May 4, 2024

ప్రేమలోనే గెలుపు …..  (ఓ ప్రేమిక మనోభావన)                       

రచన: కోసూరి ఉమాభారతి

 

 

నేను చిన్నదాన్నే ఐనా

గడసరిని, సొగసరిని…

నడకలతో పాటు నాకు

నడతలు నేర్పావు

లోకంపోకడలు తెలిపావు…

తప్పొప్పులు చెప్పావు

ప్రేమలు ఆకర్షణల నుండి

హెచ్చరించావు కూడా

ఎదుగుదలతో వొదుగుదల ఉండాలన్నావు

అందాలతో పాటు అణుకువలు రావాలన్నావు

వయసు సందడులు, మనసు అలజడులతో

చుట్టూ లోకం సందడి సందడిగా

ప్రేమనురాగాలు వలపుతలపులతో

మనసంతా చిందరవందగా ఉంటుందే మరి…

నా ప్రేమికుడు టక్కరివాడే ఐనా

వలపుల నెలరేడు

నా మనసెప్పుడో అతగాడి సొంతం

జీవితమూ అతనికే ధారాదత్తం

కలవరపడకు నాన్నా

ప్రేమలో పడిపోలేదు

మనసుని పంచిన మైమరపుతో

హాయిగా ఎగిసిపోతాను

నేనిక ఆగను వెనుకాడను

అతగాడిని చేరుకోను సాగిపోతాను

చేరువయి చేయందుకుంటాను

నీ ఆశీస్సులందుకోను జంటగా వస్తాను…
ప్రేమలో గెలుపే తప్ప ఓటమి లేదని

నా గాఢ విశ్వాసం

నాపై నమ్మకముంచు నాన్నా

వమ్ము కానివ్వను….

(తండ్రి తన ప్రేమకు అడ్డు చెబుతాడేమో అని భావించిన ఓ ప్రేమిక ధోరణిలో ఉన్న తెగింపు, తన ప్రేమ పట్ల ఆమెకున్న నమ్మకం – కోణం నుండి రాసిన కవిత)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *