుపుతూ
మన్మధనామం ధరించిన ఉగాది వచ్చేసింది !

14

ఉషారాణి నూతులపాటి
ఉగాది తొలి జ్ఞాపకం
ఏ పండగైనా సరే ..పండగంటే చాలు పిల్లలదే హడావిడి , సందడి . అమ్మ చాలా ప్లాన్డ్ గా , వివరంగా చేస్తుంది ఏపని చేసినా ! పండగలకి మాడుకి నూనె అంటడం , బొట్టు పెట్టి హారతి ఇచ్చి ,అక్షతలు వేయడం తప్పనిసరి . తను కూడా తల స్నానం చేసే ప్రతిసారి కొద్దిగా కొబ్బరి నూనె తలకి అంటుకుని , కుంకుమ పెట్టుకుని , కాస్త పసుపు చెంపలకి , మంగళ సూత్రాలకి రాసుకునేది . అలాగే చేయాలనేది .
ప్రతి పండగకి ఒక ప్రత్యెక మెనూ ఉండేది . నాన్న కోరినవి , మాకు నచ్చేవి కలసి . ఉగాదికి మాత్రం
మామిడికాయ పులిహోర , బొబ్బట్లు
, ఆలు బజ్జిలు , అన్నం పరవాన్నం ఉండాలిందే .. స్నానం చేసి ఉగాది
పచ్చడి తిన్నాకే .. మరేదైనా తినడం . అందుకే తను తెల్లవారుఝామున 3
గం. లకే లేచేది ..అందరి తలస్నానాలు , తెల్లవారేవరకూ అయిపోవాలని ..అలాగే తప్పని సరిగా అయిపోయేవి కూడా !

నాకు 4 సం. వయసులో ఉగాది బాగా గుర్తు . నాన్న ఖమ్మం నుండి ఫేమస్ షోరూం “ఫాషన్ హాల్ ” లో నాకు ఫ్రాక్స్ కొని తెచ్చేవారు . చెల్లి పుట్టలేదు . పల్లెటూరు మాది అందుకే 10/15 రోజుల ముందే షాపింగ్ అయ్యేది . కొత్త గౌను వేసుకోవాలని తెగ ఎదురు చూస్తుంటే జ్వరం వచ్చింది . అదికాస్తా ఎక్కువై , వళ్ళంతా ఎర్రగా దద్దు పోసింది . అంటే మీసిల్స్ అన్నమాట ! కడుపులో కూడా బాగా మంట .. తగ్గడానికి 15
రోజులు పట్టింది . తెల్లవారితే ఉగాది .
11 రోజున ఒక స్నానం చేయించారు .. కఠిన పత్యం .. తిరగబెడుతుంది అప పత్యం చేస్తే అని అమ్మమ్మ భయం . వంటిమీద దద్దుర్లు పూర్తిగా తగ్గక , దురదలు .. ఇక నో కొత్త గౌను , నో పులిహోర (నాకు చిన్నప్పటి నుండి స్వీట్ ఇష్టం లేదు ) .. నో ఆటలు ..
కొద్దిసేపు కొత్తగౌను వేసుకుంటానని ఎంత ఏడ్చినా .. వంటిమీద దద్దుర్లు
మంటపుడతాయని .. ఎంతో నచ్చజెప్పి .. చివరకు మరో కొత్త గౌను వేస్తానండి అమ్మ .. నేను సంతోషంగా ఒప్పుకున్నా !! తీరా
నాకు వేసిన కొత్త గౌను తెల్లటి సిమ్మి .. అప్పట్లో టేర్లీన్, టెరీ కాటన్ ఫ్రాక్స్ కింద , సిమ్మీ వేసుకునేవారం .. అదీ నా కొత్త గౌను . పండగకి మా అన్నలూ , మా మేనత్త పిల్లలూ అందరూ కొత్తబట్టలు .. నేనొక్కదాన్ని సిమ్మీ లో .. అలా ఆ ఉగాది నాకు
చేదు పండగే అయింది . ఈ జ్ఞాపకం తాజాగా ఉండటానికి కారణం గ్రూప్ ఫోటో …పైగా నా కొత్త గౌను , మా మేనత్త కూతురు వేసుకుంది .. ఇక నాబాధ వర్ణనాతీతం !

 

 

 

 

 

 

 

 

 

 

 

 

8 thoughts on “ప్రమదాక్షరి ఉగాది జ్ఞాపకాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *