May 6, 2024

మనోగతం

రచన: శ్రీధర్ నీలంరాజు

 

కార్యేషు దాసి, కరణేషు మంత్రీ అంటూ ప్రతి విషయం లో జోక్యం చేసుకునే భార్య నాకొద్దు…

ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు. నిజానికి ఈ విషయం తో నేను పూర్తిగా ఏకీభవించను. కేవలం విజయం లోనే కాదు అతని పుట్టుకనుండి ప్రతి ఆనందం లోనూ స్త్రీ ప్రమేయం తప్పకుండా ఉంటుంది. మరి ఇది విజయానికి మాత్రమే సంబంధించిన విషయం ఎలా అవుతుంది? అతని జీవితం స్త్రీతో వివిధ అనుభూతుల సమ్మేళనం!

నాకు ఊహ తెలిసినప్పటినుండీ, నేను బాగా ఇష్టపడేది చిన్న పిల్లలనే. వాళ్ళతో ఆటలలో నాకు ఎప్పుడూ సమయం తెలిసేది కాదు. మర్నాడు ఉదయం ఇంజనీరింగ్ పరీక్ష పెట్టుకొని రాత్రంతా చిన్నపిల్లలని ఎత్తుకొని ఆడుకున్న సందర్భాలు ఉన్నాయి. నా స్నేహితులు నన్ను చూసి నవ్వేవారు. కొందఱు ఎగతాళి కూడా చేసే వారు. ఎవరు  ఏమనుకున్నా పసితనంలోని అమాయకత్వం, వారి మాటలు నన్ను ముగ్దుడిని చేసేవి.

లతతో మా పెళ్లి కుదిరాక, వివాహం పూర్వమే ఒక సాయంత్రం ఇద్దరం రామాలయం లో కలుసుకున్నాం. తనని అక్కడ దింపి వాళ్ళ తమ్ముడు ఆలయం గోడ దగ్గరే తచ్చాడుతున్నాడు. నా చేతిని తన చేతిలోకి తీసుకొని లత అడిగింది. మీకు గిఫ్ట్ ఇస్తాను, ఏం కావాలో చెప్పండి అని.

“నాకు ఇద్దరు పిల్లలు కావాలి. నీలాగే అందం గా ఉండాలి” అని చెప్పాను .

“అలాగే” అంది నవ్వుతూ ..

ఆ క్షణం లో మా యిద్దరి భవిష్యత్తులో ఏమి రాసి పెట్టి  ఉందో మాకు నిజం గా తెలియదు

పెళ్లి అయిన మూడు నెలలకే తను ప్రెగ్నెంట్. మా ఆనందానికి అవధులు లేవు. మా రూమ్ నిండా చిన్న పిల్లల ఫోటోలు తెచ్చి పెట్టుకున్నాం. అయిదో నెలలో మా ఆశలు అడియాసలు చేస్తూ మిస్ క్యారేజ్ తనకు. ఇలా ఒకటీ, రెండూ కాదు, నాలుగు సార్లు. నేను మానసికం గా కృంగిపోయాను. తను శారీరకం గా కూడా. అయిదో సారి వంద శాతం బెడ్ రెస్ట్ తర్వాత శ్రీయ పుట్టింది పున్నమి జాబిలి లా.

తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఒకరు చాలని చెప్పాను. తను వినలేదు. ఈసారి బాబు పుట్టాడు. తెల్ల జాంపండులా. నా జీవితం ధన్యమైంది అనుకున్నాను. ఇంతలోనే రెండు దుర్వార్తలు. బాబు ఉమ్మ నీరు తాగేశాడనీ, తల్లి బీ.పి కంట్రోల్ తప్పిందని. కాసేపట్లో బాబు విగత జీవుడు అయ్యాడు. అతి కష్టం మీద లత దక్కింది. కోలుకోవటానికి చాలా సంవత్సరాలు పట్టింది.

వద్దు అని ఎందరు చెప్తున్నా వినకుండా మళ్ళీ ప్రాణాలు పణం గా పెట్టి లత సింధుకి జన్మని ఇచ్చింది. ఇద్దరు  అందమైన పిల్లలు కావాలన్న నా కోరిక తీర్చింది.

ఎప్పుడూ లత నామ స్మరణ చేస్తాననీ, ఎవ్వరినీ పట్టించుకోననీ అందరూ నన్ను ఎగతాళి చేస్తుంటారు. నా కోసం తను పడ్డ బాధలు ఎవరికీ చెప్తే అర్ధం అయ్యేవి కావు.

కార్యేషు దాసి, కరణేషు మంత్రీ ..అంటూ ప్రతి విషయంలో జోక్యం చేసుకునే భార్య నాకు అక్కర్లేదు. ద్రౌపది, తార, మండోదరి..ఇలాంటి మహా పతివ్రతలు అసలే అక్కర్లేదు. ఇలాంటి పవర్ఫుల్ మహిళలతో సంసారం చేయటం చాలా కష్టం. నా మనసులో నిజమైన కోరికలు ఏమిటో తెలుసుకొని వాటిని తీర్చడానికి కృషి చేస్తే చాలు. అప్పుడ ప్పుడు కాస్త తిట్టినా పట్టించుకోను. జీవితం అంటే అన్నీ ఉండాలి. శోభన్ బాబు సినిమాలా ఉంటే మనం మగవాళ్ళమేనా అనే  అనుమానాలు వస్తాయి.

నన్ను అభిమానించే, సాయంచేసే మహిళలు చాలా మంది ఉన్నారు. కానీ నా కోసం జీవితం పణం గా పెట్టి పోరాడే మహిళ నా జీవిత భాగస్వామి గా లభించటం నా అదృష్టం.  తనకోసం ఒక కవిత!

నీ నొసటన మెరిసే అరుణ వర్ణ ధూళిని నేను

నీ ఎదపై మెరిసే పసుపు వర్ణ తాళి ని నేను

నీ సిగ లో మురిసే పారిజాత పూవుని నేను

నీ పెదవులపై మెరిసే పులకింతపు నవ్వుని నేను

నీ ముత్తయిదువ భాగ్యాన్ని నేను

నీ జీవన సౌభాగ్యాన్ని నేను

నీ హస్త వాసిని నేను నీ భాగ్యరాశి ని నేను

నీ  పేరు లో తొలిభాగం నేను

నీ మేని లో సగభాగం నేను

పరవశం తో నీ మది పాడే ఆనంద భైరవ రాగం నేను

నీ యవ్వన భారాలని మోసే మహారసిక శ్రామికుడిని నేను

నిను అనునిత్యం తలిచే నీ తీయని ప్రేమికుడిని నేను

నువ్వు చేసే ప్రతి పూజకి అసలు సిసలు పరమార్ధం నేను

నీ అణువణువు నిండిపోయిన ప్రేమ పదార్ధం నేను

నా జీవితభాగస్వామి లతకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

4 thoughts on “మనోగతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *