May 2, 2024

పెరుగుతున్న అత్యాచారాలు – కరవవుతున్న భద్రత

రచన: మణి కోపల్లె

అనాదికాలం నుంచి సమాజంలో పురుషాధిక్యత వుంటోంది. మహిళలంటే చిన్న చూపు. బానిసలనే భావం, చెప్పింది చేయాలి అనే అధికార తత్త్వం.  తమ చెప్పు చేతల్లోనే ఉండాలనే తత్త్వం మహిళలపై వుంది.  అత్యాచారాలు, హత్యలు, కిడ్నాపులు, ఆసిడ్ దాడులు మహిళలపై అధికంగా జరుగుతున్నాయి  స్త్రీని ఒక కామకేళి వస్తువుగా చూస్తున్నారు. సంఘంలో స్త్రీలకి తీరని అన్యాయం జరుగుతోంది. న్యాయం జరగటం లేదు.  మహిళలపై వివక్షత నానాటికి ఎక్కువవుతోంది.

పురాణాలలో స్త్రీని సమానంగా చూసేవారు. పూజించేవారు. మంత్రిలా సలహాలు తీసుకునేవారు.  ఆమెలో తల్లిలా లాలించే ప్రేమమూర్తినే చూసారు. కాలం గడుస్తున్న కొద్దీ స్త్రీని ఒక ఆటవస్తువుగా మార్చేసారు. తమ అవసరాలు తీర్చే బానిసని చేసారు. కొంతమంది స్త్రీలలో దేవతని చూస్తే, మరి కొంతమంది కోరికలు తీర్చే కామాన్ని  చూస్తున్నారు. స్త్రీకి మనసుంటుందని, ఒక వ్యక్తీ అని, స్త్రీ లేనిదే సమాజం లేదని కుటుంబం లేదని, ఆమె లేనిదే పురుషుడు లేడని,  వారు  కూడా అన్నిటా సమానమని దుర్మార్గులు గుర్తించడం లేదు.

కుటుంబంలో, సంఘంలో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో అంతటా  సమానులు, సమాన స్థానం వుంది, స్త్రీ పురుషలిద్దరూ సమానులే అని పైకి అంటారు కాని అన్ని చోట్లా అన్ని రంగాల్లోనూ అసమానతే ఉంటోంది. భద్రతా కరువవుతోంది. నేరాలకు గురయ్యేది ముఖ్యంగా మహిళలే!

పైశాచికత్వానికి నిదర్శనం ఈ మధ్యే జరిగిన నిర్భయ ఉదంతం. ఈ సంఘటన ప్రతి ఒక్కరినీ కదిలించింది. అత్యధికంగా గౌరవించబడే విద్యలో రాణించే వైద్య విద్యార్ధిని ఘోరాతి ఘోరంగా స్నేహితుని సమక్షంలో మానభంగానికి గురయ్యిందంటే మహిళలకు ఎంత భద్రత వుందో అర్థం అవుతోంది.  శారీరకంగా చాలా దారుణంగా హింసించిన  ఆ ఐదుగురు రాక్షసులతో  వీరోచితంగా ఎదురు నిల్చి పోరాడిన ఆ నిర్భయ మృత్యువుతో కూడా చివరిదాకా పోరాడింది. నిస్సహాయురాలై కనుమూసింది. తన్ను కాపాడుకోలేక పోయింది .  ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్భయపై జరిగిన దానికి తమ నిరసనలను తెలియ చేసాయి.  ఒక మహిళా సంస్థవారు ఝాన్సీలక్ష్మిబాయి అవార్డు, అమెరికాలో అంతర్జాతీయ మహిళా పురస్కారం అందించారు. దేశమంతా ధర్నాలు చేసారు, ఆస్తులు తగులపెట్టారు. దోషులకు ఉరిశిక్ష విధించాలని నిర్భయ తల్లితండ్రులు, అందరూ కోరుకున్నారు.

ప్రభుత్వం ఆ తరువాత ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని అవార్డులు ప్రకటించినా, నష్ట పరిహారాలు చేసినా, నిందితులని  పట్టుకున్నా, శిక్షలు వేసినా , ఉరిశిక్షలు వేసినా ఎంతమంది కామంధులు అత్యాచారాలు చేయటం మానుకున్నారు? రోజురోజుకి పెరిగిపోతూనే వున్నాయి. చదువుకున్నవారు, ఉద్యోగులు, అల్పవర్గాలవారు, ఉన్నత వర్గాలవారు ఇలా ఒకటేమిటి వయసుతో పని లేదు.  ముదుసలైనా,  పసి పిల్లలైనా ఆడది అంటే చాలు. అత్యాచారాలు. అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. నేరాలు రెట్టింపు అవుతూనే వున్నాయి. కేసులు పెట్టి న్యాయం కోసం పోరాడిన వాళ్లకి కొద్దో గొప్పో నష్టపరిహారం అందుతోంది. కాని కోర్టుల గుమ్మం  ఎక్కలేని బీదవారు, దళితులు, మైనర్ బాలికలు ఎందరో న్యాయం కోసం  ఎదురు చూపులు చూస్తున్నారు.

దేశానికి రాజధాని ఢిల్లి అయితే అత్యాచారాలకు కూడా ఢిల్లి నెలవైంది.  రెట్టింపు నేరాలు జరుగుతున్నాయి  సామూహిక అత్యాచారాలు జరుగుతూనే వున్నాయి

ఒక అభయ, ఒక అనూహ్య, ఒక యువ జర్నలిస్ట్ ఇలా ఎందరో మహిళలు అత్యాచారానికి గురవుతూనే వున్నారు. దళిత మహిళలపై కుడా సామూహిక అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆంధ్రాలో వైద్య విద్యార్ధిని శ్రీలక్ష్మి   వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది.

ఈ సమస్య ఒక్క భారతావనిలోనే కాదు చాలా దేశాల్లో వుంది. ఆస్ట్రేలియాలో మహిళలకి అతి తక్కువగా న్యాయం జరుగుతోంది.  కొన్ని దేశాల్లో (అరబ్ దేశాల్లో) స్త్రీల జీవితం మరింత దుర్భరంగా వుంటుంది.

అత్యాధునిక సాంకేతికత పెరిగే కొద్దీ నేరాలు కూడా పెరిగి పోతున్నాయి. కంపూటర్లు సమాజానికి ఎన్నో విషయాల్లో అద్భుతంగా ఉపయోగపడుతుంటే కొందరు అదే కంప్యుటర్లని చెడుగా ఉపయోగిస్తున్నారు.  అశ్లీల చిత్రాలు చూడటం, యువతులకు అసభ్యకర సందేశాలు ఫోన్లలో పంపించటం, బ్లాకు మెయిల్ చేయటం ఇలా సైబర్ నేరాలకి పాల్పడుతున్నారు. నేటి సినిమాలు కూడా మరింత యువతపై చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పెరిగిపోతున్న ఫ్యాషన్ ప్రపంచంలో మహిళల ఆధునిక వస్త్ర ధారణ కూడా ఒక కారణం అని కొందరి  అభిప్రాయం.

స్త్రీలకు రక్షణ కరవవుతోంది. న్యాయం జరగటం లేదు. జరిగిన అన్యాయం చెప్పుకోడానికి పోలిస్ స్టేషన్ లలో మహిళా పోలీసులుండరు. జస్టిస్ వర్మ కమీషన్ మహిళల భద్రతపై అనేక సూచనలు చేసింది.  బయట జరిగే దాడులే కాదు ఇంట్లో కూడా మహిళలకు భద్రతా కరువవుతోందని అంది. మహిళల సమానతపై వివాదం వీడనంతవరకు సమాజంలో కొందరు బలవంతులుగా మారి బలహీనులపై  తమ ఆధిపత్యం చలాయిస్తుంటారు. మహిళలకు, బలహీనులకు భద్రత కొరవడుతోంది. అత్యాచారం ద్వారా మరణానికి, లేదా బాధితురాలు జీవచ్ఛవంలా మారడానికి కారణమయ్యే నిందితుడికి ఉరిశిక్ష వేయాలని ఆర్డినెన్సు నిర్దేశించింది. ఈ నియమాన్ని మార్చాలని ప్రభుత్వం అనుకోవడం లేదు. శిక్షలు కఠినంగా ఉండాలనే నిర్ణయించింది. అత్యాచారానికి ఏడేళ్ల జైలు శిక్షను 20 ఏళ్లకు పెంచాలన్ననియమంలోనూ ఏ మార్పూ చేయకూడదని భావిస్తున్నది. లైంగిక వేధింపుల పరిహార చట్టాన్ని పార్లమెంటు ఇటీవలే ఆమోదించింది. భారతీయ మహిళ  తమపై జరిగిన నేరం గురించి చెప్పుకోవడానికి భయపడే పరిస్థితి ఉంది. అత్యాచారానికి గురైన మహిళ గానీ వారి కుటుంబం గానీ వెంటనే ఫిర్యాదు చేయాలనుకునే వాతావరణం కల్పించినపుడే భద్రత వున్నట్టు. కాని పోలీసు స్టేషన్ కు వెళ్లి న్యాయం కోరటానికి అనుకూలమైన పరిస్తితులు వుంటం లేదు. నేరాలు పెరుగుతున్నా దోషులపై నేరారోపణ చేస్తున్న వారు తక్కువ. కంప్లైంట్ ఇవ్వటానికి కుటుంబ గౌరవం పరువు మర్యాదా, చూడటం, కంప్లైంట్ ఇచ్చ్హినా తిరిగి దోషులు దాడి చేస్తారని భయం, ఆర్ధిక ఇబ్బందులు, ఇంకా ఇతర కారణాలు ఫిర్యాదు చేయలేక పోతున్నారు.

మహిళలపై నేరాలు జరిగే వాటిల్లో మన రాష్ట్రం రెండో స్థానంలో ఉన్నందుకు సిగ్గు పడాలి. అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. కిడ్నాపులు పెరుగుతున్నాయి. ఇక యాసిడ్ దాడుల విషయంలోనూ అంతే! ప్రేమించలేదంటే యువతులపై యాసిడ్ దాడులెక్కువైపోయాయి. దోషులని పట్టుకున్నా ఇప్పుడు వున్న సెక్షన్ ప్రకారం తేలికగా జరిమానా కట్టి సులువుగా బెయిల్ పొంది బైటికి వస్తున్నారు. అందుకే ఆ పీనల్ కోడ్ సెక్షన్ ని మార్పు చేయాలని కోరుతున్నారు యాసిడ్ బాధితులు. శిక్షాకాలం పెంచాలని, కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు.

గణాంకాల ప్రకారం 2012లో నమోదు అయిన అత్యాచారాలు  1,296 అయితే నమోదు కానివి ఎన్నో వేల కేసులు  వున్నాయి. ఒకవేళ కేసులు రుజువయినా శిక్షలు పడే నేరస్తులు చాల తక్కువ. సరియైన సాక్ష్యాలు లేకపోవడంతో  నిందితులు తప్పించుకుంటున్నారు. ఏళ్ల తరబడి విచారణలు కొనసాగటం, కేసు విచారణ సమయంలో న్యాయవాదులు అడిగే ఇబ్బందికర ప్రశ్నలకు జవాబులు చెప్పలేక సిగ్గుతో తలదించుకోవటం, చట్టంలోని లొసుగులతో నిందితులు సులువుగా తప్పించుకుంటున్నారు. అందుకే చాలామంది కోర్టులకెల్లినా తమకి న్యాయం జరగటం లేదని అంటున్నారు. నేరగాళ్లు మరింత నేరాలు చేస్తున్నారు.

దుర్మార్గులు  వికలాంగులని సైతం  వదిలిపెట్టరు.  మెదక్ జిల్ల్లాలో ఒక వికలాంగురాలిపై  దుర్మార్గులు అత్యాచారం జరిపినపుడు ఆమె అవమానంతో ఆత్మ హత్య చేసుకుంది. మరో చోట గర్భవతిపై తమ కామ దాహం తీర్చుకుని కాల్చేశారు. ఇవి నగరానికి దగ్గరలోనే జరిగాయి   ప్రతి ఏటా మహిళలపై నేరాలు పెరిగి పోతూనే వున్నాయి.  దోషులకు కఠిన శిక్షలు ఉంటేనే మహిళలపై నేరాలు తగ్గుతాయి. దేశంలో కఠిన చట్టాలున్నా అమలు కావడం లేదు.

ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం నవంబరు 25వ తేదీన స్త్రీల హక్కుల పరిరక్షణ మరియు స్త్రీ హింసా వ్యతిరేక దినంగా పాటించాలని తీర్మానం చేసింది.  అత్మన్యూనతతో ఆత్మహత్యలు చేసుకునే మహిళలు కొంతైనా ఉరట చెందుతారని వారికోసం ఒక రోజుని కేటాయించారు . పాశ్చ్యాత్య సంస్కృతి దిగుమతి చేసుకుని  విదేశీ మోజులో స్త్రీలపై జరిగే అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టాలంటే ముందుగా మగవారి దృక్పధంలో మార్పు రావాలి. స్త్రీలని గౌరవించాలి. అక్షరాస్యత వుంటే చేసేది మంచా? చెడా అనేది వివక్షతతో తెలుసుకోగలుగుతాడు. స్త్రీ అంటే మహాశక్తి అని గ్రహించగలగాలి.  ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అనే నానుడి తెలుసుకోవాలి.

బాధిత మహిళలు న్యాయం కోసం వచ్చినపుడు వీలైనంత త్వరగా కేసులు పరిష్కరించాలి. మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలి. ముఖ్యమైన ప్రదేశాలలో సి సి కెమెరాలు ఏర్పాటు చేయటం, మహిళా పోలీసు స్టేషన్ లు ఏర్పాటు చేయటం, రాజకీయ పలుకుబడినుపయోగించి నిందితులు తప్పించుకోకుండా చూడటం, చట్టాలలో మార్పులు తీసుకురావటం, ముఖ్యంగా మానసికంగా, శారీరకంగా బాధను అనుభవించే మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం వుండాలి.  ఎవరో చేసే తప్పులకి మహిళలు జీవితాంతం శిక్షననుభవించటం ఎంతవరకు న్యాయం?

 

(ప్రతి పురుషుడు ఇలానే వుంటారని కాదు. ఇప్పటికీ స్త్రీని గౌరవంగా చూస్తున్నారు. భార్యా పిల్లలని ప్రేమగా చూస్తూ, స్నేహ హస్తం అందిస్తూ, ఆప్యాయతానురాగాలు పంచుతున్న వారూ వున్నారు. కాని సమాజంలో అన్యాయానికి గురవుతున్న మహిళలపై రాస్తున్న ఈ అక్షరాంజలి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *