May 1, 2024

అక్షరాల సాక్షిగా…

 సమీక్ష వాణి కొరటమద్ది         

 

 manju kavitvam

 

“మంజు యనమదల” గారి “అక్షరాల సాక్షిగా… నేను ఓడి పోలేదు” కవితాసంపుటి పై నాలుగుమాటలు

‘మౌనం రాల్చిన అక్షరాల్లో మసక బారిన జ్ఞాపకాలు కదులుతున్న కాలంలో చెరిగిపోని ఆనవాళ్ళు’ ఆమె పేర్చిన అక్షరాలు. అంతులేని ఆత్మ విశ్వాసాలు పదాల పొందికలో లోతైన భావాలు. తన గెలుపుకు అక్షరాలే సాక్ష్య౦ అంటూ కవితా సంపుటి పేరు లోనే విజయాన్ని ప్రకటించారు ఇలా ….”అక్షరాల సాక్షిగా … నేనోడిపోలేదంటు…….”.

మనసుతో చదవాల్సిన మంచి పుస్తకం మంజు కవిత్వం.

స్నేహశీలిగా, హుందాతనానికి ప్రతిరూపంగా మృదువైన పదశైలి ఆమె సొంతం అక్షరాలతో అనునయిస్తూ భావాల పంటను మన ముందుకు తెచ్చారు 130 కి పైగా ఆణిముత్యాల వంటి కవితలతో ఆమె సంకలనం.

ప్రతి కవితా ప్రత్యేకంగా వుంటూ … వేరు చేసి విశ్లేషించలేని కవితలే అన్నీ …

“ఈ అక్షరాల……. “ అనే కవితలో గుండె గొంతునెవరో గుప్పిట పట్టి జ్ఞాపకాలను కాల్చేసిన ఆనవాళ్ళు మనసుని పిండేస్తుంటే ……..అంటున్న ఈ కవితలో చుక్కల లెక్కల్లా తేలని బాంధవ్యాలు ఎన్నున్నా ….వేసారిన మదికి ఊరట అందించే చెలిమి అక్షరాల ఆత్మబంధమని… మనసుకు హత్తుకునేలా రాశారు.

కవితలకి శీర్షికలే ప్రత్యేకంగా వున్నాయి. ఆ కవితలు ఖచ్చితంగా చదవాలనే ఆసక్తిని కలిగిస్తూ… “ఓ మౌనం పగిలింది…” అన్న కవితలో నిశబ్దాన్ని బద్దలు చేస్తూ విగత జీవిగా మిగిలిన మనసును కదిలిస్తూ గాయాల గేయాలను పాడుకొమ్మంటున్న గుండె గాత్రాన్ని అరువుగా ఇమ్మంటు…..ఇలా సాగే ఈ కవితా …అక్షరాలతో ఆటలాడుతూ చైతన్యానికి చేతనగా చేరి సరికొత్త విజయానికి చిరునామాగా నిలిచిందని…….. శతాబ్దాల చరిత్రను తిరగ రాసానని చెప్పడం బావుంది.

సంపుటి ఆవిష్కరణ సభలో బుద్ధ ప్రసాద్ గారు ఓ మా టఅన్నారు మంజు కవిత్వం గురించి “ఈ పుస్తకం చదివి వుంటే రిషితేశ్వరి లాంటి పిల్లలు బలవన్మరణానికి పాల్పడరూ అని, ఆత్మ విశ్వాసాన్ని అద్భుతంగా ఆవిష్కరించారని” నిజమే అనిపిస్తుంది.

“కలకంఠీ కలలు” అన్న కవితలో వేదనాదాన్ని మోదంగా, మౌన మంత్రాన్నిఖేదంగా, మది తలుపులు మూసిన క్షణాలు …….కల కంటి కళలు ఈ మనసు పరచిన కవితలు ….అంటున్న మంజు గారి 135 కవితల ఈ సంపుటి అందరూ చదవాల్సిన మంచి పుస్తకం.
అందులోని నాకు నచ్చిన కొన్ని వాక్యాలు …….

ఎటెళ్ళినా ఎదను తడిమే గురుతులతో
కొలువుదీరిన కన్నీటి చుక్కల పేరంటాండ్లు
చీకటి సీమంతానికి పిలువని పేరంటంలా
వెతల కతల వారధిగా
కలత కలల కాపురం చేస్తున్నాయి
నా అక్షరాల అనుబంధపు ఆనవాళ్ళై ….!!

విషాదాన్ని నా ముందుంచితే
చెలిమికి చిరునామావనుకున్నా
నువ్వెళిపోతూ ఒంటరిని చేస్తే
ఏకాంతాన్ని తోడిచ్చావని సంబరపడ్డా
నవ్వులన్ని నీతో తీసుకెళిపోతే
కన్నీటిని నాకుంచావని సరిపెట్టుకున్నా
రెప్ప పడితే కనుమరుగౌతావని
కలలనే కనుమరుగు కమ్మని ఆదేశించా
వెన్నెలంతా నువ్వెత్తుకెళితే
చీకటే నా చుట్టమని సరిపెట్టుకున్నా
నా జీవాన్ని నువ్వు తీసుకుంటే
నువ్వే నా జీవితమని నన్ను నే వదిలేసుకున్నా….!!

తడి లేని కళ్ళలో మిగిలిన పొడి భాష్పం
రాలకుండా జ్ఞాపకాలను చూస్తోంది
ఒక్కటైనా తడిగా తగలక పోతుందా అని ఆశతో
వెన్నెల్లో ఆడుకునే నా అక్షరాలను
వేధిస్తున్నా శరాలను సంధించమని

చీకటి జ్ఞాపకాలు చుట్టాలై చేరితే
తల్లడిల్లే మదిని సముదాయించలేక
అమ్మ భాష తెలిసిన
అక్షరాన్ని ఆశ్రయం కోరితే
స్వాంతన అందిస్తూ కడుపులో దాచుకుంది అమ్మలా….!!

సున్నితంగా, సునిశితంగా, ఆలోచనాత్మకంగా, ఆవేశంగా, వేదనగా భావకవిత్వపు పూతోటలొ విహరించినట్లుగా మంచుతెరల్లా తాకుతుంది మంజు కవిత్వం.”

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *