May 3, 2024

అనకాపల్ల్లిలో శ్రీ దత్తాత్రేయ వైభవం

సేకరణ మరియు రచన: వెంకట సుశీల, అనకాపల్లి

datta-1

దత్తాత్రేయం మహాత్మానం,వరదం భక్తవత్సలం
ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు |

చాలామంది నోటనుండి నేను విన్నాను. “రాముడు, పరశురాముడు, కృష్ణుడు, బుద్ధుడు అలాగే షిరిడీ సాయిబాబా మొదలైన వారు మానవులు, వారు మానవులవలె ప్రేమించారు, విలపించారు, అందరిమధ్య ఒకరు గా జీవించారు, అందరూ తిన్న ఆహారాన్నే భుజించారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు (సాయిబాబా కాదులెండి), పిల్లల్ని కలిగివున్నారు, బంధాలకి బాందవ్యాలకి లోనయ్యారు. అటువంటప్పుడు దేవుళ్ళెలా అవుతారు? వీటన్నింటినీ జయించిన వాడే కదా దేవుడు? మన్లాగే జీవించిన వాళ్ళెలా దేవుళ్ళయ్యారు? లీలలు చూపించారని, వరాలిచ్చారని వాళ్ళ మీద వ్రాసిన పుస్తకాలు, పురాణాలు కల్పితాలు” అని కొట్టిపడేస్తున్నారు. ఇది నిజమని నమ్మినవాళ్ళు దేవుడు లేడూ అని నాస్తికులవుతున్నారు, అది నమ్మని వాళ్ళు దేవుడు ఉన్నాడని ఆస్తికులవుతున్నారు. ఈ వైరుధ్య భావాలకి కారణం దేవుడు మానవునిగా ఎందుకు అవతరిస్తున్నాడన్న స్పష్టత లేకపోవడమే. దీనిపైన నా అభిప్రాయం, నమ్మకం ఏమిటంటే ఒక క్రొత్త ధర్మాన్ని స్థాపించాల్సి వచ్చిన ప్రతిసారీ దేవుడు మానవునిగా అవతరించి, మానవునికన్నా ఎక్కువ కష్టాలు పడి ఏ అవతారానికి తగిన బాధ్యతని ఆ అవతారం లో పూర్తి చేసుకొని, ధర్మాన్ని స్థాపించి ఆ దేహాన్ని వదిలి వెళ్ళిపోయారు. దేవుడు ధర్మసంస్థాపనకై మానవుని గా అవతరిస్తాడు ఎందుకంటే మానవునికి ఆ మార్గం పై ఆసక్తి కలుగజెయ్యాలంటే ఆ ధర్మాన్ని ముందు తానాచరించి చూపాలి. యుగానికొక ధర్మం ఎలా విస్తరించింది మరి? అటువంటప్పుడు దేవుడు లేడని అనుకోవడానికి లేదు. దేవుడు మానవ శక్తికి అంతిపట్టని లేదా మానవ శక్తికి మించిన పన్లు చేసినప్పుడు అతడు కేవలం మానవుడని ఎలా కొట్టిపారేస్తాం? రాముడ్నుండి బాబా వరకు తీసుకున్నా వారు చేసినవి గానీ, వారి వారి కాలాల్లో జరిగినవి గానీ న భూతో న భవిష్యతి అన్నట్లు మరెవ్వరూ కూడా చేయలేదు, మరెన్నడూ జరగనూ లేదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితము గా మామూలు మానవులు కారు!

అలాగే శ్రీ గురుదత్తుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపం. అందుకే అతడు మూడు శిరస్సులతో తన వద్ద నాలుగు వేదాలనబడే నాలుగు కుక్కలతో, మాయను జయించిన వాడిగా ఆ మాయను ఆవు రూపము లో తనవద్దే పెట్టుకొని వుంటాడు. ఈయన అత్రి మహర్షి, అనసూయలకు దత్తపుత్రుడు కాబట్టి “దత్తాత్రేయుడు” అనే నామధేయాన్ని కలిగి వున్నాడు. మూడు తలలు, ఆరు చేతులు, నుదుటి పై ఊర్ధ్వపుండ్రంతో, రుద్రాక్షలు ధరించి, చేతులలో శంఖు చక్రాలు, తిశూల ఢమరుకాలు, కమండలం, జపమాలలతో మహా తేజస్సుని కలిగివుంటాడు. గురుచరిత్ర ప్రకారం దత్తాత్రేయుడు పంచావతారాల్లో దర్శనమిస్తూ భక్తులకు కొంగుబంగారమయ్యాడు. ఆ అయిదవతారాలు- శ్రీపాద శ్రీవల్లభ, శ్రీ నారసిమ్హ సరస్వతి, శ్రీ మాణిక్ ప్రభు, శ్రీ అక్కల్ కోట్ మహరాజ్, శ్రీ షిరిడీ సాయిబాబా. మానవాళికి జ్ఞానామృతాన్ని పంచే కార్యక్రమాన్ని ఈ అవదూతల రూపంలో సాగించాడు.

కలియుగం లోనే 1330 వ సంవత్సరం లో భాద్రపద శుక్ల చతుర్ధినాడు పవిత్ర గోదావరి నదీ తీరాన పిఠాపురం అనే గ్రామంలో అప్పలరాజు శర్మ, సుమతి అనే పుణ్యదంపతులకు శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించాడు. ఈయన దత్తాత్రేయుని ప్రధమ అవతారం. ఈయన జన్మించిన పిఠాపురం తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశం లో వుంది. శ్రీపాద వల్లభులు పిఠాపురం లో పదహారు సంవత్సరాలు వుండి ఆ తర్వాత సన్యసించి పాదచారియై ద్వారక, కాశీ, బృందావనం మొదలగు క్షేత్రాలు దర్శిస్తూ బదరీ వెళ్ళి అటు తర్వాత గోకర్ణం వెళ్ళారు. అక్కడ మూడు సంవత్సరాలుండి కృష్ణానదీతీర సమీపాన ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాలసరిహద్దుల్లో వున్న కురువపురం లో పదునాలుగు సంవత్స రాలు తపస్సుచేస్తూ వుండిపోయారుట. శ్రీపాదులవారు యోగముద్రలో సిద్దాసనం వున్న ప్రదేశంలో ప్రస్తుత ఆలయం వుంది. ఇది ఒక ద్వీపంలో వున్నట్టే, ఎందుకంటే ఈ ఆలయం చుట్టూ వుంది కృష్ణానదే. ఈ కురువపుర క్షేత్రంలో కృష్ణా నదికి ఇటువైపు అంటే ఆంధ్రావైపు శ్రీవల్లభులు సూర్యనమస్కారాలు చేసేవారనీ, అక్కడే దర్బార్ నడిపేవారనీ అలాగే కర్ణాటక వైపు కృష్ణానదిఒడ్డున తపస్సు చేశేవారని అక్కడికి వెళ్ళివచ్చినవాళ్ళు చెప్పుకుంటుంటారు. 1350 వ ప్రాంతం లో తన భక్తుడు శంకరభట్టునకు తాను వెళ్ళిపోయే కాలము ఆసన్నమైనదని చెప్పారుట, తనచరితామృతాన్ని కూడా రచించి ఆ పై మూడు సంవత్సరాల తర్వాత తన పాదుకలవద్ద పెట్టమని సూచించారుట. ఆ తర్వాత హస్తానక్షత్రము ఆశ్వీయుజ కృష్ణ ద్వాదశిరోజున కురువపురం వద్ద కృష్ణానదిలో మునిగి జలసమాధి అయినారు.

ఆంధ్రప్రదేశ్ ని మరొక జిల్లా విశాఖపట్నానికి చెందిన అనకాపల్లె అనే పట్టణం లోని శ్రీ రామ పంచాయతన బ్రహ్మ విద్యా లయం లో కాశీనుండి వచ్చిన ఒక అవదూత శ్రీదత్తాత్రేయుని పీఠాన్ని స్థాపింపజేసి ఆ విద్యాలయాన్ని “శంకరదత్తాత్రేయ” ఆలయం గా మార్చారు. ఈ స్థాపన 1958 లో జరిగింది. అనకాపల్లి నా జన్మస్థానం కావడం వల్ల ఈ ఆలయం నాకు పరిచయమే. గాంధీనగరం రామాలయం వీధి కి తీసుకెళ్ళుబాబూ అంటే రిక్షావాడు తిన్నగా ఈ వీధికి తెచ్చేస్తాడు. ఏదో ఒక పనిమీద మేము అక్కడికి వెళ్ళినా చివరగా ఇంటికి వచ్చేసేటప్పుడు ఆ ఆలయం లోకి వెళ్ళి దేవుళ్ళని దర్శించేవాళ్ళము. 1948 వ సంవత్సరం లో శ్రీ వేదుల వెంకటరమణ, జగదాంబగార్లు శ్రీ రామ పంచాయతన బ్రహ్మవిద్యాలయాన్ని స్థాపించారు. అక్కడ విద్యార్ధులు వేద విద్యను అభ్యసించేవారుట. వారు కాలం చేసిన తర్వాత మేనేజ్ మెంటు మరో ఇద్దరి చేతులు మారడం జరిగింది. అది కేవలం విద్యాలయమే కాకుండా దేవాలయం కూడా, అందులో శ్రీ రాజరాజేశ్వరి దేవి, శివుడు, రాముడు, గణపతి, సూర్యుడు దేవతా విగ్రహాలు స్థాపింపబడినవి. భక్తులందరూ వెళ్ళుతుండేవారు. ఆ విధం గా అది రామాలయం గా ప్రసిద్ది కెక్కింది. ఏభై సంవత్సరాలక్రితం సినిమా పాటల గాయకుడు శ్రీ ఘంటసాలవారి చెల్లెలి భర్త రామచంద్రశర్మ పశ్చిమ గోదావరి జిల్లా నుండి వేదాలలో ఎం.ఏ చేసి అక్కడికి దేవుని సేవ చెయ్యడానికి మరియు విద్యాబోధనకి వచ్చారు. ఈయన వచ్చాకే కాశీనుండి తనకి తానుగా దత్తాత్రేయ ఉపాసకులు రావడం ఆ దేవాలయం లో ఈతని ద్వారా దత్తాత్రేయ పీఠాన్ని స్థాపింపజేయడం జరిగింది. మిగితా దేవతా విగ్రహాలతో పాటు శ్రీ దత్తాత్రేయ పీఠము, అలాగే ఆది శంకరాచార్యుల వారి విగ్రహం కూడా వుంటుంది. రామచంద్రశర్మగారు దత్తాత్రేయ ఉపాసకులు గా మారిపోయి ఎంతో మందికి ఒక గురువువయిపోయారు. ఈయన ఎం.ఏ పూర్తయిన వెంటనే సినిమాల్లోకి వెళ్ళిన వ్యక్తి. దత్తాత్రేయులవారు ఈ కోవలోకి లాగారని చెప్పవచ్చు. ఆ ఆలయం ఎప్పుడూ ప్రశాంతం గా నిశ్శబ్దత కూడుకొని వుండేది. కొన్ని ముఖ్యమైనరోజుల్లో జనసందోహం ఎక్కువ వున్నప్పటికీ మిగితా ఆలయాల్లా కాకుండా, ఆ ఆలయంలోకి ఒక్కసారి అడుగు పెట్టేసరికి ఎవరూ చెప్పకపోయినా ప్రజలు చాలా నెమ్మదస్తులయిపోయేవారు. ఈ ఆలయంలో ధ్యానానికి, వేల వేలసార్లు జపనామాలు ఉచ్చరించడానికి ప్రాముఖ్యతనిస్తారు.

దత్తాత్రేయుల వారి పీఠాన్నిస్థాపించిన వెంటనే సూచిక గా కాబోలు లోపలి వైపు పెరటిలో మేడి, రావి మొక్కలు పుట్టుకొచ్చాయట. ఇప్పటికి బాగా వృక్షాలయ్యాయనుకోండి. వీటి మేడిపళ్ళల్లో పురుగులుండవట, తియ్యగా వుంటాయిట. ఈ గురువుగారు, తన శిష్యుల సహాయంతో దత్తాత్రేయ నవరాత్రులు 2000 వ సంవత్సరం నుండి మార్గశిర మాసం లో మార్గశిర షష్ఠినుండి, దత్తాత్రేయుని జయంతి వరకూ నిర్వహిస్తున్నారు. అనేకమైన భక్తులు దీంట్లో పాల్గొంటున్నారు. నానాటికీ సంఖ్య పెరుగుతున్నది. ఈ తొమ్మిది రోజులూ ఎంతో మంది భక్తులచేత లక్ష సార్లు దత్తాత్రేయుని వివిధ నామాలను జపింపజేయడం జరుగుతుంది. ఆఖరిరోజున జరిగే అన్నసంతర్పణ లో, కొన్ని వందలమంది వచ్చి పాల్గొని వెళ్తుంటారు. భక్తులు పెరగడం వల్ల ఆ దేవాలయం ఎంతో ప్రాచురణలోకి వచ్చింది, వేద విద్య అభ్యసించడానికి వచ్చే విద్యార్ధుల సంఖ్య పెరగడం వల్ల మరియు విరాళాలు కూడా ఎక్కువరావడంతో ఆ విద్యార్ధులకు అన్ని వసతులతో ప్రక్కన సెపరేటు గా ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దేవాలయం లో పెద్దయెత్తున ఎన్నో దైవ కార్యాలు జరుగుతున్నాయి, ఎంతోమంది సామాన్యుల కష్ట, నష్టాలకి కొంగుబంగారమయి దత్తత్రేయులవారు ఉంటున్నారుట. తాను చేసే లోకకళ్యాణంలో ఈ గురువు గారిని ఒక సాధనం గా తీసుకొని ఆయన జన్మను కూడా తరింపజేశారు. ఎవరి వల్ల ఏ కార్యము జరుగనున్నదో అనడానికి కూడా ఇది ఒక గొప్ప ఉదాహరణ. విశ్వగురువు గా ఉపనిషత్తులచే పేర్కొనబడిన దత్తాత్రేయులు ఆధ్యాత్మిక సాధనకు మూలమైన జ్ఞానము, యోగ విద్యను అందిస్తూ వస్తున్నారు. బ్రహ్మకు మంత్ర విద్యను, వశిష్టునికి యోగ విద్యను, ప్రహ్లాదునికి ఆత్మ విద్యను, పరశురామునికి శ్రీవిద్యామంత్రాన్ని ఉపదేశించినట్లు గా పురాణాలు చెప్తున్నాయి. హనుమంతుడికి, సుబ్రహమణ్యుడికి జ్ఞానబోధ, కార్తవీర్యార్జునిడికి మహాపరాక్రమం అలాగే సామాన్యులకు వారుకోరిన దాన్నిబట్టి జ్ఞానం, ఆరోగ్యం, ఆయుస్షు, సంతానం, సౌభాగ్యం, సంపదలు, మోక్షం అనుగ్రహిస్తూ వస్తున్నారు. ఏ యుగంలోనూ పరిసమాప్తి లేని దైవం శ్రీ దత్తాత్రేయ మహిమాన్వితం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *