May 2, 2024

ప్రకృతే దేవుడు : దేవ్ ఘర్ (Nature is the house of God)

సేకరణ, రచన: డా. శ్రీసత్య గౌతమి

harihareshwar-1
మహారాష్ట్ర, రాయ్ గడ్ జిల్లాలో హరిహరేశ్వర్ అనే చిన్న ఊరు నాలుగు కొండల మధ్య చిక్కుకున్నట్లుగా వుంది. ఈ ఊరిచుట్టూ ఈ నాలుగు కొండలే కాకుండా ఆ కొండల మధ్యలో ప్రవహిస్తూ ఆ ఊరిచుట్టూ అరేబియా సముద్రం అల్లుకొని వుంటుంది. అందువల్ల హరిహరేశ్వర్ చుట్టూ అందమైన సముద్ర తీరాలతో చల్లని గాలులతో వచ్చిన సంధర్శకులని అలరిస్తూ వుంటుంది. నిజానికదొక దీవి. మరి ఆ చుట్టూ విస్తరించుకొని వున్న ఆ నాలుగు కొండల పేర్లేమిటో తెలుసా? అవి హరిహరేశ్వర్, హర్షినాచల్, బ్రహ్మాద్రి మరియు పుష్పాద్రి. హెలికాప్టర్ పైనుండి గనుక చూస్తే ఈ దీవి అందాలు కళ్ళార్పలేనివి. గుండ్రంగా నాలుగు కొండలు, మధ్యలో హరిహరేశ్వర టౌన్, ఈ రెండింటినీ చుట్టూరా చుట్టుకొని అరేబియా మహాసముద్రం. అంతటితో అయిపోయిందా? ఇక్కడ మరో అందముంది. సావిత్రీ నది ఈ టౌన్ గుండా ప్రవహిస్తూ అరేబియా సముద్రం లో సంగమిస్తుంది. దీనికి ఉత్తర దిక్కున హరిహరేశ్వర్ కొండపై అదే పేరుతో హరిహరేశ్వరుని గుడి వుంది. సాక్ష్యాత్తు ఆ పరమశివుడే వెలిసినది. ఆ కొండ చుట్టూ వున్న సముద్రతీరపు రాళ్ళపై విష్ణు పాదాలతో విలసిల్లుతుంది. ఈ తీరంలో దర్శించడానికి ఈ రెండే వున్నాయి. ఈ తీరం మిగితా తీరాలకు విభిన్నమైనది. మిగితా తీరాలలో ప్రజా సంచారమెక్కువ, పిల్లలు, పెద్దవారు కూడా సముద్ర నీటిలోకి వెళ్ళవచ్చు. ఆయా తీరాలలో సముద్రపు ఆటు పోటులు కూడా తక్కువ. హరిహరేశ్వరులు వెలిసిన చోట విపరీతమైన సముద్రపుహోరుతో, వాయువేగంతో, ఎప్పుడూ పెద్ద పెద్ద అలల ఝాంకారాలతో తీరం అలసట లేకుండా విలసిల్లుతూనే వుంటుంది. అక్కడి స్థానిక ప్రజలు చెప్పిన దాని ప్రకారం ఈ తీరము ఆకస్మిక మార్పులకి లోనవుతుంటుందనీ.. హటాత్తుగా పెద్ద పద్ద అలలు ఉవ్వెత్తున లేచి పడుతుంటాయని, బలమైన గాలులు వీస్తుంటాయనీ… ఆ యా సమయాల్లో దగ్గరకి వెళ్ళకూడదని. అలా సాహసించి వెళ్ళినవాళ్ళు మళ్ళీ తిరిగిరాలేదని, సముద్రం లోపలికి లాగివేయబడ్డారని చెప్పారు. వీటన్నిటి కారణం వల్ల, పై పెచ్చు ఇక్కడ కూర్చోవడానికి సముద్రపు ఇసుక కనబడదు. కేవలం కొండ పైన శివుని నివాసం, క్రింద సముద్రం ఆ కొండని ఇరవైన్నాలుగు గంటలు కొట్టుకుంటూ, ఒరుసుకుంటూ సముద్రపు అలలు ఆ కొండలోని ఒకభాగంగా చదునైన, సమతలం మీద విష్ణు పాదాలు, అంతే. అందువల్ల ఈ ప్రాంతాన్ని “దేవ్ ఘర్ (house of God)” అని పిలుస్తారు. అంతేకాదు దీనికి “దక్షిణకాశి” అని కూడా మరొక పేరు. అక్కడ జనసంచారం కూడా చాలా తక్కువ. వీటి విషయాల్ని మరిన్ని చర్చిస్తాను మీతో.

2012 వ సంవత్సరం లో దీపావళి శెలవులకి పూనే లో నివసిస్తున్న స్నేహితులదగ్గిరకి వెళ్ళాము. అక్కడినుండి ఈ దేవ్ ఘర్ కేవలం 175 కిలోమీటర్లే. ఈ అందమైన ప్రదేశాన్ని చూసి, హరిహరుల ఆశీర్వాదాల్ని తీసుకోవడానికి అందరమూ ఒక టాటా సుమో మాట్లాడుకొని బయలుదేరాము. బండి డ్రైవర్ కూడా యువకుడు కావడం తో టైం అంతా చక్కటి జోక్స్ తో గడిచిపోయింది. ప్రకృతే దేవుడు అని అమ్మావాళ్ళు ఏదో మాటల సంధర్భాల్లో మాట్లాడుకునేటప్పుడు, ఏవిటోలే కనబడిన ప్రతి రాయినీ, చెట్టునీ దైవికం గా భావించి పూజించే సంస్కృతి కదా అలా మాట్లాడుతున్నారు అనుకునేదాన్ని. కానీ అమెరికా లో చాలా కాలం వుండి భారత్ వెళ్ళిపోయాక ఈ అద్భుతమైన ప్రకృతి మరియు హరిహరుల నిలయం చూశాక ఈ ప్రకృతి అంతా దేవుడుంటాడు, కేవలం గుళ్ళోనే కాదు అనుకున్నాను. అంతేకాదు… తన ప్రశాంతతకు భంగం కలుగకుండా వుండాలనేమో అన్ని తీరాల్ని మనుష్యుల కొదిలేసి, తాను వున్నచోట మాత్రం ఆకస్మిక వాతావరణ మార్పులు, సముద్రపు హోరు, బలమైన గాలులు పెట్టుకున్నారేమో అని కూడా అనిపించింది :). అయినా నేను ఆగలేదు నీళ్ళలో దిగాలనే ఆత్రం తో సంసిద్ధురాలినయ్యాను గాని నాతోటి వారు వద్దని వారించడం తో వారికోసం ఆగక తప్పలేదు. కానీ మేము వెళ్ళినప్పుడు ఆకస్మిక మార్పులు ఏమీ జరగలేదు. ఎప్పుడూ వుండే ఆ చోటుకి ప్రత్యేకమైన వాతావరణమే తప్పా.

తీరాలన్నీ ప్రశాంతం గా వున్నాయి. మొదట సందర్శించినది దేవేఘర్ బీచ్. బీచ్ ఇసుక తెల్లగా, మెత్తగా వున్నప్పటికీ అలలనుండి కొట్టికొచ్చిన చిన్న చిన్న రాళ్ళు ఆ ఇసుకలో ఎక్కువభాగం కలిసి వుండడం వల్ల నడవడానికి కొంచెం ఇబ్బంది కలిగిందని చెప్పుకోవచ్చు. దివేఘర్ బీచ్ కిడ్స్ ఫ్రెండ్లీ. నీట్లో దిగాక పెద్దలోతులేదు, సామాన్యమైన అలలు. కాలపోతే అలవచ్చిన ప్రతిసారీ జీవించే వున్న చిన్న చిన్న స్నైయిల్స్ లాంటి సముద్ర జీవాలు మరియు చిన్న చిన్న రాళ్ళు ఒడ్డుకి కొట్టుకొస్తున్నాయి. అలతో పాటు ఇవన్నీ శరీరానికి తగిలిన ప్రతిసారీ చర్మం గాయపడడం జరిగింది. ఆ తీరామంతా చాలా దూరముంటుంది ఉత్తరం నుండి దక్షిణం వరకూ వెళ్ళవచ్చు, దగ్గిర దగ్గిర 25 కిలోమీటర్లు పొడవు. ఆ పొడవంతా నడవడానికి ముఖ్యం గా రాళ్ళవల్ల ఇబ్బంది కనుక జట్కాబండిలో వెళ్ళవచ్చు. దక్షిణాన వున్న బీచ్ ను శివవర్ధన్ బీచ్ అంటారు.

పిల్లలతో సమయాన్ని దేవేఘర్ బీచ్ లోనే గడిపి ముఖ్యం గా అక్కడి సూర్యాస్తమయం చూడ చక్కగా వుంటుందంటే ఆ సమయం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాం. ఆ అందమైన సూర్యాస్తమయాన్ని కెమేరాల్లో బంధించాలనే తపన ఒకటి. స్థానికులు కూడా ఆ రోజు సూర్యాస్తమయాన్ని చూసి, రెండవరోజున అక్కడినుండి 35 క్.మీ. దూరంలో వున్న కొండకి దేవుణ్ణి చూడడానికి వెళ్ళమని సలహా ఇచ్చారు. ఆ ప్రకారమే ఆగి అందమైన సూర్యాస్తమయాన్ని చూసాం. ఇలా అమెరికాలో శాండియాగో సూర్యాస్తమయానికి కూడా మంచి పేరుంది, ఎందుకంటే ఆ ప్లేసునుండి సూర్యాస్తమయాన్ని చాలా దగ్గిరగా చూడొచ్చని. మేము సముద్రంపైన కట్టిన కాటేజ్ నుండి సూర్యాస్తమయాన్ని చూశాం శాండియాగో లో వున్నప్పుడు. దానితర్వాత చాలా కాలానికి మళ్ళీ ఇదిగో భారత్ లో దివే ఘర్ బీచ్. కాకపోతే ఇది అరేబియా మహా సముద్రతీరం, శాండియాగో సూర్యాస్తమయం పసిఫిక్ మహా సముద్రతీరం 🙂 .

devghar2

ఆ తర్వాత రాత్రి బస చెయ్యడానికి అనువైన ప్రదేశాల్ని వెతకడం మొదలుపెట్టాం. ఎక్కడ చూసినా హోటల్సు, భోజనశాలలు. మమ్మల్నాకర్షించినది మాత్రం ఫ్యామిలీ కాటేజ్. ఇది ఒక కంప్లీట్ ఇల్లు, ఒక పొడవాటి పెద్ద గది అన్ని సౌకర్యాలతో పరిశుభ్రం గా వుంది, కానీ వంటిల్లుమాత్రం లేదు. చుట్టూ భోజనశాలలు వున్నాయి కాబట్టి, భోంచేసి ఇక్కడకొచ్చేశాం. ఒక రాత్రికి వెయ్యి రూపాయలు చార్జ్ చేశారు. ప్రొద్దునే లేవగానే ఎండిపోయిన పిల్లలు, కంపలు తెచ్చి మేమే పొయ్యి వెలిగించి వేడినీళ్ళు కాగబెట్టుకున్నాము, భలేని అనుభవం. చక్కటి పూలమొక్కలతో నిండిన పెరడు, అక్కడ పొయ్యి, శ్రమదానం చేసి కాగబెట్టుకున్న వేడినీళ్ళు!! మేము స్నానాలు చేసేలోపల, మా బ్యాచ్ లో కొంతమంది ప్రొద్దున్నే మళ్ళీ తీరానికి వెళ్ళిపోయి సూర్యోదయాన్ని చూసొచ్చేశారు, నేను అది మిస్ అయ్యాను. అందరం చక చకా తయారయ్యి, ఫలహారాలు చేసేసి.. కొండకి బయలుదేరాం.

వావ్… 35 కి.మీ. పొడవు ఘాట్ రోడ్డు కొండ పైకి. సుమో మెల్లగా పైకెళ్ళుతున్నది. కేవలం మా బండి పట్టేంత తారురోడ్డు, అట్నుంచి వచ్చే బండి తారురోడ్డు నుండి ఎడమప్రక్కకి మట్టిలోకి తీసుకోవలసిందే. అలాగే మా బండి అయినా, ఎదురొచ్చే బండికి దారివ్వాలంటే. షార్ప్ టర్నింగ్స్ కూడావున్నాయి, పైఅనంతా కొండ చరియ. మధ్యలో ఏవో టోడ్స్ బండికి అడ్డంగా పరిగెడుతున్నాయి. వాటివల్ల ఏమి జరుగుతాదో అని ఒక భయం. ఎలాగయితే ఏం..ఒక అడ్వెంచరస్ మెట్టు ఎక్కేశాం, విష్ణుపద్ ముందు చేరుకున్నాం. ఈ క్రింది ఫొటోలు చూశారా?

ఈ కొండక్రింద బీచ్ అంతా పెద్ద పెద్ద రాళ్ళ గుట్టలు, కొండలు వుంటాయి, ఈ బీచ్ పేరు హరిహరేశ్వర్ బీచ్. ఇది రాకీ బీచ్.
harihareshwar 3

నేను నిలబడిన చోటు నుండి లెక్కవేసుకుంటే 140 మెట్లు క్రిందకు ఆ రెండు కొండల మధ్య. అవన్నీ దిగివెళ్ళితే క్రింద చదునైన కొండ గుట్టల మీద దర్శనమిస్తాయి విష్ణుపాదాలు. నేను నిలబడ్డ చోట కనిపిస్తున్న ఆ రెండు కొండలు ఇలా చీలి నట్లు వుంది కదా? అది భీముడు తన గధతో కొట్టి ఆ కొండను రెండు గా చీల్చినట్లుగా చెప్తున్నారు. ఆ మెట్లు ఆనాడు లేవనీ, అదంతా సముద్రమే వున్నప్పుడు విష్ణు మొదలైన దేవతలు సముద్రుడ్ని వెనక్కి పంపించారుట. అలా పంపించినప్పుడే సముద్రుడు వెనక్కి వెళ్ళి ఆ చదునైన గుట్టని వదిలాడుట. అప్పుడు శివ, విష్ణు ఇంకా ఎంతో మంది దేవతల సంక్షం లో ఆ చునైన గుట్ట మీద భీముడు పితృసంస్కరణలు చేశాడని అక్కడ స్థల పురాణం చెప్పబడింది. అక్కడ నేను చూసిన విష్ణుపాదమే ఇది. ఈ ఆకారం లో కొన్ని వున్నాయి, మరో పాదాకారంలో మరి కొన్ని వున్నాయి, అవి కూడా దేవతలది, భీమునిపాదాలతో సహా అని చెప్పుకొంటున్నారు. క్రింద చూపబడిన ఫొటో విష్ణుపాదం ముద్ర.

harihareshwar 4
అక్కడనే మరొక చెప్పుకోదగ్గ స్థలం వుంది- గాయత్రీ పాండ్. భీముడు ఆ కొండను చీల్చకమునుపు కొండకివతల దూరంలో గాయత్రీ పాండ్ వుండేదిట. అది చాలా మహిమ కలిగి వుండేదిట. ఆ పాండ్ ఇప్ప టికి ఎన్నో రూపాంతరాలు జరిగి, ఎలాగో ఆ కొండలోకి చొచ్చుకొని పొయి ఒక చిన్న గుంత, అందులో గుక్కెడు నీళ్ళగా మిగిలిపోయిందిట. అందరూ ఆ కొండ లోపలికి వంగి దాన్ని దర్శిస్తున్నారు. దాని దర్శన భాగ్యం కూడా మాకు కలిగింది. ఇదిగో ఆ గాయత్రీ పాండ్ ను ఈ క్రింది ఫొటోలో చూడండి.

harihareshwar 5

ఆ తర్వాత కొండపైకి మెట్ల ద్వారా ఎక్కి గుడిలో ప్రవేశించాము. ఈ మెట్లు, ఒక ఆలయప్రాకారమంతా పల్లవ రాజులు కట్టించారని చెప్పారు. ఇప్పుడా మెట్లు, అక్కడున్న శిల్పకళ కూడా శిధిలమయిపోతున్నాయి. మెట్లెక్కి లోపల ప్రవేశించగానే ఇదిగో ఇలా వుంది. ప్రాంగణం చూడగానే ఒక కాటేజ్ లాగే వుంది.
harihareshwar 6
ఎత్తు అరుగుల ఇల్లు, దానికి బ్లోలెడాన్ని స్థంబాలు, పలుద్వారాలు వున్నాయి. ఒక్కొక్క ద్వారం దగ్గిర ఒక్కొక్క బోర్డు ఆయా దేవతామూర్తుల పేర్లను వ్రాసేసారు. అది చదువుకొని, ఆయా ద్వారాలగుండా ప్రవేశించి వారిని దర్శించి భక్తులు వెళ్తున్నారు. తీరా మేము లోపలికి అడుగుపెట్టేసరికి తెలిసిందేమిటంటే ద్వారాలు వేరు వేరేగా వున్నా.. దేవుళ్ళందరూ ఒకటే హాల్ లో వున్నారు. లోపలికి అడుగు పెట్టేసరికి చాలా నిరాడంబరంగా వుంది. మొదట కాలభైరవ విగ్రహం దగ్గర కొచ్చాము, నమస్కరించాము. ఆపై వినాయకుడు, నంది ఇలా మరికొన్ని విగ్రహాలని దర్శించి.. చివరిగా శివలింగాన్ని దర్శించాము. ఈ లింగం భూమి కి సమానమైన లెవెల్లో చాలా పెద్ద లింగాకారంలో వున్నది, ఆ లింగాకారం పైనే రాగితో చేసిన నాగపడగ వుంది. కూర్చొని, కాసేపు ధ్యానించి ఆ హాల్లోంచి వచ్చేశాము.
harihareshwar 7

ఆ తర్వాత బయటికి వచ్చి పరక్కనే వున్న హనుమంతుని విగ్రహాన్ని కూడా దర్శించి ఒక తిరురు ప్రయాణం పూనె కి బయలుదేరాము.
harihareshwar 8
మార్గమధ్యంలో బోజనాలు చేసి, పూనెకు దగ్గిరగా వచ్చాక మతాబులు, చిచ్చుబుడ్లు కొనుక్కొని ఇంటికి వచ్చేశాము, ఎందుకంటే మరుసటిరోజే దీపావళి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *