May 1, 2024

అసమాన అనసూయ ఆలపించిన జీవనరాగం

పుస్తక సమీక్ష  -సి.ఉమాదేవి

001

ఆత్మకథ రాయాలంటే ముందు మనమేమిటో మనకర్థం కావాలి. అర్థమయాక వరుసక్రమంలో జ్ఞాపకాలను చక్కని మాలగా అల్లగలగాలి. వయసు మీరిందనడానికి గుర్తు దృష్టి,వినికిడి లోపాలుగా పరిగణిస్తారు.కాని అత్యాధునిక చికిత్సావిధానాలతో వీటిని అధిగమించగలుగుతున్నాము. అయితే ఎంత సాధన ఉన్నా మతిమరపును జయించడం కాస్త శ్రమే. కాని వార్ధక్యానికి వరం చిన్ననాటి జ్ఞాపకాలు బహుపసందుగా గుర్తుకురావడం.తొంభై నాలుగు సంవత్సరాల మెదడు కురిపించిన మెరుపులే కాదు మనసులోని ఉరుములు చవి చూపారు కళాప్రపూర్ణ డా.అవసరాల (వింజమూరి) అనసూయా దేవి. వారి మానవతా దృక్పథం, మనుషులపై నమ్మకం వారిని కష్టాలకు గురిచేసింది.అయితే కళామతల్లి తోడు నీడ ఆమెకు సేదతీర్చే వరాలను పాటల రూపేణా అందించడం అనసూయగారి సుకృతమే. విభిన్నభాషలలో రాగయుక్తంగా అనేక గీతాలను కదంబమాలగా అందించిన అద్వితీయ గాయని అనుభవాలు సుఖ దుఃఖాల సమాహారం.సంగీత సరస్వతి తన కటాక్షాన్ని మనసారా అవసరాల (వింజమూరి) అనసూయగారిపై కురిపించిన ఫలితమే మనం వారి గానామృతంలో తడిసి ముద్దవగలిగాము.

వింజమూరి అనసూయగారి పేరు తెలియని ఆనాటి ఆకాశవాణి శ్రోతలు లేరంటే అతిశయోక్తి కాదు. వెస్టర్న్ మ్యూజిక్, వాల్టజ్  మ్యూజిక్ నాలుగు తీగల మీద వాయించగలిగే సంగమేశ్వర శాస్త్రిగారినుండి  తొలి ఆశీస్సులందుకున్న ధన్యజీవి అనసూయ గారు. సరస్వతీ కటాక్షం నిలువెల్ల కురిసిన జీవనానికది నాంది. విభిన్న కచేరీలు విని కర్ణామృతం గ్రోలినా మునుగంటి వెంకట్రావు గారు గురువుగా లభించాకే సంగీతశాస్త్రంలో మెళకువలు, దశవిధ గమకాల ప్రయోగాలు వంటివెన్నో అవగతమయ్యాయని చెప్తారు. ఇప్పటిలా కీబోర్డువంటివి లేని రోజుల్లో హార్మోనియం పైనే దశవిధ గమకాలు పలికించగలిగిన బాలమేధావి మన అనసూయగారు. బ్రహ్మసమాజం ఆచరించే సర్వమానవ సౌభ్రాతృత్వం, రవీంద్రుల సంగీతానికి నృత్యమొనరించినా, గాంధీగారి ఎదుట “హే భారత జననీ” అని పాట పాడినా వాటి నేపథ్యాలను మనకు వివరించి రసానుభూతినందిస్తారు.క్రిష్ణశాస్త్రి గారి ఆనాటి జాతీయ దేశభక్తి గీతం “జయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి” ఈనాటికి సుమధురమే! ఒకనాటి రేడియో శ్రోతలలో ఈ పాట నేర్చుకుందాం శీర్షికన ఈ పాటకు గొంతు కలపని వారు లేరు అనడంలో అతిశయోక్తిలేదు. రసభరితమైన పాటలను జనరంజకంగా పాడి అందరిని మాధుర్యకేళిలో ఓలలాడిస్తారు.సంగీత సాహిత్య సమలంకృతే అనిపించేలా అటు సంగీతమే కాదు తనదైన శైలిలో రచనలను గావించి అలరించడంలో నేర్పరిననిపించుకున్నారు.

విశ్వవిద్యాలయాలలో సంగీతం పాఠ్యాంశంగా చేర్చబడటం వెనుక వీరి కృషి ఉంది. దక్షిణ భారతదేశంలో సినిమాలకు తొలి మహిళా దర్శకురాలు కూడా వీరే.కళాప్రపూర్ణ,సంగీత సరస్వతి  బిరుదాంకితురాలు. అన్నిరకాల పాటలకు పుస్తకాకృతి కలిగించారు. ఈ రచనలలో లాలి పాటలు, పెళ్లి పాటలు, పండుగలకు పూజ పాటలు, భావగీతాలు, జానపద గేయాలు మన ముందు పేర్చబడ్డ రత్నాల రాశులే! ఎందరో మహానుభావుల స్వదస్తూరితో వచ్చిన లేఖలను,సందేశాలను అమృతోపమానంగా భద్రపరచి ఈ పుస్తకంలో ముద్రించి మనకందివ్వడంలో ఆమెకున్న అంకితభావాన్ని ప్రపంచానికి తెలుపుతుంది. ఆంధ్రమహిళా సభ, రవీంద్రభారతి ప్రారంభోత్సవాలకు  ఆమె గానం కళాకాంతులను పెంపుచేసింది. పాటే తన ప్రాణమనుకున్నా మనందరికీ తెలిసిన నృత్య కళాకారిణి.

రత్నపాపకు ఆమె అందించిన సహకారం తల్లిగా అనసూయగారి బాధ్యతాయుత జీవనాన్ని తెలుపుతుంది. సినిమాలలో చిన్న పాత్రలు కూడా ధరించిన రత్నపాప కోన ప్రభాకర రావు గారి చిత్రం ‘ముగ్గురు కొడుకులు’, జెమినీ వారి ‘సంసారం’ చిత్రంలో బాలనటిగా  నటించారు.బాల నటుడిగా నటించిన  భీమశంకరం గారి పుత్రుడు మోహన్ (యన్.టి.రామారావు గారి ప్రభుత్వంలో ఛీఫ్ సెక్రటరీగా విధులు నిర్వహించిన మోహన్ కందా గారు) కూడా వీరి జ్ఞాపకాలలోని తీపిగుర్తులే!.

పదునాలుగు భాషలలో తన గళం వినిపించిన అనసూయ గారు అసమాన గాయని అని నిర్వచింపబడటం ఏనాడో విదితం. వంగూరి చిటెన్ రాజు గారి ప్రోద్బలం, సుభాష్ గారి సహకారం.జ్యోతి వలభోజు గారి అంకిత భావం ఈ పుస్తక రూపకల్పనలో బలమైన పునాదులని చెప్పక తప్పదు. ఈ రచన రూపుదిద్దుకోవడంలో ఎంతో నిబద్ధతతో శ్రమించిన వారందరికీ శుభాభినందనలు. పదపదములోను మీటిన రాగ స్రవంతి ఈ రచన. .మన గురించి మనకు తెలిసినంతగా ఇతరులకు తెలియదన్నది అక్షరసత్యం. సాధారణ జీవనం, గానకళ పట్ల అసాధారణ అంకిత భావం ఇవే ఈ పుస్తక సారాంశం.హృదయమంతా పరచుకున్న పాటల పల్లవులు, పాటలకలదిన మెరుపులు, తళుకులు పాటకు రాగాభిషేకం.సంగీత సరస్వతికి సంగీతాభిషేకం. ‘నలుగురు కూర్చుని నవ్వే వేళల నా మాటొకపరి తలవండి. నా పాటొక పరి పాడండి, ఇదే నా చివరి కోరిక ’ అని చదివినపుడు కళ్లు చెమ్మగిలకమానవు.

 

1 thought on “అసమాన అనసూయ ఆలపించిన జీవనరాగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *