May 6, 2024

మహిళా సాధికారత సాధించామా..? సంపన్నులకే సొంతమా…???

రచన : రాణి సంధ్య

మహిళా సాధికారత !!! నిజానికి ప్రపంచ దేశాలను వణికిస్తూ , కంటిపై కునుకు లేకుండా చేస్తున్న పదం ఇది. భారత దేశం మొత్తం మహిళా సాధికారత కోసం కలలు కంటుంది. అందుకు మన సమాజం,  ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు కూడా తమ వంతు కృషి చేస్తున్నారు.

అయితే నిజంగా ఈ పోరాటం సాధికారత కోసమేనా???

అందరూ కోరినట్టు ఈ కృషి సాధికారత సాధించడం  కోసమేనా???

సాధికారత పేరుతో మహిళ తనని తాను వంచించుకుంటూ వంచింపబడుతుందా??? సాధికారత ముసుగులో మహిళ తన సహజత్వాన్ని, అమ్మతనాన్ని పక్కకు పెట్టిందా??? మహిళా సాధికారత మగవారి చేతిలో రాజకీయ  అస్త్రమా??? సంపన్నులకే  సొంతమా..??? ఏది నిజం??? అవును ఏది నిజం???

“ఈ దేశం ప్రతి రోజూ స్త్రీ కన్నీటి కిరణాలతో తడిసి, ముద్దవుతూ నిద్ర లేస్తుంది. అయినా చలనం లేని సమాజం స్వార్దమనే నీడలో అచేతనంగా బతికేస్తుంది.  మౌనమనే చల్లని జాబిలి వెలుగులో రోదిస్తూ నిదురపోతుంది.”  దేశంలో రోజుకు కొన్ని వందలమంది మాన ప్రాణాలు బలవంతపు చెరలో బలి అవుతున్నాయి! డిల్లీ నుంచి గల్లీ వరకు ఎంతో మంది ఆడవారి శరీరం రాక్షస ఆనందానికి బలి అవుతుంది. ఎంతో మంది స్త్రీలు మానవ రవాణాకు బలి అయ్యి, తమ ఉనికిని కోల్పోతున్నారు, చీకటి జీవితాలలో జీవశ్చవాలుగా బతుకీడుస్తున్నారు.

స్త్రీ సమానత్వ పోరాటం చేసి రాజ్యాగంలో తనకొక సుస్తిర స్థానం సంపాదించుకుంది. నిజమే! చదువు, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు పొందడంలో ముందంజలో ఉంది. నిజమే!

చట్ట సభలలో కూడా తన వాణి వినిపిస్తూ హక్కుల పోరటం కొనసాగిస్తుంది. నిజమే!

వారసత్వ సంపద , భాద్యత, పొందటంలోనే కాకుండా అవసరమైతే తలిదండ్రుల అంత్యక్రియలు/దహన సంస్కారాలు జరిపే హక్కుని కూడా పొందారు. నిజమే!

మగవారితో సరిసమానంగా  వేతనాలు పొందడంలోనే కాకుండా కంపనీ సీఈవో, వాటాదారులుగా యాజమాన్య హక్కును పొందడంలో సఫలీకృతులయ్యారు. నిజమే!

స్త్రీల కోసం, వారి సంరక్షణ కోసం  చట్టాలు తీసుకొచ్చారు. నిజమే!!!

ఒకప్పుడు ముసుగు వేసుకుని ఇంట్లో కూర్చున్న మహిళ నేడు దేశ ప్రధాని, రాష్ట్రపతి , ముఖ్యమంత్రి వంటి పదవులను సునాయాసంగా చేపట్టి ప్రపంచ దేశాలకు సవాళ్లు విసురుతూ తన ఉనికిని చాటి చెప్తుంది. కొన్ని వందల ఏళ్లుగా పాతుకుపోయిన మన సాంప్రదాయాలను పక్కకు తోసిరాజని, సతీ సహగమనం, బాల్య వివాహాం,  బహుభార్యత్వం, గృహహింస, వెట్టి చాకిరి, వంటి వాటికి స్త్రీలు బలవ్వకుండా చట్టాలు తీసుకురావడమే కాకుండా, మనోవర్తి, వివాహ నమోదు, నిర్భయ  వంటి సంరక్షణ చట్టాలు తెచ్చి, జీవితకాల వైధవ్యం నిషేదిస్తూ  వితంతు వివాహాల  అభివ్రిద్దికి కృషి చేస్తూ సంఘంలో గౌరవప్రదమైన  స్థానం  కోసం అనుక్షణం తపిస్తూ తమ అనూహ్యమైన ప్రతిభాపాటవాలను పది మందికి పంచుతూ , ఆస్తి, వోటు, పౌర హక్కులు అనుభవిస్తున్నారు.

ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు కూడా స్త్రీ శక్తి సామర్జ్యాలని గుర్తించి ఎన్నో అవకాశాలు వారికి అందుబాటులోకి తీస్కోచ్చాయి. స్త్రీలు రాజకీయంగా  ఎదగడమే కాకుండా, సాంఘికంగా కూడా సమాజంలో ప్రతి వృత్తిలో తమ ముద్ర వేస్తున్నారు.  ఒకప్పుడు స్త్రీకి వృత్తి ఒక ఫాషన్ మాత్రమే. మగవారు చేసే ప్రతి పని తాము చేయాలని తపించేవారు. ముఖ్యంగా సైనిఖ శిక్షణ తీసుకుని యుద్దాలు చేయాలని, విమానాలు నడపాలని, నౌకా దళంలో సభ్యులు కావాలని, ఇలా తమాషాకి మొదలైన వారి కల ఐ.ఏ.ఎస్., ఐ.పి.యస్., ఐ.ఎఫ్,యస్., వంటి అధికారిక పరిపాలనా సంభందమైన వృత్తిల నుంచి నేడు  సంసార భాద్యత కోసం స్త్రీలు బస్సు, ఆటో, కాబ్ డ్రైవర్లుగా మారి జీవనం సాగిస్తున్నారు. పౌరోహిత్యంలో కూడా తమ ప్రావిణ్యం చూపిస్తున్నారు.  ఈ రోజు ప్రతి ఆడపిల్లా బడికి వెళ్లి విద్యని సొంతం చేసుకోవడమే కాకుండా తమ భవిష్యత్ ప్రణాలికని ముందే తమ తలిదండ్రులకి, జీవిత భాగస్వామికి చెప్పి ఒప్పించగలిగే ఓర్పు నేర్పుని సాదించింది. ఇదంతా ఒక గొప్ప విజయమే.

ఇంత పురోగతి సాధిస్తున్నా ఇంకా ఎదో కొరత. ఈ సమాజంలో స్త్రీ ధార్మిక  విలువ పెరుగుతుందో తరుగుతుందో అర్ధంకాని పరిస్థితి. నేడు కుటుంబ నిర్ణయాలలో ముఖ్య భూమిక స్త్రీదే.  ఇంటా బయటా, రాత్రి పగలు ఆమె కష్టం విలువ కట్టలేనిది. నిత్యం పరుగులు తీస్తూ నిమిషాలతో ఆమె చేసే యుద్దం అనివార్యం. కాలు కింద పెడితే కందిపోయే సహజ సిద్దమైన సున్నితత్వాన్ని వదిలేసి, రాతి బొమ్మలా మారి, అహర్నిశలు ఇంటా బయటా ఎదుర్కునే కష్టాలు వర్ణనాతీతం. తమ ఉనికి ప్రపంచానికి చాటడం కోసం వారు చేసే త్యాగాలు అమోఘం. స్త్రీల విజయం స్త్రీ జాతికే గౌరవం. ఇది అందరూ ఆమోదించాల్సిందే. అయితే ఆ విజయాలు అంత సులభం మాత్రం కాదు. విజయం  సాధించే బాటలో ఆమె ఎదురుకునే సాదింపులు, వేదింపులు, ఆకతాయి అల్లర్లు, ఇరవై నాలుగు గంటలు కుటుంభంతో ఉండాల్సిన అవసరం  ఆమెని వెనక్కి లాగుతున్నా, ఆశయం కోసం , ఆశయ సాధన కోసం పిల్లలని, వారి సంరక్షణని వేరొకరికి అప్పగించి తను ముందడగు వేస్తుంది. ఈ ప్రయాణంలో కొంత  వ్యాపార దోరణి మొదలై స్త్రీలకోసం  ఆలోచించడం ప్రారంభించి చిన్న పిల్లల క్రష్లు, స్కూల్లు, ఓల్డేజ్ హోమ్స్ , మారేజ్ బ్యూరోలు, ఈవెంట్ మానేజ్మెంట్, వగైరాలు నడుపుతూ స్వకార్యం స్వామీ కార్యం అన్నట్టుగా సాగడం బాగున్నా, ఇంకా ఏదో వెలతి. ఏదో కావాలనే తపన, ఇంటా  బయటా అధికారం చెలాయిస్తున్నా, సంపూర్ణ సాధికారత రాలేదేమో అనే భాద ఎప్పుడో ఒకప్పుడు  ప్రతి స్త్రీని వెంటాడుతూనే ఉంది. రాజకీయంగా స్త్రీని సాధికారత పేరుతో ముందు నిలుచో బెట్టి మగవారు వెనుకగా తాము అధికారం చెలాయించడం, ఆ అధికారాన్ని వాడుకోవడం  మనం చూస్తున్నాం. లాలు ప్రసాద్ యాదవ్ వంటి నాయకులు ఇందుకు నిదర్శనం. స్త్రీని ముందు నిలుచోబెడితే  ఓట్లు పడతాయనే ధోరణిలో ప్రతి రాయకీయ పార్టిలో, కొంత మంది  నాయకులు ఆలోచిస్తున్నారు.

యాబై ఏళ్ల క్రితం స్త్రీలకోసం ఇన్ని అవకాశాలు లేవు, ఇన్ని తెలివితేటలూ లేవు, కాలక్రమంలో ఆమె సాధించిన పురోగతి బాగుంది కాని నేడు స్త్రీ బయటికి వెళితే ఇంటికి క్షేమంగా వచ్చే అవకాశం మాత్రం చాల చాల తక్కువ అనే చెప్పాలి. ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా, రోజు రోజుకి స్త్రీల పై అత్యాచారాలు పెరుగుతున్నాయి  కాని ఆగడం లేదు. ఆమె ఇంట్లో భార్యగా, తల్లి గా ఉన్నప్పుడు ఉన్న భద్రత ఇప్పుడు తక్కువైంది. ఆడపిల్లల పుట్టుక  సంఖ్య కూడా  తగ్గింది. ఆడపిల్లలను, శిశువులని అమ్ముకోవడం, లేదంటే చంపేయటం పెరిగింది. ఆడపిల్ల అని తెలిస్తే చాలు వయసుతో సంభంధం  లేకుండా నెలల పిల్లల నుంచీ ముదుసలి వరకు కూడా వదలకుండా వెంటాడి వేటాడి వారి కామవంచకు బలిచేస్తున్నారు. బస్సా..? ట్రైనా..? ఇల్లా..? బాజారా..? ఆఫీసా..? ఊరా..? నగరమా..? పంట చేనా..? పగలా..? రాత్రా..? వావి.. వరసా ??? ఏవి ఆలోచించే విచక్షణ జ్ఞానం లేకుండా వికృతంగా జంతువుల్లా మారిన వారిని ఆపడం ఎలా??? భర్త, అత్తా మామలు పెట్టె హింస భరించలేక ఆత్మహత్యలు చేసుకునే వారిని ఎలా ఆపడం. భ్రూణహత్యలను ఎలా ఆపడం.??

చట్టాలు ఎన్ని ఉన్నా న్యాయం కోసం పోలిసు గడప తొక్కాలంటేనే, కోర్టు మొహం చూడాలంటేనే  భయపడే మహిళకు సాధికారత లభించిందని, లభిస్తుందని నమ్ముదామా.

ఈ సమస్యలకి డబ్బు, హోదా, అధికారంతో సంబందం లేదు అని శశి తరూర్ వంటి స్త్రీల జీవితం మనకు కళ్లకు కట్టినట్టు కనబడుతుంటే మహిళా సాధికారత సంభవమే అనే  మాట నిజమేనా అని అనుమానం కలుగక మానదు.  సమాజం, ప్రభుత్వం, చట్టం పై  నమ్మకం కోల్పోయి నక్సలైట్లుగా, తీవ్రవాదులుగా, నేరస్తులుగా మారిన మహిళలను కూడా మనం చూసాం, చూస్తున్నాం. మహిళా సాధికారత అంటే స్త్రీ సమానత్వం, సమాన హక్కులు, సమాన అధికారాలు మాత్రమే కాదు. స్త్రీని విలాస వస్తువుగా కాకుండా, మనిషిగా, మానవత్వ దోరణిలో గుర్తించి, ఆమె మాన ప్రాణాలకు విలువనిచ్చే సమాజం కావాలి. కాగితాలపై చూపించే చట్టాలు అమలులోకి రావాలి, అత్యాచార  నేరాల్లో తీవ్రతను  గుర్తించి త్వరితగతిన  మహిళకు న్యాయం  చేయాలి, అప్పుడే ఒక మహిళ పై చేయి వేయడానికి ఎవరూ సాహసించరు. నేర ప్రవృత్తి సమూలంగా అంతమయ్యే శిక్షలతో బాటు నేరస్తులకు స్త్రీలపట్ల గౌరవభావం కలిగించే శిక్షణ ఇవ్వాలి.  ముందుగా స్త్రీ అంటే మగవాడికి  ఎక్కువా, తక్కువా, సమానమా..  అనే ఆలోచన నుండి, స్త్రీ తమలాగే ఒక మనిషి అని, చదువున్నా లేకున్నా, అధికారం ఉన్నా లేకున్నా, డబ్బున్నా లేకున్నా  ఆమెను, ఆమె అభిప్రాయాలను, స్వేచ్చను గౌరవించాలనే సున్నితత్వం మగవారికి అర్ధమయ్యే శిక్షణ ఇవ్వాలి. ఇది ప్రతి తల్లీ, తండ్రి , గురువు, స్నేహితుడు తమ భాద్యతగా భావించాలి. అప్పుడే మనం మహిళా సాధికారత సంపూర్ణంగా సాధించినట్టు అర్ధం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *