April 26, 2024

అనువాదం – దొరికిన సిరి

అనువాదం:-బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి

మూల రచన: సి.ఎన్.ముక్తా

మూలం: ఉత్థాన (కన్నడ  పత్రిక)

ప్రచురణకాలం- 2015 అక్టోబర్.

 

 

లేనిది కోరేవు యున్నది వదిలేవు

ఎందుకు రగిలేవొ యేమై మిగిలేవొ

మౌనమె నీ భాష ఓ మూగమనసా!

 

ఎక్కణ్ణించో సన్నగా ఆకాశవాణి లోంచి పాట వినిపిస్తోంది. ఉన్నది, మనదైనది అయిన దానిమీద ఎప్పుడూ అసంతృప్తి ఎందుకో మనకు? ఎప్పుడూ ఇంకా ఏదో లేదనే అసమాధానమే! దీనికి దాదాపు ఎవ్వరూ మినహాయింపు కాదు. ప్రతి ఒక్కరం నాకు దక్కాల్సింది దక్కలేదనే ఆలోచిస్తుంటాము.

కారు స్టార్ట్ చేస్తూ సాగర్ ఆలోచిస్తున్నాడు. తనకు మాత్రం ఇప్పుడేం తక్కువైందని? అమ్మ, నాన్న ఇద్దరూ ఉన్నత విద్యావంతులైనప్పటికీ , ఒక్కగానొక్క కొడుకు ఏ డాక్టరో , ఇంజనీరో కావాలని కోరుకున్నప్పటికీ తను కోరుకున్నట్టే తన జీవితాన్ని దిద్దుకోగలిగాడు. ఆరోజు తండ్రితో తాను మాట్లాడింది గుర్తొస్తూంది.

“నాన్నా, నాకు ఎమ్ బిబి ఎస్ , ఇంజనీరింగ్ చదవాలని లేదు”.

“మరేం చదువుతావోయ్?”

“వ్యవసాయం అంటే నాకు చిన్నప్పట్నించీ చాలా ఇష్టం, దానికి సంబంధించిన కోర్సే చదవాలని ఉంది”.

“చదివి …ఏం చేస్తానంటావు?”

“పొలం కొనుక్కుంటాను. బంగారం పండిస్తాను” ఆవేశంగా చెప్పాడు తను.

తల్లిదండ్రులు తన ఇష్టానికి అడ్డు చెప్పలేదు. అనుకున్నట్టే ఎమ్ ఎస్ సి ఏజి పూర్తి చేశాడు. ఊళ్ళో నరసరామయ్య పొలాన్ని కొనాలని ఆలోచిస్తుండగా, తండ్రి ఒప్పుకోలేదు.

“ఇక్కడ వద్దు. సిటీకి దగ్గరగా తీసుకో. పూలు, పండ్లు, కూరలు పెంచు. మార్కెట్ కు దగ్గరగా ఉంటుంది. అమ్మడం సుళువు అవుతుంది” అని సలహా ఇచ్చాడు. ఇదీ బానే ఉందనిపించింది తనకు.

సిటీకి దగ్గర్లో పొలం గురించి వివరాలు సేకరిస్తున్నపుడు స్నేహితుడు దర్శన్ “వట్టి పొలం మాత్రం కాదు. ఒక ఫార్మ్ హౌస్ తీసుకొని అభివృద్ధి చేసుకున్నావంటే బాగుంటుందేమో” అని సూచించాడు. వాడి సహాయంతోనే నగరానికి ఐదారు కి.మీ. దూరంలో పన్నెండెకరాల ఒక ఫార్మ్ హౌస్ తీసుకున్నాడు. రెండేండ్లు పట్టింది దాని కొక రూపు తెచ్చి అభివృద్ధి చేసేందుకు. ఈ రెండేండ్లూ మొత్తం దృష్టి, ధ్యాస దానిపైనే. తిండీ తిప్పలూ పట్టించుకోకుండా కష్టపడ్డాడు తను. పండ్ల చెట్లు, పూలతోట, కూరల సాగు అన్నీ తృప్తికరంగా వచ్చాయి. ఆరు ఆవులను కూడా కొని వాటి పోషణ, తద్వారా పొలం పోషణ బాగా అభివృద్ధి చేశాడు. తల్లిదండ్రులు అడపా దడపా వచ్చి నెల్లాళ్ళు ఉండి వెళ్ళేవారు.

చివరికి ఒక రోజు అన్నారు… “సాగర్! నీవనుకున్నట్టే అన్నీ చేసుకోగలిగావు. ఇకనైనా పెళ్ళి గురించి ఆలోచిస్తే బాగుంటుంది కదా” అని.

“అలాగే. నాకున్నట్టే వ్యవసాయం మీద ఆసక్తి ఉన్న అమ్మాయిని చూడండి. తప్పక చేసుకుంటాన” న్నాడు తను.

నాన్న, అమ్మ తమ దృష్టిలోకి వచ్చిన అమ్మాయిల గురించి వాకబు చేస్తే ఎవరూ కూడా వ్యవసాయం చేసే వరుడంటే ఆసక్తి చూపలేదు. వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఇంజనీరు, డాక్టర్లనే కోరుకుంటున్నారు.

“మా అమ్మాయికి ఉద్యోగంలో ఉండే వరుడిని చూస్తున్నామండి.  మీ అబ్బాయి అంత చదువుకొని వ్యవసాయం చేయడం ఏమిటండీ? ఏదైనా ఉద్యోగంలో చేర్చండి” అని సలహాలూ చాలానే వచ్చాయి.

ఒకరోజు నాన్న తన స్నేహితుడు సోమనాథ్ బాబాయ్ తో కలిసి ఒక పెండ్లికి వెళ్ళినపుడు అక్కడ మాధవిని చూశారు. మాధవి తండ్రి రామకృష్ణారావు గారిని సోమనాథ్ పరిచయం చేశాడు. ఆయన తమ ఇంటికి ఆహ్వానించారు. అలా వారి ఇంటికి వెళ్ళినపుడు స్నేహితులిద్దరినీ ఆయన తమ తోట చూపడానికి తీసుకెళ్ళారు.

అక్కడ మాధవి చెట్టు నుంచి కొబ్బరిబోండాలు దింపిస్తోంది. పని చేసేవాళ్ళను గమనించుకుంటూ , అక్కడే ఉన్న రామయ్యతో ఎరువులతో పాటు ఏ ఏ విత్తనాలను తీసుకురావాల్సి ఉందో గుర్తు చేస్తూ పాదరసంలా తోటంతా తిరిగేస్తోన్న మాధవిని చూసి వారికి ముచ్చటేసిందట, పదేపదే చెప్పారు.

తనతో కూడా మాధవి అంది కదా, “నాకూ మట్టికీ అవినాభావ సంబంధమనుకోండి. తోటలు, పొలాలు, ఆవులూ, దూడలూ ఇవిలేకుండా నా ప్రపంచమే లేదు” తమ తోట చూపిస్తూ.

తన సంతోషానికి పట్టపగ్గాల్లేవు. ఆర్నెల్లు తిరక్కుండా పెళ్ళీ అయిపోయింది. ఇప్పుడిద్దరు పిల్లలు కూడా.

ఒకరకంగా పండంటికాపురమే కాదూ తమది! చిరునవ్వు కదలాడింది సాగర్ పెదవులపై. వచ్చినప్పటినుంచీ ఫార్మ్ హౌస్ బాధ్యతంతా తీసుకొంది మాధవి. డైరీఫార్మ్ కూడా మొదలయిందిప్పుడు. సాగర్ నెయ్యి, వెన్న, పన్నీర్ లకు బాగా డిమాండ్ ఉంది. చందన్, చైత్ర వారికి రెండు కళ్ళు.

మొదట్లోనే చెప్పాడు తను, ’వంటకు ఎవరినన్నా పెడదా’మని. ఎందుకూ అంది మాధవి.

“తోట పని చాలా ఉంటుంది మనకు. వంటపని, తోటపని రెండూ నీకు కష్టం కదా” అంటే అంది కదా, ”వద్దు. మనిద్దరమే ఉందామీ స్వర్గంలో. మనమధ్య ఇంకెవరూ వద్దు” అని.

మరి ”పిల్లల మాటో’ అన్నాడు తను చిలిపిగా. సిగ్గుపడుతూ ”మన పిల్లలు కదా! వాళ్ళు మనతోనే ఉండవచ్చు” అన్నది.

తన సర్వస్వం మాధవే అయింది. తనకు కావలసినవి అన్నీకనిపెడుతూ, పిల్లల చదువుసంధ్యలు చూసుకుంటూ, అన్నిటా తానై, చైతన్య ప్రవాహమై ఇంటికే అలంకారమైంది. ఈ మధ్యలో డ్రైవింగ్ కూడా నేర్చుకుంది.

అయితే ఈమధ్య తనకెందుకో వెల్తిగా అనిపిస్తోంది. ఎందుకో మాధవిలో మార్పు వచ్చిందనిపిస్తోంది. ఊరూర్కే కోప్పడుతుంది. మనసు విప్పి మాట్లాడడం లేదు. పనులన్నీ యథాప్రకారమే చేస్తోంది. కానీ మాధవి మనసులో దేనికో దిగులు పెట్టుకుందనిపిస్తుంది.

ఈరోజు పొద్దున ఏమంది? లేచీలేవగానే పిల్లల స్కూలు ఫీజ్ కట్టిరమ్మంది. “దానికిప్పుడేం తొందర? బడి తెరవనీ, కడదాం”.

“అప్పుడు చాలామంది కడుతుంటారు. రద్దీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా కట్టలేరు. ఇప్పుడైతే ఎక్కువ ఉండరు. కట్టేయండి”.

“మాధవీ, చెప్పిందే చెప్పొద్దు. స్కూల్ ఫీజ్ కట్టే బాధ్యత నాది. సరేనా? ఇంకా విషయం వదిలేద్దూ”

ముఖం మాడ్చుకొని ఫలహారం పెట్టింది. ”సిటీ కెళ్ళి వస్తాను….అంటే ఎందుకు అని కూడా అడుగలేదు”.

గుడి మీదుగా వెళ్తూ ఆగినపుడు ఫోన్ మ్రోగింది. “బావా, నేను గోపీని. పొద్దుట్నించీ అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. అక్కతో మాట్లాడదామంటే లాండ్ లైన్ కూడా తగలడం లేదు”,

“ఔనా గోపీ, నేను బయట ఉన్నాను. ఏదైనా ముఖ్యమైన సంగతా?”

“అలాచెప్పండి! మీరిద్దరూ బయటికి వచ్చారా ! సరే, అక్కకిస్తారా ఫోన్?”

“లేదు గోపీ, నేనొక్కడినే వచ్చాను. సంగతేంటి చెప్పు”,

“ఈరోజు అక్క పుట్టినరోజు కదా అని చేశానంతే బావా, ఇంకేం లేదు. పిల్లలు కూడా విష్ చేద్దామంటేనూ.. ఒంట్లో ఏమన్నా బాలేదేమో అని కొంచెం కంగారనిపించింది”,

“అబ్బే, అదేం లేదు, ఫోన్ ఎక్కడైనా పెట్టి మరచిపోయిందేమో, నేనిప్పుడు ఇంటికే వెళ్తున్నా. చూస్తాను” అన్నాడు సాగర్.

అప్పుడర్థమైందతనికి ఎందుకు పొద్దున మాధవి అలా ఉండిందో! కనీసం తన పుట్టినరోజు కూడా గుర్తు పెట్టుకోని భర్త అంటే ఎవరికైనా కోపం వస్తుంది. తాను బంధువులందరి పుట్టిన రోజులూ, పెళ్ళిరోజులూ కూడా గుర్తుపెట్టుకుంటుంది. పిల్లలదీ, భర్తదీ అంటే చెప్పక్కరలేదు. ఎంత హడావిడి చేస్తుందో!

తన మీద తనకే బాగా కోపం వచ్చింది సాగర్ కి. ఎలా మర్చిపోయాడు తను! మాధవిలా ఎందుకు లేడు?

గడియారం వైపు చూశాడు. ఆరున్నర. వెంటనే కారు వెనక్కి తిప్పి ఒక జత గాజులు కొన్నాడు. మాధవికి ఇష్టమైన జాంగ్రీ, సమోసాలు ప్యాక్ చేయించాడు. ఎనిమిదయిపోతోందనుకుంటూ ఇంటికి బయల్దేరాడు.

——-

వంట పూర్తి చేసి టీవి ఆన్ చేసింది మాధవి. ఆమె మనస్సంతా రాయి విసిరిన కొలనులా అల్ల కల్లోలంగా ఉంది. తానింతగా ప్రేమించిన సాగరేనా అనిపిస్తున్నాడు ఈ మధ్య. ఏదీ పట్టించుకోడు. సులువుగా సారీ చెప్పేస్తాడు.

ఏ బాధ్యతా తీసుకోడు. పంట అమ్మకాలు, బాంక్ పనులు తప్ప మిగిలినవేవీ తన పనులు కాదన్నట్టు ఉంటాడు. పిల్లలకు హోంవర్క్ కూడా చెప్పించడు. పేరెంట్స్ మీటింగ్ కు రాడు. వాళ్ళకు పెన్నో పెన్సిలో కావాలేమోననో , ఎలా చదువుతున్నారనో ఏదీ పట్టించుకోడు. శలవని ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే చివరినిముషంలో నాకు వీలుకాలేదంటూ చల్లగా చెప్పేస్తాడు. ’తప్పయింది సారీ’ ఒకటి పైగా.

“ఈరోజు నా పుట్టినరోజని గుర్తైనా ఉందా అసలు? విష్ చేయాలనే అనిపించలేదేమో! పిల్లల పుట్టినరోజులకూ ఏర్పాట్లన్నీ నేనే చేయాలి. ఏదో అతిథి లా వచ్చి కూచుంటాడు. నేను మాత్రం ఎన్నని చేయగలను? ఒక ప్రక్క తోట, ఇల్లు అన్నీ చూసుకోవాలి. ఇటువంటి బ్రదుకు నాకు అవసరమా? ఒక్కోసారి అనిపిస్తుంది ఏ ఉద్యోగస్తు డినో ఎందుకు చేసుకోలేదా అని. ప్చ్.. నాకూ  నా పనికీ ఏ విలువా లేదు. అసలు ఈరోజు సిటీకి ఏం పనంట? నన్నూ రమ్మన్నాడా, అదీలేదు! పిల్లలన్నా ఉంటే బాగుండేది. శలవలని అవ్వతాత యింటికి వెళ్ళిపోయారు. ఫోన్ చేద్దామంటే అదీ కనిపించడం లేదు ఎక్కడ పెట్టానో ఏమిటో ఖర్మ. లాండ్ లైన్ డెడ్. తొమ్మిదవుతోంది. ఇంకా రాలేదేమిటి ఈయన? వాన వస్తోందని ఎక్కడైనా ఆగారో, లేక ఏ యాక్సిడెంటో…!దేవుడా!”.

ఇంతలో కారు వచ్చి ఆగిన శబ్దం. మాధవి బయటకు వచ్చింది. సాగర్ కారు దిగుతూ, “సిద్ధయ్యా, వెనుక సీట్ లో ఉన్నసామాను పట్టుకురా” అని కేకేశాడు.

ఎదురు వచ్చిన మాధవిని చూసి కొంచెం తడబడ్డాడు. ఎందుకు ఇంత లేట్ అని అడగితే జవాబివ్వక “నీ మొబైల్ ఎక్కడ?” అని ఆడిగాడు. “అదెక్కడో కనిపించడం లేదు. ఎక్కడ పెట్టేశానో తెలియడం లేదు. ఏం, ఎందుకడిగారు?”

సాగర్ బదులిస్తుండగానే సిద్ధయ్య పరుగెట్టుకుంటూ వచ్చాడు. “అయ్యా, కార్లో వెనుక సీట్ లో ఎవరో పడుకున్నారయ్యా? ఎవరు?”

“ఔనా, ఎవరు?”

“రండయ్యా చూద్దురుగాని”.

సాగర్ కార్లో లైట్ వేశాడు. వెనుక సీట్లో పాతికేళ్ళ అమ్మాయి పడుకొని ఉంది. చుడీదార్లో చిన్నపాపలా ముడుచుకొని పడుకొంది.

“ఎవరీమె?”

“ఏమో మాధవీ , నాకూ తెలియదు. కార్లో ఎప్పుడొచ్చి పడుకొందో నేనూ గమనించనేలేదు’.

మాధవి ఆమెను కదలించి చూసింది. లాభంలేకపోయింది. ముఖం మీద నీళ్ళు చిలకరించే సరికి కళ్ళు విప్పి అందర్నీ ఆశ్చర్యంగా చూసింది.

“ఎవరు నువ్వు? నా కార్లోకి ఎలా వచ్చావు?” గద్దించాడు సాగర్.

కళ్ళనీళ్ళు పెట్టుకున్న ఆమెను చూసి మాధవి, “మీరు లోపలికి వెళ్ళండి. నేను ఈమెను తీసుకువస్తాను” అంది.

ఆమె బట్టలు పూర్తిగా తడిసి ఉన్నాయి. మాధవి ఆమెను లోపలికి తీసుకువెళ్ళి తన చుడీదార్ , తువ్వాలు ఇచ్చి బట్టలు మార్చుకోమంది. ఆమె వాలకం చూసి తానే సహాయం చేసింది.

పేరడిగితే తెలీదంది. ఇల్లెక్కడ అన్నా తెలీలేదు. పైగా మీరెవరు అని ప్రశ్నవేసింది. మాధవికి విచిత్రంగా అనిపించింది.

“అవన్నీ మళ్ళీ మాటాడుదాములే. ముందు భోంచేద్దాం పద” అని తీసుకువచ్చింది. అప్పటికే సాగర్ ప్లేట్లల్లో వడ్డించాడు.

“మీరూ తినండి” అంది మాధవి. “లేదు మాధవీ, నీతో కలిసి తింటాను” అన్నాడు సాగర్.

మాధవి ఆమెను కూచోబెట్టి తినిపించింది. చక్కగా భోంచేసిందామె. తర్వాత  “చందూ, నాకు పాలు కావాలి”  అని అడిగింది. మాధవి పాలు వేడి చేసి తీసుకొచ్చింది. ఆమె తాగేసి, “చందూ నాకు నిద్దరొస్తోంది” అంది. మాధవి ఆమెను చైత్ర గదిలో పడుకోబెట్టింది.

మాధవి తిరిగి వచ్చేసరికి సాగర్ తాను తెచ్చిన జాంగ్రీలు, సమోసాలు సిద్ధంగా పెట్టి ఉంచాడు. శుభాకాంక్షలూ చెప్పాడు.

“ఇప్పుడు గుర్తువచ్చిందా” నిష్టురంగా అంది మాధవి.

“నిజంగానే పొద్దున గుర్తు లేదు మాధవీ, సాయంకాలం గుర్తొచ్చి ఫోన్ చేశాను. నీ ఫోన్ ఆఫ్ అని వచ్చింది”

“సరేలెండి, ఇదేం కొత్త కాదుగా? అసలు మీకు నా మీద ఆసక్తి తగ్గిపోయింది. నా మీద పిల్లల మీద మీకు ప్రేమ ఉందా అని సందేహం వస్తోందీ మధ్య”,

“ఇప్పుడు నేనేం చెప్పినా నీవు నమ్మవని తెలుసు. ఈ మతిమరుపు ప్రాణాలు తోడేస్తోంది ఈమధ్య. అసలు అన్నీ మరిచిపోయే రోగం వస్తుందేమో నని భయం వేస్తోంది నాకసలు”.

మాధవి ఏమీ మాట్లాడలేదు. సాగర్ భోంచేసి ఫోన్ తీసుకొని బయటకెళ్ళబోయాడు.

“ఏమిటింకా పడుకోరా?”

“లేదు, ఒకసారి ఇన్స్పెక్టర్ అశోక్ కుచేస్తాను. మనింట్లో ఉన్న ఆమెను గురించి చెప్పాలి కదా?”

“నాకామెను చూస్తే మన చైత్ర గుర్తొస్తోంది. చైత్ర కు ఏడేళ్ళు, ఈమెకు ఇరవై ఏడు, ఇరవైఎనిమిది ఉండొచ్చు.అదే అమాయకత్వం…”

“మాధవీ, ఆమెకు తన పేరు , ఊరు కూడా తెలియట్లేదు కదా? ఏమై ఉంటుందో?”

“నాకూ అదే అర్థం కాలేదు. పోలీసులకు ఫోన్ చేస్తానంటారా?”

“ఔను మాధవీ, ఒకవేళ ఎవరైనా తమ కూతురో, భార్యో తప్పిపోయిందని కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు కదా?…అశోక్ గారు చూసుకుంటారని”.

సాగర్ బయటకు వెళ్ళాడు. మాధవి టీపాయ్ మీదున్న చిన్న పర్సు చూసి , ఇదెవరిది అనుకుంటూ తెరిచింది. దాంట్లో గాజుల జత , విషెస్ కార్డూ కనిపించాయి. కళ్ళు అప్రయత్నంగానే నిండాయి మాధవికి.

మరుసటిరోజు పొద్దున్న ఐదింటికే తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది. ఇన్ స్పెక్టర్ అశోక్ ఒక పెద్దాయ ననూ, ఒక యువకుడినీ వెంటబెట్టుకొని వచ్చాడు.

“సాగర్, వీరు శారదా ప్రసాద్, వీరబ్బాయి కిశోర్. మీ ఇంట్లో ఉన్నామె కిశోర్ భార్యే. నీవు ఫోటో పంపావు కదా నాకు. ఫోటో చూసి వీళ్ళు గుర్తు పట్టారు” అని చెప్పాడు అశోక్.

“ఎక్కడ మా మను?” ఆత్రుతగా అడిగాడు కిశోర్.

“ఆమె, అదిగో ఆ గదిలో పడుకున్నారు. లేచాక తీసుకెళ్దురు గాని.’ అంది మాధవి కాఫీలందిస్తూ.

వెంటనే లేచి గదిలో కెళ్ళాడు. భార్య తల ఆప్యాయంగా నిమిరి, దుప్పటి సరిచేసి బయటికొచ్చాడు.

చేతులు జోడిస్తూ, “సర్, మీకు చాలా ధన్యవాదాలు. రాత్రంతా ఎంత కంగారుపడ్డామో, ఎంత వెదికామో మాకే తెలుసు. మీకెక్కడ కనిపించింది?” అన్నాడతను.

“ఆమె నా కార్లో ఎప్పుడు వచ్చి పడుకున్నారో నేనూ ఇంటికి వచ్చేదాకా గమనించలేదండి. చూడగానే అశోక్ గారికి ఫోన్ చేశాను. ఆమె ఎందుకో ఏమడిగినా సరిగ్గా చెప్పలేకపోయారు” అన్నాడు సాగర్.

“హ్మ్..తనకేదన్నా గుర్తుంటే కదండీ మీకు చెప్పగలిగేది? మొదట ఎలా ఉండేది ఇలా అయిపోయింది” నిట్టూ రుస్తూ చెప్పాడు కిశోర్.

“నేను మొదట తనను కలిసేటప్పటికి బాంకులో పని చేస్తుండేది. ఎంత చలాకీ అనుకున్నారు! నాకు చాలా నచ్చింది. ఎవరూ లేరామెకు అని తెలిసీ మా తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు. పెళ్ళయ్యాక ఇంట్లోనే ఉంటూ చక్కగా అన్నీ చూసుకునేది. ఈతపోటీల్లో ఎన్నో బహుమతులు గెల్చుకుంది. ఒకసారి  బెంగళూరు నుంచి స్వంతంగా కారు డ్రైవింగ్ చేస్తూండగా తనకు యాక్సిడెంట్ అయింది. బ్రతికిందే ఎక్కువ. అప్పట్నించీ ఇలా…” మాట్లాడలేక పోయాడు కిశోర్.

“చందూ ఎవరు?”

“ఏమో తెలియదు. ప్రమాదం తర్వాత నలభై రోజులు కోమాలో ఉంది. తెలివి వచ్చాక నన్నెందుకో చందూ అనే పిలుస్తోంది”

“తన పనులు తాను చేసుకోలేదను కుంటాను” మాధవి జాలిగా అంది.

“ఒక నర్స్ ను పెట్టాము ఇరవైనాలుగు గంటలూ చూసుకోడానికి. ఆకలైతే మాత్రం చందూ పాలు ఇవ్వు, అన్నం పెట్టు అని అడుగుతుంది. మొండిపట్టు కూడా పడుతుంది. మేమూ సమయానికి తనకు కావలసినవి ఇస్తూ చూసుకుంటుంటాము”.

అంతలో మను అనబడే మానస లేచి వచ్చి కిశోర్ చేతులు పట్టుకుని నవ్వుతూ నిలుచుంది. కిశోర్ నాన్నగారు కోడలిని, కొడుకును ఒక్కసారి చూసుకొని చెప్పారు.

“అమ్మాయికి ఇలా అయిన తర్వాత మావాడికెందరో చెప్పారు. వేరే పెళ్ళి చేసుకొమ్మని. కానీ వాడు ఖచ్చితంగా చెప్పేశాడు. ఎలా ఉన్నా కూడా తను నా భార్య. నేను తనతోనే ఉంటాను. తనను చూసుకుంటాను” అని.

ఒకప్రక్క దిగులు, ఒకప్రక్క గర్వం ఆయనకు. వాళ్ళు వెళ్ళిపోయారు. మాధవి, సాగర్ తమ పనుల్లో పడ్డారు.

ఇద్దరి మనసులో ఒకే ఆలోచన.

“దేవుని దయవలన మాకే లోటూ లేదు. అయినా చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసుకొని మథనపడి పోతుంటాము. మూడ్ పాడుచేసుకుంటాము. మూతి ముడుచుకుంటాము. కోపాలు పెంచుకుంటాము. కానీ చూడబోతే కిశోర్ మా కన్నా ఎంతో చిన్నవాడు. అతనికున్న ఓర్పు, అంత బాధలో అతని ప్రేమ, భార్యఉన్న పరిస్థితిలో ఆమె పట్ల అతనికున్న బాధ్యత ఎంత గొప్పగా ఉన్నాయి!” అని.

సాగర్, మాధవి ఇద్దరూ ఒకేసారి హాల్లోకి వచ్చారు. ఒకరి కళ్ళలో ఒకరికి కనిపించిన భావనలెన్నో!

 

****                 ****                      ****

 

 

 

4 thoughts on “అనువాదం – దొరికిన సిరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *