May 12, 2024

అతను – ఆమె – కాలం

సమీక్ష: బులుసు సుబ్రహ్మణ్యం

AtanuAmeKalamFrontCover-666x1024

 

అతను – ఆమె – కాలం పుస్తకం ఇరవై మూడు కధల సమాహారం. ఇందులో పదహారు కధలు బహుమతులు పొందినవి. కొన్ని వివిధ భాషల్లోకి అనువదించబడ్డాయి. రచయిత శ్రీమతి గరిమెళ్ళ సుబ్బలక్ష్మి గారు, సుమారు పన్నెండేళ్ళుగా రచనలు చేస్తున్నారు. లక్ష్మిగారి కొన్ని కధలు, ఒక నవల, ఒక మినీ నవల వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఈమె బ్లాగ్లోకంలో కూడా ప్రసిద్ధులు.

ఈ పుస్తకంలో కధలు చదివితే శ్రీమతి లక్ష్మిగారు మూడుతరాల తెలుగు జీవితాలలో కాలగమనంలో వచ్చిన, వస్తున్న మార్పులని క్షుణ్ణంగా అధ్యయనం చేశారని అర్ధం అవుతుంది. శ్రీమతి లక్ష్మిగారి ఆహ్లాదకరమైన శైలి సులువుగా చదివించేస్తుంది. కధపై పట్టు, బిగి సడలించకుండా సాగే కధనం ఈమె స్వంతం. ఏ కధ చదివినా మన చుట్టూ జరిగే సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఈనాటి వేగవంతమైన జీవితాలలో లోపిస్తున్న మానవతా బంధాలని సున్నితంగా సృశిస్తూ, ఏ ఇజాల జోలికి పోకుండా, తను అనుకున్నది సూటిగా చెప్పడం ఈమె ప్రత్యేకత. సామాన్యుల జీవితాలలో ఒకరి పట్ల ఒకరికి ఆప్యాయతలు, అనుబంధాలు ఇంకా ఉన్నాయి అనే నమ్మకం బలపడుతుంది, ఈ కధలు చదివితే.

ఈ పుస్తకానికి పెట్టిన పేరు, “అతను- ఆమె-కాలం” అనే కధ ఆసక్తికరంగా ఉంది. అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా అని తను కూడా చేసుకున్న ఒక భర్త, స్వంత అభిప్రాయాలు, ఆశలు, సరదాలు ఉన్నా జీవితమంతా తనను భద్రంగా చూసుకుంటాడు అనే నమ్మకంతో అతని వేలు పట్టుకుని వచ్చిన భార్య. ఇద్దరూ విరుద్ధ భావాలు కల ముఖ్య పాత్రలు. అనురాగం, ప్రేమ వారి మధ్య లేవేమో అనిపించే సంఘటనలు. గడిచే కాలం, పెరుగుతున్న దూరం. కూతురు బారసాల రోజున “నువ్వు మా అమ్మ పేరు పెట్టడానికి ఒప్పుకుంటే బారసాల పీటల మీద కూర్చుంటాను. లేదూ… నా కూతురిని తీసుకు వెళ్లిపోతాను” అని మొండి పట్టు నెగ్గించుకున్న అతను, కొడుకు పెళ్లి సంబంధం విషయంలో మాట్లాడడానికి ఇంటికి వచ్చిన పెద్దమనుషులతో భర్త మాట్లాడుతుంటే “మీరూరుకోండి …నేను చెప్తానుగా … మీ సంబంధం మా వాడు ఒప్పుకోడండి… ఇంకా మాట్లేమిటి? వెళ్లి రండి” అంటూ వారి ముందు భర్తని చులకన చేసిన ఆమె, మధ్య గడచిన కాలం. ఉన్నట్టుండి ఆమెకి స్ట్రోక్ . హాస్పిటల్ లో జేర్చిన తరువాత ఇరువురూ తమ జీవితాలను పునరాలోచించుకుంటారు. హాస్పిటల్ నుంచి తిరిగి వస్తూ “ఎంతయిదండి బిల్లు?” అడిగిన ఆమె. “నువ్వు మళ్ళీ నాతో వస్తున్నావు. అందుకు ఎంతిచ్చినా తక్కువే” అన్న అతను. అతని కౌగిలిలో ఒదిగిన ఆమె. హృద్యంగా ఉంది చదివినప్పుడు. విరుద్ధ భావాల వ్యక్తుల మధ్య కూడా, కాలం గడిచే కొద్దీ అంతర్లీనంగా అవ్యక్తంగా పెరిగిన ప్రేమ, అభిమానం పాఠకుడిని మురిపిస్తుంది .

పై కధతో కొద్దిగా పోలిక ఉన్న మరో కధ ‘దాంపత్యం’. “ఏమిటా నిలబడి నిద్రపోవడం? మొగుడి మొహాన కాస్త కాఫీ పోసేదేమైనా ఉందా? లేదా?” ఇది భర్త పలకరింపు. అలా అని భార్యకు ఏమీ లోటు చెయ్యలేదు. స్వతహాగా మంచి మనిషే. కానీ ఆడవారికి కూడా స్పందించే గుణముంటుందని తెలియని వాడు. తన ఇష్టాలే భార్యకి నచ్చాలనుకునేవాడు. కోపమూ ఎక్కువే. అతని నోటికి అడ్డు, అదుపు ఉండదు. రమేశం పెళ్ళాంగానే రాజేశ్వరి జీవితం. పిల్లల దృష్టిలో తల్లి దేవత, తండ్రి రాక్షసుడు. పిల్లలకి పెళ్లి అయి వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. అయినా భర్త మారలేదు. సహించింది. సహించింది. ఒకరోజున తిరుగుబాటు చేసింది. ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. విషయం తెలిసి పిల్లలు వచ్చారు. కోడలి సలహా, ప్రోద్బలంతో ఇంటికి తిరిగి వచ్చింది రాజేశ్వరి తన హక్కులు సాధించుకోవటానికి. సంతోషంగా తలూపి స్వాగతించాడు రమేశం.

మనకి తెలియకుండానే మనం చాలా దానాలు చేసేస్తుంటాం. అందువల్ల బోలెడు పుణ్యం కూడా మూట కట్టుకుంటాము. ఎలానో తెలుసు కోవాలంటే ‘ఏది పుణ్యం’ కధ చదవాల్సిందే.

మనమడితో ఆడుకోవాలని, అచ్చటా ముచ్చటా తీర్చుకోవాలని అమెరికా వెళుతుంది ఒక నాయనమ్మ. టివి కూడా ఆపరేట్ చెయ్యడం చాతకాదని నాయనమ్మని హేళనగా చూస్తాడు మనమడు. మనమడిని మచ్చిక చేసుకోడానికి విఫల ప్రయత్నాలు చేస్తుంది నాయనమ్మ. అనుకోకుండా ఒక రాత్రి మనమడు చేరువ అవుతాడు. సరదాగా సాగే కధ ‘పెన్నిధి దొరికింది’

ఉమ్మడి కుటుంబంలో, ఎవరిని నొప్పించకుండా, అందరికి తలలో నాలుకగా మసలుతూ, దక్షతతో సమస్యలని పరిష్కరించే తల్లిని చూసి మేనేజ్మెంట్ పద్దతులు నేర్చుకున్న తనయుడి కధ ‘ఇప్పుడైనా చెప్పనీయమ్మా’ .

కని పెంచిన తల్లి ఎడల బాధ్యత మరచి, ఆమె కనీస అవసరాలను కూడా గుర్తించని కొడుకు నేర్చుకున్న పాఠం ‘ఒఖ్ఖ రెండు రూపాయలు’ లో చదవచ్చు.

పెంపుడు జంతువులంటే కొంతమందికి ఇష్టం మరికొందరికి అయిష్టం. అయిష్టమైనా పిల్లల కోసం ఒప్పుకున్న మాలతి కష్టాలలో పడ్డ వైనం ‘పాపం మాలతి’ కధలో సరదాగా చదువుకోవచ్చు.

తను ఊహించినవే నిజాలని భ్రమించి, సమాజసేవకి, పీడిత జనోద్ధరణకి నడుం కట్టిన యువతి తెలుసుకున్న సత్యం ‘నాణానికి మరోవైపు’ కధలో. కధని పూర్తి చేసిన తరువాత మనసు ఆర్ద్ర మవుతుంది.

భార్యా భార్తలిరువురు ఉన్నతోద్యోగంలో ఉన్నవారే. రెండేళ్ళ వయసున్న కొడుకు భవిష్యత్ గురించి కలలు కంటారు. వాడిని క్రమ శిక్షణలో పెంచడానికి, అన్నీ నేర్పడానికి, పిల్లల పెంపకంలో ట్రెయిన్ అయిన ఆయాని పెడతారు. కొడుకు మనసులో ఏముందో తల్లి ఎలా తెలుసుకుందో ‘చందమామ రావే’ కధలో చూడవచ్చు.

“ఎత్తుకో బిడ్డనూ ఎక్కు అందలమూ …చేరి మీ వారితో చెప్పి రావమ్మా” అని అన్నగారు అంటే అత్తమామలని, తోడికోడలని, బావగారిని, భర్తని ఇత్యాదులందరినీ అనుమతి అడిగి కానీ బండి ఎక్కడం కుదరేది కాదు ఆ రోజుల్లో కూడా. వాళ్ళు సులువుగానే అనుమతి ఇచ్చేవారు. ఈ రోజుల్లో ఉద్యోగం చేస్తున్న స్త్రీ శలవు పెట్టి ఊరికి వెళ్ళాలంటే ఎన్ని అనుమతులు కావాలి? ‘కలికి కాత్యాయిని’ చదివితే అర్ధం అవుతుంది.

శ్రీమతి లక్ష్మిగారు శృతి మించని, సున్నితమైన హాస్యంతో వ్రాసిన ‘డిజైనర్ ఫుడ్’ ‘పాత సీసాలో కొత్త సారా’ ‘వెఱ్ఱిబాగుల వదిన వ్రతకధ’ మొదలైన కధలు పెదాల మీద చిరునవ్వు చెరగకుండా చదివించేస్తాయి.

కధలన్నిటి గురించీ వివరించాలంటే, ఒక్కో కధకి కనీసం ఒక్కో పేరా వ్రాయాలి. స్థలాభావం వల్ల ఇంతకంటే ఎక్కువ వ్రాయడం కుదరదు. పుస్తకం ధర నూట ఏభై రూపాయలూ పూర్తిగా వసూలవుతాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.

‘అతను – ఆమె – కాలం’ పుస్తకాలు ప్రముఖ పుస్తకాల షాప్ ల్లో దొరుకుతాయి. అంతర్జాల బుక్ షాప్ ‘కినిగె’ లో కూడా దొరుకుతాయి. రచయిత్రి దగ్గర నుంచి కూడా బడయవచ్చు.

 

3 thoughts on “అతను – ఆమె – కాలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *