May 6, 2024

“చక్రవాకం” రాగ లక్షణములు

రచన: భారతీ ప్రకాష్.

 

 

చక్రవాకం 16.వ మేళకర్త రాగం. మూడవ చక్రమైన అగ్ని లో 4వ రాగం.

ఈ రాగం మూర్చనకారక రాగం.

ఈ రాగం లోని “మ” ని షడ్జమం చేస్తే “సరసాంగి (27వ మేళకర్త రాగం)“ అవుతుంది.

అలాగే “ని” షడ్జమం “చేస్తే” ధర్మావతి (59 వ మేళకర్తరాగం) “ అవుతుంది.

ఆరోహణ :- స రి గ మ ప ద ని స.

.నిదపమగరిస

ఈ రాగం లో వచ్చే స్వరాలు:

షడ్జమం మరియు పంచమం తో కలిపి – శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశృతి దైవతం,

కైశిక నిషాదం.

సంపూర్ణ రాగం: సర్వ స్వర గమక వరీక రక్తి రాగం.

జీవ స్వరాలు: “రి” మరియు “ని”

ఆధార స్వరాలు: “గ” మరియు “ప”

న్యాస స్వరాలు: “రి” మరియు “ప”

ఈ రాగం లో నిషాదం కంపితం.

విశేష సంచారములు: “గ   మ   రీ   స”  మరియు  “ప   మ   దా”

త్రిస్థాయి రాగం. రాగ విస్తారానికి బాగా అనుకూలమైన రాగం. ఈ రాగం లోని రచనలు “స, గ, ప” స్వరాలతో మొదలవుతాయి. ఎల్లవేళలా పాడదగిన రాగం. గానరస ప్రధాన మైన రాగం. ఈ రాగాన్ని శ్రీ త్యాగరాజ స్వామి వారు ప్రాముఖ్యము లోకి తీసికుని వచ్చారు. ఈ రాగం లోని రచనలన్నీ “గ మ రీ సా” అనే విశేష సంచారం తో మొదలుపెట్టవచ్చు.

ఈ రాగం యొక్క జన్య రాగమైన, “వేగవాహిని”,  “తోయవేగవాహిని” పేరుతో  అసంపూర్ణ మేళ పద్ధతి లో 16.వ. మేళ రాగం గా కనిపిస్తుంది.

క్రిందటి శతాబ్దం లో ప్రఖ్యాత గాయకులైన, శ్రీ మహా వైద్యనాథ అయ్యర్ గారు, తన 12.వ.ఏట సంగీత విద్వాంసుల సభలో ఈ రాగం పాడినందుకు ఆయనకు “మహా” అనే బిరుదు వచ్చింది. చరిత్రలోకి చూస్తే, 72 మేళ రాగాల పద్ధతి ఆవిర్భవించినప్పుడే ఈ రాగం బైటపడింది.

ఈ రాగములోని కొన్ని ముఖ్య రచనలు:

రచన సాహిత్యం తాళం రచించినవారు

1. వర్ణం – జలజాక్షి – ఆది – శ్రీ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్

2. కృతి – సుగుణములే – రూపక – శ్రీ త్యాగరాజు

3. కృతి – ఎటులబ్రోతువో – త్రిపుట – శ్రీ త్యాగరాజు.

4. కృతి – ఇంకాదయ – ఆది – శ్రీ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్

5. కృతి – నా మనవిని – రూపక – శ్రీ కరూర్ దేవుడు అయ్యర్.

6. కృతి – నీవే పాలించరా – రూపక – శ్రీ కరిగిరి రావ్.

చక్రవాక రాగం. రూపక తాళం రచన: శ్రీ త్యాగరాజ స్వామి.

పల్లవి:

సుగుణములేచెప్పుకొంటి  –  సుందరరఘురామా//

అనుపల్లవి:

వగలెరుంగలేక  ఇటువత్తుననుచుదురాశచే//

చరణం:

స్నానాదిసుకర్మంబులుదానాధ్యయనంబులెరుగ

శ్రీనాయకక్షమించుముశ్రీత్యాగరాజవినుత//

శ్రీ త్యాగరాజ స్వామి వారు ఉపాసనా పద్ధతి లో శ్రీరాముని నామసంకీర్తనము చేయుచూ, ఈ క్రింది కీర్తనలో ఏ విధంగా శ్రీరాముని క్షమించమని వేడుకుంటున్నారో గమనిస్తే మన ఒళ్ళు పులకరిస్తుంది.

చదవండి:

ఓ సుందర రూపుడైన శ్రీరామా! నీ నటనలు తెలియక, నువ్వు వస్తావనే దురాశతో, నీ సుగుణములే కీర్తించుచున్నాను. మరియొక విధముగా నిన్ను ప్రార్ద్ధించుట గాని, వేరే సాధనములు చేపట్టుట కాని, నా చేతకాదు. పుణ్యతీర్ఢ స్నానములు కాని, వివిధ దానములు చేయుట గాని, వేదాధ్యయనములను చేయుట గాని  నేనెరుగను. నీవే నన్ను క్షమించి దర్సనమిచ్చి కాపాడుము “దురాశ ” అనే పదము ఇక్కడ వాడడం వలన, ఆయన ఎంత వినయం గా శ్రీరాముని ప్రార్ధిస్తున్నారో మనకి తెలుస్తుంది.

ఈ రాగములో వున్న కొన్ని తెలుగు సినిమా పాటలు:

పాట సినిమా

1. ఏడుకొండలవాడా వెంకటా రమణా – పెళ్ళి చేసి చూడు.

2. విధివంచితులై విభవమువీడి – పాడవ వనవాసం.

3. ఎవరికెవరు ఈ లోకం లో – సిరిసిరి మువ్వ

4. రాధకు నీవేరా ప్రాణం – తులాభారం.

5. వీణ లోనా తీగ లోనా – చక్రవాకం.

6. జగమే రామమయం – కధానాయకి మొల్ల

———————————————————-0———————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *