May 6, 2024

ముందుమాట తో కట్టి పడేసే అక్షరం

సమీక్ష: పుష్యమీ సాగర్

పుష్య

అక్షరాలతో మనుషుల్ని కలపవచ్చా? మనిషి లోపల మరో ప్రపంచాన్ని వెతికి బహిర్గతం చేయవచ్చా? తన అంతరంగం లో ని భావాలతో మనుషుల్ని ఆప్యాయం గా అక్కున చేర్చుకోవడానికి తన “రెండో అధ్యయనానికి ముందు మాట” లో విరించి విరివింటి గారు తొలి ప్రయత్నం చేసారు సామాజిక స్పృహ తో తన కలానికి పదును పెడుతూనే, సున్నితత్వాన్ని మార్ధవాన్ని వదలలేదు. కవిత్వమంటే రూపెత్తిన ఆక్షర మాల మాత్రమే కాదు అదొక ప్రాసెస్ . అందుకేనేమో ఓ చోట ఇలా అంటారు.

“వొంటరితనం లో

మౌనానికి మౌనానికి మధ్య

మాటలు పెల్లుబికుతున్నప్పుడు

ప్రతి మాట కూడా మౌనం గానే

వినిపిస్తుంటుంది ”

ఇలా చెప్పడం లో మాటకి ఎంత ప్రాధన్యత ఇచ్చారో తెలుస్తుంది. భారత దేశం లో పెల్లుబికిన “అసహన” ప్రహసనాన్ని రచయత కోణం నుంచి రాసిన కవిత నిజంగా ఆలోచింపచేస్తుంది.  తన “రెం” REM కవిత లో తను చెప్పాలనుకున్నది స్పష్టం గా సూటి గా చెప్తారు. తన స్వాభావిక స్వేచ్చని హరించి వేసి, తన ప్రతిభ కి దక్కిన బహుమతి ని లాగేసుకున్నారు అంటారు  తన ప్రమేయం లేకుండా నే జరిగిన ప్రక్రియ ని చూసి బాధ పడతారు ఇందులో.

“వేల మంది ముందు వేదిక ఎక్కాను నేను”, “తలపులు పగల గొట్టేసారు వాళ్ళు”, “ఇవ్వాల్సిందే అని గద్దించారు వాళ్ళు”, “నన్ను వీళ్ళు చంపేశారు”, “నా బహుమతి ని చంపేశారు”, “ప్రజాస్వామ్యాన్ని ఈ దేశం లో చంపేశారు” అనడం లో రచయత ల స్వేచ్చ కి ప్రతినిధి లా  అనిపిస్తారు ..

నిర్మలమైన స్నేహానికి మత రంగు పులిమితే, కల్మషం లేని స్నేహం విషపూరితం అవుతుంది. తన చిన్నప్పటి నేస్తాన్ని గుర్తు చేసుకుంటూ “కంకర రాళ్ళు” లో ఇలా అక్కడక్కడ అంటారు. “ఐదు రూపాయల ఇరాని చాయి వన్ బై టు తాగుతూ”, “మధ్య మధ్య లో మలాయి చక్కర కలుపుకొని తాగుతూ”,  “చాయి వాడు దండం పెట్టి నేట్టేసేవరకు” -ఇలా ప్రేమ తో సాగవలసిన స్నేహానుబంధం మత విద్వేషం తో విడిపోవడం నచ్చదని తేల్చి చెప్పారు. నీవు నేను దేవుడి సాక్షి గా బాగుండాలి అనే కాంక్ష  ని వ్యక్తం చేస్తారు .

నేస్తం, ”ఇన్శా అల్లాహ్ అనుకుంటూ నీవు…రాముడి గుడి లో చేతులు జోడించి నేను” “కోరుకొని మొక్కటం” “దేవుడు మనకు ఇచ్చి ఉండకూడదు” “ఎల్లకాలం  మనదైన రోజు కోసం ఎదురు చూద్దాం” అనేటటువంటి వాక్యప్రయోగాలతో తన స్నేహానికి కుల మత విబిన్నిత లేదని చాటి చెప్పారు .

ఓ కిటికీ ద్వారం గుండా బయట ప్రపంచాన్ని చూడాలనుకున్న తపన ని, అక్షరాలతో అలుముకోవాలని ఉన్నదీ అని అన్నారు. సాంకేతిక కి, భౌతికత కి మధ్య సంఘర్షణ ని వొడిసి పట్టుకొని తేడా తెలుసుకోవాలని ఆరాట పడ్డారు.

“యు ట్యూబ్ లో పిచ్చుక శబ్దాల్ని

ఇయర్ ఫోన్ లో వినే నేను

కిటికీ నుంచి ఒక పిచ్చుకైన

కనిపిస్తుంది అని ఆరాటపడటం లో

తప్పేమీ లేదు అనుకుంటాను ”     అని తన మానసిక సంఘర్షణ కు రూపం ఇచ్చే లోగా కిటికీ ని, తద్వారా జ్ఞాపకాలని క్లోజ్ చేసేస్తారు అంటారు .

“చల్లని జ్ఞాపకం కోసం కిటికీ దగ్గర నిలబడిన” “జ్ఞాపకాల తో పాటు గా కిటికీ రెక్కను మూసివేసినా”

“ప్రకృతి నంతా కలగంటూ పడుకుంటాను” లాంటి మాటలు వాడుతూ కిటికీ కి తనకు గల బందాన్ని అందం గా చెప్పారు కదా…..

“పిడికిలి” నిరసన కి సంకేతం, విప్లవానికి సూచిక. నిస్వార్ధనికి ఉపయోగిస్తే పిడికిలి మరో మనిషి జీవితం లో వెలుగు నింపుతుంది ఆలా కాకుండా వ్యక్తిగత ప్రయోజనికి విలువిచ్చి వెన్నుపోటు పొడిస్తే ఆకలి కి ఆవేశానికి మధ్య లో అగాధం గా నిలబడుతుంది. ఇదే తనలో కలిగిన భావానికి అక్షర రూపమే పిడికిలి.

 

“నీ ఆవేశమే నీ ఆకలి

ఒక ఉదయాన్ని రగిలించడానికి తప్ప

నీ ఉదయాన్ని వెలిగించడానికి కాదు”

నీ త్యాగం నీకు కాక మరొకరికి వెళ్తుంది. త్యాగం వరుస క్రమం లో నీ వంతు చివరిదే సుమా అని విప్లవం లో త్యాగానికి స్వార్ధ కోణం లో ని పార్స్వాలని ఎత్తి చూపిస్తారు .

“కిటికీ” నుంచి వేగిరంగా పుస్తక అల్మారాలలో కి దూరి పోతు, కాగితం పడవగా మారిపోతారు. జీవితమంటే జ్ఞాపకాల శవ యాత్ర కాదు కాని వైరాగ్యాన్ని తోడూ గా పంపే కిటికీ గా నైన మారిపోవల్సిందే . కవికి అతని లో ని వ్యక్తిత్వానికి అద్దం పట్టే కవిత నే “కవిత్వటపుద్దం” ఇందులో జీవితపు సంతకాలు, ఖాళి కాగితాల్ని వ్యర్థం గా నింపుతున్నప్పుడు గంభీర గ్రందాల తలుపుల్ని నీలో నే వెతుక్కోవాలి (కవిత్వటపుద్దం).

ఇక మహిళా సమస్యలని తనదైనా కోణం నుంచి రాసిన కవితలే “equality condmend” and prostittue “. మగాడి తో నేను సమానమని అంటారు. జీవితం లో ప్రతి దశలోనూ ముందు ఉన్న క్రమం లో తన వెనకున్న కస్టాలు ఉంటాయని తెలుసుకోరు ఎందుకో …అలాంటప్పుడు   నేను వాళ్ళతో ఎలా సమానం అవుతాను అని ప్రశ్నిస్తారు.

“వాళ్ళంటారు ఉద్యోగాలలో, క్రీడలలో ముందు ఉన్నందుకు

నేను వాళ్ళతో సమానమని

కాని వాళ్ళకి తెలియదు

బయటి వారి చూపుల అవమానాలకి

భర్త గారి అనుమాలేవి తీసిపోవని

స్త్రీత్వం నా వొంటి నిండా పులుముకున్నప్పుడు ఆ గర్వం మనసు నిండా పొంగుతున్నప్పుడు తల పైకెత్తి అడగాలని ఉంటుంది “నేను నీతో ఎట్టా సమానం రా అని ”

ఇదే స్త్రీ సమస్య ని “prostitue” లో వ్యక్తం చేసిన తీరు ఆకట్టుకొంటుంది. ..మనసు ను పిండేస్తుంది

“ఆత్రం గా అల్లుకునే వొళ్ళు విరుపులు ..

మౌనం రోదించే అరుపులు

అభావం గా పలకరించే ఆ గది కప్పు కింద

భావ ప్రాప్తి ని మించిన ముభావం తో

కొన్ని నీడలు ఎక్కి దిగుతుంటాయి”

స్త్రీ సంవేదన ని ఇంతకన్నా ఎవరు చెప్పగలరు?

ఇక రెండో అధ్యాయానికి ముందు మాట లో తను ఏమి చెప్పదల్చుకున్నది స్పష్టం చేస్తారు …పాఠకుడికి కవికి మధ్య అనుబందాన్ని స్మరణ కు తెచ్చుకుంటారు ..సిద్ధాంత పరంగా ఎన్ని విబేధాలు ఉన్న ఒకరికొకరు కలుసుకున్నపుడు ఆత్మీయంగా కౌగిలించుకోవాలని. ఆ రకం గా బంధాన్ని కొనసాగించాలని చెప్పినప్పుడు నిజమే అనిపిస్తుంది

“పుస్తకాల్లో విభేదించుకునే మనం

ఒకరికొకరం కలుసుకునప్పుడు

ఆత్మీయం గా కౌగిలించుకోవాల్సి ఉంటుంది”

రచన కి పాఠకుడి కి మధ్య వారధి లా తను వుండాలని  రచయతగా విజయం సాదించానో లేదో తెలియదు కాని పాఠకుడికి మాత్రం గొప్ప స్థానం ఇచ్చేస్తారు ..నిజమే పాఠకుడి  చదవని ఏ రచన అయిన గొప్పది కాదు కదా…

“నీవు నన్ను ఎలా అర్థం చేసుకున్నా

నేను మాత్రం నిన్ను

నా ప్రియ పాఠకుడా అనే

సంబోదిన్చాల్సి ఉంటుంది “…

సమాజం లో నీవు ఒక వైపు నేను ఒక వైపు నిలబడి చూద్దాం ….సమాజాన్ని చిలికితే ఎంత విషం వచ్చిందో చూడు …ముఖ స్తుతి కోసం ముఖం గా మిగిలిన అస్తిపంజరాలే అంటూ నేడు ఈ ప్రపంచమంతా ప్రళయం  కబంధ హస్తం లో నలుగుతుంది .

-చూస్తావా నేస్తం, సమాజాన్ని నీవోకవైపు, నేను ఒక వైపు నిలబడి

-చిలికితే ఎంతటి విషం వోలికిందో

-ముఖ స్తుతి కోసం ముఖం గా మిగిలిన అస్తిపంజరాలం

అని ఈ రోజు జరుగతున్న ఆకృత్యాలను ఎండగడుతూ మానవత్వపు మేడ కింద అడ్డొచ్చిన ప్రతి మెడ కి కత్తులు పెట్టం అంటూ ఇప్పుడున్న అభద్రత పరిస్థుతుల ను ఏకరువు పెట్టారు

అయితే ఏమి చెయ్యాలో కూడా చెప్తారు చూడండి

“ఏమో, మనమిపుడు ఏమి చేద్దాం చెప్పు, మన మధ్య దూరానికి నిచ్చెన వేద్దామా లేక వారధి కడదామా …?”

 

అజ్ఞాత అవశేషం లో సముద్రపు అలలు నీ పదాన్ని తాకినప్పుడు ఏమవుతుంది ? కాసింత తడి తప్ప ఇంకేమి మిగలదు కదా….చలిగాలి తెమ్మెర నీ వంటి ని తాకినపుడు ఏమవుతుంది వీచిన గాలి ఎన్నటికి నిలవదు …ఇదే కవి భావం …. జీవితం పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నదీ ఇవన్ని కవి తన కవిత లో బందిస్తాడు …కవి అంటే ఏంటో అజ్ఞాత అవశేషం  పేర్కొనడం బాగుంది

కవి

ఒక స్పందించ గల కేమెర

సమాజం వణికిపోతుంటే

తాను కాలి పోతుంటాడు

ఇంత బాగా చెప్పగలడం కేవలం విరించి గారికే సాధ్యం ..

ఇవి కేవలం కొన్ని మాత్రమె ఇంకా ఇందులో “కవిత కాయని వెన్నెల “, “కామన్ మాన్ “, “ప్రళయం” “నీ  కవిత” “, “తూర్పు పడమర”, “మహా నగరం” “అప్పగింతలు” లాంటి మంచి కవితలు ఉన్నాయి. కవి తన కోసం కాకుండా పరుల కోసం రాయాలని తపించేవారు బహు కొద్ది మంది వుంటారు. అందులో విరించి విరివింటి గారు ఒకరు అనడం లో ఎలాంటి సందేహం లేదు. వైయుక్తికంగా చాలా వరకు కనిపించినా సమాజం లో ప్రతి ఒక్కరు అంతర్లీనం గా తమని తాము చూసుకుంటారు. వీరి కవితల్లో …మొదటి సంచికలోనే మంచి కధావస్తువులని తీసుకొని సంకలనం గా తీసుకు రావడం ముదావహం . వారు మరిన్ని మంచి పుస్తకాలు వెలువరించాలని కోరుకుంటూ సెలవు .

 

2 thoughts on “ముందుమాట తో కట్టి పడేసే అక్షరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *